India rank
-
Thota Jyothi Rani: పేదరికం దేశాన్ని వదలని రుగ్మత
నేషనల్ ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్, స్వర్ణ జయంతి గ్రామ్ స్వరోజ్‌గార్ యోజన, సంపూర్ణ గ్రామీణ రోజ్‌గార్ యోజన, రూరల్ హౌసింగ్ కోసం ఇందిరా ఆవాస్ యోజన, ప్రధాన మంత్రి గ్రామోదయ యోజన, రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్, ప్రైమ్ మినిస్టర్స్ రోజ్‌గార్ యోజన, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన... ప్రభుత్వం ఇన్ని పథకాలను అమలు చేస్తోంది. ఇవన్నీ దేశంలో పేదరికాన్ని నిర్మూలించడం కోసం రూపొందించినవే. దశాబ్దాలుగా పథకాలు అమలవుతున్నప్పటికీ దేశంలో పేదరికం అలాగే ఉంది. పేదరికం మాత్రమే కాదు ఆకలి తీవ్రమవుతోంది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2024 ప్రకారం ప్రపంచంలోని 127 దేశాల జాబితాలో మనదేశానిది 105వ స్థానం. ఏడు పదులు దాటిన స్వతంత్ర భారతంలో ప్రభుత్వాలు అనుసరించిన పాలన పద్ధతులతో పేదరికం తగ్గలేదు సరి కదా ఆకలి పెరుగుతోందని గ్లోబల్ హంగర్ ఇండెక్స్ తెలియచేస్తోందని చెప్పారు కాకతీయ యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ తోట జ్యోతి రాణి. ఇంటర్నేషనల్ పావర్టీ ఇరాడికేషన్ డే సందర్భంగా పేదరికం మనదేశంలో మహిళల మీద ఎంతటి ప్రభావాన్ని చూపిస్తోందో పరిశీలిద్దాం. ఫోను... లూనా... ప్రమాణాలు కాదు!మనదేశం అభివృద్ధి చెందలేదా అంటే ఏ మాత్రం సందేహం లేకుండా అభివృద్ధి చెందిందనే చెప్పాలి. కరెంట్ వాడకం, గ్యాస్ వినియోగం పెరిగాయి. ఉల్లిపాయలు, కూరగాయలమ్మే వాళ్లు కూడా టూ వీలర్, మినీ ట్రక్కుల మీద వచ్చి అమ్ముకుంటున్నారు. జనాభాలో ఎక్కువ మంది మొబైల్ ఫోన్ వాడుతున్నారు. వీటిని చూసి పేదరికం తగ్గిపోయిందనే అభిప్రాయానికి రావడం ముమ్మాటికీ తప్పే. అవి లేకపోతే ఆ మేరకు పనులు చేసుకోవడం కూడా సాధ్యం కాని రోజులు వచ్చేశాయి. కాబట్టి ఇప్పుడు వీటిని సంపన్నతకు ప్రతిరూపాలుగా చూడరాదు. నిత్యావసర సౌకర్యాలనే చెప్పాలి. ఈ ఖర్చులిలా ఉంటే కడుపు నింపుకోవడానికి మంచి ఆహారం కోసం తగినంత డబ్బు ఖర్చుచేయలేని స్థితిలో ఉంది అల్పాదాయవర్గం. సమాజం పేదరికాన్ని ఆర్థిక కోణంలోనే చూస్తుంది. నిజానికది సామాజిక కోణంలో చూడాల్సిన అంశం. భారం మహిళల మీదనే!అల్పాదాయ కుటుంబంలోని మహిళ పేదరికానికి తన జీవితకాలమంతటినీ మూల్యంగా చెల్లించుకుంటుంది. పేదరికం భారం ప్రధానంగా మహిళ మీదనే పడుతుంది. పొయ్యి మీదకు, పొయ్యి కిందకు సమకూర్చుకోవడంలో నలిగిపోయేది ఆడవాళ్లే. ఒకప్పుడు అడవికి పోయి కట్టెలు తెచ్చుకునే వాళ్లు. గ్రామీణ మహిళకు కూడా ఇప్పుడా అవకాశం లేదు. తప్పని సరిగా గ్యాస్ సిలిండర్, కిరోసిన్, బొగ్గులు ఏదో ఒకటి కొనాల్సిందే. ఇంట్లో అందరికీ సరిపోయేటట్లు వండాలి. ఉన్న డబ్బులో అందరికీ పెట్టగలిగిన వాటినే వండుతుంది. ఆ వండిన పదార్థాలను ఇంట్లో అందరికీ పెట్టిన తర్వాత మిగిలింది తాను తినాలి. ఆ తినగలగడం కూడా అందరూ తినగా మిగిలితేనే. అందరికీ పెట్టి పస్తులుండే మహిళలు ఇంకా దేశంలో ఉన్నారు. బీహార్‌లో అత్యంత పేదరికంలో మగ్గుతున్న ముసాహర్ సామాజిక వర్గంలో మహిళలు రొట్టెలు చేసి తాము సగం రొట్టెతో ఆకలి తీర్చుకుంటారు. వాళ్లు ఒక రొట్టె అంతటినీ తినగలగడం అంటే ఆ రోజు వాళ్లకు పండగతో సమానం. ఇంటి నాలుగ్గోడల మధ్య ఏం వండారో, ఏం తిన్నారో బయటకు తెలియదు. కానీ జాతీయ సర్వేలు ఈ విషయాలను బయటపెడుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో క్రానిక్ ఎనర్జీ డెఫిషియెన్సీతో బాధ పడుతున్న మహిళలు నూటికి ఎనభై మంది ఉన్నారు. పట్టణాల్లో ఆ సంఖ్య యాభై ఏడుగా ఉంది. పేదరికం విలయతాండవం చేస్తోందని చెప్పడానికి ఇంతకంటే రుజువులు ఇంకే కావాలి. అభివృద్ధి గమనం సరైన దిశలో సాగకపోవడమే ఇందుకు కారణం. అభివృద్ధి క్రమం తప్పడం వల్లనే పేదరిక నిర్మూలన అసాధ్యమవుతోంది. ఆలోచన అరవై ఏళ్ల కిందటే వచ్చింది!మనదేశంలో పాలకులకు పేదరికం గురించిన ఆలోచన 1960 దశకంలోనే వచ్చింది. నేషనల్ సాంపుల్ సర్వే 1960–61 ఆధారంగా వి.ఎమ్. దండేకర్, ఎన్. రాత్ల నివేదిక దేశంలో పేదరికం తీవ్రతను తెలియచేసింది. ఉద్యోగ కల్పన ద్వారా పేదరికాన్ని నిర్మూలించాలనే ఆలోచనతో ప్రణాళికలు రూపొందాయి. కానీ అవి అమలులో అనుకున్న ఫలితాలనివ్వలేదు, పూర్తిగా వక్రీకరణ చెందాయి. దాంతో ప్రభుత్వాలు తాత్కాలిక ఉపశమన చర్యల వైపు చూశాయి. ఆ చర్యల్లో భాగమే పైన చెప్పుకున్న పథకాలు. ఇన్ని దశాబ్దాలుగా ఈ పథకాలు అమలులో ఉన్నప్పటికీ సమాజంలో వాటి అవసరం ఇంకా ఉందని హంగర్ ఇండెక్స్ చెబుతోంది. ప్రణాళిక బద్ధమైన ఉద్యోగ కల్పన ఇప్పటికీ జరగలేదు, ఇంకా తాత్కాలిక ఉపశమనాలతోనే నెట్టుకు వస్తున్నాం. ఇదిలా ఉంటే పంచవర్ష ప్రణాళికలను కూడా నిలిపివేసింది ప్రభుత్వం. పేదరిక నిర్మూలన సాధనలో ఉపాధి హామీ అనేది చిరుదీపం వంటిదే. అదే సంపూర్ణ పరిష్కారం కాదు. సమ్మిళిత అభివృద్ధి జరగకపోవడంతో సమాజంలో అంతరాలు పెరుగుతున్నాయి. సంపన్నులు మరీ సంపన్నులవుతున్నారు. పేదవాళ్లు మరింత పేదరికంలోకి జారిపోతున్నారు. పేదరికం ప్రభావం మహిళలు, పిల్లల మీద తీవ్రంగా చూపిస్తుంది. విద్య, వైద్యం కార్పొరేటీకరణ చెందడంతో ఒక్క అనారోగ్యం వస్తే కష్టపడి సంపాదించుకున్న డబ్బు ఆవిరైపోతుంది. వైద్యాన్ని కూడా కొనసాగించలేకపోతున్నారు. – ప్రొ‘‘ తోట జ్యోతిరాణి, రిటైర్డ్ ఫ్రొఫెసర్, ఎకనమిక్స్, కాకతీయ యూనివర్సిటీ– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ఆర్థిక స్వేచ్ఛ సూచీలో ఒక మెట్టు తగ్గిన భారత్
న్యూఢిల్లీ: ఆర్థిక స్వేచ్ఛ సూచీ (ఈఎఫ్ఐ)లో ఉన్న 165 దేశాలలో భారతదేశం 2021లో ఒక మెట్టు దిగజారి 87వ స్థానానికి చేరుకుంది. 2020లో దేశం ర్యాంక్ 86. ఎకనామిక్ ఫ్రీడమ్ ఆఫ్ ది వరల్డ్: 2021 వార్షిక నివేదికను న్యూఢిల్లీకి చెందిన ఆర్థిక విశ్లేషణా సంస్థ– సెంటర్ ఫర్ సివిల్ సొసైటీతో కలిసి కెనడా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఫ్రేజర్ ఇన్స్టిట్యూట్ విడుదల చేసింది. కాగా, 1980 నుంచి చూస్తే భారత్‌కు సంబంధించి సూచీ 4.90 నుంచి గణనీయంగా 6.62కు పెరిగింది. వివిధ విభాగాల్లో కొన్ని దేశాలతో పోల్చితే వెనకబడ్డం తాజాగా భారత్ ర్యాంక్ తగ్గుదలకు ఒక కారణం. కాగా, సింగపూర్ ఇండెక్స్‌లో సింగపూర్ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత హాంకాంగ్, స్విట్జర్లాండ్, న్యూజిలాండ్, అమెరికా, ఐర్లాండ్, డెన్మార్క్, ఆ్రస్టేలియా, బ్రిటన్, కెనడా ఉన్నాయి. చైనాకన్నా (111) భారత్ పరిస్థితి మెరుగ్గా ఉండడం గమనార్హం. జాబితాలో వెనుజులా చివరన నిలిచింది. ఇతర ముఖ్యమైన ర్యాంకింగ్స్‌లో జపాన్ (20), జర్మనీ (23), ఫ్రాన్స్ (47), రష్యా (104) ఉన్నాయి. అంతర్జాతీయ వాణిజ్యం, నియంత్రణలు, రుణం, కారి్మక రంగం, న్యాయ వ్యవస్థ, మోథో హక్కులు వంటి 10 అంశాల ప్రాతిపదికన సూచీ కదలికలు ఉంటాయి. -
ఇంధన పరివర్తన ఇండెక్స్‌లో భారత్ సత్తా.. మెరుగైన ర్యాంక్ సాధన
న్యూఢిల్లీ: ఇంధన పరివర్తన(ఎనర్జీ ట్రాన్సిషన్) ఇండెక్స్‌లో భారత్ 67వ ర్యాంకులో నిలిచినట్లు వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్(డబ్ల్యూఈఎఫ్) నివేదిక తాజాగా పేర్కొంది. గ్లోబల్ ర్యాంకింగ్స్ జాబితాలో స్వీడన్ తొలి స్థానాన్ని పొందగా.. డెన్మార్క్, నార్వే, ఫిన్లాండ్, స్విట్జర్లాండ్ టాప్–5లో చోటు సాధించాయి. 120 దేశాలతో కూడిన ఈ ఇండెక్స్‌లో అన్ని రకాలుగా ఎనర్జీ ట్రాన్సిషన్‌కు ఊపునిస్తున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ భారత్ మాత్రమేనని వెల్లడించింది. ఐటీ దిగ్గజం యాక్సెంచర్ సహకారంతో నివేదికను రూపొందించింది. ప్రపంచ ఇంధన సంక్షోభం, భౌగోళిక, రాజకీయ అనిశ్చితుల కారణంగా ఎనర్జీ ట్రాన్సిషన్ మందగించినప్పటికీ భారత్ చెప్పుకోదగ్గ చర్యలు చేపట్టినట్లు నివేదిక పేర్కొంది. నిరంతర ఆర్థికాభివృద్ధిని సాధిస్తున్న నేపథ్యంలోనూ భారత్ ఇంధన తీవ్రతను తగ్గించుకున్నట్లు తెలియజేసింది. అంతర్జాతీయ ఇంధనాలను పొందడం ద్వారా కర్బనాలకు సైతం చెక్ పెడుతున్నట్లు వెల్లడించింది. అందుబాటులో విద్యుత్ నిర్వహణను సమర్ధవంతంగా చేపడుతున్నట్లు ప్రశంసించింది. శుద్ధ ఇంధనాల వినియోగాన్ని పెంచడం, పునరుత్పాదక ఇంధనాలకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాలు ఇండెక్స్‌లో భారత్ మెరుగుపడేందుకు దోహదం చేసినట్లు వివరించింది. -
ర్యాంకులు పోనాయండీ!
ప్రపంచవ్యాప్తంగా ఇది ఆందోళనకర అంశం, తక్షణ దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన విషయం. ఐరాస లెక్క ప్రకారం వరుసగా రెండో ఏడాదీ పలు దేశాల ‘మానవాభివృద్ధి సూచిక’ (హెచ్‌డీఐ) స్కోరు కిందకు పడింది. మన దేశపు ర్యాంకు మునుపటితో పోలిస్తే రెండు స్థానాలు కిందకు పడింది. ఐరాస అభివృద్ధి సంస్థ (యూఎన్డీపీ) 2021–22 మానవాభివృద్ధి నివేదిక (హెచ్డీఆర్) ‘అనిశ్చిత పరిస్థితులు, అస్థిర జీవితాలు – మారుతున్న ప్రపంచంలో భవిష్యత్ రూప కల్పన’ ఈ చేదునిజాన్ని బయటపెట్టింది. తొంభై శాతానికి పైగా దేశాలు 2020లో కానీ, 2021లో కానీ హెచ్‌డీఐ స్కోరులో వెనకబడ్డాయి. నలభై శాతానికి పైగా దేశాలైతే ఆ రెండేళ్ళూ ర్యాంకుల్లో కిందికి వచ్చేశాయి. గత వారం విడుదలైన ఈ నివేదిక ప్రకారం మానవాభివృద్ధిలో మొత్తం 191 దేశాల్లో మన దేశం రెండు స్థానాలు కిందకొచ్చి, 132వ ర్యాంకుకు చేరింది. గడచిన 32 ఏళ్ళలో ఇలా వరుసగా రెండేళ్ళు సూచికలో దిగజారడం ఇదే తొలిసారి. మానవాభివృద్ధి పరామితుల ప్రకారం బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంకల కన్నా మనం వెనకబడే ఉన్నాం. దేశం సుభిక్షంగా ఉంది, స్థూల జాతీయోత్పత్తిలో బ్రిటన్ను దాటేశాం లాంటి కబుర్లతో కాలక్షేపం చేస్తున్న వారికి ఇది కనువిప్పు. హెచ్డీఐలో వివిధ దేశాల ర్యాంకులు పడిపోవడానికి కనివిని ఎరుగని సంక్షోభాలు కారణం. గత పదేళ్ళలో ఆర్థికపతనాలు, వాతావరణ సంక్షోభాలు, కరోనా, యుద్ధం లాంటి గడ్డు సమస్యల్ని ప్రపంచం ఎదుర్కొంది. ప్రతి సంక్షోభం ప్రపంచాభివృద్ధిపై ప్రభావం చూపింది. అయితే, అందులో కరోనాది అతి పెద్ద పాత్ర అని ఐరాస నివేదిక సారాంశం. ప్రపంచాన్ని వణికించిన ఈ మహమ్మారితో మానవ పురోగతి కనీసం అయిదేళ్ళు వెనక్కి వెళ్ళింది. అంతటా అనిశ్చితి ప్రబలింది. హెచ్‌డీఐకి లెక్కలోకి తీసుకుంటున్న అంశాల్లో లోపాలున్నాయని కొన్ని విమర్శలు లేకపోలేదు. అయితే, మరే సూచికా లేని వేళ ప్రతి దేశపు సగటు విజయాన్నీ లెక్కించడానికి ఉన్నంతలో ఇదే మెరుగైనదని ఒప్పుకోక తప్పదు. ఆర్థిక అసమానత్వం, లైంగిక అసమానత్వం, బహుముఖ దారిద్య్రం లాంటి ఆరు వేర్వేరు మానవాభివృద్ధి సూచీల ద్వారా ఈ ర్యాంకులు లెక్కకట్టారు. స్విట్జర్లాండ్ 0.962 స్కోరుతో ప్రథమ ర్యాంకు దక్కించుకుంది. భారత్ కేవలం 0.633 స్కోరుతో అగ్రశ్రేణికి సుదూరంగా నిలిచిపోయింది. విషాదమేమిటంటే, మానవాభివృద్ధిలో మన స్కోరు ప్రపంచ సగటు 0.732 కన్నా తక్కువ. పొరుగున ఉన్న చైనా హెచ్‌డీఐ స్కోర్ 1990 నుంచి ఏటా పెరుగుతుంటే, మన పరిస్థితి తద్భిన్నంగా ఉంది. మన దేశంలో ఆర్థిక అసమానతలూ ఎక్కువే. జనాభాలో అతి సంపన్నులైన 1 శాతం మంది ఆదాయ వాటా, నిరుపేదలైన 40 శాతం మంది వాటా కన్నా ఎక్కువని తాజా లెక్క. ఇంతటి అసమానత చైనా, స్విట్జర్లాండ్లలో లేదు. లింగపరంగా చూస్తే, మన దేశ తలసరి ఆదాయంలో పురుషుల కన్నా స్త్రీలు చాలా వెనుకబడి ఉన్నారు. విద్య, వైద్యం, జీవన ప్రమాణాల ప్రాతిపదికన లెక్కకట్టే బహుముఖ దారిద్య్రం లోనూ భారత్ పరిస్థితి గొప్పగా ఏమీ లేదు. 2019 నాటి యూఎన్డీపీ అంచనాల ప్రకారం... ప్రపంచంలో అత్యధిక జనాభా గల చైనాలో 5.4 కోట్ల మంది బహుముఖ దారిద్య్రంలో ఉంటే, రెండో అత్యధిక జనాభా ఉన్న భారత్‌లో ఆ సంఖ్య 38.1 కోట్ల పైచిలుకే. అయితే, 2019 – 2020 మధ్య మన దేశంలో లింగ అసమానత దారుణంగా పెరగగా, తాజా నివేదికలో ఆ కోణంలో కొద్దిగా మెరుగుదల సాధించడం ఉపశమనం. మొత్తానికి, అన్నీ కలిపి చూస్తే మానవాభివృద్ధిలో మన స్కోరునూ, దరిమిలా ఇతర దేశాల మధ్య మన ర్యాంకునూ కిందకు గుంజాయి. అయితే, సంతోషించదగ్గ అంశం ఏమంటే – కరోనాలో ఏడాది లోపలే భారత్ టీకాను అభివృద్ధి చేయడం, ధనిక దేశాలకు సైతం కరోనా నిరోధానికి సహకరించడం! ఇది మన మానవ సామర్థ్యమే! అదే సమయంలో కనీస ఆదాయ హామీకై దేశంలో జరుగుతున్న ప్రయత్నాలూ యూఎన్డీపీ ప్రశంసలు అందుకున్నాయి. అలాగే కరోనా అనంతరం ఆర్థికంగా మన దేశపు పనితీరు పొరుగు దేశాల కన్నా మెరుగ్గా ఉండడం ఆశాకిరణం. అభివృద్ధి అజెండా అమలుకు నిధులు వెచ్చించే వీలుంటుంది. అయినా, ఇప్పటికీ అనేక అంశాల్లో ఇతర దేశాలు మెరుగ్గా ఉన్నాయనేది నిష్ఠురసత్యం. పౌష్టికలోప జనాభా, బాలల మరణాల రేటు తదితర అంశాలతో లెక్కించే ‘ప్రపంచ ఆకలి సూచి’ (2020) ప్రకారం కూడా 107 దేశాల్లో మనది 94వ స్థానం. వీటికి తోడు ఇప్పుడు ఉక్రెయిన్‌లో యుద్ధం, ప్రపంచాన్ని పూర్తిగా వదిలిపోని కరోనా, భూతాపోన్నతి ముప్పేటదాడి చేస్తున్నాయి. అన్నీ కలసి ప్రపంచ ఆహార సంక్షోభానికి దారి తీయవచ్చని ఐరాస హెచ్చరిస్తోంది. నిలకడైన అభివృద్ధి, సామాజిక భద్రత, సత్వర సాంకేతిక ఆవిష్కరణలపై దృష్టి పెడితేనే అనిశ్చితి నుంచి బయటపడగలమంటోంది. ఐరాస మాట చద్దిమూట. పాలకులు దీన్ని పరిగణనలోకి తీసుకొని, పకడ్బందీగా మానవాభివృద్ధి ప్రణాళికలు రచించాలి. పర్యావరణ సంక్షోభ నివారణ లక్ష్యాలను చేరుకొనేందుకూ కృషి చేయాలి. ద్రవ్యోల్బణం, ధరలు పెరుగుతూ, ఉపాధి హామీ తగ్గుతున్న సమయంలో ఎన్నికల వ్యూహాలు కాస్త ఆపి, నిలకడగా చేతల్లోకి దిగాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంతరాలు తగ్గించుకొని, సమన్వయంతో సాగాలి. కానీ, పైచేయి కోసం ప్రయత్నాలతో ఢిల్లీ నుంచి గల్లీ దాకా సహకార స్ఫూర్తి కొరవడుతున్న వేళ ప్రగతి బాటలో కలసి సాగడానికి మన పాలకులు సిద్ధమేనా? -
Sakshi Cartoon: భారత్‌లో పత్రికా స్వేచ్ఛకు ప్రమాదం-వరల్డ్ ప్రెస్ ఫ్రీడం
భారత్‌లో పత్రికా స్వేచ్ఛకు ప్రమాదం-వరల్డ్ ప్రెస్ ఫ్రీడం -
వ్యాపారానికి భారత్ భేష్..
వాషింగ్టన్: వ్యాపారం సులభంగా నిర్వహించేందుకు వీలున్న దేశాల జాబితాలో భారత ర్యాంక్ మరింత మెరుగుపడింది. ప్రపంచ బ్యాంక్ తాజాగా ప్రకటించిన ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ర్యాంకుల్లో మన దేశం 63వ స్థానాన్ని సొంతం చేసుకుంది. గతేడాదిలో 77వ స్థానానికి చేరి సంచలనం సృష్టించిన భారత్.. ఈ సారి ఏకంగా మరో 14 మెట్లు పైకెక్కింది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నెమ్మదించిన నేపథ్యంలో ఆర్బీఐ, ఐఎంఎఫ్, పలు రేటింగ్ ఏజెన్సీలు దేశ వృద్ధి రేటులో కోతను విధించిన ప్రస్తుత తరుణంలో భారత ర్యాంక్ మరింత మెరుగుపడడం విశేషం కాగా.. వరుసగా మూడో సారి కూడా టాప్ 10 మెరుగైన దేశాల్లో స్థానం కొనసాగడం మరో విశేషంగా నిలిచింది. ఈ విధమైన రికార్డులను నెలకొల్పడం భారత్‌కే సాధ్యపడిందని వరల్డ్ బ్యాంక్ డైరెక్టర్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ సిమియన్ జంకోవ్ కొనియాడారు. వచ్చే రెండేళ్లలో టాప్ 50 వ్యాపార సులభతర దేశాల జాబితాలోకి చేరాలన్న భారత్ లక్ష్యానికి అనుకూలంగా ఇక్కడి వాతావరణం మారుతోందన్నారు. స్పైస్ సూపర్..: భారత్‌లో కంపెనీలను సునాయసంగా ప్రారంభించడం కోసం కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. స్పైస్ (సరళీకృత ఎలక్ట్రానిక్ నమోదు) పేరిట నూతన ఒరవడిని సృష్టించింది. ఇదే సమయంలో ఫైలింగ్ రుసుమును రద్దు చేయడం వంటి వ్యాపార సానుకూల నిర్ణయాలను తీసుకుంది. ఢిల్లీలో నిర్మాణ అనుమతులు పొందేందుకు సమయం, ఖర్చులను గణనీయంగా తగ్గించడం.. పరిపాలనా సంస్కరణలు వంటి కీలకాంశాలు భారత ర్యాంకును మరింత పైకి చేర్చాయని ప్రపంచ బ్యాంక్ ఈ సందర్భంగా వెల్లడించింది. జీఎస్టీ సరళీకరణతో మరింత మెరుగు.. వస్తు, సేవల పన్నును మరింత సరళతరం చేయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. తద్వారా నిర్దేశిత లక్ష్యమైన అగ్ర స్థాయి 50 దేశాల జాబితాలోకి చేరుకోవడానికి వీలుంటుందని వివరించారు. జీఎస్టీని సులభతరం చేయడం అనేది కొనసాగుతున్న ప్రక్రియ కాగా, ప్రస్తుతం రిటర్నుల ఆన్లైన్ ఫైలింగ్‌లో ఉన్నటువంటి అవాంతరాలను అధిగమించే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. -
సైబర్ సెక్యూరిటీలో మన ర్యాంకు..?
భారతదేశంలో సైబర్ సెక్యూరిటీలో అధ్వాన్న స్థితిలో నిలిచిందని సెబర్ సెక్యూరిటీ స్టడీ ప్రకటించింది. దేశంలోని 25 శాతం ఫోన్లు, 21శాతం కంప్యూటర్లు మాలావేర్ బారిన పడుతున్నాయని తాజా అధ్యయనం తేల్చింది. సైబర్ రక్షణ -సంబంధిత అప్డేటెడ్ చట్టాలు, మాలావేర్ ఎటాక్, సైబర్-దాడులకు సంసిద్ధత లాంటి అంశాలపై యూకేకు చెందిన టెక్నాలజీ పరిశోధనా సంస్థ కంపారిటెక్ 60దేశాల్లో ఈ సర్వే నిర్వహించింది. ఇందులో ఇండియా 46వ స్థానంలో నిలిచింది. ప్రపంచంలోని అత్యంత సైబర్-సురక్షిత దేశంగా జపాన్ నిలిచింది. కేవలం 1.34శాతం ఫోన్లు, 8 శాతం కంప్యూటర్లు మాత్రమే సెబర్ దాడులకు గురవుతున్నాయి సర్వే వెల్లడించింది. సైబర్ దాడులు నిరోధం, చట్టాలులాంటి అంశంలో తప్ప మిగిలిన అన్ని అంశాల్లో మెరుగా వుందని తెలిపింది. ఈ జాబితాలో ఫ్రాన్స్, కెనడా, డెన్మార్క్, అమెరికా తరువాతి స్థానాల్లో నిలిచాయి. పాకిస్థాన్, చైనా రెండూ సైబర్-సెక్యూరిటీలో అధ్వాన్నంగా ఉన్నప్పటికీ భారతదేశం మొత్తం స్కోరులో 39 శాతం సాధించిందని రిపోర్టు పేర్కొంది. సైబర్‌దాడులకు సంబంధించి ఈ జాబితాలో అల్జీరియా అట్టడుగున నిలిచింది. అలాగే సరైన చట్టాలు,రక్షణ చర్యలు లేని కారణంగా ఇండోనేషియా, వియత్నం, టాంజానియా, ఉజ్బెకిస్తాన్ ఎక్కువ దాడులకు గురవుతున్నాయని నివేదించింది. -
మానవాభివృద్ధిలో భారత్ ర్యాంకు 130
న్యూఢిల్లీ: మానవాభివృద్ధి సూచీలో భారత్ ఒక స్థానం మెరుగుపరచుకుని 130వ ర్యాంకు సాధించింది. ఐరాస అభివృద్ధి కార్యక్రమం(యూఎన్డీపీ) శుక్రవారం విడుదల చేసిన జాబితాలో 189 దేశాలకు ర్యాంకులు ప్రకటించింది. తాజా ర్యాంకింగ్‌లో పొరుగు దేశాలు బంగ్లాదేశ్, పాకిస్తాన్ వరసగా 136, 150వ స్థానాల్లో నిలిచాయి. నార్వే, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, ఐర్లాడ్, జర్మనీ వరసగా తొలి ఐదు స్థానాలు దక్కించుకున్నాయి. 189 దేశాల్లో 59 దేశాలు అధిక మానవాభివృద్ధి గ్రూప్‌లో, 38 దేశాలు అల్ప మానవాభివృద్ధి గ్రూప్‌లో ఉన్నాయి. 0.640 హెచ్‌డీఐ స్కోర్‌తో భారత్ మాధ్యమిక మానవాభివృద్ధి కేటగిరీలో చోటు దక్కించుకుంది. -
ఇండియా పాస్‌పోర్ట్ పవర్ ర్యాంక్ ఇదే
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టు కలిగిన దేశాల్లో భారతదేశం 76వ స్థానంలో నిలిచింది. హెన్లే అండ్ పార్ట్నర్స్ పాస్‌పోర్ట్ ఇండెక్స్-2018 నివేదికలో ఈ విషయం వెల్లడైంది. పాస్‌పోర్టు మాత్రమే ఉండి, ముందుగా వీసా తీసుకోకుండా ఎన్ని దేశాలకు వెళ్లగలరనే అంశం ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. జపాన్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ దేశ పాస్‌పోర్ట్‌తో 189 దేశాలకు ముందుగా వీసా లేకుండా వెళ్లోచ్చు. సింగపూర్, జర్మనీ సంయుక్తంగా రెండవ స్థానంలో( 188 దేశాలకు వెళ్లోచ్చు) నిలిచాయి. డెన్మార్గ్, ఫిన్లాండ్, ప్రాన్స్, ఇటలీ, స్వీడన్, స్పెయిన్ దేశాలు మూడో స్థానంలో నిలిచాయి. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) అధ్యయన సమాచారం ఆధారంగా 199 దేశాల పాస్‌పోర్టులు పరిశీలించి ఈ ర్యాంకులను కేటాయించారు. -
సైబర్ భద్రతలో భారత్‌కు 23వ ర్యాంకు
ఐక్యరాజ్యసమితి: ప్రపంచవ్యాప్తంగా సైబర్ భద్రతలో మొత్తం 165 దేశాల్లో భారత్ 23వ స్థానంలో నిలిచినట్లు ఇంటర్నేషనల్ టెలీకమ్యూనికేషన్ యూనియన్(ఐటీయూ) తెలిపింది. రెండో ప్రపంచ సైబర్ భద్రతా సూచీ(జీసీఐ)లో సింగపూర్ తొలిస్థానంలో నిలిచినట్లు వెల్లడించింది. అమెరికా, మలేసియా, ఒమన్, ఇస్తోనియా, మారిషస్, ఆస్ట్రేలియాలు తర్వాతి స్థానాల్లో ఉన్నట్లు పేర్కొంది. ఈ జాబితాలోని 77 దేశాలు సైబర్ భద్రత కోసం ఇప్పటికే చర్యలు ప్రారంభించాయని ఐటీయూ తెలిపింది. గతేడాది పంపిన మొత్తం ఈ మెయిల్స్‌లో 1 శాతం సైబర్ దాడులకు ఉద్దేశించినవేనని ఐటీయూ సెక్రటరీ జనరల్ హౌలిన్ జహో తెలిపారు. -
‘పర్యావరణ’ సూచీలో భారత్‌కు 20వ ర్యాంకు
మరాకేస్(మొరాకో): పర్యావరణ మార్పుల పనితీరు సూచీ(సీసీపీఐ)లో భారత్ ఆరు స్థానాలు ఎగబాకి 20 ర్యాంకుకు చేరింది. 58 దేశాలకు ‘జర్మన్ వాచ్ అండ్ క్లైమేట్ యాక్షన్ నెటవర్క్ యూరప్’ విడుదల చేసిన 2016 సూచీ.. వర్ధమాన దేశాలు పారిశ్రామిక దేశాల విధానాలను అనుకరించకుండా సొంత పర్యావరణ హిత మార్గాలు పాటించాలని సూచించింది. ‘ఉద్గారాల విషయంలో భారత్ పనితీరు బాగుంది. పునరుత్పాదక ఇంధన వినియోగంలో స్కోరు మెరుగుపడింది. బొగ్గు నుంచిసాంప్రదాయేతర వనరుల్లోకి పెట్టుబడులు మళ్లించడం మంచి చేస్తుంది. ఉద్గారాలు తక్కువగా నమోదవుతున్న దేశాల్లో భారత్, బ్రెజిల్, చైనాల వృద్ధి రేటు క్రమంగా పుంజుకుంటోంది’ అని పేర్కొంది. -
అవినీతి దేశాల్లో 76వ స్థానంలో భారత్
బెర్లిన్: ప్రపంచ వ్యాప్త దేశాల్లో అవినీతిలో భారత్ 76వ స్థానంలో ఉంది. కాస్త అటుఇటుగా అన్ని దేశాల్లోనూ అవినీతి రాజ్యమేలుతోందని తాజా నివేదిక తేటతెల్లం చేస్తోంది. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ కరెప్షన్ పర్సెప్షన్ 2015లో అవినీతిపై తన నివేదికను బుధవారం విడుదల చేసింది. ఆయా దేశాల్లో అవినీతిని బట్టి స్కోర్‌ను ఇచ్చింది. అవినీతి లేకుంటే 100 స్కోరుగా, పూర్తిగా అవినీతి ఉంటే సున్నా స్కోర్‌గా పేర్కొన్నారు. అవినీతి రాజ్యాల నివేదికలో 38 పాయింట్లతో భారత్ 76 స్థానంలో నిలిచింది. గత సంవత్సరం ఈ నివేదికలో మన దేశం 85 స్థానంలో ఉంది. డెన్మార్క్ అతి తక్కువ అవినీతితో 91 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా 68 శాతం దేశాలు అవినీతితో రక్కసితో ఇబ్బందులు పడుతుండగా, అందులో జీ20 దేశాలు కూడా ఉన్నాయి. ఉత్తర కొరియా, సోమాలియా దేశాలు 8 పాయింట్లతో చివరి స్థానంలో నిలిచాయి. యూఎస్, ఆస్ట్రేలియాలు.. 76 పాయింట్లతో 16వ స్థానం, యూకే.. 81 పాయింట్లతో 10వ స్థానంలో ఉన్నాయి. కాగా 100కు 100 పాయింట్లు ఏ దేశానికీ రాకపోవడం గమనార్హం.