అప్పుడే మళ్ళీ మరొక సంవత్సరం తెగిన గాలిపటంలా తెలియని ఏ దిక్కుల ఆవలికో ఎగిరిపోయింది. ఇదిగో ఇప్పుడే ఏడు రంగుల ఏడాది ఒకటి రెక్కలు రెపరెపలాడిస్తూ ఎక్కడినుంచో ఖగోళ శాస్త్రజ్ఞులు ఇంకా కనిపెట్టని ఏ అగోచర మార్మిక గ్రహం నుంచో వచ్చి మనం మనదనుకుంటున్న ఈ లోకపు భుజం మీద వాలింది. వానలూ తుపానులూ భూకంపాలూ ఎన్నికలూ వాగ్దానాలూ వంచనలూ వరదలూ ఊచకోతలూ మళ్ళీ మరొకసారి కొత్త గజ్జెలు కట్టి కాల రంగస్థలం మీద నర్తిస్తాయి... అంతా బాగున్నట్టే ప్రవర్తిస్తాయి.
చౌరస్తాలలో యాచక బాలల చేతుల్లో హేపీ న్యూ ఇయర్ జెండాలు ఎప్పటిలాగే ఊగుతాయి. దలాల్ స్ట్రీట్‌లో క్షణాలలో లక్షలూ కోట్లూ ఎప్పటిలాగే చేతులు మారతాయి; మురికివాడలకీ, విలాస నివాసాలకీ ఆడీ కార్లకీ తుప్పుపట్టిన సైకిల్ చక్రాలకీ ఏ దేశంలోనయినా ఏ సంవత్సరంలో అయినా కేలెండర్లతో పంచాంగాలతో ఏమి పని... అనంత కాలవాక్యంలో పాతదయినా కొత్తదయినా సంవత్సరం ఒక సూక్ష్మ విరామ చిహ్నమే.
– దేవిప్రియ
Comments
Please login to add a commentAdd a comment