సాక్షి, న్యూఢిల్లీ/తిరుపతి: ఇద్దరు తెలుగు రచయితలను కేంద్ర సాహిత్య అకాడమి అవార్డులు వరించాయి. అకాడమి 2022 సంవత్సరానికి అవార్డులను గురువారం ప్రకటించింది. తెలుగు రచయితలు మధురాంతకం నరేంద్ర, వారాల ఆనంద్‌లకు పురస్కారాలు దక్కాయి. జీవితంలో ప్రజాస్వామిక దృక్పథం ఎంతో అవసరమని నమ్మే కథా రచయితల్లో ఒకరైన మధురాంతకం నరేంద్ర రచించిన ‘మనోధర్మ పరాగం’ నవలకు సాహిత్య అకాడమీ పురస్కారం, అనువాద రచనల విభాగంలో వారాల ఆనంద్ రాసిన ‘ఆకుపచ్చ కవితలు‘ పుస్తకానికి అనువాద పురస్కారం లభించాయి. త్వరలో రూ.లక్ష నగదు, జ్ఞాపికతో వీరు ఈ అవార్డులను అందుకోనున్నారు.
నాడు తండ్రికి.. నేడు కుమారుడికి..
సామాజిక అంశాలే కథా వస్తువులుగా, సీమ వేషభాషలే ప్రాతిపదికగా పాత్రల తీరుతెన్నులు, జన వాస్తవిక దృక్పథమే ఆలంబనగా రచనలు చేస్తూ మధ్యతరగతి జీవుల జీవిత విశేషాలకు దర్పణం పట్టిన మధురాంతకం నరేంద్ర 1957 జూలై 16వ తేదీన ప్రస్తుతం తిరుపతి జిల్లా పాకాల మండలంలోని రమణయ్యగారిపల్లెలో నాగభూషణమ్మ, మధురాంతకం రాజారాం దంపతులకు జన్మించారు. ప్రస్తుతం తిరుపతి పద్మావతి నగర్‌లో నివాసముంటున్నారు. ఎంఏ ఇంగ్లిష్ లిటరేచర్, ఎంఫిల్, పీహెచ్‌డీ చేసిన నరేంద్ర ఎస్వీ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్‌కి ప్రిన్సిపాల్‌గా పని చేశారు. ఎస్వీయూ ఇంగ్లిష్ ప్రొఫెసర్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు.
సుప్రసిద్ధ రచయితగా కథలు, నవలలు, నాటకాలు, గేయాలు రచించిన సాహిత్య ఘనాపాటి అయిన తండ్రి మధురాంతకం రాజారాం వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నారు. తమిళ, కన్నడ, హిందీ, ఆంగ్ల, రష్యన్ భాషల్లోకి అనేక పుస్తకాలను అనువదించి సాహిత్యమే ఊపిరిగా జీవించిన రాజారాం గతంలో సాహిత్య అకాడమి అవార్డు అందుకున్నారు. కాగా, మైక్రోకోమ్స్ ఆఫ్ మోడర్న్ ఇండియా, కథాంజలి, కుంభమేళా, అస్తిత్వానికి అటు ఇటు, రెండేళ్లు పద్నాలుగు, భూచకం, కొండకింద కొత్తూరు, రూపాంతరం, పాటాంతరం, వెదురుపువ్వు, మధురాంతకం నరేంద్ర కథలు, నాలుగుకాళ్ల మండపం, కథాయాత్ర, తాత్వికకథలు, కథావర్షిక.. తదితరాలు నరేంద్ర రచనలు.
డిగ్రీలోనే ఆనంద్ సాహితీ ప్రయాణం
కరీంనగర్‌కు చెందిన వారాల ఆనంద్ కవి, రచయితడాక్యుమెంటరీ చిత్రాల దర్శకుడు, ఫిల్మిక్రిటిక్. ప్రముఖ కవి పద్మభూషణ్ గుల్జార్ రాసిన గ్రీన్‌పోయెమ్స్ 2019లో ఆనంద్ తెలుగులోకి అనువదించిన ‘ఆకుపచ్చ కవితలు’ పుస్తకంలో ప్రకృతికి సంబంధించిన 58 కవితలు ఉన్నాయి. ఆనంద్ డిగ్రీ చదువుతున్న సమయంలోనే తన సాహితీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1999లో నవ్యచిత్ర వైతాళికులు, మానేరు తీరం(కవిత్వం), బాలల చిత్రాలు వెలువరించారు. 2001లో సినీసుమాలు, 24 ఫ్రేమ్స్, 2010లో మానేరు గలగల, మెరుపు (సాహిత్యకారుల ఇంటర్వ్యూలు), 2017లో మనిషిలోపల (కవిత్వం), 2018లో అక్షరాల చెలిమి(కవిత్వం), బంగారు తెలంగాణలో చలనచిత్రం, తెలంగాణ సినిమా దశదిశ అనే రచనలు చేశారు.
ఆనంద్ లైబ్రేరియన్‌గా ఉద్యోగ విరమణ పొందారు.
రచయితలకు సీఎం జగన్ అభినందనలు
సాక్షి, అమరావతి: కేంద్ర సాహిత్య అకాడమి పురస్కారానికి ఎంపికైన తెలుగు రచయితలు వారాల ఆనంద్, మ«దురాంతకం నరేంద్రలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం అభినందనలు తెలిపారు. ఇద్దరు సాహిత్యవేత్తలు అద్భుత రచనా నైపుణ్యంతో తెలుగుకీర్తిని పెంపొందించారని చెప్పారు. వారు తెలుగు సాహిత్యానికి ఎనలేని కృషి చేశారని కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment