‘ఇంటి మూలన వంట గది’
‘అడవిలో హరిణి’
‘సంధ్య వెలుతురు’... సి.ఎస్.లక్ష్మి అనే చిత్తూరు సుబ్రహ్మణ్యం లక్ష్మి కథల సంపుటాల పేర్లు ఇవి. ‘అంబై’ కలం పేరుతో తమిళంలో స్త్రీల పారంపరిక బంధనాలను ప్రశ్నించే కథలు రాస్తున్న సి.ఎస్.లక్ష్మికి ప్రతిష్టాత్మక ‘టాటా లిటరేచర్ లైఫ్‌టైమ్ అవార్డు’ ఈ సంవత్సరానికి ప్రకటించారు. ‘స్పారో’ అనే సంస్థను స్థాపించి మహిళా సాహిత్యకారుల చరిత్రను నిక్షిప్తం చేస్తున్న లక్ష్మి పరిచయం... ఆలోచనలు...
‘నన్ను మహిళా రచయిత అని ప్రత్యేకంగా పిలవొద్దు. పురుషులు ఏం రాసినా వారిని పురుష రచయిత అంటున్నారా? మమ్మల్ని మాత్రం మహిళా రచయితలు అనడం ఎందుకు? మమ్మల్ని కూడా రచయితలు అనే పిలవండి’ అంటారు సి.ఎస్.లక్ష్మి.
‘అంబై’ కలం పేరుతో తమిళ పాఠకులకు సుదీర్ఘకాలంగా అభిమాన రచయిత్రిగా ఉన్న సి.ఎస్.లక్ష్మి ఒకటీ రెండు నవలలు రాసినా ఎక్కువగా అంకితమైంది కథలకే. అదీ స్త్రీల కథలకి. తమిళంలో స్త్రీవాద దృక్పథంతో రాసి ఒక కదలిక తేగలిగిన రచయితల్లో సి.ఎస్.లక్ష్మి ప్రముఖులు. సుదీర్ఘ కాలంగా తాను ఆశించిన స్త్రీ వికాసం కోసం కలాన్ని అంకితం చేయడం వల్లే ఆమెకు ‘టాటా లిటరేచర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు’ 2023 సంవత్సరానికి ప్రకటించారు. టాటా సన్స్ ప్రతినిధి హరీష్ భట్ ఈ విషయాన్ని తెలియచేస్తూ ‘స్త్రీలు తాము మోయక తప్పని మూసలను లక్ష్మి తన కథల ద్వారా బద్దలు కొడుతూనే వచ్చారు’ అని వ్యాఖ్యానించారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డును గతంలో అందుకున్న వారిలో వి.ఎస్.నైపాల్, మహాశ్వేతా దేవి, రస్కిన్ బాండ్, గిరిష్ కర్నాడ్ తదితరులు ఉన్నారు.
ఊరు కోయంబత్తూరు
కోయంబత్తూరులో జన్మించిన అంబై ఢిల్లీలోని జె.ఎన్.యు నుంచి పిహెచ్.డి పట్టా పొందారు. తమిళనాడులో అధ్యాపకురాలిగా పని చేస్తూ కథలు రాశారు. డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ విష్ణు మాథూర్‌ని వివాహం చేసుకుని తర్వాతి కాలంలో ముంబైలో స్థిరపడ్డారు. 18 ఏళ్ల వయసులో తొలిసారి పిల్లల కోసం ‘నందిమలై చరలిలె’ (నందిమల కొండల్లో) అనే డిటెక్టివ్ నవలతో ఆమె రచనా జీవితం మొదలైనా 1967లో రాసిన ‘సిరగుగల్ మురియుమ్’(రెక్కలు విరిగిపోతాయి) అనే కథతో సిసలైన బాట పట్టారు.
స్త్రీ స్వేచ్ఛ, సమానత్వం, స్త్రీవాద దృక్పథం గురించి తమిళంలో తొలిసారి గొంతు విప్పిన రచయిత్రి ఆమేనని విమర్శకులు అంటారు. సంప్రదాయం, ఆచారాలు మహిళల్ని ప్రత్యక్షంగా పరోక్షంగా అణచివేస్తున్నాయో ఆమె తన కథల్లో వివరించే ప్రయత్నం చేశారు. తప్పక చదవాల్సిన తమిళ కథల్లో అంబై రాసిన ‘వీట్టిన్ మూలై ఒరు సమేలరై’, ‘అమ్మా ఒరు కొలై సెయ్‌దల్’, ‘కరుప్పు కుదిరై చతుక్కుమ్’ కథలు ఉంటాయని రచయిత జయమోహన్ పేర్కొన్నారు. 2021లో అంబైకు సాహిత్య అకాడెమీ పురస్కారం దక్కింది.
కలం పేరు వెనుక కథ
తన కలం పేరు ‘అంబై’గా మార్చుకోవడానికి వెనకున్న కథను గతంలో వెల్లడించారామె. శుక్రవారం పుట్టే ఆడపిల్లలకు ‘లక్ష్మి’ అనే పేరు పెడతారని, తనకూ అదే పేరు పెడితే ఆ పేరుతోనే కథలు రాయాలపించలేదని చెప్పారు. తమిళ సీనియర్ రచయిత దేవన్ రాసిన ‘పార్వతిన్ సంగల్పం (పార్వతి సంకల్పం)’ నవలలో భర్త చేత అణచివేతకు గురైన ఓ భార్య తన పేరును అంబైగా మార్చుకొని రాయడం మొదలు పెడుతుందని, అదే తనకు స్ఫూర్తినిచ్చి కలం పేరును అంబైగా మార్చుకున్నానని తెలిపారు.
సాహితీ కార్యకర్త
సి.ఎస్.లక్ష్మి కేవలం రాయడమే కాదు చాలా సాహితీ కార్యక్రమాలు చేస్తారు. తమిళంలో మహిళా సాహిత్యం గురించి ఆమె చేసిన పరిశోధన ముఖ్యమైనది. 1994లో చెన్నైలో స్థాపించిన రోజ ముత్తయ్య రీసెర్చ్ లైబ్రరీ ఏర్పాటు వెనుక అంబై కీలకంగా నిలిచారు. ప్రపంచంలోని అతి పెద్ద ప్రైవేటు లైబ్రరీల్లో ఇదీ ఒకటి కావడం విశేషం. ప్రస్తుతం ఇక్కడ మూడు లక్షల పుస్తకాల దాకా ఉన్నాయి. అలాగే 1988లో SPARROW (Sound and Picture Archives for Research on Women) అనే ఎన్జీవో ప్రారంభించారు. మహిళా రచయితలు, మహిళా కళాకారుల రచనలు, ప్రతిభ, వారి కృషిని డాక్యుమెంట్ చేయడం, నిక్షిప్తం చేయడం ఆ సంస్థ లక్ష్యం. ప్రస్తుతం ఆమె ఆ సంస్థకు అధ్యక్షురాలిగా ఉన్నారు. తన సంస్థ తరఫున అనేక పుస్తకాలు ప్రచురించారు.
Comments
Please login to add a commentAdd a comment