జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు సోమవారం భారీ దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. కథువా జిల్లాలోని మాచేడి ప్రాంతంలో భారత సైన్యానికి చెందిన వాహనంపై టెర్రిరిస్టులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మాచేడి-కిండ్లీ-మల్హార్ రోడ్డు మార్గంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
తాజాగా కథువా ఉగ్రదాడి ఘటను భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడికి ప్రతీకారం తప్పక తీర్చుకుంటామని రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్ అరమనే స్పష్టం చేశారు. దాడి వెనుక ఉన్న దుష్ట శక్తులను విడిచిపెట్టేది లేదని హెచ్చరించారు. ఉగ్రదాడిలో అమరులైన సైనిక కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
‘కథావాలోని బద్నోటాలో జరిగిన ఉగ్రవాద దాడిలో ఐదుగురు ధైర్యవంతులైన జవాన్లను కోల్పోయినందుకు.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. వారి నిస్వార్థ సేవను దేశం ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుంది, వారి త్యాగం ప్రతీకారం తీర్చుకుంటాం. అలాగే దాడి వెనుక ఉన్న దుష్ట శక్తులను భారత్ విడిచిపెట్టదు.’ అని ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
ఉగ్రవాదులు పక్కా ప్లాన్ ప్రకారం దాడికి పాల్పడ్డారు. తొలుత కాన్వాయ్‌పై గ్రనేడ్ విసిరారు. వాహనం ఆగిపోవడంతో కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్‌తో సహా ఐదుగురు ఆర్మీ సిబ్బంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. ప్రమాద సమయంలో ఆర్మీ కాన్వాయ్‌లో పదిమంది సైనికులు ఉన్నారు. బలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించేసరికి అక్కడి నుంచి దగ్గర్లోని అటవీ ప్రాంతంలోకి పరారైనట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. వారి కోసం సెర్చ్ ఆపరేషన్ సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment