నిజం చెప్పొద్దూ.. ఎవరి కవిత్వం గురించి వారే∙మాట్లాడుతుంటే చాలా అసహ్యంగా ఉంటుంది వినడానికి. ‘కనుగొని పొగడగ’ అన్నట్టు సాహితీవేత్తలు ఆ కవిత్వాన్ని విశ్లేషిస్తే బావుంటుంది వినసొంపుగా. దేవిప్రియ తన గురించి నోరు తెరవరు. తన కవిత్వం గురించైతే అసలు పెదవే విప్పరు. ఆ మాటకొస్తే అసలాయన దేని గురించీ మాట్లాడరు. రెండు దశాబ్దాల పైబడిన సాన్నిహిత్యంలో గట్టిగానో, మెల్లగానో మాత్రమే కాదు; గుసగుసగా కూడా ఆయన ఎప్పుడూ దేని గురించీ వివరంగా మాట్లాడగా చెవినపడలేదు. అంతా, ఆయన కవిత్వమే ఆయన మనసులోని మాటలేంటో చెబుతుంది. చుట్టు పక్కల వాదోపవాదాలు చెలరేగిపోతున్నా మెత్తని చిరునవ్వుతో హత్తుకోవడమే తెలుసు. తీవ్రమైన విమర్శలు ఎదురైనప్పుడు సైతం.. కనీసం కన్నెర్రజేసిన దాఖలాలు లేవు. అలాని, ఆయనకు ఎరుపంటే భయమేమీ లేదు. ‘వివేక వంతుల స్వరం బలంగా వినిపించకపోతే అరాచక శక్తుల గొంతులు పెరుగుతాయి’ అని ఆయనకు తెలుసు.
అంతమాత్రాన ఆయన కవిత్వంలో ఝంఝానిల షడ్జద్వానం వంటి శబ్దాలేమీ వినిపించవు. పీడితుల కన్నీటి చుక్క రుచి తెలిసిన నీటిపుట్ట ఆయన కవిత్వం. పీడ కలల నుంచి విముక్తి ప్రసాదించే గాలి రంగు ఆయన వాక్యం. తుఫాన్ ఉధృ తిలో తుమ్మెద ఝుంకారాన్నీ, ఒకప్పుడు అరణ్యంలో ఎగిరిపోయే పిట్ట పురాణాన్నీ, ఇంకొకప్పుడు చేప చిలుక విన్యాసాలనీ పట్టుకున్న గంధపు పరిమళాలు ఆయన పదచిత్రాలు. ఇదంతా కేవలం ఒకవైపు మాత్రమే. మరోవైపు చూస్తే.. ఆయన ఓ సంచలన పాత్రికేయుడు, మరో విభిన్నమైన సినీ రచయిత, అందరినీ ఆశ్చర్యపరిచే ప్రయోగశీలి. అందుకే ఆయన బహుముఖీనుడు. అలా బహుముఖుడైన దేవిప్రియ గురించి అనేకమంది అనేక సందర్భాలలో ముచ్చటించారు. అటువంటి విభిన్న పార్శా్వల సమాహారం ‘బహుముఖ’. ‘ఊహ చేయలేనివాడు ఉపన్యాసకుడు కాగలడేమోకానీ కవి కాగలడా?’అని నిలదీసే దేవిప్రియ తనను తాను కవిగా ఎలా మలచుకున్నాడో, తన లోని కవితాగ్ని కీలలు చల్లారిపోకుండా రెండు చేతులూ అడ్డి ఎలా కాపాడుకున్నాడో ఇంటర్వ్యూలలో ఆయన సవివరంగా వివరించారు.
పాత్రికేయుడిగా ఆయన సృష్టిం చిన సంచలనాలు, చేసిన ప్రయోగాలు, సాగించిన ప్రస్థానం నేటి తరపు జర్నలిస్టులకు ఎంతో స్ఫూర్తినిస్తాయి. సినీరంగంలోకి ఆయన సునాయాసంగా చొచ్చుకుపోయిన ప్రజ్ఞను గురించి కాకరాల, పాండీబజార్‌లో పంచుకున్న అనుభవాలను గురించి ధవళ సత్యం ఆసక్తికరంగా వివరించారు. రాజకీయ ఆవేశాలలో సున్నితత్వాన్ని పోగొట్టుకోకపోవడం, గార్డెన్ రెస్టారెంట్ చల్ల గాలి రుచి మరిగినా అడివిని విస్మరించకపోవడం, సమాజచలనాలపట్ల గల నిశిత పరిశీలన గురించి, కాలక్షేపం చేస్తున్నా మస్తిష్కంలో పదాలు అల్లుకోవడం గురించీ.. ఇంకా అనేకానేక ప్రత్యేకతల గురించి ప్రముఖ కవులు, విమర్శకులు, పాత్రికే యుల అభిప్రాయాల మాలిక ఈ ‘బహుముఖ’.. వెరసి, ఇది ఓ ‘దేవి’ భాగవతం.
(హైదరాబాద్ పర్యాటక భవన్‌లో నేటి సాయంత్రం ఆరు గంటలకు ‘బహుముఖ’ ఆవిష్కరణ)
– దేశరాజు
Comments
Please login to add a commentAdd a comment