నేషనల్ ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్, స్వర్ణ జయంతి గ్రామ్ స్వరోజ్‌గార్ యోజన, సంపూర్ణ గ్రామీణ రోజ్‌గార్ యోజన, రూరల్ హౌసింగ్ కోసం ఇందిరా ఆవాస్ యోజన, ప్రధాన మంత్రి గ్రామోదయ యోజన, రూరల్ ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్, ప్రైమ్ మినిస్టర్స్ రోజ్‌గార్ యోజన, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన... ప్రభుత్వం ఇన్ని పథకాలను అమలు చేస్తోంది. ఇవన్నీ దేశంలో పేదరికాన్ని నిర్మూలించడం కోసం రూపొందించినవే.
దశాబ్దాలుగా పథకాలు అమలవుతున్నప్పటికీ దేశంలో పేదరికం అలాగే ఉంది. పేదరికం మాత్రమే కాదు ఆకలి తీవ్రమవుతోంది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2024 ప్రకారం ప్రపంచంలోని 127 దేశాల జాబితాలో మనదేశానిది 105వ స్థానం. ఏడు పదులు దాటిన స్వతంత్ర భారతంలో ప్రభుత్వాలు అనుసరించిన పాలన పద్ధతులతో పేదరికం తగ్గలేదు సరి కదా ఆకలి పెరుగుతోందని గ్లోబల్ హంగర్ ఇండెక్స్ తెలియచేస్తోందని చెప్పారు కాకతీయ యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ తోట జ్యోతి రాణి. ఇంటర్నేషనల్ పావర్టీ ఇరాడికేషన్ డే సందర్భంగా పేదరికం మనదేశంలో మహిళల మీద ఎంతటి ప్రభావాన్ని చూపిస్తోందో పరిశీలిద్దాం.
ఫోను... లూనా... ప్రమాణాలు కాదు!
మనదేశం అభివృద్ధి చెందలేదా అంటే ఏ మాత్రం సందేహం లేకుండా అభివృద్ధి చెందిందనే చెప్పాలి. కరెంట్ వాడకం, గ్యాస్ వినియోగం పెరిగాయి. ఉల్లిపాయలు, కూరగాయలమ్మే వాళ్లు కూడా టూ వీలర్, మినీ ట్రక్కుల మీద వచ్చి అమ్ముకుంటున్నారు. జనాభాలో ఎక్కువ మంది మొబైల్ ఫోన్ వాడుతున్నారు. వీటిని చూసి పేదరికం తగ్గిపోయిందనే అభిప్రాయానికి రావడం ముమ్మాటికీ తప్పే. అవి లేకపోతే ఆ మేరకు పనులు చేసుకోవడం కూడా సాధ్యం కాని రోజులు వచ్చేశాయి. కాబట్టి ఇప్పుడు వీటిని సంపన్నతకు ప్రతిరూపాలుగా చూడరాదు. నిత్యావసర సౌకర్యాలనే చెప్పాలి. ఈ ఖర్చులిలా ఉంటే కడుపు నింపుకోవడానికి మంచి ఆహారం కోసం తగినంత డబ్బు ఖర్చుచేయలేని స్థితిలో ఉంది అల్పాదాయవర్గం. సమాజం పేదరికాన్ని ఆర్థిక కోణంలోనే చూస్తుంది. నిజానికది సామాజిక కోణంలో చూడాల్సిన అంశం.
భారం మహిళల మీదనే!అల్పాదాయ కుటుంబంలోని మహిళ పేదరికానికి తన జీవితకాలమంతటినీ మూల్యంగా చెల్లించుకుంటుంది. పేదరికం భారం ప్రధానంగా మహిళ మీదనే పడుతుంది. పొయ్యి మీదకు, పొయ్యి కిందకు సమకూర్చుకోవడంలో నలిగిపోయేది ఆడవాళ్లే. ఒకప్పుడు అడవికి పోయి కట్టెలు తెచ్చుకునే వాళ్లు. గ్రామీణ మహిళకు కూడా ఇప్పుడా అవకాశం లేదు. తప్పని సరిగా గ్యాస్ సిలిండర్, కిరోసిన్, బొగ్గులు ఏదో ఒకటి కొనాల్సిందే. ఇంట్లో అందరికీ సరిపోయేటట్లు వండాలి. ఉన్న డబ్బులో అందరికీ పెట్టగలిగిన వాటినే వండుతుంది. ఆ వండిన పదార్థాలను ఇంట్లో అందరికీ పెట్టిన తర్వాత మిగిలింది తాను తినాలి.
ఆ తినగలగడం కూడా అందరూ తినగా మిగిలితేనే. అందరికీ పెట్టి పస్తులుండే మహిళలు ఇంకా దేశంలో ఉన్నారు. బీహార్‌లో అత్యంత పేదరికంలో మగ్గుతున్న ముసాహర్ సామాజిక వర్గంలో మహిళలు రొట్టెలు చేసి తాము సగం రొట్టెతో ఆకలి తీర్చుకుంటారు. వాళ్లు ఒక రొట్టె అంతటినీ తినగలగడం అంటే ఆ రోజు వాళ్లకు పండగతో సమానం. ఇంటి నాలుగ్గోడల మధ్య ఏం వండారో, ఏం తిన్నారో బయటకు తెలియదు. కానీ జాతీయ సర్వేలు ఈ విషయాలను బయటపెడుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో క్రానిక్ ఎనర్జీ డెఫిషియెన్సీతో బాధ పడుతున్న మహిళలు నూటికి ఎనభై మంది ఉన్నారు. పట్టణాల్లో ఆ సంఖ్య యాభై ఏడుగా ఉంది. పేదరికం విలయతాండవం చేస్తోందని చెప్పడానికి ఇంతకంటే రుజువులు ఇంకే కావాలి. అభివృద్ధి గమనం సరైన దిశలో సాగకపోవడమే ఇందుకు కారణం. అభివృద్ధి క్రమం తప్పడం వల్లనే పేదరిక నిర్మూలన అసాధ్యమవుతోంది.
ఆలోచన అరవై ఏళ్ల కిందటే వచ్చింది!మనదేశంలో పాలకులకు పేదరికం గురించిన ఆలోచన 1960 దశకంలోనే వచ్చింది. నేషనల్ సాంపుల్ సర్వే 1960–61 ఆధారంగా వి.ఎమ్. దండేకర్, ఎన్. రాత్‌ల నివేదిక దేశంలో పేదరికం తీవ్రతను తెలియచేసింది. ఉద్యోగ కల్పన ద్వారా పేదరికాన్ని నిర్మూలించాలనే ఆలోచనతో ప్రణాళికలు రూపొందాయి. కానీ అవి అమలులో అనుకున్న ఫలితాలనివ్వలేదు, పూర్తిగా వక్రీకరణ చెందాయి. దాంతో ప్రభుత్వాలు తాత్కాలిక ఉపశమన చర్యల వైపు చూశాయి. ఆ చర్యల్లో భాగమే పైన చెప్పుకున్న పథకాలు. ఇన్ని దశాబ్దాలుగా ఈ పథకాలు అమలులో ఉన్నప్పటికీ సమాజంలో వాటి అవసరం ఇంకా ఉందని హంగర్ ఇండెక్స్ చెబుతోంది.
ప్రణాళిక బద్ధమైన ఉద్యోగ కల్పన ఇప్పటికీ జరగలేదు, ఇంకా తాత్కాలిక ఉపశమనాలతోనే నెట్టుకు వస్తున్నాం. ఇదిలా ఉంటే పంచవర్ష ప్రణాళికలను కూడా నిలిపివేసింది ప్రభుత్వం. పేదరిక నిర్మూలన సాధనలో ఉపాధి హామీ అనేది చిరుదీపం వంటిదే. అదే సంపూర్ణ పరిష్కారం కాదు. సమ్మిళిత అభివృద్ధి జరగకపోవడంతో సమాజంలో అంతరాలు పెరుగుతున్నాయి. సంపన్నులు మరీ సంపన్నులవుతున్నారు. పేదవాళ్లు మరింత పేదరికంలోకి జారిపోతున్నారు. పేదరికం ప్రభావం మహిళలు, పిల్లల మీద తీవ్రంగా చూపిస్తుంది. విద్య, వైద్యం కార్పొరేటీకరణ చెందడంతో ఒక్క అనారోగ్యం వస్తే కష్టపడి సంపాదించుకున్న డబ్బు ఆవిరైపోతుంది. వైద్యాన్ని కూడా కొనసాగించలేకపోతున్నారు.
– ప్రొ‘‘ తోట జ్యోతిరాణి, రిటైర్డ్ ఫ్రొఫెసర్, ఎకనమిక్స్, కాకతీయ యూనివర్సిటీ
– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment