Telugu book
-
Varala Anand: ఆనంద్ అంతర్లోకాల చెలిమె
కవి తనని తాను చూసుకునే చూపు. అలాగే సమాజాన్ని చూసే చూపు. తనూ సమాజం కలగలసిన చూపు. విశాల విశ్వంలో తన చూపు ఆనే చోటు. ఇలాగ చూపులు ఎన్నో రకాలుగా ఉంటాయి. ఒక కవి తనలోకి అలాగే సమాజంలోకి చూసే దృక్కోణాలే కాకుండా– అతడు సమా జాన్ని తనలోకి ఒంపుకోవడం– అలాగే తను సమాజంలో కలగలిసిపోవడం. ఇలాగా ఎన్నెన్నో కోణాల నుంచి తనని తాను బేరీజు వేసుకునే కవి శ్రమించి తన కవితను తీర్చిదిద్దుతాడు. తనలో ఒక క్రమం. అలాగే సమాజంలోనూ ఓ క్రమం ఉంటుంది. క్రమం లేని తనమూ ఉండవచ్చు. ఇలా ఆలోచిస్తూ పోతుంటే కవి తనకు తాను సాధారణంగానూ, అసాధారణంగానూ తోచవచ్చు! ‘అక్షరాల చెలిమె’ అన్న వారాల ఆనంద్ కవితా సంపుటిని ఒకటికి రెండుసార్లు చదివినాక నాలో కలిగిన భావాలివి. ఆనంద్ భావకుడు. ఒక శిల్పి ఎలాగైతే తన శిల్పాన్ని తయారు చేస్తాడో అలాగే ఆనంద్ కవిత్వం చేయడంలో నేర్పరి. పుట్టుకతో మనిషి తెచ్చుకున్న బాధ ఉంది. రకరకాల అనుభూతులతో పాటు నేను న్నానని ఎప్పుడూ హెచ్చరించే బాధ ఉంది. బాధలు రకరకాలు. ఉండీ బాధ, లేకా బాధ. ఉండీ లేకా బాధ. ఒక్కోసారి బాధ కోసమే బాధ. సందర్భాన్ని బట్టి బాధ అలంకారమూ కావచ్చు. ఏది ఏమైనా సంతోషాన్ని నిరాకరించలేనట్టే బాధనూ నిరాకరించలేము. వేదన అన్నది మరొకటి. వేదనకీ, బాధకీ కొంత వ్యత్యాస ముంది. చాలా సందర్భాలలో వేదనకి బాధ మూలమై ఉంటుంది. ఉండకనూ పోవచ్చు. మనిషి జీవితంలో సందర్భాలు అనేకం. అందుకే వేదన సందర్భాన్ని అనుసరించి కూడా ఉండొచ్చు. ప్రారంభం లాగానే కొన్నింటికి ముగింపు కనిపిస్తుంది. కొన్నింటికి కనిపించదు. మరికొన్నింటికి కనిపించీ కనిపించని తనంలా తోస్తోంది. కదలిక– స్తబ్ధత, ఉదయం– సాయంకాలం, రాత్రి–పగలు, బాగుండడం– దిగులుగా ఉండడం, నవ్వు– ఏడుపు, ఆశ– నిరాశ, తీరం కనిపించడం– దరి దొరకకపోవడం, బతుకు– చావు... మానవ జీవితంలోని ద్వంద్వాలు ఇవి. ఉన్నవాటిని అంగీకరిస్తూనే, లేని వాటిని ఊహించడం. ఒక్కో సారి ఉన్నది వాస్తవం కాకపోవచ్చు. ఊహ సరైనది కావచ్చు. అలాగే ఉన్నది వాస్తవం అయినప్పుడు ఊహ సరైనది అయ్యే అవకాశం లేకపోవచ్చు. వాస్తవం– ఊహ అన్నవి నిజాలు. అలాగే అబద్ధాలూనూ! జీవితం నిజం. వాస్తవం. అంటే మన కంటితో చూస్తున్నది నిజమైతే – భౌతికంగా కనిపించే జీవితానికి పైన అద్దిన పన్నీ కూడా ఉంది. ఇవి రెంటినీ కలిపి చూస్తే – నీరెండ నీళ్ళపై తేలియాడే వెలుతురు. పసిపాప ముఖంపై సయ్యాటలాడే చిరునవ్వు. జీవితంలోని నిజాల్ని ఒప్పుకుంటేనే, జీవితం ముందూ వెనకా జరిగే సంఘటనలను నేర్పుగా పట్టుకోలేని అసాయత కూడా ఒకటి ఉంది. ‘విజయసూత్రం’ అనేది జీవితంలో అచ్చమైన నిజం కాదు. దానికి ముందూ వెనకా చాలా విషయాలు ఉంటాయి. జీవితం అన్నది అనేక అంశాల కూడలి. వాటి క్రమం ఎప్పుడూ ఒకేలా ఉండదు. వైవిధ్యభరితమైంది అది. వెలుగు నీడలూ, తెలుపు నలుపు అన్నవి ఎంత నిజమో; మానవ జీవితంలోని ప్రతి కదలికకి కలవరించి పలవరించడమూ అన్నది అంతే నిజం. సృజన కారుల్లో ఇది కాస్త మోతాదుని మించుతుంది. ఆనంద్ తను కవిగా చెందిన పరిణతి మనల్ని అబ్బురపరుస్తుంది. అలాగే అతడి జీవిత క్రమం కూడా! సామాన్యుల జీవితా లలో ఎన్నో పరిణామాలు జరుగుతూ ఉంటాయి. కాని అవి అంతగా పరిగణలోకి రావు. కాని సృజన కారుడి జీవితంలో జరిగే పరిణామాలు ఎన్నో వింతలూ విడ్డూరాల్ని సృష్టించవచ్చు. కారణం సృజనకారుడు సమస్య లోతుల్లోకి వెళ్ళి శోధిస్తాడు. అతడు ఇంకా సున్నిత మనస్కుడైనప్పుడు మనకు ‘అక్షరాల చెలిమె’ లాంటి విలువైన కవిత అందుతుంది. కవి ఇక్కడ జీవితంలోని అరలను, వాటిలోని వెలుగునీడల్ని మనకు పరిచయం చేస్తాడు. జీవితంలో తట్టుకొని... సంగీతాన్ని వినిపిస్తాడు. అందుకే ఆనంద్ కవిత్వమన్నా, జీవితమన్నా నాకు చాలా ప్రత్యేకమైనవి. మీరు కూడా ఈ కవితల ద్వారా ఎన్నో వింత వినూత్న అనుభవాలకు లోనౌతారని ఆశిస్తాను. (క్లిక్ చేయండి: రా.రా. ఓ నఖరేఖా చిత్రం!) - బి. నరసింగరావు సినీ దర్శకులు, రచయిత -
Darshi Chenchaiah: ఆయన జీవితమే ఒక సందేశం
ఆయన జీవితం ఒక అద్భుతం. ఆయన పోరాటం అనన్యం. ఏకైక తెలుగు ‘గదర్’ వీరుడు. వ్యవసాయ శాస్త్రం చదవడానికని విదేశాలకు వెళ్ళి సమాజంలో అసమాన తలు చూసి చలించిపోయి విప్లవాన్ని విలక్షణంగా అధ్యయనం చేసిన ధీరుడు. తెలుగులోనే కాదు, యావత్ దేశంలోనే ప్రప్రథమ అరాచకవాద (అనార్కిస్ట్) తత్వవేత్తల్లో ఒకరు. విస్తృతమైన జీవితాను భవాలను అక్షరీకరించి ‘నేనూ–నా దేశం’ పేరిట అద్వితీయమైన ఆత్మకథను తెలుగు ప్రజకి అందించాడు. ఆయనే దరిశి చెంచయ్య. సామాన్య సంప్రదాయ కుటుంబంలో జన్మించి అసామాన్య యోధుడిగా ఎదిగిన ఆయన జీవితం ఎప్పటికీ నిత్య పఠనీయం. యావత్ దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి రాజకీయ డిటెన్యూగా దేశంలో ఆనాడు ఆయన్ని ఉంచని జైలు లేదంటే అతిశయోక్తి కాదు. స్వాతంత్య్రోద్యమంలో అతివాద టెర్రరిస్టు కార్యకలాపాలలో పాల్గొనడమే కాక కాంగ్రెస్ నాయకుడిగా, గాంధేయవాదిగా తన ప్రస్థానాన్ని కొనసాగించారు. సోషలిస్టుగా, కమ్యూనిస్టుగా, మానవతావాదిగా, సాహిత్యకారుడిగా, సామా జిక వేత్తగా, సంఘ సంస్కర్తగా, సాంస్కృతిక ఉద్యమకారుడిగా చెంచయ్య ప్రజ్ఞ బహుముఖం. చెంచయ్య ఆత్మకథ... అనేకమంది విప్లవ వీరులూ, స్వాతంత్య్ర సమరయోధుల జీవిత చరిత్రల సమాహారం. ఒక విధంగా చెప్పాలంటే సమకాలీన చరిత్రను రికార్డు చేసిన గ్రంథం. అందుకే తెలుగులో వచ్చిన ఆత్మకథల్లో అత్యుత్తమమైన వాటిలో ఒకటిగా ఇది నిలుస్తుంది. సరిగ్గా 70 ఏళ్ళ క్రితం... 1952 సెప్టెంబర్‌లో మొదటిసారిగా ప్రచురించబడిన ‘నేను–నా దేశం’ గ్రంథాన్ని బ్రిటిష్ సామ్రాజ్యవాదుల ఉరి కొయ్యలకు బలైపోయిన తన పంజాబ్ మిత్రుడు సర్దార్ బలవంత్ సింగుకూ, ఆయన భార్యకీ అంకితం ఇచ్చారు. నాకు తెలిసి తెలుగులో ఒక పంజాబ్ విప్లవ దంపతులకు అంకితమిచ్చిన ఏకైక తెలుగు స్వీయచరిత్ర ఇదే. అందుకే నార్ల ఈ పుస్తకానికి పీఠిక రాస్తూ, ‘‘శ్రీ చెంచయ్య గారి ‘నేనూ – నా దేశం’ నిస్సంశయంగా ఉత్తమ శ్రేణికి చెందిన ఆత్మకథ. నిజానికి అది ఆయన ఆత్మకథ కాదు; మన దేశ చరిత్ర. పోయిన అర్ధ శతాబ్దిలో మన దేశంలో ఆర్థిక, సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక రంగాలలో వచ్చిన ప్రతి మహోద్యమం చెంచయ్య జీవిత దర్పణంలో తన ప్రతిబింబాన్ని మిగిల్చింద’’ని అంటారు. స్వాతంత్య్ర సమరయోధుడు, ‘ప్రభవ’ పత్రిక వ్యవస్థాపకులు గద్దె లింగయ్య మొదటిసారి ముద్రించిన నాలుగొందల పుటల ఈ స్వీయచరిత్ర అద్భుతమైన విప్లవకారులు జితేంద్ర నాధ లాహిరీ నుండి మొట్టమొదటి భారతీయ అనార్కిస్టు, గొప్ప బౌద్ధ, భౌతికవాద రచయిత లాలా హర్ దయాళ్ వరకూ; జోధ్ సింగ్, చిదంబరం పిళ్లై, నీలకంఠ బ్రహ్మ చారి... వంటి అనేకమందీ మనకి పరిచయం అవుతారు. మొదటి వైశ్య వితంతు వివాహం మొదలు కొని వితంతు శిశు శరణాలయాల స్థాపన దాకా; ‘మా భూమి’ నాటక ప్రదర్శనలు, అమెరికా, జపాన్, చైనా, రష్యా, సింగపూర్ దేశాలలోని పరిస్థితులు, విప్లవ రాజకీయాల్ని కూడా ఇందులో మన కళ్ళకు కడతారు. ఇదంతా ఒక ఎత్తయితే మహామేధావి డాక్టర్ కేబీ కృష్ణతో చెంచయ్యకి ఉన్న అమితమైన స్నేహం ఒక్కటీ ఒకెత్తు. జైలులో ఉన్న సమయంలో కేబీ కృష్ణ మార్క్స్ ‘కేపిటల్’ గ్రంథం మీద అందరికీ క్లాసులు చెప్పే వారంటూ, ‘ఆయన శక్తి మాకు ఆశ్చర్యం కలిగించింది... ఆయన రాజకీయ ఆర్థిక శాస్త్రాలలో పారంగతుడు; వేదాంత శాస్త్రంలో అసమాన పాండిత్యం కలవాడు.. వారి సహాయంతో డిటెన్యూల క్యాంపు ఒక సర్వకళాశాలగానూ, విప్లవ కళాశాలగానూ మారిందని’ అంటారు చెంచయ్య. ‘నేను కమ్యూనిస్టు కావడానికి ముఖ్య కారణం స్త్రీల కష్టాలను తొలగించడానికి ప్రయత్నాలు చేసి, చేసి పూర్తిగా సాధించలేక పోవడం వల్ల కలిగిన అసంతృప్తి..’ అని రాసుకున్నారాయన. పది సంవత్సరాలు కమ్యూనిస్టు పార్టీలో ఉన్నప్పటికీ కమ్యూనిస్టు కాలేకపోయానని నిజాయితీగా రాసుకున్న నిజమైన కమ్యూనిస్టు ఆయన. బీడీ కార్మికులు, చుట్ట కార్మికులు, స్పెన్సర్ కంపెనీ కార్మికులు, కార్పొరేషన్ కార్మికులు, ఇంకా పారిశుద్ధ్య కార్మికులు వంటివారు చేసిన పోరాటాలు అన్నిం టిలోనూ క్షేత్ర స్థాయిలో పాల్గొన్న ఆయన ‘అభ్యుదయ రచయితల మహాసభ’ మొదలు ‘ప్రజానాట్యమండలి’ వరకూ అనేక ప్రజా సంఘాలతో మమేకమై పని చేశారు. వాటిల్లోని లోపాలను కూడా చాలా సూటిగా చెప్పారు, రాశారు. కనుకనే స్వీయచరిత్ర ముగిస్తూ ఈ దేశానికి, మన సమాజానికి, ‘ఒక మహత్తర సంస్కృతీ ఉద్యమము’ అవసరం అని ప్రత్యేకంగా నొక్కి వక్కాణించారు. (చదవండి: భరత జాతికి ఒక ఆంగ్ల నాడి) చివరి రోజుల్లో ఆర్థిక ఇబ్బందులకు తాళలేక, ఎవరి దగ్గరా చేయి చాచలేక ఇంట్లో సామానులు అమ్ముకున్న వైనం మనల్ని కదిలిస్తుంది. బహుముఖ ప్రజ్ఞాశాలి చెంచయ్యకు తెలుగు నేలపై ఇప్పటికీ తగిన గుర్తింపు రాలేదనడం అవాస్తవం కాదు. 70 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఆయన స్వీయ చరిత్ర ‘నేనూ– నా దేశం’ లోని కొంత భాగాన్నయినా విద్యార్థులకు పాఠ్యాంశంగా పెట్టే దిశగా ప్రభుత్వం యోచన చేయాలి. - గౌరవ్ చెంచయ్య సాంస్కృతిక వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు (దరిశి చెంచయ్య స్వీయచరిత్ర ‘నేనూ – నా దేశం’తెలుగు లోకానికి అంది 70 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా) -
చరిత్ర చెక్కిలిపై చెరగని సంతకం
కొంతమంది మామూలు మనుషులు దేశికోత్తముల శిష్యరికం, నిరంతర అధ్యయనం, విసుగూ వేసటా లేని రచనా వ్యాసంగం, మహా విద్వాంసుల సాంగత్యాల వల్ల సామాన్య స్థితి నుంచి అసామాన్య స్థాయికి ఎదుగుతారు. తాము చరిత్రను నడిపించామని గొప్పలు పోక, చరిత్ర తమను నడిపించిందని తలొంచుకొని వినమ్రత ప్రదర్శిస్తారు. అలాంటి వినయమోహనులైన వకుళాభరణం రామకృష్ణ ఆత్మకథ – ‘నన్ను నడిపించిన చరిత్ర’. వకుళాభరణం ‘జ్ఞాపకాలు ఎందుకు రాశాను?’ అని తనకు తానే ప్రశ్నించుకొని ఇలా సమాధానం ఇస్తారు – ‘‘గత జీవితపు నెమరువేత! నాతో నేను మాట్లాడుకొనే స్వీయ సంభాషణ నా తృప్తికోసం, మహా అయితే మా కుటుంబం, మిత్రుల కోసం, శ్రేయోభి లాషుల కోసం, భావి తరాల కోసం.’’ 84 ఏళ్ల వకుళా భరణం రామకృష్ణ సుమారు ఎనభై సంవత్సరాల గత స్మృతుల్ని తలపోసుకొన్నారు. వకుళాభరణం రామకృష్ణ నెల్లూరు జిల్లా కందుకూరు తాలూకా ‘పాకలపల్లె’ వీధిబడి నుంచి కావలిలోని ‘విశ్వోదయ’ (జవహర్ భారతి) కళాశాల దాకా సాగిన చదువు సాముల గురించి ఎన్నో తీపి, చేదు అనుభవాల్ని జ్ఞాపకాల దొంతర్లలో పేర్చారు. పల్లెపట్టుల ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించి, అన్ని జాతుల వాళ్ల మధ్య అరమరికలు లేకుండా జీవించి, మురిసిపోయిన వకుళా భరణం సింహావలోకనం చేసుకుంటూ– ‘‘...మన సమాజం ఎంత దూరం వచ్చింది, చదువు, సంస్కారం, విజ్ఞానం ఒకవైపు పెరిగినా; మత దురహంకారం, అసహనం ఎలా పెరిగి పొయ్యాయి? మన సంకీర్ణ సంస్కృతి ఏమౌతున్నది?’’ అని తలపట్టుకొని వేదన పడ్డారు. రామకృష్ణ నెల్లూరు వీఆర్ కాలేజి (1953–55)లో ఇంటర్మీడియట్, కావలి విశ్వోదయ కాలేజి (1955– 57)లో బీఏ చదివారు. సింగరాయ కొండ ఉన్నత పాఠశాలలో చదివే రోజుల్లోనే రెబల్ టీచరు నల్లగట్ల బాలకృష్ణారెడ్డి, ఉపాధ్యాయ ఉద్యమ నిర్మాత మరో అధ్యాపకుడైన సింగరాజు రామకృష్ణయ్యల న్యాయ పక్షపాత దృష్టి, సామ్యవాద సిద్ధాంతాల ప్రభావం ఈయనపై పడింది. కేవీఆర్ శిష్యరికంతో ఈ ప్రభావం మరింత గాఢమైంది. వకుళాభరణం ‘గుంపులో మనిషిని కాని’ నేను (పేజి: 96) అని అన్నా... యునైటెడ్ స్టేట్స్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ఇన్ ఇండియా (యూఎస్ఈఎఫ్ఐ) ద్వారా ఎన్నికై 1967లో అమెరికా వెళ్లి, అక్కడ బ్లూమింగ్టన్ లోని ‘ఎర్ల్ హామ్ కాలేజి’లో విద్యార్థి సేవల గురించి అధ్యయనం చేశారు. రెండు నెలలపాటు అక్కడి పది విశ్వవిద్యాలయాల్ని దర్శించి నేర్చుకొన్న పాఠాల్నీ, అనుభవాల్నీ ‘జవహర్ భారతి’ కళాశాలలో ఆచరణలోకి తెచ్చారు. ‘‘అమెరికా పర్యటన వల్ల నా జ్ఞాన నేత్రం మరింత విప్పారింది. నా చుట్టూ వున్న పరిసరాలను, మనుష్యులను సమ్యక్ రీతిలో అర్థం చేసుకోగల సామర్థ్యం పెరిగింది’’ (పేజి: 100) అని రాసుకున్నారు. అంతేకాదు, ఈ విదేశీ పర్య టన ‘గుంపులో మనిషి కాని’ వకుళాభరణాన్ని గుంపులో మనిషిగా తీర్చిదిద్దింది. (క్లిక్: కూడు పెట్టే భాష కావాలి!) ‘జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం’లో వకుళా భరణం పరిశోధకులుగా గడిపిన సుమారు నాలుగు సంవత్సరాల అవధి, ఉపన్యాసకులుగా పనిచేసిన ఏడాది కాలం ఆయన్ను రాటుదేలిన పరిశోధకులుగా, ఉత్తమ ఆచార్యులుగా రూపొందించాయి. ఆచార్యవర్యులైన సర్వేపల్లి గోపాల్, బిపిన్‌చంద్ర, రొమిలా థాపర్ల సాన్నిధ్య, సాన్నిహిత్యాలు ఆయన జ్ఞానతృష్ణ, పరిశోధనా పటిమలకు మెరుగులు దిద్దాయి. ఆచార్య వకుళాభరణం రామకృష్ణ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎంతోమంది చరిత్ర ఆచార్యుల, విద్వాంసుల సహాయ సహకారాలతో ‘ఆంధ్రప్రదేశ్ సమగ్ర చరిత్ర – సంస్కృతి’ 9 ఆంగ్ల సంపుటాల్నీ, 8 తెలుగు సంపుటాల్నీ 2003 నుంచి 2017 అవధిలో ప్రచురింపచేశారు. ఆచార్య రామకృష్ణ తమ ఆత్మకథ చివర్లో ‘కథ ముగిసింది’ (పేజి: 210) అని నిర్వేదం ప్రకటించారు. కథ ఇంకా ముగియ లేదు. ఆయన చేయవలసింది చాలా ఉంది! (క్లిక్: నవ్యచిత్ర వైతాళికుడు) – ఘట్టమరాజు సుప్రసిద్ధ విమర్శకులు -
తెలుగు పుస్తకంలో తెలంగాణ పదాలు
పాలకోడేరు రూరల్ : గుండు పోకలు.. యాడ్‌కి.. నింబోళీ.. వాడినాలు.. పోక గెలలు.. సూక్కవోడు వంగ.. షర్బత్.. తలవాలు బియ్యం.. ఏంటి ఈ పదాలు ఎక్కడా విన్నట్లు లేవు అనుకుంటున్నారా ఏమీ లేదండి తొమ్మిదో తరగతి తెలుగు పుస్తకంలో కనిపిస్తున్న పదాలు ఇవి. విద్యా ప్రమాణాలను పెంచేందుకు ప్రభుత్వం తొమ్మిదో తరగతికి కొత్త సిలబస్‌ను కేటాయించింది. దీనిలో భాగంగా కొత్త పుస్తకాలను విడుదల చేసింది. ఇవి పాఠశాలలకు కూడా చేరుకున్నాయి. అయితే తొమ్మిదో తరగతి తెలుగు దివ్వెలు-1 పుస్తకంలో కొన్ని తెలంగాణ పాఠాలు విద్యార్థులను తికమక పెట్టేవిలా ఉన్నాయి. వరంగల్, ఆదిలాబాద్, మహ బూబ్‌నగర్ ప్రాంతాలకు చెందిన కొందరు రచయితలు ఈ పుస్తకంలో కొన్ని పాఠాలను రచించారు. ఇవి పూర్తిగా తెలంగాణ భాష, యాసతో కూడుకుని ఉన్నాయి. ఈ పాఠాల్లోన్ని కొన్ని పదాల అర్థాలు పలువురు ఉపాధ్యాయులకు తెలియకపోవడం గమనార్హం. దీంతో విద్యార్థులకు పాఠాలు ఎలా బోధించాలని వారు అంటున్నారు. పుస్తకంలోని ‘సీతక్క పెం డ్లి, రూబాయి’ పాఠాలలో ‘సుట్టాలోచ్చిన్రు, మ్యానత లిచిన్రు, మంగళహర్తిదెచ్చింది’వంటి పదాలు ఇందుకు నిదర్శనంగా నిలిచాయి. ఎక్కువ పదాలు తెలంగాణ యాసలో ఉ న్నాయి. ఆయా ప్రాంతాల్లో వాడుకలో ఉన్న పదాలను ఇక్కడ వినియోగించారు. దీంతో విద్యార్థులు అయోమయానికి గురికాక తప్పని పరిస్థితి.