Tamil writer
-
నీ కోసం కథలు రాసి
‘ఇంటి మూలన వంట గది’ ‘అడవిలో హరిణి’ ‘సంధ్య వెలుతురు’... సి.ఎస్.లక్ష్మి అనే చిత్తూరు సుబ్రహ్మణ్యం లక్ష్మి కథల సంపుటాల పేర్లు ఇవి. ‘అంబై’ కలం పేరుతో తమిళంలో స్త్రీల పారంపరిక బంధనాలను ప్రశ్నించే కథలు రాస్తున్న సి.ఎస్.లక్ష్మికి ప్రతిష్టాత్మక ‘టాటా లిటరేచర్ లైఫ్‌టైమ్ అవార్డు’ ఈ సంవత్సరానికి ప్రకటించారు. ‘స్పారో’ అనే సంస్థను స్థాపించి మహిళా సాహిత్యకారుల చరిత్రను నిక్షిప్తం చేస్తున్న లక్ష్మి పరిచయం... ఆలోచనలు... ‘నన్ను మహిళా రచయిత అని ప్రత్యేకంగా పిలవొద్దు. పురుషులు ఏం రాసినా వారిని పురుష రచయిత అంటున్నారా? మమ్మల్ని మాత్రం మహిళా రచయితలు అనడం ఎందుకు? మమ్మల్ని కూడా రచయితలు అనే పిలవండి’ అంటారు సి.ఎస్.లక్ష్మి. ‘అంబై’ కలం పేరుతో తమిళ పాఠకులకు సుదీర్ఘకాలంగా అభిమాన రచయిత్రిగా ఉన్న సి.ఎస్.లక్ష్మి ఒకటీ రెండు నవలలు రాసినా ఎక్కువగా అంకితమైంది కథలకే. అదీ స్త్రీల కథలకి. తమిళంలో స్త్రీవాద దృక్పథంతో రాసి ఒక కదలిక తేగలిగిన రచయితల్లో సి.ఎస్.లక్ష్మి ప్రముఖులు. సుదీర్ఘ కాలంగా తాను ఆశించిన స్త్రీ వికాసం కోసం కలాన్ని అంకితం చేయడం వల్లే ఆమెకు ‘టాటా లిటరేచర్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు’ 2023 సంవత్సరానికి ప్రకటించారు. టాటా సన్స్ ప్రతినిధి హరీష్ భట్ ఈ విషయాన్ని తెలియచేస్తూ ‘స్త్రీలు తాము మోయక తప్పని మూసలను లక్ష్మి తన కథల ద్వారా బద్దలు కొడుతూనే వచ్చారు’ అని వ్యాఖ్యానించారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డును గతంలో అందుకున్న వారిలో వి.ఎస్.నైపాల్, మహాశ్వేతా దేవి, రస్కిన్ బాండ్, గిరిష్ కర్నాడ్ తదితరులు ఉన్నారు. ఊరు కోయంబత్తూరు కోయంబత్తూరులో జన్మించిన అంబై ఢిల్లీలోని జె.ఎన్.యు నుంచి పిహెచ్.డి పట్టా పొందారు. తమిళనాడులో అధ్యాపకురాలిగా పని చేస్తూ కథలు రాశారు. డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ విష్ణు మాథూర్‌ని వివాహం చేసుకుని తర్వాతి కాలంలో ముంబైలో స్థిరపడ్డారు. 18 ఏళ్ల వయసులో తొలిసారి పిల్లల కోసం ‘నందిమలై చరలిలె’ (నందిమల కొండల్లో) అనే డిటెక్టివ్ నవలతో ఆమె రచనా జీవితం మొదలైనా 1967లో రాసిన ‘సిరగుగల్ మురియుమ్’(రెక్కలు విరిగిపోతాయి) అనే కథతో సిసలైన బాట పట్టారు. స్త్రీ స్వేచ్ఛ, సమానత్వం, స్త్రీవాద దృక్పథం గురించి తమిళంలో తొలిసారి గొంతు విప్పిన రచయిత్రి ఆమేనని విమర్శకులు అంటారు. సంప్రదాయం, ఆచారాలు మహిళల్ని ప్రత్యక్షంగా పరోక్షంగా అణచివేస్తున్నాయో ఆమె తన కథల్లో వివరించే ప్రయత్నం చేశారు. తప్పక చదవాల్సిన తమిళ కథల్లో అంబై రాసిన ‘వీట్టిన్ మూలై ఒరు సమేలరై’, ‘అమ్మా ఒరు కొలై సెయ్దల్’, ‘కరుప్పు కుదిరై చతుక్కుమ్’ కథలు ఉంటాయని రచయిత జయమోహన్ పేర్కొన్నారు. 2021లో అంబైకు సాహిత్య అకాడెమీ పురస్కారం దక్కింది. కలం పేరు వెనుక కథ తన కలం పేరు ‘అంబై’గా మార్చుకోవడానికి వెనకున్న కథను గతంలో వెల్లడించారామె. శుక్రవారం పుట్టే ఆడపిల్లలకు ‘లక్ష్మి’ అనే పేరు పెడతారని, తనకూ అదే పేరు పెడితే ఆ పేరుతోనే కథలు రాయాలపించలేదని చెప్పారు. తమిళ సీనియర్ రచయిత దేవన్ రాసిన ‘పార్వతిన్ సంగల్పం (పార్వతి సంకల్పం)’ నవలలో భర్త చేత అణచివేతకు గురైన ఓ భార్య తన పేరును అంబైగా మార్చుకొని రాయడం మొదలు పెడుతుందని, అదే తనకు స్ఫూర్తినిచ్చి కలం పేరును అంబైగా మార్చుకున్నానని తెలిపారు. సాహితీ కార్యకర్త సి.ఎస్.లక్ష్మి కేవలం రాయడమే కాదు చాలా సాహితీ కార్యక్రమాలు చేస్తారు. తమిళంలో మహిళా సాహిత్యం గురించి ఆమె చేసిన పరిశోధన ముఖ్యమైనది. 1994లో చెన్నైలో స్థాపించిన రోజ ముత్తయ్య రీసెర్చ్ లైబ్రరీ ఏర్పాటు వెనుక అంబై కీలకంగా నిలిచారు. ప్రపంచంలోని అతి పెద్ద ప్రైవేటు లైబ్రరీల్లో ఇదీ ఒకటి కావడం విశేషం. ప్రస్తుతం ఇక్కడ మూడు లక్షల పుస్తకాల దాకా ఉన్నాయి. అలాగే 1988లో SPARROW (Sound and Picture Archives for Research on Women) అనే ఎన్జీవో ప్రారంభించారు. మహిళా రచయితలు, మహిళా కళాకారుల రచనలు, ప్రతిభ, వారి కృషిని డాక్యుమెంట్ చేయడం, నిక్షిప్తం చేయడం ఆ సంస్థ లక్ష్యం. ప్రస్తుతం ఆమె ఆ సంస్థకు అధ్యక్షురాలిగా ఉన్నారు. తన సంస్థ తరఫున అనేక పుస్తకాలు ప్రచురించారు. -
Nandini Krishnan: అనువాద వారధి
సొంతగా రచనలు చేయగలిగేవారు అనువాదాలు చేయరు. భాష బాగా వచ్చినంత మాత్రాన అనువాదం చేయలేరు. దానికి నైపుణ్యం, కొంత నిస్వార్థం కావాలి. తమిళ రచయిత్రి నందిని కృష్ణన్ చేసిన ‘పొన్నియిన్ సెల్వన్’ ఇంగ్లిష్ అనువాదం ఏప్రిల్ 24న మార్కెట్లోకి రానుంది. నవలలోని పాతకాలపు తమిళాన్ని నేటి యువతకు అందేలా అనువాదం చేయడం సులువు కాదు. తమిళంలోని ఉత్తమ నవలలను సవాలుగా తీసుకుని నందిని ఇంగ్లిష్‌లో అనువాదం చేస్తోంది. ఆమెకు వస్తున్న గుర్తింపు ఆ రంగంలో రాణించాలనుకునే స్త్రీలు గమనించదగ్గది. దాదాపు 2500 పేజీలు ఉండే ఐదు భాగాల భారీ ప్రఖ్యాత తమిళ నవల ‘పొన్నియిన్ సెల్వన్’ను ఇంగ్లిష్‌లో అనువాదం చేయబూనడం సాహసం. కాని ఈ క్లాసిక్‌ను అనువాదం చేయడానికి చాలా మంది ట్రై చేస్తూనే వచ్చారు. ముగ్గురు నలుగురు సఫలీకృతులయ్యారు. అయితే ఎప్పటికప్పుడు కొత్త జనరేషన్‌కు తగ్గట్టుగా అనువాదం చేయడానికి ఎవరో ఒకరు ముందుకు వస్తూనే ఉన్నారు. ఇప్పుడు నందిని కృష్ణన్ వంతు. ఆమె చేసిన ఈ నవల అనువాదం మొదటి భాగం పూర్తయ్యింది. ఏప్రిల్ 24న విడుదల కానుంది. వెస్ట్‌ల్యాండ్ బుక్స్ దీనిని ప్రచురిస్తుంటే ‘పొన్నియిన్ సెల్వన్’ను రెండు భాగాల సినిమాగా తీస్తున్న దర్శకుడు మణిరత్నం ఈ కార్యక్రమానికి ప్రోత్సాహకుడిగా ఉన్నాడు. ‘పొన్నియిన్ సెల్వన్ నవల 75 ఏళ్ల క్రితం నాటిదని గుర్తు లేనంతగా అనునిత్యం తమిళ సాహిత్యంలో కలగలిసిపోయింది. కల్కి రాసిన ఈ నవలలోని భాషను, పై అర్థాన్ని, లోపలి అర్థాన్ని అర్థం చేసుకుని అనువాదం చేయడం చాలా జటిలం. అయినా చేశాను. పాఠకులు సులభంగా చదువుకోవడానికి, చేత బట్టుకోవడానికి వీలుగా ఇంగ్లిష్‌లో ఐదు కంటే ఎక్కువ భాగాలుగా విభజించి పుస్తకాలుగా తేనున్నాము’ అని తెలిపింది నందిని కృష్ణన్. ఎవరీ నందిని కృష్ణన్? నందిని కృష్ణన్ చెన్నైలో స్థిరపడిన నాటకకర్త, రచయిత్రి, స్టేజ్ యాక్టర్ కూడా. లండన్‌లో, ఢిల్లీలో జర్నలిస్ట్‌గా పని చేసింది. ఆ తర్వాత చెన్నై నుంచి వెబ్, ప్రింట్ మీడియాలలో పని చేయడం మొదలుపెట్టింది. హాస్యం రాస్తుంది. పెద్దలు కుదిర్చే పెళ్లిళ్లకు ప్రాధాన్యం ఇచ్చే భారతీయ వైవాహిక వ్యవస్థపై విమర్శను పెడుతూ వివాహమైన స్త్రీలను, పురుషులను ఇంటర్వ్యూ చేసి ‘హిచ్డ్: ది మోడర్న్ అండ్ అరేంజ్డ్ మేరేజ్’ పుస్తకం తెచ్చింది. ట్రాన్స్ మెన్ జీవితాల ఆధారంగా ‘ఇన్విజిబుల్ మెన్‘ పుస్తకం రాసింది. పెరుమాళ్ మురుగన్ నవలలను ఇంగ్లిష్‌లో అనువాదం చేయడం ద్వారా అనువాద రంగంలో ప్రవేశించింది. ఇప్పుడు ‘పొన్నియిన్ సెల్వన్‘ అనువాదం చేస్తోంది. నందిని కృష్ణన్ ఇంట్లో ఎప్పుడూ వీధి కుక్కలు ఉంటాయి. వాటిని సాకుతుంటుంది. పిల్లులను కూడా. ‘కుక్కలు, పిల్లలు, వేల కొద్ది పుస్తకాలు అంతే మా ఇల్లు’ అని చెబుతుంది. కత్తి మీద సాము ‘అనువాదం చేయడం కత్తి మీద సాము’ అంటుంది నందిని. ‘సొంత రచనైతే అలా ఒక సమాధి స్థితికి వెళ్లి రాసుకుంటూ పోతాము. అనువాదం అలా కాదు. అప్రమత్తంగా ఉండాలి. ఎదుటివారు చదివితే అది కేవలం అనువాదం అనిపించకూడదు. అదే సమయంలో ఒరిజినల్ నవల తాలూకు పరిమళం దానిలో ఉండాలి. అనువాదం పూర్తి చేశాక ఎవరిదో కన్నబిడ్డను మనం సాకాం... ఇక దీనితో రుణం చెల్లిపోయింది అన్న బాధ తప్పదు’ అంటుంది నందిని. ‘అనువాదకులు స్వయంగా రచయితలు కాకపోవడం వల్ల కొన్ని అనువాదాలు చెడిపోతాయి. ఎందుకంటే వాళ్లు ప్రతి మాటా కచ్చితంగా అనువాదం చేస్తూ కృతకంగా మారుస్తారు. అనువాదకులు స్వయంగా రచయితలైనా కూడా కొన్ని అనువాదాలు చెడిపోతాయి. ఎందుకంటే వారు తమ సృజనశక్తిని కూడా కలుపుతారు. అది తప్పు. వేరొకరు గీసిన బొమ్మను నకలు చేసేటప్పుడు మనం పికాసో అంతటివాళ్లమైనా ఆ బొమ్మలో మన గొప్పదనం చూపకూడదు. అనువాదం అయినా అంతే’ అంటుంది నందిని కృష్ణన్. మంచి అనువాద రుసుము ‘అనువాదంలో రాణించాలంటే మంచి డబ్బు కూడా మనకు ఆఫర్ చేయాలి. తగిన డబ్బు లేకుండా అనువాదం చేయడం అనవసరం’ అంటుంది నందిని. ‘కొంతమంది కల్లబొల్లి మాటలు చెప్పి అనువాదం చేయించుకోవాలనుకుంటారు. వారి నుంచి జాగ్రత్తగా ఉండాలి. నేను రోజుకు ఆరేడు గంటలు అనువాదం చేస్తాను. ఒక పదానికి బదులు ఎన్ని పదాలు వాడొచ్చో అవసరమైతే లిస్ట్ రాసుకుంటాను. ఒరిజినల్ని చదువుతూ, అనువాదాన్ని చదువుకుంటూ పని ముగిస్తాను. పెరుమాళ్ మురుగన్ లాంటి రచయితలు పల్లెల్లో మరీ కొన్ని వర్గాలు మాత్రమే వాడే మాటల్ని ఉపయోగించి రాస్తారు. వాటికి ఇంగ్లిష్ మాటలు ఉండవు. డిక్షనరీలు కూడా ఉండవు. అందుకే అవసరమైతే ఒరిజినల్ రచయితనే సంప్రదిస్తూ డౌట్లు క్లియర్ చేసుకుంటూ అనువాదం ముగించాలి’ అంటుంది నందిని. నందిని లాంటి అనువాదకులు తెలుగులో కూడా ఉంటే మన క్లాసిక్స్ కూడా ప్రపంచ పాఠకులకు తప్పక చేరుతాయి. అనువాదకులకు గుర్తింపునూ తెచ్చిపెడతాయి. -
పురస్కారం... ఎర్రని రెక్కల పచ్చని పక్షి
రచన చేయడంలో రెండు వర్గీకరణలు ఉన్నాయి అనుకుంటే– ఒకటి: ఇలా మాత్రమే రాయాలి. రెండు: ఇలా కూడా రాయవచ్చు. మొదటి విభాగానికి చెందిన వారికి రాయడానికి ‘సమస్య’ అనేది ప్రధానం కాదు. అందుకే వారికి ఎలాంటి సమస్యలు ఎదురుకావు. ఇక రెండో కోవకు చెందిన వారు సమస్యల మీదే రాస్తారు. వారికి అనేకానేక సమస్యలు ఎదురుకావచ్చు కూడా. అంతమాత్రాన ఆగిపోరు. రాజీ పడరు. ఈ కోవకు చెందిన తమిళ రచయిత్రి అంబై. ఆమె కథా సంకలనం‘శివప్పు కళత్తుడన్ ఒరు పట్చయ్ పరవై’ (ఎర్రటిమెడ ఉన్న పచ్చటిపక్షి) కేంద్రసాహిత్య అకాడమీ అవార్డ్‌కు ఎంపికైంది. అంబై కథలు తీరిగ్గా చదివి, పక్కన పెట్టేవి కావు. అలజడి పెంచి ఆలోచనలకు పదును పెట్టేవి. ఈ కథలలో ఒక పాత్ర ఇలా అంటుంది... ‘నా జీవితంతో పాటే ఎన్నో కిటికీలు ఉన్నాయి. ఎప్పుడైనా ఆ కిటికీల నుంచి బయటకు చూస్తే తెలియని ప్రపంచం, తెలుసుకోవాలనిపించే ప్రపంచం ఆవిష్కారం అవుతుంది. ఎన్ని కిటికీలు ఉన్నా...ప్రతి కిటికీ తనదైన ప్రపంచాన్ని చూపుతుంది’ పందొమ్మిది సంవత్సరాల వయసులోనే కథలు రాయడం మొదలుపెట్టింది అంబై. ప్రసిద్ధ పత్రిక ‘ ఆనంద్ వికటన్’ లో అంబై రాసిన ఎన్నో కథలు ప్రచురితమయ్యాయి. అయితే ‘సిరకుకల్ మురియమ్’ (1967)తో సీరియస్ రైటింగ్ మొదలుపెట్టారు. సంప్రదాయ పాఠకవర్గాలకు ఈ కథలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. ‘ఇలా కూడా రాయవచ్చా!’ ‘ఆమె రాసింది నిజమే కదా. మరి మనం ఇలా ఎప్పుడూ ఆలోచించలేదేమిటీ’....అనుకునేవారు. ‘దశాబ్దాల క్రితం రాసిన ఆమె కథలు ఇప్పటికీ కొత్తగానే ఉంటాయి. వాటికి ప్రాసంగికత ఉంటుంది’ అంటున్నారు అంబై కథాసాహిత్యంపై వివరమైన రచనలు చేసిన సెంథిల్. తమిళనాడులోని కొయంబత్తూర్‌లో జన్మించిన అంబై అసలు పేరు సీఎస్.లక్షీ. ముంబై, బెంగళూరులో పెరిగారు. మద్రాస్ క్రిస్టియన్ కాలేజిలో పోస్ట్–గ్రాడ్యుయేషన్ (చరిత్ర) చేసిన అంబై దిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీలో పీహెచ్‌డి చేశారు. తమిళనాడులో స్కూల్ టీచర్, లెక్చరర్‌గా పనిచేశారు. అనేక ప్రాంతాలు,రకరకాల మనుషులు, వారి మనస్తత్వాలు ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్న ప్రత్యక్ష,పరోక్ష సమస్యలు ఆమె రాసిన కథలకు వస్తువు అయ్యాయి. అంబై కథల్లోని పాత్రలు మూస ధోరణుల్లో ఆలోచించవు. సమాజంలో కనిపించే అపసవ్యధోరణులను ప్రశ్నిస్తాయి. స్పారో(సౌండ్ అండ్ పిక్చర్ అర్కైవ్స్ ఫర్ రిసెర్చ్ ఆన్ వుమెన్) వ్యవస్థాపకురాలైన అంబై ఈ ఫోరమ్ తరపున మహిళా రచయితలు, కళాకారులకు సంబంధించిన ఎన్నో పుస్తకాలను ప్రచురించారు. -
ప్రముఖ రచయిత బాలకుమరన్ మృతి
ప్రఖ్యాత తమిళ రచయిత బాలకుమరన్ (71) చెన్నైలోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 150 నవలలు, 100కు పైగా కథలు, 20 సినిమాలకు మాటలు, స్క్రీన్‌ప్లే అందించిన బాలకుమరన్ తమిళ సినీ అభిమానులకు సుపరిచితులు. మణిరత్నం, శంకర్ లాంటి దర్శకులతో కలిసి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు స్క్రీన్‌ప్లే, మాటలు అందించారు. నాయకుడు, జెంటిల్‌మేన్, భాషా, సిటిజెన్ లాంటి సినిమాలకు బాలకుమరన్ పనిచేశారు. 1981లో భాగ్యరాజ హీరోగా తెరకెక్కిన ఇదు నమ్మ ఆలు సినిమాకు దర్శకత్వం వహించారు. పలు పత్రికలకు కల్కి, ఆనంద వికటన్, కుముదం లాంటి కథలను కూడా రాశారు. బాలకుమరన్ మృతి పట్ల పలువురు తమిళ సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. -
రచయితగా మరణించా... ఒంటరిగా వదిలేయండి
తమిళ రచయిత సంచలన ప్రకటన ‘మధోరుభగన్’ నవల వివాదమే కారణం చెన్నై: తమిళనాడులో హిందుత్వవాదుల ఆగ్రహానికి గురైన ప్రముఖ నవలా రచయిత ప్రొఫెసర్ పెరుమాళ్ మురుగన్ తాను ‘రచయితగా మరణించాన’ని మంగళవారం ప్రకటించారు. తనకు పునర్జన్మపై విశ్వాసం లేదు గనుక ఒక సాధారణ అధ్యాపకుడిగా జీవితం కొనసాగిస్తానన్నారు. ఇకపై ఎవరూ కలవడానికి ప్రయత్నించవద్దని, సాహిత్య సమావేశాలకు ఆహ్వానించవద్దని, తనను ఒంటరిగా వదిలేయాలని విజ్ఞప్తిచేశారు. తన నవలలు, కథానికలు, కవిత్వం, ఇతర సృజనాత్మక రచనల అమ్మకాలను నిలిపేయాలని ప్రచురణకర్తలను ఆయన కోరారు. ఇలా నిలిపేయడంవల్ల కలిగే నష్టాన్ని తాను భరిస్తానని మురుగన్ చెప్పారు. నూటపాతికేళ్ల నాడు తిరుచెంగోడు ప్రాంతంలో నెలకొన్న ఒక ఆచారం నేపథ్యంగా ఆయన ‘మధోరుభగన్’ పేరిట నాలుగేళ్ల క్రితం ఒక నవల రచించారు. ప్రముఖ ప్రచురణల సంస్థ పెంగ్విన్ దాని ఆంగ్లానువాదాన్ని గతేడాది వెలువరించింది. ఈ నవలపై తిరుచెంగోడులోని ఆరెస్సెస్ శాఖ, హిందూ మున్నాని, కొన్ని కులసంఘాలు గత నెలలో తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశాయి. బంద్‌లు, హర్తాళ్లు నిర్వహించాయి. శాంతిభద్రతల సమస్య తలెత్తడంతో మురుగన్ కుటుంబంతో సహా అక్కడి నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. సంతానం లేని మహిళలు ఒక తిరునాళ్ల సందర్భంగా ఆలయంలో అపరిచితులతో శారీరకంగా కలవడం ప్రధానాంశంగా మురుగన్ ఈ నవల రాశారు. సోమవారం జిల్లా రెవెన్యూ అధికారి వీఆర్ సుబ్బులక్ష్మి ఆధ్వర్యంలో మత సంస్థలు, కుల సంఘాలతో సమావేశం జరిగింది. ఇందులో మురుగన్ కూడా పాల్గొన్నారు. బేషరతుగా క్షమాపణ చెప్పడానికి, నవల ఉపసంహరణకు ఆయన హామీ ఇచ్చారు. ఆయనపై దాఖలుచేసిన కేసుల ఉపసంహరణకు హిందుత్వ సంస్థలు కూడా అంగీకరించాయి. వివాదం సమయంలో మురుగన్‌కు పలు సాహితీ సంస్థలు, రచయితలు అండగా నిలిచారు. అవసరమైతే న్యాయస్థానానికి వెళ్లడానికి తాము సిద్ధమేనని ప్రచురణకర్తలు కూడా ప్రకటించారు. -
మతమేదైనా మహిళకు పోరే
తమిళ రచయిత్రి.. రాజకీయవేత్త.. అన్నిటికన్నా ముందు నాలుగు గోడల బందీ! టాల్‌స్టాయ్.. చింఘిజ్ ఐత్మతోవ్.. దాస్తోవ్‌స్కీ.. సంకెళ్లను తెంచేసుకునే ఆలోచనలిచ్చిన నేతలు! ఆ ధైర్యంతోనే బందీ ‘రజతి’ రచనల రెక్కలు విప్పుకొని స్వేచ్ఛా విహంగం ‘సల్మా’గా మారింది! ఈ రెండింటికి మధ్య నలిగిన ‘రొక్కయ్య’ కూడా ఉంది! సల్మాకు పోరాటాన్ని నేర్పిన వనిత.. ఆమె జర్నీ టు ఫ్రీడమ్‌కి స్ఫూర్తిప్రదాత! ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన కవిసంగమం పొయెట్రీ ఫెస్టివల్‌కి సల్మా ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె పరిచయం తన మాటల్లోనే... పుట్టింట్లో రజతి అమ్మానాన్న పెట్టిన పేరు రజతి. మా సొంతూరు తిరుచ్చి దగ్గర్లోని తువరన్కురుచ్చి. పల్లెటూరు. ఆడపిల్లలు బయటకు వెళ్లకూడదనుకునే సంప్రదాయ ముస్లిం కుటుంబం. మట్టి గోడల మా ఇంటి చిన్న కిటికీ నాకు, అక్క (నజ్మా)కు బయటి ప్రపంచాన్ని చూపించేది. నాకేమో చదువంటే ప్రాణం. మా కజిన్‌తో ఊళ్లోని లైబ్రరీ నుంచి పుస్తకాలు తెప్పించుకొని చదివేదాన్ని. చిన్నపిల్లల కథల పుస్తకాలతో పాటు టాల్‌స్టాయ్, ఐత్మమతోవ్, దాస్తోవ్స్కీలనూ నాకు పరిచయం చేసింది ఆ లైబ్రరీయే! సాహిత్యాన్ని చదవడంతోనే సరిపెట్టుకోలేకపోయాను. మనసులోని భావాలను కాగితంమీద పరచాలనిపించింది. అలా నా పదిహేనవ యేట తొలి రచనకు శ్రీకారం చుట్టాను. గడపదాటి బయటకు వెళ్లకుండా నేనేం చేసినా మా పెద్దవాళ్లు అభ్యంతర పెట్టేవాళ్లు కాదు. నేను రాసిన కవితలను మా అమ్మ బాగా మెచ్చుకునేది. నాన్న వాటిని పత్రికలకు పోస్ట్ చేసేవాడు. అట్లా నా కవితలు కొన్ని పత్రికల్లో అచ్చయ్యాయి కూడా! నా కవిత్వాన్ని అంతలా ప్రోత్సహించిన అమ్మ నా పెళ్లి విషయంలో మాత్రం ఎందుకంత మొండిపట్టు పట్టిందో అర్థంకాలేదు. మా ఊళ్లోనే ఉంటున్న అబ్దుల్ మాలిక్ అనే అతనితో సంబంధం ఖాయం చేశారు. నాకిప్పుడప్పుడే పెళ్లొద్దు అని పట్టుబట్టినా అమ్మ మనసు కరగలేదు. తొమ్మిదో తరగతితోనే నా చదువు ఆగిపోయింది. మాలిక్‌తో నిఖా అయిపోయింది. అత్తింట్లో రొక్కయ్య నా రెండో పాత్ర. రజతి అనే నా పుట్టింటి పేరు ముస్లింపేరులా లేదని మా అత్తింటి వాళ్లు రొక్కయ్యగా మార్చారు నన్ను. అదే బందీ జీవితం.. గోడలు మారిందంతే! కాకపోతే మా ఇంట్లో నాకు నచ్చింది చదువుకొని, వచ్చింది రాసుకొనే స్వేచ్ఛ ఉండేది. ఇక్కడ అదీ లేదు. నా ప్రపంచం మరింత కుదించుకుపోయింది. ఏదైనా ఆలోచన రాగానే ఎవరికంటా పడకుండా పెన్ను, పేపర్ తీసుకొని బాత్రూమ్లోకి వెళ్లి రాసుకునేదాన్ని. ఆ కాగితాలను బాత్రూమ్లోనే దాచేదాన్ని. నన్ను చూడ్డానికి మా నాన్న వచ్చినప్పుడు దొంగతనంగా ఆయనకు ఈ కాగితాలు ఇచ్చేదాన్ని పత్రికలకు పోస్ట్చేయమని. ఊళ్లో మా ఆయన కాస్త పేరు, పలుకుబడి ఉన్న పొలిటికల్ లీడర్. రజతి పేరుతో పత్రికల్లో అచ్చయిన నా కవితల గురించి అతనికి తెలిసింది. అప్పటికే మాకిద్దరు పిల్లలు సలీం, నదీం. ఆడపిల్ల పుట్టలేదనే చింత ఇప్పటికీ! రాతలు ఆపేయమని చాలా గొడవపెట్టాడు మాలిక్. ఆయన, అత్తగారు వాళ్లంతా కలిసి పెద్ద యుద్ధమే చేశారు నాతో. నేను రాయడం మానేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు మాలిక్. నా మనసు రెక్కలు విరిగినట్టు ఫీలయ్యాను. ‘రజతి’ పేరుతో రాయడం మానేస్తాను అనుకున్నాను. అజ్ఞాతంగా సల్మా నా రచనాదాహం తీర్చుకోవడానికే సల్మా పుట్టింది! పొయిట్రీకే పరిమితమవకుండా ప్రోజ్కూడా రాయడం మొదలెట్టాను. ‘జిౌఠటట ఞ్చట్ట ఝజీఛీజీజజ్టి’ అనే నవలను రాశాను. దీన్ని మలయాళం, హిందీ, మరాఠీ, జర్మన్ భాషల్లోకి అనువదించారు. ఇది విమెన్ సెక్సువాలిటీకి సంబంధించింది. చాలా కాంట్రావర్స్ అయింది. ఇప్పుడు ‘టాయిలెట్’ అనే నవల రాస్తున్నాను. 2015లో రిలీజ్ అవుతుంది. ఇదీ ఉమన్ సబ్జెక్టే. దీన్నీ కాంట్రవర్సీ చేస్తారేమో! సల్మా.. నా వ్యక్తిత్వానికి ప్రతిరూపం. నా పోరాటానికి శక్తి. ఈ పేరుతో రాస్తున్నదీ నేనే అన్న విషయం కొన్నాళ్లకు మా ఆయనకు తెలిసింది. మళ్లీ చిన్నపాటి ఘర్షణ జరిగినా.. నా మొండితనం చూసి మిన్నకుండిపోయాడు. తర్వాత నుంచి వ్యతిరేకతా లేదు మద్దతూ లేదు. ఈ పరిణామక్రమంలోనే నా రాజకీయ ప్రవేశమూ జరిగింది. నా జీవితమే నాకు స్ఫూర్తి. ముస్లిం, హిందూ అని తేడా లేకుండా ఏ మహిళ అయినా తన అస్తిత్వం కోసం పోరాడాల్సిందే. పేదరికం, నిరక్షరాస్యత మహిళలను అణచిపెట్టేస్తున్నాయి. వాటిని జయించాలి. మహిళలు చదువుకోవాలి, సాధికారత సాధించాలి. ముస్లిం మహిళల విషయానికి వస్తే.. ఇస్లాం ఎక్కడా ఆడవాళ్లు చదువుకోవద్దని చెప్పలేదు. చదువు ఆత్మవిశ్వాసాన్నిస్తుంది. ప్రశ్నించడం నేర్పుతుంది. ఆ దిశగా మనం పయనించాలి! నీరాజనాలు: ఈ తమిళ రచయిత్రి జీవితం ఆధారంగా ‘సల్మా’అనే తొంభై నిమిషాల డాక్యుమెంటరీ వచ్చింది. దీన్ని అమెరికాలోని పార్క్‌సిటీలో ఈమధ్యనే ప్రదర్శించారు. ప్రదర్శన అనంతరం సంభాషించడానికి వచ్చిన సల్మాకు ప్రేక్షకుల స్టాండింగ్ ఒవేషన్ లభించింది! రజతి.. రొక్కయ్య.. సల్మా.. నా జీవితంలోని మూడు భిన్న పాత్రలు! విభిన్న అనుభవాలు.. కాబట్టి ఈ మూడూ నా కిష్టమే!