సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ రచయిత బండి నారాయణస్వామి రచించిన ‘శప్తభూమి’ నవలకు ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ-2019 పురస్కారం లభించింది. ఈసారి 23 భాషల్లో కేంద్ర సాహిత్య అకాడమీ వార్షిక పురస్కారాలు ప్రకటించగా.. పురస్కారం అందుకున్న పుస్తకాల్లో ఏడు కవితా సంపుటాలు, నాలుగు నవలలు, ఆరు కథల పుస్తకాలు, మూడు వ్యాస సంపూటాలు, నాన్ ఫిక్షన్, ఆత్మకథ, జీవిత కథ పుస్తకాలకు ఒక్కొక్కటి చొప్పున సత్కారం దక్కింది. రాయలసీమ చరిత్ర ఆధారంగా శప్తభూమి నవలను నారాయణస్వామి రచించారు. రాయలకాల తదనంతరం సుమారు 18వ శతాబ్దం నాటి అనంతపుర సంస్థాన అధికార రాజకీయాలు, అప్పటి జీవితము చిత్రించిన చారిత్రక నవల ఇది. హండే రాజుల కాలంనాటి సంఘటనలు, కక్షలు, కార్పణ్యాల మధ్య నలిగిన ప్రజల జీవితాల, పాలెగాళ్ల దౌర్జన్యాల సమాహారమైన ఈ నవలకు తానా బహుమతి లభించింది.
బండి నారాయణస్వామిది అనంతపురం జిల్లా. 1952 జూన్ 3న అనంతపురం పాత ఊరులో ఆయన జన్మించారు. ఆయన తల్లిదండ్రులు హన్నూరప్ప, పోలేరమ్మ. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం పీజీ సెంటర్‌లో ఉన్నత విద్యను అభ్యసించిన ఆయన బి.ఎడ్ చేసి ప్రస్తుతం ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. మొత్తం నలభై దాకా కథలు రాసిన ఆయన ‘వీరగల్లు’ కథాసంపుటి వెలువరించారు. గద్దలాడ్తాండాయి, మీరాజ్యం మీరేలండి, రెండు కలలదేశం మొదలైన నవలలు రాశారు. ఆయన రాసిన శప్తభూమి.. తానా సంస్థ 2017లో నిర్వహించిన నవలల పోటీలో బహుమతి పొందింది.
బండి నారాయణస్వామి
Comments
Please login to add a commentAdd a comment