
వాషింగ్టన్: వ్యాపారం సులభంగా నిర్వహించేందుకు వీలున్న దేశాల జాబితాలో భారత ర్యాంక్ మరింత మెరుగుపడింది. ప్రపంచ బ్యాంక్ తాజాగా ప్రకటించిన ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ర్యాంకుల్లో మన దేశం 63వ స్థానాన్ని సొంతం చేసుకుంది. గతేడాదిలో 77వ స్థానానికి చేరి సంచలనం సృష్టించిన భారత్.. ఈ సారి ఏకంగా మరో 14 మెట్లు పైకెక్కింది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నెమ్మదించిన నేపథ్యంలో ఆర్‌బీఐ, ఐఎంఎఫ్, పలు రేటింగ్ ఏజెన్సీలు దేశ వృద్ధి రేటులో కోతను విధించిన ప్రస్తుత తరుణంలో భారత ర్యాంక్ మరింత మెరుగుపడడం విశేషం కాగా.. వరుసగా మూడో సారి కూడా టాప్ 10 మెరుగైన దేశాల్లో స్థానం కొనసాగడం మరో విశేషంగా నిలిచింది. ఈ విధమైన రికార్డులను నెలకొల్పడం భారత్‌కే సాధ్యపడిందని వరల్డ్ బ్యాంక్ డైరెక్టర్ ఆఫ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ సిమియన్ జంకోవ్ కొనియాడారు. వచ్చే రెండేళ్లలో టాప్ 50 వ్యాపార సులభతర దేశాల జాబితాలోకి చేరాలన్న భారత్ లక్ష్యానికి అనుకూలంగా ఇక్కడి వాతావరణం మారుతోందన్నారు.
స్పైస్ సూపర్..: భారత్‌లో కంపెనీలను సునాయసంగా ప్రారంభించడం కోసం కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. స్పైస్ (సరళీకృత ఎలక్ట్రానిక్ నమోదు) పేరిట నూతన ఒరవడిని సృష్టించింది. ఇదే సమయంలో ఫైలింగ్ రుసుమును రద్దు చేయడం వంటి వ్యాపార సానుకూల నిర్ణయాలను తీసుకుంది. ఢిల్లీలో నిర్మాణ అనుమతులు పొందేందుకు సమయం, ఖర్చులను గణనీయంగా తగ్గించడం.. పరిపాలనా సంస్కరణలు వంటి కీలకాంశాలు భారత ర్యాంకును మరింత పైకి చేర్చాయని ప్రపంచ బ్యాంక్ ఈ సందర్భంగా వెల్లడించింది.
జీఎస్‌టీ సరళీకరణతో మరింత మెరుగు..
వస్తు, సేవల పన్నును మరింత సరళతరం చేయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. తద్వారా నిర్దేశిత లక్ష్యమైన అగ్ర స్థాయి 50 దేశాల జాబితాలోకి చేరుకోవడానికి వీలుంటుందని వివరించారు. జీఎస్‌టీని సులభతరం చేయడం అనేది కొనసాగుతున్న ప్రక్రియ కాగా, ప్రస్తుతం రిటర్నుల ఆన్‌లైన్ ఫైలింగ్‌లో ఉన్నటువంటి అవాంతరాలను అధిగమించే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment