national best actor
-
మెగా ఫ్యాన్స్ సపోర్ట్‌తో ఎంట్రీ.. ఆపై దూరం.. బన్నీ సమాధానం ఇదే
‘‘ఒకరు అదే పనిగా మనల్ని విమర్శిస్తున్నారంటే మనం ఎదిగినట్లే... బయటకు చెప్పలేం... చాలా అవమానాలుంటాయి.. నాది అత్యాస.. నాకు అన్నీ కావాలి... నేషనల్ బెస్ట్ హీరో అని ఊరికే ఇచ్చేయరు’’... ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను ‘సాక్షి’తో ప్రత్యేకంగా పంచుకున్నారు అల్లు అర్జున్. ‘జాతీయ ఉత్తమ నటుడు’ అవార్డు దక్కించుకున్న ఆనందంలో ఉన్న అల్లు అర్జున్‌తో శనివారం జరిపిన ఇంటర్వ్యూలోని విశేషాలు ఈ విధంగా... ► జాతీయ ఉత్తమ నటుడి ప్రకటన రాగానే మీ రియాక్షన్? అల్లు అర్జున్: ఇంగ్లీష్‌లో ఎలైటెడ్ (ఉక్కిరి బిక్కిరి.. పట్టరానంత ఆనందం...) అంటారు. నా ఫీలింగ్ అదే. అయితే ఈ అవార్డు నాకు వచ్చింది నా వల్ల కాదు. సుకుమార్ వల్ల వచ్చిందన్నది నా ఫస్ట్ ఫీలింగ్. అవార్డు ప్రకటన రాగానే నేను, సుకుమార్ ఆప్యాయంగా హత్తుకుని, ఆ ఉద్విగ్న క్షణాల్లో అలా ఓ నిమిషానికి పైగా ఉండిపోయాం. మైత్రీ మూవీ మేకర్స్ కాకుండా ‘పుష్ప’ని ఎవరు తీసినా ఈ సినిమా ఇంత బాగా వచ్చి ఉండేది కాదు. నాతో ‘పుష్ప’ తీశారని అలా అనడంలేదు. ‘రంగస్థలం’ చూసినçప్పుడే ‘మైత్రీ సపోర్ట్ చేసింది కాబట్టే నువ్వు అనుకున్న సినిమా తీయగలిగావు. ఈ సినిమాని వేరే ఏ బేనర్‌తో చేసినా తీయలేకపోయేవాడివి’ అని సుకుమార్‌తో అన్నాను. ‘పుష్ప’కి కూడా ఇదే వర్తిస్తుంది. ► ఈ తరంలో తెలుగులో ఉన్న ‘బెస్ట్ యాక్టర్స్’లో మీరు ఒకరు. ముందు తరాల్లో ఎందరో ‘బెస్ట్ యాక్టర్స్’ ఉన్నారు. వారికి ఉత్తమ జాతీయ నటుడు అవార్డు లభించలేదు. ఈ విషయంపై మీ అభి్రపాయం.. నాకు అవార్డు వచ్చినందుకు ఎంత హ్యాపీగా ఉందో.. ముందు తరాల వారికీ, నా సమకాలీన నటులకు అవార్డు రాలేదన్నది అంతే బాధాకరమైన విషయం. వారంతా అర్హులే. జాతీయ అవార్డు దక్కించుకునే స్థాయి నటనను అందరూ ప్రదర్శించారు. కానీ ఎందుకో వారికి రాలేదు. సామర్థ్యం లేక వారికి అవార్డులు రాలేదనుకుంటే అది మన తెలివితక్కువతనమే. మన పరిశ్రమలో ఎప్పుడూ గొప్ప నటులు ఉంటూనే ఉన్నారు. కానీ ఎందుకో కుదర్లేదు.. ఈసారి కుదిరింది. ► అంటే.. కాస్త అదృష్టం కూడా కలిసి రావాలంటారా? అదృష్టాన్ని నమ్మను. మన కృషి మనం చేస్తూ ఉంటే సరైన చాన్స్, టైమ్ వచ్చినప్పుడు కొడితే ఆ పాయింట్‌ను అదృష్టం అంటా. మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చే విషయంలో నేను ఎప్పుడూ కృషి చేస్తూనే ఉన్నాను. ఇక ఇప్పుడు తెలుగు సినిమాలకు దేశవ్యాప్త గుర్తింపు దక్కడం, తెలుగు సినిమాలపై అందరి దృష్టి పడటం అనేది అవకాశం. సో... నా కృషికి చాన్స్, టైమ్ కలిసి స్ట్రైక్ అయ్యాయి. ఇది లక్ అంటాను. ► మీ 20 ఏళ్ల సక్సెస్ఫుల్ కెరీర్లో మీ కుటుంబం, అభిమానుల, ఇండస్ట్రీ భాగస్వామ్యం ఎంత.. నా సక్సెస్‌లో అందరి సపోర్ట్ ఉంది. ఏ సపోర్ట్ లేదని అనలేను. నా ఫ్యామిలీ, ఇండస్ట్రీ సపోర్ట్ ఉంది. ఎక్కువ శాతం ఉన్న నా సొంత ఫ్యాన్స్ సపోర్ట్‌తో పాటు మెగా ఫ్యాన్స్, ఇతర హీరోల ఫ్యాన్స్ ప్రోత్సాహం కూడా ఉంది. ► మీ కెరీర్ ఫస్ట్ మొదలైంది మెగా ఫ్యాన్స్ సపోర్ట్‌తోనే. ఆ తర్వాత మీకు సొంత ఆర్మీ (అభిమానులు) ఏర్పాటైంది. ఇలా ఓన్ ఫ్యాన్ బేస్ డెవలప్ అయ్యాక పాజిటివిటీతో పాటు నెగటివిటీ కూడా వచ్చింది. ఈ విషయాన్ని ఎలా చూస్తారు.. నేనే కాదు.. ప్రపంచంలో ఉన్న ఏ వ్యక్తి అయినా ఒకచోటు నుంచి మొదలై, జీవితంలో ఎదిగే క్రమంలో కొంత టైమ్ గడిచాక తనకంటూ ఓ డెవలప్మెంట్ జరుగుతుంది. అది సహజం.. ఇందుకు ఉదాహరణగా చాలామంది ఉన్నారు. కొన్నిసార్లు పిల్లలు తమ తల్లిదండ్రుల కన్నా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఇదొక సహజమైన ప్రయాణం. ► కానీ ఎక్కడ మొదలయ్యారో ఆ నీడలో ఉండాలని వేరేవాళ్లు అనుకోవడం సహజంగా జరుగుతుంటుంది.. నేనేమనుకుంటానంటే.. ఒకరు విశేషంగా ఎదుగుతూ, ఓ లెవల్‌కి వచ్చాక.. వారు మన దగ్గర ఉండలేరని వారికే అర్థం అయిపోతుంది.. వాళ్లు ఇక్కడ సరిపోరని. అది పేరెంట్స్ అయినా కావొచ్చు.. ఫ్యామిలీలో ఎవరైనా కావొచ్చు. అయితే వాళ్లు ఎప్పుడు కోరుకుంటారంటే.. వాళ్లకంటే తక్కువగా ఉన్నప్పుడో.. ఇప్పుడు వాళ్లు ఎంత ఉన్నారో.. మనం అంతే ఉన్నప్పుడు ఎందుకు బయటకు వెళ్లాలని కోరుకుంటారు. అదే మనం ‘టెన్ ఎక్స్’ ఎదిగాం అనుకుంటే అప్పుడు వాళ్లు కోరుకోరు. ఇదంతా సైజ్ డిఫరెన్స్పై ఆధారపడి ఉంటుంది. ► చిరంజీవిగారి ఇంటికి వెళ్లారు కదా. ఆయన స్పందన.. చిరంజీవిగారు చాలా మంచి మాట అన్నారు. ఓ జాతీయ అవార్డు రావడానికి ఓ నటుడికి కావాల్సిన కారణాలు ఇరవై ఉంటే.. అన్ని కారణాల్లోనూ నువ్వు వంద మార్కులు కొడతావ్ అన్నారు. బాడీ లాంగ్వేజ్.. మేకప్ కావొచ్చు... సంభాషణల ఉచ్చారణ కావొచ్చు.. ఇలా కొన్ని చెప్పుకుంటూ వచ్చారు. చిరంజీవిగారికి ఉన్న అనుభవంతో ఓ విషయాన్ని ఆయన మనకన్నా బాగా చూడగలరు. బాగా పెర్ఫార్మ్ చేశావ్. చెప్పాలంటే.. నీకు ఇవ్వకపోతే తప్పయిపోయేది అనే స్థాయిలో పెర్ఫార్మ్ చేశావన్నారు. ► ఏదైనా మనకు దక్కినప్పుడు అందుకు మనం నిజంగా అర్హులమేనా? అనే ఓ ఆలోచన కలగడం సహజం. నేషనల్ అవార్డు ప్రకటించినప్పుడు అలాంటి ఆలోచన మీకేమైనా కలిగిందా? నేనూ సుకుమార్‌గారు ఎప్పుడూ నిజం అనేది ఒకటి ఉంటుందని మాట్లాడుకుంటుంటాం. మేం నిజాయితీగా కష్టపడ్డాం. ఆ కష్టం ప్రజలకు కనెక్ట్ అయ్యింది. ఇది నిజం. ఒక సినిమా బాగుందా? లేదా అనేది నిజం మాట్లాడుతుంది. బాగోలేని సినిమాను నేను ఎంత ప్రమోట్ చేసినా వర్కౌట్ కాదు. కానీ మనం నిజాయితీగా కష్టపడ్డప్పుడు ఆ కష్టమే మాట్లాడుతుంది. అది నిజం. అప్పుడు నిజం దానంతట అదే మాట్లాడుతుంది. ఒకవేళ నేను సినిమాలో బాగా యాక్ట్ చేసి, నేనే బాగోలేదని చెప్పినా కూడా నా మాట ఎవరూ నమ్మరు. ఎందుకంటే నిజం నాకంటే గొప్పది.. నన్ను మించినది అనేది నా అభప్రాయం. ► తెలుగు సినిమాకు ఈ ఏడాది ఎక్కువగా జాతీయ అవార్డులు వచ్చాయి... ఈ విషయం గురించి ఏమంటారు? ఈ గౌరవం దక్కడానికి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను ముఖ్య కారణంగా చెప్పుకోవాలి.. ‘పుష్ప’ కూడా. ‘ఆర్ఆర్ఆర్’కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. దీంతో జాతీయ స్థాయిలో ‘ఆర్ఆర్ఆర్’ను గౌరవించుకోకపోతే అది తప్పవుతుందనే ఓ ప్రత్యేక ఫీలింగ్ ఆ సినిమాపై ఉంది. ఏదో ఆస్కార్స్‌కు వెళ్లింది కదా అని కాకుండా నిజంగా ఆ సినిమాకు సంబంధించి ఎవరెవరికి రావాలో వారికి ఇచ్చారు. తెలుగు సినిమాకు ప్రాముఖ్యత చేకూర్చారు. అందుకు తగ్గ కష్టం కూడా ఆ సినిమాలు పడ్డాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా తెలుగు ఇండస్ట్రీ ప్రామిసింగ్‌గా ఉంది. ఈ ఇంపాక్ట్ వారిపై (జ్యూరీని ఉద్దేశిస్తూ..) కూడా ఉంటుంది. ► ఈ సమయంలో మీ తాత (ప్రముఖ నటుడు అల్లు రామలింగయ్య)గారు ఉండి ఉంటే సంతోషించేవారు.. ఆయన జీవించి ఉన్నట్లయితే.. ఇన్నేళ్ల చరిత్రలో నా మనవడు కొట్టాడు. తన జీవితానికి ఇది చాలని ఆయన ఫీలయ్యే సందర్భం కచ్చితంగా అయ్యుండేది. ఆ విషయం పక్కన పెడితే... నేను నేషనల్ అవార్డుని సాధించడం మా నాన్నగారు చూడగలిగారు. నాకు అదే చాలా అదృష్టం. ► ‘పుష్ప’లో నటనపరంగా తగ్గేదే లే అన్నట్లు నటించారు. ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్, రామ్‌చరణ్ అద్భుత నటనతో పాటు ఆ సినిమా ఆస్కార్‌తో గ్లోబల్‌గా రీచ్ అయింది. తమిళ ‘జై భీమ్’లో సూర్య నటన అద్భుతం.. ఈ పెద్ద పోటీలో జాతీయ అవార్డు ఎవరికి దక్కుతుందనే కోణంలో ఆలోచించారా? మనం సౌత్‌లో ఉన్నాం కాబట్టి ఈ రెండు సినిమాల గురించే మాట్లాడటం సహజం. అయితే పోటీలో హిందీ నుంచి ‘షేర్షా, సర్దార్ ఉద్దమ్’ వంటి చిత్రాలు ఉన్నాయి. ఇంకా వేరే భాషల నుంచి వేరే చిత్రాల్లో నటించిన హీరోలు ఉన్నారు. పోటీలో 20 మందికి పైగా ఉన్నారు. కానీ ఫైనల్‌గా నేషనల్ హీరో ఒక్కడే. ఈ ప్రాసెస్‌లో ‘పుష్ప’ హీరోకి అవార్డు దక్కే అర్హత పూర్తిగా ఉంది. ఎందుకంటే నేషనల్ హీరోని సెలక్ట్ చేసేటప్పుడు అతని నటన చూస్తారు.. సినిమాని కాదు. అయినా బెస్ట్ ఫిలిం కింద నేషనల్ అవార్డుకి ‘పుష్ప’ని తీసుకోరు. ఎందుకంటే స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్ కాబట్టి. అందుకే ఉత్తమ చిత్రం కేటగిరీకి మేం ‘పుష్ప’ని పంపించలేదు. బెస్ట్ యాక్టర్ కేటగిరీ అనేది పూర్తిగా నటనని బేస్ చేసుకునే ఇస్తారు. ఆ విధంగా పుష్పరాజ్.. బెస్ట్ అనుకుని, నామినేషన్‌కి పంపించాం. మా నమ్మకం నిజమైంది. ► 20 ఏళ్ల కెరీర్.. 20 మందికి పైగా హీరోలతో పోటీ పడి నేషనల్ అవార్డు తెచ్చుకున్న ఈ ఆనందంలో మీ కెరీర్‌ని విశ్లేషించుకుంటే ఏమనిపిస్తోంది? యాక్చువల్‌గా ఇలా ఆనందంగా ఉన్నప్పుడు కాదు.. ‘సాడ్ మూమెంట్స్’ అప్పుడే ఎక్కువ ఎనలైజ్ చేసుకుంటాం. హ్యాపీ అప్పుడు హాయిగా అలా వెళ్లిపోతాం. 20 ఏళ్ల లైఫ్ టైమ్‌లో ఏ మనిషికైనా హ్యాపీ.. సాడ్ ఈ రెండూ ఉంటాయి. బయట చూసేవాళ్లకు అంతా స్మూత్‌గా ఉన్నట్లు కనిపిస్తుంది కానీ ఏ మనిషి జీవితం కూడా ఈ రెండూ లేకుండా ఫ్రిజ్‌లో పెట్టిన మటన్లా ఫ్రీజ్ అయిపోవడం జరగదు (నవ్వుతూ). ఏ చెట్టుకి ఆ గాలి. బయటకు చెప్పలేకపోవచ్చు కానీ.. చాలా అవమానాలు ఉంటాయి. ఆ చెప్పలేనివి జరిగినప్పుడు విశ్లేషణ అనేది మొదలవుతుంది. అందులోంచే నేర్చుకోవడం, నడుచుకోవడం కూడా తెలుస్తుంది. ► మీరన్నట్లు అవమానాలు సహజం. పైగా ఇప్పుడీ డిజిటల్ వరల్డ్‌లో ట్రోల్స్ ఎక్కువ.. వీటిని పట్టించుకుంటారా? హండ్రెడ్ పర్సంట్ అన్నీ పట్టించుకుంటాను. కాకపోతే ‘ఫన్’గా తీసుకుంటాను. మన కోసం ఒకళ్లు పని గట్టుకుని టైమ్ కేటాయించి, అదే పనిగా విమర్శిస్తున్నారంటే మనం ఎదిగినట్లే కదా (నవ్వుతూ). మా స్టాఫ్‌లో ఒకరు.. ‘చూడండి సార్.. మీ గురించి ఇలా అనుకుంటున్నారు’ అంటే, ‘మంచిదే కదా.. మనం ఎదిగినట్లు అర్థం’ అన్నాను. ఏమీ లేకుండా మిగిలిపోయినవాళ్లను ఎవరూ పట్టించుకోరు. సో.. మనల్ని పట్టించుకున్నారంటేనే మనం సాధిస్తున్నాం అని అర్థం. ► మరి.. ‘మెగా ఫ్యాన్స్’, ‘అల్లు అర్జున్ ఆర్మీ’ అంటూ ఫ్యాన్ వార్ జరుగుతుంటుంది కదా.. ఆ వార్ని కూడా పట్టించుకుంటారా? నేను ఏదైనా ఒకటి పట్టించుకోనంటే ఆ ఫ్యాన్ వార్ని మాత్రమే. నేనస్సలు పట్టించుకోను. ఎందుకు పట్టించుకునేంత టైమ్ లేదు. ఫ్యాన్స్ పని ఫ్యాన్స్ చూసుకుంటారు. నా పని నేను చూసుకుంటాను. ► వసూళ్లు, అవార్డుల గురించి పట్టించుకుంటారా..? వీటి గురించి అయితే పక్కాగా ఆలోచిస్తాను. వేరే వాటి గురించి ఆలోచించను. నా ఫోకస్ అంతా వాటిపైనే ఉంటుంది. మిగతావారి గురించి నాకు తెలియదు కానీ నాకు మాత్రం అన్నీ కావాలి. అవార్డులు కావాలి... కలెక్షన్స్ కావాలి. ప్రజల్లో పేరు, నా సినిమా నిర్మాతలకు డబ్బులు రావాలి. జనాలకు పిచ్చెక్కిపోయే సినిమాలు ఇవ్వాలి.. ఇలా నాకు అన్నీ కావాలి. ఆ క్లారిటీ నాకు ఉంది. నాది అత్యాశ.. నాకు అన్నీ కావాలి. అందుకే తగ్గేదే లే అంటూ హార్డ్ వర్క్ చేస్తాను. ఆగేదే లే అంటూ సినిమాలు చేసుకుంటూ వెళతాను.. ► ‘పుష్ప 2’ తర్వాత మీ ప్రాజెక్ట్? ప్రస్తుతం ‘పుష్ప 2’ కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. వాళ్లకు న్యాయం చేయాలనే ఆలోచనే ప్రజెంట్ నా మైండ్‌లో ఉంది. ‘పుష్ప 2’ తర్వాత నా తర్వాతి సినిమాపై మరింత క్లారిటీ ఇస్తాను. ► ‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ సినిమా తర్వాత మీరు కొంత గ్యాప్ తీసుకున్నారు. ఆ తర్వాత మీరు చేసిన ‘అల.. వైకుంఠపురములో.., పుష్ప’ హిట్. ఆ గ్యాప్‌లో మిమ్మల్ని మీరు తెలుసుకోవడమే ఈ హిట్స్‌కి కారణమా.. నా గురించి నేను వంద శాతం తెలుసుకోవడానికి ఆ సమయం నాకు దొరికినట్లయింది. నేను ఏం తప్పులు చేశాను? ఎటు వెళ్తున్నాను అని ఆలోచించుకున్నాను. కొందరు సలహాలు ఇచ్చారు. చెప్పాలంటే నన్ను నేను సరిద్దుకున్న సమయం అది. అలా నన్ను నేను సరిదిద్దుకుని ఇకనుంచి తగ్గేదే లే... ఆపేదేలే అనుకున్నాను. ► జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు సాధించారు. ఇక వాట్ నెక్ట్స్ అనే ప్రెజర్ ఏమైనా? దేశవ్యాప్తంగా సినిమా పెరుగుతోంది. తెలుగు సినిమా మరింతగా ప్రగతి పథంలో ముందుకు వెళుతోంది. ఇప్పుడు మనం ఏ ప్రయోగాలు చేసినా రిసీవ్ చేసుకోవడానికి ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇది ప్రెజర్ కాదు.. పెద్ద అడ్వాంటేజ్ అని చెప్పవచ్చు. చెప్పాలంటే ఎవరికైనా ప్రెజర్ లేదూ అంటే అది మనకే. తెలుగు పరిశ్రమతో పోటీపడాలని ఇతర ఇండస్ట్రీలు ఒత్తిడికి గురవుతున్నాయి. ► మీ నాన్నగారు (నిర్మాత అల్లు అరవింద్) చాలా సంతోషపడి ఉంటారు. అలాగే మీ కుటుంబ సభ్యులు ఎలా స్పందించారు... అవార్డు సాధించిన నాకన్నా.. మా నాన్నగారికి ఎక్కువ శుభాకాంక్షలు వచ్చాయి (నవ్వుతూ). మా అమ్మ అయితే ఆనందంతో మాట్లాడలేకపోయారు. అమ్మ హగ్‌లోనే ఆమె సంతోషం అర్థమైపోయింది. అలాగే నా సినిమా గురించి మా ఆవిడ (స్నేహా) ఎప్పుడూ భావోద్వేగానికి లోనవ్వదు. కానీ తొలిసారి ఎమోషన్‌కి గురై, నన్ను హత్తుకుంది. -
మన సత్తా ఇప్పుడే తెలిసిందా?
తెలుగు సినిమాను చాలాకాలం పాటు కేంద్ర ప్రభుత్వ అవార్డుల కమిటీ సభ్యులు, క్రిటిక్స్ తక్కువ చేసి చూపించడానికి ప్రయత్నించారు. కానీ, ఇప్పుడు తెలుగు సినిమా జూలు విదిలిస్తోంది. 2021కి గాను ప్రకటించిన 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు 11 అవార్డులు దక్కాయి. నేషనల్ ఫిల్మ్ అవార్డుల చరిత్రలో తొలిసారిగా ఒక తెలుగు నటుడికి జాతీయ ఉత్తమ నటుడు అవార్డ్ రావడం అభిమానులనే కాదు – పరిశ్రమనూ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తెలుగు వాడికి టాలెంట్ ఎప్పుడూ ఉంది, కానీ ప్రపంచం ఇప్పుడే తెలుగు సినిమా ప్రతిభ తెలుసుకుంటోంది. ఆగస్ట్ 23న చంద్రయాన్–3 ప్రయోగం విజయవంతం కావడంతో భారతదేశం, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు అందరూ గర్వపడ్డారు. ఆ మరుసటి రోజునే తెలుగు సినిమా చంద్ర మండలం ఎక్కినంతగా సంబరం చేసుకుంటోంది. కారణం అందరికీ తెలిసిందే! 2021వ సంవత్సరానికి గాను ప్రకటించిన 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు ఏకంగా 11 అవార్డులు దక్కాయి. సంఖ్యా పరంగానే కాకుండా – 69 సంవత్సరాల నేషనల్ ఫిల్మ్ అవార్డుల చరిత్రలో తొలిసారిగా ఒక తెలుగు నటుడికి జాతీయ ఉత్తమ నటుడు అవార్డ్ రావడం తెలుగు సినిమా అభిమానులనే కాదు– తెలుగు సినిమా పరిశ్రమను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇక్కడ మౌలికంగా ఓ ప్రశ్న తలెత్తుతుంది. తెలుగు సినిమా రంగంలో ఎందరో మహా నటులున్నారు. వారెవరికీ దక్కని గౌరవం, గుర్తింపు– అభిమానుల చేత ‘ఐకాన్ స్టార్’ అని పిలిపించుకునే అల్లు అర్జున్‌కు రావడం సంతోషదాయకం. అలాగని ముందు తరాల నటుల గురించి, ఏ మాత్రం తక్కువగా ఆలోచించినా మహాపరాధం! ఒక నిజం ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా – తెలుగు సినిమాను చాలాకాలం పాటు కేంద్ర ప్రభుత్వ అవార్డుల కమిటీ సభ్యులు, మిగి లిన భాషా చిత్రాల మార్కెట్లు, క్రిటిక్స్ తక్కువ చేసి చూపించడానికి ప్రయత్నించారు. ఎన్.టి. రామారావు గారి ‘పాతాళ భైరవి’, అక్కినేని నాగేశ్వరరావు గారి ‘సువర్ణ సుందరి’ – హిందీలోనూ ఏడాది పైన ఆడిన చరిత్ర ఈ జనరేషన్‌కి తెలియకపోవచ్చు. అలాగే జకార్తా ఇంటర్ నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్లో ‘నర్తన శాల’ సినిమాలో ఎస్.వి. రంగా రావు పోషించిన కీచక పాత్రకు ఉత్తమ నటుడిగా లభించిన గౌరవం కొందరికే గుర్తుండవచ్చు. పైగా పది, పదిహేనేళ్ళ క్రితం వరకూ అవార్డులను... నేచురల్‌గా ఉండే సినిమాలు అనండి, ఆర్ట్ ఫిలిమ్స్ అనండి... వాటికి మాత్రమే ఇవ్వాలనే ఒక ప్రత్యేక ధోరణి ఉండేది. బాక్సాఫీస్ దగ్గర డబ్బులు వసూలు చేసిన సినిమాలకూ, అందులో పని చేసినవాళ్ళకూ ఎక్కువ శాతం అవార్డులు వచ్చేవి కాదు. వచ్చేవి కాదు అనే కన్నా ఇచ్చేవాళ్ళు కాదనడం కరెక్ట్! పక్క భాషల నటులు ఒక్కొక్కరికి 2–3 అవార్డులు వచ్చిన సందర్భాలున్నాయి. అదే సమయంలో మన తెలుగు నటు లను గుర్తించడం లేదేంటని బాధ పడుతుండేవాళ్ళు. అందుకే 30 ఏళ్ళ నుంచి ఉత్తమ వినోదాత్మక చిత్రం అవార్డ్ ప్రవేశపెట్టి, కమర్షియల్ సినిమా కన్నీరు తుడిచే ప్రయత్నం చేశారు. అయిదారేళ్ళ క్రితం వరకూ భారతీయ వినోదాత్మక రంగం నుంచి వచ్చే ఆదాయంలో తెలుగు సినిమా వాటా 18–19 శాతం ఉండేది. బాలీవుడ్ రెవిన్యూ తర్వాత స్థానం తెలుగు సినిమాదే. ఇప్పుడు ఈ వాటా 30 శాతం వరకూ పెరిగిందని విన్నాను. కేవలం ప్రభుత్వానికి ఆదాయం రావడమే కాదు! అన్ని వందల, వేల కోట్ల ఆదాయం ఎన్ని వేల కుటుంబాలకు ఉపాధి కలిగిస్తోందో అన్న విషయం ప్రధానంగా గమనించాలి. ముఖ్యంగా ఇవాళ ఆర్ట్ ఫిలిమ్స్ తీసేవాళ్ళు, ఆదరించేవాళ్ళు తగ్గి పోయారు. అవతల ఆస్కార్ అవార్డుల్లో (మన వాళ్ళందరికీ అదే కొలమానం కాబట్టి) బాక్సాఫీస్ సక్సెస్ అయిన సినిమాలకూ, క్రైమ్ డ్రామాలకూ అవార్డులు ఇస్తున్నప్పుడు కమర్షియల్ సినిమాలు భారత దేశంలో ఏం పాపం చేసుకున్నాయి? జనం బాగా ఆదరించిన సిని మాల్లో కళాత్మక విలువలు ఉండవా? అత్యద్భుతమైన ప్రతిభా పాట వాలు ఉండవా? ఎన్ని పదుల, వందల కోట్ల పారితోషికాలు తీసు కున్నా, ప్రతి కళాకారుడూ కోరుకునేది తన పనిని ఎక్కువ మంది మెచ్చుకోవాలని! మేధావులు, అవార్డుల కమిటీల్లో గొప్పవాళ్ళ నుంచి ప్రశంసలు, సత్కారాలు అందుకోవాలని! ఇందులో తప్పేం ఉంది? అమితాబ్‌కి ఉత్తమ నటుడు అవార్డ్ వచ్చినప్పుడూ, రజనీ కాంత్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్రదానం చేసినప్పుడు కూడా కొన్ని విమర్శలు వచ్చాయి. వాళ్ళు దేశవ్యాప్తంగా పాపులర్ స్టార్స్ అయినంత మాత్రాన ప్రతిభావంతులు కారా? ఎవరు అవునన్నా, కాదన్నా – రాజమౌళి ‘బాహుబలి’తో ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ రీ–సౌండ్ తెలుగు సినిమా వినిపించింది. అప్పటి నుంచి తెలుగు సినిమా రంగం గురించి మన దేశంలోనే కాదు... ప్రపంచంలోని సినిమా అభిమానులందరికీ తెలిసింది. ఈ రోజు జాతీయ స్థాయిలో తెలుగు సినిమా పనితనం, ప్రతిభ తెలిసిందంటే... తెలుగు సినిమా తనని తాను పెంచుకున్న స్థాయి. లాబీయింగ్ అంటే ఇదే! తెలుగు సినిమా తన టాలెంట్‌తో భారతదేశంలోని సినిమా అభిమానులు, కమిటీ సభ్యుల దగ్గర లాబీయింగ్ చేసింది! భారీ స్థాయిలో – ఊహకందని విజువల్స్‌తో, మార్కెట్ రిస్క్ చేసి సంపాదించుకున్న రెస్పెక్ట్ ఇది! రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్.’ ఆస్కార్ స్థాయిలో అందుకున్న అవార్డులకూ, గుర్తింపునకూ ఈ జాతీయ అవార్డులు ఓ కొనసాగింపు! అలాగే శ్రీశ్రీ, వేటూరి, సుద్దాల అశోక్ తేజ సరసన ఇప్పుడు చంద్ర బోస్ జాతీయ ఉత్తమ గీత రచయిత అవార్డును అందుకున్నారు. ప్రేమకథల్లో ఓ షాకింగ్ పాయింట్‌తో వచ్చిన ‘ఉప్పెన’ సినిమా తెలుగులో ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డ్ గెలుచుకోవడం అభినందనీయం! ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్న తొలి తెలుగు నటుడిగా చరిత్రలో నిలిచిపోతున్న అల్లు అర్జున్ గురించి రెండు మాటలు చెప్పాలి. ప్రతి నటుడూ కష్టపడతారు. అల్లు అర్జున్ తనకు అసాధ్యం అనుకున్నది కూడా కసిగా సాధించి తీరుతారు. అల్లు అర్జున్‌తో మూడు సినిమాలకు ఓ రచయితగా పని చేసినప్పుడు ఆయ నలో గమనించిన కొన్ని లక్షణాల గురించి చెప్పుకోవాలి. క్యారెక్టర్ కోసం తన శరీరాన్ని మలుచుకోవడమే కాదు... డిక్షన్, బాడీ లాంగ్వేజ్ కోసం తనకు రానిది కూడా ఆయన కష్టపడి నేర్చుకుంటారు. ‘రుద్రమ దేవి’లో గోన గన్నా రెడ్డి పాత్ర చేసిన సాహసం, ‘దువ్వాడ జగన్నాథం (డి.జె.)’లో పురుష సూక్తం పలకడానికి చేసిన ప్రయత్నం, ఇప్పుడు ‘పుష్ప’లో ఓ పక్కకు భుజం వంచి (గూని లాంటిది) మరీ చేసిన అభినయం, చిత్తూరు జిల్లా యాస నేర్చుకోవడానికి చూపిన పట్టుదల – ఇవన్నీ అవార్డ్ అందుకోవడానికి కారణాలయ్యాయి. చివరగా ఓ మాట! తెలుగు సినిమా పుట్టినప్పటి నుంచి (92 సంవత్సరాల కాలం) తన ప్రతిభను చాటి చెబుతూనే ఉంది. అయితే ఆ వెలుగు, వినోదం తెలుగు నేలకే పరిమితమైంది. ఇప్పుడు మన సినిమా ఎల్లలు దాటింది, రిస్క్ గేమ్ ఆడుతోంది. దానికి తగ్గ ప్రతి ఫలాలూ అందుకుంటోంది. తెలుగు వాడికి టాలెంట్ ఎప్పుడూ ఉంది, కానీ ప్రపంచం ఇప్పుడే తెలుగు సినిమా ప్రతిభ తెలుసుకుంటోంది. అందుకే ఇన్ని వందల కోట్ల వసూళ్ళు, అవార్డులు, సత్కారాలు, మర్యాదలు! తెలుగు సినిమా ఏం చేస్తోందనేది మిగిలిన భాషా చిత్రాలు, మార్కెట్లు ఇప్పుడు గమనిస్తున్నాయి. కానీ, తెలుగు ప్రేక్ష కుల అభిరుచిని ఏనాడో కొందరు గొప్ప దర్శకులు గుర్తించారు. తెలుగు సినిమాకు దగ్గర కావాలని ప్రయత్నించారు. 1970ల చివరలో శ్యామ్ బెనెగల్ ‘అనుగ్రహం’, మృణాల్ సేన్ ‘ఒక ఊరి కథ’, గౌతమ్ ఘోష్ ‘మా భూమి’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. ఇప్పుడు కమర్షియల్ ప్యాన్– ఇండియా సినిమా కోసం, క్వాలిటీ మేకింగ్ కోసం దేశం తెలుగు సినిమా వైపు తొంగిచూస్తోంది. పాపులర్ సినిమాలకు అన్ని విధాలా పట్టాభిషేకాలు ఇప్పుడిప్పుడే మొదల య్యాయి. తెలుగు సినిమా జైత్రయాత్రకు ఇది శుభారంభం! ప్రసాద్ నాయుడు వ్యాసకర్త ప్రముఖ సినిమా రచయిత, సినీ విశ్లేషకులు PrasaadNaidu5@gmail.com -
నా జాతీయ అవార్డు వెనక్కి తీసేసుకోండి
రెండున్నర దశాబ్దాలుగా బాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తున్న అక్షయ్‌కుమార్‌కు ఎట్టకేలకు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు వచ్చింది. అయితే దాని గురించి ఒక్కోరూ ఒక్కోలా మాట్లాడుతుండటంతో అక్షయ్‌కి ఎక్కడలేని కోపం వచ్చింది. 'మీరు కావాలనుకుంటే దాన్ని వెనక్కి తీసేసుకోండి' అంటూ తీవ్రంగా మండిపడ్డాడు. 'గత పాతికేళ్లుగా నేను వింటూనే ఉన్నాను. ఎప్పుడైనా ఎవరికైనా అవార్డు వచ్చిందంటే దానిమీద బోలెడంత చర్చ మొదలుపెడతారు. ఎవరో ఒకరు ఏదో రకంగా వివాదం సృష్టిస్తారు. ఆ అవార్డు అతడికి వచ్చి ఉండకూడదు.. వేరేవాళ్లకు రావాల్సింది అంటారు. నాకు 26 ఏళ్ల తర్వాత ఈ అవార్డు వచ్చింది. ఇది కూడా మీకు నచ్చకపోతే వెనక్కి తిరిగి తీసేసుకోండి' అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. రుస్తుం సినిమాలో నటనకు గాను అక్షయ్‌కుమార్ ఈ ఏడాది ఉత్తమ నటుడి అవార్డు గెలుచుకున్నాడు. దీనిపై చాలామంది కామెంట్లు చేశారు. దంగల్ సినిమాలో ఆమిర్ ఖాన్, అలీగఢ్ సినిమాలో మనో్జ్ బాజ్‌పాయి లాంటి వాళ్ల కంటే అక్షయ్ ఏమంత గొప్పగా చేశాడంటూ విమర్శించారు. ఇంతకుముందు అక్షయ్ నటించిన హేరా ఫేపరీ, భాగమ్ భాగ్ సినిమాలకు దర్శకత్వం వహించిన ప్రియదర్శన్ ఇప్పుడు జాతీయ అవార్డుల జ్యూరీకి చైర్మన్‌గా ఉండటం వల్లే అక్షయ్‌కి అవార్డు వచ్చిందని కూడా వ్యాఖ్యానించారు. ఇంతకుముందు రమేష్ సిప్పీ చైర్మన్‌గా ఉండగా అమితాబ్ బచ్చన్‌కు అవార్డు వచ్చిందని, అలాగే ప్రకాష్ ఝా చైర్మన్‌గా ఉండగా అజయ్ దేవ్‌గణ్‌కు వచ్చిందని, అప్పుడెవరూ ప్రశ్నించరు గానీ ఇప్పుడు మాత్రం ఇలాంటి ప్రశ్నలు ఎలా వస్తాయని అక్షయ్ కుమార్ మండిపడ్డాడు. వాస్తవానికి అక్కీకి ఈ అవార్డు ఎప్పుడో వచ్చి ఉండాల్సిందని ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ అన్నాడు. అతడు చాలా టాలెంట్ ఉన్న, కష్టపడే, నిబద్ధత కలిగిన నటుడని.. ఇప్పటికైనా అతడిని గుర్తించి అవార్డు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని, ఆ అర్హత అక్షయ్‌కి ఉందని చెప్పాడు. తన భార్య ప్రేమికుడిని హత్యచేసి విచారణ ఎదుర్కొన్న నౌకాదళ అధికారిగా రుస్తుం సినిమాలో అక్షయ్ నటించాడు. ప్రస్తుతం తన భార్య ట్వింకిల్ ఖన్నా నిర్మాతగా సోనమ్ కపూర్, రాధికా ఆప్టే నటిస్తున్న పద్మన్, రజనీకాంత్ హీరోగా చేస్తున్న రోబో 2.0 సినిమాలలో అక్షయ్ చేస్తున్న సంగతి తెలిసిందే.