Varala Anand: ఆనంద్‌ అంతర్లోకాల చెలిమె | Varala Anand Book Akshrala Cheleme Review by Bongu Narsing Rao | Sakshi

Varala Anand: ఆనంద్‌ అంతర్లోకాల చెలిమె

Published Tue, Nov 29 2022 2:24 PM | Last Updated on Tue, Nov 29 2022 2:24 PM

Varala Anand Book Akshrala Cheleme Review by Bongu Narsing Rao - Sakshi

వారాల ఆనంద్‌

కవి తనని తాను చూసుకునే చూపు. అలాగే సమాజాన్ని చూసే చూపు. తనూ సమాజం కలగలసిన చూపు. విశాల విశ్వంలో తన చూపు ఆనే చోటు. ఇలాగ చూపులు ఎన్నో రకాలుగా ఉంటాయి. 

ఒక కవి తనలోకి అలాగే సమాజంలోకి చూసే దృక్కోణాలే కాకుండా– అతడు సమా జాన్ని తనలోకి ఒంపుకోవడం– అలాగే తను సమాజంలో కలగలిసిపోవడం. ఇలాగా ఎన్నెన్నో కోణాల నుంచి తనని తాను బేరీజు వేసుకునే కవి శ్రమించి తన కవితను తీర్చిదిద్దుతాడు. 

తనలో ఒక క్రమం. అలాగే సమాజంలోనూ ఓ క్రమం ఉంటుంది. క్రమం లేని తనమూ ఉండవచ్చు. ఇలా ఆలోచిస్తూ పోతుంటే కవి తనకు తాను సాధారణంగానూ, అసాధారణంగానూ తోచవచ్చు! ‘అక్షరాల చెలిమె’ అన్న వారాల ఆనంద్‌ కవితా సంపుటిని ఒకటికి రెండుసార్లు చదివినాక నాలో కలిగిన భావాలివి. 

ఆనంద్‌ భావకుడు. ఒక శిల్పి ఎలాగైతే తన శిల్పాన్ని తయారు చేస్తాడో అలాగే ఆనంద్‌ కవిత్వం చేయడంలో నేర్పరి. పుట్టుకతో మనిషి తెచ్చుకున్న బాధ ఉంది. రకరకాల అనుభూతులతో పాటు నేను న్నానని ఎప్పుడూ హెచ్చరించే బాధ ఉంది. 

బాధలు రకరకాలు. ఉండీ బాధ, లేకా బాధ. ఉండీ లేకా బాధ. ఒక్కోసారి బాధ కోసమే బాధ. సందర్భాన్ని బట్టి బాధ అలంకారమూ కావచ్చు. ఏది ఏమైనా సంతోషాన్ని నిరాకరించలేనట్టే బాధనూ నిరాకరించలేము. 

వేదన అన్నది మరొకటి. వేదనకీ, బాధకీ కొంత వ్యత్యాస ముంది. చాలా సందర్భాలలో వేదనకి బాధ మూలమై ఉంటుంది. ఉండకనూ పోవచ్చు. మనిషి జీవితంలో సందర్భాలు అనేకం. అందుకే వేదన సందర్భాన్ని అనుసరించి కూడా ఉండొచ్చు. 

ప్రారంభం లాగానే కొన్నింటికి ముగింపు కనిపిస్తుంది. కొన్నింటికి కనిపించదు. మరికొన్నింటికి కనిపించీ కనిపించని తనంలా తోస్తోంది. కదలిక– స్తబ్ధత, ఉదయం– సాయంకాలం, రాత్రి–పగలు, బాగుండడం– దిగులుగా ఉండడం, నవ్వు– ఏడుపు, ఆశ– నిరాశ, తీరం కనిపించడం– దరి దొరకకపోవడం, బతుకు– చావు... మానవ జీవితంలోని ద్వంద్వాలు ఇవి. 

ఉన్నవాటిని అంగీకరిస్తూనే, లేని వాటిని ఊహించడం. ఒక్కో సారి ఉన్నది వాస్తవం కాకపోవచ్చు. ఊహ సరైనది కావచ్చు. అలాగే ఉన్నది వాస్తవం అయినప్పుడు ఊహ సరైనది అయ్యే అవకాశం లేకపోవచ్చు. వాస్తవం– ఊహ అన్నవి నిజాలు. అలాగే అబద్ధాలూనూ!

జీవితం నిజం. వాస్తవం. అంటే మన కంటితో చూస్తున్నది నిజమైతే – భౌతికంగా కనిపించే జీవితానికి పైన అద్దిన పన్నీ కూడా ఉంది. ఇవి రెంటినీ కలిపి చూస్తే – నీరెండ నీళ్ళపై తేలియాడే వెలుతురు. పసిపాప ముఖంపై సయ్యాటలాడే చిరునవ్వు. జీవితంలోని నిజాల్ని ఒప్పుకుంటేనే, జీవితం ముందూ వెనకా జరిగే సంఘటనలను నేర్పుగా పట్టుకోలేని అసాయత కూడా ఒకటి ఉంది. ‘విజయసూత్రం’ అనేది జీవితంలో అచ్చమైన నిజం కాదు. దానికి ముందూ వెనకా చాలా విషయాలు ఉంటాయి. 

జీవితం అన్నది అనేక అంశాల కూడలి. వాటి క్రమం ఎప్పుడూ ఒకేలా ఉండదు. వైవిధ్యభరితమైంది అది. వెలుగు నీడలూ, తెలుపు నలుపు అన్నవి ఎంత నిజమో; మానవ జీవితంలోని ప్రతి కదలికకి కలవరించి పలవరించడమూ అన్నది అంతే నిజం. సృజన కారుల్లో ఇది కాస్త మోతాదుని మించుతుంది.

ఆనంద్‌ తను కవిగా చెందిన పరిణతి మనల్ని అబ్బురపరుస్తుంది. అలాగే అతడి జీవిత క్రమం కూడా! సామాన్యుల జీవితా లలో ఎన్నో పరిణామాలు జరుగుతూ ఉంటాయి. కాని అవి అంతగా పరిగణలోకి రావు. కాని సృజన కారుడి జీవితంలో జరిగే పరిణామాలు ఎన్నో వింతలూ విడ్డూరాల్ని సృష్టించవచ్చు. కారణం సృజనకారుడు సమస్య లోతుల్లోకి వెళ్ళి శోధిస్తాడు. అతడు ఇంకా సున్నిత మనస్కుడైనప్పుడు మనకు ‘అక్షరాల చెలిమె’ లాంటి విలువైన కవిత అందుతుంది. కవి ఇక్కడ జీవితంలోని అరలను, వాటిలోని వెలుగునీడల్ని మనకు పరిచయం చేస్తాడు. జీవితంలో తట్టుకొని... సంగీతాన్ని వినిపిస్తాడు. 

అందుకే ఆనంద్‌ కవిత్వమన్నా, జీవితమన్నా నాకు చాలా ప్రత్యేకమైనవి. మీరు కూడా ఈ కవితల ద్వారా ఎన్నో వింత వినూత్న అనుభవాలకు లోనౌతారని ఆశిస్తాను. (క్లిక్‌ చేయండి: రా.రా.  ఓ నఖరేఖా చిత్రం!)


- బి. నరసింగరావు
సినీ దర్శకులు, రచయిత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement