వైట్ అమెరికన్ కోడలికి తెలుగు అత్తగారు వారానికో తెలుగు కథను విన్పించాలి. ఇంగ్లిష్‌లో. ఫోన్‌లో. అది నియమం. ఇటీవల ఒక తాజా కవితను అత్తగారు విన్పించారు. అమెరికా అమ్మాయి తట్టుకోలేక ఏడ్చింది. ఏమిటా పుస్తకం? ‘పూర్ణమ్మ: ద గోల్డెన్ డాల్’. అనువాదకులు దేవీప్రియ. ‘ఇంగ్లిష్ భాషలోని ప్రపంచసాహితీ నిధికి దేవీప్రియ చేర్చిన క్లాసికల్ ఆభరణం ఈ పుస్తకం’ అన్నారు భాషాశాస్త్రవేత్త చేకూరి రామారావు. మహాకవి గురజాడ వారసత్వాన్ని కొనసాగిస్తోన్న ఆధునిక వచన కవుల్లో దేవీప్రియ మాత్రమే ‘ముత్యాల స్వరా’న్ని అందుకున్నారు. ఏభయ్యేళ్లుగా పాళీ అరుగుతోంది. కాని, పదును తగ్గలేదు.
ఆయనతో ఒక సంభాషణ!
మీ బాల్యం చెప్పండి.
పల్నాడులోని ఓబులేశుని పల్లెలో జన్మించాను. తాడికొండలో పెరిగాను. మా నాన్నగారి పాత పోలీసు డ్రస్‌ను రీసైజ్ చేయించుకుని బడికి వెళ్లిన పేదరికం నాది. అయితే మా ఊరి కొండపై గుడి, ధ్వజస్థంభపు గంటలు గాలికి కదులాడి ధైర్యాన్ని ప్రసరించేవి. అమరావతి- తాడికొండ మధ్య ఆ రోజుల్లో గుర్రపుబండ్లు ప్రధాన రవాణా సాధనాలు. గుర్రాల సౌందర్యం, వాటి కదలికల హొయలు మెస్మరైజ్ చేసేవి. గాలిగోపురం దగ్గర గ్రంధాలయంలో మంచి పుస్తకం చదివినప్పుడల్లా ‘గుర్రపు నడక’ ధ్వనించేది. కవిత్వంలో కూడా ఇప్పటికీ అదే నడక. ‘కోస్తా/సీడెడ్/నైజాం: గరిక అదే/అరక అదే/చెమట అదే/కూలి అదే/అయినా నష్టమేమిటి తెలుగు వాడా/అనుభవిద్దాం విడిగ కూడా’ అని కవిత తన్నుకొస్తుంది.
కరుణశ్రీ శిష్యులనుకుంటాను....
గుంటూరు ఎ.ీసి.కాలేజీలో స్పెషల్ తెలుగులో చేరాను. అక్కడ నా అధ్యాపకులు కరుణశ్రీగారు. సిలబస్‌లో లేని అనేక సాహిత్య విషయాలను చెప్పేవారు. క్లాస్ ముగించే ముందు బోర్డుపై ఆశువుగా ఒకరోజు ‘ఆటవెలది’ మరో రోజు ‘ఉత్పలమాల’ లేదా ‘కందం’ రాసేవారు. మరుసటి రోజు ఆ నమూనాలో స్వంతంగా ఛందోపద్యంతో క్లాసుకు రావాలనేవారు. అలా నేను పద్యాలను రాసేవాణ్ణి. ఎ.సి.కాలేజీ వరండాలో కరుణశ్రీని అనుసరిస్తూ నడవడం ఒక ‘క్లాసిక్’ ఎక్స్‌పీరియన్స్. ఆ ‘నడక’గాని, కవిత్వంలో ‘నడక’గాని నాకు జర్నలిజంలో ఉపయోగపడ్డాయి. ఒక వార్త, ఒక చిత్రం చెప్పలేని భావాన్ని ‘రన్నింగ్ కామెంటరీ’లో చూపాను. రంగుల కల సినిమా కోసం నేను రాసిన ‘జమ్‌జమ్మల్ మర్రి వెయ్యికాళ్ల జర్రీ’ ప్రేక్షకుల నాల్కలపై జీవించిన పాట!
శ్రీశ్రీ చేత ‘అనంతం’ రాయించినట్టున్నారు....
సాంప్రదాయ- సామాజిక ఆధిపత్యం గల వర్గాలు కవిత్వాన్ని, జర్నలిజాన్ని నిర్దేశిస్తోన్న రోజుల్లో నాలాంటి వాడు పైకి రావాలంటే ఆ కష్టం చెప్తే తెలిసేది కాదు. కష్టపడి పని చేయడం, కొత్తగా పని చేయడం వల్లే అది సాధ్యం అవుతుంది. ‘ప్రజాతంత్ర’లో శ్రీశ్రీ చేత ఆయన ఆత్మచరిత ‘అనంతం’ రాయించాను. అది ఒక సంచలనం. ఆ సీరియల్ రాయించుకోవడానికి శ్రీశ్రీ మాటల్లోనే చెప్పాలంటే నేను ‘పీత కష్టాలు’ పడ్డాను!
మీ కవిత్వం సులువుగా లోతుగా ఉంటుంది.
నా కవిత్వం ప్రధానంగా సామాజికం. వసుధైక కుటుంబ స్వాప్పికుణ్ణి నేను. అందుకే కుటుంబ సంబంధాలను తరచూ పలవరిస్తాను.
‘ఎప్పటిలా అమ్మ అమ్మలాగే ఉంది/ఈ కొడుకే కొడుకు లాగ లేడు’
రెక్కలొచ్చిన పిల్లలు ఎవరి దారి వారు వెతుక్కున్న తరువాత
కొత్తగా అడిగిందామె : ‘ఇప్పుడెలా బతుకుతాం?’
ఎప్పటిలాగే. ఇలాగే. సరేనా!
మీ కవిత్వానికి ప్రేరణ....
పిట్టకూడా ఎగిరిపోవాల్సిందే- కవిత్వం గాలిరంగు- చేపచిలుక- అమ్మచెట్టు - నీటిపుట్ట- తుఫాను తుమ్మెద ఇవీ నా కవితా సంకలనాలు. నాకు కవిత్వాన్ని నిర్వచించడంలో పట్టువిడుపులు లేవు. కవిత్వంలో కవిత్వం కానిదేదీ ఉండకూడదు అనుకుంటాను. సామాన్యప్రజల జీవితాలను మెరుగుపరచడం అనే ఆశయం నా కవితా వస్తువు. కవికి ప్రేరణలు పరిపరివిధాలు. మా పెరట్లో పూసిన మందారపువ్వు కూడా ఒకోసారి నా కవితలకు ప్రేరణగా నిలుస్తుంది.
- పున్నా కృష్ణమూర్తి
పెరట్లో మందారం కూడా కవిత్వానికి ప్రేరణే
Published Mon, Sep 16 2013 12:02 AM | Last Updated on Fri, Sep 1 2017 10:45 PM
Advertisement
Advertisement