Palakoderu
-
నువ్వు లేకపోతే చచ్చిపోతానని నమ్మించి.. పలుమార్లు లైంగిక దాడి
సాక్షి, పాలకోడేరు (తూర్పుగోదావరి): బాలికపై లైంగిక దాడికి పాల్పడిన యువకుడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. డీఎస్పీ టీవీ సత్యనారాయణ పాలకోడేరులో శనివారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. మండలంలోని శృంగవృక్షం గ్రామానికి చెందిన బాలిక పదోతరగతి చదివి ఇంటి దగ్గరే ఉంటోంది. వీరవాసరం మండలం అండలూరు గ్రామానికి చెందిన నల్లి దిలీప్ డెకరేషన్ వృత్తి చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. బాలికతో ఇన్స్టాగ్రామ్ లో పరిచయం పెంచుకుని.. నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు లేకపోతే చచ్చిపోతానని నమ్మించి ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన ఇంటికి తీసుకువెళ్లి అక్కడ కూడా లైంగిక దాడి చేశాడు. అక్కడి నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు చేస్తున్నట్టు డీఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో ఎస్సై సీహెచ్ రామచంద్రరావు, సిబ్బంది పాల్గొన్నారు. చదవండి: (పెళ్లి చేసుకుంటానని.. యువతులతో సంబంధాలు: నటి అనుశ్రీ) -
రైలెక్కి హైదరాబాద్‌కు.. 21 ఏళ్ల అనంతరం
పాలకోడేరు: అది 2000 సంవత్సరం.. ఆ పిల్లవాడు 6వ తరగతి చదువుతున్నాడు. బడిలో టీచర్ మందలించాడని ఇంటికి వెళ్లకుండా రైల్వేస్టేషన్‌కు వెళ్లి కనిపించిన రైలు ఎక్కేశాడు. హైదరాబాద్‌లో మహానగరంలో దిగి ఎక్కడికి వెళ్లాలో తెలియక ఎక్కడెక్కడో తిరిగాడు. కడుపునింపుకోవడానికి ఎన్నో పనులు చేశాడు. పెద్దవాడై పెళ్లి చేసుకున్నాడు. కవలపిల్లలు పుట్టారు. 21 ఏళ్ల అనంతరం అతనికి అమ్మానాన్న, తమ్ముడు, చెల్లి గుర్తుకొచ్చారు. అయితే ఫోన్‌నెంబర్లు లేవు. ఎలా కలవాలో తెలియలేదు. తను పనిచేసే రెస్టారెంట్‌కు రెగ్యులర్‌గా వచ్చే ఒక జర్నలిస్ట్‌కు తన బాధ చెప్పుకున్నాడు. ఆ జర్నలిస్ట్ పంచాయతీ కార్యాలయానికి తల్లిదండ్రుల పేర్లు అందించి ఫోన్ నెంబర్లు సేకరించాడు. ఇప్పుడు తనవారికి కలుసుకునేందుకు సొంతూరు వస్తున్నాడు. 21 ఏళ్ల క్రితం వెళ్లి పోయిన కొడుకు కోసం తల్లిదండ్రులు వెదకని చోటు లేదు. కాల ప్రవాహంంలో చిన్న కొడుకు, కూతుళ్ల పెళ్లిళ్లు చేశారు. ఎప్పటికైనా కొడుకు వస్తాడని ఎదురుచూస్తున్నారు. వారికి చల్లని వార్త జర్నలిస్ట్ రూపంలో అందింది. ఫోన్లో కొడుకుతో మాట్లాడారు. సినిమా కథను మరిపించే ఈ సంఘటన పాలకోడేరు మండలం శృంగవృక్షంలో జరిగింది. రావి చెరువు గట్టున ఉన్న బొక్కా సుబ్బారావు–కృష్ణవేణి దంపతుల కుమారుడే శ్రీకాంత్. ప్రస్తుతం శ్రీకాంత్ తన భార్యా, బిడ్డలతో రెండు దశాబ్దాల అనంతరం సొంత గడ్డపై అడుగుపెడుతున్నాడు. అతని రాక కోసం ఆ కుటుంబం ఎదురు చూస్తుంది. చదవండి: యువకుడి హత్య కేసులో తొమ్మిది మంది అరెస్ట్ -
వడ్డీల వలయంలో చిక్కి దంపతుల ఆత్మహత్య
పాలకోడేరు: ఆ దంపతులు వడ్డీల వలయంలో చిక్కి ఏడాదిన్నర కుమారుడికి విషమిచ్చి ఊపిరి తీశారు. ఆ వెంటనే వారు కూడా విషం తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం కుముదవల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. చీడే పరశురామ్(45), ధనసావిత్రి(30) వ్యవసాయదారులు. మంగళవారం ఉదయం ఆ దంపతులు తమ కుమారుడు నాగవెంకట శ్రీనివాస్‌తో కలిసి కుముదవల్లి సమీపంలోని సరుగుడు తోటలోకి వెళ్లి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. చనిపోయే ముందు బంధువులకు వాట్సాప్ మెసేజ్‌లు పెట్టడంతో వారంతా అక్కడికి చేసుకునేసరికే ముగ్గురూ విగత జీవులై కనిపించారు. వడ్డీల మాయలో పడి.. ధనసావిత్రి పుట్టిల్లైన అత్తిలిలో చోడిశెట్టి హైమ అనే మహిళ చిట్టీలు వేస్తూ, వడ్డీ వ్యాపారం చేస్తుండేది. ఆమెకు ధనసావిత్రితో పరిచయం ఉండటంతో అధిక వడ్డీ ఆశ చూపించి సుమారు రూ.9 లక్షలు అప్పు తీసుకుంది. ఆ తరువాత తెలిసిన వారి నుంచి తక్కువ వడ్డీకి సొమ్ములు తీసుకుని తనకిస్తే.. నూటికి రూ.5 చొప్పున వడ్డీ చెల్లిస్తానని నమ్మబలికింది. ఇలా ధనసావిత్రి దంపతుల బంధువుల నుంచి రూ.25 లక్షలకు పైగా సేకరించిన హైమ ఐపీ పెట్టింది. ఈ విషయం తెలియడంతో ధనసావిత్రి బంధువులు తామిచ్చిన డబ్బును తిరిగివ్వాలంటూ ఆమెపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. చోడిశెట్టి హైమ అధిక వడ్డీ ఆశ చూపి చాలామంది నుంచి రూ.కోటికి పైగా వసూలు చేసినట్టు సమాచారం. ఏలూరుకు చెందిన కానిస్టేబుల్ ఉచ్చులోపడిన హైమ.. అతడి సూచన మేరకు ఐపీ పెట్టి ఊరినుంచి వెళ్లిపోయినట్టు చెబుతున్నారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. -
తల్లి ఎదుటే కిడ్నాప్‌కు యత్నించిన యువకుడి
-
తల్లి ఎదుటే కిడ్నాప్‌కు యత్నించిన యువకుడు
సాక్షి, పశ్చిమ గోదావరి: జిల్లాలోని పాలకోడేరు మండలం విస్సాకోడేరులో కిడ్నాప్ కలకలం రేపింది. విస్సాకోడేరు సెంటర్లో వెళుతున్న యువతిని.. ఓ యువకుడు కారులోకి లాక్కోని వెళ్లిపోయాడు. వివరాల్లోకి అరుణకుమారి తన కూతరు అనుషాతో కలిసి వెళుతున్న సమయంలో కారులో వచ్చిన ఒక యువకుడు అనుషాను కారులో బలవంతంగా ఎక్కించాడు. ఇది చూసిన అరుణకుమారి కారు డోర్ పట్టుకుని వేలాడుతూ అడ్డుపడ్డారు. కానీ ఆ యువకుడు అవేమీ పట్టించుకోకుండా కారును వేగంగా ముందుకు తోలాడు. దీనిని గమనించిన స్థానికులు ఆ కారును వెంబడించి పట్టుకున్నారు. ఈలోపే ఆ యువకుడు అనుషాను విస్సాకోడేరు నుంచి భీమవరం మండలం తాడేరు వరకు దాదాపు 10 కి.మీ తీసుకునివెళ్లాడు. అనుషాను రక్షించిన స్థానికులు ఆ యువకుడిని చితకబాది.. పాలకోడేరు పోలీస్ స్టేషన్లో అప్పగించారు. కిడ్నాప్‌కు యత్నించిన సదురు యువకుడిని కాలేష్గా గుర్తించారు. కాగా, కాలేష్ గత కొంతకాలంగా ప్రేమిస్తున్నానంటూ అనుషా వెంట పడుతున్నట్టుగా సమాచారం. -
కొండేపూడి సెంటిమెంట్
పాలకోడేరు–ఆకివీడు: అధికారం చేపట్టాలంటే ఆ గ్రామం నుంచి ప్రచారం మొదలు పెట్టాల్సిందే. ప్రభుత్వ పథకాలు మొదలు పెట్టాలంటే ఆ గ్రామంలో అడుగుపెట్టి వెళ్లాల్సిందే. ఇలాంటి సెంటిమెంట్‌తో పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో పాలకోడేరు మండలంలో కొండేపూడి గ్రామం ఉంది. ఒకప్పుడు భీమవరం నియోజకవర్గంలో పాలకోడేరు మండలం ఉండేది. అప్పుడు కూడా నాయకులు ఈశాన్యం నుంచి ప్రచారాలు, కార్యక్రమాలు మొదలుపెడితే మంచిదని భావించి కొండేపూడిని ఎంపిక చేసుకునేవారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ప్రతి నాయకుడూ ప్రతి కార్యక్రమాన్ని ఇక్కడ నుంచే ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోంది. 2009లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత పాలకోడేరు మండలం ఉండి నియోజకవర్గంలోకి వచ్చింది. ఇప్పుడు కూడా ఈశాన్యం కొండేపూడి గ్రామం కావడంతో ఈ గ్రామం సెంటిమెంట్‌కు ప్రాధాన్యత పెరిగింది. అయితే.. సెంటిమెంట్ గ్రామంలో అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే చందంగా ఉంది. నియోజకవర్గాలు మారినా, నాయకులు మారినా గ్రామంలో సమస్యలు మాత్రం తీరలేదు. గ్రామ సచివాలయం శిథిలమైపోయినా పట్టించుకునే నాథుడే లేడు. -
బాల్యవివాహాల నిరోధానికి చట్టం
పాలకోడేరు రూరల్ : బాల్య వివాహాల వల్ల ఎన్నో అనర్థాలు తలెత్తుతాయి. ఇప్పటికీ ఎంతో మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు బాల్య దశలోనే పెళ్లిళ్లు చేసేస్తున్నారు. ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో త్వరపడుతున్నారు. ఇది చాలా ప్రమాదకరమని స్వచ్ఛంద సంస్థలు, అధికారులు మొత్తుకుంటున్నా పట్టించుకోవడం లేదు. ఈనేపథ్యంలో బాల్యవివాహాల నిరోధక చట్టం ఏం చెబుతోంది.. ఆ పెళ్లిళ్ల వల్ల సమస్యలేమిటీ వంటి విషయాలు ఐసీడీఎస్ విస్సాకోడేరు ప్రాజెక్టు అధికారిణి వాణీవిజయురత్నం వివరించారు. చట్టం ఏమి చెబుతుందంటే.. బాల్య వివాహాల నిరోధక చట్టం(1929) స్థానంలో ప్రభుత్వం 2006లో కొత్త బాల్య వివాహ నిరోధక చట్టాన్ని ప్రవేశపెట్టింది. దీనిప్రకారం బాలికకు 18 ఏళ్లు, బాలుడికి 21 ఏళ్లు నిండకుండా పెళ్లి చేస్తే నేరం. వాటిని ప్రోత్సహించినా నేరమే. వీటికి కఠిన శిక్షలు ఉంటాయి. అనర్థాలివీ.. చిన్న వయుస్సులో పెళ్లి చేయుడం వల్ల ఆడపిల్లలకు ఆరోగ్యపర ఇబ్బందులు వస్తారుు. చదువు, ఆటపాటలతో ఎదగాల్సిన పిల్లలు బలహీనమవుతారు. శారీరక, వూనసిక పరిపక్వత లేని సవుయుంలో గర్భిణులైతే వూతాశిశువురణాలు సంభవించే ప్రమాదం ఉంది. చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేయడం వల్ల కుటుంబ భారం మీద పడుతుంది. అవగాహన లేమి వల్ల ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. వీటిని తట్టుకునే మానసిక పరిపక్వత లేకపోవడంతో కుటుంబం ఛిన్నాభిన్నమయ్యే ప్రమాదం ఉంది. చిన్నవయసులో భర్త, పిల్లలు, అత్తమామల సంరక్షణ భారం పడడంతో ఆడపిల్లలు ఒత్తిడికి లోనవుతారు. ఫలితంగా ఆత్మహత్యలు పెరిగే ప్రమాదం ఉంది. బాల్య వివాహాల వల్ల పుట్టే పిల్లల్లో జన్యులోపం ఉంటున్నట్టు వైద్యులూ హెచ్చరిస్తున్నారు. నివారణకు మనమేం చేయాలి బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలి. ఎక్కడైనా చిన్నపిల్లలకు పెళ్లి జరుగుతున్నట్టు తెలిస్తే వెంటనే గ్రామస్థాయిలో అంగన్వాడీ టీచర్‌కు సమాచారం ఇవ్వాలి. అంగన్వాడీ కార్యకర్త ఐసీడీఎస్ సూపర్వైజర్కు గానీ, మహిళా సంక్షేమ అధికారికిగానీ సమాచారం ఇస్తారు. ఐసీడీఎస్ అధికారులు తహసిల్దార్, ఎస్ఐకి సమాచారం ఇచ్చి బాల్యవివాహాన్ని అడ్డుకుంటారు. బాలలకు రక్షణ కల్పిస్తారు. ప్రత్యేక కమిటీలు ఉన్నాయి బాల్య వివాహాలు నిరోధించడానికి ప్రభుత్వం పలు స్థారుుల్లో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. జిల్లాస్థాయిలో కలెక్టర్ బాల్యవివాహాల నిరోధక అధికారిగా వ్యవహరిస్తారు. ఈ కమిటీలో మహిళాశిశు సంక్షేమ పీడీతోపాటు ఇతర శాఖల అధికారులు సభ్యులుగా ఉంటారు. రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఆర్డీవో, లేదా సబ్‌కలెక్టర్ బాల్య వివాహాల నిరోధక అధికారిగా ఉంటారు. ఆయునతోపాటు డివిజన్ల్స్థాయి ఇతర శాఖల అధికారులు సభ్యులుగా ఉంటారు. అంగన్వాడి ప్రాజెక్టు పరిధిలో ఐసీడీఎస్ సీడీపీఓ బాల్యవివాహ నిరోధక అధికారిగా ఉంటారు. ఈ స్థాయిలో తహసిల్దార్, ఎస్ఐ సభ్యులుగా ఉంటారు. గ్రావుస్థాయిలో బాల్య వివాహాల నిరోధక కమిటీలో గ్రావు సర్పంచ్ కమిటీ అధ్యక్షునిగా వ్యవహరిస్తారు. అంగన్వాడీ టీచర్, పంచాయతీ కార్యదర్శి, వీఆర్వో, పంచాయతీ బోర్డు మహిళా సభ్యురాలు, ఏఎన్ఎం, గ్రామ సమాఖ్య సభ్యులు తదితర 12 మంది కమిటీ సభ్యులుగా ఉంటారు. బాల్య వివాహాలు జరుగుతున్నట్టు మన దృష్టికి వస్తే ఈ కమిటీల్లో ఎవరికైనా ఫిర్యాదు చేయొచ్చు. -
జైలులో ఉన్నవారిని కలవాలంటే..!
పాలకోడేరు రూరల్: జైలులో ఉన్న రిమాండ్ ఖైదీలు, శిక్ష అనుభవిస్తున్న ముద్దాలను కలవాలంటే ఎలా అనే విషయాలను భీమవరం సబ్‌జైలు చీఫ్ హెడ్ వార్డర్ వీవీవీఎస్ఎం ప్రసాద్ తెలిపారు. ఏం చేయాలి, ఎవరి అనుమతి తీసుకోవాలి, వారానికి ఎన్నిసార్లు కలవొచ్చు, ఎంత సమయం మాట్లాడవచ్చు తదితర వివరాలు తెలుసుకోండి. అనుమతి తీసుకోవడం ఇలా.. జైలులో ఉన్నవారిని కలిసేందుకు ముందుగా ఓ దరఖాస్తు పూర్తిచేయాల్సి ఉంటుంది. సంబంధిత ఖైదీ వివరాలు, కలవడానికి వచ్చిన వారి వివరాలు, ఖైదీతో వీరికున్న బంధం, చిరునామాను దరఖాస్తుపై పూరించాలి. దీంతో పాటు కలవడానికి వచ్చిన వారి ఆధార్ లేక రేషన్ కార్డు జెరాక్సు కాపీ జతచేయాలి. దరఖాస్తును జైలు సిబ్బందికి అందిస్తే వారు సూపరింటెండెంట్‌కు పంపిస్తారు. ఆయన దానిని పరిశీలించి అనుమతి ఇస్తారు. రెండు సార్లు.. 20 నిమిషాలు వారానికి రెండు సార్లు సాధారణ పనిరోజుల్లో ఖైదీలను కలవవచ్చు. ఉదయుం 10 గంటల నుంచి సాయుంత్రం 4 గంటలలోపు కలవవచ్చు. ఖైదీతో సుమారు 20 నిమిషాల పాటు మాట్లాడవచ్చు. ఖైదీ తల్లిదండ్రులు, భార్య, పిల్లలు, బంధువులు, స్నేహితులు, వారి న్యాయవాదులు కలిసేందుకు అవకాశం ఇస్తారు. తినుబండారాలు.. వస్త్రాలు ఖైదీలను కలవడానికి వచ్చే వారు పండ్లు, కవర్ ప్యాకింగ్ (సీల్డ్ ఐటమ్స్) ఉన్న బిస్కెట్లు, స్వీట్లు అందించవచ్చు. దుస్తులు ఇవ్వవచ్చు. డాక్టర్ పరిశీలించిన తర్వాత సూపరింటెండెంట్ అనుమతితో మందులు ఇవ్వవచ్చు. ముందుగా వీటిని జైలు సిబ్బంది పరిశీలించిన తర్వాతే ఖైదీలకు అందిస్తారు. ఖైదీలకు సొమ్ములు ఇవ్వాలనుకుంటే వాటిని జైలు సిబ్బందికి ఇస్తే పీపీసీకి (ప్రజనీర్స్ ప్రైవేట్ క్యాష్) నందు డిపాజిట్ చేస్తారు. ఫోను.. పోస్టు కార్డు సౌకర్యం జైలులో ఉన్న ఖైదీలకు ఫోన్ సదుపాయం కల్పిస్తారు. కాల్‌కు 5 నిమిషాలకు రూ.10 వసూలు చేస్తారు. ఫోను సంభాషణలు జైలు శాఖ ఉన్నత కార్యాలయంలో రికార్డు అవుతాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ఖైదీలు మాట్లాడాల్సి ఉంటుంది. జైలులో ఫోను ఉపయోగించని వారికి నెలకు రెండు సార్లు పోస్టు కార్డులు అందిస్తారు. 15 రోజులకోసారి ఖైదీలకు ఉత్తరం రాసుకునే అవకాశం కల్పిస్తారు. -
వాహన రిజిస్ట్రేషన్ చేయించుకోండిలా
పాలకోడేరు రూరల్ :వాహనాలను కొనుగోలు చేసిన వారు విధిగా రిజస్ట్రేషన్ చేయించుకోవాలి. వాహన కంపెనీ డీలర్ నుంచి టీఆర్ తీసుకున్న 30 రోజుల్లో పర్మినెంట్ రిజస్ట్రేషన్ చేయించుకోకపోతే ఇబ్బందులు తప్పవంటున్నారు భీమవరం ప్రాంతీయ రవాణా అధికారి (ఆర్డీవో) జె.రమేష్‌కువూర్. రిజిస్ట్రేషన్ చేయించుకునే విధానం, తదితర వివరాలు ఆయన మాటల్లోనే.. తాత్కాలిక రిజిస్ట్రేషన్ (టీఆర్) వాహనం కొనుగోలు చేసినప్పుడు సదరు వాహన కంపెనీ డీలర్ తాత్కాలిక రిజస్ట్రేషన్ (టీఆర్) నంబర్ ఇస్తారు. ఆ నంబర్‌తో ఉండే రిజస్ట్రేషన్ కేవలం 30 రోజులు మాత్రమే పనిచేస్తుంది. 30 రోజుల్లోపు వాహనానికి పర్మినెంట్ రిజస్ట్రేషన్ చేయించుకోవాలి. పర్మినెంట్ రిజిస్ట్రేషన్ పొందండిలా పర్మినెంట్ రిజస్ట్రేషన్ కోసం సమీపంలోని ప్రాంతీయు రవాణా అధికారి (ఆర్టీవో) కార్యాలయంలో దరఖాస్తు చేయాలి. వాహనానికి సంబంధించి డీలర్ ఇచ్చిన పత్రాల కాపీలను జత చేయాలి. ద్విచక్ర వాహనం అయితే ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ, హెల్మెట్ బిల్లు జత చేయాలి. కారు యజమాని అయితే ఆధార్, పాన్ కార్డు కాపీలను జత చేయాలి. ద్విచక్ర వాహనానికి అయితే రూ.445, ఆటోకు రూ.350, కారుకు రూ.635, ట్రాక్టర్‌కు రూ.700, లారీకి రూ.900, ఇతర మినీ లారీలకు రూ.625 చొప్పున చలానా రూపంలో చెల్లించాలి. అనంతరం దరఖాస్తును ఆర్టీవో సిబ్బంది హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ (హెచ్ఎస్ఆర్పీ) విభాగానికి పంపిస్తారు. హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ కోసం.. హెచ్ఎస్ఆర్పీ విభాగం దరఖాస్తును పరిశీలించి అదే రోజున పర్మినెంట్ నంబర్ కేటాయించి హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ (హెచ్ఎస్ఆర్పీ) ఇస్తుంది. ఈ నంబర్ ప్లేట్ కోసం ద్విచక్ర వాహనానికైతే రూ.245, నాలుగు చక్రాల వాహనాలకైతే రూ.630 రుసుము వసూలు చేస్తారు. అనంతరం వాహనాన్ని పరిశీలన కోసం రిజస్ట్రేషన్ దరఖాస్తును అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఏఎంవీఐ)కి పంపిస్తారు. ఏఎంవీఐ ఆ వాహనాన్ని పరిశీలిస్తారు. డీలర్ ఇచ్చిన పత్రాల్లోని వివరాల ఆధారంగా వాహనం మోడల్, ఛాసిస్ నంబర్, ఇంజిన్, వాడే ఇంధనం తదితర అన్ని వివరాలను పరిశీలిస్తారు. ఫారం-21 ప్రకారం అన్నీ పరిశీలించి.. వివరాలన్నీ సక్రమంగా ఉంటే ఆమోదం తెలియజేస్తారు. అనంతరం దరఖాస్తును ఏపీ ట్రాన్స్పోర్ట్ డాట్ ఓఆర్జీ వెబ్సైట్లో పొందుపరుస్తారు. దీంతో రిజిస్ట్రేషన్ పూర్తయినట్టే. అనంతరం పర్మినెంట్ రిజిస్ట్రేషన్ (ఆర్సీ) వివరాలు పొందుపర్చిన కార్డును దరఖాస్తు చేసిన నాలుగు రోజుల్లో పోస్టు ద్వారా వాహన యజమాని ఇంటికి పంపిస్తారు. ఆర్సీ కార్డులో వాహనం రకం, మోడల్, వాడే ఇంధనం, రంగు, యూజవూని పేరు, చిరునామా తదితర వివరాలు ఉంటాయి. రిజస్ట్రేషన్ చేయించకపోతే.. వాహనం కొనుగోలు సవుయుంలో ఇచ్చే తాత్కాలిక రిజస్ట్రేషన్ గడువు 30 రోజుల్లోపు పర్మినెంట్ రిజస్ట్రేషన్ చేయించుకోకపోతే తనిఖీల సమయంలో వాహనాన్ని సీజ్ చేస్తారు. వాహన యజమానికి జరిమానా కూడా విధిస్తారు. ద్విచక్ర వాహనమైతే రూ.2 వేలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. -
తల్లి ఆరోగ్యమే బిడ్డకు రక్ష
పాలకోడేరు రూరల్ : తల్లి ఆరోగ్యమే బిడ్డకు రక్ష. గర్భిణులు, బాలింతలు తగిన జాగ్రత్తలు పాటిస్తే పుట్టే/పుట్టిన బిడ్డతోపాటు వారూ ఆరోగ్యంగా ఉంటారు. భవిష్యత్తులో తలెత్తబోయే సమస్యలనూ నియంత్రించగలుగుతారు. ఈ నేపథ్యంలో వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహార నియమాలు ఓ సారి తెలుసుకుందాం.. గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గర్భిణి అని తెలియగానే అంగన్వాడీ కేంద్రంలో పేరు నమోదు చేసుకోవాలి. అక్కడ ఇచ్చే పౌష్టికాహారం తప్పనిసరిగా తీసుకోవాలి. రోజులో కొద్దికొద్దిగా ఎక్కువసార్లు ఆహారం తీసుకోవాలి. అయోడైజ్డ్ ఉప్పునే వాడాలి. రక్తహీనత నివారణకు ఐ.ఎఫ్.ఎ. వూత్రలు వాడాలి. ధనుర్వాత నివారణకు రెండు టీటీ ఇంజక్షన్లు చేయించుకోవాలి. గర్భిణిగా ఉన్న సమయంలో కనీసం ఐదుసార్లు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. , రక్తపోటు, రక్తపరీక్షలు చేయించుకోవాలి. ఎలాంటి బరువు పనులూ చేయురాదు. ఆఖరి మూడు నెలలు తగినంత విశ్రాంతి తీసుకోవాలి. ఎప్పుటికప్పుడు స్కానింగ్ చేయించుకుని శిశువు బరువు తెలుసుకోవాలి. ఆస్పత్రిలోనే ప్రసవం చేయించుకోవాలి. పాలు, గుడ్లు రోజూ తీసుకోవాలి. పండ్లు, ఆకు కూరలు ఎక్కువగా తినాలి. వేరుశేనగ, బెల్లం ఉండలు తీసుకుంటే మంచిది. ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. -
ప్రేమజంట ఆత్మహత్య
పాలకోడేరు (పశ్చిమగోదావరి జిల్లా) : తమ ప్రేమకు తల్లిదండ్రులు ఒప్పులేదనే కారణంతో ఓ ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన పాలకోడేరు మండలం గరగపర్రు గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. గరగపర్రు గ్రామానికి చెందిన డొల్ల సునీల్(20), దాసరి శిరీష(20)లిద్దరూ రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో మనస్తాపానికి గురై ఊరి చివర పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
తెలుగు పుస్తకంలో తెలంగాణ పదాలు
పాలకోడేరు రూరల్ : గుండు పోకలు.. యాడ్‌కి.. నింబోళీ.. వాడినాలు.. పోక గెలలు.. సూక్కవోడు వంగ.. షర్బత్.. తలవాలు బియ్యం.. ఏంటి ఈ పదాలు ఎక్కడా విన్నట్లు లేవు అనుకుంటున్నారా ఏమీ లేదండి తొమ్మిదో తరగతి తెలుగు పుస్తకంలో కనిపిస్తున్న పదాలు ఇవి. విద్యా ప్రమాణాలను పెంచేందుకు ప్రభుత్వం తొమ్మిదో తరగతికి కొత్త సిలబస్‌ను కేటాయించింది. దీనిలో భాగంగా కొత్త పుస్తకాలను విడుదల చేసింది. ఇవి పాఠశాలలకు కూడా చేరుకున్నాయి. అయితే తొమ్మిదో తరగతి తెలుగు దివ్వెలు-1 పుస్తకంలో కొన్ని తెలంగాణ పాఠాలు విద్యార్థులను తికమక పెట్టేవిలా ఉన్నాయి. వరంగల్, ఆదిలాబాద్, మహ బూబ్‌నగర్ ప్రాంతాలకు చెందిన కొందరు రచయితలు ఈ పుస్తకంలో కొన్ని పాఠాలను రచించారు. ఇవి పూర్తిగా తెలంగాణ భాష, యాసతో కూడుకుని ఉన్నాయి. ఈ పాఠాల్లోన్ని కొన్ని పదాల అర్థాలు పలువురు ఉపాధ్యాయులకు తెలియకపోవడం గమనార్హం. దీంతో విద్యార్థులకు పాఠాలు ఎలా బోధించాలని వారు అంటున్నారు. పుస్తకంలోని ‘సీతక్క పెం డ్లి, రూబాయి’ పాఠాలలో ‘సుట్టాలోచ్చిన్రు, మ్యానత లిచిన్రు, మంగళహర్తిదెచ్చింది’వంటి పదాలు ఇందుకు నిదర్శనంగా నిలిచాయి. ఎక్కువ పదాలు తెలంగాణ యాసలో ఉ న్నాయి. ఆయా ప్రాంతాల్లో వాడుకలో ఉన్న పదాలను ఇక్కడ వినియోగించారు. దీంతో విద్యార్థులు అయోమయానికి గురికాక తప్పని పరిస్థితి. -
విద్యుత్ శాఖను వేధిస్తున్న లైన్మెన్ల కొరత
పాలకోడేరు రూరల్, న్యూస్‌లైన్: విద్యుత్ శాఖను సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. ముఖ్యంగా తగినంతమంది లైన్మెన్లు లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సమస్యలు పరిష్కారం కావడం లేదు. దీంతో అటు వినియోగదారులు, ఇటు విద్యుత్ శాఖ అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయినా, ఏమైనా ఫిర్యాదులు వచ్చినా, కొత్త కనెక్షన్లు ఇచ్చేందుకు రోజుల తరబడి సమయం పడుతోంది. దీంతో కొందరు అధికారులు ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లచే పనులు చేయిస్తున్నారు. హైకోర్టులో పోస్టుల భర్తీ వ్యవహారం జిల్లాలో సూమారు 400 గ్రామాలకు జూనియర్ లైన్మెన్లు లేక ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో 360 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ పోస్టులు భర్తీ విషయం హైకోర్టులో నలుగుతుంది. లైన్మెన్ పోస్టులు తమకు కేటాయించాలంటూ విద్యుత్ సబ్స్టేషన్లలో పనిచేసే షిఫ్ట్ ఆపరేటర్లు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు నేరుగా నియామకాలు చేపట్టాలంటూ పలువురు నిరుద్యోగులు కూడా పిటిషన్లు వేశారు. దీంతో ఆ వ్యవహారం కోర్టులో నలుగుతోంది. అది తేలితే గాని పోస్టులు భర్తీ చేసే అవకాశం లేదు. మరోవైపు రాష్ట్ర విభజన అంశం కూడా మరో కారణంగా కనిపిస్తోంది. కోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే లైన్మెన్ పోస్టులు భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని జిల్లా విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. -
అమ్మ పేరు పెట్టారని పింఛను ఆపేశారు
పాలకోడేరు, న్యూస్‌లైన్ :వీళ్లిద్దరూ తల్లీకూతుళ్లు. ఇద్దరి పేర్లూ మరియమ్మ కావడం.. వారి పాలిట శాపమైంది. అధికారుల పుణ్యమాని కుమార్తె మరి యమ్మకు వికలాంగుల కోటాలో నెలనెలా ఇచ్చే రూ.500 పింఛను ఆగిపోయింది. ఇదేమని అధికారులను అడిగితే.. అదంతే అంటున్నారు. కుటుంబ పెద్ద మరణించాడు. తల్లికి ఒంట్లో శక్తి క్షీణించింది. ఏ పనీ చేయలేకపోతోంది. కుమార్తెను పోషించుకునే మార్గం లేక తల్లడిల్లిపోతోంది. వివరాల్లోకి వెళితే.. పాలకోడేరు మండలం మోగల్లు గ్రామానికి చెందిన సన్నమండ్ర ఏసేబు కుమార్తె మరియమ్మ పుట్టుకతోనే వికలాంగురాలు. అతడు మరణించడంతో భార్య మరియమ్మకు రూ.200 వితంతు పిం ఛను ఇస్తున్నారు. ఆమె కుమార్తె మరియమ్మ వికలాంగురాలు కావడంతో గతంలో రూ. 500 పింఛను వచ్చేది. ఆరు నెలల నుంచి ఆ మొత్తం ఇవ్వడం మానేశారు. ఆరాతీస్తే తల్లిపేరు, కుమార్తె పేరు ఒకటే కావడంతో ఆ యువతికి వికలాంగ పింఛను నిలిపివేసినట్టు తెలిసింది. ‘మా ఇంటాయన చనిపోయూడు. నా ఒంట్లో ఓపిక చచ్చిపోయింది. కూలి పనులు చేయలేకపోతున్నాను. నా బిడ్డ వికలాంగురాలు. దానికొచ్చే పింఛను ఆగిపోయింది. నాకు ఇస్తున్న రూ. 200తో మేమిద్దరం ఎలా బతికేది’ అంటూ తల్లి మరియమ్మ విలపిస్తోంది. ఈ విషయమై గ్రామ కార్యదర్శి పి.నాగమణిని ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా.. ఇద్దరి పేర్లు ఒకటే కావడం వల్ల గందరగోళం ఏర్పడి పింఛను నిలిచిపోయిందని చెప్పారు. వారిద్దరి ఆధార్ కార్డులను తీసుకుని ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు. ఈ సమస్యను పరిష్కారమయ్యే వరకూ సమరభేరి మోగించాలని ‘సాక్షి’ నిర్ణయించింది.