మన సత్తా ఇప్పుడే తెలిసిందా? | Sakshi Guest Column On 69th National Film Awards Telugu Cinema | Sakshi
Sakshi News home page

మన సత్తా ఇప్పుడే తెలిసిందా?

Published Fri, Aug 25 2023 2:45 AM | Last Updated on Fri, Aug 25 2023 10:18 AM

Sakshi Guest Column On 69th National Film Awards Telugu Cinema

తెలుగు సినిమాను చాలాకాలం పాటు కేంద్ర ప్రభుత్వ అవార్డుల కమిటీ సభ్యులు, క్రిటిక్స్‌ తక్కువ చేసి చూపించడానికి ప్రయత్నించారు. కానీ, ఇప్పుడు తెలుగు సినిమా జూలు విదిలిస్తోంది. 2021కి గాను ప్రకటించిన 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు 11 అవార్డులు దక్కాయి. నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డుల చరిత్రలో తొలిసారిగా ఒక తెలుగు నటుడికి జాతీయ ఉత్తమ నటుడు అవార్డ్‌ రావడం అభిమానులనే కాదు – పరిశ్రమనూ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తెలుగు వాడికి టాలెంట్‌ ఎప్పుడూ ఉంది, కానీ ప్రపంచం ఇప్పుడే తెలుగు సినిమా ప్రతిభ తెలుసుకుంటోంది.

ఆగస్ట్‌ 23న చంద్రయాన్‌–3 ప్రయోగం విజయవంతం కావడంతో భారతదేశం, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు అందరూ గర్వపడ్డారు. ఆ మరుసటి రోజునే తెలుగు సినిమా చంద్ర మండలం ఎక్కినంతగా సంబరం చేసుకుంటోంది. కారణం అందరికీ తెలిసిందే! 2021వ సంవత్సరానికి గాను ప్రకటించిన 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు ఏకంగా 11 అవార్డులు దక్కాయి. సంఖ్యా పరంగానే కాకుండా – 69 సంవత్సరాల నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డుల చరిత్రలో తొలిసారిగా ఒక తెలుగు నటుడికి జాతీయ ఉత్తమ నటుడు అవార్డ్‌ రావడం తెలుగు సినిమా అభిమానులనే కాదు– తెలుగు సినిమా పరిశ్రమను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

ఇక్కడ మౌలికంగా ఓ ప్రశ్న తలెత్తుతుంది. తెలుగు సినిమా రంగంలో ఎందరో మహా నటులున్నారు. వారెవరికీ దక్కని గౌరవం, గుర్తింపు– అభిమానుల చేత ‘ఐకాన్‌ స్టార్‌’ అని పిలిపించుకునే అల్లు అర్జున్‌కు రావడం సంతోషదాయకం. అలాగని ముందు తరాల నటుల గురించి, ఏ మాత్రం తక్కువగా ఆలోచించినా మహాపరాధం! 

ఒక నిజం ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా – తెలుగు సినిమాను చాలాకాలం పాటు కేంద్ర ప్రభుత్వ అవార్డుల కమిటీ సభ్యులు, మిగి లిన భాషా చిత్రాల మార్కెట్లు, క్రిటిక్స్‌ తక్కువ చేసి చూపించడానికి ప్రయత్నించారు. ఎన్‌.టి. రామారావు గారి ‘పాతాళ భైరవి’, అక్కినేని నాగేశ్వరరావు గారి ‘సువర్ణ సుందరి’ – హిందీలోనూ ఏడాది పైన ఆడిన చరిత్ర ఈ జనరేషన్‌కి తెలియకపోవచ్చు. అలాగే జకార్తా ఇంటర్‌ నేషనల్‌ ఫిలిమ్‌ ఫెస్టివల్‌లో ‘నర్తన శాల’ సినిమాలో ఎస్‌.వి. రంగా రావు పోషించిన కీచక పాత్రకు ఉత్తమ నటుడిగా లభించిన గౌరవం కొందరికే గుర్తుండవచ్చు.

పైగా పది, పదిహేనేళ్ళ క్రితం వరకూ అవార్డులను... నేచురల్‌గా ఉండే సినిమాలు అనండి, ఆర్ట్‌ ఫిలిమ్స్‌ అనండి... వాటికి మాత్రమే ఇవ్వాలనే ఒక ప్రత్యేక ధోరణి ఉండేది. బాక్సాఫీస్‌ దగ్గర డబ్బులు వసూలు చేసిన సినిమాలకూ, అందులో పని చేసినవాళ్ళకూ ఎక్కువ శాతం అవార్డులు వచ్చేవి కాదు. వచ్చేవి కాదు అనే కన్నా ఇచ్చేవాళ్ళు కాదనడం కరెక్ట్‌! పక్క భాషల నటులు ఒక్కొక్కరికి 2–3 అవార్డులు వచ్చిన సందర్భాలున్నాయి. అదే సమయంలో మన తెలుగు నటు లను గుర్తించడం లేదేంటని బాధ పడుతుండేవాళ్ళు. అందుకే 30 ఏళ్ళ నుంచి ఉత్తమ వినోదాత్మక చిత్రం అవార్డ్‌ ప్రవేశపెట్టి, కమర్షియల్‌ సినిమా కన్నీరు తుడిచే ప్రయత్నం చేశారు. 

అయిదారేళ్ళ క్రితం వరకూ భారతీయ వినోదాత్మక రంగం నుంచి వచ్చే ఆదాయంలో తెలుగు సినిమా వాటా 18–19 శాతం ఉండేది. బాలీవుడ్‌ రెవిన్యూ తర్వాత స్థానం తెలుగు సినిమాదే. ఇప్పుడు ఈ వాటా 30 శాతం వరకూ పెరిగిందని విన్నాను. కేవలం ప్రభుత్వానికి ఆదాయం రావడమే కాదు! అన్ని వందల, వేల కోట్ల ఆదాయం ఎన్ని వేల కుటుంబాలకు ఉపాధి కలిగిస్తోందో అన్న విషయం ప్రధానంగా గమనించాలి. 

ముఖ్యంగా ఇవాళ ఆర్ట్‌ ఫిలిమ్స్‌ తీసేవాళ్ళు, ఆదరించేవాళ్ళు తగ్గి పోయారు. అవతల ఆస్కార్‌ అవార్డుల్లో (మన వాళ్ళందరికీ అదే కొలమానం కాబట్టి) బాక్సాఫీస్‌ సక్సెస్‌ అయిన సినిమాలకూ, క్రైమ్‌ డ్రామాలకూ అవార్డులు ఇస్తున్నప్పుడు కమర్షియల్‌ సినిమాలు భారత దేశంలో ఏం పాపం చేసుకున్నాయి? జనం బాగా ఆదరించిన సిని మాల్లో కళాత్మక విలువలు ఉండవా? అత్యద్భుతమైన ప్రతిభా పాట వాలు ఉండవా? ఎన్ని పదుల, వందల కోట్ల పారితోషికాలు తీసు కున్నా, ప్రతి కళాకారుడూ కోరుకునేది తన పనిని ఎక్కువ మంది మెచ్చుకోవాలని! మేధావులు, అవార్డుల కమిటీల్లో గొప్పవాళ్ళ నుంచి ప్రశంసలు, సత్కారాలు అందుకోవాలని! ఇందులో తప్పేం ఉంది? అమితాబ్‌కి ఉత్తమ నటుడు అవార్డ్‌ వచ్చినప్పుడూ, రజనీ కాంత్‌కు దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు ప్రదానం చేసినప్పుడు కూడా కొన్ని విమర్శలు వచ్చాయి. వాళ్ళు దేశవ్యాప్తంగా పాపులర్‌ స్టార్స్‌ అయినంత మాత్రాన ప్రతిభావంతులు కారా? 

ఎవరు అవునన్నా, కాదన్నా – రాజమౌళి ‘బాహుబలి’తో ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్‌ రీ–సౌండ్‌ తెలుగు సినిమా వినిపించింది. అప్పటి నుంచి తెలుగు సినిమా రంగం గురించి మన దేశంలోనే కాదు... ప్రపంచంలోని సినిమా అభిమానులందరికీ తెలిసింది. ఈ రోజు జాతీయ స్థాయిలో తెలుగు సినిమా పనితనం, ప్రతిభ తెలిసిందంటే... తెలుగు సినిమా తనని తాను పెంచుకున్న స్థాయి. లాబీయింగ్‌ అంటే ఇదే! తెలుగు సినిమా తన టాలెంట్‌తో భారతదేశంలోని సినిమా అభిమానులు, కమిటీ సభ్యుల దగ్గర లాబీయింగ్‌ చేసింది! భారీ స్థాయిలో – ఊహకందని విజువల్స్‌తో, మార్కెట్‌ రిస్క్‌ చేసి సంపాదించుకున్న రెస్పెక్ట్‌ ఇది! రాజమౌళి ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌.’ ఆస్కార్‌ స్థాయిలో అందుకున్న అవార్డులకూ, గుర్తింపునకూ ఈ జాతీయ అవార్డులు ఓ కొనసాగింపు! అలాగే శ్రీశ్రీ, వేటూరి, సుద్దాల అశోక్‌ తేజ సరసన ఇప్పుడు చంద్ర బోస్‌ జాతీయ ఉత్తమ గీత రచయిత అవార్డును అందుకున్నారు. ప్రేమకథల్లో ఓ షాకింగ్‌ పాయింట్‌తో వచ్చిన ‘ఉప్పెన’ సినిమా తెలుగులో ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డ్‌ గెలుచుకోవడం అభినందనీయం!

ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్న తొలి తెలుగు నటుడిగా చరిత్రలో నిలిచిపోతున్న అల్లు అర్జున్‌ గురించి రెండు మాటలు చెప్పాలి. ప్రతి నటుడూ కష్టపడతారు. అల్లు అర్జున్‌ తనకు అసాధ్యం అనుకున్నది కూడా కసిగా సాధించి తీరుతారు. అల్లు అర్జున్‌తో మూడు సినిమాలకు ఓ రచయితగా పని చేసినప్పుడు ఆయ నలో గమనించిన కొన్ని లక్షణాల గురించి చెప్పుకోవాలి.

క్యారెక్టర్‌ కోసం తన శరీరాన్ని మలుచుకోవడమే కాదు... డిక్షన్, బాడీ లాంగ్వేజ్‌ కోసం తనకు రానిది కూడా ఆయన కష్టపడి నేర్చుకుంటారు. ‘రుద్రమ దేవి’లో గోన గన్నా రెడ్డి పాత్ర చేసిన సాహసం, ‘దువ్వాడ జగన్నాథం (డి.జె.)’లో పురుష సూక్తం పలకడానికి చేసిన ప్రయత్నం, ఇప్పుడు ‘పుష్ప’లో ఓ పక్కకు భుజం వంచి (గూని లాంటిది) మరీ చేసిన అభినయం, చిత్తూరు జిల్లా యాస నేర్చుకోవడానికి చూపిన పట్టుదల – ఇవన్నీ అవార్డ్‌ అందుకోవడానికి కారణాలయ్యాయి.

చివరగా ఓ మాట! తెలుగు సినిమా పుట్టినప్పటి నుంచి (92 సంవత్సరాల కాలం) తన ప్రతిభను చాటి చెబుతూనే ఉంది. అయితే ఆ వెలుగు, వినోదం తెలుగు నేలకే పరిమితమైంది. ఇప్పుడు మన సినిమా ఎల్లలు దాటింది, రిస్క్‌ గేమ్‌ ఆడుతోంది. దానికి తగ్గ ప్రతి ఫలాలూ అందుకుంటోంది. తెలుగు వాడికి టాలెంట్‌ ఎప్పుడూ ఉంది, కానీ ప్రపంచం ఇప్పుడే తెలుగు సినిమా ప్రతిభ తెలుసుకుంటోంది.

అందుకే ఇన్ని వందల కోట్ల వసూళ్ళు, అవార్డులు, సత్కారాలు, మర్యాదలు! తెలుగు సినిమా ఏం చేస్తోందనేది మిగిలిన భాషా చిత్రాలు, మార్కెట్లు ఇప్పుడు గమనిస్తున్నాయి. కానీ, తెలుగు ప్రేక్ష కుల అభిరుచిని ఏనాడో కొందరు గొప్ప దర్శకులు గుర్తించారు. తెలుగు సినిమాకు దగ్గర కావాలని ప్రయత్నించారు. 1970ల చివరలో శ్యామ్‌ బెనెగల్‌ ‘అనుగ్రహం’, మృణాల్‌ సేన్‌ ‘ఒక ఊరి కథ’, గౌతమ్‌ ఘోష్‌ ‘మా భూమి’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు.

ఇప్పుడు కమర్షియల్‌ ప్యాన్‌– ఇండియా సినిమా కోసం, క్వాలిటీ మేకింగ్‌ కోసం దేశం తెలుగు సినిమా వైపు తొంగిచూస్తోంది. పాపులర్‌ సినిమాలకు అన్ని విధాలా పట్టాభిషేకాలు ఇప్పుడిప్పుడే మొదల య్యాయి. తెలుగు సినిమా జైత్రయాత్రకు ఇది శుభారంభం!
ప్రసాద్‌ నాయుడు
వ్యాసకర్త ప్రముఖ సినిమా రచయిత, సినీ విశ్లేషకులు
PrasaadNaidu5@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement