
పరశురామ్ కుటుంబం (ఫైల్)
పాలకోడేరు: ఆ దంపతులు వడ్డీల వలయంలో చిక్కి ఏడాదిన్నర కుమారుడికి విషమిచ్చి ఊపిరి తీశారు. ఆ వెంటనే వారు కూడా విషం తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం కుముదవల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. చీడే పరశురామ్(45), ధనసావిత్రి(30) వ్యవసాయదారులు. మంగళవారం ఉదయం ఆ దంపతులు తమ కుమారుడు నాగవెంకట శ్రీనివాస్‌తో కలిసి కుముదవల్లి సమీపంలోని సరుగుడు తోటలోకి వెళ్లి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. చనిపోయే ముందు బంధువులకు వాట్సాప్ మెసేజ్‌లు పెట్టడంతో వారంతా అక్కడికి చేసుకునేసరికే ముగ్గురూ విగత జీవులై కనిపించారు.
వడ్డీల మాయలో పడి..
ధనసావిత్రి పుట్టిల్లైన అత్తిలిలో చోడిశెట్టి హైమ అనే మహిళ చిట్టీలు వేస్తూ, వడ్డీ వ్యాపారం చేస్తుండేది. ఆమెకు ధనసావిత్రితో పరిచయం ఉండటంతో అధిక వడ్డీ ఆశ చూపించి సుమారు రూ.9 లక్షలు అప్పు తీసుకుంది. ఆ తరువాత తెలిసిన వారి నుంచి తక్కువ వడ్డీకి సొమ్ములు తీసుకుని తనకిస్తే.. నూటికి రూ.5 చొప్పున వడ్డీ చెల్లిస్తానని నమ్మబలికింది. ఇలా ధనసావిత్రి దంపతుల బంధువుల నుంచి రూ.25 లక్షలకు పైగా సేకరించిన హైమ ఐపీ పెట్టింది. ఈ విషయం తెలియడంతో ధనసావిత్రి బంధువులు తామిచ్చిన డబ్బును తిరిగివ్వాలంటూ ఆమెపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. చోడిశెట్టి హైమ అధిక వడ్డీ ఆశ చూపి చాలామంది నుంచి రూ.కోటికి పైగా వసూలు చేసినట్టు సమాచారం. ఏలూరుకు చెందిన కానిస్టేబుల్ ఉచ్చులోపడిన హైమ.. అతడి సూచన మేరకు ఐపీ పెట్టి ఊరినుంచి వెళ్లిపోయినట్టు చెబుతున్నారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment