హిందీ సినిమా రంగంలో అయిదు దశాబ్దాలకు పైగా నటుడిగా కొన సాగారు దేవానంద్. ఆయన నటనే స్టైల్‌కు పర్యాయపదంగా నిలిచి పోయింది. నిర్మాతగా, రచయితగా, దర్శకుడిగా కూడా కొనసాగుతూ ఎంతోమంది ప్రతిభావంతుల్ని సినీతెరకు పరిచయం చేశారు. శతజయంతి సందర్భంగా దేశ వ్యాప్తంగా ఆయన సినిమాలు ప్రదర్శితమయ్యాయి.
హిందీ ప్రధాన స్రవంతి సినిమాల్లో దేవానంద్‌కు ముందు హుందా అయిన నటులున్నారు. ఆయన తర్వాత కాలంలో కూడా ఎంతో మంది నటులు వచ్చారు. కానీ దేవానంద్ స్టైల్, స్మైల్ విలక్షణమయినవి. ఆయన కదలిక, ఆహార్యం మొత్తంగా ఆయన నటనే స్టైల్‌కు పర్యాయ పదంగా నిలిచిపోయింది. ఆయన సినిమాల్లోని పాటలు నేటికీ జనాన్ని మంత్రముగ్ధుల్ని చేస్తూనే ఉన్నాయి. ‘మై జిందగీ కా సాత్ నిభాతా చలాగయా’, ‘కొయా కొయా చాంద్’, ‘గాతా రహే మేరా దిల్’ లాంటి పాటల్ని ఎవరు మరిచిపోగలరు?
ఆ కాలంలో దిలీప్ కుమార్ విషాదాంత పాత్రలకు పర్యాయ పదంగా ఉండి, మధ్యతరగతి ప్రజల్ని, ఆనాటి మేధావుల్ని అలరిస్తున్నాడు. మరో వైపు చార్లీ చాప్లిన్ తరహా ట్రాంప్‌లా రాజ్ కపూర్ సామాన్య జన జీవితాల్లోకి చొచ్చుకు పోతున్నాడు. ఆ పరిస్థితుల్లో వారిద్దరికీ భిన్నంగా, తనదైన చేతనాత్మకమైన ధోరణితో నిలిచి గెలిచాడు దేవానంద్. సురయ్యా, మధుబాల, వైజయంతిమాల, హేమామాలిని, వహీదా రెహమాన్, నూతన్, గీతా దత్ లాంటి వాళ్ళతో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించాడు.
1923లో పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో దేవానంద్ జన్మించాడు. పంజాబ్ విశ్వ విద్యాలయంలో డిగ్రీ పూర్తి చేసుకుని బొంబాయి బయలుదేరాడు. అప్పటికే సినీ రంగంలో కృషి చేస్తున్న సోదరుడు చేతన్ ఆనంద్‌తో కలిసి తన భవిష్యత్తును నిర్మించుకుందామని ఆలోచన. 1946లో ప్రభాత్ వాళ్ళు నిర్మించిన ‘హామ్ ఏక్ హై’తో దేవ్ తన నట జీవితాన్ని ఆరంభించాడు. అప్పుడే గురు దత్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ మిత్రులయ్యారు. తాను నిర్మాతగా మారి దర్శకుడిని చేస్తానని హామీ ఇచ్చాడు.
రష్యన్ సినిమా ‘ఇన్‌స్పెక్టర్ జనరల్’ ప్రేరణతో చేతన్ ఆనంద్ తీసిన ‘అఫ్సర్’తో ఎస్.డి.బర్మన్‌ను సంగీత దర్శకుడిగా పరి చయం చేశాడు. తర్వాత బాల్ రాజ్ సహానీ స్క్రిప్ట్ ఆధారంగా ‘బాజీ’ తీశాడు. గురుదత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఉర్దూ కవి సాహిర్ లుథియాన్వీ మొదటిసారిగా గీతాలు రాశాడు. ఈ సినిమాతోనే కమెడియన్‌గా జానీ వాకర్ కూడా పరిచయం అయ్యాడు. గీతా రాయ్‌ను గురుదత్, కల్పనా కార్తీక్‌ను దేవా నంద్ ఈ చిత్ర సమయంలోనే కలుసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు జంటలయ్యారు.
వహీదా రహ్మాన్‌తో దేవానంద్ అనేక విజయవంతమయిన సినిమాలు చేశాడు. వారిద్దరిదీ అప్పుడు హిందీ సినిమాల్లో గొప్ప హిట్ జంట. ‘సోల్వా సాల్’, ‘గైడ్’, ‘కాలా బాజార్’, ‘బాత్ ఏక్ రాత్ కీ’ వంటి సినిమాలు చిరస్థాయిగా నిలిచిపోయాయి. ‘గైడ్’ మొట్ట మొదటి ఇండో అమెరికన్ సిన్మాగా రూపొందింది. ఆర్.కె.నారాయణ్ నవల ఆధారంగా తీసిన ఈ సినిమా విమర్శ కుల ప్రశంసల్ని అందుకుంది.
నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు ముగ్గురు త్రిమూర్తుల్ని– అంటే దేవానంద్, రాజ్‌కపూర్, దిలీప్ కుమార్‌లను తీన్‌మూర్తి భవన్‌కు ప్రత్యేకంగా ఆహ్వానించారు. అయిదు దశాబ్దాలకు పైగా హిందీ సినిమా రంగంలో తనదయిన శైలిలో నటిస్తూ, నిర్మిస్తూ... రచయితగా, దర్శకుడిగా కూడా కొనసాగుతూ... మొండితనంతో, తృష్ణతో తన నిర్మాణ సంస్థ ‘నవకేతన్’ను 52 ఏళ్ళకు పైగా సజీవంగా ఉంచుకున్నాడు దేవానంద్. 2001లో పద్మభూషణ్, 2002లో దాదా సాహెబ్ ఫాల్కే వరించాయి.
ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించిన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆమెకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నేషనల్ పార్టీ ఆఫ్ ఇండియా పేర రాజకీయ పార్టీని స్థాపించినప్పటికీ దాన్ని ఎక్కువ కాలం నడపలేదు. దేవానంద్ జన్మశతాబ్ది సందర్భంగా దేశ వ్యాప్తంగా 30 నగరాల్లో 55 టాకీసుల్లో ఆయన నటించిన సినిమాలతో ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించారు. ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్, ఎన్.ఎఫ్.డి.సి. ఆర్కైవ్స్ ఆధ్వర్యంలో ఇది జరిగింది.
వారాల ఆనంద్
వ్యాసకర్త కవి, విమర్శకుడు. 94405 01281
(నేడు నటుడు దేవానంద్ శతజయంతి.)
Comments
Please login to add a commentAdd a comment