దాచేస్తే దాగని చరిత్ర- రన్నింగ్ కామెంటరీ...
తాజా పుస్తకం
రాష్ట్రానికి రాష్ట్రానికి/ పెట్టి కీచులాట
నవఢిల్లీ పాడుతోంది/ ఇపుడు జోలపాట!
ఎప్పుడో 1986లో దేవిప్రియ రాసిన రన్నింగ్ కామెంటరీ ఇది. కాని ఇవాళ్టి సందర్భంలో కూడా కట్ చేసి పేస్ట్ చేసుకునేలా ఉంది. దేవిప్రియ ఒక సరిహద్దు సిపాయి. ఎత్తయిన బురుజు మీద నిఘాకు నిలబడి శత్రువులు ఎవరు చొరబడుతున్నారా అని పహారా కాసే కలం సిపాయి. పాత్రికేయుడిగా దాదాపు ముప్పయ్ నలభై ఏళ్లుగా కొనసాగుతున్నా అందులోని రెండు దశాబ్దాల కాలాన్ని ఆయన రన్నింగ్ కామెంటరీకి వెచ్చించారు. వార్తలు జరిగింది జరిగనట్టు చెప్తాయి. కాని కవి జరిగినదాని వెనుక ఉన్న ఉద్దేశాలను వ్యాఖానిస్తాడు. జరగబోయే నష్టాన్ని దుశ్శకునంగా చూపుతాడు.
ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజీవ్ గాంధీ హత్యోదంతం వరకూ దాదాపు ఇరవై ఏళ్ల పాటు సమకాలీన జాతీయ, రాష్ట్రీయ పరిణామాలపై దేవిప్రియ అనునిత్యం పేల్చిన వ్యంగ్య తూటాలు, పదును బాణాలు ఇప్పుడిలా మూడు భాగాలుగా సంపుటీకరణ చెంది ‘దేవిప్రియ రన్నింగ్ కామెంటరీ’గా విడుదలయ్యాయి. నిజానికి ఇలాంటి ప్రక్రియ దినపత్రికల్లో మొదలుకావడం దేవిప్రియతోనే మొదలు. మొదటి పేజీలో రాజకీయ వ్యంగ్య కవిత్వం ప్రతి రోజూ రాయడం, మెప్పించడం, అందుకంటూ పాఠకులు ఏర్పడటం, ఈ శీర్షిక ఘనవిజయం సాధించడం వల్ల దాదాపు చాలా పత్రికలు దీనిని అనుకరించడం గర్వంతో చెప్పుకోదగ్గ పని. నాటి ఆంధ్రప్రభ, ఉదయం, ఆంధ్రజ్యోతిల్లో తాను వివిధ హోదాల్లో పని చేస్తున్నా రన్నింగ్ కామెంటరీని వదలకుండా గురి తప్పని వేటగాడిలా రాజకీయ పక్షాల వెంటపడి తన పదాలతో చీల్చి చెండాడాడు దేవిప్రియ. ఆయన పదం పేదవాడి పక్షం. పాలకుడు ఆయన ప్రత్యర్థి.
గుండెలెందుకు బాదుకోడం/ పాలధర పెరిగిందని
పేదప్రాణం రేటు మినహా / దేని ధర తరిగిందని?
ఇది దేవిప్రియ ఆత్మ.
ఎవరికెవరు తీసిపోని/ రాజకీయ పీతలు
ప్రజల ఉసురు పోసుకునే/ నీతిలేని నేతలు.
ఇది దేవిప్రియ ఆక్రోశం. ఈ ఆత్మ, ఆక్రోశం కలగలవడం వల్లే సామాన్యులు ఈ రన్నింగ్ కామెంటరీని తమ సొంతం చేసుకున్నారు. తాము అనాల్సిన మాటలనే కవి అంటున్నందుకు పొంగిపోయారు. ఇలాంటి గౌరవం దక్కినప్పుడే కవి ప్రజల నాల్కల మీద సజీవుడవుతాడు. దేవిప్రియ తన రన్నింగ్ కామెంటరీతో అలా సజీవుడైనాడు. తన అపారమైన రాజకీయ పరిజ్ఞానం వల్ల, అనల్పమైన శబ్ద సంపద వల్ల దేవిప్రియ ఈ వ్యంగ్య కవిత్వాన్ని రక్తి కట్టించగలిగారు. సులభమైన పదాలతోనే కావలసిన స్పందనను సాధించుకోవడంలో సఫలీకృతుడయ్యాడు. ఇది కచ్చితంగా వేమన బాణీ. శ్రీశ్రీ, ఆరుద్రలు కూడా పదాలతో చాలా క్రీడా విన్యాసాలు చేశారుగాని దేవిప్రియ నిబద్ధత, రన్నింగ్ కామెంటరీ వెనుక ఉన్న ఆయన సదుద్దేశం, ఆశించిన ప్రతిఫలం ఆయనను విడిగా, సగౌరవంగా నిలబెట్టి తీరుతాయి. కవిగా ఆయన ఎంత సాధించినా రన్నింగ్ కామెంటరీ సాధించిన పాప్యులారిటీ వేరు. అందుకే ఎండ్లూరి సుధాకర్ చెప్పినట్టు-
ఛందోలయ బృందాలయ/ అందాలయ దేవిప్రియ
చేతులెత్తి చప్పట్లతో/ చెప్పాలయ జయజయ.
దేవిప్రియ రన్నింగ్ కామెంటరీ- మూడు భాగాలు- మూడు కలిపి రూ.999; కావ్య పబ్లిషింగ్ హౌస్ ప్రచురణ; ప్రతులకు: విశాలాంధ్ర