Kendra Sahitya Academy Award
-
మధురాంతకం, వారాలకు కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు
సాక్షి, న్యూఢిల్లీ/తిరుపతి: ఇద్దరు తెలుగు రచయితలను కేంద్ర సాహిత్య అకాడమి అవార్డులు వరించాయి. అకాడమి 2022 సంవత్సరానికి అవార్డులను గురువారం ప్రకటించింది. తెలుగు రచయితలు మధురాంతకం నరేంద్ర, వారాల ఆనంద్‌లకు పురస్కారాలు దక్కాయి. జీవితంలో ప్రజాస్వామిక దృక్పథం ఎంతో అవసరమని నమ్మే కథా రచయితల్లో ఒకరైన మధురాంతకం నరేంద్ర రచించిన ‘మనోధర్మ పరాగం’ నవలకు సాహిత్య అకాడమీ పురస్కారం, అనువాద రచనల విభాగంలో వారాల ఆనంద్ రాసిన ‘ఆకుపచ్చ కవితలు‘ పుస్తకానికి అనువాద పురస్కారం లభించాయి. త్వరలో రూ.లక్ష నగదు, జ్ఞాపికతో వీరు ఈ అవార్డులను అందుకోనున్నారు. నాడు తండ్రికి.. నేడు కుమారుడికి.. సామాజిక అంశాలే కథా వస్తువులుగా, సీమ వేషభాషలే ప్రాతిపదికగా పాత్రల తీరుతెన్నులు, జన వాస్తవిక దృక్పథమే ఆలంబనగా రచనలు చేస్తూ మధ్యతరగతి జీవుల జీవిత విశేషాలకు దర్పణం పట్టిన మధురాంతకం నరేంద్ర 1957 జూలై 16వ తేదీన ప్రస్తుతం తిరుపతి జిల్లా పాకాల మండలంలోని రమణయ్యగారిపల్లెలో నాగభూషణమ్మ, మధురాంతకం రాజారాం దంపతులకు జన్మించారు. ప్రస్తుతం తిరుపతి పద్మావతి నగర్లో నివాసముంటున్నారు. ఎంఏ ఇంగ్లిష్ లిటరేచర్, ఎంఫిల్, పీహెచ్డీ చేసిన నరేంద్ర ఎస్వీ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్‌కి ప్రిన్సిపాల్‌గా పని చేశారు. ఎస్వీయూ ఇంగ్లిష్ ప్రొఫెసర్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. సుప్రసిద్ధ రచయితగా కథలు, నవలలు, నాటకాలు, గేయాలు రచించిన సాహిత్య ఘనాపాటి అయిన తండ్రి మధురాంతకం రాజారాం వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నారు. తమిళ, కన్నడ, హిందీ, ఆంగ్ల, రష్యన్ భాషల్లోకి అనేక పుస్తకాలను అనువదించి సాహిత్యమే ఊపిరిగా జీవించిన రాజారాం గతంలో సాహిత్య అకాడమి అవార్డు అందుకున్నారు. కాగా, మైక్రోకోమ్స్ ఆఫ్ మోడర్న్ ఇండియా, కథాంజలి, కుంభమేళా, అస్తిత్వానికి అటు ఇటు, రెండేళ్లు పద్నాలుగు, భూచకం, కొండకింద కొత్తూరు, రూపాంతరం, పాటాంతరం, వెదురుపువ్వు, మధురాంతకం నరేంద్ర కథలు, నాలుగుకాళ్ల మండపం, కథాయాత్ర, తాత్వికకథలు, కథావర్షిక.. తదితరాలు నరేంద్ర రచనలు. డిగ్రీలోనే ఆనంద్ సాహితీ ప్రయాణం కరీంనగర్‌కు చెందిన వారాల ఆనంద్ కవి, రచయితడాక్యుమెంటరీ చిత్రాల దర్శకుడు, ఫిల్మిక్రిటిక్. ప్రముఖ కవి పద్మభూషణ్ గుల్జార్ రాసిన గ్రీన్పోయెమ్స్ 2019లో ఆనంద్ తెలుగులోకి అనువదించిన ‘ఆకుపచ్చ కవితలు’ పుస్తకంలో ప్రకృతికి సంబంధించిన 58 కవితలు ఉన్నాయి. ఆనంద్ డిగ్రీ చదువుతున్న సమయంలోనే తన సాహితీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1999లో నవ్యచిత్ర వైతాళికులు, మానేరు తీరం(కవిత్వం), బాలల చిత్రాలు వెలువరించారు. 2001లో సినీసుమాలు, 24 ఫ్రేమ్స్, 2010లో మానేరు గలగల, మెరుపు (సాహిత్యకారుల ఇంటర్వ్యూలు), 2017లో మనిషిలోపల (కవిత్వం), 2018లో అక్షరాల చెలిమి(కవిత్వం), బంగారు తెలంగాణలో చలనచిత్రం, తెలంగాణ సినిమా దశదిశ అనే రచనలు చేశారు. ఆనంద్ లైబ్రేరియన్‌గా ఉద్యోగ విరమణ పొందారు. రచయితలకు సీఎం జగన్ అభినందనలు సాక్షి, అమరావతి: కేంద్ర సాహిత్య అకాడమి పురస్కారానికి ఎంపికైన తెలుగు రచయితలు వారాల ఆనంద్, మ«దురాంతకం నరేంద్రలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం అభినందనలు తెలిపారు. ఇద్దరు సాహిత్యవేత్తలు అద్భుత రచనా నైపుణ్యంతో తెలుగుకీర్తిని పెంపొందించారని చెప్పారు. వారు తెలుగు సాహిత్యానికి ఎనలేని కృషి చేశారని కొనియాడారు. -
సజయకు కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు
సాక్షి, న్యూఢిల్లీ: రచయిత్రి, సామాజిక ఉద్యమకారిణి కాకర్ల సజయకు 2021 సంవత్సరానికి సంబంధించి అనువాద విభాగంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం దక్కింది. ప్రముఖ రచయిత్రి భాషాసింగ్ రచించిన అదృశ్య భారత్(నాన్ ఫిక్షన్) హిందీ పుస్తకాన్ని సజయ ‘అశుద్ధ భారత్’పేరిట తెలుగులోకి అనువదించారు. అకాడమీ అధ్యక్షుడు చంద్రశేఖర్ కాంబర్ నేతృత్వంలోని కార్యనిర్వాహక బోర్డు శుక్రవారం సమావేశమై 22 పుస్తకాలను సాహిత్య అకాడమీ అనువాద అవార్డులకు ఎంపిక చేసింది. ఆయా వివరాలు అకాడమీ కార్యదర్శి కె.శ్రీనివాసరావు మీడియాకు వెల్లడించారు. జనవరి 1, 2015 నుంచి డిసెంబరు 2019 మధ్య ప్రచురితమైన పుస్తకాల నుంచి అవార్డు గ్రహీతలను ఎంపిక చేసినట్లు తెలిపారు. జ్యూరీ సభ్యులుగా ఎస్.శేషారత్నం, వై.ముకుంద రామారావు, గుమ్మ సాంబశివరావు వ్యవహరించారు. దేశంలోని పారిశుధ్య కార్మికుల వాస్తవ జీవన చిత్రాన్ని అశుద్ధ భారత్ పుస్తకం ఆవిష్కరించింది. త్వరలో నిర్వహించే కార్యక్రమంలో అవార్డు గ్రహీతలకు రూ.50 వేల నగదు, తామ్రపత్రం అందజేయనున్నారు. నలుగురికి భాషా సమ్మాన్ అవార్డు అకాడమీ కార్యనిర్వాహక బోర్డు 2019కిగానూ నాలుగు రీజియన్ల భాషా సమ్మాన్ అవార్డులను ప్రకటించింది. సంప్రదాయ, మధ్యయుగ సాహిత్యంపై చేసిన కృషికిగానూ ప్రొఫెసర్ దయానంద్(ఉత్తరం) ఎ.దక్షిణామూర్తి (దక్షిణం), సత్యేంద్ర నారాయణ్ గోస్వామి(తూర్పు), మహమ్మద్ అజం (పశ్చిమ)లను ఎంపిక చేసినట్లు పేర్కొంది. త్వరలో నిర్వహించే కార్యక్రమంలో అవార్డు గ్రహీతలకు రూ.లక్ష నగదు, తామ్రపత్రం అందజేయనున్నారు. వివిధ వర్గాల ప్రజలకు అర్థమయ్యేలా... ‘2022లోనూ మనదేశంలో ‘మ్యానువల్ స్కావెంజింగ్’ వంటి అమానవీయ పద్ధతులు అమలు కావడం అత్యంత విషాదం. ఈ పనుల్లో నిమగ్నమైన వారి బాధ, ఆత్మాభి మానం, ఘోషను సభ్యసమాజానికి చాటి చెప్పాలనుకున్నాం. ఈ అవార్డు ద్వారా ఎంతోకొంత మార్పు వచ్చినా మేం విజయవంతమైనట్టుగా భావిస్తాం. కొన్ని వర్గాల ప్రజలు ఆయా విధుల నిర్వహణ పేరిట ఏ విధంగా అణచివేతకు గురవుతున్నారు, వారి పట్ల సమాజం ఎలాంటి దృష్టిని కలిగి ఉందనేదానిని చర్చనీయాంశం చేసేందుకు ఈ పుస్తకం పనికొస్తుంది. వివిధ వర్గాల ప్రజలకు ఈ సమస్య తీవ్రత అర్థమ య్యేందుకు ఈ రచన దోహదపడితే అంతకంటే సంతోషం ఉండదు. ఈ సమస్య చుట్టూ ముడిపడిన అంశాలను వెలుగులోకి తీసుకురావడానికి నా బాధ్యతగా ఈ అను వాదం చేశాను. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా పర్యటించి, విస్తృత పరిశీలన, లోతైన విశ్లేషణలు, అభిప్రాయాల సేకరణ ద్వారా మాతృక రచయిత్రి భాషాసింగ్ హిందీలో ఈ రచన చేశారు’ అని సజయ ‘సాక్షి’తో మాట్లాడుతూ అన్నారు. (క్లిక్: పిల్లలు చెప్పిన పేరెంట్స్ కథ) -
పురస్కారం... ఎర్రని రెక్కల పచ్చని పక్షి
రచన చేయడంలో రెండు వర్గీకరణలు ఉన్నాయి అనుకుంటే– ఒకటి: ఇలా మాత్రమే రాయాలి. రెండు: ఇలా కూడా రాయవచ్చు. మొదటి విభాగానికి చెందిన వారికి రాయడానికి ‘సమస్య’ అనేది ప్రధానం కాదు. అందుకే వారికి ఎలాంటి సమస్యలు ఎదురుకావు. ఇక రెండో కోవకు చెందిన వారు సమస్యల మీదే రాస్తారు. వారికి అనేకానేక సమస్యలు ఎదురుకావచ్చు కూడా. అంతమాత్రాన ఆగిపోరు. రాజీ పడరు. ఈ కోవకు చెందిన తమిళ రచయిత్రి అంబై. ఆమె కథా సంకలనం‘శివప్పు కళత్తుడన్ ఒరు పట్చయ్ పరవై’ (ఎర్రటిమెడ ఉన్న పచ్చటిపక్షి) కేంద్రసాహిత్య అకాడమీ అవార్డ్‌కు ఎంపికైంది. అంబై కథలు తీరిగ్గా చదివి, పక్కన పెట్టేవి కావు. అలజడి పెంచి ఆలోచనలకు పదును పెట్టేవి. ఈ కథలలో ఒక పాత్ర ఇలా అంటుంది... ‘నా జీవితంతో పాటే ఎన్నో కిటికీలు ఉన్నాయి. ఎప్పుడైనా ఆ కిటికీల నుంచి బయటకు చూస్తే తెలియని ప్రపంచం, తెలుసుకోవాలనిపించే ప్రపంచం ఆవిష్కారం అవుతుంది. ఎన్ని కిటికీలు ఉన్నా...ప్రతి కిటికీ తనదైన ప్రపంచాన్ని చూపుతుంది’ పందొమ్మిది సంవత్సరాల వయసులోనే కథలు రాయడం మొదలుపెట్టింది అంబై. ప్రసిద్ధ పత్రిక ‘ ఆనంద్ వికటన్’ లో అంబై రాసిన ఎన్నో కథలు ప్రచురితమయ్యాయి. అయితే ‘సిరకుకల్ మురియమ్’ (1967)తో సీరియస్ రైటింగ్ మొదలుపెట్టారు. సంప్రదాయ పాఠకవర్గాలకు ఈ కథలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. ‘ఇలా కూడా రాయవచ్చా!’ ‘ఆమె రాసింది నిజమే కదా. మరి మనం ఇలా ఎప్పుడూ ఆలోచించలేదేమిటీ’....అనుకునేవారు. ‘దశాబ్దాల క్రితం రాసిన ఆమె కథలు ఇప్పటికీ కొత్తగానే ఉంటాయి. వాటికి ప్రాసంగికత ఉంటుంది’ అంటున్నారు అంబై కథాసాహిత్యంపై వివరమైన రచనలు చేసిన సెంథిల్. తమిళనాడులోని కొయంబత్తూర్‌లో జన్మించిన అంబై అసలు పేరు సీఎస్.లక్షీ. ముంబై, బెంగళూరులో పెరిగారు. మద్రాస్ క్రిస్టియన్ కాలేజిలో పోస్ట్–గ్రాడ్యుయేషన్ (చరిత్ర) చేసిన అంబై దిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీలో పీహెచ్‌డి చేశారు. తమిళనాడులో స్కూల్ టీచర్, లెక్చరర్‌గా పనిచేశారు. అనేక ప్రాంతాలు,రకరకాల మనుషులు, వారి మనస్తత్వాలు ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్న ప్రత్యక్ష,పరోక్ష సమస్యలు ఆమె రాసిన కథలకు వస్తువు అయ్యాయి. అంబై కథల్లోని పాత్రలు మూస ధోరణుల్లో ఆలోచించవు. సమాజంలో కనిపించే అపసవ్యధోరణులను ప్రశ్నిస్తాయి. స్పారో(సౌండ్ అండ్ పిక్చర్ అర్కైవ్స్ ఫర్ రిసెర్చ్ ఆన్ వుమెన్) వ్యవస్థాపకురాలైన అంబై ఈ ఫోరమ్ తరపున మహిళా రచయితలు, కళాకారులకు సంబంధించిన ఎన్నో పుస్తకాలను ప్రచురించారు. -
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కృష్ణమూర్తి కన్నుమూత
దాచేపల్లి (గురజాల): కేంద్ర సాహిత్య అకాడ మీ అవార్డు గ్రహీత చిట్టిప్రోలు కృష్ణమూర్తి (85) గురువారం కన్ను మూశారు. కొంతకా లంగా అనారో గ్యంతో బాధపడుతూ హైదరా బాద్ లో కుమారుడి వద్ద ఉంటున్న ఆయన అక్కడే తుదిశ్వాస విడిచారు. ఆయన కు భార్య సరస్వతి, ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఒక కుమారుడు గతంలోనే మరణించారు. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడులో చిట్టిప్రోలు వెంకట రత్నం, కనకమ్మ దంపతులకు 1936 డిసెంబర్ 26న జన్మించిన కృష్ణమూర్తి స్వగ్రామంలో సుదీర్ఘ కాలం పోస్ట్ మాస్టర్‌గా పనిచేశారు. పద్యాలు, కవి తలపై ఆసక్తి మెండు. ఆయన కలం నుంచి కైకేయి, తరంగణి, అక్షర దేవాలయం, పురుషో త్తముడు.. వంటివి జాలువారాయి. మహిషా సుర శతకము, మాఘ మేఘములు అనే సంస్కృత కావ్యాలను అదేపేరుతో తెలుగులోకి అనువదించారు. ఆయన రచించిన ‘పురుషోత్త ముడు’ కావ్యానికి 2011లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. -
ఒక ప్రాంతీయ రచయిత సార్వజన ఘోష
రౌద్రమూ, బీభత్సమూ, విషాదమూ ముప్పిరిగొనే శప్తభూమి నవల చారిత్రక విభాత సంధ్యలో మానవ కథ వికాసమెట్టిదో నిరూపిస్తుంది. ‘‘బాబ్రీ మసీదును రామజన్మభూమిగా విశ్వసిస్తే తప్ప హిందువు కాడంటే, నేను హిందువును కాను. నాస్తికుడైతే తప్ప కమ్యూనిస్టు కానేరడు అంటే, నేను కమ్యూనిస్టును కాను. అవినీతిని తాత్వీకరించుకున్న దొంగల రాజ్యంలో ఆ దోపిడీ స్వభావపు పాలనాధికారం కోసమే తమ దళిత రాజకీయాలు ఉన్నాయంటే, నేను దళితవాదిని కాను. భిన్న భిన్న ప్రాంతాల వివిధాత్మక జీవితాన్ని గుర్తించి ఆమోదిస్తే తప్ప నేను ప్రాంతీయ తాత్వికుణ్ణి కాలేను,’’ అని స్పష్టంగా ప్రకటించుకున్న సాహిత్యకారుడు ‘స్వామి’. మానవ జీవితాన్నే గురువుగా గుర్తించి, తనదైన విలక్షణమైన చూపుతో జీవితపు చలన సూత్రాలను అన్వేషించే సాధకుడు స్వామి అనే పేరుతో ప్రసిద్ధుడైన బండి నారాయణ స్వామి. కథకుడుగా ప్రారంభించి, నవలలు రాసి, యిటీవల కాలంలో రాయలసీమ సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిణామాలపైన పరిశోధన వ్యాసాలు రాసిన స్వామి తొలినుంచీ తనదైన జీవితపు అస్తిత్వ మూలాలను తరచి చూడడంలోనే తన దృష్టినంతా కేంద్రీకరిస్తున్నాడు. యీ అన్వేషణ ఆయన కథల్లో బీజమై పుట్టి, నవలల్లో మర్రిచెట్లంత విశాలంగా పరుచుకుంటూ వస్తోంది. యీ అన్వేషణ క్రమంలోనే, అనంతపురం చారిత్రక నేపథ్యాల్ని సాహిత్యీకరించిన ‘శప్తభూమి’ నవల రాశాడు. దానికిప్పుడు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చినప్పుడు, తన ప్రాంతపు జీవన సంఘర్షణనిప్పుడు, మిగిలిన ప్రాంతాలవాళ్లు గూడా తెలుసుకుంటారనీ, రచయితలు అభిలషించే వొక ఆదర్శ ప్రపంచంవైపుకు నడవడానికి కొందరైనా సమాయత్తమౌతారనీ మాత్రమే స్వామి సంతోషిస్తాడు. వానరాలే, నీళ్లు, సావుకూడు, అవశేషం వంటి తొలినాటి కథల్లో అనంతపురం జిల్లాలోని జీవిత పోరాటాల్ని చిత్రించడంతో స్వామి యీ అన్వేషణను ప్రారంభించాడు. ‘‘ఎవరు ఎన్ని నీళ్లు వాడతారో తెలిస్తే వాళ్ల నాగరికత ఏపాటిదో చెప్పెయ్యొచ్చు’ అనేది ఒక సూక్తి. తాగడానికి ఒక కడవ నీళ్లు నోచుకోలేనివారికి ఏం నాగరికత ఉంటుంది?’’ అని ముగిసే ‘నీళ్లు’ కథలో రచయిత వాపోయినట్టుగా కనిపించినా, అది నిజానికి నాగరికమని అనుకునే సంఘానికీ, ప్రజాస్వామ్యం అని పిలుచుకుంటున్న మన రాజకీయ వ్యవస్థకూ పెద్ద సవాలుగా మిగులుతుంది. పైనుంచీ నంగనాచి మాదిరి చూస్తావుండే ఆకాశం కింద వాన రాక కోసం యెగజూసుకుంటూ సంవత్సరాలకు సంవత్సరాలు గడిపే అనంతపురం జిల్లా రైతుల ఆక్రందనలను సాహిత్యీకరించడమే తన బాధ్యతగా గుర్తెరిగిన రచయిత స్వామి. కరువు సీమలో మొగుడు చచ్చిపోయిన తర్వాత జరిగిన దివసాల రోజున, బంధువులు అందరూ మాంసాహారాల్ని గొంతుల వరకూ తినివెళ్లిపోయిన తర్వాత, యింకా యేడుస్తూ కూర్చున్న ముసలాయన పెండ్లాం యేడుస్తున్నదెందుకో తెలిసేదెవరికి? ‘‘ఎవురెవురికి పుట్టిన నా కొడుకులో వచ్చి, గొంతువరకూ సించుకొని పోయిరి. నా ఇస్తరాకులో మాత్రము నాలుగు తునకలు ఎయ్యకపోతిరి కదరా! మీ కడుపులు దొక్కా! మీరు తునకలు తిని నా మొగానికి నీల్లు కలిపిన పులుసు పోస్తిరి కదరా!’’ అంటూ ఆ ముసలావిడ తిట్టడం మొదలెడుతుంది. యివీ కరువు సీమల వ్యధలు. వ్యక్తి, కుటుంబము, వూరు, సమాజము, మతము, రాజ్యం, ప్రపంచం– మనిషితో ముడిబడిన యీ విషయాల పైనంతా స్వామికి అక్కరే! ‘‘ప్రపంచం కుగ్రామం కావడం కాదు. కుగ్రామమే ఒక ప్రపంచం కావాలి’’ అని యెలుగెత్తి చెప్పేవాడు స్వామి. అందుకే పై అంశాలలో దేన్నీ వదలకుండా అన్వేషిస్తాడు. యీ అన్వేషణలోనే ఆయన భారతీయమైన తాత్విక చింతనలోనూ మునిగిపోతాడు. జీవితపు మూల తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నంలో నీడలమెట్లు, రెండు అబద్ధాలు, చమ్కీదండ, పద్మపాదం వంటి కథలూ అనేకం రాశాడు. వెతికేవాడికి యేదైనా దొరుకుతుందనీ, వొక్కోసారి ఎంత వెదికినా ఏదీ దొరక్కపోవచ్చుననీ, దొరికేదేదైనా వుంటే అది వాడిపోనీ, వాసన లేనీ చమ్కీదండే అవుతుందనీ స్వామి గ్రహిస్తాడు. స్వామికున్న యీ అస్తిత్వ, సాంఘిక, రాజకీయ అన్వేషణలు కథల్లో వేరువేరుగా కనిపించినా, ఆయన యిటీవలి నవలల్లో మాత్రం ముప్పేటగా పెనవేసుకుపోతాయి. నిత్య విద్యార్థిగా భారతీయ తాత్విక చింతనను అవుపోసన పట్టిన స్వామే అగ్ర శూద్ర కులాల రాజకీయ ఆధిపత్యంపైనా, జాతి ముఖంపైన రుద్దిన బ్రాహ్మణ కుల సంస్కృతిపైనా, రాజకీయ పాలెగాళ్లపైనా తిరుగుబాటును నిర్ద్వంద్వంగా ప్రకటిస్తాడు ‘మీ రాజ్యం మీరేలండి’ నవలలో. దళితుడు మరో దళిత కులంపైన అనుకంపన చెందే ఔన్నత్యాన్నీ, సనాతన సంస్కృతిని చెమట పరం చేసే శూద్రకులాల మూలాల్నీ, వ్యక్తిగత ‘నేను’ను విచ్ఛేదం చేసే అద్వైత చింతననూ, కమ్యూనిస్టు సమాజాన్నీ ఆయన తన గమ్యంగా చూపిస్తాడు. అందుకే ఆ నవలను అంబటి సురేంద్రరాజు ‘శూద్ర గాథా సప్తశతి అను అనంత జీవన ఇతిహాసం’ అని పేర్కొంటాడు. కులాలూ, మతాలూ గాఢంగా వేర్లూనుకున్న భారతదేశంలో వైవిధ్యాలు లేని ఆర్థిక వర్గమొకటి రూపొందించగలమనే యూరోపియన్ భావనను వ్యతిరేకిస్తూ, ప్రతి అట్టడుగు కులమూ తనదైన సాంస్కృతిక వైవిధ్యాన్ని తాను పోషించుకుంటూనే, మిగతా అట్టడుగు కులాలతో కలిసి ఒక రాజకీయ ఎజెండా కింద ఐక్యమయ్యే బహుజన తాత్వికతను ఆపాదిస్తూ స్వామి ‘రెండు కలల దేశమ్’ నవల రాశాడు. ప్రస్తుతాన్ని అర్థం చేసుకోడానికి చరిత్రలోకి ప్రయాణం చేసే లక్షణం స్వామిలో తొలినుంచీ వుంది. ‘అవశేషం’ కథలో ఆయన కురవ కులం వాళ్ల ఆచార వ్యవహారాలను చిత్రించిన తీరులో యీ ధోరణి స్పష్టంగా కనబడుతుంది. అనంతపురం చరిత్రను తెలుసుకోడానికి రచయిత కైఫీయత్తులను, శిలాశాసనాలనూ, గెజిట్‌లనూ, వీరగల్లులనూ అధ్యయనం చేశాడు. తన పరిశోధనలను తనదైన సామాజిక, తత్వశాస్త్ర అవగాహనలతో సాహిత్యీకరించి, ‘శప్తభూమి’ చారిత్రక నవలగా మలిచాడు. హండె హనుమప్ప నాయకుడి వంశస్థుడు సిద్దరామప్ప నాయుడి పరిపాలన కాలంలో జరిగిన సంగతులతో శప్తభూమి ప్రారంభమవుతుంది. ఆ కాలంనాటి ఆచారాలూ, వ్యవహారాలూ, నమ్మకాలూ, మొత్తం ఆనాటి సమాజాన్నీ, పాలేగాళ్ల వంటి రాజుల అరాచకపు పాలననూ, వాళ్ల పాదాల కింద పడి నలిగిపోయిన దళిత, బహుజన సముదాయాల ఘోషనూ యీ నవల నినదిస్తుంది. రౌద్రమూ, బీభత్సమూ, విషాదమూ ముప్పిరిగొనే ఈ నవల చారిత్రక విభాత సంధ్యలో మానవ కథ వికాసమెట్టిదో నిరూపిస్తుంది. రచనతో బాటూ రచయిత గూడా ప్రయాణం చేయడం, దారిలో కొత్త సత్యాల్ని తెలుసుకోవడం యీ నవలలో గమనించవచ్చు. నవలను రాస్తున్నప్పుడు, అణగారిన వర్గాల వాళ్లంతా దళిత బహుజన కులాల వాళ్లేనని తెలిసిందనీ, అలా యీ నవల క్రమంగా రాయలసీమ దళిత బహుజన చారిత్రక నవలగా మారిందనీ రచయితే చెప్పుకున్నాడు. చారిత్రక నవలలు పాశ్చాత్య సాహిత్యంలో చాలా వున్నాయి. చారిత్రక నేపథ్యాన్నీ, సత్యాల్నీ, కల్పనాత్మకమైన పాత్రలతోనూ, కథలతోనూ ముడిబెట్టే పాశ్చాత్య చారిత్రక నవలల్లాగే ‘చెంఘిజ్‌ఖాన్’(తెన్నేటి సూరి), ‘గోన గన్నారెడ్డి’(అడవి బాపిరాజు), విశ్వనాథ సత్యనారాయణ రాసిన నేపాళీ కాశ్మీరు రాజవంశ నవలలు కొన్ని తెలుగు చారిత్రక నవలా రచనకు దారి చూపించాయి. స్వామికి తనదైన తమ ప్రాంతపు మౌఖిక ధోరణిలో, తమ అనంతపురం మాండలికంలో రాయడమే యిష్టం. ఆయన శప్తభూమిని చారిత్రక నవల అని పిలిచినా ఆ నవల మునుపున్న చారిత్రక నవలల ధోరణిలో కాకుండా, తన స్వభావానికి అనుగుణమైన రూపంలో, సహజంగా రూపొందాలనే అనుకుంటాడు. శప్తభూమి, స్వామి ముద్ర స్పష్టంగా ఉన్న నవల. నవలంతా రచయితదైన కంఠస్వరం స్పష్టంగా వినబడుతూ వుంటుంది. చివరిలో రచయిత పజ్జెనిమిదవ శతాబ్దానికంతా గొంతుగా మారిపోయి ‘‘యిది ఈ సీడెడ్ జిల్లాల కథ. వదిలించుకున్న జిల్లాల కథ. పాలకులు పట్టించుకోని అనాథ భూమి కథ. ప్రతి కొత్తలోనూ ఒక పాత కొనసాగుతూవుండటమే వర్తమాన చరిత్ర. కరువు కాటకాలూ, పాలేగాళ్ల కొనసాగింపే కదా ఇప్పటికీ ఈ శప్తభూమి గాథ’’ అని వ్యాఖ్యానిస్తాడు. ఈ నవలకు అవార్డు రావడం సాహిత్యకారులందరికీ ఆమోదం కలిగించే విషయం. యీ శప్తభూమిని యికపైన అయినా సుఖసంతోషాల తీరం చేర్చే చిత్తశుద్ధి వున్న ప్రయత్నాలు మొదలైతేనే, సాహిత్యకారులతోబాటు రచయితా సంతోషపడతాడు. -మధురాంతకం నరేంద్ర -
శశిథరూర్‌కు కేంద్ర సాహిత్య పురస్కారం
ఢిల్లీ : కాంగ్రెస్ ఎంపీ, సీనియర్ నేత శశిథరూర్ మరో ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికయ్యారు. 2019 సంవత్సారానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలను బుధవారం 23 భాషల్లో ప్రకటించారు. ఈ నేపథ్యంలో శశిథరూర్ రాసిన ' యాన్ ఎరా ఆఫ్ డార్క్నెస్: ది బ్రిటీష్ ఎంపైర్ ఇన్ ఇండియా' పుస్తకానికి నాన్ ఫిక్షన్ విభాగంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. భారత్‌పై బ్రిటీష్ పాలకుల ప్రభావం గురించి, దేశాన్ని ఎలా నాశనం చేశారనే దానిపై ఈ పుస్తకాన్ని రాశారు. భారత వనరులను బ్రిటన్ పాలకులు ఎలా అపహరించారు? మన వస్త్ర, ఉక్కు, షిప్పింగ్ పరిశ్రమలను ఎలా నాశనం చేశారనే దానిపై ఈ పుస్తకంలో సమగ్రంగా వివరించారు. శశిథరూర్ ఈ పుస్తకాన్ని 2016లో విడుదల చేశారు. కాగా సాహిత్య అకాడమీ పురస్కారం కింద ఆయన రూ. లక్ష నగదు బహుమతిని పొందనున్నారు. రాజకీయాల్లో అపరమేధావిగా పేరు గాంచిన శశిథరూర్ లండన్‌లో జన్మించారు.1975లో ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుంచి గ్రాడ్యుయేజన్ పూర్తి చేసిన శశిథరూర్ 1978 లో అమెరికాలోని టఫ్ట్స్ విశ్వవిద్యాలయం నుంచి ఫ్లెచర్ స్కూల్ ఆఫ్ లా అండ్ డిప్లొమసీ విభాగంలో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ అఫైర్స్ పై డాక్టరేట్ పూర్తి చేశారు. మంచి రాజకీయనాయకునిగా పేరు పొందిన శశిథరూర్ చాలా పుస్తకాలు రచించారు. అందులో ప్రముఖంగా 'వై ఐయామ్ ఎ హిందూ' , 'ది పారాడాక్సికల్ ప్రైమ్ మినిష్టర్' లాంటివి చెప్పుకోదగినవి. -
నారాయణస్వామికి కేంద్ర సాహిత్య పురస్కారం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ రచయిత బండి నారాయణస్వామి రచించిన ‘శప్తభూమి’ నవలకు ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ-2019 పురస్కారం లభించింది. ఈసారి 23 భాషల్లో కేంద్ర సాహిత్య అకాడమీ వార్షిక పురస్కారాలు ప్రకటించగా.. పురస్కారం అందుకున్న పుస్తకాల్లో ఏడు కవితా సంపుటాలు, నాలుగు నవలలు, ఆరు కథల పుస్తకాలు, మూడు వ్యాస సంపూటాలు, నాన్ ఫిక్షన్, ఆత్మకథ, జీవిత కథ పుస్తకాలకు ఒక్కొక్కటి చొప్పున సత్కారం దక్కింది. రాయలసీమ చరిత్ర ఆధారంగా శప్తభూమి నవలను నారాయణస్వామి రచించారు. రాయలకాల తదనంతరం సుమారు 18వ శతాబ్దం నాటి అనంతపుర సంస్థాన అధికార రాజకీయాలు, అప్పటి జీవితము చిత్రించిన చారిత్రక నవల ఇది. హండే రాజుల కాలంనాటి సంఘటనలు, కక్షలు, కార్పణ్యాల మధ్య నలిగిన ప్రజల జీవితాల, పాలెగాళ్ల దౌర్జన్యాల సమాహారమైన ఈ నవలకు తానా బహుమతి లభించింది. బండి నారాయణస్వామిది అనంతపురం జిల్లా. 1952 జూన్ 3న అనంతపురం పాత ఊరులో ఆయన జన్మించారు. ఆయన తల్లిదండ్రులు హన్నూరప్ప, పోలేరమ్మ. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం పీజీ సెంటర్లో ఉన్నత విద్యను అభ్యసించిన ఆయన బి.ఎడ్ చేసి ప్రస్తుతం ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. మొత్తం నలభై దాకా కథలు రాసిన ఆయన ‘వీరగల్లు’ కథాసంపుటి వెలువరించారు. గద్దలాడ్తాండాయి, మీరాజ్యం మీరేలండి, రెండు కలలదేశం మొదలైన నవలలు రాశారు. ఆయన రాసిన శప్తభూమి.. తానా సంస్థ 2017లో నిర్వహించిన నవలల పోటీలో బహుమతి పొందింది. బండి నారాయణస్వామి -
రచనల నుంచి రాజకీయాల్లోకి: బరిలో ప్రముఖ రచయిత్రి
సాక్షి, హైదరాబాద్ : అనతికాలంలోనే తెలుగు సాహిత్యంలో విశేషమైన పేరుప్రఖ్యాతులు సాధించుకున్న కవి, రచయిత్రి మెర్సీ మార్గరేట్. తాను ప్రచురించిన తొలి కవితా సంకలనం ‘మాటల మడుగు’తో కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారాన్ని గెలుపొందారు ఆమె. నిత్యం సాహిత్యంతో మమేకమవుతూ.. తన కవితల ద్వారా సమాజంలో చైతన్యం తీసుకురావడానికి తపిస్తున్న ఆమె మరో మార్పు దిశగా ముందడుగు వేశారు. తెలంగాణలో ముందస్తుగా అసెంబ్లీ ఎన్నికలు జరగుతున్న వేళ.. రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు మెర్సీ మార్గరేట్. హైదరాబాద్ నగరంలోని ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమె ‘సాక్షి’తో ముచ్చటించారు. పుట్టిపెరిగింది ముషీరాబాద్‌లోనే.. ముషీరాబాద్‌లో పుట్టిపెరిగిన తనకు ఇక్కడి పరిస్థితులు, మురికివాడల్లో నివసిస్తున్న ఇక్కడి నిరుపేద ప్రజల జీవనస్థితిగతులు తెలుసునని మెర్సీ మార్గరేట్ అంటారు. ప్రతిసారి ఎన్నికలు వచ్చివెళుతున్నా.. నియోజకవర్గంలో పరిస్థితులు మెరుగుపడటం లేదని, సిటీ నడిబొడ్డున ఉన్న ముషీరాబాద్ నియోజకవర్గంలో పరిస్థితులు దుర్భరంగా ఉండటం తనను కలిచి వేసిందని, ఇక్కడి ప్రజలకు ఏదైనా సేవ చేయాలని, ఇక్కడి పరిస్థితులు మార్చాలనే దృఢ సంకల్పంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని ఆమె తెలిపారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి ‘నగరంలో చాలామంది ఎన్నికల్లో ఓటు వేసేందుకు ముందుకు రావడం లేదు. ఓటు వేసేవారిలోనూ పలువురు ‘నోటా’ను ఎంచుకుంటున్నారు. ఎన్నికల్లో పోటీ పడుతున్న వారిలో నిస్వార్థంగా సేవ చేస్తారని నమ్మకం కలిగించే నాయకులు లేకపోవడమే ఇందుకు కారణం. చదువుకున్న విద్యావంతులు, సమాజం పట్ల నిబద్ధత కలిగిన వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే.. ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకురావచ్చు’ అని ఆమె తెలిపారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని, అది రాజ్యాంగ నిర్దేశించిన సర్వోన్నతమైన బాధ్యత అని ఓటర్లకు పిలుపునిచ్చారు. సమాజం పట్ల నిబద్ధతతో నిత్యం సాహిత్యంతో మమేకమవుతున్న తాను.. రాజకీయాల్లో మార్పు కోసమే ఎన్నికల బరిలోకి దిగానని, ఓటు హక్కుపై చైతన్యం కలిగించడం, యువత, విద్యావంతులూ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించడం లక్ష్యంగా ఈ ముందడుగు వేశానని ఆమె తెలిపారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యేందుకు, వారి సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషిచేసేందుకు ఎన్నికల్లో పోటీచేస్తున్నానని, ప్రజలు తనను ఆశీర్వదిస్తారన్న నమ్మకముందని మెర్సీ మార్గరేట్ చెప్పారు. -
నువ్వేనా ఆసిఫా?
అమృతం తాగిన ఆడదేవతల ముఖాలతో నర్తన నడకలతో గగన మేఘధూళి ఎగజిమ్ముతూ పోతున్న గుర్రాల గుంపు వీపుల మీద ఊరేగుతున్నది భయవిహ్వల నేత్రాలతో నువ్వేనా మా బంగారు తల్లి ఆసిఫా? ఏకపత్నీవ్రత స్వాముల నామ జపాలతో తనివితీరని దైత్య జిహ్వల రక్త తృష్ణకి పసినెత్తుటి నిండు దోసిలివయింది నువ్వేనా మా గారాల తల్లి ఆసిఫా? కన్నతల్లులనీ, కన్నకూతుళ్లనీ, అక్కచెల్లెళ్లనీ మరిచి హోమ సురాపానోన్మత్తులయి నీ లేలేత మృదుపుష్పవాటిక మీద క్రూర విహంగాలయి ఇనుపగోళ్లతో విరుచుకుపడిన నవపావన ధూర్త దురంత భూత ప్రేత ఆలయ పాలక అధముల వికటహాసాలకి కకావికలయిన చూర్ణదృక్కులతో కనిపించని నిర్వికార సృష్టికారకుడికీ కనిపిస్తున్న కుంకుమచర్చిత విగ్రహానికీ శబ్దహీన రోదనలతో కరుణ కోసం వేడుకున్నది నువ్వేనా మా పిచ్చిమాలచ్చిమి ఆసిఫా? ఏలినవారికి, ఎక్కడో లండన్‌లో ప్రవాస యోషల హారతి పళ్లేల వెలుగులో వెండిలా వికసిస్తున్న గడ్డం, వందేమాతర నినాద నాదాలతో ఉప్పొంగుతున్న విశాల వక్ష వృక్షపత్రాలలో ప్రతిఫలిస్తున్న వైరి ధనుర్భంగ ద్వితీయ విజయోత్సవ మధుర స్వప్న సంరంభంలో ఏ నిస్సహాయ ఆక్రందనలూ వినిపించడం లేదని లక్షలాది కొవ్వొత్తుల నడుమ నిలుచుని వెక్కివెక్కి విలపిస్తున్నది నువ్వేనా మా చిన్నారి ఆసిఫా? ప్రపంచంలోని తల్లులందరూ ప్రపంచంలోని తండ్రులందరూ ప్రపంచంలోని మనుషులందరూ ఇప్పుడు నీకోసం ఘోషించే సముద్రాలయి తీరశిలలమీద తలలు బాదుకుని వ్రయ్యలవుతున్నారమ్మా ఆసిఫా? ఏడెనిమిదేళ్ల ఏ పసిపాప ముఖం చూసినా నాకు నువ్వే కనిపిస్తున్నావెందుకమ్మా ఆసిఫా? ఏ ప్రవక్తలూ, ఏ వియోగులూ, ఏ యోధులూ ఏ విధ్వంసకారులూ, ఏ విప్లవవీరులూ చేయలేకపోయినదేదో నీ బలిదానాన్ని ఆయుధంగా ధరించి నీ పూదీవ చేతులతో నువ్వు చేస్తావని ఈ నవదిన నవ ఘడియలో ఈ దివ్య నిముషంలో నాకనిపిస్తున్నదెందుకమ్మా, మా ఆశాదీప ఆసిఫా?? (ప్రపంచవ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్న, కశ్మీర్‌లోని కథువాలో 8 ఏళ్ల చిన్నారి ఆసిఫా దారుణ హత్యపై స్పందించి ‘సాక్షి’ కోసం ప్రత్యేకంగా రాసిన కవిత) (ఒక తక్షణ నిర్ఘాంత స్థితి నుంచి నన్ను తట్టి లేపిన డా‘‘పాలేరు శ్రీనివాస్‌కు ధన్యవాదాలతో) – దేవిప్రియ, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత మొబైల్ : 98661 11874 -
దేవిప్రియ కవిత్వానికి కేంద్ర సాహిత్య పురస్కారం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మకమైన కేంద్ర సాహిత్య అకాడమీ 2017వ సంవత్సరానికిగాను అవార్డులను ప్రకటించింది. తెలుగు ప్రముఖ కవి, రచయిత దేవిప్రియ రచించిన 'గాలిరంగు' కవిత్వానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. అదేవిధంగా అనువాద విభాగంలో వీణావల్లభరావును పురస్కారం వరించింది. ఆయన అనువాదం చేసిన 'విరామమెరుగని పయనం' పుస్తకానికి కేంద్ర సాహిత్య పురస్కారం దక్కింది. పంజాబీలో రచించిన ఖానాబదోష్ ఆత్మకథను వల్లభరావు అనువాదం చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అవార్డులను ప్రదానం చేయనున్నారు. పురస్కారం కింద తామ్రపత్రం, లక్ష నగదు రచయితలకు అందజేయనున్నారు. దేవిప్రియ 1949 ఆగష్టు 15న గుంటూరులో జన్మించారు. ఆయన అసలు పేరు షేక్ ఖాజాహుస్సేన్. తల్లిదండ్రులు షేక్ హుస్సేన్ సాహెబ్, షేక్ ఇమాం బీ.. గుంటూరులోని ఏసీ కాలేజీలో బీఏ చదువుకున్నారు. కాలేజీ రోజుల్లోనే కవిత్వం పట్ల ఆకర్షితుడై పద్యాలు, గేయాలు రాయడం ప్రారంభించారు. గుంటూరు కేంద్రంగా అవతరించిన పైగంబర కవులు బృందంలో దేవిప్రియ ఒకరు. పాత్రికేయుడిగా పలు దినపత్రికల్లో పనిచేశారు. వ్యంగ్య, విమర్శనాత్మకమైన 'సమాజానందస్వామి', 'రన్నింగ్ కామెంటరీ' కార్టూన్ కవిత్వం ద్వారా తెలుగు పత్రికారంగంలో ఆయన కొత్త ఒరవడిని ప్రవేశపెట్టారు. సినిమా రంగంపై సాధికారమైన వ్యాసాలు రాశారు. దాసి, రంగులకల మొదలైన సినిమాలకు స్క్రీన్ ప్లే, పాటలు రాశారు. 'ప్రజాతంత్ర', 'హైదారాబాద్ మిర్రర్' దినపత్రికలకు ప్రధాన సంపాదకులుగా పనిచేశారు. దేవిప్రియ రచనలు: అమ్మచెట్టు (1979), సమాజానందస్వామి (1977), గరీబు గీతాలు (1992), నీటిపుట్ట (1990), తుఫాను తుమ్మెద (1999), రన్నింగ్ కామెంటరీ (3 సంపుటాలు) (2013), అరణ్య పురాణం, పిట్ట కూడా ఎగిరిపోవలసిందే (2001), చేపచిలుక (2005), అధ్యక్షా మన్నించండి (సంపాదకీయాలు) (2010), గాలిరంగు (2011), గంధకుటి (2009), ఇన్షా అల్లాహ్ (పద్యకావ్యం), Poornamma the golden doll (అనువాదం), The Cobra Dancer (కేజే రావు జీవితకథ) పురస్కారాలు: 1980లో అమ్మచెట్టు కవిత్వానికి ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు.. 1991లో నీటిపుట్ట కవితాసంకలనానికి సినారె కవితాపురస్కారం (కరీంనగర్) వైఎస్ జగన్ అభినందనలు 2017 సంవత్సరానికిగాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు గెలుపొందిన తెలుగు రచయితలు దేవిప్రియ, వీణావల్లభరావులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. సాహిత్యరంగంలో వారికి అవార్డులు రావడం తెలుగుభాషకు గర్వకారణమని వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
అభ్యుదయ రచయిత్రికి అరుదైన పురస్కారం
=‘సాహిత్య ఆకాశంలో సగం’ రచనకు దక్కిన గౌరవం =జిల్లా నుంచి కేంద్ర పురస్కారానికి ఎంపికైన వారిలో విద్మహే రెండోవారు = అంపశయ్య నవీన్ మొదటివారు =అనేక పుస్తకాలపై సాహిత్య విమర్శలు రాసిన కాత్యాయనీ.. పలు అవార్డులు ఆమె సొంతం =ప్రసుత్తం కాకతీయ యూనివర్సిటీ తెలుగు విభాగంలో ప్రొఫెసర్‌గా విధులు కేయూ క్యాంపస్, న్యూస్‌లైన్ : స్త్రీవాద సాహిత్య విమర్శకురాలు, కాకతీయ యూనివర్సిటీ తెలుగు విభాగం ప్రొఫెసర్ కేతవరపు కాత్యాయనీ విద్మహేకి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఆమె రాసిన ‘సాహిత్య ఆకాశంలో సగం’ అనే కథా కవిత్వం విమర్శనా గ్రంథానికి గాను ఆమె ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డుకు ఎంపికయ్యారు. రచయిత్రులు రాసిన కథాకవిత్వంపై ఆమె స్త్రీవాద మార్క్కిస్టు దృక్పథంతో విమర్శచేస్తూ వ్యాసాలు రాశారు. కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారం పొందిన వారిలో వరంగల్ జిల్లా నుంచి కాత్యాయనీ రెండోవారు. 2004లో జిల్లాకు చెందిన అంపశయ్యనవీన్ ఈ పురస్కారం అందుకున్నారు. ప్రస్తుతం కాత్యాయనీ విద్మహే ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక రాష్ర్ట కార్యదర్శిగా, మానవహక్కుల వేదిక సభ్యురాలుగా కొనసాగుతున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 20న ఢిల్లీలో ఈ పురస్కారం అందుకోనున్నారు. దేశంలోని వివిధ భాషాల సాహిత్యానికి చేసిన కృషికిగాను ఈపురస్కారాలు ఇస్తారు. తెలుగుభాషలో సాహిత్యం కింద కాత్యాయనీకి ఈ పురస్కారం లభించింది. పురస్కారం కింద రూ.లక్ష నగదు, సత్కారం అందుకోనున్నారు. 12 ఏళ్లనుంచే సాహిత్యంపై ఆసక్తి కాత్యాయనీ 1955 సంవత్సరంలో నవంబర్ 3న ప్రకాశం జిల్లా అద్దంకి మండలం మైలవరం గ్రామంలో కేతవరపు ఇందిరాదేవి, రామకోటిశాస్త్రి దంపతులకు జన్మించారు. ఆమె తండ్రి దివంగత ప్రొఫెసర్ రామకోటిశాస్త్రి ఉద్యోగరీత్యా కాకతీయ యూనివర్సిటీలోనే తెలుగు విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. కాత్యాయనీ పుట్టింది మైలవరంలోనైనా పెరిగింది.. విద్యాభ్యాసం అంతా వరంగల్‌లోనే. ఆమె గీసుకొండ మండలం మొగిలిచర్ల గ్రామానికి చెందిన డాక్టర్ వెంకటేశ్వర్లును వివాహం చేసుకుని ఇక్కడే స్థిరపడ్డారు. వెంకటేశ్వర్లు వైద్యుడిగా పనిచేసి ఇటీవల రిటైర్డ్ అయ్యారు. వారికి ఒక కూతురు ఉంది. 12 ఏళ్ల వయసు నుంచే సాహిత్యంపై ఆసక్తి కనబర్చారు. ప్రాథమిక విద్య వరంగల్‌లోని సుజాతరెడ్డి హైస్కూల్లో, ఇంటర్ పింగిళి కళాశాల, డిగ్రీ యూనివర్సిటీ ఆర్ట్స్అండ్ సైన్స్ కళాశాల, ఎంఏ తెలుగు కేయూలో చదువుకున్నారు. ‘చివరకు మిగిలేది మానసిక సామాజిక జీవన స్రవంతి నవలా మిమర్శ’ అనే అంశంపై పీహెచ్డీ చేసి డాక్టరేట్ పొందారు. ఇదే కాకతీయ యూనివర్సిటీలో 1977లో అధ్యాపకురాలుగా ప్రవేశించి 1998సంవత్సరంలో ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందారు. కాత్యాయనీ విద్మహే అన్న కలం పేరుతో 1977నుంచి పరిశోధనలు మొదలుపెట్టారు. 1982 నుంచి మహిళా జనజీవన దృక్పథంతో సాహిత్య విమర్శనా వ్యాసాలు రాశారు. అలంకార శాస్త్రం సాహిత్య విమర్శ నిరంతర చింతనా విషయాలు, మార్క్సిజం, స్త్రీవాద దృక్పథం, సామాజిక సిద్ధాంతాలు తదితర 285 వరకు వ్యాసాలు రాశారు. తన తండ్రి రామకోటిశాస్త్రి రాసిన సాహిత్య వాస్యాలను తనసంపాదకత్వంలో ఇప్పటివరకు 22వరకు పుస్తకాలను ప్రచురింపచేశారు. 1992నుంచి ఇప్పటివరకు ప్రతి ఏడాది అక్టోబర్ 28న తనతండ్రి వర్థంతిరోజు తప్పనిసరిగా ఒక పుస్తకాన్ని విడుదల చేస్తారు. రామకోటిశాస్త్రి రాసిన వ్యాసాలను పుస్తకాలుగా తీసుకువస్తున్నారు. రామకోటిశాస్త్రికి మైథిలీ, శ్రీగౌరి, కాత్యాయనీ ముగ్గురు కుమార్తెలు. కాత్యాయనీ సాహిత్య వారసురాలుగా సాహితీవేత్తల మన్ననలు పొందుతున్నారు. ఈఏడాది అక్టోబర్ 28న కూడా తెలంగాణ సాహిత్య వ్యాసాల పుస్తకాన్ని కూడా ఆవిష్కరింపచేశారు. తెలంగాణ సాహిత్యానికి సంబంధించి కాళోజీ, అల్లం రాజయ్య, పాల్కంపెల్లి శాంతాదేవి రచనలపై ఎంఫిల్ స్థాయి పరిశోధనలు, తెలంగాణ పోరాట నాటకంపై పీహెచ్డీ స్థాయి పరిశోధనలు కూడా చేయించారు. సాహిత్యం ఆకాశంలో సగం పుస్తకంలోలో 28 వ్యాసాలు మార్క్సిస్టుదృక్పథంతో స్త్రీవాద సాహిత్యం విమర్శనాత్మకంగా పరిశీలించటం, చర్చకుపెట్టడం కాత్యాయనీ విద్మహే ప్రత్యేక త. ఈ వ్యాస సంకలనంలో స్త్రీల కథ, కవిత్వానికి సంబంధించిన 28 వ్యాసాలున్నాయి. ఈ పుస్తకం 2010లో మొదటి ముద్రణ స్త్రీజనాభ్యుదయ సంస్థ ప్రచురించింది. స్త్రీ సాహిత్యంపై సమీక్షల కలయికగా ఈ సంపుటి వెలువరించారు. 28 వ్యాసాల్లో రాజకీయ ఆర్థిక పరిణామాల నేపథ్యంలో స్త్రీల సాహిత్య అధ్యయనం, జెండర్స్పృహ ఆధునిక సాహిత్యంలో ప్రతిఫలాలు, కవిత్వ అధ్యయనం అవసరం-పద్ధతి, మహిళలు సాహిత్యం స్వాతంత్య్రానికి పూర్వం స్త్రీల సాహిత్యం తదితర వ్యాసాలు ఆమె నిర్దేశించుకున్న చారిత్రిక బాధ్యతకు అనుగుణమైనవి. 1980 దశకంలో ఆరంభం నుంచి విప్లవ పోరాటాల ప్రభావంతో గళమెత్తిన స్త్రీల గురించి, సంప్రదాయాలను, కట్టుబాట్లను, మూఢవిశ్వాసాలను ప్రశ్నిస్తూ వారు చేసిన రచనల గురించి కాత్యాయనీ సమగ్రంగా విశ్లేషించారు. వివిధ రచయిత్రుల రచనలను పరిచయం చేస్తూ ఆమె విభిన్నధోరణులను చూపించగలిగారు. రాజ్యహింస తరుచూ లైంగిక హింసగా మారటానికి ‘కొండె పూడి నిర్మల భాద సప్తనది’ కవితను ఆమె సమీక్షించారు. జీవితాన్ని ప్రేమించటం నేర్పే మెహజబిన్ కవిత్వాన్ని పరిచయం చేశారు. భవిష్యత్తుమీద నమ్మకాన్ని కల్పించి వెలుగుకోసం ఆకాంక్షించే భవాని దేవి సాహిత్యాన్ని ప్రశింసించారు. వాస్తవ జీవితంతోపాటు స్త్రీవాద తాత్విక భావాలను మార్క్సిస్టు దృక్పథంతో మేళవించిన విమల వంటిల్లు కవితపై సమగ్ర వాఖ్యానం కాత్యాయనీ రాశారు. అన్ని కులాల స్త్రీల మీద బరువైన పితృస్వామ్యం గురించిన అవగాహనకలిగిన జయ‘మట్టి పువ్వు’ అనే కవితను వెలుగులోకి తెచ్చారు. భిన్న సామాజిక సమస్యలతోపాటు స్త్రీల సమస్యలను విప్లవోద్యమాన్ని చైతన్యాన్ని మేళవించిన లక్ష్మీసుహాసిని కవిత్వాన్ని తన వ్యాసాలల్లో విశ్లేశించారు. స్త్రీ-పురుష సంబంధాలను భిన్నకోణాల నుంచి చూపిన రంగనాయకమ్మ సాహిత్యంలోని ప్రయోజనాన్ని ఆవిష్కరించారు. పితృస్వామ్య మాయూజాలంలో చిక్కుకుని విలవిలలాడుతూ విముక్తి కోరుకున్న స్త్రీలకు శ్రామికవర్గ స్త్రీలు అసలు నేస్తాలు అని చెప్పే సత్యవతి ‘చీమ’కథ ప్రయోజనాన్ని తెలియ జెప్పారు. ఉత్తరాంధ్ర బడుగువర్గాల స్త్రీల జీవిత పోరాటాన్ని, మధ్యతరగతి స్త్రీల చైతన్యాన్ని చిత్రించిన ద్వివేదుల విశాలక్ష్మి కథలు ఇందులో సమీక్షించారు. స్త్రీలను బహుకోణాలను పరిశీలించి జలందర చేసిన జీవిత వాఖ్యానాలను కూడా సాహిత్యకారుల ముందుంచారు. విప్లవోద్యమం ప్రతిబింబించే తాయమ్మ కరుణ మిడ్కో వంటి రచయిత్రుల రచనలను పరిచయం చేశారు. అలా కాత్యాయనీ విద్మహే ఒక విమర్శనాత్మక పరిశీలకురాలుగా బహుముఖ ప్రజ్జను కనపరిచారు. కాగా ఈ పుస్తకాన్ని తొలి మహిళా ఉద్యమ రచయిత్రి బండారు అచ్చమాంబ, తొలి అభ్యుదయ సాహిత్యోద్యమ రచయిత్రి వట్టికొండ విశాలక్ష్మి, విప్లవోద్యమ కార్యచరణలో భాగమైన రంగవల్లికి అంకితం చేశారు. వివిధ యూనివర్సిటీలకు రిసోర్స్పర్సన్గాను.. ఆంధ్ర, వెంకటేశ్వర, పద్మావతి మహిళా, నాగార్జున, పొట్టి శ్రీరాములు, ఉస్మానియా, యోగివేమన, ద్రావిడ, హంపీ, బెనరాస్హిందూ యూనివర్సిటీలకు రిసోర్స్‌పర్సన్‌గా కూడా సేవలను అందిస్తున్నారు. ఇప్పటివరకు 275 రీసెర్చ్పేపర్లు సమర్పించారు. 200 జాతీయస్థాయి సెమినార్లలో పత్రాలను సమర్పించారు. ఉమెన్స్ జర్నల్ కూడా ప్రారంభించారు. ఆవె ువద్ద 11మంది పరిశోధకులు పీహెచ్డీ డిగ్రీలు పొందారు. 17మంది ఆమె పర్యవేక్షణలో ఎంఫిల్ డిగ్రీలు సాధించారు. మరో ఆరుగురు ప్రస్తుతం పరిశోధన చేస్తున్నారు. కాకతీయ యూనివర్సిటీలో ఏడు రీసెర్చ్ ప్రాజెక్టులు చేపట్టారు. యూజీసీ, కేంద్ర సాహిత్య అకాడమీ పరిధిలో యూజీసీ మేజర్ రీసెర్చ్ప్రాజెక్టు ఉమెన్ లిటరేచర్ ఆన్తెలుగు 1900- 1950( 2009-2011) పూర్తిచేశారు. బెస్ట్ అకడమిక్పర్ఫార్మెన్స్గా నాలుగు అవార్డులు కూడా పొందారు. కాత్యాయనీ పొందిన అవార్డులు కాత్యాయనీ స్త్రీవాదం, స్త్రీల విషయంలో చేసిన సామాజిక, సాహిత్య విమర్శకు చేసిన కృషికిగాను పలు అవార్డులు పొందారు. వట్టికొండ విశాలాక్షి అవార్డు, ఏటుకూరు బలరామమూర్తి అవార్డు, పులికంటి కృష్ణారెడ్డి అవార్డు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ధర్మనిధి పురస్కారం, రంగవల్లి స్మారక విశిష్టమహిళా పురస్కారం, ఆంధ్రప్రభుత్వ సాంస్కృతికమండలి గురుజాడ స్మారక పురస్కారం, రంగవల్లిస్మారక విశిష్ట మహిళా పురస్కారం అందుకున్నారు. కాత్యాయనీ రచనలు... రాయప్రోలు వాఙ్మయ జీవిత సూచిక( 1980) పంచాయితీ రాజ్యరాజకీయ నవల, వాసిరెడ్డి సీతాదేవి రాబందులు-రామచిలకలు ఒక పరిశీలన 1981 బుచ్చిబాబు వాఙ్మయ జీవిత సూచిక 1983 కొడవటిగంటి కుటుంబరావు వాఙ్మయ జీవిత సూచిక 1986 చివరకు మిగిలేది -మానసిక సామాజిక జీవన స్రవంతి నవలా విమర్శ 1987 మహిళా జీవన సమస్యలు మూలాల అన్వేషణ 1994 తెలుగు నవలాకథానికి విమర్శ పరిణామం 1995 రావిశాస్త్రి శాస్త్రీయ దృక్పథం1996 సంప్రదాయ సాహిత్యం స్త్రీవాద దృక్పథం 1998 కన్యాశుల్కం సామాజిక సంబంధాలు 2005 స్వాతంత్య్రనంతర భారతదేశం స్త్రీల స్థితిగతులు 2005 ప్రాచీన భారత రాజకీయ ఆర్థిక, ప్రతిబింబించిన రచనలు మహిళా జీవితం 2005, ఆధునిక తెలుగుసాహిత్యం స్త్రీవాద భూమిక 2006 జెండర్ సమానతదిశగా సమాజం సాహిత్యం 2007 ప్రపంచీకరణ పరిణామాలు ప్రభావాలు మహిళల జీవితం 2007 ప్రాచీణ సాహిత్యం మరోచూపు 2008 సాహిత్య ఆకాశంలో సగం-స్త్రీల అస్థిత్వ సాహిత్యం కవిత్వం కథ 2010 స్త్రీవాదం 2012 తెలంగాణ సాహిత్యం- ప్రాంతీయత 2013 -
కాత్యాయినీ విద్మహేకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
హైదరాబాద్: ప్రముఖ రచయిత్రి కాత్యాయినీ విద్మహేకు 2013 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికయ్యారు. సాహిత్యాకాశంలో సగం అనే ఆమె వ్యాసాలకు సాహిత్య అకాడమీ ఈ అవార్డు ప్రకటించింది. కేంద్ర సాహిత్య అకాడమీ ప్రతి సంవత్సరం 22 భారతీయ భాషలలో ఈ అవార్డులు ఇస్తుంది. గత సంవత్సం తెలుగులో ఈ అవార్డు పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథా సంకలనానికి లభించింది.