గురూ.... కొత్త కాంబినేషన్ షురూ | Star Directors New Combination With Star Heros in Tollywood | Sakshi
Sakshi News home page

గురూ.... కొత్త కాంబినేషన్ షురూ

Published Fri, Feb 21 2025 3:01 AM | Last Updated on Fri, Feb 21 2025 6:52 AM

Star Directors New Combination With Star Heros in Tollywood

జానర్‌ మాత్రమే కాదు... ఒక్కోసారి కాంబినేషన్స్‌ కూడా ఆడియన్స్‌ను థియేటర్స్‌కు రప్పిస్తాయి. అలాంటి క్రేజీ కాంబినేషన్‌ మూవీస్‌కు ప్రస్తుతం సన్నాహాలు జరుగుతున్నాయి. కొందరు తెలుగు స్టార్‌ హీరోలు ఇప్పటివరకు తమతో సినిమాలు చేయని దర్శకులతో సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ ఇండస్ట్రీలో చర్చ జరుగుతున్న కొన్ని కొత్త కాంబినేషన్స్‌ కథా కమామీషుపై ఓ లుక్‌ వేయండి.

ప్రభాస్‌తో లోకేశ్‌ 
‘రాజా సాబ్, ఫౌజి’ సినిమాలతో బిజీగా ఉన్నారు ప్రభాస్‌. ఈ రెండు సినిమాల చిత్రీకరణలు తుది దశకు చేరుకుంటున్నాయి. దీంతో త్వరలోనే సందీప్‌ రెడ్డి వంగా డైరెక్షన్‌లోని ‘స్పిరిట్‌’ మూవీ చిత్రీకరణలో పాల్గొంటారు ప్రభాస్‌. ‘స్పిరిట్‌’ సినిమా ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. అయితే తనతో ‘సలార్‌’ వంటి మాస్‌ సినిమాను నిర్మించిన హోంబలే ఫిలింస్‌తో ప్రభాస్‌ మూడు సినిమాలు కమిటయ్యారు. ఈ మూడు సినిమాలు వరుసగా 2026, 2027, 2028లలో విడుదల కానున్నాయి.

కాగా వీటిలో ఓ చిత్రాన్ని తమిళ దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ డైరెక్ట్‌ చేయనున్నారనే టాక్‌ వినిపిస్తోంది. అయితే లోకేశ్‌  కార్తీతో ‘ఖైదీ 2’ చేయాల్సి ఉంది. మరోవైపు ప్రభాస్‌ కమిట్‌మెంట్స్‌ కూడా ఉన్నాయి. కాబట్టి ప్రభాస్‌–లోకేశ్‌ కనగరాజ్‌ కాంబినేషన్‌లోని మూవీ చిత్రీకరణ కాస్త ఆలస్యంగా ప్రారంభం అయ్యే చాన్సెస్‌ ఉన్నాయి.

అలాగే ‘హనుమాన్‌’ తో భారీ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ సాధించిన ప్రశాంత్‌ వర్మతో ప్రభాస్‌ ఓ మూవీ చేయనున్నారు. ప్రస్తుతం ‘జై హనుమాన్‌’తో బిజీగా ఉన్నారు ప్రశాంత్‌ వర్మ. ఈ సినిమా పూర్తయిన తర్వాత ప్రభాస్‌తో ప్రశాంత్‌ వర్మ సినిమా చేసే అవకాశం ఉందని ఫిల్మ్‌నగర్‌ సమాచారం.

గ్రీన్‌ సిగ్నల్‌
తమిళంలో రజనీకాంత్‌తో ‘జైలర్‌’ సినిమా తీసి సూపర్‌హిట్‌ అందుకున్నారు దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌కుమార్‌. ప్రస్తుతం రజనీకాంత్‌తోనే ‘జైలర్‌ 2’ సినిమా చేసే పనుల్లో నిమగ్నమయ్యారు నెల్సన్‌. అయితే ‘జైలర్‌’కు, ‘జైలర్‌ 2’కు మధ్య తనకు లభించిన గ్యాప్‌లో ఓ కథ రాసుకున్నారట నెల్సన్‌. ఈ కథను ఎన్టీఆర్‌కు వినిపించగా, ఎన్టీఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని సమాచారం.

అయితే ఇటీవలే హిందీలో ‘వార్‌ 2’ (ఈ చిత్రంలో హృతిక్‌ రోషన్‌ మరో హీరో) సినిమాను పూర్తి చేసిన ఎన్టీఆర్, ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్‌తో తాను కమిటైన ‘డ్రాగన్‌’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌) మూవీ సినిమా కోసం కావాల్సిన మేకోవర్‌ పనుల్లో బిజీగా ఉన్నారు. వచ్చే నెలలో ‘డ్రాగన్‌’ మూవీ రెగ్యులర్‌ షూటింగ్‌లో జాయిన్‌ అవుతారు ఎన్టీఆర్‌.

ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేసిన తర్వాత నెల్సన్‌ సినిమాను ఎన్టీఆర్‌ సెట్స్‌కు తీసుకువెళతారని ఊహించవచ్చు. అలాగే ‘హాయ్‌ నాన్న’ వంటి ఫీల్‌గుడ్‌ మూవీ తీసిన శౌర్యువ్‌ కూడా ఎన్టీఆర్‌కుప్రాథమికంగా ఓ లైన్‌ చెప్పారని, స్టోరీ కుదిరితే శౌర్యువ్‌తోనూ ఎన్టీఆర్‌ మూవీ చేస్తారనే వార్త  ప్రచారంలోకి వచ్చింది.

అర్జున్‌తో అట్లీ
‘పుష్ప: ది రూల్‌’ సినిమా సక్సెస్‌తో మంచి జోష్‌లో ఉన్నారు అల్లు అర్జున్‌. ఈ సక్సెస్‌ను ఎంజాయ్‌ చేసేందుకు ప్రస్తుతం స్పెయిన్‌లో ఉన్నారు అల్లు అర్జున్‌. కాగా ‘పుష్ప’ సినిమా నిర్మాణం సమయంలోనే దర్శకుడు త్రివిక్రమ్, దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగాలతో అల్లు అర్జున్‌ సినిమాలు చేయనున్నట్లుగా అధికారిక ప్రకటనలు వెల్లడయ్యాయి. అయితే ప్రభాస్‌ ‘స్పిరిట్‌’ మూవీతో సందీప్‌ రెడ్డి వంగా బిజీగా ఉండటంతో అల్లు అర్జున్‌ తన నెక్ట్స్‌ మూవీని త్రివిక్రమ్‌తో చేస్తారనే టాక్‌ వినిపించింది.

కానీ త్రివిక్రమ్‌తో అల్లు అర్జున్‌ చేయాల్సిన సినిమాకు మైథలాజికల్‌ బ్యాక్‌డ్రాప్‌ ఉంటుందట, చాలా గ్రాఫిక్స్‌ వర్క్‌ అవసరం అవుతుందట. ఇలా ఈ సినిమా ప్రీప్రోడక్షన్‌ వర్క్స్‌ ఇంకా సమయం పడుతుందట. దీంతో తన నెక్ట్స్‌ మూవీ కోసం తమిళ టాప్‌ డైరెక్టర్‌ అట్లీతో చర్చలు జరిపారట అల్లు అర్జున్‌. అట్లీ డైరెక్షన్‌లోనే అల్లు అర్జున్‌ నెక్ట్స్‌ మూవీ సెట్స్‌పైకి వెళ్లనుందని టాక్‌. ఈ చిత్రంలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తారని, సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించనుందని భోగట్టా. అల్లు అర్జున్‌ ‘పుష్ప 2’ సినిమా రూ. 1871 కోట్ల వసూళ్లు రాబట్టింది.

మరోవైపు దర్శకుడిగా షారుక్‌ ఖాన్‌తో రూ. 1000 కోట్ల ‘జవాను’ను తీశారు అట్లీ. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్‌–అట్లీ కాంబినేషన్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. అల్లు అర్జున్‌ స్పెయిన్‌ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఈ మూవీ పై మరింత సమాచారం బయటకు రానుందని తెలిసింది. అలాగే ప్రముఖ హిందీ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీని ఇటీవల ముంబైలో కలిశారు అల్లు అర్జున్‌. వీరి మధ్య ఓ సినిమాకు సంబంధించిన చర్చలు జరిగాయి. సో... భన్సాలీతో కూడా అల్లు అర్జున్‌ సినిమా చేసే చాన్స్‌ ఉందని ఊహించవచ్చు.

మాస్‌ ప్లస్‌ క్లాస్‌ 
ఎక్కువగా మాస్, వీలైనప్పుడు క్లాస్‌ మూవీస్‌ చేస్తుంటారు రవితేజ. అయితే రీసెంట్‌ టైమ్స్‌లో రవితేజ మాస్‌ సినిమాలే ఆడియన్స్‌ ముందుకు వచ్చాయి. ప్రస్తుతం రవితేజ చేస్తున్న ‘మాస్‌ జాతర’ మాస్‌ అప్పీల్‌ ఉన్న సినిమాయే. దీంతో ఓ క్లాస్‌ మూవీ చేయాలని రవితేజ అనుకుంటున్నారట. ఇందులో భాగంగానే కిశోర్‌ తిరుమల రెడీ చేసిన ఓ ఫీల్‌ గుడ్‌ ఎంటర్‌టైనర్‌ మూవీకి రవితేజ పచ్చజెండా ఊపారని, త్వరలోనే ఈ వీరి కాంబినేషన్‌లోని మూవీపై స్పష్టత రానుందని ఫిల్మ్‌నగర్‌ సమాచారం.

ఓకే చెప్పిన నానీ
శివ కార్తికేయన్‌తో తమిళంలో ‘డాన్‌’ (2022) వంటి క్యాంపస్‌ డ్రామా ఫిల్మ్‌ తీసి హిట్‌ సాధించారు తమిళ యంగ్‌ డైరెక్టర్‌ సిబీ చక్రవర్తి. అప్పట్నుంచి సిబీ చక్రవర్తితో ఓ మూవీ చేయాలని నానీ అనుకుంటున్నారట. ఆ సమయం ఇప్పడు వచ్చిందని, నానీ–సిబీ చక్రవర్తి కాంబినేషన్‌లోని మూవీకి సన్నాహాలు జరుగుతున్నాయని, మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ఈ సినిమాను నిర్మించనుందనే టాక్‌ ఫిల్మ్‌నగర్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ప్రస్తుతం నానీ ‘హిట్‌ 3’ మూవీతో బిజీగా ఉన్నారు.

మే 1న ఈ చిత్రం రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ మూవీ తర్వాత తనకు ‘దసరా’ వంటి హిట్‌ ఇచ్చిన శ్రీకాంత్‌ ఓదెలతో నానీ ‘ప్యారడైజ్‌’ అనే మూవీ చేస్తారు. అయితే ‘ప్యారడైజ్‌’ చిత్రానికి సమాంతరంగా సిబీ సినిమాను కూడా నానీ చేస్తారా? లేక ‘ప్యారడైజ్‌’ చిత్రాన్ని పూర్తి చేశాక సిబీ చక్రవర్తి సినిమాను స్టార్ట్‌ చేస్తారా? అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.

అలాగే దర్శకుడు శేఖర్‌ కమ్ముల చెప్పిన ఓ కథ నానీని ఇంప్రెస్‌ చేసిందని, నానీ ప్రస్తుత కమిట్‌మెంట్స్‌ కంప్లీట్‌ అయిన తర్వాత శేఖర్‌ కమ్ములతో చేసే మూవీపై ఓ స్పష్టత వస్తుందని సమాచారం. ఈ నెల 24న నానీ బర్త్‌ డే. ఈ సందర్భంగా ఈ హీరో తదుపరి చిత్రాలపై అధికారిక అప్‌డేట్స్‌ ఏమైనా వస్తాయా? అనేది చూడాలి.

కిల్‌ డైరెక్టర్‌తో..!
హిందీలో ‘కిల్‌’ వంటి మాస్‌ యాక్షన్‌ ఫిల్మ్‌ తీసి, ఒక్కసారిగా టాక్‌ ఆఫ్‌ ది బాలీవుడ్‌ అయ్యారు దర్శకుడు నిఖిల్‌ నగేశ్‌ భట్‌. ఈ దర్శకుడు ఇప్పుడు ఓ క్రేజీ తెలుగు హీరోతో భారీ బడ్జెట్‌ మూవీ తీయాలని ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల హైదరాబాద్‌లో విజయ్‌ దేవరకొండను కలిశారు నిఖిల్‌ నగేశ్‌. వీరి మధ్య ఓ కొత్త సినిమా గురించిన చర్చలు జరిగాయి. ప్రస్తుతం ‘కింగ్‌డమ్‌’ మూవీ చేస్తున్నారు విజయ్‌ దేవరకొండ.

మే 30న ఈ మూవీ రిలీజ్‌ కానుంది. ఈ మూవీ తర్వాత దర్శకుడు రాహుల్‌ సంకృత్యాన్‌తో రాయలసీమ నేపథ్యంలో ఓ పీరియాడికల్‌ యాక్షన్‌ ఫిల్మ్, రవికిరణ్‌ కోలాతో ఓ విలేజ్‌ యాక్షన్‌ డ్రామా ఫిల్మ్‌ కమిటయ్యారు విజయ్‌ దేవరకొండ. ఈ సినిమాలు పూర్తయ్యాక విజయ్‌ దేవరకొండ–నిఖిల్‌ నగేశ్‌ల కాంబినేషన్‌లోని మూవీపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement