తమిళ రచయిత్రి, అంబై
రచన చేయడంలో రెండు వర్గీకరణలు ఉన్నాయి అనుకుంటే–
ఒకటి: ఇలా మాత్రమే రాయాలి.
రెండు: ఇలా కూడా రాయవచ్చు.
మొదటి విభాగానికి చెందిన వారికి రాయడానికి ‘సమస్య’ అనేది ప్రధానం కాదు. అందుకే వారికి ఎలాంటి సమస్యలు ఎదురుకావు. ఇక రెండో కోవకు చెందిన వారు సమస్యల మీదే రాస్తారు. వారికి అనేకానేక సమస్యలు ఎదురుకావచ్చు కూడా. అంతమాత్రాన ఆగిపోరు. రాజీ పడరు. ఈ కోవకు చెందిన తమిళ రచయిత్రి అంబై. ఆమె కథా సంకలనం‘శివప్పు కళత్తుడన్ ఒరు పట్చయ్ పరవై’ (ఎర్రటిమెడ ఉన్న పచ్చటిపక్షి) కేంద్రసాహిత్య అకాడమీ అవార్డ్‌కు ఎంపికైంది. అంబై కథలు తీరిగ్గా చదివి, పక్కన పెట్టేవి కావు. అలజడి పెంచి ఆలోచనలకు పదును పెట్టేవి.
ఈ కథలలో ఒక పాత్ర ఇలా అంటుంది...
‘నా జీవితంతో పాటే ఎన్నో కిటికీలు ఉన్నాయి. ఎప్పుడైనా ఆ కిటికీల నుంచి బయటకు చూస్తే తెలియని ప్రపంచం, తెలుసుకోవాలనిపించే ప్రపంచం ఆవిష్కారం అవుతుంది. ఎన్ని కిటికీలు ఉన్నా...ప్రతి కిటికీ తనదైన ప్రపంచాన్ని చూపుతుంది’
పందొమ్మిది సంవత్సరాల వయసులోనే కథలు రాయడం మొదలుపెట్టింది అంబై. ప్రసిద్ధ పత్రిక ‘ ఆనంద్ వికటన్’ లో అంబై రాసిన ఎన్నో కథలు ప్రచురితమయ్యాయి. అయితే ‘సిరకుకల్ మురియమ్’ (1967)తో సీరియస్ రైటింగ్ మొదలుపెట్టారు. సంప్రదాయ పాఠకవర్గాలకు ఈ కథలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. ‘ఇలా కూడా రాయవచ్చా!’ ‘ఆమె రాసింది నిజమే కదా. మరి మనం ఇలా ఎప్పుడూ ఆలోచించలేదేమిటీ’....అనుకునేవారు.
‘దశాబ్దాల క్రితం రాసిన ఆమె కథలు ఇప్పటికీ కొత్తగానే ఉంటాయి. వాటికి ప్రాసంగికత ఉంటుంది’ అంటున్నారు అంబై కథాసాహిత్యంపై వివరమైన రచనలు చేసిన సెంథిల్.
తమిళనాడులోని కొయంబత్తూర్‌లో జన్మించిన అంబై అసలు పేరు సీఎస్.లక్షీ. ముంబై, బెంగళూరులో పెరిగారు. మద్రాస్ క్రిస్టియన్ కాలేజిలో పోస్ట్–గ్రాడ్యుయేషన్ (చరిత్ర) చేసిన అంబై దిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీలో పీహెచ్‌డి చేశారు. తమిళనాడులో స్కూల్ టీచర్, లెక్చరర్‌గా పనిచేశారు.
అనేక ప్రాంతాలు,రకరకాల మనుషులు, వారి మనస్తత్వాలు ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్న ప్రత్యక్ష,పరోక్ష సమస్యలు ఆమె రాసిన కథలకు వస్తువు అయ్యాయి. అంబై కథల్లోని పాత్రలు మూస ధోరణుల్లో ఆలోచించవు. సమాజంలో కనిపించే అపసవ్యధోరణులను ప్రశ్నిస్తాయి.
స్పారో(సౌండ్ అండ్ పిక్చర్ అర్కైవ్స్ ఫర్ రిసెర్చ్ ఆన్ వుమెన్) వ్యవస్థాపకురాలైన అంబై ఈ ఫోరమ్ తరపున మహిళా రచయితలు, కళాకారులకు సంబంధించిన ఎన్నో పుస్తకాలను ప్రచురించారు.
Comments
Please login to add a commentAdd a comment