ఇప్పుడు తెలుగు సినిమా తెలుగు సినిమా కాదు. మరి ఏంటీ అంటే.. ‘పాన్ ఇండియా సినిమా’ అయిపోయింది. ‘బాహుబలి’తో తెలుగు సినిమా రేంజ్ పెరిగిపోయింది. ఆ తర్వాత పాన్ ఇండియా సినిమాలు ఎక్కువయ్యాయి. ఇతర భాషల దర్శకుల చూపు కూడా మన హీరోలపై పడింది. తమిళం, కన్నడ, హిందీ భాషల దర్శకులు తెలుగు హీరోలతో పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. వణక్కమ్, నమస్కార, నమస్కార్ అంటూ మన హీరోలకు వాళ్ల భాషల్లో ‘నమస్కారం’ చెబుతున్నారు. ఇక ఆ డైరెక్టర్ల గురించి తెలుసుకుందాం.
‘బాహుబలి’తో పాన్ ఇండియా స్టార్ అయ్యారు ప్రభాస్. ఆ సినిమా తర్వాత ప్రభాస్ ఏ సినిమా చేసినా అది పాన్ ఇండియా రేంజ్ కావడం విశేషం. హిందీ దర్శకులు ప్రభాస్‌తో సినిమా చేయడానికి ఆసక్తి చూపగా దర్శకుడు ఓం రౌత్‌కి ముందుగా అవకాశం ఇచ్చారు. ప్రభాస్ హీరోగా ఓం రౌత్ తెరకెక్కించిన ‘ఆదిపురుష్’ వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుంది. అలాగే హిందీ చిత్రం ‘వార్’ ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలోనూ ప్రభాస్ ఓ సినిమా చేయనున్నారనే టాక్ ఉంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం కన్నడ దర్శకుడు, ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్‌తో ప్రభాస్ ‘సలార్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇక ఇటీవల విడుదలైన ‘ఆర్‌ఆర్‌ఆర్’తో పర భాషల్లో కూడా స్టార్‌డమ్‌ను పెంచుకున్న ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో సినిమా చేయడానికి ‘ఆర్‌ఆర్‌ఆర్’ విడుదల కాకముందే ఇతర ఇండస్ట్రీ దర్శకులు ఆసక్తి చూపారు. ఆల్రెడీ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమా కన్ఫార్మ్ అయింది. దర్శకుడు కొరటాల శివతో చేయనున్న సినిమాను పూర్తి చేశాక ప్రశాంత్ నీల్ కథలోకి వెళ్తారు ఎన్టీఆర్. సేమ్ ఎన్టీఆర్‌లానే రామ్‌చరణ్ కూడా ‘ఆర్‌ఆర్‌ఆర్’ రిలీజ్ కాక ముందే తమిళ దర్శకుడు శంకర్‌తో ఓ సినిమా కమిటయ్యారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ప్రశాంత్ నీల్‌తో కూడా రామ్‌చరణ్ కథా చర్చలు జరిపినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అలాగే ఓ ప్రముఖ ముంబై నిర్మాణ సంస్థ రామ్‌చరణ్‌తో సినిమా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలిసింది.
ఇటు నాగచైతన్య, రామ్ తమిళ దర్శకులతో సినిమాలు చేస్తున్నారు. ఈ మధ్య కోలీవుడ్‌లో ‘మానాడు’తో హిట్ సాధించిన దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించనున్న ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రంలో నాగచైతన్య హీరోగా నటిస్తారు. ఇక ‘పందెంకోడి’తో హిట్ దర్శకుడిగా తెలుగు ప్రేక్షకుల్లో పేరు సంపాదించిన లింగుసామి ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో ఓ ద్విభాషా సినిమా చేస్తున్నారు. ‘ది వారియర్’ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో రామ్ హీరో. ఈ చిత్రం జూలై 14న రిలీజ్ కానుంది. ఇంకా దర్శకుడు శ్రీ కార్తీక్‌తో హీరో శర్వానంద్ చేసిన ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం ‘ఒకే ఒక జీవితం’ రిలీజ్‌కు రెడీగా ఉంది. తమిళ దర్శకుడు రంజిత్ జయకొడి దర్శకత్వంలో సందీప్ కిషన్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘మైఖేల్’ చేస్తున్నారు. మరికొందరు పరభాషా దర్శకులు తెలుగు హీరోల డేట్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. సో.. మరికొన్ని కాంబినేషన్స్ సెట్ కావొచ్చు.
కుదిరితే...
వార్తల్లో ఉన్న ప్రకారం మరికొందరు తెలుగు హీరోలు కూడా వేరే భాషల దర్శక-నిర్మాతలతో సినిమాలు చేసే అవకాశం ఉంది. అన్నీ కుదిరితే ఆ చిత్రాలు కూడా పట్టాలెక్కుతాయి. నటుడు, దర్శకుడు సముద్ర ఖని తెరకెక్కించనున్న సినిమాలో పవన్ కల్యాణ్, సాయిధరమ్‌తేజ్‌లు నటిస్తారని, హీరో గోపీచంద్, తమిళ దర్శకుడు హరి కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనుందనే టాక్ వినిపిస్తోంది. ఇక ‘తగ్గేదే లే’ అంటూ.. ‘పుష్ప: ది రైజ్’ సినిమాతో బాలీవుడ్ మార్కెట్‌లోనూ సత్తా చాటిన అల్లు అర్జున్ ఇటీవల హిందీ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీని కలిశారు. బాలీవుడ్‌లో బన్నీ చేయనున్న స్ట్రయిట్ సినిమా కోసమే ఈ మీటింగ్ అనే టాక్ వినిపిస్తోంది. అలాగే యంగ్ హీరోలు అఖిల్, విజయ్ దేవరకొండతో బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ సినిమాలు చేయడానికి రంగం సిద్ధం చేశారట.
కీలక పాత్రల్లో...
తెలుగు హీరోలను కీలక పాత్రలకు కూడా తీసుకుంటున్నారు బాలీవుడ్ దర్శకులు. రణ్‌బీర్ కపూర్ హీరోగా దర్శకుడు అయాన్ ముఖర్జీ తీసిన ‘బ్రహ్మాస్త్ర’ చిత్రంలో నాగార్జున ఓ లీడ్ రోల్ చేశారు. సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందనున్న ఓ చిత్రంలో వెంకటేశ్ ఓ లీడ్ రోల్ చేయనున్నారు. ఈ సినిమాకు ఫర్హాద్ సామ్జీ దర్శకుడు అని టాక్. అద్వైత్ చందన్ దర్శకత్వంలో ఆమిర్ ఖాన్ నటించిన ‘లాల్‌సింగ్ చద్దా’లో నాగచైతన్య ఓ కీలక పాత్ర చేశారు. అలాగే అభిషేక్ శర్మ దర్శకత్వంలో అక్షయ్‌కుమార్ హీరోగా నటించిన ‘రామసేతు’లో సత్యదేవ్ ఓ ముఖ్య పాత్ర చేశారు.
Comments
Please login to add a commentAdd a comment