Varala Anand
-
రొమాంటిక్ హీరో.. ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ప్రచారం..
హిందీ సినిమా రంగంలో అయిదు దశాబ్దాలకు పైగా నటుడిగా కొన సాగారు దేవానంద్. ఆయన నటనే స్టైల్‌కు పర్యాయపదంగా నిలిచి పోయింది. నిర్మాతగా, రచయితగా, దర్శకుడిగా కూడా కొనసాగుతూ ఎంతోమంది ప్రతిభావంతుల్ని సినీతెరకు పరిచయం చేశారు. శతజయంతి సందర్భంగా దేశ వ్యాప్తంగా ఆయన సినిమాలు ప్రదర్శితమయ్యాయి. హిందీ ప్రధాన స్రవంతి సినిమాల్లో దేవానంద్‌కు ముందు హుందా అయిన నటులున్నారు. ఆయన తర్వాత కాలంలో కూడా ఎంతో మంది నటులు వచ్చారు. కానీ దేవానంద్ స్టైల్, స్మైల్ విలక్షణమయినవి. ఆయన కదలిక, ఆహార్యం మొత్తంగా ఆయన నటనే స్టైల్‌కు పర్యాయ పదంగా నిలిచిపోయింది. ఆయన సినిమాల్లోని పాటలు నేటికీ జనాన్ని మంత్రముగ్ధుల్ని చేస్తూనే ఉన్నాయి. ‘మై జిందగీ కా సాత్ నిభాతా చలాగయా’, ‘కొయా కొయా చాంద్’, ‘గాతా రహే మేరా దిల్’ లాంటి పాటల్ని ఎవరు మరిచిపోగలరు? ఆ కాలంలో దిలీప్ కుమార్ విషాదాంత పాత్రలకు పర్యాయ పదంగా ఉండి, మధ్యతరగతి ప్రజల్ని, ఆనాటి మేధావుల్ని అలరిస్తున్నాడు. మరో వైపు చార్లీ చాప్లిన్ తరహా ట్రాంప్లా రాజ్ కపూర్ సామాన్య జన జీవితాల్లోకి చొచ్చుకు పోతున్నాడు. ఆ పరిస్థితుల్లో వారిద్దరికీ భిన్నంగా, తనదైన చేతనాత్మకమైన ధోరణితో నిలిచి గెలిచాడు దేవానంద్. సురయ్యా, మధుబాల, వైజయంతిమాల, హేమామాలిని, వహీదా రెహమాన్, నూతన్, గీతా దత్ లాంటి వాళ్ళతో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించాడు. 1923లో పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో దేవానంద్ జన్మించాడు. పంజాబ్ విశ్వ విద్యాలయంలో డిగ్రీ పూర్తి చేసుకుని బొంబాయి బయలుదేరాడు. అప్పటికే సినీ రంగంలో కృషి చేస్తున్న సోదరుడు చేతన్ ఆనంద్‌తో కలిసి తన భవిష్యత్తును నిర్మించుకుందామని ఆలోచన. 1946లో ప్రభాత్ వాళ్ళు నిర్మించిన ‘హామ్ ఏక్ హై’తో దేవ్ తన నట జీవితాన్ని ఆరంభించాడు. అప్పుడే గురు దత్తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ మిత్రులయ్యారు. తాను నిర్మాతగా మారి దర్శకుడిని చేస్తానని హామీ ఇచ్చాడు. రష్యన్ సినిమా ‘ఇన్స్పెక్టర్ జనరల్’ ప్రేరణతో చేతన్ ఆనంద్ తీసిన ‘అఫ్సర్’తో ఎస్.డి.బర్మన్ను సంగీత దర్శకుడిగా పరి చయం చేశాడు. తర్వాత బాల్ రాజ్ సహానీ స్క్రిప్ట్ ఆధారంగా ‘బాజీ’ తీశాడు. గురుదత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఉర్దూ కవి సాహిర్ లుథియాన్వీ మొదటిసారిగా గీతాలు రాశాడు. ఈ సినిమాతోనే కమెడియన్‌గా జానీ వాకర్ కూడా పరిచయం అయ్యాడు. గీతా రాయ్‌ను గురుదత్, కల్పనా కార్తీక్‌ను దేవా నంద్ ఈ చిత్ర సమయంలోనే కలుసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు జంటలయ్యారు. వహీదా రహ్మాన్‌తో దేవానంద్ అనేక విజయవంతమయిన సినిమాలు చేశాడు. వారిద్దరిదీ అప్పుడు హిందీ సినిమాల్లో గొప్ప హిట్ జంట. ‘సోల్వా సాల్’, ‘గైడ్’, ‘కాలా బాజార్’, ‘బాత్ ఏక్ రాత్ కీ’ వంటి సినిమాలు చిరస్థాయిగా నిలిచిపోయాయి. ‘గైడ్’ మొట్ట మొదటి ఇండో అమెరికన్ సిన్మాగా రూపొందింది. ఆర్.కె.నారాయణ్ నవల ఆధారంగా తీసిన ఈ సినిమా విమర్శ కుల ప్రశంసల్ని అందుకుంది. నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు ముగ్గురు త్రిమూర్తుల్ని– అంటే దేవానంద్, రాజ్‌కపూర్, దిలీప్ కుమార్‌లను తీన్‌మూర్తి భవన్‌కు ప్రత్యేకంగా ఆహ్వానించారు. అయిదు దశాబ్దాలకు పైగా హిందీ సినిమా రంగంలో తనదయిన శైలిలో నటిస్తూ, నిర్మిస్తూ... రచయితగా, దర్శకుడిగా కూడా కొనసాగుతూ... మొండితనంతో, తృష్ణతో తన నిర్మాణ సంస్థ ‘నవకేతన్’ను 52 ఏళ్ళకు పైగా సజీవంగా ఉంచుకున్నాడు దేవానంద్. 2001లో పద్మభూషణ్, 2002లో దాదా సాహెబ్ ఫాల్కే వరించాయి. ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించిన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆమెకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నేషనల్ పార్టీ ఆఫ్ ఇండియా పేర రాజకీయ పార్టీని స్థాపించినప్పటికీ దాన్ని ఎక్కువ కాలం నడపలేదు. దేవానంద్ జన్మశతాబ్ది సందర్భంగా దేశ వ్యాప్తంగా 30 నగరాల్లో 55 టాకీసుల్లో ఆయన నటించిన సినిమాలతో ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించారు. ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్, ఎన్.ఎఫ్.డి.సి. ఆర్కైవ్స్ ఆధ్వర్యంలో ఇది జరిగింది. వారాల ఆనంద్ వ్యాసకర్త కవి, విమర్శకుడు. 94405 01281 (నేడు నటుడు దేవానంద్ శతజయంతి.) -
మధురాంతకం, వారాలకు కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు
సాక్షి, న్యూఢిల్లీ/తిరుపతి: ఇద్దరు తెలుగు రచయితలను కేంద్ర సాహిత్య అకాడమి అవార్డులు వరించాయి. అకాడమి 2022 సంవత్సరానికి అవార్డులను గురువారం ప్రకటించింది. తెలుగు రచయితలు మధురాంతకం నరేంద్ర, వారాల ఆనంద్‌లకు పురస్కారాలు దక్కాయి. జీవితంలో ప్రజాస్వామిక దృక్పథం ఎంతో అవసరమని నమ్మే కథా రచయితల్లో ఒకరైన మధురాంతకం నరేంద్ర రచించిన ‘మనోధర్మ పరాగం’ నవలకు సాహిత్య అకాడమీ పురస్కారం, అనువాద రచనల విభాగంలో వారాల ఆనంద్ రాసిన ‘ఆకుపచ్చ కవితలు‘ పుస్తకానికి అనువాద పురస్కారం లభించాయి. త్వరలో రూ.లక్ష నగదు, జ్ఞాపికతో వీరు ఈ అవార్డులను అందుకోనున్నారు. నాడు తండ్రికి.. నేడు కుమారుడికి.. సామాజిక అంశాలే కథా వస్తువులుగా, సీమ వేషభాషలే ప్రాతిపదికగా పాత్రల తీరుతెన్నులు, జన వాస్తవిక దృక్పథమే ఆలంబనగా రచనలు చేస్తూ మధ్యతరగతి జీవుల జీవిత విశేషాలకు దర్పణం పట్టిన మధురాంతకం నరేంద్ర 1957 జూలై 16వ తేదీన ప్రస్తుతం తిరుపతి జిల్లా పాకాల మండలంలోని రమణయ్యగారిపల్లెలో నాగభూషణమ్మ, మధురాంతకం రాజారాం దంపతులకు జన్మించారు. ప్రస్తుతం తిరుపతి పద్మావతి నగర్లో నివాసముంటున్నారు. ఎంఏ ఇంగ్లిష్ లిటరేచర్, ఎంఫిల్, పీహెచ్డీ చేసిన నరేంద్ర ఎస్వీ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్‌కి ప్రిన్సిపాల్‌గా పని చేశారు. ఎస్వీయూ ఇంగ్లిష్ ప్రొఫెసర్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. సుప్రసిద్ధ రచయితగా కథలు, నవలలు, నాటకాలు, గేయాలు రచించిన సాహిత్య ఘనాపాటి అయిన తండ్రి మధురాంతకం రాజారాం వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నారు. తమిళ, కన్నడ, హిందీ, ఆంగ్ల, రష్యన్ భాషల్లోకి అనేక పుస్తకాలను అనువదించి సాహిత్యమే ఊపిరిగా జీవించిన రాజారాం గతంలో సాహిత్య అకాడమి అవార్డు అందుకున్నారు. కాగా, మైక్రోకోమ్స్ ఆఫ్ మోడర్న్ ఇండియా, కథాంజలి, కుంభమేళా, అస్తిత్వానికి అటు ఇటు, రెండేళ్లు పద్నాలుగు, భూచకం, కొండకింద కొత్తూరు, రూపాంతరం, పాటాంతరం, వెదురుపువ్వు, మధురాంతకం నరేంద్ర కథలు, నాలుగుకాళ్ల మండపం, కథాయాత్ర, తాత్వికకథలు, కథావర్షిక.. తదితరాలు నరేంద్ర రచనలు. డిగ్రీలోనే ఆనంద్ సాహితీ ప్రయాణం కరీంనగర్‌కు చెందిన వారాల ఆనంద్ కవి, రచయితడాక్యుమెంటరీ చిత్రాల దర్శకుడు, ఫిల్మిక్రిటిక్. ప్రముఖ కవి పద్మభూషణ్ గుల్జార్ రాసిన గ్రీన్పోయెమ్స్ 2019లో ఆనంద్ తెలుగులోకి అనువదించిన ‘ఆకుపచ్చ కవితలు’ పుస్తకంలో ప్రకృతికి సంబంధించిన 58 కవితలు ఉన్నాయి. ఆనంద్ డిగ్రీ చదువుతున్న సమయంలోనే తన సాహితీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1999లో నవ్యచిత్ర వైతాళికులు, మానేరు తీరం(కవిత్వం), బాలల చిత్రాలు వెలువరించారు. 2001లో సినీసుమాలు, 24 ఫ్రేమ్స్, 2010లో మానేరు గలగల, మెరుపు (సాహిత్యకారుల ఇంటర్వ్యూలు), 2017లో మనిషిలోపల (కవిత్వం), 2018లో అక్షరాల చెలిమి(కవిత్వం), బంగారు తెలంగాణలో చలనచిత్రం, తెలంగాణ సినిమా దశదిశ అనే రచనలు చేశారు. ఆనంద్ లైబ్రేరియన్‌గా ఉద్యోగ విరమణ పొందారు. రచయితలకు సీఎం జగన్ అభినందనలు సాక్షి, అమరావతి: కేంద్ర సాహిత్య అకాడమి పురస్కారానికి ఎంపికైన తెలుగు రచయితలు వారాల ఆనంద్, మ«దురాంతకం నరేంద్రలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం అభినందనలు తెలిపారు. ఇద్దరు సాహిత్యవేత్తలు అద్భుత రచనా నైపుణ్యంతో తెలుగుకీర్తిని పెంపొందించారని చెప్పారు. వారు తెలుగు సాహిత్యానికి ఎనలేని కృషి చేశారని కొనియాడారు. -
Varala Anand: ఆనంద్ అంతర్లోకాల చెలిమె
కవి తనని తాను చూసుకునే చూపు. అలాగే సమాజాన్ని చూసే చూపు. తనూ సమాజం కలగలసిన చూపు. విశాల విశ్వంలో తన చూపు ఆనే చోటు. ఇలాగ చూపులు ఎన్నో రకాలుగా ఉంటాయి. ఒక కవి తనలోకి అలాగే సమాజంలోకి చూసే దృక్కోణాలే కాకుండా– అతడు సమా జాన్ని తనలోకి ఒంపుకోవడం– అలాగే తను సమాజంలో కలగలిసిపోవడం. ఇలాగా ఎన్నెన్నో కోణాల నుంచి తనని తాను బేరీజు వేసుకునే కవి శ్రమించి తన కవితను తీర్చిదిద్దుతాడు. తనలో ఒక క్రమం. అలాగే సమాజంలోనూ ఓ క్రమం ఉంటుంది. క్రమం లేని తనమూ ఉండవచ్చు. ఇలా ఆలోచిస్తూ పోతుంటే కవి తనకు తాను సాధారణంగానూ, అసాధారణంగానూ తోచవచ్చు! ‘అక్షరాల చెలిమె’ అన్న వారాల ఆనంద్ కవితా సంపుటిని ఒకటికి రెండుసార్లు చదివినాక నాలో కలిగిన భావాలివి. ఆనంద్ భావకుడు. ఒక శిల్పి ఎలాగైతే తన శిల్పాన్ని తయారు చేస్తాడో అలాగే ఆనంద్ కవిత్వం చేయడంలో నేర్పరి. పుట్టుకతో మనిషి తెచ్చుకున్న బాధ ఉంది. రకరకాల అనుభూతులతో పాటు నేను న్నానని ఎప్పుడూ హెచ్చరించే బాధ ఉంది. బాధలు రకరకాలు. ఉండీ బాధ, లేకా బాధ. ఉండీ లేకా బాధ. ఒక్కోసారి బాధ కోసమే బాధ. సందర్భాన్ని బట్టి బాధ అలంకారమూ కావచ్చు. ఏది ఏమైనా సంతోషాన్ని నిరాకరించలేనట్టే బాధనూ నిరాకరించలేము. వేదన అన్నది మరొకటి. వేదనకీ, బాధకీ కొంత వ్యత్యాస ముంది. చాలా సందర్భాలలో వేదనకి బాధ మూలమై ఉంటుంది. ఉండకనూ పోవచ్చు. మనిషి జీవితంలో సందర్భాలు అనేకం. అందుకే వేదన సందర్భాన్ని అనుసరించి కూడా ఉండొచ్చు. ప్రారంభం లాగానే కొన్నింటికి ముగింపు కనిపిస్తుంది. కొన్నింటికి కనిపించదు. మరికొన్నింటికి కనిపించీ కనిపించని తనంలా తోస్తోంది. కదలిక– స్తబ్ధత, ఉదయం– సాయంకాలం, రాత్రి–పగలు, బాగుండడం– దిగులుగా ఉండడం, నవ్వు– ఏడుపు, ఆశ– నిరాశ, తీరం కనిపించడం– దరి దొరకకపోవడం, బతుకు– చావు... మానవ జీవితంలోని ద్వంద్వాలు ఇవి. ఉన్నవాటిని అంగీకరిస్తూనే, లేని వాటిని ఊహించడం. ఒక్కో సారి ఉన్నది వాస్తవం కాకపోవచ్చు. ఊహ సరైనది కావచ్చు. అలాగే ఉన్నది వాస్తవం అయినప్పుడు ఊహ సరైనది అయ్యే అవకాశం లేకపోవచ్చు. వాస్తవం– ఊహ అన్నవి నిజాలు. అలాగే అబద్ధాలూనూ! జీవితం నిజం. వాస్తవం. అంటే మన కంటితో చూస్తున్నది నిజమైతే – భౌతికంగా కనిపించే జీవితానికి పైన అద్దిన పన్నీ కూడా ఉంది. ఇవి రెంటినీ కలిపి చూస్తే – నీరెండ నీళ్ళపై తేలియాడే వెలుతురు. పసిపాప ముఖంపై సయ్యాటలాడే చిరునవ్వు. జీవితంలోని నిజాల్ని ఒప్పుకుంటేనే, జీవితం ముందూ వెనకా జరిగే సంఘటనలను నేర్పుగా పట్టుకోలేని అసాయత కూడా ఒకటి ఉంది. ‘విజయసూత్రం’ అనేది జీవితంలో అచ్చమైన నిజం కాదు. దానికి ముందూ వెనకా చాలా విషయాలు ఉంటాయి. జీవితం అన్నది అనేక అంశాల కూడలి. వాటి క్రమం ఎప్పుడూ ఒకేలా ఉండదు. వైవిధ్యభరితమైంది అది. వెలుగు నీడలూ, తెలుపు నలుపు అన్నవి ఎంత నిజమో; మానవ జీవితంలోని ప్రతి కదలికకి కలవరించి పలవరించడమూ అన్నది అంతే నిజం. సృజన కారుల్లో ఇది కాస్త మోతాదుని మించుతుంది. ఆనంద్ తను కవిగా చెందిన పరిణతి మనల్ని అబ్బురపరుస్తుంది. అలాగే అతడి జీవిత క్రమం కూడా! సామాన్యుల జీవితా లలో ఎన్నో పరిణామాలు జరుగుతూ ఉంటాయి. కాని అవి అంతగా పరిగణలోకి రావు. కాని సృజన కారుడి జీవితంలో జరిగే పరిణామాలు ఎన్నో వింతలూ విడ్డూరాల్ని సృష్టించవచ్చు. కారణం సృజనకారుడు సమస్య లోతుల్లోకి వెళ్ళి శోధిస్తాడు. అతడు ఇంకా సున్నిత మనస్కుడైనప్పుడు మనకు ‘అక్షరాల చెలిమె’ లాంటి విలువైన కవిత అందుతుంది. కవి ఇక్కడ జీవితంలోని అరలను, వాటిలోని వెలుగునీడల్ని మనకు పరిచయం చేస్తాడు. జీవితంలో తట్టుకొని... సంగీతాన్ని వినిపిస్తాడు. అందుకే ఆనంద్ కవిత్వమన్నా, జీవితమన్నా నాకు చాలా ప్రత్యేకమైనవి. మీరు కూడా ఈ కవితల ద్వారా ఎన్నో వింత వినూత్న అనుభవాలకు లోనౌతారని ఆశిస్తాను. (క్లిక్ చేయండి: రా.రా. ఓ నఖరేఖా చిత్రం!) - బి. నరసింగరావు సినీ దర్శకులు, రచయిత -
Satyajit Ray: నవ్యచిత్ర వైతాళికుడు
‘‘ఏమున్నది సార్ గీ సిన్మాల అంతా మా వూరు లెక్కనే వున్నది... మా బతుకులే వున్నయి...’’ సత్యజిత్ రే ‘పథేర్ పాంచాలి’ సినిమా చూసిన తర్వాత కరీంనగర్ జిల్లా ‘పోరండ్ల’ గ్రామ రైతు స్పందన ఇది. ఒక నిజాయతీ కలిగిన వాస్తవిక సినిమాకు ప్రపంచంలో ఎక్కడయినా ఇలాంటి స్పందనే వస్తుందన్నది నిజం. భారతీయ సినిమాకు కళాత్మకతనూ, మానవీయ స్పందనలనూ అందించిన దర్శకుడు రే. తన ముప్పై ఏళ్ల సినీ ప్రస్థానంలో ఆయన ‘పథేర్ పాంచాలి’ నుంచి ‘ఆగంతుక్’ వరకు ముప్పై పూర్తి నిడివి సినిమాలు, అనేక డాక్యుమెంటరీ సినిమాలు తీశారు. ఈ రోజుల్లో లాగా ఎలాంటి ఆధునిక ప్రసార మాధ్యమాలూ, సామాజిక మాధ్య మాలూ లేని ఆ కాలంలో రే కు ప్రపంచ ఖ్యాతి లభించింది. 1921లో మే 2న జన్మించిన సత్యజిత్ రే తన జీవితంలోని అత్యధిక సమయం సినీ రంగంలోనే గడిపినప్పటికీ ఆయన... రచయితగా, చిత్రకారుడిగా, టైపోగ్రాఫర్గా, బాల సాహిత్య సృష్టి కర్తగా, సైన్స్ ఫిక్షన్ రచయితగా తనదైన ముద్రతో సృజన రంగంలో పని చేశారు. సినిమా రంగంలో కూడా దర్శకత్వంతో పాటు సంగీతం, సినిమా టోగ్రఫీ, స్క్రిప్ట్, మాటల రచన తానే నిర్వహించారు. మొదట రవిశంకర్ లాంటి వాళ్ళతో సంగీతం చేయించుకున్నా తర్వాత తానే తన సినిమాలన్నింటికీ సంగీతం సమకూర్చుకున్నారు. ఇంకా సన్నివేశాలకు సంబంధించి సంపూర్ణ స్కెచెస్ వేసుకొని, చిత్రీకరణ జరిపేవారు. సాహిత్యానికీ సినిమాకూ వారధిలా నిలిచి భారతీయ సినిమాను పరిపుష్టం చేశారు. టాగూర్, బిభూతిభూషణ్ బంధోపాధ్యాయ్, తారాశంకర్ బంధోపాధ్యాయ్, ప్రేమ్ చంద్, నరేంద్రనాథ్ లాంటి మహా రచయితల రచనల్ని తెరపైకి ఎక్కించారు రే. అంతేకాదు, పలు సినిమాలకు తన స్వీయ రచనల్ని కూడా ఉపయోగించుకున్నారు. (చదవండి: ఆదర్శ కమ్యూనిస్టుకు జోహార్లు!) 1956లో ‘పథేర్ పాంచాలి’ కాన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘బెస్ట్ హ్యూమన్ డాక్యుమెంట్’ అవా ర్డును గెలుచుకొని భారతీయ సినిమాకు ప్రపంచ స్థాయి గుర్తింపును తెచ్చింది. తర్వాత ‘దేవి’, ‘కాంచన్ జంగా’, ‘చారులత’, ‘తీన్ కన్య’ ‘ఘరె బైరె’, ‘ఆగంతుక్’ లాంటి అనేక విశ్వ విఖ్యాత సిని మాల్ని రూపొందించారు. బహుశా ఆయన సినిమాల్ని ప్రదర్శించని అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు ప్రపంచంలో లేవు. ఆయన అందుకోని అవార్డులూ లేవు. కేంద్ర ప్రభుత్వం ‘భారత రత్న’, దాదా సాహెబ్ ఫాల్కే వంటి అత్యున్నత పురస్కారాలతో సత్కరించింది. ఫ్రాన్స్ దేశానికి చెందిన ‘లెజియన్ ఆఫ్ ఆనర్’, అలాగే ‘ఆస్కార్ జీవిత సాఫల్య పురస్కారం’ లాంటి లెక్కలేనన్ని అంతర్జాతీయ పురస్కారాలూ అందుకున్నారు. భారతీయ సినిమాకు నవ్యచిత్ర వైతాళికుడిగా నిలిచిన సత్యజిత్ రే 1992 ఏప్రిల్ 23న కలకత్తాలోని బెల్లెవీ నర్సింగ్ హోమ్‌లో తుదిశ్వాస విడిచారు. ఆయన చరిత్ర చిత్రసీమకు మణిహారం. (చదవండి: ‘జై హింద్’ నినాదకర్త మనోడే!) – వారాల ఆనంద్ (మే 2న సత్యజిత్ రే జయంతి)