bandi narayana swamy
-
సాహిత్య అకాడమీ అవార్డుల ప్రదానం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఏపీలకు చెందిన రచయితలు బండి నారాయణ స్వామి, పెన్నా మధుసూదన్‌లు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు అందుకున్నారు. 23 భారతీయ భాషల్లో రచనలకు గాను ఏటా ప్రకటించే సాహిత్య అకాడమీ అవార్డులను డిసెంబర్ 18న ప్రకటించిన సంగతి తెలిసిందే. అనంతపురం జిల్లాకు చెందిన బండి నారాయణ స్వామి రాయలసీమ చరిత్ర ఆధారంగా తెలుగులో రాసిన శప్తభూమికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించగా.. మంగళవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో అకాడమీ అధ్యక్షుడు చంద్రశేఖర్ కంబర్ చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారం అందుకున్నారు. కాగా, సంస్కృత భాషలో పెన్నా మధుసూదన్ రాసిన ప్రజ్ఞాచాక్షుషం కావ్యానికి కూడా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఆయన కూడా మంగళవారం జరిగిన కార్యక్రమంలో పురస్కారాన్ని అందుకున్నారు. పెన్నా మధుసూదన్ జడ్చర్లకు చెందినవారు. గతంలో ఆయన సోమనాథ్ సంస్కృత పండిట్ అవార్డు, పండిట్ లట్కర్‌శాస్త్రి మెమోరియల్ అవార్డు తదితర పురస్కారాలు అందుకున్నారు. మహారాష్ట్రకు చెందిన సాధువు గులాబ్‌రావు మహారాజ్ ఆధ్యాత్మిక తత్వబోధనలపై ప్రజ్ఞాచాక్షుషం రచించారు. కార్యక్రమంలో అకాడమీ కార్యదర్శి కె.శ్రీనివాసరావు స్వాగతోపన్యాసం చేశారు. చాలా ఆనందంగా ఉంది అవార్డు అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మహారాష్ట్రలో ఒక రైతు కుటుంబంలో ఒక నిర్దన పరివారంలో పుట్టిన ఒక గొప్ప మహాత్ముడి జీవితాన్ని 850 శ్లోకాల్లో రాశాను. ఆయన జీవితం, ఆయన దార్శనిక విచారాలు, తత్వజ్ఞానాలు ప్రస్తావించాను. ఆ మహాత్ముడి జీవితం తెలియాలి. 34 ఏళ్లు మాత్రమే జీవించారు. 134 పుస్తకాలు,4 భాషల్లో రాశారు. భారతీయ ధర్మాన్ని స్థాపించాలని ప్రయత్నించారు. మరిన్ని రచనలు చేసేందుకు ఈ అవార్డు ప్రోత్సాహాన్నిస్తుంది. –పెన్నా మధుసూదన్ అవార్డు రావడం సంతోషకరం నేను రాసిన శప్తభూమి నవలకు ఈ అవార్డు రావడం పాఠకులకు ఎక్కువ సంతోషాన్నిచ్చింది. దాని ఆధారంగా నాకూ సంతోషాన్నిచ్చింది. తెలంగాణ విడిపోయిన క్రమంలో రాయలసీమ ప్రాంతీయ అస్తిత్వం ప్రశ్నార్థకమైంది. రాయలసీమకు కూడా తనకంటూ ఒక భాష, సంస్కృతి ఉందని వివిధ ప్రాంతాలకు తెలియపరిచేందుకు ఈ శప్తభూమి రాశాను. రాయలసీమ చారిత్రక మూలాలు 18వ శతాబ్దం నుంచి తీసుకుని ఈ నవల రాశాను. రాయలసీమ కరువు, కరువుల పరంపరలను నవలలో రాశాను. రాయలసీమ కరువు కాటకాలను, సుఖదుఃఖాలను వివిధ ప్రాంతాలతో పంచుకునే అవకాశం లభించింది. – బండి నారాయణ స్వామి -
అవినీతి తగ్గించడానికి దృష్టి పెట్టాలి: సీఎం జగన్
-
అవినీతిని అంతం చేయాల్సిందే: సీఎం జగన్
సాక్షి, అమరావతి: అన్ని స్థాయిల్లో అవినీతిని రూపుమాపడానికి అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. అవినీతి నిరోధానికి ఏర్పాటు చేసిన 14400 టోల్‌ఫ్రీ నంబర్‌పై ప్రచార వీడియోలను ఆయన మంగళవారం విడుదల చేశారు. సీఎం జగన్, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు సందేశంతో ఈ వీడియోలను తయారుచేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఎట్టిపరిస్థితుల్లోను అవినీతి ఉండకూడని స్పష్టం చేశారు. అన్ని రంగాల్లో అవినీతిని ఏరివేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. (ఎవరికీ అన్యాయం జరగకూడదు: సీఎం జగన్) వారిద్దరికీ అభినందనలు: సీఎం జగన్ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు అందుకోనున్న బండి నారాయణస్వామి, పి. సత్యవతి (అనువాద విభాగం)లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. తెలుగు సాహిత్యానికి ఇరువురు విశేషమైన సేవలను అందించారని ప్రశంసించారు. రాష్ట్రం నుంచి ఇద్దరు రచయితలను ఈ అవార్డులు వరించడం తెలుగువారందరికీ గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. (నారాయణస్వామికి కేంద్ర సాహిత్య పురస్కారం) చదవండి: (ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో సీఎం జగన్ భేటీ) -
‘చంద్రబాబు రాయలసీమ ద్రోహి’
-
‘చంద్రబాబు రాయలసీమ ద్రోహి’
సాక్షి, అనంతపురం : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యవహార శైలిపై రాయలసీమ ప్రజాసంఘాల నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు రాయలసీమ ద్రోహి అని మండిపడ్డారు. అమరావతి పోరాటానికి మద్దతు కోరేందుకు చంద్రబాబు సోమవారం అనంతపురంలో పరటించనున్నారు. ఈ నేపథ్యంలో రాయలసీమ ప్రజాసంఘాల నేతలు చంద్రబాబుకు బహిరంగం లేఖను విడుదల చేశారు. 1956లో తెలుగువారి ఐక్యత కోసం కర్నూలు రాజధానిని త్యాగం చేసిన సంగతి గుర్తులేదా అని సూటిగా ప్రశ్నించారు. రాయలసీమకు రావాల్సిన ముఖ్యమైన ప్రాజెక్టులను ఎందుకు ఇతర ప్రాంతాలకు తరలించారని నిలదీశారు. రాయలసీమను చంద్రబాబు అనేక సందర్భాల్లో అవమానించారని గుర్తుచేశారు. అమరావతిలోనే అన్నీ ఉండాలన్న చంద్రబాబు ఆలోచన సరికాదని అన్నారు. అమరావతి మాత్రమే అభివృద్ధి చెందితే.. ఇతర జిల్లాల పరిస్థితి ఏమిటని నిలదీశారు. రాష్ట్ర విభజన తరువాత అధికార వికేంద్రీకరణ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. అధికార, అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు వెల్లడించారు. చంద్రబాబు బస్సు యాత్రను అడ్డుకుని తీరుతామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత బండి నారాయణ స్వామి మాట్లాడుతూ చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు రాయలసీమ ద్రోహి అని విమర్శించారు. శ్రీభాగ్ ఒప్పందం అమలు చేయలేదని.. కడప స్టీల్ ఫ్యాక్టరీ, కర్నూలు రాజధాని లేదా హైకోర్టు, అనంతపురానికి ఎయిమ్స్ రాకుండా అడ్డుపడ్డారని ఆరోపించారు. -
ఒక ప్రాంతీయ రచయిత సార్వజన ఘోష
రౌద్రమూ, బీభత్సమూ, విషాదమూ ముప్పిరిగొనే శప్తభూమి నవల చారిత్రక విభాత సంధ్యలో మానవ కథ వికాసమెట్టిదో నిరూపిస్తుంది. ‘‘బాబ్రీ మసీదును రామజన్మభూమిగా విశ్వసిస్తే తప్ప హిందువు కాడంటే, నేను హిందువును కాను. నాస్తికుడైతే తప్ప కమ్యూనిస్టు కానేరడు అంటే, నేను కమ్యూనిస్టును కాను. అవినీతిని తాత్వీకరించుకున్న దొంగల రాజ్యంలో ఆ దోపిడీ స్వభావపు పాలనాధికారం కోసమే తమ దళిత రాజకీయాలు ఉన్నాయంటే, నేను దళితవాదిని కాను. భిన్న భిన్న ప్రాంతాల వివిధాత్మక జీవితాన్ని గుర్తించి ఆమోదిస్తే తప్ప నేను ప్రాంతీయ తాత్వికుణ్ణి కాలేను,’’ అని స్పష్టంగా ప్రకటించుకున్న సాహిత్యకారుడు ‘స్వామి’. మానవ జీవితాన్నే గురువుగా గుర్తించి, తనదైన విలక్షణమైన చూపుతో జీవితపు చలన సూత్రాలను అన్వేషించే సాధకుడు స్వామి అనే పేరుతో ప్రసిద్ధుడైన బండి నారాయణ స్వామి. కథకుడుగా ప్రారంభించి, నవలలు రాసి, యిటీవల కాలంలో రాయలసీమ సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిణామాలపైన పరిశోధన వ్యాసాలు రాసిన స్వామి తొలినుంచీ తనదైన జీవితపు అస్తిత్వ మూలాలను తరచి చూడడంలోనే తన దృష్టినంతా కేంద్రీకరిస్తున్నాడు. యీ అన్వేషణ ఆయన కథల్లో బీజమై పుట్టి, నవలల్లో మర్రిచెట్లంత విశాలంగా పరుచుకుంటూ వస్తోంది. యీ అన్వేషణ క్రమంలోనే, అనంతపురం చారిత్రక నేపథ్యాల్ని సాహిత్యీకరించిన ‘శప్తభూమి’ నవల రాశాడు. దానికిప్పుడు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చినప్పుడు, తన ప్రాంతపు జీవన సంఘర్షణనిప్పుడు, మిగిలిన ప్రాంతాలవాళ్లు గూడా తెలుసుకుంటారనీ, రచయితలు అభిలషించే వొక ఆదర్శ ప్రపంచంవైపుకు నడవడానికి కొందరైనా సమాయత్తమౌతారనీ మాత్రమే స్వామి సంతోషిస్తాడు. వానరాలే, నీళ్లు, సావుకూడు, అవశేషం వంటి తొలినాటి కథల్లో అనంతపురం జిల్లాలోని జీవిత పోరాటాల్ని చిత్రించడంతో స్వామి యీ అన్వేషణను ప్రారంభించాడు. ‘‘ఎవరు ఎన్ని నీళ్లు వాడతారో తెలిస్తే వాళ్ల నాగరికత ఏపాటిదో చెప్పెయ్యొచ్చు’ అనేది ఒక సూక్తి. తాగడానికి ఒక కడవ నీళ్లు నోచుకోలేనివారికి ఏం నాగరికత ఉంటుంది?’’ అని ముగిసే ‘నీళ్లు’ కథలో రచయిత వాపోయినట్టుగా కనిపించినా, అది నిజానికి నాగరికమని అనుకునే సంఘానికీ, ప్రజాస్వామ్యం అని పిలుచుకుంటున్న మన రాజకీయ వ్యవస్థకూ పెద్ద సవాలుగా మిగులుతుంది. పైనుంచీ నంగనాచి మాదిరి చూస్తావుండే ఆకాశం కింద వాన రాక కోసం యెగజూసుకుంటూ సంవత్సరాలకు సంవత్సరాలు గడిపే అనంతపురం జిల్లా రైతుల ఆక్రందనలను సాహిత్యీకరించడమే తన బాధ్యతగా గుర్తెరిగిన రచయిత స్వామి. కరువు సీమలో మొగుడు చచ్చిపోయిన తర్వాత జరిగిన దివసాల రోజున, బంధువులు అందరూ మాంసాహారాల్ని గొంతుల వరకూ తినివెళ్లిపోయిన తర్వాత, యింకా యేడుస్తూ కూర్చున్న ముసలాయన పెండ్లాం యేడుస్తున్నదెందుకో తెలిసేదెవరికి? ‘‘ఎవురెవురికి పుట్టిన నా కొడుకులో వచ్చి, గొంతువరకూ సించుకొని పోయిరి. నా ఇస్తరాకులో మాత్రము నాలుగు తునకలు ఎయ్యకపోతిరి కదరా! మీ కడుపులు దొక్కా! మీరు తునకలు తిని నా మొగానికి నీల్లు కలిపిన పులుసు పోస్తిరి కదరా!’’ అంటూ ఆ ముసలావిడ తిట్టడం మొదలెడుతుంది. యివీ కరువు సీమల వ్యధలు. వ్యక్తి, కుటుంబము, వూరు, సమాజము, మతము, రాజ్యం, ప్రపంచం– మనిషితో ముడిబడిన యీ విషయాల పైనంతా స్వామికి అక్కరే! ‘‘ప్రపంచం కుగ్రామం కావడం కాదు. కుగ్రామమే ఒక ప్రపంచం కావాలి’’ అని యెలుగెత్తి చెప్పేవాడు స్వామి. అందుకే పై అంశాలలో దేన్నీ వదలకుండా అన్వేషిస్తాడు. యీ అన్వేషణలోనే ఆయన భారతీయమైన తాత్విక చింతనలోనూ మునిగిపోతాడు. జీవితపు మూల తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నంలో నీడలమెట్లు, రెండు అబద్ధాలు, చమ్కీదండ, పద్మపాదం వంటి కథలూ అనేకం రాశాడు. వెతికేవాడికి యేదైనా దొరుకుతుందనీ, వొక్కోసారి ఎంత వెదికినా ఏదీ దొరక్కపోవచ్చుననీ, దొరికేదేదైనా వుంటే అది వాడిపోనీ, వాసన లేనీ చమ్కీదండే అవుతుందనీ స్వామి గ్రహిస్తాడు. స్వామికున్న యీ అస్తిత్వ, సాంఘిక, రాజకీయ అన్వేషణలు కథల్లో వేరువేరుగా కనిపించినా, ఆయన యిటీవలి నవలల్లో మాత్రం ముప్పేటగా పెనవేసుకుపోతాయి. నిత్య విద్యార్థిగా భారతీయ తాత్విక చింతనను అవుపోసన పట్టిన స్వామే అగ్ర శూద్ర కులాల రాజకీయ ఆధిపత్యంపైనా, జాతి ముఖంపైన రుద్దిన బ్రాహ్మణ కుల సంస్కృతిపైనా, రాజకీయ పాలెగాళ్లపైనా తిరుగుబాటును నిర్ద్వంద్వంగా ప్రకటిస్తాడు ‘మీ రాజ్యం మీరేలండి’ నవలలో. దళితుడు మరో దళిత కులంపైన అనుకంపన చెందే ఔన్నత్యాన్నీ, సనాతన సంస్కృతిని చెమట పరం చేసే శూద్రకులాల మూలాల్నీ, వ్యక్తిగత ‘నేను’ను విచ్ఛేదం చేసే అద్వైత చింతననూ, కమ్యూనిస్టు సమాజాన్నీ ఆయన తన గమ్యంగా చూపిస్తాడు. అందుకే ఆ నవలను అంబటి సురేంద్రరాజు ‘శూద్ర గాథా సప్తశతి అను అనంత జీవన ఇతిహాసం’ అని పేర్కొంటాడు. కులాలూ, మతాలూ గాఢంగా వేర్లూనుకున్న భారతదేశంలో వైవిధ్యాలు లేని ఆర్థిక వర్గమొకటి రూపొందించగలమనే యూరోపియన్ భావనను వ్యతిరేకిస్తూ, ప్రతి అట్టడుగు కులమూ తనదైన సాంస్కృతిక వైవిధ్యాన్ని తాను పోషించుకుంటూనే, మిగతా అట్టడుగు కులాలతో కలిసి ఒక రాజకీయ ఎజెండా కింద ఐక్యమయ్యే బహుజన తాత్వికతను ఆపాదిస్తూ స్వామి ‘రెండు కలల దేశమ్’ నవల రాశాడు. ప్రస్తుతాన్ని అర్థం చేసుకోడానికి చరిత్రలోకి ప్రయాణం చేసే లక్షణం స్వామిలో తొలినుంచీ వుంది. ‘అవశేషం’ కథలో ఆయన కురవ కులం వాళ్ల ఆచార వ్యవహారాలను చిత్రించిన తీరులో యీ ధోరణి స్పష్టంగా కనబడుతుంది. అనంతపురం చరిత్రను తెలుసుకోడానికి రచయిత కైఫీయత్తులను, శిలాశాసనాలనూ, గెజిట్‌లనూ, వీరగల్లులనూ అధ్యయనం చేశాడు. తన పరిశోధనలను తనదైన సామాజిక, తత్వశాస్త్ర అవగాహనలతో సాహిత్యీకరించి, ‘శప్తభూమి’ చారిత్రక నవలగా మలిచాడు. హండె హనుమప్ప నాయకుడి వంశస్థుడు సిద్దరామప్ప నాయుడి పరిపాలన కాలంలో జరిగిన సంగతులతో శప్తభూమి ప్రారంభమవుతుంది. ఆ కాలంనాటి ఆచారాలూ, వ్యవహారాలూ, నమ్మకాలూ, మొత్తం ఆనాటి సమాజాన్నీ, పాలేగాళ్ల వంటి రాజుల అరాచకపు పాలననూ, వాళ్ల పాదాల కింద పడి నలిగిపోయిన దళిత, బహుజన సముదాయాల ఘోషనూ యీ నవల నినదిస్తుంది. రౌద్రమూ, బీభత్సమూ, విషాదమూ ముప్పిరిగొనే ఈ నవల చారిత్రక విభాత సంధ్యలో మానవ కథ వికాసమెట్టిదో నిరూపిస్తుంది. రచనతో బాటూ రచయిత గూడా ప్రయాణం చేయడం, దారిలో కొత్త సత్యాల్ని తెలుసుకోవడం యీ నవలలో గమనించవచ్చు. నవలను రాస్తున్నప్పుడు, అణగారిన వర్గాల వాళ్లంతా దళిత బహుజన కులాల వాళ్లేనని తెలిసిందనీ, అలా యీ నవల క్రమంగా రాయలసీమ దళిత బహుజన చారిత్రక నవలగా మారిందనీ రచయితే చెప్పుకున్నాడు. చారిత్రక నవలలు పాశ్చాత్య సాహిత్యంలో చాలా వున్నాయి. చారిత్రక నేపథ్యాన్నీ, సత్యాల్నీ, కల్పనాత్మకమైన పాత్రలతోనూ, కథలతోనూ ముడిబెట్టే పాశ్చాత్య చారిత్రక నవలల్లాగే ‘చెంఘిజ్‌ఖాన్’(తెన్నేటి సూరి), ‘గోన గన్నారెడ్డి’(అడవి బాపిరాజు), విశ్వనాథ సత్యనారాయణ రాసిన నేపాళీ కాశ్మీరు రాజవంశ నవలలు కొన్ని తెలుగు చారిత్రక నవలా రచనకు దారి చూపించాయి. స్వామికి తనదైన తమ ప్రాంతపు మౌఖిక ధోరణిలో, తమ అనంతపురం మాండలికంలో రాయడమే యిష్టం. ఆయన శప్తభూమిని చారిత్రక నవల అని పిలిచినా ఆ నవల మునుపున్న చారిత్రక నవలల ధోరణిలో కాకుండా, తన స్వభావానికి అనుగుణమైన రూపంలో, సహజంగా రూపొందాలనే అనుకుంటాడు. శప్తభూమి, స్వామి ముద్ర స్పష్టంగా ఉన్న నవల. నవలంతా రచయితదైన కంఠస్వరం స్పష్టంగా వినబడుతూ వుంటుంది. చివరిలో రచయిత పజ్జెనిమిదవ శతాబ్దానికంతా గొంతుగా మారిపోయి ‘‘యిది ఈ సీడెడ్ జిల్లాల కథ. వదిలించుకున్న జిల్లాల కథ. పాలకులు పట్టించుకోని అనాథ భూమి కథ. ప్రతి కొత్తలోనూ ఒక పాత కొనసాగుతూవుండటమే వర్తమాన చరిత్ర. కరువు కాటకాలూ, పాలేగాళ్ల కొనసాగింపే కదా ఇప్పటికీ ఈ శప్తభూమి గాథ’’ అని వ్యాఖ్యానిస్తాడు. ఈ నవలకు అవార్డు రావడం సాహిత్యకారులందరికీ ఆమోదం కలిగించే విషయం. యీ శప్తభూమిని యికపైన అయినా సుఖసంతోషాల తీరం చేర్చే చిత్తశుద్ధి వున్న ప్రయత్నాలు మొదలైతేనే, సాహిత్యకారులతోబాటు రచయితా సంతోషపడతాడు. -మధురాంతకం నరేంద్ర -
‘శప్తభూమి’కి సాహిత్య అవార్డు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ తెలుగు రచయిత బండి నారాయణస్వామికి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది. రాయలసీమ చరిత్ర నేపథ్యంగా ఆయన రాసిన ‘శప్తభూమి’నవలకు ఈ గౌరవం దక్కింది. కేంద్ర సాహిత్య అకాడెమీ 23 భారతీయ భాషలలో రచనలకు వార్షిక అవార్డులను బుధవారం ప్రకటించింది. 7 కవితా సంకలనాలు, 4 నవలలు, 6 లఘు కథలు, 4 వ్యాసాలు, ఒక నాన్ ఫిక్షన్, ఒక ఆటోబయోగ్రఫీ, ఒక బయోగ్రఫీని అవార్డుల కోసం ఎంపిక చేసినట్లు అకాడెమీ తెలిపింది. 23 భారతీయ భాషలలో జ్యూరీ సభ్యులు సిఫారసు చేసిన రచనలను అకాడెమీ కార్యనిర్వాహక బోర్డు ఆమోదించి అవార్డులను ప్రకటించింది. తెలుగులో కేతు విశ్వనాథరెడ్డి, శీలా వీర్రాజు, డాక్టర్ వి.చినవీరభద్రుడు జ్యూరీ సభ్యులుగా వ్యవహరించారు. బండి నారాయణస్వామి రాయలసీమ రచయితగా గుర్తింపు పొందారు. శప్తభూమి అంటే శాపగ్రస్త ప్రదేశమని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా, గడ్డం మోహన్‌రావు రాసిన ‘కొంగవాలు కత్తి’నవలకు అకాడెమీ యువ పురస్కార్ లభించింది. ‘తాత మాట వరాల మూట’రచనకు గాను బెలగం భీమేశ్వరరావుకు అకాడెమీ ‘బాల సాహిత్య పురస్కారం’ప్రకటించింది. ధరూర్ పుస్తకం, నంది కిశోర్ కవిత కాంగ్రెస్ నేత, రచయిత శశిథరూర్, నాటక రచయిత నంద కిశోర్ ఆచార్య తదితర 23 మంది రచయితలున్నారు. థరూర్ ఆంగ్లంలో రాసిన ‘యాన్ ఎరా ఆఫ్ డార్క్నెస్’పుస్తకం, నందకిశోర్ ఆచార్య హిందీలో రాసిన ‘చలాతే హుయే ఆప్నే కో’కవితకు ఈ పురస్కారం లభించింది. విజేతలకు వచ్చే ఫిబ్రవరి 25వ తేదీన ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో తామ్ర పత్రంతోపాటు రూ.లక్ష నగదు అందజేస్తారు. ఏపీ సీఎం జగన్ అభినందనలు సాక్షి, అమరావతి: ప్రముఖ రచయిత బండి నారాయణస్వామికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడంపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. ఉపాధ్యాయుడిగా, రచయితగా సమాజాన్ని అధ్యయనం చేస్తూ ఆయన చేసిన రచనలు మరెందరికో స్ఫూర్తినిస్తాయని అన్నారు. -
అభిశప్తుడికి ఓ అభయం
బండి నారాయణ స్వామి–రాయలసీమ సాహిత్యానికి ఓ బండి చక్రం. కాదు, కాదు–ఆ బండి చక్రానికి ఇరుసు. కరువును కళ్లారా చూసి కాసిని కన్నీళ్లను అక్షరాలుగా మలిచినవాడు. ఆ అక్షరాలను నెత్తుటితో రంగరించి అనంత శక్తినొసగినవాడు. ఆ శక్తితో అనుపమానమైన సాహిత్యాన్ని సృష్టించినవాడు. చరిత్రలో మరుగున పడిపోయిన అనేకానేక సందర్భాల నుంచి సీమకు జరిగిన అన్యాయాలను, అక్రమాలను.. ఎందరో దాచేసిన అసత్యాలను, అర్థసత్యాలను అక్షర నిష్టతో వెలికితీసినవాడు. ఆ నిరంతర కృషికి ఇవాళ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. ‘శప్తభూమి’పై రుద్రతాండవం చేసిన అభిశప్తుడికి ఓ అభయం లభించింది. శప్తభూమి నవల క్రీ.శ. 1775వ సంవత్సరంలో ప్రారంభమవుతుంది. విజయనగర సామ్రాజ్య పతనం అనంతరం చిన్నచిన్న రాజ్యాలు ఏర్పడటం, దళిత బహుజనులతో సహా పలువురు అధికారాన్ని హస్తగతం చేసుకోవడం, వారిమధ్య ఆధిపత్య పోరు, అందులో భాగంగా చిమ్మిన నెత్తురు నవలంతా చిత్తడిగా పరచుకుంటుంది. ఈ నవలలోని సిద్ధరామప్పనాయుడు, కరిహుళి బసవప్ప, దళవాయి సుబ్బరాయుడు, బ్రౌన్, మాడల కందప్ప వంటి వారు నిజంగా ఆ కాలంలో జీవించినవారు. మిగిలిన అనేక పాత్రలకు అప్పటి సంఘటనల ఆధారంగా స్వామి ప్రాణం పోశారు. ఆ కాలంలో సాగిన సతీసహగమనం, బసివిని వంటి ఆచారాలు, సంతలు, పరసల తీరుతెన్నులు, పూజలు, పండుగలు, పెళ్లిళ్లు, ఆయా కులాల ఆచార వ్యవహారాలు, సుంకాలు, పెళ్లి పన్ను, చేను మాన్యాలు, కుల పురాణాలు, కుటుంబ చరిత్రలు, హేయమైన శిక్షలు, అత్యాచారాలు, అక్రమాలు, గాలి దేవరలు, వీరగల్లులు.. అన్నీ సవివరంగా చిత్రించిన తీరు చూస్తూ ఆయా వివరాలను సేకరించడానికి రచయిత ఎంత కష్టించి ఉంటారో అవగతమవుతుంది. ‘తానా’ బహుమతి నవలగా వెలువడినప్పుడే స్వామి ‘శప్తభూమి’కి విశేష ఆదరణ లభించింది. ఇప్పుడు అకాడమీ అవార్డు రావడం, సాహితీ ప్రియులందరికీ సంతోషం కలిగించే అంశం. – దేశరాజు -
నారాయణస్వామికి కేంద్ర సాహిత్య పురస్కారం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ రచయిత బండి నారాయణస్వామి రచించిన ‘శప్తభూమి’ నవలకు ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ-2019 పురస్కారం లభించింది. ఈసారి 23 భాషల్లో కేంద్ర సాహిత్య అకాడమీ వార్షిక పురస్కారాలు ప్రకటించగా.. పురస్కారం అందుకున్న పుస్తకాల్లో ఏడు కవితా సంపుటాలు, నాలుగు నవలలు, ఆరు కథల పుస్తకాలు, మూడు వ్యాస సంపూటాలు, నాన్ ఫిక్షన్, ఆత్మకథ, జీవిత కథ పుస్తకాలకు ఒక్కొక్కటి చొప్పున సత్కారం దక్కింది. రాయలసీమ చరిత్ర ఆధారంగా శప్తభూమి నవలను నారాయణస్వామి రచించారు. రాయలకాల తదనంతరం సుమారు 18వ శతాబ్దం నాటి అనంతపుర సంస్థాన అధికార రాజకీయాలు, అప్పటి జీవితము చిత్రించిన చారిత్రక నవల ఇది. హండే రాజుల కాలంనాటి సంఘటనలు, కక్షలు, కార్పణ్యాల మధ్య నలిగిన ప్రజల జీవితాల, పాలెగాళ్ల దౌర్జన్యాల సమాహారమైన ఈ నవలకు తానా బహుమతి లభించింది. బండి నారాయణస్వామిది అనంతపురం జిల్లా. 1952 జూన్ 3న అనంతపురం పాత ఊరులో ఆయన జన్మించారు. ఆయన తల్లిదండ్రులు హన్నూరప్ప, పోలేరమ్మ. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం పీజీ సెంటర్లో ఉన్నత విద్యను అభ్యసించిన ఆయన బి.ఎడ్ చేసి ప్రస్తుతం ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. మొత్తం నలభై దాకా కథలు రాసిన ఆయన ‘వీరగల్లు’ కథాసంపుటి వెలువరించారు. గద్దలాడ్తాండాయి, మీరాజ్యం మీరేలండి, రెండు కలలదేశం మొదలైన నవలలు రాశారు. ఆయన రాసిన శప్తభూమి.. తానా సంస్థ 2017లో నిర్వహించిన నవలల పోటీలో బహుమతి పొందింది. బండి నారాయణస్వామి -
కొత్త సందర్భంలో రాయలసీమ కథ
ఏ సామాజిక సందర్భంలో పుట్టిన సాహిత్యం ఆ సామాజిక ఉద్యమానికే వెన్నుదన్నుగా నిలిచిన క్రమమే మనకు తెలుసు. కానీ, సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో పుట్టిన రాయలసీమ సాహిత్యం, అదే సమైక్యాంధ్ర వాదాన్ని వ్యతిరేకిస్తూ సాగడం మన సమాజంలోనే ఒక కొత్త సందర్భం! జనవరి 23, 24 తేదీలలో రాయలసీమ మహాసభ, రాయలసీమ అస్తిత్వ రచయితల వర్క్‌షాపును నిర్వహించింది. అనంతపురంలో రెండు రోజులు నాలుగు పెడలు( విభాగాలు)గా జరిగిన ఈ వర్క్‌షాపులో సమైకాంధ్య్ర ఉద్యమ సందర్భంలో వచ్చిన రాయలసీమ సాహిత్యం గురించి విశ్లేషించినారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో బైటపడిన రాయలసీమ ఆకాంక్షలు కథ, కవిత్వం, పాట, వ్యాసం అనే ఈ నాలుగు ప్రక్రియలలోకి కొత్త వస్తువుల్ని ఎట్లా ప్రవేశపెట్టగలిగాయో పరిశీలించినారు. ఈ వర్క్‌షాపునకు తెలంగాణ నుండి గోరటి వెంకన్న, అంబటి సురేంద్ర రాజు, సిద్ధార్థ వంటి ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరుకావడం విశేషం! ఏ సామాజిక సందర్భంలో పుట్టిన సాహిత్యం ఆ సామాజిక ఉద్యమానికే వెన్నుదన్నుగా నిలిచిన క్రమమే మనకు తెలుసు. కానీ, సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో పుట్టిన రాయలసీమ సాహిత్యం, అదే సమైక్యాంధ్ర వాదాన్ని వ్యతిరేకిస్తూ సాగడం మన సమాజంలోనే ఒక కొత్త సందర్భం! కాదేదీ ఒక స్థిర బిందువు అని బాలగంగాధర తిలక్ అన్నట్లూ- కాలంతోపాటు ప్రాంతీయ అస్తిత్వాలూ, వాటి పరిధులూ మార్పుకు లోనవుతుంటాయి. ఈ చారిత్రక అవగాహన వల్లే రాయలసీమ రచయితలూ మేధావులూ ప్రత్యేక తెలంగాణను సమర్థించినారు. 1800 సంవత్సరంలో నిజాం ప్రభువు కర్నూలు, కడప, అనంతపురం, బళ్లారి జిల్లాలను ఇంగ్లీషు వారికి దత్తత ఇవ్వకుండా ఉండి ఉంటే, దత్త మండలాలని పిలువబడిన నేటి రాయలసీమ అసలు ఉనికిలోనే ఉండేది కాదుగదా అని గుర్తు చేసినారు. 1953లోనే మనం ఆంధ్ర రాష్ట్రం కోసం లక్షలాది మన తెలుగుసోదరులను కర్ణాటకలోనూ, తమిళనాడులోనూ వదిలేసి రాలేదా? అని ప్రశ్నించినారు. సుగాలీ కుటుంబం, ఇరువురు యాత్రికులు, భగీరథ ప్రయత్నము... వంటి కథలతో 95 ఏండ్లుగా కొనసాగుతూ వస్తున్న రాయలసీమ ప్రాదేశిక కథలో వెనుకబాటుతనం ప్రధానాంశం అయితే, రాయలసీమ కొత్త సందర్భం కథలో ఆ వెనుకబాటుతనానికి వెనకాల పనిచేసిన రాజకీయ కారణాలు ప్రధానాంశం. డా॥కె.సుభాషిణి కథ ‘ధృతరాష్ర్టుని కౌగిలి’ ధ్వన్యాత్మకంగా సాగుతుంది. ఈ కథలో త్రిలింగ రాజ్యం 1956లో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌కూ, మొరుసునాడు రాయలసీమ ప్రాంతానికీ మారుపేర్లు. త్రిలింగ రాజ్య సామంతరాజులందరూ రాయలసీమకు చెందిన వీరశేఖర మహారాజును తమ నాయకునిగా ఎన్నుకుంటారు. తమప్రాంతం వాడైన వీరశేఖర మహారాజు పట్టాభిషేకాన్ని చూడటానికి రాయలసీమ ప్రజలు కోస్తాంధ్రకు బయలుదేరతారు. కోస్తాంధ్రలో అడుగుపెట్టినప్పటి నుంచి, కోస్తాంధ్రకూ రాయలసీమకూ మధ్య జీవన ప్రమాణాలలో గల అంతరం అనుభవానికి వచ్చి విభ్రాంతికి లోనవుతారు. కోస్తాంధ్ర ఎద్దులు పచ్చగడ్డి మేస్తుంటే, రాయలసీమ ఎద్దులకు ఎండుగడ్డే గతి. అక్కడ పూడిక తీసిన చెరువులు జలకళతో మెరుస్తుంటాయి. ఇక్కడ అతీగతీ లేని చెరువులు ఎండి పాడైపోయి ఉంటాయి. అందరూ త్రిలింగ దేశ ప్రజలమే కదా! కాని కోస్తాంధ్రులు చేసుకున్న పుణ్యమేమి? రాయలసీమ చేసుకున్న పాపమేమి? అనే ప్రశ్నలకు ఈ కథలో రెండు సమాధానాలు లభిస్తాయి. ఒకటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి బయటకు తీసుకొచ్చిన తరువాత రాయలసీమకు ఇచ్చిన నీటి వాగ్దానాలను వమ్ముచేయడం. రెండవది, కోస్తాంధ్రలో ఎమ్మెల్యే సీట్ల సంఖ్య 123. రాయలసీమలో 52 మాత్రమే! ఈ నంబరు గేము నేపథ్యంలో రాయలసీమ నుంచి వచ్చిన ముఖ్యమంత్రులు కోస్తాంధ్ర ఎమ్మెల్యేల మీద ఆధారపడక తప్పని రాజకీయ పరిస్థితి! జి.వెంకటకృష్ణ కథ ‘పోగొట్టుకున్నది’ రాయలసీమ నీళ్ల కోసం జరగాల్సిన ఉద్యమం హైదరాబాదు కోసం జరగడాన్ని తప్పుపడుతుంది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కృష్ణాపెన్నార్ డ్యాముకు అప్పటి కేంద్ర ప్రభుత్వ ప్రణాళికా సంఘం ఆమోదం తెలిపి ఉన్నింది. ఆ ప్రాజెక్టు వల్ల రాయలసీమకు 400 టీఎంసీల నీళ్లు లభిస్తాయి. 40 లక్షల ఎకరాలకు ఆరు తడి నీళ్లు అందుతాయి. అటువంటి సందర్భంలోనే కోస్తాంధ్రులు తెలివిగా ప్రత్యేకరాష్ట్ర ఉద్యమం లేవదీసినారు. ఆ ఉద్యమాన్ని రాయలసీమ పెద్దలైన పప్పూరు రామాచార్లు వంటి వారు వ్యతిరేకించినారు. తమతో పాటు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి కలిసివస్తే కృష్ణానీళ్ల మీద రాయలసీమకే మొదటి హక్కు ఉంటుందని నమ్మబలికినారు. శ్రీబాగ్ ఒడంబడిక మీద సంతకాలు కూడా చేసినారు. కానీ ప్రత్యేక ఆంధ్రప్రదేశ్‌లో జరిగిందేమిటి? కృష్ణా పెన్నార్ డ్యాముకు బదులు నాగార్జునసాగర్ కట్టుకున్నారు. నాగార్జునసాగర్ నీళ్లు కోస్తా, తెలంగాణ ప్రాంతాలకు పరిమితమయినాయి. సమైక్య ఉద్యమకారులు తుంగభద్రలోకి నడుంలోతున దిగి నినాదాలు ఇస్తుండటంతో ఈ కథ మొదలవుతుంది. చయ్ ఛోడేంగే నయ్ ఛోడేంగే హైదరాబాద్ నయ్ ఛోడేంగే అని వారి నినాదం. ఆ దావలో ఒక రైతు పోతూ పోతూ ఆగి, సమైక్య ఉద్యమ లీడర్‌కి కొన్ని ప్రశ్నలు వేస్తాడు. ‘ఈ తుంగభద్ర నీళ్లు యాటికి పోతాయన్నా?’ ‘కృష్ణానదిలోకి పోతాయి’ ‘కృష్ణానది నుంచీ..? ‘శ్రీశైలం డ్యాంలోకి పోతాయి’ ‘శ్రీశైలం నుంచీ యాటికి పోతాయన్నా’ ‘నాగార్జునసాగర్‌లోకి పోతాయి’ ‘నాగార్జునసాగర్ నుంచీ..?’ ‘కాలువల్లో పడి పొలాల్లోకి పోయి పంటలు పండిస్తాయి’. ‘ఎవరి పంటలు?’ ‘మన సమైక్యాంధ్ర రైతులవి’ ‘ఆ రైతుల్లో మన రాయలసీమోల్లు ఎవురన్నా ఉండారా అన్నా?’ - అయోమయంలో పడతాడు ఆ సమైక్యాంధ్ర లీడరు. ‘యాడో ఉండే హైదరాబాద్‌ను నయ్ ఛోడేంగే అంటాండారే! మల్ల ఈడుండే నీల్లని మాత్రం హమ్ కైసే ఛోడేంగే అన్నా?’ తుపాకీ గుండు మాదిరి తగిలే ఈ ముగింపు వాక్యమే పాఠకునికి కళ్లు తెరిపిస్తుంది. డా॥ఎం.హరికిషన్ కథ ‘జై తెలంగాణ’. వీరేశం స్కూలు హెడ్మాస్టరు. ఉరుకుందప్ప అతని మిత్రుడు. ఇద్దరు ఒక పెళ్లి కార్యం మీద బైరాపురం పోతారు. కెనాల్ ఎగువన మిరప, పత్తి పంటలతో భూములు కళకళలాడుతుంటాయి. ఆ భూములు తమ ఊరి వాళ్లవే అనీ, గుంటూరోళ్లు గుత్తకు చేస్తున్నారనీ చెప్పాడు ఉరుకుందప్ప. మా ఊరోళ్లు ఉత్త సోమరిపోతులు అని కూడా చెప్తాడు. కెనాల్ దిగువన పంటలు వాడిపోతుంటాయి. కెనాల్ ఎగువన ఉన్న కాలనీ వాళ్ళు అధికారుల నోళ్లల్లో డబ్బులు కొట్టి, రాత్రిళ్లు పైపులు పెట్టి నీళ్ళు లాగేసుకుని మంచిపంటలు పండించుకుంటారనీ, అందుకే కెనాల్ దిగువన పంటలు ఎండిపోయినాయనీ తెలుస్తుంది. నీటి రుచి తెలియనివాడు నీటిదొంగగా మారలేడు. సమైక్యాంధ్ర వైపు నిలవాల్సిన రచయిత తెలంగాణ పక్షం ఎందుకు వహించినాడో కూడా ఇక్కడ అర్థమవుతుంది. జి.ఉమామహేశ్వర్ ‘జలపాఠం’ మాంత్రిక వాస్తవికత రూపంతో నడిచిన కథ. ఇందులో హఠాత్తుగా కృష్ణా నది మాయమైపోతుంది. ఈ నది మాయమైపోయినప్పుడు, రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణల రాజకీయాలూ, మనోభావాలూ ఎట్లుంటాయి అనేది కథ. రాయలసీమ రాజకీయాలకు వస్తే - జిల్లాకు 100 టీఎంసీలు (1972 వ్యవసాయ ప్లానింగ్ కమిషన్ ప్రకారం) ఇవ్వవలసిన ప్రభుత్వం ఐదు, పదీ టీఎంసీలతో రాజకీయాలు చేస్తూ ఉంది. ఈ చెంచాడు నీళ్ల కోసం రాయలసీమలో - జిల్లాకూ జిల్లాకూ మధ్య నీటి యుద్ధాలు. ఒక నియోజకవర్గంలోనే మండలాల మధ్య నీటి యుద్ధాలు. ఈ నీటి యుద్ధాలలోనే తమ ప్రాంతం కోసం తొడగొట్టి ఓట్లు దండుకునే రాజకీయ నాయకులు కృష్ణానది మాయంకాగానే అయోమయంలో పడతారు. కథ చివర కృష్ణానది పోయి పోయి సరస్వతిని చేరుతుంది. ఎందుకొచ్చావ్ కృష్ణా అని సరస్వతి ఆప్యాయంగా అడిగితే - మనం ఉన్నాం కాబట్టి ఈ మనుషులు జీవిస్తారనుకున్నాను. కానీ మనకోసమే గొడవలు పడి ప్రాణాలు తీసుకుంటున్నారు. అందుకే నీ మాదిరి అంతర్వాహినిగా మిగిలిపోతాను అంటుంది. మల్లెల నరసింహమూర్తి, సడ్లపల్లి చిదంబర రెడ్డి వంటివారు కొత్త సందర్భం కవిత్వం రాస్తున్నారు. సురేశ్, రామాంజనేయులు వంటి వారు కొత్త సందర్భం పాటలు రాస్తున్నారు. అప్పిరెడ్డి హరినాథరెడ్డి, పాణ్యం సుబ్రహ్మణ్యం, ఎస్.ఎం.బాషా, రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, బండి నారాయణస్వామి వంటివారు కొత్త సందర్భం వ్యాసాలు రాస్తున్నారు. వీరు కాలపు మాళిగలో ఇరుక్కున్న రాయలసీమ చరిత్రనీ, సంస్కృతినీ, తవ్వితీస్తున్నారు. వీరికి రాయలసీమ మహాసభ అక్షర జేజేలు పలుకుతూ ఉంది. బండి నారాయణస్వామి 8886540990