అభ్యుదయ రచయిత్రికి అరుదైన పురస్కారం | Katyayani vidmahe selected for sahitya academy award | Sakshi
Sakshi News home page

అభ్యుదయ రచయిత్రికి అరుదైన పురస్కారం

Published Thu, Dec 19 2013 9:50 AM | Last Updated on Sat, Sep 2 2017 1:45 AM

ప్రొఫెసర్ కాత్యాయనీ విద్మహే

ప్రొఫెసర్ కాత్యాయనీ విద్మహే

 =‘సాహిత్య ఆకాశంలో సగం’ రచనకు దక్కిన గౌరవం
 =జిల్లా నుంచి కేంద్ర పురస్కారానికి ఎంపికైన వారిలో విద్మహే రెండోవారు
 = అంపశయ్య నవీన్ మొదటివారు
 =అనేక పుస్తకాలపై  సాహిత్య విమర్శలు రాసిన కాత్యాయనీ.. పలు అవార్డులు ఆమె సొంతం
 =ప్రసుత్తం కాకతీయ యూనివర్సిటీ తెలుగు విభాగంలో ప్రొఫెసర్‌గా విధులు

 
కేయూ క్యాంపస్, న్యూస్‌లైన్ : స్త్రీవాద సాహిత్య విమర్శకురాలు, కాకతీయ యూనివర్సిటీ తెలుగు విభాగం ప్రొఫెసర్ కేతవరపు కాత్యాయనీ విద్మహేకి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఆమె రాసిన ‘సాహిత్య ఆకాశంలో సగం’ అనే కథా కవిత్వం విమర్శనా గ్రంథానికి గాను ఆమె ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డుకు ఎంపికయ్యారు. రచయిత్రులు రాసిన కథాకవిత్వంపై ఆమె స్త్రీవాద మార్క్కిస్టు దృక్పథంతో విమర్శచేస్తూ వ్యాసాలు రాశారు. కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారం పొందిన వారిలో వరంగల్ జిల్లా నుంచి కాత్యాయనీ రెండోవారు.

2004లో జిల్లాకు చెందిన అంపశయ్యనవీన్ ఈ పురస్కారం అందుకున్నారు. ప్రస్తుతం కాత్యాయనీ విద్మహే ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక రాష్ర్ట కార్యదర్శిగా, మానవహక్కుల వేదిక సభ్యురాలుగా కొనసాగుతున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 20న ఢిల్లీలో ఈ పురస్కారం అందుకోనున్నారు. దేశంలోని వివిధ భాషాల సాహిత్యానికి చేసిన కృషికిగాను ఈపురస్కారాలు ఇస్తారు. తెలుగుభాషలో సాహిత్యం కింద కాత్యాయనీకి ఈ పురస్కారం లభించింది. పురస్కారం కింద రూ.లక్ష నగదు, సత్కారం అందుకోనున్నారు.  
 
12 ఏళ్లనుంచే సాహిత్యంపై ఆసక్తి

 కాత్యాయనీ 1955 సంవత్సరంలో నవంబర్ 3న ప్రకాశం జిల్లా అద్దంకి మండలం మైలవరం గ్రామంలో కేతవరపు ఇందిరాదేవి, రామకోటిశాస్త్రి దంపతులకు జన్మించారు. ఆమె తండ్రి దివంగత ప్రొఫెసర్ రామకోటిశాస్త్రి ఉద్యోగరీత్యా కాకతీయ యూనివర్సిటీలోనే తెలుగు విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. కాత్యాయనీ పుట్టింది మైలవరంలోనైనా పెరిగింది.. విద్యాభ్యాసం అంతా వరంగల్‌లోనే. ఆమె గీసుకొండ మండలం మొగిలిచర్ల గ్రామానికి చెందిన డాక్టర్ వెంకటేశ్వర్లును వివాహం చేసుకుని ఇక్కడే స్థిరపడ్డారు. వెంకటేశ్వర్లు వైద్యుడిగా పనిచేసి ఇటీవల రిటైర్డ్ అయ్యారు. వారికి ఒక కూతురు ఉంది.

12 ఏళ్ల వయసు నుంచే సాహిత్యంపై ఆసక్తి కనబర్చారు. ప్రాథమిక విద్య వరంగల్‌లోని సుజాతరెడ్డి హైస్కూల్‌లో, ఇంటర్ పింగిళి కళాశాల, డిగ్రీ యూనివర్సిటీ ఆర్ట్స్‌అండ్ సైన్స్ కళాశాల, ఎంఏ తెలుగు కేయూలో చదువుకున్నారు. ‘చివరకు మిగిలేది మానసిక సామాజిక జీవన స్రవంతి నవలా మిమర్శ’ అనే అంశంపై పీహెచ్‌డీ చేసి డాక్టరేట్ పొందారు. ఇదే కాకతీయ యూనివర్సిటీలో 1977లో అధ్యాపకురాలుగా ప్రవేశించి 1998సంవత్సరంలో ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందారు. కాత్యాయనీ విద్మహే అన్న కలం పేరుతో 1977నుంచి పరిశోధనలు మొదలుపెట్టారు.

1982 నుంచి మహిళా జనజీవన దృక్పథంతో సాహిత్య విమర్శనా వ్యాసాలు రాశారు. అలంకార శాస్త్రం సాహిత్య విమర్శ నిరంతర చింతనా విషయాలు, మార్క్సిజం, స్త్రీవాద దృక్పథం, సామాజిక సిద్ధాంతాలు తదితర 285 వరకు వ్యాసాలు రాశారు. తన తండ్రి రామకోటిశాస్త్రి రాసిన సాహిత్య వాస్యాలను తనసంపాదకత్వంలో ఇప్పటివరకు 22వరకు పుస్తకాలను ప్రచురింపచేశారు.  

1992నుంచి ఇప్పటివరకు ప్రతి ఏడాది అక్టోబర్ 28న తనతండ్రి వర్థంతిరోజు తప్పనిసరిగా ఒక పుస్తకాన్ని విడుదల చేస్తారు. రామకోటిశాస్త్రి రాసిన వ్యాసాలను పుస్తకాలుగా తీసుకువస్తున్నారు. రామకోటిశాస్త్రికి మైథిలీ, శ్రీగౌరి, కాత్యాయనీ ముగ్గురు కుమార్తెలు. కాత్యాయనీ సాహిత్య వారసురాలుగా సాహితీవేత్తల మన్ననలు పొందుతున్నారు. ఈఏడాది అక్టోబర్ 28న కూడా తెలంగాణ సాహిత్య వ్యాసాల పుస్తకాన్ని కూడా ఆవిష్కరింపచేశారు. తెలంగాణ సాహిత్యానికి సంబంధించి కాళోజీ, అల్లం రాజయ్య, పాల్కంపెల్లి శాంతాదేవి రచనలపై ఎంఫిల్ స్థాయి పరిశోధనలు, తెలంగాణ పోరాట నాటకంపై పీహెచ్‌డీ స్థాయి పరిశోధనలు కూడా చేయించారు.
 
సాహిత్యం ఆకాశంలో సగం పుస్తకంలోలో 28 వ్యాసాలు

మార్క్సిస్టుదృక్పథంతో స్త్రీవాద సాహిత్యం విమర్శనాత్మకంగా పరిశీలించటం, చర్చకుపెట్టడం కాత్యాయనీ విద్మహే ప్రత్యేక త. ఈ వ్యాస సంకలనంలో స్త్రీల  కథ, కవిత్వానికి సంబంధించిన 28 వ్యాసాలున్నాయి. ఈ పుస్తకం 2010లో మొదటి ముద్రణ స్త్రీజనాభ్యుదయ సంస్థ ప్రచురించింది. స్త్రీ సాహిత్యంపై సమీక్షల కలయికగా ఈ సంపుటి వెలువరించారు. 28 వ్యాసాల్లో రాజకీయ ఆర్థిక పరిణామాల నేపథ్యంలో స్త్రీల సాహిత్య అధ్యయనం, జెండర్‌స్పృహ ఆధునిక సాహిత్యంలో ప్రతిఫలాలు, కవిత్వ అధ్యయనం అవసరం-పద్ధతి, మహిళలు సాహిత్యం స్వాతంత్య్రానికి పూర్వం స్త్రీల సాహిత్యం తదితర వ్యాసాలు ఆమె నిర్దేశించుకున్న చారిత్రిక బాధ్యతకు అనుగుణమైనవి.

1980 దశకంలో ఆరంభం నుంచి విప్లవ పోరాటాల ప్రభావంతో గళమెత్తిన స్త్రీల గురించి, సంప్రదాయాలను, కట్టుబాట్లను, మూఢవిశ్వాసాలను ప్రశ్నిస్తూ వారు చేసిన రచనల గురించి కాత్యాయనీ సమగ్రంగా విశ్లేషించారు. వివిధ రచయిత్రుల రచనలను పరిచయం చేస్తూ ఆమె విభిన్నధోరణులను చూపించగలిగారు. రాజ్యహింస తరుచూ లైంగిక హింసగా మారటానికి ‘కొండె పూడి నిర్మల భాద సప్తనది’ కవితను ఆమె సమీక్షించారు. జీవితాన్ని ప్రేమించటం నేర్పే మెహజబిన్ కవిత్వాన్ని పరిచయం చేశారు.
 
భవిష్యత్తుమీద నమ్మకాన్ని కల్పించి వెలుగుకోసం ఆకాంక్షించే భవాని దేవి సాహిత్యాన్ని ప్రశింసించారు. వాస్తవ జీవితంతోపాటు స్త్రీవాద తాత్విక భావాలను మార్క్సిస్టు దృక్పథంతో మేళవించిన విమల వంటిల్లు కవితపై సమగ్ర వాఖ్యానం కాత్యాయనీ రాశారు. అన్ని కులాల స్త్రీల మీద బరువైన పితృస్వామ్యం గురించిన అవగాహనకలిగిన జయ‘మట్టి పువ్వు’ అనే కవితను వెలుగులోకి తెచ్చారు. భిన్న సామాజిక సమస్యలతోపాటు స్త్రీల సమస్యలను విప్లవోద్యమాన్ని చైతన్యాన్ని మేళవించిన లక్ష్మీసుహాసిని కవిత్వాన్ని తన వ్యాసాలల్లో విశ్లేశించారు.

స్త్రీ-పురుష సంబంధాలను భిన్నకోణాల నుంచి చూపిన రంగనాయకమ్మ సాహిత్యంలోని ప్రయోజనాన్ని ఆవిష్కరించారు. పితృస్వామ్య మాయూజాలంలో చిక్కుకుని విలవిలలాడుతూ విముక్తి కోరుకున్న స్త్రీలకు శ్రామికవర్గ స్త్రీలు అసలు నేస్తాలు అని చెప్పే సత్యవతి ‘చీమ’కథ ప్రయోజనాన్ని తెలియ జెప్పారు. ఉత్తరాంధ్ర బడుగువర్గాల స్త్రీల జీవిత పోరాటాన్ని, మధ్యతరగతి స్త్రీల చైతన్యాన్ని చిత్రించిన ద్వివేదుల విశాలక్ష్మి కథలు ఇందులో సమీక్షించారు. స్త్రీలను బహుకోణాలను పరిశీలించి జలందర చేసిన జీవిత వాఖ్యానాలను కూడా సాహిత్యకారుల ముందుంచారు.

విప్లవోద్యమం ప్రతిబింబించే తాయమ్మ కరుణ మిడ్కో వంటి రచయిత్రుల రచనలను పరిచయం చేశారు. అలా కాత్యాయనీ విద్మహే ఒక విమర్శనాత్మక పరిశీలకురాలుగా బహుముఖ ప్రజ్జను కనపరిచారు. కాగా ఈ పుస్తకాన్ని తొలి మహిళా ఉద్యమ రచయిత్రి బండారు అచ్చమాంబ, తొలి అభ్యుదయ సాహిత్యోద్యమ రచయిత్రి వట్టికొండ విశాలక్ష్మి, విప్లవోద్యమ కార్యచరణలో భాగమైన రంగవల్లికి అంకితం చేశారు.   
 
వివిధ యూనివర్సిటీలకు రిసోర్స్‌పర్సన్‌గాను..

ఆంధ్ర, వెంకటేశ్వర, పద్మావతి మహిళా, నాగార్జున, పొట్టి శ్రీరాములు, ఉస్మానియా, యోగివేమన, ద్రావిడ, హంపీ, బెనరాస్‌హిందూ యూనివర్సిటీలకు రిసోర్స్‌పర్సన్‌గా కూడా సేవలను అందిస్తున్నారు. ఇప్పటివరకు 275 రీసెర్చ్‌పేపర్లు సమర్పించారు. 200 జాతీయస్థాయి సెమినార్‌లలో పత్రాలను సమర్పించారు. ఉమెన్స్ జర్నల్ కూడా ప్రారంభించారు. ఆవె ువద్ద 11మంది పరిశోధకులు పీహెచ్‌డీ డిగ్రీలు పొందారు. 17మంది ఆమె పర్యవేక్షణలో ఎంఫిల్ డిగ్రీలు సాధించారు. మరో ఆరుగురు ప్రస్తుతం పరిశోధన చేస్తున్నారు. కాకతీయ యూనివర్సిటీలో ఏడు రీసెర్చ్ ప్రాజెక్టులు చేపట్టారు. యూజీసీ, కేంద్ర సాహిత్య అకాడమీ పరిధిలో యూజీసీ మేజర్ రీసెర్చ్‌ప్రాజెక్టు ఉమెన్ లిటరేచర్ ఆన్‌తెలుగు 1900- 1950( 2009-2011) పూర్తిచేశారు. బెస్ట్ అకడమిక్‌పర్‌ఫార్మెన్స్‌గా నాలుగు అవార్డులు కూడా పొందారు.
 
 కాత్యాయనీ పొందిన అవార్డులు
 కాత్యాయనీ స్త్రీవాదం, స్త్రీల విషయంలో చేసిన సామాజిక, సాహిత్య విమర్శకు చేసిన కృషికిగాను పలు అవార్డులు పొందారు. వట్టికొండ విశాలాక్షి అవార్డు, ఏటుకూరు బలరామమూర్తి అవార్డు, పులికంటి కృష్ణారెడ్డి అవార్డు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ధర్మనిధి పురస్కారం, రంగవల్లి స్మారక విశిష్టమహిళా పురస్కారం, ఆంధ్రప్రభుత్వ సాంస్కృతికమండలి గురుజాడ స్మారక పురస్కారం, రంగవల్లిస్మారక విశిష్ట మహిళా పురస్కారం అందుకున్నారు.
 
 కాత్యాయనీ రచనలు...
 రాయప్రోలు వాఙ్మయ జీవిత సూచిక( 1980)
 పంచాయితీ రాజ్యరాజకీయ నవల,
 వాసిరెడ్డి సీతాదేవి రాబందులు-రామచిలకలు ఒక పరిశీలన 1981
 బుచ్చిబాబు వాఙ్మయ జీవిత సూచిక 1983
 కొడవటిగంటి కుటుంబరావు వాఙ్మయ జీవిత సూచిక 1986
 చివరకు మిగిలేది -మానసిక సామాజిక జీవన స్రవంతి నవలా విమర్శ 1987
 మహిళా జీవన సమస్యలు మూలాల అన్వేషణ 1994
 తెలుగు నవలాకథానికి విమర్శ పరిణామం 1995
 రావిశాస్త్రి శాస్త్రీయ దృక్పథం1996
 సంప్రదాయ సాహిత్యం స్త్రీవాద దృక్పథం 1998
 కన్యాశుల్కం సామాజిక సంబంధాలు 2005
 స్వాతంత్య్రనంతర భారతదేశం స్త్రీల స్థితిగతులు 2005
 ప్రాచీన భారత రాజకీయ ఆర్థిక, ప్రతిబింబించిన రచనలు మహిళా జీవితం 2005,
 ఆధునిక తెలుగుసాహిత్యం స్త్రీవాద భూమిక 2006
 జెండర్ సమానతదిశగా సమాజం సాహిత్యం 2007
 ప్రపంచీకరణ పరిణామాలు ప్రభావాలు మహిళల జీవితం 2007
 ప్రాచీణ సాహిత్యం మరోచూపు 2008
 సాహిత్య ఆకాశంలో సగం-స్త్రీల అస్థిత్వ సాహిత్యం కవిత్వం కథ 2010
 స్త్రీవాదం 2012
 తెలంగాణ సాహిత్యం- ప్రాంతీయత 2013

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement