
సాక్షి, అనంతపురం : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యవహార శైలిపై రాయలసీమ ప్రజాసంఘాల నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు రాయలసీమ ద్రోహి అని మండిపడ్డారు. అమరావతి పోరాటానికి మద్దతు కోరేందుకు చంద్రబాబు సోమవారం అనంతపురంలో పరటించనున్నారు. ఈ నేపథ్యంలో రాయలసీమ ప్రజాసంఘాల నేతలు చంద్రబాబుకు బహిరంగం లేఖను విడుదల చేశారు. 1956లో తెలుగువారి ఐక్యత కోసం కర్నూలు రాజధానిని త్యాగం చేసిన సంగతి గుర్తులేదా అని సూటిగా ప్రశ్నించారు. రాయలసీమకు రావాల్సిన ముఖ్యమైన ప్రాజెక్టులను ఎందుకు ఇతర ప్రాంతాలకు తరలించారని నిలదీశారు. రాయలసీమను చంద్రబాబు అనేక సందర్భాల్లో అవమానించారని గుర్తుచేశారు.
అమరావతిలోనే అన్నీ ఉండాలన్న చంద్రబాబు ఆలోచన సరికాదని అన్నారు. అమరావతి మాత్రమే అభివృద్ధి చెందితే.. ఇతర జిల్లాల పరిస్థితి ఏమిటని నిలదీశారు. రాష్ట్ర విభజన తరువాత అధికార వికేంద్రీకరణ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. అధికార, అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు వెల్లడించారు. చంద్రబాబు బస్సు యాత్రను అడ్డుకుని తీరుతామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత బండి నారాయణ స్వామి మాట్లాడుతూ చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు రాయలసీమ ద్రోహి అని విమర్శించారు. శ్రీభాగ్ ఒప్పందం అమలు చేయలేదని.. కడప స్టీల్ ఫ్యాక్టరీ, కర్నూలు రాజధాని లేదా హైకోర్టు, అనంతపురానికి ఎయిమ్స్ రాకుండా అడ్డుపడ్డారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment