బండి నారాయణ స్వామి–రాయలసీమ సాహిత్యానికి ఓ బండి చక్రం. కాదు, కాదు–ఆ బండి చక్రానికి ఇరుసు. కరువును కళ్లారా చూసి కాసిని కన్నీళ్లను అక్షరాలుగా మలిచినవాడు. ఆ అక్షరాలను నెత్తుటితో రంగరించి అనంత శక్తినొసగినవాడు. ఆ శక్తితో అనుపమానమైన సాహిత్యాన్ని సృష్టించినవాడు. చరిత్రలో మరుగున పడిపోయిన అనేకానేక సందర్భాల నుంచి సీమకు జరిగిన అన్యాయాలను, అక్రమాలను.. ఎందరో దాచేసిన అసత్యాలను, అర్థసత్యాలను అక్షర నిష్టతో వెలికితీసినవాడు. ఆ నిరంతర కృషికి ఇవాళ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. ‘శప్తభూమి’పై రుద్రతాండవం చేసిన అభిశప్తుడికి ఓ అభయం లభించింది.
శప్తభూమి నవల క్రీ.శ. 1775వ సంవత్సరంలో ప్రారంభమవుతుంది. విజయనగర సామ్రాజ్య పతనం అనంతరం చిన్నచిన్న రాజ్యాలు ఏర్పడటం, దళిత బహుజనులతో సహా పలువురు అధికారాన్ని హస్తగతం చేసుకోవడం, వారిమధ్య ఆధిపత్య పోరు, అందులో భాగంగా చిమ్మిన నెత్తురు నవలంతా చిత్తడిగా పరచుకుంటుంది. ఈ నవలలోని సిద్ధరామప్పనాయుడు, కరిహుళి బసవప్ప, దళవాయి సుబ్బరాయుడు, బ్రౌన్, మాడల కందప్ప వంటి వారు నిజంగా ఆ కాలంలో జీవించినవారు. మిగిలిన అనేక పాత్రలకు అప్పటి సంఘటనల ఆధారంగా స్వామి ప్రాణం పోశారు.
ఆ కాలంలో సాగిన సతీసహగమనం, బసివిని వంటి ఆచారాలు, సంతలు, పరసల తీరుతెన్నులు, పూజలు, పండుగలు, పెళ్లిళ్లు, ఆయా కులాల ఆచార వ్యవహారాలు, సుంకాలు, పెళ్లి పన్ను, చేను మాన్యాలు, కుల పురాణాలు, కుటుంబ చరిత్రలు, హేయమైన శిక్షలు, అత్యాచారాలు, అక్రమాలు, గాలి దేవరలు, వీరగల్లులు.. అన్నీ సవివరంగా చిత్రించిన తీరు చూస్తూ ఆయా వివరాలను సేకరించడానికి రచయిత ఎంత కష్టించి ఉంటారో అవగతమవుతుంది. ‘తానా’ బహుమతి నవలగా వెలువడినప్పుడే స్వామి ‘శప్తభూమి’కి విశేష ఆదరణ లభించింది. ఇప్పుడు అకాడమీ అవార్డు రావడం, సాహితీ ప్రియులందరికీ సంతోషం కలిగించే అంశం. – దేశరాజు
Comments
Please login to add a commentAdd a comment