తెలుగు పుస్తకంలో తెలంగాణ పదాలు
పాలకోడేరు రూరల్ : గుండు పోకలు.. యాడ్కి.. నింబోళీ.. వాడినాలు.. పోక గెలలు.. సూక్కవోడు వంగ.. షర్బత్.. తలవాలు బియ్యం.. ఏంటి ఈ పదాలు ఎక్కడా విన్నట్లు లేవు అనుకుంటున్నారా ఏమీ లేదండి తొమ్మిదో తరగతి తెలుగు పుస్తకంలో కనిపిస్తున్న పదాలు ఇవి. విద్యా ప్రమాణాలను పెంచేందుకు ప్రభుత్వం తొమ్మిదో తరగతికి కొత్త సిలబస్‌ను కేటాయించింది. దీనిలో భాగంగా కొత్త పుస్తకాలను విడుదల చేసింది. ఇవి పాఠశాలలకు కూడా చేరుకున్నాయి. అయితే తొమ్మిదో తరగతి తెలుగు దివ్వెలు-1 పుస్తకంలో కొన్ని తెలంగాణ పాఠాలు విద్యార్థులను తికమక పెట్టేవిలా ఉన్నాయి.
వరంగల్, ఆదిలాబాద్, మహ బూబ్‌నగర్ ప్రాంతాలకు చెందిన కొందరు రచయితలు ఈ పుస్తకంలో కొన్ని పాఠాలను రచించారు. ఇవి పూర్తిగా తెలంగాణ భాష, యాసతో కూడుకుని ఉన్నాయి. ఈ పాఠాల్లోన్ని కొన్ని పదాల అర్థాలు పలువురు ఉపాధ్యాయులకు తెలియకపోవడం గమనార్హం. దీంతో విద్యార్థులకు పాఠాలు ఎలా బోధించాలని వారు అంటున్నారు. పుస్తకంలోని ‘సీతక్క పెం డ్లి, రూబాయి’ పాఠాలలో ‘సుట్టాలోచ్చిన్రు, మ్యానత లిచిన్రు, మంగళహర్తిదెచ్చింది’వంటి పదాలు ఇందుకు నిదర్శనంగా నిలిచాయి. ఎక్కువ పదాలు తెలంగాణ యాసలో ఉ న్నాయి. ఆయా ప్రాంతాల్లో వాడుకలో ఉన్న పదాలను ఇక్కడ వినియోగించారు. దీంతో విద్యార్థులు అయోమయానికి గురికాక తప్పని పరిస్థితి.