అవినీతి దేశాల్లో 76వ స్థానంలో భారత్
బెర్లిన్: ప్రపంచ వ్యాప్త దేశాల్లో అవినీతిలో భారత్ 76వ స్థానంలో ఉంది. కాస్త అటుఇటుగా అన్ని దేశాల్లోనూ అవినీతి రాజ్యమేలుతోందని తాజా నివేదిక తేటతెల్లం చేస్తోంది. ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్‌నేషనల్ కరెప్షన్ పర్సెప్షన్ 2015లో అవినీతిపై తన నివేదికను బుధవారం విడుదల చేసింది. ఆయా దేశాల్లో అవినీతిని బట్టి స్కోర్‌ను ఇచ్చింది. అవినీతి లేకుంటే 100 స్కోరుగా, పూర్తిగా అవినీతి ఉంటే సున్నా స్కోర్‌గా పేర్కొన్నారు. అవినీతి రాజ్యాల నివేదికలో 38 పాయింట్లతో భారత్ 76 స్థానంలో నిలిచింది.
గత సంవత్సరం ఈ నివేదికలో మన దేశం 85 స్థానంలో ఉంది. డెన్మార్క్ అతి తక్కువ అవినీతితో 91 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా 68 శాతం దేశాలు అవినీతితో రక్కసితో ఇబ్బందులు పడుతుండగా, అందులో జీ20 దేశాలు కూడా ఉన్నాయి. ఉత్తర కొరియా, సోమాలియా దేశాలు 8 పాయింట్లతో చివరి స్థానంలో నిలిచాయి. యూఎస్, ఆస్ట్రేలియాలు.. 76 పాయింట్లతో 16వ స్థానం, యూకే.. 81 పాయింట్లతో 10వ స్థానంలో ఉన్నాయి. కాగా 100కు 100 పాయింట్లు ఏ దేశానికీ రాకపోవడం గమనార్హం.