Sahitya Akademi Award
-
ప్రముఖ రచయిత పెనుగొండ లక్ష్మీనారాయణకు వైఎస్ జగన్ అభినందనలు
-
పెనుగొండ.. మట్టి నుంచి ఎదిగిన మాణిక్యం: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: ప్రముఖ రచయిత పెనుగొండ లక్ష్మీనారాయణకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆయనకు అభినందనలు తెలిపారు.గుంటూరులో న్యాయవాదిగా పని చేస్తూ, అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షుడిగా కూడా ఎన్నికయ్యారని, ఆ బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. సాహితీ విమర్శ కేటగిరీలో తన రచనకు జాతీయ సాహిత్య అకాడమీ అవార్డు దక్కించుకోవడం స్ఫూర్తిదాయకమని జగన్ అన్నారు.1972లో సమిథ అనే కవితతో తన సాహితీ ప్రస్థానాన్ని ప్రారంభించిన లక్ష్మీనారాయణ మట్టి నుంచి ఎదిగిన మాణిక్యంగా ప్రశంసించారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కించుకున్న లక్ష్మీనారాయణకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు తన సందేశంలో జగన్ పేర్కొన్నారు.పెనుగొండ లక్ష్మీనారాయణకు ‘దీపిక అభ్యుదయ వ్యాస సంపుటి’కిగాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. ఆయన ప్రస్తుతం గుంటూరులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. 1972లో సమిధ అనే కవితతో తన సాహితీ ప్రస్థానం ప్రారంభించారు. అదే ఏడాది.. అభ్యుదయ రచయితల సంఘం కార్యకర్తగా జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పలు బాధ్యతలు నిర్వహించి, 2023లో జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి తెలుగు సాహితీవేత్తగా గుర్తింపు పొందారు. -
నా జీవితం.. ‘అందమైన పూలతోట’ కాదు
తెనాలి: ‘నా జీవితం అందమైన పూలతోట కాదు.. జీవనం కోసం ఎన్నెన్నో చిరుద్యోగాలు చేశాను. అన్నింటిలోను అత్తెసరు సంపాదనే. చివరకు రచనా వ్యాసంగమే బాలసాహిత్య ప్రపంచంలో నిలబెట్టింది. గుర్తింపువచ్చాక వెనుదిరిగి చూసుకోలేదు. కథలు, నవలికలు, నవలలు, టెలీఫిలింస్తో బిజీ అయ్యాను. కమ్యూనిస్టు నేపథ్యం ఉండటంతో కమర్షియల్ కాదలచుకోలేదు. సీరియస్ సాహిత్యాన్నే చేశాను. సామాజిక సమస్యలతో కూడిన ఇతివృత్తాలతోనే సాహిత్య సృజన చేశాను. ఇప్పుడీ అవార్డుకు ఎంపికవటం సంతోషంగా ఉంది..’ కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య అవార్డుకు ఎంపికైన ప్రముఖ బాలసాహితీవేత్త, నవలా రచయిత, కాలమిస్ట్, టెలీఫిలింస్ కథ, మాటలు, స్క్రీన్‌ప్లే రచయిత పి.చంద్రశేఖర ఆజాద్ స్పందన ఇది. అవార్డు వచ్చిన నేపథ్యంలో ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. చంద్రశేఖర అజాద్ స్వస్థలం ఉమ్మడి గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండల గ్రామం వెల్లటూరు. 1955 మే 24న జన్మించారు. తండ్రి పమిడిముక్కల లక్ష్మణరావు. అప్పట్లో కమ్యూనిస్టు యోధుడు. తెలంగాణ పోరాటంలో పాల్గొని జైలుకెళ్లారు. కొడుక్కి స్వాతంత్య్రయోధుడు చంద్రశేఖర అజాద్ పేరు పెట్టారు. అజాద్‌కు ఏడేళ్ల వయసులోనే ఆయన మరణించారు. గుంటూరులోని సీపీఎం కార్యాలయం ఆయన పేరుతోనే ఉంటుంది. రేపల్లెలో ఇంటర్ వరకు చదివిన అజాద్.. ఆ మరుసటిరోజే తెనాలిలోని బావగారి హోటల్లో పనికి కుదిరాడు. ఏ ఉద్యోగంలోను ఎక్కువకాలం చేయలేదు. నవభారత్ టొబాకోలో కొంతకాలం, తర్వాత మరికొన్నింటిలో పనిచేశారు. అపరాధ పరిశోధన.. నిలబెట్టింది ఏదో ఒక ఉద్యోగం చేస్తూనే తనలోని భావాలను అక్షరాల్లోకి మార్చే ప్రయత్నం చేశారు అజాద్. వాటిని అప్పటి దినపత్రికలకు పంపేవారు. ఆరోజుల్లో ‘అపరాధ పరిశోధన’ మాసపత్రిక వచ్చేది. తన కథలు, నవలికలు పంపుతుండేవారు. ‘ఆ పుస్తకమే తనను రచయితగా నిలబెట్టింది..’ అని అజాద్ గుర్తుచేసుకున్నారు. ‘ఆ పత్రికకు 16–17 నవలికలు, 40కి పైగా కథలు రాశాను. అప్పటో్లనే కథకు రూ.75, నవలికకు రూ.125 నుంచి రూ.150 చొప్పున ఇచ్చేవారు. చేసే ఉద్యోగంతో నెలకు రూ.180 వరకు వచ్చేవి. అమ్మ విజయలక్ష్మి వాళ్లంతా తెనాల్లో ఉండేవారు. ఆ డబ్బులు తీసుకుని అమ్మను చూడ్డానికి వెళే్లవాడిని..’ అని చెప్పారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ ట్రేడింగ్ కార్పొరేషన్లో చేరారు. రోజుకు రూ.10 వేతనం. సెలవులొస్తే అది కూడా ఉండేది కాదు. 1974లో పెళ్లయింది. భార్య, ఇద్దరు పిల్లలు. 1982 వరకు నెలకొచ్చే వేతనం ఏనాడు రూ.180కి మించలేదు. అందమైన పూలతోటకు మొదటి బహుమతి 1983లో ఒక దినపత్రిక ఆధ్వర్యంలో నడుస్తున్న బాలల మాసపత్రిక బాలల నవలల పోటీని ప్రకటించింది. ‘అందమైన పూలతోట’ అనే నవలను రాసి పంపారు. తెలుగు బాలసాహిత్యంలో ఒక ప్రయోగాత్మకమైన ఆ నవలకు ప్రథమ బహుమతి, ఆరుద్ర భార్య రామలక్ష్మి రాసిన నవలకు ద్వితీయ బహుమతి వచ్చాయి. ‘మహదానందం కలగటమే కాదు.. ఆ నవలతో నా జీవితం మలుపు తిరిగింది..’ అన్నారు అజాద్. ‘అప్పటికే యండమూరి వీరేంద్రనాథ్, యద్దనపూడి సులోచనారాణి వంటి రచయితలు సాహితీ ప్రపంచాన్ని ఏలుతున్నారు. నాలాంటి వర్ధమాన రచయితలకు ఖాళీలేదని అర్థమైంది. బాలసాహిత్యంలో అవకాశం ఉందనిపించటంతో అప్పట్నుంచి పిల్లలకోసం అంకితమయ్యాను..’ అంటారు అజాద్. విజయవాడ నుంచి వెలువడే ‘స్వాతి’ మాసపత్రికలో అవకాశమిచ్చారు. ‘మా హృదయం’ పేరుతో పదేళ్లలోపు పిల్లలకు అమ్మ, నాన్నతో మొదలుకొని వారికి సంబంధించిన మొత్తం 50 అంశాలను వారి భాషలో రాసిన సీరియల్‌కు కూడా మంచి గుర్తింపు లభించింది. స్వాతి మాసపత్రికల్లో ఆ సీరియల్ ఆఖరిది. అప్పట్నుంచి రచనలు వేగం పుంజుకున్నాయి. కట్‌చేస్తే.. ఇప్పటికి 85 నవలలు, 17 నవలికలు, 850కి పైగా కథలు రాశారు. కమ్యూనిస్టు నేపథ్యం కావటంతో సీరియస్ సాహిత్యమే చేశానంటారు అజాద్. సామాజిక అంశాలకు సంబంధించిన ఏదో ఒక సమస్యను చర్చించినవే అన్నీ. వందకుపైగా కథలు, 30కి పైగా నవలలు వివిధ బహుమతులు గెల్చుకున్నాయి. తెలిమబ్బుల ఛాయ, మనోప్రస్థానం, నగరంలో వెన్నెల నవలలకు వరుసగా మూడేళ్లు ఆటా, తానా బహుమతులు లభించాయి. విపరీత వ్యక్తులు, అహానికి రంగుండదు, ముక్తిపర్వం, దేవుడొచ్చాడు నవలలు కూడా గుర్తింపు పొందాయి. పిల్లల ప్రపంచం, నాన్నకో ఉత్తరం, మూడ్స్, ఎక్స్ప్రెషన్స్, ఇంప్రెషన్స్ పేరుతో దినపత్రికల్లో రాసిన కాలమ్స్ ప్రజాదరణ పొందాయి. గతంలో ఆంధ్రభూమి దినపత్రికలో వచ్చిన ‘నగరంలో వెన్నెల’ ఇప్పుడో సాహిత్య మాసపత్రికల్లో సీరియల్‌గా ఆరంభమైందని తెలిపారు అజాద్. ఆకర్షించిన బుల్లితెర మరోవైపు బుల్లితెర రంగం కూడా అజాద్‌ను ఆకర్షించింది. దూరదర్శన్‌లో ‘జీవనతీరాలు’ సీరియల్‌తో ఆరంభించి, రాధామధు, లయ, అడగక ఇచ్చిన మనసు, ఎదురీత సీరియల్స్‌తో మొత్తం ఐదువేల ఎపిసోడ్లకు రచనా సహకారం అందించారు. సామాజిక, మానవ భావోద్వేగాలకు సంబంధించిన అన్నిరకాల సమస్యలను చర్చించారు. అజాద్ రచనా సహకారం అందించిన పాండవులు, అడవిపూలు, బోన్సాయ్, తమసోమా టెలీఫిలింస్కు మూడు స్వర్ణాలు, వెండి నంది వచ్చాయి. అడవిపూలు టెలీఫిలింకు కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలకుగాను వ్యక్తిగతంగా నంది బహుమతిని స్వీకరించారు. సరదా కోసం కొన్ని టెలీఫిలింస్, టీవీ సీరియల్స్‌లోను ఆయన నటించారు. ఉపాధికోసం గుంటూరు, ఒంగోలు, ఏలూరు, రాజమండ్రిలో ఉన్నపుడు కొన్ని సాంస్కృతిక సంస్థల నిర్వహణలోను పనిచేసిన ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. -
పతంజలి శాస్త్రికి సాహిత్య అకాడమీ పురస్కారం
సాక్షి, హైదరాబాద్/పిఠాపురం: సుప్రసిద్ధ తెలుగు రచయిత తల్లావఝల పతంజలి శాస్త్రికి 2023 సంవత్సరానికిగాను సాహిత్య అకాడమీ పురస్కారం దక్కింది. ఆయన రాసిన ‘రామేశ్వరం కాకులు’ కథా సంపుటికి ఈ పురస్కారం ప్రకటించారు. బేతవోలు రామబ్రహ్మం, పాపినేని శివశంకర్, దార్ల వెంకటేశ్వరరావు జ్యూరీగా వ్యవహరించారు. బుధవారం న్యూఢిల్లీలో జరిగిన పత్రికా సమావేశంలో 24 భారతీయ భాషల పురస్కార గ్రహీతలను ప్రకటించారు. ఈసారి కేవలం 5 భాషల్లో కథా సంపుటాలు అవార్డులు గెలుచుకోగా వాటిలో ఒకటి తెలుగు సంపుటి కావడం గమనార్హం. ఎక్కువ భాషల్లో కవిత్వానికే అకాడమీ పురస్కారం మొగ్గు చూపింది. పిఠాపురంలో జననం.. రాజమహేంద్రవరంలో చిరకాలంగా జీవనం 1945 మే 14న పిఠాపురంలో జన్మించిన తల్లావఝల పతంజలి శాస్త్రి బాల్యం, కాలేజీ జీవితం అంతా ఒంగోలులోనే గడిచింది. తల్లి మహాలక్ష్మి, తండ్రి కృత్తివాస తీర్థులు. పతంజలి శాస్త్రి ఇరువైపుల తాతగార్లు తల్లావఝల శివశంకర శాస్త్రి, మొక్కపాటి నరసింహశాస్త్రి సాహిత్య రంగంలో లబ్ధ ప్రతిష్ఠులు. ఎస్.వి.యూనివర్సిటీలో ఎం.ఏ చేసిన పతంజలి శాస్త్రి పూణె నుంచి ఆర్కియాలజీలో పీహెచ్డీ చేశారు. అమలాపురం కాలేజీలో హిస్టరీ లెక్చరర్‌గా పని చేసి.. ఆ తర్వాత ‘ఎన్విరాన్మెంట్ సెంటర్’స్థాపించి పర్యావరణ రంగంలో కృషి చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మడ అడవుల రక్షణ కోసం చాలా పోరాడారు. అమెరికా, ఇజ్రాయిల్ దేశాలలో పర్యావరణ కార్యకర్తగా సదస్సులకు హాజరయ్యారు. దక్షిణ భారతదేశ చరిత్ర మీద, దేవాలయాల వాస్తు మీద పతంజలి శాస్త్రికి విశేష పరిజ్ఞానం ఉంది. భార్య విజయలక్ష్మితో రాజమండ్రిలో చిరకాలంగా జీవనం గడుపుతున్నారు. కుమారుడు శశి, కుమార్తె గాయత్రి. అర్ధ శతాబ్దానికి పైగా కథారచయితగా.. ప్రత్యేక కథాశైలితో ప్రతిష్ట 1960ల నుంచి కథలు రాస్తున్న పతంజలి శాస్త్రిది తెలుగులో ప్రత్యేక శైలి. తేటతెల్లంగా కథావస్తువును బయల్పరచకుండా పాఠకుడి మేధ కొద్దీ అర్థం చేసుకునే విషయాలను ఇమడ్చుతారు ఆయన. నిర్దిష్టమైన సాంస్కృతిక నేపథ్యంతో కాకుండా సార్వజనీనమైన మానవ ప్రవర్తనలతో కథను చెప్పడం ఆయన ధోరణిలో కనిపిస్తుంది. జేబు దొంగలు, హోటల్ క్లీనర్లు, ఐటీ ఉద్యోగాల కట్టు బానిసలు, రంగు రాళ్ల వెతుకులాటలో ప్రాణాలు కోల్పోయే వాళ్లు, వేశ్యలు, గారడీల వాళ్లు పాత్రలుగా ఆయన కథల్లో కనిపిస్తారు. ‘వడ్ల చిలుకలు’, ‘పతంజలి శాస్త్రి కథలు’, ‘నలుపెరుపు’, ‘రామేశ్వరం కాకులు’ పతంజలి శాస్త్రి కథాసంపుటాలు కాగా ‘హోరు’, ‘దేవర కోటేశు’, ‘గేద మీద పిట్ట’నవలలు. వీటిలో ‘గేద మీద పిట్ట’ముఖ్య వస్తువు ‘మగ వేశ్యలు’కావడం ఒక ప్రత్యేకత. ‘మాధవి’అనే నాటకం రాశారు. గాథాసప్తశతిలోని వంద కథల్ని తెలుగులోకి అనువదించారు. ‘నేను నడుస్తున్నా, బస్సులో ఉన్నా, ఏం చేస్తున్నా మనసులో ఏదో కథ రాస్తూనే ఉంటాను’అని చెప్పే పతంజలి శాస్త్రి అలుపెరగక రాస్తూనే ఉన్నారు. పతంజలి శాస్త్రికి సాహిత్య అకాడమీ పురస్కారం రావడం పట్ల పలువులు సాహితీవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. సాహిత్యం నా జీవితం నా సాహిత్య వ్యాసంగం గుర్తింపు కోసమో, పురస్కారాల కోసమో కాదు. పర్యావరణం, సాహిత్యం నా జీవితం.. నా రచన. ‘రామేశ్వరం కాకులు’ దేశంలోనే గౌరవప్రదమైన కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకోవడం సంతోషం. అధ్యయనం, అనుశీలనం నా ధ్యేయాలు.. ఇంకా రాస్తూనే ఉంటాను. -తల్లావఝల పతంజలి శాస్త్రి, రాజమహేంద్రవరం -
నీ కోసం కథలు రాసి
‘ఇంటి మూలన వంట గది’ ‘అడవిలో హరిణి’ ‘సంధ్య వెలుతురు’... సి.ఎస్.లక్ష్మి అనే చిత్తూరు సుబ్రహ్మణ్యం లక్ష్మి కథల సంపుటాల పేర్లు ఇవి. ‘అంబై’ కలం పేరుతో తమిళంలో స్త్రీల పారంపరిక బంధనాలను ప్రశ్నించే కథలు రాస్తున్న సి.ఎస్.లక్ష్మికి ప్రతిష్టాత్మక ‘టాటా లిటరేచర్ లైఫ్‌టైమ్ అవార్డు’ ఈ సంవత్సరానికి ప్రకటించారు. ‘స్పారో’ అనే సంస్థను స్థాపించి మహిళా సాహిత్యకారుల చరిత్రను నిక్షిప్తం చేస్తున్న లక్ష్మి పరిచయం... ఆలోచనలు... ‘నన్ను మహిళా రచయిత అని ప్రత్యేకంగా పిలవొద్దు. పురుషులు ఏం రాసినా వారిని పురుష రచయిత అంటున్నారా? మమ్మల్ని మాత్రం మహిళా రచయితలు అనడం ఎందుకు? మమ్మల్ని కూడా రచయితలు అనే పిలవండి’ అంటారు సి.ఎస్.లక్ష్మి. ‘అంబై’ కలం పేరుతో తమిళ పాఠకులకు సుదీర్ఘకాలంగా అభిమాన రచయిత్రిగా ఉన్న సి.ఎస్.లక్ష్మి ఒకటీ రెండు నవలలు రాసినా ఎక్కువగా అంకితమైంది కథలకే. అదీ స్త్రీల కథలకి. తమిళంలో స్త్రీవాద దృక్పథంతో రాసి ఒక కదలిక తేగలిగిన రచయితల్లో సి.ఎస్.లక్ష్మి ప్రముఖులు. సుదీర్ఘ కాలంగా తాను ఆశించిన స్త్రీ వికాసం కోసం కలాన్ని అంకితం చేయడం వల్లే ఆమెకు ‘టాటా లిటరేచర్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు’ 2023 సంవత్సరానికి ప్రకటించారు. టాటా సన్స్ ప్రతినిధి హరీష్ భట్ ఈ విషయాన్ని తెలియచేస్తూ ‘స్త్రీలు తాము మోయక తప్పని మూసలను లక్ష్మి తన కథల ద్వారా బద్దలు కొడుతూనే వచ్చారు’ అని వ్యాఖ్యానించారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డును గతంలో అందుకున్న వారిలో వి.ఎస్.నైపాల్, మహాశ్వేతా దేవి, రస్కిన్ బాండ్, గిరిష్ కర్నాడ్ తదితరులు ఉన్నారు. ఊరు కోయంబత్తూరు కోయంబత్తూరులో జన్మించిన అంబై ఢిల్లీలోని జె.ఎన్.యు నుంచి పిహెచ్.డి పట్టా పొందారు. తమిళనాడులో అధ్యాపకురాలిగా పని చేస్తూ కథలు రాశారు. డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ విష్ణు మాథూర్‌ని వివాహం చేసుకుని తర్వాతి కాలంలో ముంబైలో స్థిరపడ్డారు. 18 ఏళ్ల వయసులో తొలిసారి పిల్లల కోసం ‘నందిమలై చరలిలె’ (నందిమల కొండల్లో) అనే డిటెక్టివ్ నవలతో ఆమె రచనా జీవితం మొదలైనా 1967లో రాసిన ‘సిరగుగల్ మురియుమ్’(రెక్కలు విరిగిపోతాయి) అనే కథతో సిసలైన బాట పట్టారు. స్త్రీ స్వేచ్ఛ, సమానత్వం, స్త్రీవాద దృక్పథం గురించి తమిళంలో తొలిసారి గొంతు విప్పిన రచయిత్రి ఆమేనని విమర్శకులు అంటారు. సంప్రదాయం, ఆచారాలు మహిళల్ని ప్రత్యక్షంగా పరోక్షంగా అణచివేస్తున్నాయో ఆమె తన కథల్లో వివరించే ప్రయత్నం చేశారు. తప్పక చదవాల్సిన తమిళ కథల్లో అంబై రాసిన ‘వీట్టిన్ మూలై ఒరు సమేలరై’, ‘అమ్మా ఒరు కొలై సెయ్దల్’, ‘కరుప్పు కుదిరై చతుక్కుమ్’ కథలు ఉంటాయని రచయిత జయమోహన్ పేర్కొన్నారు. 2021లో అంబైకు సాహిత్య అకాడెమీ పురస్కారం దక్కింది. కలం పేరు వెనుక కథ తన కలం పేరు ‘అంబై’గా మార్చుకోవడానికి వెనకున్న కథను గతంలో వెల్లడించారామె. శుక్రవారం పుట్టే ఆడపిల్లలకు ‘లక్ష్మి’ అనే పేరు పెడతారని, తనకూ అదే పేరు పెడితే ఆ పేరుతోనే కథలు రాయాలపించలేదని చెప్పారు. తమిళ సీనియర్ రచయిత దేవన్ రాసిన ‘పార్వతిన్ సంగల్పం (పార్వతి సంకల్పం)’ నవలలో భర్త చేత అణచివేతకు గురైన ఓ భార్య తన పేరును అంబైగా మార్చుకొని రాయడం మొదలు పెడుతుందని, అదే తనకు స్ఫూర్తినిచ్చి కలం పేరును అంబైగా మార్చుకున్నానని తెలిపారు. సాహితీ కార్యకర్త సి.ఎస్.లక్ష్మి కేవలం రాయడమే కాదు చాలా సాహితీ కార్యక్రమాలు చేస్తారు. తమిళంలో మహిళా సాహిత్యం గురించి ఆమె చేసిన పరిశోధన ముఖ్యమైనది. 1994లో చెన్నైలో స్థాపించిన రోజ ముత్తయ్య రీసెర్చ్ లైబ్రరీ ఏర్పాటు వెనుక అంబై కీలకంగా నిలిచారు. ప్రపంచంలోని అతి పెద్ద ప్రైవేటు లైబ్రరీల్లో ఇదీ ఒకటి కావడం విశేషం. ప్రస్తుతం ఇక్కడ మూడు లక్షల పుస్తకాల దాకా ఉన్నాయి. అలాగే 1988లో SPARROW (Sound and Picture Archives for Research on Women) అనే ఎన్జీవో ప్రారంభించారు. మహిళా రచయితలు, మహిళా కళాకారుల రచనలు, ప్రతిభ, వారి కృషిని డాక్యుమెంట్ చేయడం, నిక్షిప్తం చేయడం ఆ సంస్థ లక్ష్యం. ప్రస్తుతం ఆమె ఆ సంస్థకు అధ్యక్షురాలిగా ఉన్నారు. తన సంస్థ తరఫున అనేక పుస్తకాలు ప్రచురించారు. -
జాతీయస్థాయిలో అవార్డు గ్రహీత.. ఆమెపై అత్యాచారం.. చివరకు..
సాక్షి, న్యూఢిల్లీ: ఆయన జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రచయిత. ఆయన రచనలకు గుర్తింపుగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా సొంతం చేసుకున్నారు. కానీ ఇందంత ఒకవైపు.. మరోవైపు మాత్రం అతను ఓ యువతి జీవితాన్ని నాశనం చేశాడు. అతడు తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు పోలీసులను ఆశ్రయించడం కలకలం సృష్టించింది. వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు చెందిన మహిళ(32) .. ఢిల్లీలోని తిమ్మార్‌పూర్ పోలీసులను ఆశ్రయించింది. ఢిల్లీకి చెందిన కేంద్ర సాహిత్య అకాడమీ గ్రహీత తనపై అత్యాచారం చేశాడని ఆరోపించింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను యూపీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నట్టు తెలిపింది. ఈ క్రమంలో పదేళ్ల క్రితం సోషల్ మీడియాలో ద్వారా అతడితో పరిచయం ఏర్పడిందని, అనంతరం వారద్దరూ ప్రేమించున్నట్టు పేర్కొంది. 2013లో తనకు కంటి నొప్పి రావడంతో ఎయిమ్స్ చికిత్స చేపించుకుని తిరిగి వచ్చేసరికి ఆలస్యమైందని తెలిపింది. లేట్ అయినందుకు అతను కోపంతో తనను తీవ్రంగా కొట్టాడని, ఓ వైపు తాను ఏడుస్తున్నా తనపై అత్యాచారం చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా, తర్వాత రోజు అతను తన వద్దకు వచ్చి పెళ్లి చేసుకుంటానని చెప్పినట్టు పేర్కొంది. ఇలా పెళ్లి పేరుతో అతడు తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని వాపోయింది. ఇదిలా ఉండగా.. ఇటీవలే నిందితుడి ఫోన్‌ను బాధితురాలు చెక్ చేయగా అతడికి మరికొంతమంది మహిళలతో సంబంధం ఉన్నట్టు గుర్తించానని పేర్కొంది. దీంతో పోలీసులను ఆశ్రయించినట్టు చెప్పుకొచ్చింది. ఇది కూడా చదవండి: ఆర్డర్ చేసిన ఫుడ్‌లో పాము చర్మం...షాక్‌లో కస్టమర్ -
గోరటికి సాహిత్య అకాడమీ అవార్డు ప్రదానం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రసిద్ధ తెలుగు కవి, గేయకర్త, గాయకుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. ఢిల్లీలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో అకాడమీ అధ్యక్షుడు చంద్రశేఖర్, గోరటికి పురస్కారాన్ని అందజేశారు. దేశవ్యాప్తంగా వివిధ భాషల్లోని 24మంది రచయితలకు కేంద్ర సాహిత్య అకాడమీ 2021 సంవత్సరానికి గాను అవార్డులు అందించింది. గ్రహీతలకు లక్ష రూపాయల ప్రైజ్ మనీతో పాటు జ్ఞాపికను అందించారు. నాగర్ కర్నూల్ జిల్లా గౌరారం గ్రామంలో 1965 నవంబరులో జన్మించిన గోరటి వెంకన్న అనేక పాటలు రాసి, పాడటంతో పాటు ‘ఏకునాదం మోత’, ‘రేలపూతలు’, ‘అలసెంద్ర వంక’, ‘పూసిన పున్నమి’, ‘వల్లంకితాళం’ వంటి కవితా సంపుటాలను రచించారు. గోరటి 2006లో కళారత్న (హంస) పురస్కారం, 2016లో కాళోజీ నారాయణరావు పురస్కారంతోపాటు మరెన్నో అవార్డులను అందుకున్నారు. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణను కలిసిన గోరటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను గోరటి వెంకన్న మర్యాదపూర్వకంగా కలిశారు. తన ‘వల్లంకి తాళం’ కవితా సంపుటి పుస్తకాన్ని ఆయనకు అందజేశారు. అవార్డు అందుకున్న సందర్భంగా గోరటి ని జస్టిస్ ఎన్వీ రమణ పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువాతో సన్మానించారు. అనంతరం సీజేఐ అభ్యర్థన మేరకు గోరటి ‘అడవి తల్లి’పై పాట పాడి వినిపించారు. -
ఎక్కడి నుంచో రేగు పండ్ల వాసన.. ఆధునిక, వైజ్ఞానిక మేళవింపు
సాక్షి, మాడ్గుల: తగుళ్ల ఎల్లమ్మ, కృష్ణయ్య దంపతుల కుమారుడు తగుళ్ల గోపాల్ ప్రస్తుతం నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం అజిలాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఎస్జీటీ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ఎంఏ తెలుగు పూర్తి చేసి పరిశోధన ప్రయత్నాల్లో ఉన్నారు. ఆయన రాసిన ‘దండ కడియం’ కవితా సంపుటి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్‌కు ఎంపిక కావడంతో అటు స్వగ్రామం రంగారెడ్డి జిల్లా కలకొండలో, ఇటు అజిలాపూర్‌లో హర్షం వ్యక్తమవుతోంది. ‘‘ఎక్కడి నుంచో రేగుపండ్ల వాసన.. వచ్చేది మా హంస అక్క అయి ఉంటుంది’’ అని తన కవిత్వంలో మంటల్లో చనిపోయిన అక్క హంసమ్మను బతికించుకొనే ప్రయత్నం చేశారు గోపాల్. ‘తీరొక్క పువ్వు’ అనే పుస్తకాన్ని కూడా రచించారు. రాష్ట్ర సాహితీ యువ పురస్కార్, మహబూబ్‌నగర్ సాహితీ అవార్డు, రాయలసీమ సాహితీ పురస్కార్, రొట్టెమాకురేవు సాహితీ అవార్డు అందుకున్నారు. నా గ్రామమే నాకు స్ఫూర్తి మా ఊరు కలకొండలో నేను చవిచూసిన జ్ఞాపకాలు, పల్లెటూరి ప్రజల కష్టసుఖాలు, శ్రామికుల జీవన విధానాలే ‘దండ కడియం’ రాయడానికి స్ఫూర్తి. దండ కడియంలో ఓ పల్లెటూరి పిల్లోడి జీవనవిధానం ప్రతిబింబించేలా అక్షర రూపం ఇచ్చాను. ఇది నా ఆత్మకథ. – తగుళ్ల గోపాల్ దేవరాజు ‘నేను అంటే ఎవరు’ సాక్షిప్రతినిధి, వరంగల్: ఆధునిక, వైజ్ఞానిక పరమైన అంశాలను ఓ తాత ఇద్దరు పిల్లలకు వివరించేదే డాక్టర్ దేవరాజు మహారాజు రాసిన ‘నేను అంటే ఎవరు’. ఒక తాతను పిల్లలు అడుగుతుంటే.. ‘ఆధ్యాత్మికత, దేవుడు, దయ్యం కాదు...నిన్ను నీవు తెలుసుకోడానికి నీ శరీరం జీవ కణాలతో ఎలా ఏర్పడింది ?హృదయం, మెదడు ఎలా ఏర్పడ్డాయి ? మనసు అనేది ఎక్కడా ఉండదు. అది మెదడులోనే ఒక భాగం’.. అంటూ అనేక సున్నిత, వాస్తవమైన అంశాలను ఇందులో వివరించారు. దేవరాజు 1951 ఫిబ్రవరి 21న వరంగల్ జిల్లా (జనగామ తాలూకా) కోడూరులో జన్మించారు. 1972లో హనుమకొండ కాకతీయ యూనివర్సిటీ లోని ఓయూ పీజీ సెంటర్లో ఎమ్మెస్సీ జువాలజీ ఫస్టియర్ చదువుతుండగా.. ఉగాది సందర్భంగా ‘పాలు ఎర్రబడ్డాయి’అనే కవిత రాశారు. ఇది ఓ ప్రముఖ పత్రికలో ప్రచురితం కావడంతో ప్రాచు ర్యం పొందారు. తర్వాత తెలంగాణ మాండలికంలో రాసిన ‘గుండె గుడిసె’కు మంచి ఆదరణ లభించింది. భారతీయ వారసత్వం, సంస్కృతి, విజ్ఞాన నాగరికతలు డిగ్రీ పాఠ్య గ్రం థమే అయినా.. సంపాదకుడిగా దానిని ఐఏఎస్ స్థాయి పోటీ పరీక్షలకు పనికివచ్చే విధంగా తీర్చిదిద్దారు. రాజముద్ర, మధుశాల, నీకూ నాకూ మధ్య ఓ రంగుల నది.. ఇలా 85కి పైగా రచనలు చేశారు. గౌరవాలు.. గాయపడ్డ ఉదయం వచన కవితకు తెలుగు విశ్వవిద్యాలయ ప్రధాన అవార్డును 1991లో పొందారు. హరివంశరాయ్ బచ్చన్ కావ్యాన్ని ఆంధ్రప్రదేశ్ హిందీ ఆకాడమీ వారి సౌజన్యంతో ముద్రించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉగాది సత్కారం, తెలుగు విశ్వవిద్యాలయ కవితా పురస్కారం, దాశరథి దంపతుల సత్కారం, తొలి ఎక్స్‌రే పురస్కారం, సురమౌళి అవార్డు వంటివెన్నో అందుకున్నారు. దశాబ్ద కాలంగా నేషనల్ బుక్ ట్రస్ట్వారికి న్యూఢిల్లీ సలహా సంఘ సభ్యులుగా ఉన్నారు. -
గోరటి వెంకన్నకు సీఎం జగన్ అభినందనలు
సాక్షి,అమరావతి: కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 2021కు ఎంపికయిన ప్రసిద్ధ వాగ్గేయకారుడు, ప్రజాకవి, రచయిత, ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు సీఎం వైఎస్ జగన్ అభినందనలు తెలియజేశారు. గోరటి వెంకన్న రచించిన ‘వల్లంకి తాళం ’ కవితా సంపుటికి ఈ ఏడాది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఈ సందర్భంగా ఆయనను అభినందిస్తూ సీఎం గురువారం ట్వీట్ చేశారు. సామాన్యుడికి చేరేలా హావభావాలతోటి గ్రామీణ జానపదాలతో ఆయన ప్రజల హృదయాలు గెలిచారని, ఒక లెజెండరీగా ఎదిగారని తెలిపారు. వారి ప్రజా గేయాలు ఈనాటికీ యువకుల్లో స్ఫూర్తిని నింపుతాయని పేర్కొన్నారు. ఆయనతో పాటు యువజన, పిల్లల విభాగంలో అవార్డులు గెలుచుకున్న తగుళ్ల గోపాల్, దేవరాజ్ మహరాజ్‌కు కూడా సీఎం జగన్ అభినందనలు తెలిపారు. -
గోరటి ‘వల్లంకి తాళం’ని వరించిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ సాహిత్యం తన ప్రతిభను చాటింది. సాహితీ ప్రపంచంలో సగర్వంగా నిలబడింది. ఏకంగా మూడు ప్రతిష్టాత్మక అవార్డులు చేజిక్కించుకుంది. తెలంగాణకు చెందిన ముగ్గురు కవులను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు వరించాయి. ‘పల్లె కన్నీరు పెడుతుందో..’అంటూ ‘కుబుసం’సినిమాలోని పాటతో బహుళ ప్రజాదరణ పొందిన జానపద గాయకుడు, రచయిత, కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు –2021 దక్కింది. ఆయన రచించిన ‘వల్లంకి తాళం’అనే కవితా సంపుటికి ఈ అవార్డు లభించింది. డాక్టర్ సి.మృణాళిని, జి.శ్రీరామమూర్తి, డాక్టర్ కాత్యాయిని విద్మహేలతో కూడిన జ్యూరీ.. ఈ ఏడాది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు తెలుగు విభాగంలో ‘వల్లంకి తాళాన్ని’ఎంపిక చేసింది. కాగా కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం తగుళ్ల గోపాల్‌ను వరించింది. ‘దండ కడియం’అనే కవితా సంపుటికి గాను ఆయనకు ఈ పురస్కారం లభించింది. ఇక కేంద్ర సాహిత్య అకాడమీ బాల పురస్కారం దేవరాజు మహారాజు రచించిన ‘నేను అంటే ఎవరు?’అనే నాటకానికి దక్కింది. కేంద్ర సాహిత్య అకాడమీ మొత్తం ఏడు కవితా సంపుటిలు, రెండు నవలలు, ఐదు చిన్న కథలు, రెండు నాటకాలు, ఒకటి చొప్పున బయోగ్రఫీ, ఆటోబయోగ్రఫీ, క్రిటిసిజం, ఎపిక్ పొయిట్రీలను 2021 సాహిత్య అకాడమీ పురస్కారాలకు ఎంపిక చేసింది. గుజరాతీ, మైథిలి, మణిపురి, ఉర్దూ భాషల అవార్డులను త్వరలో ప్రకటిస్తామని అకాడమీ అధ్యక్షుడు చంద్రశేఖర్ అయ్యర్, కార్యదర్శి కె.శ్రీనివాసరావులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గోరటి వెంకన్న తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లా గౌరారం గ్రామానికి చెందిన వారు కాగా, తగుళ్ల గోపాల్ తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం కలకొండ గ్రామంలో జన్మించారు. ఇక దేవరాజు మహారాజు వరంగల్ జిల్లాకు చెందినవారు. జీవితానికి ఇది చాలు.. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఈ అవార్డు తీసుకుంటే ఈ జీవితానికి ఇది చాలు అన్నంత గొప్ప పురస్కారమిది. ఎక్కడో మారుమూల పల్లెలో పుట్టిన నేను, ఒక విధానం, సిద్ధాంతం, ఒక ఫ్రేమ్‌వర్క్‌లో ఇమిడి, వదగని నేను అదే పరంపరతో సాహిత్య కృషి కొనసాగించాను. – గోరటి వెంకన్న -
ఆధునిక అభ్యుదయ కవి తిలక్
తణుకు టౌన్: ఆధునిక తెలుగు సాహిత్యాన్ని అభ్యుదయ, భావ కవిత్వం వైపు నడిపించిన గొప్ప కవి దేవరకొండ బాలగంగాధర తిలక్ అని కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి కె.శ్రీనివాసరావు చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో సాహిత్య అకాడమీ, తిలక్ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన దేవరకొండ బాల గంగాధర్ తిలక్ శత జయంతిని పురస్కరించుకుని సాహితీ సదస్సును ఆయన ప్రారంభించారు. సదస్సుకు సాహితీ అకాడమీ, తెలుగు అడ్వైజరీ బోర్డు డైరెక్టర్ కె.శివారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ తిలక్ తన రచనల్లో భారతీయ సంస్కృతీ, సంప్రదాయాలకు పెద్దపీట వేశారని, జాతి, మత తత్వాలకతీతంగా ఆయన రచనలున్నాయని కొనియాడారు. రాష్ట్ర సెకండరీ ఎడ్యుకేషన్ కమిషనర్ వాడ్రేవు చిన వీరభద్రుడు మాట్లాడుతూ తిలక్ కవిత్వం 20వ శతాబ్దపు సాహిత్య ప్రపంచంలో ఎక్కువ జనాదరణ పొందిందన్నారు. తెలుగు సాహిత్యంలో శ్రీ శ్రీ తర్వాత అంతటి ప్రభావం చూపిన రచనలు తిలక్‌వని కొనియాడారు. నా కవిత్వంలో నేను దొరుకుతాను అని ప్రకటించుకున్న కవి తిలక్ అని, ఆయన కవిత్వానికి మధ్యవర్తులు అవసరం లేదన్నారు. ఈ సందర్భంగా ఆదికవి నన్నయ యూనివర్సిటీ తెలుగు శాఖ ఆధ్వర్యంలో తిలక్ రచనలపై ముద్రించిన పుస్తకాలను చిన వీరభద్రుడు ఆవిష్కరించారు. కార్యక్రమంలో తణుకు నన్నయ భట్టారక పీఠం అధ్యక్షుడు జేఎస్ సుబ్రహ్మణ్యం, పలువురు కవులు తదితరులు పాల్గొన్నారు. -
కథ: ఫిబ్రవరి 14.. ప్రేమా.. నీ విలువెంత..?
అదే ఘోరమైన తప్పు ఇవాళ మళ్ళీ చేశాను. అదేదో నేను కావాలని చేయలేదు. ఎవరో నా మట్టిరంగు శరీరంలో ఉండి, ఆ క్షణంలో నా సమస్తాన్నీ తమ అధీనంలోకి తీసుకుని, వాళ్ళే నా రక్షకులైనట్టు, నా జీవితాన్ని చైతన్యవంతం చేసే ఉత్ప్రేరకాలు అయినట్టు, నా ఆత్మను వెలిగించే దైవత్వం ఏదో వాళ్లలో నిండి ఉన్నట్టు ఆ క్షణంలో కళ్ళు మూసుకునిపోయి చేయడం వలన ఇప్పుడు ఒంటరిగా మిగిలాను. ఆ తప్పిదం వలన నా కలలన్నీ నీటి బుడగల్లా పేలిపోయాయి. నేనొంటరిగా అలా పక్కమీద వాలిపోయాను. ఈ బాధను ఎవరితో ఎలా పంచుకోవాలి? ప్రేమలో నా అపజయాలను, నా ఓటమిని, నాతో దీర్ఘకాలం ప్రయాణం చేయలేని నా స్నేహితులను, నేను ఫ్రిజిడిటీతో బాధపడుతున్నాను అని భావించే నేను ఇష్టపడిన మగవాళ్ళను, వాళ్లు నన్ను ఎక్సయిట్ చేయలేక పడిన నిరుత్సాహాన్నీ ఎవరితో ఎలా పంచుకోను? ఈ బాధ.. కాలం గడుస్తున్న కొద్దీ నన్ను అలసటకు గురిచేయసాగింది. నిస్సందేహంగా పరిణతి చెందిన పురుషులు, మనం నివసిస్తున్న సమాజంలో తమదైన ముద్ర వేయగల పురుషులంటే నా కిష్టం అని చెప్పగలను. చాలామంది చెప్తారు.. ప్రేమకు హద్దులు లేవని. నేనూ అలాగే అంటాను. ప్రేమకు హద్దుల్లేవు అని. నన్ను నన్నుగా ప్రేమించే పురుషుడు పెళ్లయిన వాడా? పెళ్లికాని వాడా? ధనికుడా? డబ్బులేని వాడా? సామాజిక స్థాయిలో ఉన్నత, నిమ్న అంశాలు ఇవన్నీ నాకు పెద్దగా పట్టించుకోవలసిన అంశాలు కానేకావు. ఇంతా చెప్పాక నన్ను ప్రేమించే వాడు నాకు ఎంత ప్రత్యేకంగా ఉండాలని భావిస్తానో మీకు చెప్పాల్సిన పని లేదు అనుకుంటాను. అతడికి నా ప్రేమను కూడా అంతే ప్రత్యేకంగా మూటకట్టి మరీ ఇస్తాను. మేమిక్కడికి, ఈ ఫిబ్రవరి 14 సాయంత్రం పూట ఈ పండుగ వాతావరణాన్ని సంపూర్తిగా హృదయంలో నింపుకోవడానికి వచ్చాము. ఈ పూట మా ప్రేమ ప్రయాణంలో ఏ అవరోధమూ, ఆటంకమూ లేకుండా సాయంత్రమంతా గడపడానికి ఈ స్థలాన్ని ప్రత్యేకంగా ఎంచుకున్నాము. ఈ మూడు నక్షత్రాల హోటల్ టెర్రస్ మీద కూర్చుని చూస్తుంటే ఈ ప్రపంచం ఎంత బావున్నది? కొన్ని వేల నియాన్ దీపాలు వెదజల్లుతున్న కాంతిలో చీకటి రాత్రి అన్ని వైపుల నుండీ పువ్వులు వెదజల్లుతున్న పరిమళాలతో సౌందర్య భరితంగా కనిపిస్తున్నది. మనోల్లాసకరమైన మంద్ర సంగీతానికి అంతే మంద్రంగా నాట్యం చేస్తున్న యువతీ యువకులు. ప్రతి యువతీ ఒక రాజకుమారిలాగా, ప్రతి యువకుడూ ఒక రాకుమారుడిలాగా కనిపిస్తూ వాతావరణంలో ఒక ప్రేమ రాజసాన్ని నింపుతున్నారు. బయట వాలంటైన్ డే సెలబ్రేషన్స్ జరుపుకోవడానికి కొన్ని సమూహాల నుండి తీవ్రమైన వ్యతిరేకత వుంది. ప్రేమికులు కనిపిస్తే చాలు బలవంతంగా తీసుకుని వెళ్లి తాళి కట్టించే సమూహాల నుండి దూరంగా, ఏ ఆటంకమూ లేని ఈ ప్రదేశంలో అతడితో నా బంధం మొదలుకావడానికి ఇదొక అద్భుతమైన, అందమైన సమయం. దేశపు తూర్పు ప్రాంతంలో ఇది వసంత సమయం. అవును నా జీవితంలో కూడా ఇది వసంత సమయమే. అతడు చాలా ఫార్మల్ సూట్లో ఎర్ర టై కట్టుకుని, కోట్ ముందు గుండీలు పెట్టుకునే బొత్తాంలో ఎర్రగులాబీ తురుముకుని ఒక అరిస్టోక్రాట్లాగా వచ్చాడు. తన జీవితంలో దుష్ట గ్రహాలు కలుగచేసే దుష్ట ప్రభావాలను తొలగించడానికి మూడువేళ్ళకు మూడు రంగురాళ్ల ఉంగరాలు ధరించి వచ్చాడు. నన్ను చూడగానే అతడి మొహంలో ఒక చిన్న ఆశాభంగం కనిపించింది. బహుశా నేను ప్రత్యేకంగా తన కోసమే తయారై ట్రెండీగా వస్తానని ఊహించి ఉంటాడు. అతడలా ఎందుకు ఊహించాడో నాకు తెలియదు.. కానీ అలంకరణ విషయంలో నేను చాలా పొదుపు. మా అమ్మ లాగా, ఇతర ఆడవాళ్ళలాగా నేను గంటల తరబడి అద్దం ముందు గడపను. ఈ క్షణాన నేను ఎర్రగులాబీ రంగు చీర కట్టుకుని వున్నాను. మేడలో చిన్న లాకెట్. ఎప్పటిలాగే జుట్టు లూజుగా వదిలివేశా. కొంచెంగా నాకు ఇష్టమైన ఫ్రెంచ్ పెర్ఫ్యూమ్ అద్దుకున్నా . చెవులకు చిన్న జూకాలు. ప్రత్యేకమైన సందర్భాల కోసం ప్రత్యేకంగా తయారవడం కన్నా ఇలా సింపుల్‌గా ఉండటమే నా కిష్టం. నా ప్రేమను చాలా డాంబికంగా ప్రదర్శించే శక్తిని ఆ సమయంలో నాలో వున్నదో లేదో నాకు తెలియదు. ‘నువ్వు చాలా అందంగా, ప్రత్యేకంగా, ఈ ప్రపంచం మొత్తం మీద అత్యంత ఆకర్షణీయమైన స్త్రీలా కనిపిస్తున్నావు. కానీ ఎందుకింత సింపుల్‌గా డ్రెస్ చేసుకున్నావు?’ మెరిసే కళ్ళతో అతడు అడిగిన ప్రశ్నకు నేను నవ్వి ఊరుకున్నాను. మా టేబుల్‌కి కాస్త దూరంలో మరొక టేబుల్ దగ్గర ఒక జంట తమ ఇద్దరు పిల్లలతో కూర్చుని వుంది. ఇద్దరు పిల్లల్లో ఒకరికి ఆరు.. మరొకరికి ఎనిమిదేళ్ళు వుంటాయేమో! పిల్లలు ఇద్దరూ ఫోర్క్‌లు, కత్తులతో కుస్తీ పడుతున్నారు. అతడు తరచూ ఆ పిల్లల వంక చూస్తూ నా వైపు చూస్తున్నాడు. మిగిలిన జీవితం తన వెనుక మిగల్చబోయే ఒకానొక జ్ఞాపకం గురించి అతడు పరధ్యానంలో పడి పోయాడేమో. అతడి ఆలోచన గురించి ఇప్పుడు నేను చెప్పడం కాస్త అసంబద్ధంగా ఉంటుంది. ఈ క్షణం నాది. ఈ అద్భుతమైన క్షణం నాది. ఈ పారవశ్యం నాది. ఈ క్షణం మోహంతో మొదలై ఆత్మీయతగా పరిణతి చెంది, గౌరవంగా కుదురుకుని, అనుబంధంగా పండి కలకాలం వీడలేని బంధంగా మారిపోయే పరిణామశీలతకు ఇది నాంది. అతడు లేని జీవితం అలసి సొలసి విశ్రమించిన ఎడారి! నేను ఇష్టపడి కొనుక్కున్న హైదరాబాదీ పర్సులో నుండి ఒక డార్క్ చాకోలెట్ తీసి అతడికి ఇచ్చాను. ఆ చాకోలెట్ నేను ఢిల్లీలో కొని ఈ రోజు కోసం ఫ్రిజ్‌లో దాచి వుంచాను. ఆ పింక్ కలర్ ర్యాపర్‌ను నేను తాకనైనా తాకకుండా అతడికోసమే దాచి వుంచాను. ఎవరు చెప్పారో సరిగ్గా గుర్తు లేదు కానీ జపనీస్ తమకు ఇష్టమైన పురుషులకు ఈ ప్రత్యేకమైన వాలంటైన్స్ డే రోజున చాకోలెట్స్ బహుమతిగా ఇస్తారట. సరిగ్గా నెల రోజుల తరువాత మార్చ్ 14 నాడు పురుషులు తమ స్త్రీలకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారట. అతడు ఆ పింక్ కలర్ ర్యాపర్‌ను జాగ్రత్తగా సున్నితంగా విప్పి ఒక చిన్న బిట్ మునిపంటితో కొరికి ‘రుచికరం’ అన్నాడు. వెంటనే మళ్ళీ ‘ నువ్వు నా కోసం ప్రత్యేకంగా చేదుగా, వగరుగా వుండే ఈ చాకోలెట్ కొన్నావు కదూ! నువ్వు బయటకి చాలా గట్టిగా సాధించలేని శిఖరంలా కనిపిస్తావు కానీ లోపల చాలా సున్నితం’ అన్నాడు. మేము ఒకరి చేతిలో మరొకరం చేతిని బంధించి ఉంచాము. మా చేతి వేళ్ళు ఒకదానితో మరొకటి పెనవేసుకున్నాయి. చుట్టూ జనంతో ఉత్సహంగా , ఉల్లాసంగా , సంతోష సంబరాలతో ఉద్విగ్నంగా వున్న ఆ వాతావరణంలో మాలో ఒకరిపట్ల మరొకరికి ఉన్న ప్రేమను వ్యక్తం చేయడానికి దారిదొరకలేదు మాకు. అతడు మెల్లగా ‘అందుకే మనకు కాస్త ప్రయివసీ కావాలి అన్నాను. కేవలం నువ్వు, నేను మాత్రమే ఉండగలిగే చోటు. నీ సాహచర్యాన్ని నేను మాత్రమే అనుభూతించగలిగే చోటు. ఇక్కడ ఇలా మనలని ఎవరైనా చూస్తే జరిగే పరిణామాలు నేనూహించగలను. నా బాధ నా గురించి కాదు. నీ గురించే! నీ రెప్యుటేషన్ గురించే ఆలోచిస్తున్నాను’ అన్నాడు. నన్ను మాత్రం గాలి అలలలో తేలి వస్తున్న బ్రయాన్ ఆడమ్ ‘Everything I do, I do it for you’ పాట పూర్తిగా లీనం చేసుకున్నది. అతడికి అర్థం అయ్యేట్లు నేనెలా చెప్పాలి.. ‘కొండల మీద నుండి దూకే ఒక జలపాతాన్ని నేను’ అని! శతసహస్ర రేకులుగా విచ్చుకున్న ప్రేమ కుసుమం నుండి రెక్కలన్నీ ఒక్కసారిగా రాల్చేస్తే ప్రేమను పొందడమూ, అపురూపంగా జ్ఞాపకాల వెన్నెల భరిణలో దాచుకోవడమూ, అప్పడప్పుడూ ఆ భరిణ తీసి ఆ మధుర, మంజుల ముద్ర శ్వాసను ఆఘ్రాణించడమూ కష్టమని! అతడిది నిర్మల హృదయమే. సమాజంలో వివిధ స్థాయిలలో ఉన్న రకరకాల వ్యక్తులతో ఉండే వైయక్తికమైన స్నేహసౌరభాలను అతడు అనుభూతించగలడు. ఈ ప్రత్యేకమైన సందర్భం సెలబ్రేట్ చేసుకోవడానికి అతడు నా కోసం ఒక చిన్న ఎర్ర గులాబీని కూడా తీసుకుని రాలేదు. ప్రేమికుల రోజున ఎర్ర గులాబీ ఇచ్చుకోవడం సంప్రదాయం. అతడా సంప్రదాయాన్ని పాటించలేదు. ఈ వాతావరణాన్ని మత్తిల్ల చేయడానికి ఒక పెర్ఫ్యూమ్‌నైనా అతడు కానుకగా ఇవ్వలేదు. మా మధ్య రూపుదిద్దుకుంటున్న ఈ బంధానికి భవిష్యత్తు లేదని అతడికి తెలుసేమో. అయినా మేమిద్దరమూ ప్రేమికులరోజు గురించి చాలా అభిప్రాయాలను, ఉటంకింపులను పంచుకున్నాము. ప్రేమ, విధేయత రెండూ ఒకటేనని.. ప్రేమ ఒక రక్షణ కవచంలా ఉంటుందన్న అభిప్రాయాన్ని ఇద్దరమూ అంగీకరించాము. చాలా రోజుల తరువాత మా ఇద్దరికీ ఇలా కలిసే అవకాశం దొరికింది. నేను మెల్లగా ఒక సాధారణ స్త్రీగా మారిపోతున్నాను ఈ మత్తిల్లిన వాతావరణంలో. రాత్రి మెల్లగా చిక్కబడుతున్నది. క్యాండిల్ లైట్ డిన్నర్‌కి మూడు నక్షత్రాల హోటల్ సిద్ధం అవుతున్నది. అతడు తన కోటు బటన్ విప్పి లోపల దాచిన ఒక సన్నటి పాకెట్ బయటకు తీశాడు. అది గిఫ్ట్ ర్యాపర్‌తో చుట్టిలేకపోవడంతో నేను చాలా తేలికగా పోల్చుకోగలిగాను. అదొక వేణువు. ఎక్కడో అరణ్యగర్భంలోని వెదురు చెట్టు నుండి లేలేత వెదురుముక్కను కోసీ, నదీ తీరంలోని గులక రాళ్ళతో పదును తేల్చి, నీళ్లలో నానబెట్టి సున్నితంగా చేసి, ఓ అద్భుతమైన కళాకారుడు తన ఆత్మనంతా ఆ వెదురులోకి ఒంపి, నిలువెల్లా గాయాలతో శ్వాస నింపి, ప్రతి అద్భుతమైన భావానికి అపురూపమైన ప్రాణ శబ్దాన్ని ఇవ్వగల వేణువు. ఆకుపచ్చదనం పండితే మధురమై, ఆ తీవ్ర మాధుర్యంలో మనలని మనం కోల్పోతామట. అది సాధ్యమేనా? నా ఎదురుగా ఉన్న అతడు, అత్యంత నాగరీకమైన దుస్తులు ధరించి లోలోపల అంత దైవత్వాన్ని కలిగివున్నాడా? బహుశా ఈ ప్రత్యేకమైన సందర్భంలో ఆ వేణువు మీద అతడు పాడే పాటలో నేను కరిగి, నీరై, నా లోని నిశ్చలత్వం పారిపొయ్యెలా చేసే రసవిద్య అతడిలో ఉన్నదా? ఒకానొక మార్మికమైన గూడు ఏదో నా చుట్టూ అల్లుకుంటున్న భావన. నా కళ్ళు కృతజ్ఞత తో చెమర్చాయి. అతడి వెచ్చనైన గొంతు మెల్లగా వినిపిస్తున్నది.. ‘నీ స్వచ్చమైన, సుందరమైన అభిరుచి నాకు తెలిసీ ఇలాంటి గిఫ్ట్ తీసుకుని వచ్చానని నవ్వుతావేమోనని మొదట నాకు చాలా భయమేసింది. నిన్ను దేనితోనూ కొనలేనని నువ్వన్నమాట నాకు గుర్తున్నది. నిన్ను అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన రసవిద్య తెలిసి ఉండాలి. గతనెల నేను ఇన్స్పెక్షన్ పని మీద జార్ఖండ్ వెళ్ళాను. ఆ రాత్రి.. కొద్ది దూరం నుండి వినిపిస్తున్న వేణుగానాన్ని విన్నాను. అలాంటి వేణునాదాన్ని ఇంతకుముందెప్పుడూ నేను విని ఉండలేదు. ఎంత మధురమైన నాదం అంటే బహుశా ఆ కోయిల గానానికి కూడా అంత మాధుర్యం ఉండదేమో! అప్పుడే అనిపించింది .. ఆ అద్భుతమైన వేణువునే ఈ రోజు నేను నీకు ఇవ్వగల అపురూపమైన కానుక అని. ఆ మరునాడే మావాళ్లను పిలిచి ఆ వేణువు ఊదే వ్యక్తిని తీసుకుని రమ్మని చెప్పాను. అతికష్టం మీద వాళ్లు అతడిని పట్టుకున్నారు. అతడొక చిన్నపిల్లాడు. పేదరికం వలన తన వయసుకు రెండింతల పెద్దవాడిగా కనిపిస్తున్నాడు. అన్నం తిని ఎన్నిరోజులు అయిందో పొట్ట వీపుకు అతుక్కొని ఉంది. ఆ పిల్లాడి తల్లి తండ్రులు చనిపోయారట. ఆ అబ్బాయి ఈ భూమి మీద బతికి ఉండటానికి కావల్సిన ఒక్క కారణం కూడా లేదు. నేను ఆ పిల్లాడికి రెండు వందల రూపాయలు ఇచ్చి ముందు కడుపు నిండా అన్నం తినమన్నాను. మందు తాగితే అస్సలు ఊరుకోను అని చెప్పాను. ఎందుకంటే గిరిజనులు చేతిలో డబ్బు పడగానే మద్యం షాప్‌కే పరుగెడతారు. ఆ పిల్లాడు మద్యం షాప్‌కి వెళ్లకుండా ఒక కన్ను వేసి ఉంచమని మా వాళ్లతో చెప్పాను. అప్పుడు చూశాను ఆ పిల్లాడి నడుముకు వేళ్ళాడుతున్న వేణువును. ‘నాకు ఆ వేణువు అమ్ముతావా?’ అని అడిగాను. వెంటనే ఆ పిల్లాడు వేణువును దాచేసుకున్నాడు. నేనా పిల్లాడితో ‘వేణువు ఇస్తే మరొక రెండువందలు ఇస్తాను’ అన్నాను. వాడు ఒప్పుకోలేదు. చివరకు వెయ్యి రూపాయలు ఇస్తాను అన్నాను. వాడికి నా ఆఫర్‌ను కాదనే శక్తి లేదు. మార్కెట్లో యాభై రూపాయలు కూడా చేయని వేణువుకు వెయ్యి రూపాయలు. కానీ బహుమతిగా ఇచ్చే వేణుగానం విలువ వాడికి ఎలా తెలుస్తుంది? ఆ వేణువులాంటి దానివే నువ్వు కూడా. నువ్వూ అమూల్యం. ఒక అమూల్యమైన నీకు, నీలాంటి అమూల్యమైన వేణువును మించిన బహుమతి కచ్చితంగా సరిపోతుంది’ అతడి మాటలు నేను ఎంతోసేపు వినలేక పోయాను. అకస్మాత్తుగా నా ప్రపంచం అంతా ఒక విషాదంతో నిండిపోయింది. ఆ వేణువు నా హృదయంలో ఒక దుఃఖ గీతం పాడసాగింది. ఎప్పటిలాగే నా లోలోపలి ఆత్మ మేలుకున్నది. ప్రేమ గురించిన నా భౌతికమైన వాంఛలన్నీ ఒక్కసారిగా కొట్టుకునిపోయాయి. ఆ వేణువు ఊదే పాపడికి ప్రేమ విలువ తెలియదా? నేను ప్రేమించిన ఈ మనిషికి ప్రేమ విలువ తెలుసా? ప్రేమ విలువ తెలియడానికి, ప్రేమ విలువ తెలియకపోవడానికి ఒక మనిషికి కావలసినది ఏమిటి? డబ్బేనా? ఇతడికి డబ్బు వుంది కనుక ప్రేమ విలువ తెలుస్తుందా? డబ్బు లేదు కనుక వేణువు ఊదే పాపడికి ప్రేమ విలువ తెలియదా? అంటే డబ్బు వున్నది కనుక అతడు ఏదైనా కొనగలడా? నేను ఒక ఎనిగ్మాటిక్ పరిమళంలోకి ప్రయాణిస్తున్నాను. మామిడిపళ్ళ మాధుర్యంలోకి, కొండలమీద నుండి దూకే చిన్న జలపాతంలోకి ప్రయాణిస్తున్నాను. నా స్పృహ, అస్తిత్వం ఒక గొప్ప వరదలో కొట్టుకుని పోతున్నదా? నా శరీరం మొత్తం నిరసనతో వణికిపోతున్నది. నేను మరొక్క మాట కూడా మాట్లాడలేక పోయాను. త్వరగా డిన్నర్ ముగించి త్వరగా వెళ్ళిపోదామని చెప్పాను. ఎక్కడో ఏదో జరగకూడనిది జరిగింది అన్న విషయాన్ని అతడు పసిగట్టినట్టున్నాడు. నేను మూర్ఖురాలినా? భౌతికమైన ఆనందాలు, సంతోషాలు పొందే క్రమంలో అవన్నీ చాలా అల్పమైన విషయాలని తెలియచెప్పే ఒక హింసాత్మక డెమి ఉమన్ నేనా? నేనెవరిని? అతడు ఎంచుకున్న మనిషినా? అతడి మనిషినా? బంధాల భవిష్యత్తును ముందుగానే గుర్తించగలిగితే మనమెవరమూ బహుశా బంధాలలోకి ఎప్పటికీ స్వయంగా వెళ్ళమేమో! ఒరియా మూలం : మోనాలిసా జెనా తెలుగు సేత : వంశీకృష్ణ -
నా జీవితమంతా సంఘర్షణే: నిఖిలేశ్వర్
సాక్షి, న్యూఢిల్లీ: ఆరు దశాబ్దాల సాహిత్య చరిత్రలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్న ప్రసిద్ధ కవి, రచయిత, అనువాదకుడు నిఖిలేశ్వర్. సమాజంలో ఉన్న జాడ్యాలకు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చేలా దిగంబర సాహిత్యానికి అంకురార్పణ చేసిన ఆయన.. విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. యువత సంకుచిత భావాలను పక్కనపెట్టినప్పుడే పురోగతి సాధ్యమని చెప్పే ఆయన.. 83 ఏళ్ల వయసులోనూ చురుగ్గా, వినూత్నంగా ఆలోచిస్తుంటారు. తాను రాసిన అగ్నిశ్వాస కవితా సంపుటి (2015–2017)కిగాను శనివారం ఢిల్లీలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ప్రతినిధితో ప్రత్యేకంగా ముచ్చటించారు. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న పరిణామాలు, ఆధునిక రచనలపై అభిప్రాయాలను, తన అనుభవాలను పంచుకున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే.. మూఢ భక్తి, సంకుచిత జాతీయవాదం ప్రమాదకరం ఇప్పుడున్నది రచయితలకు పరీక్షా సమయం. జాతీయతను, దేశభక్తిని ప్రతీవ్యక్తి కోరుకుంటారు. కానీ ప్రజాస్వామిక, లౌకిక విధానాలతో, విలువలతో బ్రతుకుతున్న ఈ దేశంలో.. ప్రస్తుతం కనిపిస్తున్న మూఢ భక్తి, సంకుచిత జాతీయవాదం ప్రమాదకరంగా పరిణమించాయి. పాలకులు అసహనంతో ఉన్నారు. తప్పిదాలను, పొరపాట్లను ఎత్తిచూపితే సహించడం లేదు. అణచిపెట్టి జైలుపాలు చేస్తున్నారు. భీమా కోరేగావ్ మొదలు వరవరరావును జైలులో పెట్టడం దాకా అనేక ఘటనలు దీనికి ఉదాహరణగా నిలుస్తున్నాయి. నేడు స్వేచ్ఛ, స్వాతంత్య్రం, ప్రజల క్షేమం కోరే రచయితలు నిజంగా అగ్నిపరీక్ష ఎదుర్కొంటున్నట్టే. విప్లవమార్గం, ఉద్యమం దెబ్బతిన్నాయి గత 20 ఏళ్లలో ప్రధానంగా అస్తిత్వ పోరాటాల పరిణామం చోటు చేసుకుంది. ప్రతీవారు తమ ఉనికి కోసం, గుర్తింపు కోసం రచనలు చేయాలన్న ఆలోచన పెరిగింది. గుర్తింపుకోసం జరిగిన పోరాటంలో విప్లవ గ్రూపులుగానీ, కమ్యూనిస్టులుగానీ స్త్రీవాదులను, దళితులను పట్టించుకోలేదనే కారణంతో స్త్రీవాదం, దళితవాదం, మైనార్టీవాదం ఏర్పడ్డాయి. ఆయా వర్గాల్లో కొత్త రచయితలు రావడం మంచి పరిణామమే అయినా.. కేవలం వారి వర్గాలపైనే రచనలను కేంద్రీకరించడం వల్ల ప్రధానమైన విప్లవమార్గం, ఉద్యమం దెబ్బతిన్నాయి. దేశంలో ఈ అస్తిత్వ పోరాటాలు, వ్యక్తిత్వవాదుల సంఖ్య పెరిగింది. కార్మిక, రైతాంగ సంక్షేమం దిశగా రచనలు జరగాలి ఆరు దశాబ్దాల సామాజిక జీవిత అనుభవంతో గమనిస్తే.. తర్వాత తెలుగు సాహిత్యం ఇప్పటికీ సజీవంగా ఉందని కనిపిస్తోంది. చాలామంది సీనియర్ కవులు మంచి రచనలు చేస్తున్నారు. అయితే.. ఆధునిక తెలుగు సాహిత్యాన్ని వ్యక్తివాద, సంకుచితదృష్టి నుంచి, మతవాదం నుంచి, కులతత్వం నుంచి రక్షించాల్సిన అవసరం ఉంది. సువిశాల దృష్టితో కార్మిక, రైతాంగ సంక్షేమం దిశగా రచనలు చేయాల్సి ఉంది. సగంమంది అమ్ముడుపోయారు రచయితల్లో కెరీర్‌పై దృష్టిపెట్టేవారు, డబ్బు కోసం రచనలు చేసేవారు ఎక్కువయ్యారు. నిబద్ధతతో ప్రజా ఉద్యమాలకు, ప్రజలకు గొంతుకగా మారడానికి తక్కువ మందే మిగిలారు. పైగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కొన్నేళ్లుగా చిత్రమైన పరిణామం చోటుచేసుకుంది. రెండు రాష్ట్రాల్లోనూ సగంమంది రచయితలు పాలకవర్గాలకు అమ్ముడుపోయారు. వారి బాకాలుగా మారిపోయారు. బుద్ధిజీవులు, మేధావులు సైతం తమ బాధ్యత మరిచిపోతున్నారు. పదవులకు, అవార్డులకు ఎగబడటం వల్లే ఈ పరిణామం ఏర్పడింది. సాహిత్యంలో ఒక విభజన రేఖ వచ్చేసింది. ఆ సాహిత్యాన్ని అపార్ధం చేసుకున్నారు దిగంబర కవుల పేరిట వచ్చిన మూడు సంపుటాలకు ప్రశంసలు, విమర్శలు రెండూ పొందాం. యువతరం, అభ్యుదయభావాలు ఉన్నవారు.. ఇది సమాజంలో ఒక షాక్ ట్రీట్మెంట్గా ఉందని, తిరుగుబాటు లక్ష్యాన్ని పొందుతుందని ప్రశంసలు ఇచ్చారు. కానీ ఇందులో అశ్లీల పదజాలాన్ని, బూతులు వాడారంటూ సాహితీవేత్తలు అపార్థం చేసుకొన్నారు. వారి విమర్శలను ఈ విషయంపైనే కేంద్రీకరించుకున్నారు. అంతేతప్ప దిగంబర కవుల నిజాయతీని, ధర్మాగ్రహాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఈ భిన్నాభిప్రాయాల వల్ల విమర్శలు ఎదుర్కొన్నాం. జీవితమంతా సంఘర్షణే.. నా జీవితమంతా సంఘర్షణే. చిన్నతనంలోనే నాన్న చనిపోవడంతో మా అమ్మ నగరానికి తీసుకొచ్చి పెంచి పోషించారు. అక్కడి నుంచే నా జీవిత పోరాటం మొదలైంది. హైస్కూల్ దశ దాకా అన్వేషణ, వెతుకులాట, దిశాహీనమైన పరిస్థితులను చూశాను. హైస్కూల్ దశ దాటుతుండగా సాహిత్యం, నిరంతర పఠనం నన్ను కాపాడాయి. కుంభం యాదవరెడ్డి పేరుతో రచనలు మొదలుపెట్టాను. కళాశాలలో చేరినప్పుడు తీసుకున్న ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, ఇంగ్లిష్ లిటరేచర్ సబ్జెక్టులు నా జీవితానికి సాహిత్యపరంగా, అవగాహనపరంగా ఊతమిచ్చాయి. రెండు, మూడు ఉద్యోగాలు మారడం, ప్రేమ వివాహం చేసుకోవడం మరో సంఘర్షణగా మిగిలాయి. గత ఆరు దశాబ్దాల్లో ఎన్నో తీపి, చేదు అనుభవాలు పొందాను. సాహిత్య పఠనం, నిరంతర అధ్యయనం నన్ను రక్షించాయి. నాకు సాహిత్య అకాడమీ అవార్డు వస్తుందని గత పదేళ్లుగా ప్రతి ఏటా నా మిత్రులు భావిస్తూ వచ్చారు. కానీ నేను ఏనాడూ అవార్డుల కోసం ఆశపడలేదు. ఇప్పుడు అవార్డు వచ్చినందుకు ఆనందంగానే ఉంది. ఆ కారణంగానే ‘విరసం’నుంచి బయటికి వచ్చాం దిగంబర కవులుగా 1965, 1967, 1968 సంవత్సరాల్లో మూడు సంపుటాలు వెలువరించాం. అందులోని దిగంబర కవులు నాటి యువతరానికి, వారి ధర్మాగ్రహానికి ప్రాతినిధ్యం వహించారు. ఆ మూడు సంపుటాల్లోనూ తాత్వికమైన, సిద్ధాంతపరమైన పరిణామాన్ని ఎదుర్కొన్నాం. ఈ పరిణామ క్రమంలో యువతరంలో సినిమా రంగం, రాజకీయ రంగాల పట్ల భ్రమలు తొలగిపోయాయి. నిరాశ, నిస్పృహలు, నిరుద్యోగం వల్ల ఆగ్రహం పెరిగింది. 1968–70 సమయంలో అంతర్జాతీయంగా ఉద్యమాలు వచ్చాయి. సహజంగానే నాటి యువ రచయితలు, మిగతావారు రచనలపరంగా, ప్రజలపరంగా మార్పు రావాలని కోరుకున్నారు. విప్లవమే మార్గమని యువత భావిస్తున్న సమయంలో.. నక్సల్బరీ ఉద్యమం, శ్రీకాకుళం గిరిజన తిరుగుబాటు వంటివి ఆశాకిరణంగా కనిపించాయి. యువతరం ఆ వైపు మొగ్గింది. ఆ క్రమంలోనే విప్లవ రచయితల సంఘం ఏర్పడింది. కానీ 1970–75 మధ్య విప్లవానికి ఏ పంథా అవసరం, ప్రజలు ఎలా పాల్గొంటారు, రచయితలు స్వతంత్రంగా రాయగలిగి ప్రజలకు చైతన్య స్ఫూర్తిని ఇవ్వాలే తప్ప పార్టీకి తోకగా మారవద్దన్న ఆలోచన మొదలైంది. దీనితో విరసంలో చీలిక వచ్చి.. 1975లో బయటికి వచ్చేశాం. -
ప్రజా నిబద్ధతే నిఖిలేశ్వర్ కవిత్వ కొలబద్ద
నిఖిలేశ్వర్ ‘అగ్ని శ్వాస’కు శుక్రవారం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించినా, ప్రజా నిబద్ధతే కొలబద్దగా వారి కవిత్వాన్ని తెలుగు సాహిత్య లోకం ఏనాడో గుర్తించింది. ‘నన్నయ్యను నరేం ద్రుడి బొందలోనే నిద్రపోనియ్యి– లేపకు– నీ పీక నులిమి గోతిలోకి లాగు తాడు’ అంటూ దిగంబర కవిత్వానికి అంకురార్పణ చేసిన నిఖిలేశ్వర్ కవితా ప్రస్థానం ఆరున్నర దశాబ్దాల క్రితమే మొదలైంది. ఎంకి పాటలు పాడుకుంటూ, కరుణశ్రీ పద్యాలకు మురిసిపోతూ, భావకవిత్వం ఊపులో కవిత లల్లుతూ, ఆత్మానుభూతి నుంచి సమష్టిలోకి, లోకానుభూతిలోకి తొలి అడుగులు వేసిన కుంభం యాదవరెడ్డి దిగంబర కవిత్వం ద్వారా నిఖిలేశ్వర్‌గా రూపాంతరం చెందారు. ప్రజాపోరాటాలతో పెనవేసుకుని, వర్గ చైతన్యాన్ని పెంచే విప్లవ కవిగా శ్రామిక విప్లవ పోరాటాలతో మమేకమయ్యారు. నల్లగొండ జిల్లా వీరవల్లి గ్రామంలో ఒక పేద రైతు కుటుంబంలో ఏకైక సంతానంగా 1938లో నిఖిలేశ్వర్ పుట్టిన ఏడాదికే తండ్రి నరసయ్య మరణించారు. ‘గునుగుపూల తెల్లని జడలు, మోదుగుపూల చిలుక ముక్కులు, గుల్మొహర్ పరచిన ఎర్రతివాచీ’ వంటి బాల్యపు జ్ఞాపకాలు ఆయన కవిత్వంలో పరిమళిస్తుంటాయి. నిజాం పాలనలో గ్రామాలపై రజాకార్లు పడి దాడులు చేస్తుంటే, గడ్డివాముల్లో దాక్కున్న బాల్యం ఆయనది. పొట్ట చేతపట్టుకుని తల్లితో కలిసి భాగ్యనగరానికి వలస వచ్చారు. సుల్తాన్ బజార్, బాకారం, ముషీరాబాద్ వీధి బడులలో విద్యా భ్యాసం. చార్మినార్ సిగరెట్ ఫ్యాక్టరీలో కూలీగా తల్లి నర్సమ్మ శ్రమజీవనం. ఆయన ఆలోచనలు ఆర్యసమాజం మీదుగా హేతు వాదంలోకి, యామినితో కులాంతర వివాహానికి దారితీశాయి. నిఖిలేశ్వర్ 1956 నుంచే హిందీలో కవిత్వం రాయడం మొదలు పెట్టారు. కె. యాదవ రెడ్డి పేరుతో 1960–65 మధ్య భావకవిత్వం రాశారు. ‘నవ్యత నింపుకోవాలంటే కోపంగా వెనక్కి చూడు’ అంటూ ఆత్మానుభూతి నుంచే లోకానుభూతి వైపు తొంగి చూశారు. సమాజం కులతత్వం, మతత్వం, అవినీతి, బంధుప్రీతి తప్ప, సమష్టి ప్రయోజనం కోల్పోయిన దశలో కొత్త పేర్లతో ఆరుగురు దిగంబర కవులు 1965లో ఆవిర్భవించారు. ప్రపంచపు అచ్ఛాదనల్ని చీల్చుకుని, పెద్ద పెద్ద అలలతో దిగంబర కవిత్వం ఒక ఉప్పెనలా విరుచుకుపడింది. ఆనాటి సమాజానికి ఒక షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోయింది. ఈ ఆరుగురు దిగంబర కవుల్లో నిఖిలేశ్వర్‌ది సొంత గొంతుక. ‘ఈ దేశంలో ప్రతినగరం నవ నవలాడే మహాగాయం. దూరం నుండి అది ఎర్రగులాబి. దగ్గరకు వెళితే అది రక్తస్రావపు వ్రణం’ అంటారు. దిగంబర కవులు 1966ను నిఖిలేశ్వర్ నామ సంవత్సరంగా నామకరణం చేశారు. దిగంబరత్వం మానసికమైనదేకానీ భౌతికమైనది కాదు. అయినా, ఆరుగురు దిగంబర కవుల్లో అతి తక్కువ బూతు పదాలు వాడింది నిఖిలేశ్వరే. ఆయన ఆర్మీలో సివిలియన్ ఉపాధ్యాయుడిగా, మద్రాసు ఎయిర్ ఫోర్స్‌లో సివిలియన్ క్లర్కుగా చేసినా, హైద రాబాద్‌లో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా స్థిర పడ్డారు. అంతకు ముందు గోల్కొండ పత్రికలో సబ్ ఎడిటర్‌గా కూడా చేశారు. తెలుగులోనే కాకుండా హిందీ, ఉర్దూ, ఇంగ్లిష్ భాషలలో కూడా కవిత్వం రాశారు. అనేక కథలు, సాహిత్య వ్యాసాలు రాశారు. వీరి కవిత్వం ఇంగ్లిష్, హిందీతోపాటు పలు భాషల్లోకి అనువాద మైంది. ‘గోడల వెనుక’ జైలు జ్ఞాపకాలు 1972లో వచ్చింది. భారత–చైనా మిత్రమండలి తరపున 2015 డిసెంబర్లో, పదిమంది సభ్యుల బృందంతో కలిసి నిఖిలేశ్వర్ పదిరోజుల పాటు చైనాలో పర్యటించారు. నక్సల్బరీ, శ్రీకాకుళ రైతాంగ పోరాటాలు, పౌర హక్కుల ఉద్యమాలు నిఖిలేశ్వర్‌ను నిమ్మళంగా కూర్చోనివ్వలేదు. జ్వాలా ముఖి, చెరబండరాజు, నగ్నమునితో కలిసి విరసం వ్యవస్థాపక సభ్యులయ్యారు. ఆయన కలం నుంచి ‘మండుతున్న తరం’ వచ్చింది. పీడీ యాక్టు కింద జ్వాలాముఖి, చెరబండరాజుతో కలిపి నిఖిలేశ్వర్‌ను 1971లో అరెస్టు చేసి 50 రోజులు జైల్లో పెట్టారు. ‘రోజూ తూర్పున ఎరుపెక్కే ఆకాశాన్ని, ద్వీపపు గోళాల్ని ఛేదించుకువచ్చే కిరణాల్ని, పశ్చిమాన ఎరుపెక్కే చంద్రుణ్ణి, రక్తస్నానం చేయించే సూర్యుల్ని ఎవరూ బంధించలేరు’ అంటారు జైలు నుంచి ‘నేరస్తుల ద్వీపం’లో. ‘దుక్కి దున్నిన చేతులకు దక్కిన దేమిటి?’ అని ‘ఈనాటికీ’ ప్రశ్నిస్తారు. ‘పిచ్చికుక్కల్లా కాటేసిన తుపాకుల చేతులు తిరిగి మన్నులోనే వెతుక్కోవాలి మానవత్వాన్ని’ అంటూ ఇంద్రవెల్లి కాల్పులపై పోలీసులకు ఆత్మబోధ చేస్తారు. ‘యథార్థాన్ని వికృతం చేసి వికటాట్టహాసం చేస్తున్న వెండితెర’ని తూర్పారబడతారు. బాల్యంలో వీరవల్లి వదిలాక నిఖిలేశ్వర్‌ను హైదరాబాదే అక్కన చేర్చుకుంది. ‘ప్రతి మారుమూలా గతుకుల, అతుకుల గల్లీల్లో అడుగులేస్తూ, పడుతూ, లేస్తూ, ఏడుస్తూ, నవ్వుతూ’నే తిరిగారు. ‘సహనానికి హద్దులు చెరిపేసిన మతోన్మాదం’ అంటూ నాలుగు దశాబ్దాల నా మహానగరం’లో ఆవేదన వ్యక్తం చేస్తారు. ‘ద్వేషపు కత్తులతో అతి చల్లగా నెత్తుటి నెలవంక’ను ఆ మహా నగరంలో చూశారు. ‘ఈ దేశంలోని ప్రతినగరం నవనవలాడే మహాగాయం’ అని బాధపడుతూనే, దీనికి హైదరాబాద్ ఏమీ అతీతం కాదని సమాధానపడతారు. ‘ప్రశ్నించే గొంతులను, తెగించే యువకులను ఎన్కౌంటర్ చేస్తున్నదెవరు?’ అని ప్రశ్ని స్తారు. ‘చరిత్రపాఠాలను నేర్పలేని వారు చరిత్రను అసలే నిర్మిం చలేరు’ అని కుండబద్దలు కొడతారు. ‘అనామకమైన ఈ బతుకు లోయలో నా పాదముద్రల ఆనవాళ్ళు చూడాలని వెనక్కి తిరిగితే గతమంతా తవ్వని జ్ఞాపకాల గనిగా మారిపోయింది. పెంటకుప్పల మీంచి గంతు లేసి, వరి పొలాల తల నిమరగానే పట్నం గల్లీల్లో పరుగు పెట్టిన కాళ్ళు కొంత దూరం ఎగిరిపోయిన అక్షరాల పావురాళ్ళ’ అని ‘జ్ఞాపకాలకొండ’ను తవ్వితీస్తారు. ‘ప్రజాస్వామ్యాన్ని ముసుగేసు కున్న కొత్త నియంత–గుర్రమెక్కి దౌడుతీస్తున్న వర్తమానం’ అని వ్యాఖ్యానిస్తారు. ‘కరగని కాలం కొవ్వొత్తిపై అగ్నిశిఖలా నేను, కొడిగట్టే క్షణాలతో చేయూతనిచ్చే జీవనోత్సాహం’ అని ‘అగ్నిశ్వాస’లో ‘అగ్ని స్పర్శ’ను అనుభవిస్తారు. ‘మన అడుగుల కింద నలిగి కూడా దుమ్ము దులుపుకుని లేచి వడివడిగా నడిచే పిపీలికం’ లోని పట్టుదలను కూడా ‘అగ్నిశ్వాస’లో మనకందిస్తారు. నిఖిలేశ్వర్ కవిత్వం ఒక్కసారిగా విరుచుకుపడి ఆగిపోయే ఉప్పెన కాదు. నిరంతరం అలలతో కదలాడే జీవనదిలా సాగుతుంది. తన చుట్టూ ఉన్న మనుషులతో, తనతో తాను నిత్యం సంభాషి స్తున్నట్టుంటుంది. ఉద్యమాల ఉధృతి, అనుభవాల గాఢత నిఖి లేశ్వర్ కవిత్వాన్ని నడిపిస్తాయి. ఆయన కవిత్వమంతా జీవితాన్ని వ్యాఖ్యానించడంతో సరిపెట్టుకోదు, జీవితాన్ని మార్చేదిశగా ఆలోచింపజేస్తుంది. రాఘవశర్మ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయుడు మొబైల్ : 94932 26180 -
వీరప్ప మొయిలీకి సాహిత్య అకాడెమీ అవార్డు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, సాహితీవేత్త వీరప్ప మొయిలీకి సాహిత్య అకాడెమీ పురస్కారం లభించింది. 2020 సంవత్సరానికి గానూ సాహిత్య అకాడెమీ అవార్డులను వార్షిక ‘ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్’ సందర్భంగా శుక్రవారం ప్రకటించారు. మొయిలీ సహా 20 మందికి ఈ అవార్డును అందజేయనున్నట్లు తెలిపారు. వీరప్ప మొయిలీకి ఆయన కన్నడ భాషలో రాసిన దీర్ఘ కవిత ‘శ్రీ బాహుబలి అహింసా దిగ్విజయం’కు, కవయిత్రి అరుంధతి సుబ్రమణియన్‌కు ఇంగ్లిష్‌లో ఆమె రాసిన కవితల సంకలనం ‘వెన్ గాడ్ ఈజ్ ఎ ట్రావెలర్’కు ఈ పురస్కారం లభించింది. ఏడు కవితా సంకలనాలు, నాలుగు నవలలు, ఐదు చిన్న కథలు, రెండు నాటకాలు, ఒక దీర్ఘ కవిత, ఒక మెమొయిర్‌కు ఈ పురస్కారం లభించింది. మలయాళం, నేపాలీ, ఒడియా, రాజస్తానీ భాషల్లోని సాహిత్యాలకు త్వరలో ఈ అవార్డులను ప్రకటిస్తామని అకాడెమీ వెల్లడించింది. మొయిలీ, అరుంధతి కాకుండా, ఇమాయియం(తమిళం), అనామిక(హిందీ), ఆర్ఎస్ భాస్కర్(కొంకణి), హరీశ్ మీనాక్షి(గుజరాతీ), ఇరుంగ్బమ్ దేవన్(మణిపుర్), రూప్ చంద్ హన్స్దా(సంతాలి), నందకిషోర్(మరాఠీ), మహేశ్‌చంద్ర గౌతమ్(సంస్కృతం), హుస్సేన్ ఉల్ హక్(ఉర్దూ), అపూర్వ కుమార్‌సైకియా(అస్సామీ), దివంగత హిదయ్ కౌల్ భారతి(కశ్మీరీ), ధరనింధర్ ఓవరి(బోడో) తదితరులకు ఈ పురస్కారం లభించింది. పురస్కారం కింద రూ. లక్ష నగదు లభిస్తుంది. అవార్డుల ప్రదానోత్సవ తేదీని త్వరలో వెల్లడించనున్నారు. -
తెలంగాణ కవికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
సాక్షి, న్యూఢిల్లీ/ హైదరాబాద్: తెలంగాణ కవి, రచయిత నిఖిలేశ్వర్‌కు ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. 2015–17 మధ్య ఆయన రాసిన అగ్నిశ్వాస కవితా సంపుటికి గాను ఈ పురస్కారం లభించింది. మొత్తం 13 రచనలు షార్ట్‌లిస్ట్ అవగా అగ్నిసాక్షి రచనతో నిఖిలేశ్వర్ విజేతగా నిలిచారు. ఈ పురస్కారం కింద రూ.లక్ష నగదు, తామ్ర పత్రం, శాలువాతో సత్కరిస్తారు. మిళింద సంక్షిప్త కథల పుస్తక రచనకు గాను ఏపీలోని రాజమహేంద్రవరానికి చెందిన ఎండ్లూరి మానసకు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్–2020 దక్కింది. ఈ పురస్కారం కింద రూ.50 వేల నగదు, తామ్ర పత్రం అందజేస్తారు. ఇక బాల సాహిత్య పురస్కారం ప్రముఖ రచయిత్రి కన్నెగంటి అనసూయకు లభించింది. 2018లో ఆమె రచించిన ‘స్నేహితులు’అనే 15 సంక్షిప్త కథల సంకలనానికి ఈ పురస్కారం దక్కింది. దీని కింద రూ.50 వేల నగదు, తామ్రపత్రం అందజేస్తారు. (చదవండి: బతుకు పాఠాలు చదివిన రచయిత) అస్తిత్వాల ఆవిష్కరణ ‘మిళింద’ కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్‌కు ఎంపికైన ఎండ్లూరి మానస దళిత, స్త్రీవాద, లింగ, లైంగిక గుర్తింపులో అల్పసంఖ్యాక వర్గాలకు సంబంధించి పలు కథలు రాశారు. ఆమె ప్రముఖ రచయితలు ఎండ్లూరి సుధాకర్, పుట్ల హేమలతల కుమార్తె. నెల్లూరులో జన్మించిన మానస.. ప్రస్తుతం హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉంటున్నారు. 2017లో స్మైల్ స్మారక పురస్కారం, వెంకట సుబ్బు స్మారక పురస్కారం, 2020లో మాడభూషి పురస్కారం అందుకున్నారు. మహిళా అంతర్జాల సాహిత్య పత్రిక ‘విహంగ’కు సంపాదకులుగా వ్యవహరిస్తున్నారు. వాస్తవిక ఘటనల ఆధారంగా పరిశుద్ధ పరిణయం, అంతిమం తదితర కథలు రాశారు. ‘‘అస్తిత్వం ప్రశ్నార్థకమైన ప్రతిచోట ఒక ఘర్షణ, ఒక పెనుగులాట కనిపిస్తుంది. అది తమ జీవితాన్ని తమకు నచ్చిన విధంగా అనుభవించే స్వేచ్ఛ కోసం చేసేపోరాటం’’అంటూ అణచివేతను, వివక్షను ఎదుర్కొంటున్న అస్తిత్వాల ఆవిష్కరణే ‘మిళింద’కథల సంపుటి. అవార్డుకు ఎంపిక కావడంపై మానస సంతోషం వ్యక్తం చేశారు. అణచివేతకు, నిర్లక్ష్యానికి గురవుతున్న వర్గాలకు లభించిన గౌరవంగా భావిస్తున్నట్టు చెప్పారు. పిల్లల సృజనకు పట్టంకట్టే ‘స్నేహితులు’ చిన్నారుల మూర్తిమత్వ వికాసానికి దోహదం చేసే చక్కటి కథలతో తెలుగు సాహిత్యంలో తన ప్రత్యేకతను చాటుకున్న ప్రముఖ రచయిత్రి కన్నెగంటి అనసూయ. ఆమె రాసిన పిల్లల కథల పుస్తకం ‘స్నేహితులు’కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఆమె ఏలూరులో కొంతకాలం పాటు లైబ్రేరియన్‌గా పనిచేశారు. లెక్చరర్‌గా విధులు నిర్వహించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని నిజాంపేట్‌లో ఉంటున్నారు. తనకు అవార్డు రావడంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు.‘‘పిల్లల్లో సృజనాత్మకత లోపిస్తోంది. స్కూళ్లలో నీతి, నైతిక విలువలను బోధించడం లేదు. అలాంటి కథలు చెప్పే టీచర్లు కూడా కరువవుతున్నారు. బాల్యంలోనే పిల్లల జీవితాలు యాంత్రికంగా మారిపోతున్నాయి. తల్లిదండ్రులు కూడా పిల్లల్లో సృజనాత్మకతను పెంపొందించే కథలు చెప్పాలి’’అని అనసూయ పేర్కొన్నారు. కలం నిఖిలేశ్వర్.. కవిత్వం సంచలనం సాహిత్య అకాడమీ అవార్డు పురస్కారం లభించిన నిఖిలేశ్వర్ ప్రముఖ కవి, రచయిత, అనువాదకుడు, విమర్శకుడు. తెలుగుతోపాటు ఇంగ్లిష్, హిందీ భాషల్లోనూ పలు రచనలు, అనువాదాలు చేశారు. ఆయన అసలు పేరు కుంభం యాదవరెడ్డి. నిఖిలేశ్వర్ అనేది ఆయన కలం పేరు. 1938 ఆగస్టు 11న నల్లగొండ జిల్లా భువనగిరి సమీపంలోని వీరవెల్లిలో జన్మించిన ఆయన.. 1960–64 మధ్య ఆర్మీలో సివిలియన్ స్కూల్ మాస్టర్‌గా, ఎయిర్‌ఫోర్స్‌లో క్లర్క్‌గా పనిచేnశారు. 1964–66 మధ్య గోల్కొండ పత్రికలో సబ్ ఎడిటర్‌గా పనిచేశారు. 1965–68 మధ్యకాలంలో మరో ఐదుగురు మిత్రులతో కలిసి తెలుగు సాహిత్యంలో పెను సంచలనం సృష్టించిన దిగంబర కవిత్వం మూడు కవితా సంపుటాలను వెలువరించారు. విప్లవ రచయితల సంఘం (విరసం) వ్యవస్థాపక సభ్యుడిగా, కార్యదర్శిగా పనిచేశారు. అగ్ని శ్వాస.. పోరాటాల ధ్యాస ‘ఏనాటికైనా ఈ అగ్నిశ్వాస నా అంతరంగ భాష, శ్రమజీవన పోరాటాల ధ్యాస.. అగ్నిశ్వాసకు సాహిత్య అకాడమీ పురస్కారం లభించడం ఆనందంగా ఉంది. నిజానికి ఈ అవార్డు 10, 15 ఏళ్ల కిందే వచ్చి ఉంటే మరింత సంతోషంగా ఉండేది. సాహిత్య, సాంస్కృతిక రంగంలో నేను చేసిన కృషి, నిర్వహించిన క్రియాశీలక పాత్రకు తగినంత గుర్తింపు సమాజంలో ఎప్పుడో లభించింది. ఇప్పుడీ గుర్తింపు అదనంగా వచ్చి చేరినందుకు సంతృప్తి చెందుతున్నా. వ్యక్తిగతంగా నా కవిత్వం, రచనలు, సాహిత్యాన్ని విమర్శకులు అంతగా పట్టించుకోలేదన్న భావన నాకుంది. తెలుగులోనే కాకుండా హిందీ, ఇంగ్లిష్‌లలో కూడా నా సాహిత్య కృషి ఉంది. ఇటీవల ఇంగ్లిష్‌లో ‘లైఫ్ ఎట్‌ది ఎడ్జ్ ఆఫ్ ద నైఫ్’, హిందీలో ‘ఇతిహాస్ కె మోడ్ పర్’కవితా సంపుటాలున్నాయి. ఈ రచనలన్నింటిపై సరైన మదింపు జరగలేదు’’. - నిఖిలేశ్వర్, ప్రముఖ కవి ఏపీ సీఎం జగన్ అభినందనలు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలకు ఎంపికైన నిఖిలేశ్వర్, కన్నెగంటి అనసూయను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. వారు మరెన్నో పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షించారు. -
సత్యవతికి సాహిత్య అకాడమీ అవార్డు
సాక్షి, న్యూఢిల్లీ/విజయవాడ కల్చరల్: విజయవాడకు చెందిన ప్రముఖ రచయిత్రి పి. సత్యవతికి అనువాద విభాగంలో సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. 2019 సంవత్సరానికిగాను ఆమె ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. 2013 జనవరి నుంచి 2017 డిసెంబరు వరకు అనువాదం చేసిన రచనల ఆధారంగా ఆమెను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు సాహిత్య అకాడమీ కార్యదర్శి కె. శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 23 భాషల్లో అనువాదాలను ఎంపికచేయగా.. 23 మంది అనువాద రచయితలను ఈ అవార్డు వరించింది. ‘ది ట్రూత్ అబౌట్ మీ : ఏ హిజ్రా లైఫ్ స్టోరీ’ అనే ఆంగ్ల ఆత్మకథను సత్యవతి తెలుగులో ‘ఒక హిజ్రా ఆత్మకథ’గా అనువదించారు. దీనికే ఈ పురస్కారం లభించింది. ఆమె రాసిన ‘వాటిజ్ మై నేమ్’ కథ పదో తరగతిలో పాఠ్యాంశంగా.. ‘విల్ హీ కమ్ హోం’ కథ ఇంటర్లో పాఠ్యాంశంగా ఉన్నాయి. ఆమె 200కు పైగా కథలు, అనేక నవలలు రచించారు. ఆమె 1940లో గుంటూరు జిల్లాలో జన్మించారు. ఆమె తొలి కథ తెలుగు స్వతంత్ర మ్యాగజైన్లో ప్రచురితమైంది. పి.సత్యవతి కథలు, ఇల్లు అలకగానే.., మంత్రనగరి వంటి కథా సంపుటాలు, ఐదు నవలలను ఆమె రచించారు. అనేక కథలను కూడా అనువదించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉగాదికి ప్రదానం చేసే కళారత్న (హంస) పురస్కారం, పెద్దిభొట్ల స్మారక పురస్కారంతోపాటు వివిధ సంస్థలు సత్యవతికి అనేక పురస్కారాలు అందించాయి. మరోవైపు.. శప్తభూమి రచయిత బండి నారాయణస్వామి మంగళవారం ఇక్కడ సాహిత్య అకాడమీ అవార్డును అందుకోనున్నారు. -
అభిశప్తుడికి ఓ అభయం
బండి నారాయణ స్వామి–రాయలసీమ సాహిత్యానికి ఓ బండి చక్రం. కాదు, కాదు–ఆ బండి చక్రానికి ఇరుసు. కరువును కళ్లారా చూసి కాసిని కన్నీళ్లను అక్షరాలుగా మలిచినవాడు. ఆ అక్షరాలను నెత్తుటితో రంగరించి అనంత శక్తినొసగినవాడు. ఆ శక్తితో అనుపమానమైన సాహిత్యాన్ని సృష్టించినవాడు. చరిత్రలో మరుగున పడిపోయిన అనేకానేక సందర్భాల నుంచి సీమకు జరిగిన అన్యాయాలను, అక్రమాలను.. ఎందరో దాచేసిన అసత్యాలను, అర్థసత్యాలను అక్షర నిష్టతో వెలికితీసినవాడు. ఆ నిరంతర కృషికి ఇవాళ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. ‘శప్తభూమి’పై రుద్రతాండవం చేసిన అభిశప్తుడికి ఓ అభయం లభించింది. శప్తభూమి నవల క్రీ.శ. 1775వ సంవత్సరంలో ప్రారంభమవుతుంది. విజయనగర సామ్రాజ్య పతనం అనంతరం చిన్నచిన్న రాజ్యాలు ఏర్పడటం, దళిత బహుజనులతో సహా పలువురు అధికారాన్ని హస్తగతం చేసుకోవడం, వారిమధ్య ఆధిపత్య పోరు, అందులో భాగంగా చిమ్మిన నెత్తురు నవలంతా చిత్తడిగా పరచుకుంటుంది. ఈ నవలలోని సిద్ధరామప్పనాయుడు, కరిహుళి బసవప్ప, దళవాయి సుబ్బరాయుడు, బ్రౌన్, మాడల కందప్ప వంటి వారు నిజంగా ఆ కాలంలో జీవించినవారు. మిగిలిన అనేక పాత్రలకు అప్పటి సంఘటనల ఆధారంగా స్వామి ప్రాణం పోశారు. ఆ కాలంలో సాగిన సతీసహగమనం, బసివిని వంటి ఆచారాలు, సంతలు, పరసల తీరుతెన్నులు, పూజలు, పండుగలు, పెళ్లిళ్లు, ఆయా కులాల ఆచార వ్యవహారాలు, సుంకాలు, పెళ్లి పన్ను, చేను మాన్యాలు, కుల పురాణాలు, కుటుంబ చరిత్రలు, హేయమైన శిక్షలు, అత్యాచారాలు, అక్రమాలు, గాలి దేవరలు, వీరగల్లులు.. అన్నీ సవివరంగా చిత్రించిన తీరు చూస్తూ ఆయా వివరాలను సేకరించడానికి రచయిత ఎంత కష్టించి ఉంటారో అవగతమవుతుంది. ‘తానా’ బహుమతి నవలగా వెలువడినప్పుడే స్వామి ‘శప్తభూమి’కి విశేష ఆదరణ లభించింది. ఇప్పుడు అకాడమీ అవార్డు రావడం, సాహితీ ప్రియులందరికీ సంతోషం కలిగించే అంశం. – దేశరాజు -
సాహిత్యంపై దాడులు జరుగుతున్నాయి..
హైదరాబాద్: దేశంలో సాహిత్యంపై దాడులు జరుగుతున్నాయని ప్రముఖ హిందీ కవి, కేంద్ర సాహిత్య అకాడమీ గ్రహీత మంగలేష్ దబ్రాల్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం సుందరయ్యవిజ్ఞాన కేంద్రంలో తెలంగాణ సాహితీ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరిగే 4వ లిటరరీ ఫెస్ట్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా 135 మంది సాహితీవేత్తలు, స్కాలర్స్ రచించిన ‘తెలుగెత్తి జైకొట్టు’పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంగలేష్ మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త చరిత్ర, కొత్త వ్యక్తులను ముందుకు తీసుకొస్తున్నారని, గాంధీ, నెహ్రూలకు బదులుగా వారి త్యాగాలను చరిత్రను చెరిపేసి సావర్కర్, వల్లభాయ్ పటేల్‌ను ముందుకు తీసుకొస్తున్నారని పేర్కొన్నారు. దేశంలో మత ప్రాతిపదికన ప్రభుత్వాన్ని నడపాలనే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రగతిశీలమైన రచయితలను నిషేధిస్తున్నారని విమర్శించారు. నేటి కవులు, రచయితలు అప్రమత్తంగా ఉండి దేశ వైవిధ్యాన్ని కాపాడాలన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి మాట్లాడుతూ.. దిశ అత్యాచారం జరిగిన నేపథ్యంలో ప్రజల నిరసనలు పెరిగాయని అన్నారు. ప్రజల మీద, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం మీద నమ్మకం లేనప్పుడే ఎన్కౌంటర్లు జరుగుతాయన్నారు. మహిళలపై జరుగుతున్న హింసను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని చెప్పారు. తెలుగును ఎత్తిపట్టుకోవాల్సిన సందర్భం వచ్చిందని పేర్కొన్నారు. ప్రజల అవసరాలను తీర్చడంతో పాటు వారిని అర్థం చేసుకునేది మాతృ భాష అని చెప్పారు. ప్రముఖ కవి సుధామ మాట్లాడుతూ.. సాహిత్యం లేకున్నా భాష ఉంటుంది.. కానీ భాష లేకుంటే సాహిత్యం ఉండదని పేర్కొన్నారు. ప్రముఖ విమర్శకులు కె.శివారెడ్డి మాట్లాడుతూ.. సాహిత్యానికి ఎల్లలు లేవని అన్నారు. సమాజం గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత కవులకు ఉందన్నారు. రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి మాట్లాడుతూ.. భాష, సంస్కృతి ప్రజలను చైతన్యం చేస్తుందన్నారు. తెలంగాణ సాహితీ ప్రధాన కార్యదర్శి కె.ఆనందాచారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రముఖ కవులు నిఖిలేశ్వర్, ఓయూ తెలుగు శాఖ అధిపతి సూర్య ధనుంజయ్, కవి యాకూబ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రముఖ మహిళా ఎడిటర్ సంచలన నిర్ణయం
ముంబై: బీజేపీ సర్కార్ తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు -2019 ను నిరసిస్తూ ప్రముఖ ఉర్దూ జర్నలిస్టు, రచయిత షిరీన్ దాల్వి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ అమానవీయ చట్టానికి నిరసనగా తనకు ప్రదానం చేసిన సాహిత్య అకాడమీ అవార్డును తిరిగి ఇచ్చేస్తున్నట్టు ఆమె ప్రకటించారు. ఈ బిల్లును పాస్ చేయడం భారత రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతమని, సెక్యులరిజానికి విరుద్ధమని విమర్శించారు. ఈ పరిణామం తనను తీవ్రమైన విచారానికి, షాక్‌కు గురించేసిందని షిరీన్ వ్యాఖ్యానించారు. ''అవధ్‌నామా'’ ఉర్దూ పత్రిక ముంబై ఎడిషన్ ఎడిటర్‌గా పనిచేసిన ఆమెకు సాహిత్య రంగంలో చేసిన విశేష సేవకు గాను 2011లో సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. అయితే చార్లీ హెబ్డో కార్టూన్‌ను తిరిగి ముద్రించిన వివాదంలో ఎడిటర్ పదవి నుంచి తప్పుకున్న ఆమె ఉర్దూన్యూస్ ఎక్స్‌ప్రెస్. కామ్ అనే న్యూస్ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. మరోవైపు మహారాష్ట్ర క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అబ్దుర్ రహమాన్ ముంబై (రాష్ట్ర మానవ హక్కుల కమిషన్) తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. రాజ్యసభలో పౌరసత్వ సవరణ బిల్లుకు ఆమోదం లభించడంతో ఆయన నిరాశ చెందారు. పౌరుల హక్కులకు విఘాతంగా కలిగిస్తుందంటూ బిల్లును ఖండించిన ఆయన తన సర్వీసులకు గుడ్ బై చెబుతున్నట్టు ట్విటర్ ద్వారా వెల్లడించారు. కాగా సోమవారం పౌరసత్వ సవరణ బిల్లును ఆమోదించుకన్న నరేంద్ర మోదీ సర్కార్, బుధవారం రాజ్యసభ ఆమోదాన్ని కూడా సాధించింది. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన 14 సవరణలు వీగిపోయాయి. సుదీర్ఘ వాదనలు, వాకౌట్లు తరువాత రాజ్యసభ బుధవారం నాడు ఈ బిల్లుకు ఆమోదించింది. దీంతో ప్రజాస్వామ్యానికి ఇది దుర్దినమని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. ఈ పరిణామంతో ఈశాన్య రాష్ట్రాలు నిరసనలు, అల్లర్లతో అట్డుడుకుతున్నాయి. ముఖ్యంగా అసోంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితిని అదుపు చేసేందుకు కేంద్రం సైన్యాన్ని రంగంలోకి దించింది. గువహటి, డిబ్రూగర్ ప్రాంతాల్లో ఇప్పటికే కర్ఫ్యూ అమల్లో ఉంది. ఇంటర్నెట్ సేవలతోపాటు పలు రైళ్ల, విమానాల రాకపోకలు కూడా నిలిచిపోయాయి. -
తెలుగు సాహిత్య దర్శిని ‘విమర్శిని’
ఆచార్య కొలకలూరి ఇనాక్ రచించిన సాహిత్య విమర్శ గ్రంథం ‘విమర్శిని’కి 2018 కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది. ఆయనకు ఆరు దశాబ్దాల సాహిత్య జీవితముంది. ఆయన కవి, కథకుడు, నవలాకారుడు, నాటక రచయిత, పరిశోధకుడు, విమర్శకుడు, మంచి వక్త. ‘తెలుగు వ్యాస పరిణామం’ అంశం మీద పరిశోధన చేశారు. సాహిత్య పరామర్శ, ఆధునిక సాహిత్య విమర్శ సూత్రం, జానపదుల సాహిత్య విమర్శ, శూద్రకవి శంభుమూర్తి వసుచరిత్ర వైశిష్ట్యం, సాహిత్య దర్శిని, పత్రత్రయి మొదలైన విమర్శ గ్రంథాలు ప్రచురించారు. విమర్శినిలో మూడు భాగాలున్నాయి. 1.తెలుగు వెలుగులు. 2. తెలుగు నవల. 3. తెలుగు కథానిక. తెలుగు వెలుగులులో ప్రాచీన ఆధునిక కవిత్వం, రచయితలు, సాహిత్యాంశాల మీద రాసిన పదహైదు వ్యాసాలున్నాయి. వాటిలో మౌలికమైన ప్రతిపాదనలు ఉన్నాయి. పరవస్తు చిన్నయసూరి బ్రాహ్మణులతో తిరస్కరింపబడినా, వాళ్లు నెత్తిమీద పెట్టుకునే బాలవ్యాకరణం, పంచతంత్రం రాశారన్నాడు. భద్రిరాజు తెలుగులో నాలుగు మాండలికాలు ఉన్నాయంటే కొలకలూరి ఆరు మాండలికాలు ఉన్నాయన్నాడు. తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర మాండలికాలుగా భద్రిరాజు విభజిస్తే– తెలంగాణ, రాయలసీమకు పూర్వాంధ్ర మాండలికం, గోదావరి మాండలికం, సర్కారు మాండలికం, నెల్లూరు చిత్తూరు కొంత ఒంగోలుతో కూడిన మాండలికాలను జత చేశారు. ‘వలస రచయితలు’ అంశం మీద రాసిన కొలకలూరి, ఒక ప్రాంతంలో పుట్టి పెరిగి కొత్త జీవితం వెతుక్కుంటూ ఇతర ప్రాంతాలకు వెళ్లిన రచయితలు, వెళ్లిన ప్రాంతం గురించి రాయకుండా తమ ప్రాంతం గురించే ఎందుకు రాస్తారు అనే అంశాన్ని చర్చించారు. వెళ్లిన ప్రాంతపు భాషను కొంత ఒంటబట్టించుకోగలమే గానీ ఆ జీవితాన్ని ఆకళింపు చేసుకోలేమని ఆయన అభిప్రాయం. పైగా సొంత ప్రాంతం గురించి రాసి మెప్పించినంతగా ఉంటున్న ప్రాంతం గురించి రాసి మెప్పించడం కష్టమని కూడా ఆయన ఉద్దేశం. శ్రీ కృష్ణదేవరాయలు– రాజ్యం, రాసిక్యం, మతం కూడలి అన్నారు. ఏ దేశ ప్రజలయినా వాళ్ల మాతృభాషలో విద్యాబోధనం జరిగితేనే విశిష్ట మానవులుగా అవతరిస్తారని చెప్పారు. 1909లో వచ్చిన ‘మాలవాండ్ర పాట’ మీద 2009లో వ్యాసం రాస్తూ ఆ పాట రచయిత దళితుడే అయ్యుండాలని కొలకలూరి ఊహించారు. ఆ తర్వాత ఆ ఊహ నిజం కాదని తేలింది. దాని రచయిత మంగిపూడి వెంకట శర్మ. బోయి భీమన్న మీద రాసిన వ్యాసంలో భారతదేశంలో జాతీయభావన రాజకీయ అవసరాల కోసం ఏర్పడిందే తప్ప ప్రజల మీద ప్రేమతో కాదని అన్నారు. ఈ భాగంలో సినారె, కీలుబొమ్మలు లాంటి అంశాల మీద రాసిన వ్యాసాలున్నాయి. కొలకలూరి దృష్టి ద్రావిడ దృష్టి. దళిత బహుజన దృష్టి. చారిత్రక వాస్తవిక దృష్టి. చాలామంది భావించినట్లు కందుకూరి ‘రాజశేఖర చరిత్ర’ను తొలి తెలుగు నవలగా ఆయన ఆమోదించలేదు. ఆయన దృష్టిలో శ్రీ రంగరాజ చరిత్ర తొలి తెలుగు నవల. అందులో లంబాడీ జీవిత చిత్రణ, కులాంతర ప్రేమ అనే ప్రగతిశీల అంశాలున్నాయని గుర్తించారు. రాజశేఖర చరిత్ర మౌలిక రచన కాదని కూడా అన్నారు. ప్రగతిశీలవాదులు మాలపల్లి నవలను అభ్యుదయ నవలగా గుర్తిస్తే, కొలకలూరి అందులో హిందూమత ప్రచార స్వభావం ఉందన్నారు. మాలపల్లిలో బ్రాహ్మణ వ్యవస్థను తిరస్కరించే జస్టిస్ పార్టీని తిరస్కరించే లక్షణముందన్నారు. విశ్వనాథను హైందవత్వ ప్రతినిధి రచయితగానే ఆయన గుర్తించారు. విశ్వనాథ దళిత జీవితం వస్తువుగా రాసిన నవలల్ని కూడా ఆయన ఆమోదించలేదు. విశ్వనాథ దళితుడు దళితుడిగా ఉంటేనే వాళ్ల శౌర్యాన్నీ పరాక్రమాన్నీ అంగీకరిస్తారు. వీరవల్లడు గొప్పవాడే, తమకు దాస్యం చేసినంత కాలం. చేయకపోతే వీరవల్లడు ఉట్టి వల్లప్ప అవుతాడు. తొలినాళ్లలో తెలుగు నవలల్లో బ్రాహ్మణ జీవితమే వస్తువు కావడం గురించి కొలకలూరి చర్చించారు. త్రిపురనేని గోపీచంద్‌తోనే తెలుగు నవలల్లోకి అబ్రాహ్మణ జీవితాలు ప్రవేశించాయన్నారు. చలం, కొడవటిగంటి కుటుంబరావు స్త్రీ విముక్తి కోరినా అది బ్రాహ్మణ స్త్రీ విముక్తే అన్నారు. కానీ వాళ్లు అబ్రాహ్మణ స్త్రీ స్వేచ్ఛను తిరస్కరించలేదన్నారు. తెలుగు కథా వికాసాన్ని పరామర్శించిన కొలకలూరి, గురజాడ అప్పారావు దిద్దుబాటు(1910) తొలి తెలుగు కథ అనే అభిప్రాయాన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరించి, బండారు అచ్చమాంబ ‘ధన త్రయోదశి’ని తొలి తెలుగు కథానికగా నిర్ణయించారు. అంతేగాక దిద్దుబాటు ఓ.హెన్రీ రాసిన ఆంగ్ల కథానికకు అనుసరణ అన్నారు. గురజాడ కథానికల్లో ‘మీ పేరేమిటి?’, ‘పెద్ద మసీదు’ మాత్రమే తెలుగు జీవితాన్ని ప్రతిబింబిస్తున్నాయని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. తొలినాళ్లలో స్త్రీ స్వేచ్ఛను కోరే కథానికలు ఎక్కువగా రావడం మీద ఆంగ్ల సాహిత్య ప్రభావం బలంగా ఉందని కొలకలూరి సిద్ధాంతం. అబ్రాహ్మణ దృక్పథంతో ‘ఆంధ్ర దేశంలో ముగ్గురి జీవితం చిత్రించిన కథానికలే తెలుగు కథానికలుగా చలామణి అయ్యాయి. నూటికి ముగ్గురి సాహిత్యం నూరుగురి సాహిత్యమయింది’ అన్నారు. అరసం సమాజంలో నూత్న ఆలోచనలు రేకెత్తించిందంటూ చాసో మొదలైనవారి కథలను విశ్లేషించారు. అభ్యుదయ, విప్లవ, స్త్రీ, గిరిజన, మైనారిటీ, బహుజన, ప్రాంతీయ అస్తిత్వ కథలను విపులంగా చర్చించారు. తెలుగు నవలలకన్నా తెలుగు కథానికను కొలకలూరి మరింత లోతుకి వెళ్లి చర్చించారు. పుస్తకం చివర్లో కొన్ని అనుబంధాలు పెట్టారు. అవి ఆయన ఎప్పుడో రాసినవి. ఒకదానిలో ఆధునిక కథానిక గురజాడతోనే ఆరంభమయింది వంటి అభిప్రాయం మనల్ని ఆకర్షిస్తుంది. కొలకలూరికి తెలుగు జానపద, ప్రాచీన, ఆధునిక సాహిత్యాల అధ్యయన పరిజ్ఞానం ఉంది. సాహిత్య విమర్శకులకు ఒక ప్రాపంచిక దృక్పథం, ఒక నిబద్ధత, ఒక తాత్విక నేపథ్యం ఉండటం ఎంత అవసరమో విమర్శిని ద్వారా రుజువు చేశారు. విశ్వనాథ, కొ.కు., కేతు, శ్రీశ్రీ, వల్లంపాటి వలె కొలకలూరి ఒకవైపు సృజనాత్మక రచనలు చేస్తూ, మరోవైపు సాహిత్య విమర్శను సుసంపన్నం చేశారు. ఆయన సవ్యసాచి. రాచపాళెం చంద్రశేఖర రెడ్డి -
కొలకలూరి కీర్తిలో ‘విమర్శిని’
ఎట్టకేలకు ఆచార్య కొలకలూరి ఇనాక్‌ను సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. ఈ వార్త చూసిన వారిలో కొంతమందైనా ‘ఏంటి? ఇనాక్‌కి ఇంతకాలం అకాడమీ అవార్డు రాలేదా?’ అని ఆశ్చర్యపోయి ఉంటారు. అందుకు కారణం ఆయన ఆ అవార్డుకు మించి ఎదిగిపోవడమే. జ్ఞాన పీఠ్ వారి ప్రతిష్టాత్మకమైన మూర్తిదేవి పురస్కారంతోపాటు, పద్మశ్రీ కూడా ఇప్పటికే అందుకున్నారాయన. జులై 1, 1939లో గుంటూరు జిల్లా వేజెండ్లలో జన్మించిన ఇనాక్ అంచెలంచెలుగా ప్రస్థానాన్ని కొనసాగిస్తూ శ్రీవేంకటేశ్వరి యూనివర్సిటీ వైస్‌చాన్సలర్ స్థాయి వరకూ ఎది గారు. తన తండ్రి మరణం ప్రేరణతో 1954లో తొలి కథ రాశారు. ఈ దేశ నిర్మాణంలో పాలుపంచుకున్న దళితుల చరిత్రను వెలికితీస్తూ అనేక గ్రంథాలు వెలువరించారు. చరిత్రలో మరుగునపడిన దళితుల కృషిని ‘ఆది ఆంధ్రుడు’ కావ్యంలో, శూర్పణఖ అంతరంగాన్ని ‘కన్నీటి గొంతు’ కావ్యంలో అపూర్వంగా ఆవిష్కరించారు. అళ్వారుల్లో ప్రసిద్ధుడైన ‘మునివాహనుడు’పై నాటకం రాశారు. ఇక కథలకైతే లెక్కేలేదు. ఊరబావి, అస్పృశ్య గంగ, సూర్యుడు తలెత్తాడు, గులాబీ నవ్వింది, కొలుపులు కథలు పాఠకులకు సుపరిచితం. సర్కార్ గడ్డి, అనంత జీవనం వంటి నవలలు ప్రసిద్ధాలు. వైవిధ్యభరితమైన సమాజాన్ని తన కథల ద్వారా అన్ని కోణాల్లో ఆవిష్కరించారు. దళితులు, దళిత స్త్రీలు, కులవృత్తులవారి కన్నీటితడిని రంగరించుకున్న ఇనాక్ సాహిత్యమంతా అట్టడుగువర్గాల జీవితానికి అద్దంపడుతుంది. తన చుట్టూ వున్న జీవితాల్ని, తాను చూసిన జీవితాల్ని, తాను అనుభవించిన జీవితాన్ని అక్షరాల్లో బందించడం వల్లే ఆయన రచనలన్నీ చెమటవాసనతో గుబాళిస్తుంటాయి. అనేక ప్రక్రియల్లో బడుగుల జీవితాన్ని చిత్రించడం ద్వారా అన్ని వర్గాలను చేరుకోవచ్చనేది ఇనాక్ ఆలోచన. కవిత, కథ, నవల, నాటకం, పరిశోధన, విమర్శ ఏది రాసినా వాటిపై ఆయన ముద్ర స్పష్టం. ఇప్పటి వరకు తొమ్మిది పదులకుపైగా పుస్తకాలను వెలువరించారు. తన రచనలు నచ్చినవారికైనా, నచ్చనివారికైనా; తాను లేవనెత్తిన సమస్యలు అంగీకరించక తప్పని పరిస్థితి కల్పించడమే ఆయన సాహిత్యం ప్రధాన ఉద్దేశం. ఆయన రచనలు ఆవేశపూరితంగానో, రెచ్చగొట్టేవిగానో ఎప్పుడూ ఉండవు. ఆలోచనాత్మకంగా, నిలకడగా సాగుతూ ఆయా సంఘటనపట్ల పాఠకుడిలో వాస్తవిక దృష్టిని కలిగిస్తాయి. ఆయన రచనలు దేశ, విదేశీ భాషల్లోకి అనువాదమయ్యాయి. పలు విశ్వవిద్యాలయాల్లో ఆయన రచనలపై అనేకమంది ఎం.ఫిల్, పీహెచ్‌డీలు చేశారు. ఇనాక్‌కు అందని పురస్కారంమంటూ దాదాపు లేదనే చెప్పవచ్చు. ఎప్పుడో అలనాడు జాషువాకు, మధ్యలో ఓసారి బోయి భీమన్నకు దక్కిన అకాడమీ పురస్కారం చాలా ఆలస్యంగానే అయినా ఇనాక్ రచించిన వ్యాస సంపుటి ‘విమర్శిని’ని వరించడం తెలుగు దళిత సాహిత్యానికి కొత్త ఉత్సాహాన్నిస్తుందని భావించవచ్చు. – దేశరాజు (కొలకలూరి ఇనాక్‌కు సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించిన సందర్భంగా) -
కథ రాయడం చాలా కష్టం...
1938లో గుంటూరులో పుట్టిన పెద్దిభొట్ల సుబ్బరామయ్య సుమారు ఏడు దశాబ్దాలు విజయవాడలోనే ఉన్నారు. గుండెను తడి చేసే ‘ఇంగువ’ వంటి అనేక కథలు రచించారు. అందులో కథలకు బహుమతులు పొందారు. ఆ కథలకు అవార్డులు అందుకున్నారు, సన్మానాలు పొందారు. విజయవాడ లయోలా కళా శాలలో తెలుగు అధ్యాపకునిగా పనిచేశారు. తాను చేసిన సాహితీ సేవకు అవార్డులు అందుకున్న పెద్ది భొట్ల తన పేరున కూడా కొందరికి అవార్డులు ఇవ్వా లనుకున్నారు. 2012 నుంచి ప్రతి డిసెంబరు 16వ తేదీన తన జన్మదినం సందర్భంగా తన పేరు మీదు గానే అవార్డులు ప్రదానం చేయడం ప్రారంభించారు. 80 సంవత్సరాల వయసులో అనారోగ్యం కారణంగా విజయవాడలోని ఒక ఆసుపత్రిలో మే 18 శుక్రవారం కన్నుమూశారు. రెండేళ్ల క్రితం తన జన్మదినం సంద ర్భంగా ఆయన తన చివరి ఇంటర్వ్యూ సాక్షి పాఠ కుల కోసం ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ వివరాలు... చిన్నతనంలో స్కూల్లో చదువుకునే రోజుల్లోనే స్కూల్ పుస్తకాలతో పాటు, చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు బాగా చదువుకున్నాను. పెద్దయిన తర్వాత సామాజిక స్పృహ ఉన్న రచనలు విరివిగా చదవ సాగాను. ఒంగోలులో పెద్ద లైబ్రరీ ఉండేది. ఇప్పుడది కాలగర్భంలో కలిసిపోయింది. అక్కడ కొవ్వలి, జంపన, శరత్‌ల నవలలు బాగా చదివేవా డిని. ముఖ్యంగా కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారా యణగారి ‘వేయి పడగలు’ విపరీతంగా చదివాను. విశ్వనాథవారితో అనుబంధం విజయవాడ మాచవరంలో ఉన్న ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ కాలేజీతో బిఏ చదివాను. కాలేజీ... తాటాకులు, తాటి బద్దలతో ఉండేది. అందువల్ల వాన పడితే రోడ్ల మీద షికారు. అప్పట్లో గొప్ప గొప్ప వాళ్లతో ప్రత్యేక పాఠాలు చెప్పించేవారు కళాశాల యాజమాన్యం. అలా చేయడం కాలేజీకి ఒక ఘనత. ఇది 1955 నాటి మాట. స్పెషల్ తెలుగులో నలుగురు మాత్రమే ఉన్నాం. విశ్వనాథ సత్యనారాయణ మా తెలుగు మాస్టారు. ఒకనాడు ఆయనను పాఠం చెప్పమని అడిగితే, ‘‘ఈ రోజు అన్నం తినలేదురా, నీరసంగా ఉంది. ఇంటికి రండి. మధ్యాహ్నం చెప్తాను’’ అన్నారు. విశ్వనాథ వారి ఇంటికి వెళ్తున్నామంటే, మహానుభావుడికి పాదాభివందనం చేయబోతున్నా నన్న జలదరింపు కలిగింది. ఆయన ఇంటికి వెళ్లాం. మధ్యాహ్నం మూడు నుంచి రాత్రి ఏడు వరకు ఆయన పాఠం చెప్పారు. పాఠం అంటే కేవలం పాఠం కాదు, అనేక ఇతర అంశాలు, సంస్కారాన్ని జోడించి పాఠం బోధించారు. ఆయనతో కాలం ఇట్టే గడిచిపోయింది. నా చదువు పూర్తయ్యాక, విజయ వాడ లయోలా కళాశాలలో పోస్ట్ ఉందని, వెళ్లమని స్వయంగా విశ్వనాథ వారే పంపారు. అప్పట్లో లయోలా కాలేజీ ఋషివాటికలా ఉండేది. నేను 1996లో అదే కళాశాలలో రిటైరయ్యాను. పద్యం వద్దన్నారు నేను చదువుకునే రోజుల్లో మార్కండేయశర్మ అనే మాస్టారు ‘నువ్వు రచయితవు అవుతావు’ అన్నారు. ఒకసారి ఆయన భారతం విరా టపర్వం చదవమని నాకు ఇచ్చారు. ఆదిపర్వం ఇవ్వ కుండా విరాటపర్వం ఇచ్చారేమిటి అన్నాను. అందుకు ఆయన ‘ఓరి వెర్రివాడా! భారతం పఠనం విరాటపర్వంతో ప్రారంభించాలి’ అన్నారు. ‘భీష్మ ద్రోణ... పద్యం కనిపించింది. నేను చదవలేకపో యాను. అదే మాట ఆయనతో అన్నాను. దానికి సమాధానంగా ఆయన, ‘ఏవీ వాటంతట అవి అర్థం కావు. మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి, తెలుసుకోవాలి’ అన్నారు. అప్పటి నుంచి ప్రతి అంశాన్నీ పట్టుదలతో నేర్చుకోవడం ప్రారంభిం చాను. అప్పట్లో గురువుల తర్ఫీదు అలా ఉండేది. ఆ రోజుల్లోనే ఒకసారి కొన్ని పద్యాలు రాసి, విశ్వనాథ వారికి చూపించాను. అప్పటికే ‘నీళ్లు’ కథ రాసి ఆయన ప్రశంసలు పొందాను. నా పద్యాలు విన గానే, ‘ఇంకెప్పుడైనా పద్యాలు రాసావంటే తంతా నురా’ అన్నారాయన. మళ్లీ పద్యం జోలికి పోలేదు. నేను చదువుకునే రోజుల్లో నాకు స్కాలర్ షిప్ వచ్చింది. కానీ మా నాన్నగారు వద్దన్నారు. చేతిలోకి వచ్చిన మహా నిధి పోయినట్లు అనిపించింది. అప్పుడు వేరే అబ్బాయికి ఇచ్చారు. ఏడుపొచ్చేసింది. ఇంటికి వచ్చి ఏడ్చాను. ‘‘మా నాన్న నన్ను గుండెల మీద పడుకోబెట్టుకుని, ‘స్కాలర్ షిప్ పేద పిల్లల కోసం’ అని చెప్పారు. ఆ మాట నాకు ఇప్పటికీ గుండెను తాకుతూ ఉంటుంది. చదివితే రాయగలుగుతాం పెద్దవాళ్ల రచ నలు బాగా చదివిన తరవాత, అసలు నేను ఎందుకు కథ రాయకూడదు అనుకున్నాను. కేవలం రచనలు చదవడమే కాకుండా, లోకజ్ఞానం కోసం అనేక ప్రాంతాలు సందర్శించాలనుకున్నాను. తలుపులన్నీ మూసుకు కూర్చుంటే ఉత్తమ కథలు రావని, అనేక మంది జీవితాలను బాగా పరిశీలించగలిగితే, మంచి మంచి కథలు వస్తాయని తెలుసుకున్నాను. అలా కథలు రాయడం మొదలుపెట్టాను. అలా భారతిలో మొత్తం 14 కథలు, 2 నవలలు ప్రచురితమయ్యాయి. అమరావతి పేరుతో ప్రకృతి ధ్వంసం ‘చిన్న కథ’ గోదావరి, కృష్ణా తీర ప్రాంతాలలో పుట్టి పెరిగింది. ఒక వింతైన మాట, వింతైన దృశ్యం కథ అవుతాయి. అయితే దాన్ని పట్టించుకోవాలి. దాని గురించి ఆలోచించాలి. అది మనసులో బీజంలా నాటుకోవాలి. అప్పుడు అది మనకు తెలియకుండానే మనలో పెరిగిపెరిగి ఒక మాను అవుతుంది. అప్ర యత్నంగా కథరూపంలా బయటకు వస్తుంది. కథ జీవితంలో నుంచి వస్తుంది. కథ రాయడం మిగిలిన అన్ని ప్రక్రియల కంటె చాలా కష్టం. కథ రాయడానికి మనిషి మానసికంగా బాధ పడాలి, అనుభూతి చెందాలి. ఉత్తమకథ అంగవైకల్యం లేని శిశువులా బయటకు వస్తుంది. ఉత్తమ రచయితల జన్మ ధన్యం. ఇప్పుడు కోస్తా జిల్లాల నుంచి కథలు రావట్లేదు. ముఖ్యంగా పచ్చటిపొలాలు ఉన్న ప్రాంతాన్ని ఈ ప్రభుత్వం రాజధాని కోసం తీసేసుకుంది. అందు వల్ల తాజాగా ఉండే కూరలు, పండ్లు, పూలు మాకు దూరమైపోయాయి. అటువైపుగా వెళ్లాలంటేనే చాలా బాధ వేస్తోంది. ఈ ప్రాంతానికి రైతు దూరమై పోయాడు. అక్కడకు వెళ్లి పోరాటం చేయాలను కుంటున్నాను. ఎంతటి అందమైన ప్రాంతం. ఈ ప్రాంతంలో భూమాత పచ్చటి పట్టుచీర కట్టుకునేది. పుడమి తల్లి ఎంత బాధపడుతోందో అనిపిస్తుంది. మనిషికి భూమితో సంబంధం తెగిపోయింది. పెద్ద పెద్ద భవంతులు వచ్చి కూర్చున్నాయి. అందుకే అక్కడ నుంచి కథలు రావట్లేదు. ఈ ప్రాంతాల నుంచే కథలు... రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల నుంచి మంచిమంచి కథలు వస్తున్నాయి. అక్కడ మనిషికి భూమితో ఇంకా సంబంధం తెగిపోలేదు. భూమి పండితే సంతో షం... భూమి ఎండితే దుఃఖం... వారి కథలలో భూమి, మనిషి కథాంశాలు. ప్రస్తుతం నవలలు రావట్లేదు. నవలల పేరుతో చెత్త రాకుండా, మేలు జరిగింది. ఇది మంచి పరిణామం. మంచి కథ చదివితే జీవిత శకలం అనుభవానికి వచ్చినట్లు ఉంటుంది. కథ చదివిన తరవాత కొంతసేపటి వరకు వాస్తవంలోకి రాలేకపోతాం. మనల్ని మనం మరచి పోతాం. ఇప్పుడు ఇక్కడ డబ్బు, మనిషి కథాంశా లుగా మారిపోతున్నాయి. కార్పొరేట్ కల్చర్ మొదల య్యాక మనీ కల్చర్ తప్ప మరేమీ లేదు. అభివృద్ధి పేరుతో మానవ విలువలు నశించిపోయాయి. నేను బెజవాడను ప్రేమించాను. రెండుసంవత్సరాల క్రితం గవర్నర్‌తో సన్మానం చేయించారు. అంతిమంగా, నా నిర్జీవ వ్యర్థ ప్రసాదాన్ని మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసు పత్రికి రాసి ఇచ్చేశాను. – సంభాషణ : డా. పురాణపండ వైజయంతి -
పెద్దిభొట్ల వెళ్లిపోయారు
-
సాహిత్య చరిత్రలో పెద్దిభొట్లది ప్రత్యేక స్థానం: వైఎస్ జగన్
సాక్షి, గోపాలపురం : విఖ్యాత కథా రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పురస్కార గ్రహీత పెద్దభొట్ల సుబ్బరామయ్య మృతిపట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. 350కి పైగా కథనలు, 8 నవలలు రచించి సాహితీ రంగానికి పెద్దభొట్ల విశేష సేవలందించారని వైఎస్ జగన్ కొనియాడారు. తెలుగు సాహిత్య చరిత్రలో పెద్దిభొట్ల ఎప్పటికీ నిలిచిపోతారని అన్నారు. పెద్దిభొట్ల కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. విఖ్యాత రచయిత పెద్దిభొట్ల కన్నుమూత