devi priya
-
కవిత్వం అదృశ్యమైంది
దేవిప్రియ(15 ఆగస్టు 1949 – 21 నవంబర్ 2020) కవిత్వం ధారాళంగా రావాలంటాడేమిటీ? అప్రయత్నంగా అసంకల్పితంగా రాకపోతే ప్రక్కన పడేస్తాడట కదా. ఏ రెండు కవితలూ ఒక్కలా రాయని కవి మళ్లీ ఎందుకొస్తాడు? ఈయన పరచిన కవిత్వమంతా ఈయన స్వప్నాలంట. నడుస్తున్నప్పుడు తన కలల మీద ఆలోచనల మీద నడుస్తున్నామని కనికరంతో గుర్తుంచుకోమంటున్నాడు. అమ్మచెట్టు, నీటిపుట్ట, గాలిరంగు, దేవిప్రియ ఏమిటీ మాటలు? ఇంతకుముందు లేవేం? పుట్టకముందు లేనిమాట నిజమే. పెట్టి పుట్టిన తర్వాత కూడా పుట్టనట్టుంటాయేం. ఎప్పటికప్పుడు ఆ క్షణానే పుట్టినట్టుంటాయేం. వెన్వెంటనే అదృశ్యమైపోతాయేం. కవిత్వమా అది? రుచి గల పదార్థం అంటే మళ్లీ నోట్లో పెట్టుకునే లోగా నాలుక మీద ఆ రుచి మిగలకపోవడమట కదా! కవిత్వం కూడా అంతేనా? అందుకేనా కవి అదృశ్యమయ్యాడు! మళ్లీ వస్తాడా? రాడు రాడు. సృజన రెండు సార్లు జరగదు. ఏ రెండు కవితలూ ఒక్కలా రాయని కవి మళ్లీ ఎందుకొస్తాడు? వెళ్లిపోయాడు. నీటిపుట్టో గాలిరంగో తీస్తామా? అంత ప్రేమగా ఇచ్చినందుకు ఒక్కసారీ చదవలేదని బెంగ పడతాం. దుఃఖం కలుగుతుంది. చదువుతుంటే ఒక్కో కవిత ఒక్కో రంగులో ఉంటుంది. అన్నీ శుభ్రమైన దుస్తుల్లో ఉంటాయి. ఎంత పేదరాలైనా బిచ్చగాడైనా సరే కొత్త బట్టలు కట్టుకోవలసిందే. ముచ్చటపడో మూడ్‌లోకి వెళ్లో కవిత్వానుభవాన్ని వివరించుదామని ఫోన్ చేస్తే అది రెండో సారో మూడో సారో అని తేలుతుంది. అంతకుముందు ఏం పంచుకున్నామో తెలీదు. కొత్త అనుభూతి నెమ్మదిగా తడుముతుంది. మళ్లీ తడుపుతుంది. అది ఏటిని నిట్టనిలువునా నిలబెడుతుంది. ఏనుగుని తొండం మీద నడిపిస్తుంది. ఎవరూ చేయలేనిది ఇంకొకటి కూడా చేస్తుంది. గాలికి రంగులేస్తుంది. కందం రాసినవాడే కవి కదా. అందంగా మధురస నిష్యందంగా పఠితృహృదయ సంస్పందంగా ఒక వంద రచించినందుకే మహాకవిని ఆకాశానికెత్తేశాం కదా, అంతకు శతాబ్దాల ముందు ధారాళమైన నీతులు నోరూరగ చవులుపుట్ట నుడివినందుకు శతకకారుణ్ణి బట్టీయం పెడుతున్నాం కదా, మరి కరువొచ్చిన కాలంలో అరవై నిండాయి నాకు అతి తేలికగా చొరబడి గడచిన యేళ్లలో ఇరవైగా మారగలన ఇన్షా అల్లాహ్ అని సరళంగా అలవోకగా రాసినందుకు కొన్ని అయినా మననం చెయ్యకపోతే ఎట్లా? కవిత్వం ధారాళంగా రావాలంటాడేమిటీ? అప్రయత్నంగా అసంకల్పితంగా రాకపోతే ప్రక్కన పడేస్తాడట కదా. కవిత్వాన్ని చెక్కిన దాఖలా ఒక్కటీ లేదంటలే ! It's not something that can be chiseled and sharpened later అంటాడా? సరే సరే! కవిత్వం బాసింపట్టు వేసుక్కూచుని ఒకటికి పదిసార్లు వెనుకా ముందూ చూసుకుంటూ ఒక ప్రారంభం ఒక ముగింపూ పెట్టుకుని ఒక ప్రణాళిక ప్రకారం మన కవిత్వం రాస్తే దాన్ని పట్టుకుని పది మంది కవులు తయారవ్వాలనుకుంటున్నాం కానీ, ఇదేమిటీ, ఈయన పద్ధతి చూస్తే వంద మంది కవిత్వం రాయడం మానేసేటట్టున్నారే! ఎట్లబ్బా? అవునూ, ఈయనది మన గుంటూరేగా, మరి డబ్ల్యూ.బి.ఈట్స్‌తో పోల్చుకుంటున్నాడు చూడండి. సదరు ఈట్స్ లాగా ఈయన పరచిన కవిత్వమంతా ఈయన స్వప్నాలంట. నడుస్తున్నప్పుడు తన కలల మీద ఆలోచనల మీద నడుస్తున్నామని కనికరంతో గుర్తుంచుకోమంటున్నాడు. ఈయనతో మహాకష్టం వచ్చిపడింది. మనం కవిత్వం మీద మన పాదముద్రలు బలంగా పడాలనుకుంటున్నాం కదా? కుదరదా? తను కవి, రచయిత, జర్నలిస్టుల్లో ఎవరో తేల్చమని మనల్నే అడుగుతున్నాడు. తన రాజకీయం ఏమిటో గుర్తుతెచ్చుకోమంటున్నాడు. మన కాలపు మహా వాగ్గేయకారుణ్ణి ప్రజా యుద్ధనౌక అన్నదెవరో, మాభూమి, రంగుల కల చిత్రాల వెనుక కలం బలం ఎవరిదో, ప్రాసక్రీడల రన్నింగ్ కామెంటేటర్ ఎవరో, అధ్యక్షా మన్నించమన్నదెవరో, మన పూర్ణమ్మను ఇంగ్లిషులోకి తీసుకెళ్లిందెవరో చూడమంటున్నాడు. తనను తాను పరిచయం చేసుకోలేననీ తన రచనలే తనను పరిచయం చెయ్యాలనీ అంటున్నాడు. అవన్నీ చూసి ఇంత వైవిధ్యం చూపిన కవి తెలుగులో ఇతను కాక ఇంకొక్కడే ఉన్నాడని చాలా మంది అంటున్నారు. ఆయనతో అనంతమైన ఆత్మచరిత్రాత్మ చరిత్రాత్మక నవలని ఈయనే రాయించాడంటున్నారు. మనమెందుకు కాదంటాం? 1987 లోనా? యానాంలో కవిమిత్రుడి పెళ్లి. కవిసమ్మేళనం. పథేర్ పాంచాలి చూసి, ప్రేమ్‌చంద్ గోదాన్ చదివిన దుఃఖంంలో రాసిన ‘ఊరు పొమ్మంటుంది’ కవితను చదివి వేదిక దిగివస్తుంటే పలకరించి ‘కరెంటు తీగల మీద వరుసగా కూర్చున్న పిట్టలు – బట్టలారేయడానికి తగిలించిన క్లిప్పుల్లా ఉన్నాయ’నే వ్యక్తీకరణ ‘అర్బన్ ఎక్స్ప్రెషన్ కదా! గ్రామీణ వాతావరణంలో ఎట్లా ఇముడుతుందీ?’ అని ప్రశ్నించినప్పటినుంచి కదా కవిత్వావరణలోకి తెలివితేటలు ప్రవేశించ కూడదనీ, అనుభవిస్తేనే కవిత్వాన్ని పలవరించాలనీ తెలుసుకున్నదీ, మసులుకున్నదీ! ఇద్దరూ కలిసి ఒంటరిగా సాగిన సహచరి మరణం ఆమె లేని ప్రపంచం నిండా ఆమెనే నింపేసింది. కవి బాధ ప్రపంచానికి బాధ అయిన మరో సందర్భం అది. అది తెరలుగా పొరలుగా కమ్ముకుని ఒక పత్రికలో కవిత్వమై వచ్చింది. అది చదివి జీట, yౌuట ఞ్ఛౌఝ జ్చిటఛీజీట్చpp్ఛ్చట్ఛఛీ అని కదా అన్నాను. వివరించమన్నప్పుడు కవి తన అనుభవాన్ని లేదా అనుభూతిని ఇతరులచేత అనుభవింప చెయ్యడానికి కవిత్వం రాస్తాడు. అందుకు భాష, వ్యక్తీకరణ మీడియంగా ఉపయోగపడతాయి. ఎంత బాగా తన స్థితిని మాటల ద్వారా బట్వాడా చెయ్యగలడో ఉద్దేశ్యం అంత నెరవేరినట్టవుతుంది. అది నూటికి నూరు పాళ్లూ ్టట్చnటఝజ్టీ అయినప్పుడు ఆ కవిత అవసరం తీరిపోయి అదృశ్యమైపోతుంది’ అని వివరించి నపుడు ‘ఇది ఎక్కడైనా రాయకూడదా?’ అని కదా అన్నారు. రాశానా? నిజానికి ఆమె వెళ్లిపోయినప్పుడే మనకు తెలియకుండా ఆయన కూడా వెళ్లిపోయాడు.ఇప్పుడు తెలిసి వెళ్లిపోయాడు. -
ప్రముఖ రచయిత దేవిప్రియ కన్నుమూత
సాక్షి, హైదరాబాద్ : శ్రమజీవుల దోపిడీ..అట్టడుగు వర్గాల కన్నీళ్లు, కష్టాలకు అక్షర రూపమిచ్చి... జీవితమంతా తిరుగుబావుటాగా రెపరెపలాడిన ప్రముఖ రచయిత, జర్నలిస్టు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత దేవిప్రియ (71) శనివారం ఉదయం మరణించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పది రోజులుగా నిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గుంటూరు జిల్లా తాడికొండలో పుట్టిన ఆయనకు తల్లిదండ్రులు షేక్ ఖాజా హుస్సేన్‌గా పేరుపెట్టగా... ఆయన తన ఊరిపేరునే ఇంటి పేరుగా మార్చుకుని తాడి కొండ దేవిప్రియ పేరుతో పాటలు, కథలు, ఇతర రచనలు చేసి విశేష ప్రాచుర్యం పొందారు. పలు సినిమాలకు స్క్రీన్ ప్లేతో పాటు పాటలు రాశారు. దేవిప్రియ భార్య రాజ్యలక్ష్మి ఆరేళ్ల క్రితమే మరణించగా, కుమారుడు ఇవ, కూతురు సమతలు ఉన్నారు. ఆయన భౌతికకాయాన్ని అల్వాల్‌లోని నివాసానికి తీసుకువెళ్లి... అనంతరం తిరుమలగిరి శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. మాజీ ఎంపీ వినోద్‌కుమార్, రచయితలు శివారెడ్డి, సిద్ధారెడ్డి, దర్శకుడు బి.నర్సింగరావు, కెఆర్ మూర్తి తదితరులు అంత్యక్రియల్లో పాల్గొని నివాళి అర్పించారు. బహుముఖ ప్రజ్ఞాశాలి కవి, రచయిత, వ్యంగ్య వ్యాఖ్యానంతో పాటు సినిమా పాటలు, స్క్రీన్‌ప్లే తదితర రంగాల్లో దేవిప్రియ బహుముఖ ప్రజ్ఞాశాలిగా రాణించారు. ‘రన్నింగ్ కామెంట్రీ’పేరుతో దినపత్రికల్లో రాజకీయనాయకులపై నిత్య వ్యంగ్య వ్యాఖ్యాన ప్రక్రియను ప్రారంభించింది ఈయనే. ‘సంతకాలు’మరొక శీర్షిక. బి.నర్సింగరావు ఆధ్వర్యంలో వచ్చిన రంగులకల సినిమాలో ‘ఝమ్ ఝమ్మల్ మర్రీ, వెయ్యికాళ్ల జెర్రీ’అంటూ జనాన్ని ఉర్రూతలూగించిన గేయం దేవిప్రియ రాసిందే. గద్దర్ దీన్ని పాడారు. మా భూమి, దాసి సినిమాలకు స్క్రీన్‌ప్లే, పాటలు రాశారు. రగులుతున్న భారతం సినిమాకు మాటలు, పాటలు రాశారు. వీటిలో ‘గుర్తుందా నీకు’పాట మరపురానిది. గుంటూరు ఏసీ కళాశాలలో చదివిన ఆయన 1970లో ఏర్పడిన పైగంబర కవులలో సభ్యునిగా అమ్మచెట్టు, నీటిపుట్ట, చేప చిలుక, తుపాన్ తుమ్మెద, అరణ్య పర్వం, గాలి రంగు తదితర కవితా సంపుటిలతో పాటు ఇన్షా అల్లా పేరుతో కంద పద్యాలు రాశారు. గాలి రంగు కవితా సంకలనానికే కేంద్రసాహిత్య అకాడమీ (2017) పురస్కారం లభించింది. ఏపీ ప్రభుత్వం హంస పురస్కారం (2015), తెలుగు యూనివర్సిటీ పురస్కారం (2016), కెఎన్‌వై పతంజలి అవార్డు(2017), గజ్జెల మల్లారెడ్డి స్మారక అవార్డు (2011), యూనిసెఫ్ పురస్కారం(2011), విశాలాక్షీ సాహితీ పురస్కారం(2009) దేవిప్రియను వరించాయి. శ్రీశ్రీతో ఆయన ఆత్మ చరిత ‘అనంతం’ను రాయించి, సీరియల్‌గా ప్రచురించారు. అప్పట్లో అదొక సంచలనం. పెద్ద చర్చకు దారితీసింది. శ్రీశ్రీతో ఆ సీరియల్ రాయించేందుకు ‘పీత కష్టాలు’పడ్డానని దేవీప్రియ ఒక సందర్భంలో చెప్పారు. ప్రజావాగ్గేయకారుడు గద్దర్ జీవితాన్ని ‘యుద్ధనౌక’గా డాక్యుమెంటరీ చేశారు. దేవిప్రియ మరణంపై ప్రజాసాహితి సంపాదకులు కొత్తపల్లి రవిబాబు, జనసాహితి అధ్యక్షులు దివి కుమార్‌లతో పాటు ప్రెస్‌క్లబ్ హైదరాబాద్ సంతాపాన్ని ప్రకటించింది. పలువురి సంతాపం ప్రముఖ సాహితీవేత్త, సీనియర్ జర్నలిస్ట్ దేవిప్రియ (షేక్ ఖాజా హుస్సేన్) అనారోగ్యంతో మృతి చెందడం పట్ల ప్రముఖ కవి, రచయిత నిఖిలేశ్వర్‌తో పాటు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వేర్వేరు ప్రకటనల్లో సంతాపం ప్రకటించి, ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. దేవిప్రియ మరణం తెలుగు సాహిత్యానికి తీరని లోటని సాహితీ సమితి ప్రతినిధులు తెలకపల్లి రవి, వరప్రసాద్, కె.సత్యరంజన్ సంతాపం తెలిపారు. గుంటూరు జిల్లా తాడికొండలో జన్మించిన దేవిప్రియ పలు పత్రికల్లో పనిచేయడంతో పాటు సందేశాత్మక, అభ్యుదయ రచనలు చేశారని, దాసి, రంగుల కల సినిమాలకు పనిచేశారని సీపీఎం రాష్ట్ర కమిటీ నివాళులర్పించింది. సామాజిక చైతన్యానికి కృషి చేశారు: సీఎం కేసీఆర్ ప్రముఖ కవి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత దేవిప్రియ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. కవిగా, రచయితగా, కార్టూనిస్టుగా సామాజిక చైతన్యాన్ని పెంపొందించేందుకు ఆయన ఎంతగానో కృషి చేశారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. దేవిప్రియ సాహిత్య ప్రతిభకు ‘గాలి రంగు’రచన మచ్చు తునక అని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సాహితీ రంగానికి తీరని లోటు: హరీశ్‌రావు దేవిప్రియ మరణం సాహితీ రంగానికి తీరని లోటని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు సంతాపం ప్రకటించారు. మెతుకు సీమతో ఆయనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఉమ్మడి మెదక్ జిల్లాలో మంజీరా రచయితల సంఘం నిర్వహించిన పలు సభల్లో పాల్గొన్నారని పేర్కొన్నారు. దేవిప్రియ సామాజిక చైతన్యం కోసం కృషి చేశారని హరీశ్‌రావు నివాళి అర్పించారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కూడా దేవీప్రియ మృతి పట్ల సంతాపం ప్రకటించారు. -
చేపచిలుక ఎగిరిపోయింది
తెలుగు పలుకుబడి మీంచి చేపచిలుక ఎగిరిపోయింది. అది నీటిపుట్టలో ఈదులాడిన చేప కావచ్చు. అమ్మచెట్టు మీద వాలిన చిలుక కావచ్చు. ఈదటం, ఎగరటం, అలరించటం తెలిసిన చేప చిలుక అక్షర ప్రపంచం మీద అలిగి వెళ్ళిపోయింది. సర్దుబాటు చేసుకో లేని తత్వం, చిరుగాలి తాకిడికి చలించిపోయే సున్ని తత్వం, హృదయాల చుట్టూ ఆత్మీయంగా అల్లుకుపోయే అరుదైన వ్యక్తిత్వం, అక్షరాన్ని సకలావయవాలతో ప్రేమించే మనస్తత్వం, అన్నీ కలిస్తే దేవిప్రియ. అరుదైన పేరు. అరుదైన కవి. అంతేసమంగా పాత్రికేయుడు. గాలి రంగు గుర్తించిన కవి రంగులు వెదుక్కుంటూ తిరుమలగిరి స్వర్గవాటిక దగ్గరి గాలిలో కలిసి ఎగిరిపోయాడు. తనకు తొందరగా దగ్గరవటం తెలియదు. దగ్గరయితే ఎన్ని అసంతృప్తులున్నా దూరమవటం కూడా తెలియదు. డెబ్బయ్యో దశకం నడిమి కాలంలో పేరు వినటం. సిద్ది పేటలో ముగ్గురు మిత్రులం ‘దివిటి’ సంకలనం ఆవిష్క రణ కోసం శివారెడ్డిగారిని కలిశాము. నేనొక్కణ్ణే కాదు, నాతోపాటు దేవిప్రియను తీసుకొస్తాను, ఆయనే సభాధ్య క్షుడు అని ఆదేశించాడు. సిద్దిపేట బస్టాండులో మొదటి సారి ఆయన్ను చూడటం. మెల్లగా మాట్లాడినా గట్టిగా పట్టుకుంటాడు. మెత్తగా కనిపించినా కటువుగా పలుకు తుంటాడు. క్రమంగా ఒక భావంలా, ఒక వాక్యంలా, స్నేహంగా అల్లుకుపోతాడు. పేద రికం తెలిసిన కవి. జీవితంలో ఎన్నెన్నో కలలు కన్న కవి. పుల్లా పుల్లా తెచ్చి గూడు అల్లుకున్న పిట్ట పనితనాన్ని ఇష్టపడే బాల్య మన స్తత్వం. పల్నాడు రోషం ఏదో లోలోపల ఇమిడే ఉంటుంది. కృష్ణా తీరమే అయినా తడితాకక ఎండి పోయిన రాళ్ళూ రప్పల ప్రాంతం వినుకొండ బొల్లాపల్లిలో కన్నుతెర చిన మనిషి, తెలంగాణలో సంచ రించటం, బావి తవ్వితే బండ తప్ప నీళ్ళు పడని మా బందారం దాకా విస్తరించటం హృదయ బంధమే కదా– అది ఒడవని అక్షర బంధం కదా. మా ఊరికి రావట మేనా? మా కుటుంబం, మా బాపుతో, మంజీరా మిత్రులతో కలిసి వరిచేల గట్లమీద తిరుగాడే ఆత్మీయత దేవిప్రియ. మా బాపు ఆసుపత్రిలో మరణశయ్య మీద ఉన్నపుడు చలించి కవిత్వం రాసేటంత బంధమేదో తను అనుభవించేది. వాకిలి, ఇల్లు, మను షులు, చేలు, ఇసిరెలు, ఏవో ఇంకేవో దేవిప్రియ తలపుల్లో ఏ ఆరడిపెట్టాయో మా అవ్వ చనిపోయినప్పుడు ఆరోగ్యం సరిగా లేకున్నా వచ్చి కంటనీరు పెట్టుకున్నాడు. నీరులేని ప్రాంతాల, జీవితాల గోస తెలిసినవాడు కనుకనే నీటిని ప్రేమించాడు, మనసుల్ని ప్రేమించాడు, ఆయన కవిత్వమే నీటిపుట్ట. మంజీరా రచయితల సంఘంతో, కవుల్తో, కార్యకర్తలతో, మిత్రుల్తో అట్లా వాగులా కలిసిపోవటం ఆర్తి ఏదైనా మాకందరికీ స్ఫూర్తి. ప్రజాతంత్ర సంపాదకత్వం దేవిప్రియ జీవితంలో మరుపురాని మజిలీ. తర్వాత ఎన్ని పెద్ద పత్రికల్లో అయినా పనిచేసి ఉండవచ్చు, కొత్త ఒరవడులు పెట్టి ఉండవచ్చు. ప్రజాతంత్ర ఎప్పటికీ గుర్తుండే ప్రయోగం. శ్రీశ్రీ ఆత్మకథ ‘అనంతం’ రచనకు కారణం దేవిప్రియే. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి మిత్రులందరం వారం వారం ఇష్టంగా ఎదురుచూసేవారం. ప్రజాతంత్రలోనే అల్లం రాజయ్యను చదువుకున్నం. కంఠమనేని రాధాకృష్ణమూర్తి, శ్రీకంఠమూర్తి, సీహెచ్ మధు కథలు తిరిగి తిరిగి చదు వుకునేవాళ్లం. ఈవారం కవిత ఎప్పటికప్పుడు సంచల నమే. ఆ పేజీ ప్రత్యేకం చంద్ర బొమ్మలు, ప్రత్యేకమైన ఛాయాచిత్రాలు, అదొక గొప్ప అనుభవం. కవిత అందులో అచ్చుకావటానికి కల కనేవాళ్లం. ఏదో మేమేనా? సినారె లాంటి మహాకవులు కూడా ఆ పేజీ ప్రచురణ కోసం కలగనటం నాకు తెలుసు. సినారెకు దేవిప్రియంటే చాలా ఇష్టముండేది. దేవిప్రియతో శివారెడ్డితో సాయంత్రాలు గుర్తుండే అనుభవాలు. కృష్ణా హోటల్ గార్డన్ రెస్టారెంట్లో సాయంత్రాలు సాహితీ మిత్రుల చర్చలు, పలవరింతలు వింటూ పరవశించేవాళ్లం. ‘అడివీ, నువ్వంటే నాకిష్టం, విల్లనంబులు ఏరి ఉంచు ఏదో ఒకరోజు వాటినే ఆశ్ర యిస్తాను’. దేవిప్రియ కవిత ఎంత ఉత్సాహపర్చేదో? నిజమే– సూర్యుడు ఎప్పుడూ ఒకలాగే ఉండడు. అప్పుడ ప్పుడు వీపుమీద బరువులు మోసే హమాలీలా ఉంటాడు అని దేవిప్రియ ఊహిస్తే ఆలోచనేదో ఆశయమేదో విచ్చు కునేది. స్త్రీవాదం అంకురించకముందే కమలాదాస్ ఆత్మ కథ సీరియల్‌గా ప్రచురించి సంచలనం రేకెత్తించిన ప్రత్యే కత దేవిప్రియదే. ‘కవిత్వాన్ని సామాన్యంగానూ, అసామాన్యంగానూ చెప్పగలవాడే కవి’ దేవిప్రియ ప్రకటించాడు. కవిత్వానికి వరదగుడి కంటే ఎక్కువ రంగులు వేయగలవాడే కవి అన్నాడు. దేవిప్రియ నమ్మినట్లుగానే సామాన్యంగా, అసా మాన్యంగా రాయగల నైపుణ్యం, సింగిడి కంటే ఎక్కువ రంగులు వేయగల కౌశలం ఆయన కవిత్వంలో గుర్తించ వచ్చు. ‘నాకు రెండు నిధులున్నాయి. నాలుక మీద కవిత్వం, తలమీద దారిద్య్రం. నాకు రెండు విధులు న్నాయి. కవిత్వ నిత్యనిబద్ధం, దారిద్య్ర విముక్తి యుద్ధం. అంత సామాన్యంగా, అసామాన్యంగా రాయటం దేవిప్రియకు ఇష్టం. పచ్చపచ్చటి ఉద్యానవనాల్లో సంచ రించినంత సుతారంగా వెచ్చ వెచ్చటి రక్త జలపాతాల సాహచ ర్యంలో సేదతీరగలడు. పద్యం రాసిన ప్రతిసారీ ఇప్పటికీ భస్మమై మళ్లీ రూపొందే విద్య ఆయనకు బాగా తెలుసు. పదాల అర్థం, పదాల అందం, పదాల పదును సంపూర్ణంగా ఎరిగిన కవి. పదం మీదే కాదు, పద్యం మీద ఆయనకు పట్టు ఎక్కువ. ఇన్షా అల్లాహ్ శతకం రాశాడు. సమాజానంద స్వామి చతురో క్తులు రాశాడు. ఆ రోజుల్లో ‘రన్నింగ్ కామెంటరీ’కి మాస్ ఫాలోయింగ్ ఉండేది. ఆటోవాలాల దగ్గరనుంచి అధికార రాజకీయ నేతల దాకా అభిమానం సంపాదించుకున్నాడు. హాస్యం, వ్యంగ్యం వైభవోపేతంగా పండించేవాడు. ‘కవి గారూ ఇలా రండి. మాటున్నది మీతో అర్థం కాకున్నది మీరు మానవులో కోతో’ అని చమక్కులు వేసేవాడు. ఎంత చమత్కారో కవిత్వం పట్ల అంత సీరియస్ తత్వం. దేవిప్రియ కవిత్వంలో దుఃఖం, వేదన, సంఘర్షణ ఎంతో అంతకుమించి సౌందర్యం, స్వాప్నికత, తాత్వికత ఒదిగిపోయేవి. ఇష్టం పుడితే ఏదైనా సాధించాల్సిందే. ప్రేమిస్తే ఏదైనా పంచాల్సిందే. తప్పనిసరయి ప్రతిరోజూ అవే దుస్తులు వేసుకుంటుంటే కొత్తబట్టలు పెట్టిన ప్రేమ దేవిప్రియ. వెనకాముందూ చూడకుండా చైనీస్ రెస్టారెంట్ల రుచి చూపించిందాయన అభిరుచి. ఇష్టంగా ప్రేమించాడు అంతే ఇష్టంగా కోపించాడు. అలాంటి ఇష్టంతోనే నాకొక వాక్యం తగిలించాడు. మందారం కనిపెంచిన బందారం అని. ప్రేమాస్పదుడు, అక్షరం మీద ప్రేమతో అంత రంగాలు శోధించిన కవి, ఆత్మీయుల అంతరంగాలు జయించిన కవి దేవిప్రియ అనుబంధాల్లో, అక్షరాల్లో, జ్ఞాపకాల్లో అమరుడై వెలుగుతుంటాడు. వ్యాసకర్త నందిని సిధారెడ్డి తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు -
దేవీప్రియ మృతి పట్ల గవర్నర్ సంతాపం
సాక్షి, అమరావతి: ప్రముఖ కవి, జర్నలిస్టు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత దేవీప్రియ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రచయితగా, కార్టూనిస్టుగా, కవిగా సామాజిక చైతన్యాన్ని పెంపొందించేందుకు ఆయన ఎంతగానో కృషి చేశారని గవర్నర్ అన్నారు. గుంటూరు జిల్లా పల్నాడులోని ఓబులేశునిపల్లెలో జన్మించిన దేవిప్రియ సినీరంగంలో తన ప్రస్థానాన్ని ప్రారంభించి జర్నలిజంలో స్థిరపడ్డారు. దేవిప్రియ మరణం తెలుగు కవిత్వానికి తీరని లోటని గవర్నర్ అన్నారు. 'గాలి రంగు' రచన ఆయన సాహిత్య ప్రతిభకు మచ్చు తునక అని, కవి, అమ్మచెట్టు వంటి అత్యుత్తమ సంకలనాలు ఆయన కలం నుండి జాలువారాయన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు బిశ్వ భూషణ్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. -
ప్రముఖ రచయిత దేవిప్రియ కన్నుమూత
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత దేవిప్రియ కన్నుమూరు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిమ్స్‌లో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తను దేవిప్రియ కుటుంబ సభ్యులు ధృవీకరించారు. కవిగా, పాత్రికేయుడిగా, సినీగేయ రచయితగా దేవీప్రియకు మంచిపేరుంది. "గాలిరంగు" కవిత్వానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. గుంటూరు జిల్లా పల్నాడులోని ఓబులేశునిపల్లెలో జన్మించిన దేవిప్రియ సినీరంగంలో తన ప్రస్థానాన్ని ప్రారంభించి జర్నలిజంలో స్థిరపడ్డారు. ‘అమ్మ చెట్టు’ మొదలుకొని ‘గాలిరంగు’ వరకు మొత్తం 7 కవితా సంపుటాలను రచించారు. 40 ఏళ్లుగా కొనసాగిన తన రచనా ప్రస్థానంలో తెలుగు నుంచి ‘గాలిరంగు’కు సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న కవిగా గుర్తింపు పొందారు. దేవీప్రియ మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. దేవీప్రియ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సామాజిక చైతన్యాన్ని పెంపొందించేందుకు... కవిగా, రచయితగా, కార్టూనిస్టుగా దేవీప్రియ ఎంతో కృషి చేశారని కేసీఆర్ గుర్తుచేశారు. దేవీప్రియ సాహిత్య ప్రతిభకు "గాలిరంగు" రచన మచ్చుతునకగా వర్ణించారు. -
‘దేవి’ భాగవతం..
నిజం చెప్పొద్దూ.. ఎవరి కవిత్వం గురించి వారే∙మాట్లాడుతుంటే చాలా అసహ్యంగా ఉంటుంది వినడానికి. ‘కనుగొని పొగడగ’ అన్నట్టు సాహితీవేత్తలు ఆ కవిత్వాన్ని విశ్లేషిస్తే బావుంటుంది వినసొంపుగా. దేవిప్రియ తన గురించి నోరు తెరవరు. తన కవిత్వం గురించైతే అసలు పెదవే విప్పరు. ఆ మాటకొస్తే అసలాయన దేని గురించీ మాట్లాడరు. రెండు దశాబ్దాల పైబడిన సాన్నిహిత్యంలో గట్టిగానో, మెల్లగానో మాత్రమే కాదు; గుసగుసగా కూడా ఆయన ఎప్పుడూ దేని గురించీ వివరంగా మాట్లాడగా చెవినపడలేదు. అంతా, ఆయన కవిత్వమే ఆయన మనసులోని మాటలేంటో చెబుతుంది. చుట్టు పక్కల వాదోపవాదాలు చెలరేగిపోతున్నా మెత్తని చిరునవ్వుతో హత్తుకోవడమే తెలుసు. తీవ్రమైన విమర్శలు ఎదురైనప్పుడు సైతం.. కనీసం కన్నెర్రజేసిన దాఖలాలు లేవు. అలాని, ఆయనకు ఎరుపంటే భయమేమీ లేదు. ‘వివేక వంతుల స్వరం బలంగా వినిపించకపోతే అరాచక శక్తుల గొంతులు పెరుగుతాయి’ అని ఆయనకు తెలుసు. అంతమాత్రాన ఆయన కవిత్వంలో ఝంఝానిల షడ్జద్వానం వంటి శబ్దాలేమీ వినిపించవు. పీడితుల కన్నీటి చుక్క రుచి తెలిసిన నీటిపుట్ట ఆయన కవిత్వం. పీడ కలల నుంచి విముక్తి ప్రసాదించే గాలి రంగు ఆయన వాక్యం. తుఫాన్ ఉధృ తిలో తుమ్మెద ఝుంకారాన్నీ, ఒకప్పుడు అరణ్యంలో ఎగిరిపోయే పిట్ట పురాణాన్నీ, ఇంకొకప్పుడు చేప చిలుక విన్యాసాలనీ పట్టుకున్న గంధపు పరిమళాలు ఆయన పదచిత్రాలు. ఇదంతా కేవలం ఒకవైపు మాత్రమే. మరోవైపు చూస్తే.. ఆయన ఓ సంచలన పాత్రికేయుడు, మరో విభిన్నమైన సినీ రచయిత, అందరినీ ఆశ్చర్యపరిచే ప్రయోగశీలి. అందుకే ఆయన బహుముఖీనుడు. అలా బహుముఖుడైన దేవిప్రియ గురించి అనేకమంది అనేక సందర్భాలలో ముచ్చటించారు. అటువంటి విభిన్న పార్శా్వల సమాహారం ‘బహుముఖ’. ‘ఊహ చేయలేనివాడు ఉపన్యాసకుడు కాగలడేమోకానీ కవి కాగలడా?’అని నిలదీసే దేవిప్రియ తనను తాను కవిగా ఎలా మలచుకున్నాడో, తన లోని కవితాగ్ని కీలలు చల్లారిపోకుండా రెండు చేతులూ అడ్డి ఎలా కాపాడుకున్నాడో ఇంటర్వ్యూలలో ఆయన సవివరంగా వివరించారు. పాత్రికేయుడిగా ఆయన సృష్టిం చిన సంచలనాలు, చేసిన ప్రయోగాలు, సాగించిన ప్రస్థానం నేటి తరపు జర్నలిస్టులకు ఎంతో స్ఫూర్తినిస్తాయి. సినీరంగంలోకి ఆయన సునాయాసంగా చొచ్చుకుపోయిన ప్రజ్ఞను గురించి కాకరాల, పాండీబజార్లో పంచుకున్న అనుభవాలను గురించి ధవళ సత్యం ఆసక్తికరంగా వివరించారు. రాజకీయ ఆవేశాలలో సున్నితత్వాన్ని పోగొట్టుకోకపోవడం, గార్డెన్ రెస్టారెంట్ చల్ల గాలి రుచి మరిగినా అడివిని విస్మరించకపోవడం, సమాజచలనాలపట్ల గల నిశిత పరిశీలన గురించి, కాలక్షేపం చేస్తున్నా మస్తిష్కంలో పదాలు అల్లుకోవడం గురించీ.. ఇంకా అనేకానేక ప్రత్యేకతల గురించి ప్రముఖ కవులు, విమర్శకులు, పాత్రికే యుల అభిప్రాయాల మాలిక ఈ ‘బహుముఖ’.. వెరసి, ఇది ఓ ‘దేవి’ భాగవతం. (హైదరాబాద్ పర్యాటక భవన్లో నేటి సాయంత్రం ఆరు గంటలకు ‘బహుముఖ’ ఆవిష్కరణ) – దేశరాజు -
నువ్వేనా ఆసిఫా?
అమృతం తాగిన ఆడదేవతల ముఖాలతో నర్తన నడకలతో గగన మేఘధూళి ఎగజిమ్ముతూ పోతున్న గుర్రాల గుంపు వీపుల మీద ఊరేగుతున్నది భయవిహ్వల నేత్రాలతో నువ్వేనా మా బంగారు తల్లి ఆసిఫా? ఏకపత్నీవ్రత స్వాముల నామ జపాలతో తనివితీరని దైత్య జిహ్వల రక్త తృష్ణకి పసినెత్తుటి నిండు దోసిలివయింది నువ్వేనా మా గారాల తల్లి ఆసిఫా? కన్నతల్లులనీ, కన్నకూతుళ్లనీ, అక్కచెల్లెళ్లనీ మరిచి హోమ సురాపానోన్మత్తులయి నీ లేలేత మృదుపుష్పవాటిక మీద క్రూర విహంగాలయి ఇనుపగోళ్లతో విరుచుకుపడిన నవపావన ధూర్త దురంత భూత ప్రేత ఆలయ పాలక అధముల వికటహాసాలకి కకావికలయిన చూర్ణదృక్కులతో కనిపించని నిర్వికార సృష్టికారకుడికీ కనిపిస్తున్న కుంకుమచర్చిత విగ్రహానికీ శబ్దహీన రోదనలతో కరుణ కోసం వేడుకున్నది నువ్వేనా మా పిచ్చిమాలచ్చిమి ఆసిఫా? ఏలినవారికి, ఎక్కడో లండన్‌లో ప్రవాస యోషల హారతి పళ్లేల వెలుగులో వెండిలా వికసిస్తున్న గడ్డం, వందేమాతర నినాద నాదాలతో ఉప్పొంగుతున్న విశాల వక్ష వృక్షపత్రాలలో ప్రతిఫలిస్తున్న వైరి ధనుర్భంగ ద్వితీయ విజయోత్సవ మధుర స్వప్న సంరంభంలో ఏ నిస్సహాయ ఆక్రందనలూ వినిపించడం లేదని లక్షలాది కొవ్వొత్తుల నడుమ నిలుచుని వెక్కివెక్కి విలపిస్తున్నది నువ్వేనా మా చిన్నారి ఆసిఫా? ప్రపంచంలోని తల్లులందరూ ప్రపంచంలోని తండ్రులందరూ ప్రపంచంలోని మనుషులందరూ ఇప్పుడు నీకోసం ఘోషించే సముద్రాలయి తీరశిలలమీద తలలు బాదుకుని వ్రయ్యలవుతున్నారమ్మా ఆసిఫా? ఏడెనిమిదేళ్ల ఏ పసిపాప ముఖం చూసినా నాకు నువ్వే కనిపిస్తున్నావెందుకమ్మా ఆసిఫా? ఏ ప్రవక్తలూ, ఏ వియోగులూ, ఏ యోధులూ ఏ విధ్వంసకారులూ, ఏ విప్లవవీరులూ చేయలేకపోయినదేదో నీ బలిదానాన్ని ఆయుధంగా ధరించి నీ పూదీవ చేతులతో నువ్వు చేస్తావని ఈ నవదిన నవ ఘడియలో ఈ దివ్య నిముషంలో నాకనిపిస్తున్నదెందుకమ్మా, మా ఆశాదీప ఆసిఫా?? (ప్రపంచవ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్న, కశ్మీర్‌లోని కథువాలో 8 ఏళ్ల చిన్నారి ఆసిఫా దారుణ హత్యపై స్పందించి ‘సాక్షి’ కోసం ప్రత్యేకంగా రాసిన కవిత) (ఒక తక్షణ నిర్ఘాంత స్థితి నుంచి నన్ను తట్టి లేపిన డా‘‘పాలేరు శ్రీనివాస్‌కు ధన్యవాదాలతో) – దేవిప్రియ, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత మొబైల్ : 98661 11874 -
ప్రపంచ సాహిత్యానికి తీసిపోనిది తెలుగు సాహిత్యం
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు కవిత్వం, సాహిత్యం ప్రపంచంలోని మరే ఇతర సాహిత్యానికీ తీసిపోదని.. దానికి అత్యున్నత ప్రమాణాలు, నాణ్యత ఉన్నాయని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత దేవిప్రియ అభిప్రాయపడ్డారు. ఆయన రచించిన ‘గాలిరంగు’ కవిత్వం.. 2017కుగానూ ఉత్తమ కవితా సంపుటి అవార్డుకు ఎంపికైన విషయం తెలిసిందే. గుంటూరు జిల్లా పల్నాడులోని ఓబులేశునిపల్లెలో జన్మించిన దేవిప్రియ సినీరంగంలో తన ప్రస్థానాన్ని ప్రారంభించి జర్నలిజంలో స్థిరపడ్డారు. ‘అమ్మ చెట్టు’ మొదలుకొని ‘గాలిరంగు’ వరకు మొత్తం 7 కవితా సంపుటాలను రచించారు. 24 భాషల్లో పురస్కారాలకు ఎంపికైన రచయితలకు అవార్డుల ప్రదానోత్సవం సోమవారం ఢిల్లీలో జరిగింది. కేంద్ర సాహిత్య అకాడమీ నూతన అధ్యక్షుడు కంబార్ చంద్రశేఖర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 40 ఏళ్లుగా కొనసాగిన తన రచనా ప్రస్థానంలో తెలుగు నుంచి ‘గాలిరంగు’కు సాహిత్య అకాడమీ అవార్డు అందుకోవడం సంతోషాన్నిచ్చిందన్నారు. ప్రపంచంలోని ఏ సాహిత్య ప్రమాణాలతోనూ తీసిపోని తెలుగు సాహిత్యం.. ఇతర భాషల్లోకి అనువాదం కాకపోవడం పెద్ద లోపమని అభిప్రాయపడ్డారు. సాహిత్య అకాడమీపై ఉత్తరాది ప్రభావం ఉందన్న భావనను తెలుగు రచయితలు, కవులు వదులుకోవాలన్నారు. తెలుగు సాహిత్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వాలూ చొరవ తీసుకోవాలని కోరారు. పాఠశాల స్థాయిలో తెలుగును తప్పనిసరి చేసిన సీఎం కేసీఆర్‌కు భాష, సాహిత్యంపై శ్రద్ధ ఉండడం అభినందనీయమన్నారు. తెలుగులో విద్యనభ్యసించే అవకాశాలను ప్రభుత్వాలు భవిష్యత్తు తరాలకు కల్పించాలని అన్నారు. కాగా, ఉర్దూలో మొహమ్మద్ బేగ్ ఈ అవార్డును అందుకున్నారు. హైదరాబాద్ వర్సిటీలో ఆయన ఉర్దూ విభాగాధిపతిగా పనిచేసి రిటైరయ్యారు. చిన్న కథల విభాగంలో ఆయన రచించిన ‘దుఃఖమ’ అవార్డుకు ఎంపికైంది. పురస్కారాలు అందుకున్న రచయితలకు జ్ఞాపికతోపాటు రూ.లక్ష నగదు బహుమానాన్ని ప్రదానం చేశారు. -
నూతన విరామ చిహ్నం
అప్పుడే మళ్ళీ మరొక సంవత్సరం తెగిన గాలిపటంలా తెలియని ఏ దిక్కుల ఆవలికో ఎగిరిపోయింది. ఇదిగో ఇప్పుడే ఏడు రంగుల ఏడాది ఒకటి రెక్కలు రెపరెపలాడిస్తూ ఎక్కడినుంచో ఖగోళ శాస్త్రజ్ఞులు ఇంకా కనిపెట్టని ఏ అగోచర మార్మిక గ్రహం నుంచో వచ్చి మనం మనదనుకుంటున్న ఈ లోకపు భుజం మీద వాలింది. వానలూ తుపానులూ భూకంపాలూ ఎన్నికలూ వాగ్దానాలూ వంచనలూ వరదలూ ఊచకోతలూ మళ్ళీ మరొకసారి కొత్త గజ్జెలు కట్టి కాల రంగస్థలం మీద నర్తిస్తాయి... అంతా బాగున్నట్టే ప్రవర్తిస్తాయి. చౌరస్తాలలో యాచక బాలల చేతుల్లో హేపీ న్యూ ఇయర్ జెండాలు ఎప్పటిలాగే ఊగుతాయి. దలాల్ స్ట్రీట్‌లో క్షణాలలో లక్షలూ కోట్లూ ఎప్పటిలాగే చేతులు మారతాయి; మురికివాడలకీ, విలాస నివాసాలకీ ఆడీ కార్లకీ తుప్పుపట్టిన సైకిల్ చక్రాలకీ ఏ దేశంలోనయినా ఏ సంవత్సరంలో అయినా కేలెండర్లతో పంచాంగాలతో ఏమి పని... అనంత కాలవాక్యంలో పాతదయినా కొత్తదయినా సంవత్సరం ఒక సూక్ష్మ విరామ చిహ్నమే. – దేవిప్రియ -
దేవీప్రియకు కేంద్ర సాహిత్య అవార్డు
-
దాచేస్తే దాగని చరిత్ర- రన్నింగ్ కామెంటరీ...
తాజా పుస్తకం రాష్ట్రానికి రాష్ట్రానికి/ పెట్టి కీచులాట నవఢిల్లీ పాడుతోంది/ ఇపుడు జోలపాట! ఎప్పుడో 1986లో దేవిప్రియ రాసిన రన్నింగ్ కామెంటరీ ఇది. కాని ఇవాళ్టి సందర్భంలో కూడా కట్ చేసి పేస్ట్ చేసుకునేలా ఉంది. దేవిప్రియ ఒక సరిహద్దు సిపాయి. ఎత్తయిన బురుజు మీద నిఘాకు నిలబడి శత్రువులు ఎవరు చొరబడుతున్నారా అని పహారా కాసే కలం సిపాయి. పాత్రికేయుడిగా దాదాపు ముప్పయ్ నలభై ఏళ్లుగా కొనసాగుతున్నా అందులోని రెండు దశాబ్దాల కాలాన్ని ఆయన రన్నింగ్ కామెంటరీకి వెచ్చించారు. వార్తలు జరిగింది జరిగనట్టు చెప్తాయి. కాని కవి జరిగినదాని వెనుక ఉన్న ఉద్దేశాలను వ్యాఖానిస్తాడు. జరగబోయే నష్టాన్ని దుశ్శకునంగా చూపుతాడు. ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజీవ్ గాంధీ హత్యోదంతం వరకూ దాదాపు ఇరవై ఏళ్ల పాటు సమకాలీన జాతీయ, రాష్ట్రీయ పరిణామాలపై దేవిప్రియ అనునిత్యం పేల్చిన వ్యంగ్య తూటాలు, పదును బాణాలు ఇప్పుడిలా మూడు భాగాలుగా సంపుటీకరణ చెంది ‘దేవిప్రియ రన్నింగ్ కామెంటరీ’గా విడుదలయ్యాయి. నిజానికి ఇలాంటి ప్రక్రియ దినపత్రికల్లో మొదలుకావడం దేవిప్రియతోనే మొదలు. మొదటి పేజీలో రాజకీయ వ్యంగ్య కవిత్వం ప్రతి రోజూ రాయడం, మెప్పించడం, అందుకంటూ పాఠకులు ఏర్పడటం, ఈ శీర్షిక ఘనవిజయం సాధించడం వల్ల దాదాపు చాలా పత్రికలు దీనిని అనుకరించడం గర్వంతో చెప్పుకోదగ్గ పని. నాటి ఆంధ్రప్రభ, ఉదయం, ఆంధ్రజ్యోతిల్లో తాను వివిధ హోదాల్లో పని చేస్తున్నా రన్నింగ్ కామెంటరీని వదలకుండా గురి తప్పని వేటగాడిలా రాజకీయ పక్షాల వెంటపడి తన పదాలతో చీల్చి చెండాడాడు దేవిప్రియ. ఆయన పదం పేదవాడి పక్షం. పాలకుడు ఆయన ప్రత్యర్థి. గుండెలెందుకు బాదుకోడం/ పాలధర పెరిగిందని పేదప్రాణం రేటు మినహా / దేని ధర తరిగిందని? ఇది దేవిప్రియ ఆత్మ. ఎవరికెవరు తీసిపోని/ రాజకీయ పీతలు ప్రజల ఉసురు పోసుకునే/ నీతిలేని నేతలు. ఇది దేవిప్రియ ఆక్రోశం. ఈ ఆత్మ, ఆక్రోశం కలగలవడం వల్లే సామాన్యులు ఈ రన్నింగ్ కామెంటరీని తమ సొంతం చేసుకున్నారు. తాము అనాల్సిన మాటలనే కవి అంటున్నందుకు పొంగిపోయారు. ఇలాంటి గౌరవం దక్కినప్పుడే కవి ప్రజల నాల్కల మీద సజీవుడవుతాడు. దేవిప్రియ తన రన్నింగ్ కామెంటరీతో అలా సజీవుడైనాడు. తన అపారమైన రాజకీయ పరిజ్ఞానం వల్ల, అనల్పమైన శబ్ద సంపద వల్ల దేవిప్రియ ఈ వ్యంగ్య కవిత్వాన్ని రక్తి కట్టించగలిగారు. సులభమైన పదాలతోనే కావలసిన స్పందనను సాధించుకోవడంలో సఫలీకృతుడయ్యాడు. ఇది కచ్చితంగా వేమన బాణీ. శ్రీశ్రీ, ఆరుద్రలు కూడా పదాలతో చాలా క్రీడా విన్యాసాలు చేశారుగాని దేవిప్రియ నిబద్ధత, రన్నింగ్ కామెంటరీ వెనుక ఉన్న ఆయన సదుద్దేశం, ఆశించిన ప్రతిఫలం ఆయనను విడిగా, సగౌరవంగా నిలబెట్టి తీరుతాయి. కవిగా ఆయన ఎంత సాధించినా రన్నింగ్ కామెంటరీ సాధించిన పాప్యులారిటీ వేరు. అందుకే ఎండ్లూరి సుధాకర్ చెప్పినట్టు- ఛందోలయ బృందాలయ/ అందాలయ దేవిప్రియ చేతులెత్తి చప్పట్లతో/ చెప్పాలయ జయజయ. దేవిప్రియ రన్నింగ్ కామెంటరీ- మూడు భాగాలు- మూడు కలిపి రూ.999; కావ్య పబ్లిషింగ్ హౌస్ ప్రచురణ; ప్రతులకు: విశాలాంధ్ర -
పెరట్లో మందారం కూడా కవిత్వానికి ప్రేరణే
వైట్ అమెరికన్ కోడలికి తెలుగు అత్తగారు వారానికో తెలుగు కథను విన్పించాలి. ఇంగ్లిష్‌లో. ఫోన్లో. అది నియమం. ఇటీవల ఒక తాజా కవితను అత్తగారు విన్పించారు. అమెరికా అమ్మాయి తట్టుకోలేక ఏడ్చింది. ఏమిటా పుస్తకం? ‘పూర్ణమ్మ: ద గోల్డెన్ డాల్’. అనువాదకులు దేవీప్రియ. ‘ఇంగ్లిష్ భాషలోని ప్రపంచసాహితీ నిధికి దేవీప్రియ చేర్చిన క్లాసికల్ ఆభరణం ఈ పుస్తకం’ అన్నారు భాషాశాస్త్రవేత్త చేకూరి రామారావు. మహాకవి గురజాడ వారసత్వాన్ని కొనసాగిస్తోన్న ఆధునిక వచన కవుల్లో దేవీప్రియ మాత్రమే ‘ముత్యాల స్వరా’న్ని అందుకున్నారు. ఏభయ్యేళ్లుగా పాళీ అరుగుతోంది. కాని, పదును తగ్గలేదు. ఆయనతో ఒక సంభాషణ! మీ బాల్యం చెప్పండి. పల్నాడులోని ఓబులేశుని పల్లెలో జన్మించాను. తాడికొండలో పెరిగాను. మా నాన్నగారి పాత పోలీసు డ్రస్‌ను రీసైజ్ చేయించుకుని బడికి వెళ్లిన పేదరికం నాది. అయితే మా ఊరి కొండపై గుడి, ధ్వజస్థంభపు గంటలు గాలికి కదులాడి ధైర్యాన్ని ప్రసరించేవి. అమరావతి- తాడికొండ మధ్య ఆ రోజుల్లో గుర్రపుబండ్లు ప్రధాన రవాణా సాధనాలు. గుర్రాల సౌందర్యం, వాటి కదలికల హొయలు మెస్మరైజ్ చేసేవి. గాలిగోపురం దగ్గర గ్రంధాలయంలో మంచి పుస్తకం చదివినప్పుడల్లా ‘గుర్రపు నడక’ ధ్వనించేది. కవిత్వంలో కూడా ఇప్పటికీ అదే నడక. ‘కోస్తా/సీడెడ్/నైజాం: గరిక అదే/అరక అదే/చెమట అదే/కూలి అదే/అయినా నష్టమేమిటి తెలుగు వాడా/అనుభవిద్దాం విడిగ కూడా’ అని కవిత తన్నుకొస్తుంది. కరుణశ్రీ శిష్యులనుకుంటాను.... గుంటూరు ఎ.ీసి.కాలేజీలో స్పెషల్ తెలుగులో చేరాను. అక్కడ నా అధ్యాపకులు కరుణశ్రీగారు. సిలబస్‌లో లేని అనేక సాహిత్య విషయాలను చెప్పేవారు. క్లాస్ ముగించే ముందు బోర్డుపై ఆశువుగా ఒకరోజు ‘ఆటవెలది’ మరో రోజు ‘ఉత్పలమాల’ లేదా ‘కందం’ రాసేవారు. మరుసటి రోజు ఆ నమూనాలో స్వంతంగా ఛందోపద్యంతో క్లాసుకు రావాలనేవారు. అలా నేను పద్యాలను రాసేవాణ్ణి. ఎ.సి.కాలేజీ వరండాలో కరుణశ్రీని అనుసరిస్తూ నడవడం ఒక ‘క్లాసిక్’ ఎక్స్పీరియన్స్. ఆ ‘నడక’గాని, కవిత్వంలో ‘నడక’గాని నాకు జర్నలిజంలో ఉపయోగపడ్డాయి. ఒక వార్త, ఒక చిత్రం చెప్పలేని భావాన్ని ‘రన్నింగ్ కామెంటరీ’లో చూపాను. రంగుల కల సినిమా కోసం నేను రాసిన ‘జమ్జమ్మల్ మర్రి వెయ్యికాళ్ల జర్రీ’ ప్రేక్షకుల నాల్కలపై జీవించిన పాట! శ్రీశ్రీ చేత ‘అనంతం’ రాయించినట్టున్నారు.... సాంప్రదాయ- సామాజిక ఆధిపత్యం గల వర్గాలు కవిత్వాన్ని, జర్నలిజాన్ని నిర్దేశిస్తోన్న రోజుల్లో నాలాంటి వాడు పైకి రావాలంటే ఆ కష్టం చెప్తే తెలిసేది కాదు. కష్టపడి పని చేయడం, కొత్తగా పని చేయడం వల్లే అది సాధ్యం అవుతుంది. ‘ప్రజాతంత్ర’లో శ్రీశ్రీ చేత ఆయన ఆత్మచరిత ‘అనంతం’ రాయించాను. అది ఒక సంచలనం. ఆ సీరియల్ రాయించుకోవడానికి శ్రీశ్రీ మాటల్లోనే చెప్పాలంటే నేను ‘పీత కష్టాలు’ పడ్డాను! మీ కవిత్వం సులువుగా లోతుగా ఉంటుంది. నా కవిత్వం ప్రధానంగా సామాజికం. వసుధైక కుటుంబ స్వాప్పికుణ్ణి నేను. అందుకే కుటుంబ సంబంధాలను తరచూ పలవరిస్తాను. ‘ఎప్పటిలా అమ్మ అమ్మలాగే ఉంది/ఈ కొడుకే కొడుకు లాగ లేడు’ రెక్కలొచ్చిన పిల్లలు ఎవరి దారి వారు వెతుక్కున్న తరువాత కొత్తగా అడిగిందామె : ‘ఇప్పుడెలా బతుకుతాం?’ ఎప్పటిలాగే. ఇలాగే. సరేనా! మీ కవిత్వానికి ప్రేరణ.... పిట్టకూడా ఎగిరిపోవాల్సిందే- కవిత్వం గాలిరంగు- చేపచిలుక- అమ్మచెట్టు - నీటిపుట్ట- తుఫాను తుమ్మెద ఇవీ నా కవితా సంకలనాలు. నాకు కవిత్వాన్ని నిర్వచించడంలో పట్టువిడుపులు లేవు. కవిత్వంలో కవిత్వం కానిదేదీ ఉండకూడదు అనుకుంటాను. సామాన్యప్రజల జీవితాలను మెరుగుపరచడం అనే ఆశయం నా కవితా వస్తువు. కవికి ప్రేరణలు పరిపరివిధాలు. మా పెరట్లో పూసిన మందారపువ్వు కూడా ఒకోసారి నా కవితలకు ప్రేరణగా నిలుస్తుంది. - పున్నా కృష్ణమూర్తి