అమృతం తాగిన
ఆడదేవతల ముఖాలతో
నర్తన నడకలతో గగన మేఘధూళి
ఎగజిమ్ముతూ పోతున్న
గుర్రాల గుంపు
వీపుల మీద ఊరేగుతున్నది
భయవిహ్వల నేత్రాలతో నువ్వేనా
మా బంగారు తల్లి ఆసిఫా?
ఏకపత్నీవ్రత స్వాముల
నామ జపాలతో తనివితీరని
దైత్య జిహ్వల రక్త తృష్ణకి పసినెత్తుటి
నిండు దోసిలివయింది
నువ్వేనా మా గారాల తల్లి ఆసిఫా?
కన్నతల్లులనీ, కన్నకూతుళ్లనీ,
అక్కచెల్లెళ్లనీ మరిచి
హోమ సురాపానోన్మత్తులయి
నీ లేలేత మృదుపుష్పవాటిక మీద
క్రూర విహంగాలయి
ఇనుపగోళ్లతో విరుచుకుపడిన
నవపావన ధూర్త దురంత భూత ప్రేత
ఆలయ పాలక అధముల
వికటహాసాలకి
కకావికలయిన చూర్ణదృక్కులతో
కనిపించని నిర్వికార
సృష్టికారకుడికీ
కనిపిస్తున్న కుంకుమచర్చిత విగ్రహానికీ
శబ్దహీన రోదనలతో
కరుణ కోసం వేడుకున్నది
నువ్వేనా మా పిచ్చిమాలచ్చిమి ఆసిఫా?
ఏలినవారికి, ఎక్కడో లండన్‌లో
ప్రవాస యోషల
హారతి పళ్లేల వెలుగులో
వెండిలా వికసిస్తున్న గడ్డం,
వందేమాతర నినాద నాదాలతో
ఉప్పొంగుతున్న విశాల వక్ష
వృక్షపత్రాలలో
ప్రతిఫలిస్తున్న వైరి ధనుర్భంగ
ద్వితీయ విజయోత్సవ మధుర
స్వప్న సంరంభంలో
ఏ నిస్సహాయ ఆక్రందనలూ
వినిపించడం లేదని
లక్షలాది కొవ్వొత్తుల
నడుమ నిలుచుని
వెక్కివెక్కి విలపిస్తున్నది
నువ్వేనా మా చిన్నారి ఆసిఫా?
ప్రపంచంలోని తల్లులందరూ
ప్రపంచంలోని తండ్రులందరూ
ప్రపంచంలోని మనుషులందరూ
ఇప్పుడు నీకోసం ఘోషించే
సముద్రాలయి తీరశిలలమీద
తలలు బాదుకుని
వ్రయ్యలవుతున్నారమ్మా ఆసిఫా?
ఏడెనిమిదేళ్ల ఏ పసిపాప
ముఖం చూసినా
నాకు నువ్వే
కనిపిస్తున్నావెందుకమ్మా ఆసిఫా?
ఏ ప్రవక్తలూ, ఏ వియోగులూ,
ఏ యోధులూ ఏ విధ్వంసకారులూ,
ఏ విప్లవవీరులూ
చేయలేకపోయినదేదో
నీ బలిదానాన్ని ఆయుధంగా ధరించి
నీ పూదీవ చేతులతో నువ్వు చేస్తావని
ఈ నవదిన నవ ఘడియలో
ఈ దివ్య నిముషంలో
నాకనిపిస్తున్నదెందుకమ్మా,
మా ఆశాదీప ఆసిఫా??
(ప్రపంచవ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్న, కశ్మీర్‌లోని కథువాలో 8 ఏళ్ల చిన్నారి ఆసిఫా దారుణ హత్యపై స్పందించి ‘సాక్షి’ కోసం ప్రత్యేకంగా రాసిన కవిత)
(ఒక తక్షణ నిర్ఘాంత స్థితి నుంచి నన్ను తట్టి లేపిన డా‘‘పాలేరు శ్రీనివాస్‌కు ధన్యవాదాలతో)
– దేవిప్రియ,
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత
మొబైల్ : 98661 11874
Comments
Please login to add a commentAdd a comment