కవిత్వం అదృశ్యమైంది | Tribute To Great Poet Devi Priya In Sakshi Sahityam | Sakshi
Sakshi News home page

కవిత్వం అదృశ్యమైంది

Published Mon, Nov 23 2020 12:20 AM | Last Updated on Mon, Nov 23 2020 12:28 AM

Tribute To Great Poet Devi Priya In Sakshi Sahityam

దేవిప్రియ(15 ఆగస్టు 1949 – 21 నవంబర్‌ 2020)
కవిత్వం ధారాళంగా రావాలంటాడేమిటీ? అప్రయత్నంగా అసంకల్పితంగా రాకపోతే ప్రక్కన పడేస్తాడట కదా. ఏ రెండు కవితలూ ఒక్కలా రాయని కవి మళ్లీ ఎందుకొస్తాడు? ఈయన పరచిన కవిత్వమంతా ఈయన స్వప్నాలంట. నడుస్తున్నప్పుడు తన కలల మీద ఆలోచనల మీద నడుస్తున్నామని కనికరంతో గుర్తుంచుకోమంటున్నాడు. 

అమ్మచెట్టు, నీటిపుట్ట, గాలిరంగు, దేవిప్రియ ఏమిటీ మాటలు? ఇంతకుముందు లేవేం? పుట్టకముందు లేనిమాట నిజమే. పెట్టి పుట్టిన తర్వాత కూడా పుట్టనట్టుంటాయేం. ఎప్పటికప్పుడు ఆ క్షణానే పుట్టినట్టుంటాయేం. వెన్వెంటనే అదృశ్యమైపోతాయేం. కవిత్వమా అది? రుచి గల పదార్థం అంటే మళ్లీ నోట్లో పెట్టుకునే లోగా నాలుక మీద ఆ రుచి మిగలకపోవడమట కదా! కవిత్వం కూడా అంతేనా? అందుకేనా కవి అదృశ్యమయ్యాడు! మళ్లీ వస్తాడా? రాడు రాడు. సృజన రెండు సార్లు జరగదు. ఏ రెండు కవితలూ ఒక్కలా రాయని కవి మళ్లీ ఎందుకొస్తాడు? వెళ్లిపోయాడు.

నీటిపుట్టో గాలిరంగో తీస్తామా? అంత ప్రేమగా ఇచ్చినందుకు ఒక్కసారీ చదవలేదని బెంగ పడతాం. దుఃఖం కలుగుతుంది. చదువుతుంటే ఒక్కో కవిత ఒక్కో రంగులో ఉంటుంది. అన్నీ శుభ్రమైన దుస్తుల్లో ఉంటాయి. ఎంత పేదరాలైనా బిచ్చగాడైనా సరే కొత్త బట్టలు కట్టుకోవలసిందే. ముచ్చటపడో మూడ్‌లోకి వెళ్లో కవిత్వానుభవాన్ని వివరించుదామని ఫోన్‌ చేస్తే అది రెండో సారో మూడో సారో అని తేలుతుంది. అంతకుముందు ఏం పంచుకున్నామో తెలీదు. కొత్త అనుభూతి నెమ్మదిగా తడుముతుంది. మళ్లీ తడుపుతుంది. అది ఏటిని నిట్టనిలువునా నిలబెడుతుంది. ఏనుగుని తొండం మీద నడిపిస్తుంది. ఎవరూ చేయలేనిది ఇంకొకటి కూడా చేస్తుంది. గాలికి రంగులేస్తుంది.
కందం రాసినవాడే కవి కదా. అందంగా మధురస నిష్యందంగా పఠితృహృదయ సంస్పందంగా ఒక వంద రచించినందుకే మహాకవిని ఆకాశానికెత్తేశాం కదా, అంతకు శతాబ్దాల ముందు ధారాళమైన నీతులు నోరూరగ చవులుపుట్ట నుడివినందుకు శతకకారుణ్ణి బట్టీయం  పెడుతున్నాం కదా, మరి 

కరువొచ్చిన కాలంలో 
అరవై నిండాయి నాకు అతి తేలికగా
చొరబడి గడచిన యేళ్లలో ఇరవైగా మారగలన ఇన్షా అల్లాహ్‌ 

అని సరళంగా అలవోకగా రాసినందుకు కొన్ని అయినా మననం చెయ్యకపోతే ఎట్లా? కవిత్వం ధారాళంగా రావాలంటాడేమిటీ? అప్రయత్నంగా అసంకల్పితంగా రాకపోతే ప్రక్కన పడేస్తాడట కదా. కవిత్వాన్ని చెక్కిన దాఖలా ఒక్కటీ లేదంటలే ! It's not something that can be chiseled and sharpened later అంటాడా? సరే సరే! కవిత్వం బాసింపట్టు వేసుక్కూచుని ఒకటికి పదిసార్లు వెనుకా ముందూ  చూసుకుంటూ ఒక ప్రారంభం ఒక ముగింపూ పెట్టుకుని ఒక ప్రణాళిక ప్రకారం మన కవిత్వం రాస్తే దాన్ని పట్టుకుని పది మంది కవులు తయారవ్వాలనుకుంటున్నాం కానీ, ఇదేమిటీ, ఈయన పద్ధతి చూస్తే వంద మంది కవిత్వం రాయడం మానేసేటట్టున్నారే! ఎట్లబ్బా?

అవునూ, ఈయనది మన గుంటూరేగా, మరి డబ్ల్యూ.బి.ఈట్స్‌తో పోల్చుకుంటున్నాడు చూడండి. సదరు ఈట్స్‌ లాగా ఈయన పరచిన కవిత్వమంతా ఈయన స్వప్నాలంట. నడుస్తున్నప్పుడు తన కలల మీద ఆలోచనల మీద నడుస్తున్నామని కనికరంతో గుర్తుంచుకోమంటున్నాడు. ఈయనతో మహాకష్టం వచ్చిపడింది. మనం కవిత్వం మీద మన పాదముద్రలు బలంగా పడాలనుకుంటున్నాం కదా? కుదరదా?

తను కవి, రచయిత, జర్నలిస్టుల్లో ఎవరో తేల్చమని మనల్నే అడుగుతున్నాడు. తన రాజకీయం ఏమిటో గుర్తుతెచ్చుకోమంటున్నాడు. మన కాలపు మహా వాగ్గేయకారుణ్ణి ప్రజా యుద్ధనౌక  అన్నదెవరో, మాభూమి, రంగుల కల చిత్రాల వెనుక కలం బలం ఎవరిదో, ప్రాసక్రీడల రన్నింగ్‌ కామెంటేటర్‌ ఎవరో, అధ్యక్షా మన్నించమన్నదెవరో, మన పూర్ణమ్మను ఇంగ్లిషులోకి తీసుకెళ్లిందెవరో చూడమంటున్నాడు. తనను తాను పరిచయం చేసుకోలేననీ తన రచనలే తనను పరిచయం చెయ్యాలనీ అంటున్నాడు. అవన్నీ చూసి ఇంత వైవిధ్యం చూపిన కవి తెలుగులో ఇతను కాక ఇంకొక్కడే ఉన్నాడని చాలా మంది అంటున్నారు. ఆయనతో అనంతమైన ఆత్మచరిత్రాత్మ చరిత్రాత్మక నవలని ఈయనే రాయించాడంటున్నారు. మనమెందుకు కాదంటాం?

1987 లోనా? యానాంలో కవిమిత్రుడి పెళ్లి. కవిసమ్మేళనం. పథేర్‌ పాంచాలి చూసి, ప్రేమ్‌చంద్‌ గోదాన్‌ చదివిన దుఃఖంంలో రాసిన ‘ఊరు పొమ్మంటుంది’ కవితను చదివి వేదిక దిగివస్తుంటే పలకరించి ‘కరెంటు తీగల మీద వరుసగా కూర్చున్న పిట్టలు – బట్టలారేయడానికి తగిలించిన క్లిప్పుల్లా ఉన్నాయ’నే వ్యక్తీకరణ ‘అర్బన్‌ ఎక్స్‌ప్రెషన్‌ కదా! గ్రామీణ వాతావరణంలో ఎట్లా ఇముడుతుందీ?’ అని ప్రశ్నించినప్పటినుంచి కదా కవిత్వావరణలోకి తెలివితేటలు ప్రవేశించ కూడదనీ, అనుభవిస్తేనే కవిత్వాన్ని పలవరించాలనీ తెలుసుకున్నదీ, మసులుకున్నదీ!

ఇద్దరూ కలిసి ఒంటరిగా సాగిన సహచరి మరణం ఆమె లేని ప్రపంచం నిండా ఆమెనే నింపేసింది. కవి బాధ ప్రపంచానికి బాధ అయిన మరో సందర్భం అది. అది తెరలుగా పొరలుగా కమ్ముకుని ఒక పత్రికలో కవిత్వమై వచ్చింది. అది చదివి   జీట, yౌuట ఞ్ఛౌఝ జ్చిటఛీజీట్చpp్ఛ్చట్ఛఛీ అని కదా అన్నాను. వివరించమన్నప్పుడు కవి తన అనుభవాన్ని లేదా అనుభూతిని ఇతరులచేత అనుభవింప చెయ్యడానికి కవిత్వం రాస్తాడు. అందుకు భాష, వ్యక్తీకరణ మీడియంగా ఉపయోగపడతాయి. ఎంత బాగా తన స్థితిని మాటల ద్వారా బట్వాడా  చెయ్యగలడో ఉద్దేశ్యం అంత నెరవేరినట్టవుతుంది. అది నూటికి నూరు పాళ్లూ ్టట్చnటఝజ్టీ అయినప్పుడు ఆ కవిత అవసరం తీరిపోయి అదృశ్యమైపోతుంది’ అని వివరించి నపుడు ‘ఇది ఎక్కడైనా రాయకూడదా?’ అని కదా అన్నారు.  రాశానా? నిజానికి ఆమె వెళ్లిపోయినప్పుడే మనకు తెలియకుండా ఆయన కూడా వెళ్లిపోయాడు.ఇప్పుడు తెలిసి వెళ్లిపోయాడు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement