world bank survey
-
World Bank: మిగతా రాష్ట్రాల కంటే ఏపీ బెస్ట్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలను అనేక రాష్ట్రాలు అనుసరించడం చూశాం.. వాటికి పలు అధ్యయన సంస్థలు కితాబులివ్వడం విన్నాం... ఇప్పుడవి రాష్ట్రాలను, దేశాలను దాటి ప్రపంచబ్యాంకు వరకు చేరాయి. ముఖ్యంగా గతేడాది కోవిడ్ లాక్డౌన్ సమయంలో భారతదేశంలోని మిగిలిన రాష్ట్రాలకన్నా ఆంధ్రప్రదేశ్‌లోని ప్రజలు నిశ్చింతగా ఉండడాన్ని ప్రపంచబ్యాంకు గుర్తించింది. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు... నేరుగా అందుతున్న నగదు పేద ప్రజల జీవితాలకు ఎనలేని భరోసాగా మారాయని అది కితాబునిచ్చింది. దేశంలోనే అత్యధికంగా గత జూన్‌లో రాష్ట్రంలో ఒక్కో కుటుంబానికి సగటున రూ.2,866 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం నగదు అందించిందని ప్రపంచ బ్యాంకు సర్వేల్లో వెల్లడైంది. కోవిడ్–19, దీర్ఘకాలిక లాక్డౌన్ గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై చూపిన ప్రభావంపై రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రపంచ బ్యాంకు సర్వే నిర్వహించింది. మిగతా రాష్ట్రాలతో పోల్చితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా గ్రామీణ ప్రజలకు నేరుగా నగదు బదిలీ చేయడం వల్ల జీవనోపాధిపై ప్రతికూల ప్రభావం పడలేదని, ఉపాధికి కూడా ఎలాంటి కొరత లేదని సర్వేలో వెల్లడైంది. మే నెలలో గ్రామీణ ప్రాంతాల్లోని 75 శాతం కుటుంబాలకు నగదు బదిలీ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహాయం అందించిందని, ఇది ఇతర రాష్ట్రాల కన్నా అత్యధికమని సర్వే స్పష్టం చేసింది. గత జూన్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సగటున ఒక్కో కుటుంబానికి అత్యధికంగా రూ.2,866 చొప్పున ఆర్థిక సాయం అందించగా, ఉత్తరప్రదేశ్ రూ.1,071 చొప్పున సాయం చేసిందని ప్రపంచ బ్యాంకు తెలిపింది. లాక్డౌన్ సమయంతోపాటు సడలింపు సమయంలో కూడా పేదలకు ఆహార భద్రత కింద పెద్ద ఎత్తున బియ్యం పంపిణీ జరిగింది. ఉపాధిలో ముందంజ.. గత ఏడాది జూన్‌లోప్రభుత్వం అందచేసిన నగదు బదిలీ డబ్బును బ్యాంకులు, ఏటీఎంల నుంచి తీసుకోవడంలో ఎలాంటి సమస్యలు ఎదురు కాలేదని అత్యధిక శాతం మంది తెలిపారు. కేవలం 3 శాతం మంది మాత్రమే నగదు ఉప సంహరణ చేసుకోలేకపోయినట్లు ప్రపంచ బ్యాంకు సర్వేలో తేలింది. గత జూన్‌లో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యం పంపిణీతో పాటు వివిధ పథకాల కింద ఇచ్చిన నగదు బదిలీ డబ్బులతో ఆంధ్రప్రదేశ్‌లో సగటు కుటుంబం ఆదాయం వారానికి రూ.5,000 వరకు ఉండగా మిగతా రాష్ట్రాల్లో రూ.1,000 నుంచి రూ.1,500 వరకే ఉందని సర్వేలో వెల్లడైంది. ఉపాధి హామీ కింద కూలీలకు పెద్ద ఎత్తున పనులు కల్పించిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంది. రాష్ట్రంలో జూలైలో ఉపాధి హామీ కింద పనులు కల్పించినట్లు 84.5 శాతం మంది పేర్కొన్నారు. సెప్టెంబర్‌లో 65.6 శాతం మందికి పనులు కల్పించినట్లు సర్వేల్లో తేలింది. కోవిడ్ విషయంలో అవగాహనపై కూడా ప్రపంచ బ్యాంకు మూడు రౌండ్లు సర్వే నిర్వహించింది. మిగతా రాష్ట్రాలతో పోల్చితే ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ శాతం మందికి అవగాహన ఉన్నట్లు తేలింది. -
వృద్ధి 1.5 శాతమే
వాషింగ్టన్: కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత వృద్ధి రేటు గణనీయంగా మందగించనుంది. 2020–21లో ఇది 1.5–2.8 శాతం స్థాయిలో ఉండొచ్చని ప్రపంచ బ్యాంకు అంచనా వేస్తోంది. ఇదే నిజమైతే, 1991లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టాక గడిచిన మూడు దశాబ్దాల్లో వృద్ధి రేటు ఇంతగా పడిపోవడం ఇదే తొలిసారి కానుంది. దక్షిణాసియా ఆర్థిక స్థితిగతులపై రూపొందించిన నివేదికలో ప్రపంచ బ్యాంకు ఈ అంశాలు వెల్లడించింది. మార్చి 31తో ముగిసిన 2019–20 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 4.8–5 శాతం స్థాయిలో ఉండవచ్చని పేర్కొంది. కరోనా వైరస్ ప్రభావాలు తగ్గే కొద్దీ 2022 ఆర్థిక సంవత్సరంలో భారత్ మళ్లీ పుంజుకోగలదన్నది బ్యాంక్ అంచనా. -
వ్యాపారానికి భారత్ భేష్..
వాషింగ్టన్: వ్యాపారం సులభంగా నిర్వహించేందుకు వీలున్న దేశాల జాబితాలో భారత ర్యాంక్ మరింత మెరుగుపడింది. ప్రపంచ బ్యాంక్ తాజాగా ప్రకటించిన ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ర్యాంకుల్లో మన దేశం 63వ స్థానాన్ని సొంతం చేసుకుంది. గతేడాదిలో 77వ స్థానానికి చేరి సంచలనం సృష్టించిన భారత్.. ఈ సారి ఏకంగా మరో 14 మెట్లు పైకెక్కింది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నెమ్మదించిన నేపథ్యంలో ఆర్బీఐ, ఐఎంఎఫ్, పలు రేటింగ్ ఏజెన్సీలు దేశ వృద్ధి రేటులో కోతను విధించిన ప్రస్తుత తరుణంలో భారత ర్యాంక్ మరింత మెరుగుపడడం విశేషం కాగా.. వరుసగా మూడో సారి కూడా టాప్ 10 మెరుగైన దేశాల్లో స్థానం కొనసాగడం మరో విశేషంగా నిలిచింది. ఈ విధమైన రికార్డులను నెలకొల్పడం భారత్‌కే సాధ్యపడిందని వరల్డ్ బ్యాంక్ డైరెక్టర్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ సిమియన్ జంకోవ్ కొనియాడారు. వచ్చే రెండేళ్లలో టాప్ 50 వ్యాపార సులభతర దేశాల జాబితాలోకి చేరాలన్న భారత్ లక్ష్యానికి అనుకూలంగా ఇక్కడి వాతావరణం మారుతోందన్నారు. స్పైస్ సూపర్..: భారత్‌లో కంపెనీలను సునాయసంగా ప్రారంభించడం కోసం కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. స్పైస్ (సరళీకృత ఎలక్ట్రానిక్ నమోదు) పేరిట నూతన ఒరవడిని సృష్టించింది. ఇదే సమయంలో ఫైలింగ్ రుసుమును రద్దు చేయడం వంటి వ్యాపార సానుకూల నిర్ణయాలను తీసుకుంది. ఢిల్లీలో నిర్మాణ అనుమతులు పొందేందుకు సమయం, ఖర్చులను గణనీయంగా తగ్గించడం.. పరిపాలనా సంస్కరణలు వంటి కీలకాంశాలు భారత ర్యాంకును మరింత పైకి చేర్చాయని ప్రపంచ బ్యాంక్ ఈ సందర్భంగా వెల్లడించింది. జీఎస్టీ సరళీకరణతో మరింత మెరుగు.. వస్తు, సేవల పన్నును మరింత సరళతరం చేయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. తద్వారా నిర్దేశిత లక్ష్యమైన అగ్ర స్థాయి 50 దేశాల జాబితాలోకి చేరుకోవడానికి వీలుంటుందని వివరించారు. జీఎస్టీని సులభతరం చేయడం అనేది కొనసాగుతున్న ప్రక్రియ కాగా, ప్రస్తుతం రిటర్నుల ఆన్లైన్ ఫైలింగ్‌లో ఉన్నటువంటి అవాంతరాలను అధిగమించే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. -
అధ్యయనం పూర్తయ్యాకే నిర్ణయం
కరీంనగర్ సిటీ, న్యూస్‌లైన్ : ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలను బిజినెస్ కరస్పాండెంట్లుగా మార్చాలనే నాబార్డు చైర్మన్ ప్రకాశ్ బక్షి సిఫారసులపై ప్రభుత్వ పరంగా ఇంకా నిర్ణయం తీసుకోలేదని సహకార సంఘాల రాష్ట్ర రిజిస్ట్రార్, కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా స్పష్టం చేశారు. ప్రస్తుతం సిఫారసులను అధ్యయనం చేస్తున్నామని, ఆ తరువాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. గురువారం నగరంలోని కేడీసీసీబీ సమావేశ మందిరంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 2007 నుంచి 2009 వరకు మూడేళ్లపాటు ప్రపంచబ్యాంకు సర్వే చేసి సూచించిన మేరకు నాబార్డు ఈ సిఫారసులు ప్రతిపాదించిందన్నారు. ఇవి ఆషామాషీ సిఫారసులు కావని తెలిపారు. సిఫారసులపై రాష్ట్ర సహకారశాఖ మంత్రితో కూడా చర్చించినట్లు చెప్పారు. పూర్తిగా అధ్యయనం చేసిన తరువాత, సహకార సంఘాల బలోపేతం దిశగానే ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. సహకార వ్యవస్థకు పీఏసీఎస్‌లు పునాది వంటివన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడువేల వరకు సింగిల్విండోలున్నాయని, ఇందులో కొన్ని లాభాల్లో ఉండగా, మరికొన్ని నష్టాల్లో ఉన్నాయన్నారు. ఈ వైరుధ్యాన్ని తొలగించేందుకే క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నట్లు వెల్లడించారు. సహకార రంగంలో శ్రీకాకుళం జిల్లా చివరి స్థానంలో ఉందని, కరీంనగర్ ప్రగతిపథంలో ఉందని పేర్కొన్నారు. ఒకే చట్టం, ఒకే విధానం ఉన్నప్పటికీ సంఘాల అభివృద్ధిలో హెచ్చు తగ్గులు ఉండడంపై దృష్టి సారించామని అన్నారు. నష్టాల్లో ఉన్న సంఘాలను బలోపేతం చేసేందుకు లాభాల్లో ఉన్న సొసైటీలను మార్గదర్శకంగా చూపిస్తామన్నారు. ఆ దిశగా శిక్షణ ఇస్తామని చెప్పారు. ముల్కనూర్ ఆదర్శం సహకార రంగం అంటేనే ప్రపంచ వ్యాప్తంగా ముల్కనూరు బ్యాంకు గుర్తుకొస్తుందని సుల్తానియా అన్నారు. బ్యాంకును వాణిజ్యపరంగా కాకుండా, స్థానికులంతా కుటుంబంలో ఒక భాగంగా చూడడంతోనే అంత గుర్తింపు లభించిందన్నారు. ముల్కనూరును ఆదర్శంగా మిగతా సంఘాల్లో మార్పులు తీసుకురావాలన్నారు. డీసీఎంఎస్‌లను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. డీసీఎంఎస్‌ల భూములు వృథాగా ఉన్నాయని, వీటిని అభివృద్ధి పరిచే దిశగా ప్రతిపాదనలు చేస్తున్నామని తెలిపారు. పోటీమార్కెట్ను తట్టుకొనేలా సహకార సూపర్బజార్లను కూడా తీర్చిదిద్దుతామన్నారు. కార్యక్రమంలో కేడీసీసీబీ చైర్మన్ కొండూరి రవీందర్రావు, అదనపు రిజిస్ట్రార్లు అర్జున్‌రావు, రాజేశం, డీసీఎంఎస్ చైర్మన్ ముదుగంటి సురేందర్‌రెడ్డి, బ్యాంకు జనరల్ మేనేజర్ భానుప్రసాద్ పాల్గొన్నారు. కంప్యూటరీకరణకు ప్రతిపాదనలు ముల్కనూర్(భీమదేవరపల్లి) : జాతీయ సహకార అభివృద్ధి సంస్థ(ఎన్సీడీసీ)ద్వారా సహకార సంఘాల అభివృద్ధికి కృషి చేయనున్నట్లు సందీప్‌కుమార్ సుల్తానియా తెలిపారు. ముల్కనూర్ మహిళా స్వకృషి డెయిరీ, సహకార గ్రామీణ బ్యాంకులను గురువారం సందర్శించారు. పాల ప్యాకెట్ల తయారీతోపాటు పాల సంఘాల గూర్చి, ఎంసీఆర్బీ రైతులకు అందిస్తున్న సేవల గురించి బ్యాంకు అధ్యక్షుడు, ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డిని పవర్ ప్రజెంటేషన్ ద్వారా కమిషనర్‌కు వివరించారు. సుల్తానియా మాట్లాడుతూ సహకార సంఘాలను కంప్యూటీకరణ చేసేందుకుగాను కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించారు. ఎంసీఆర్బీ సేవలు అభినందనీయమన్నారు. రైతు బజార్లను సహకార సంఘాల పరిధిలోకి తీసుకొచ్చి వాటిని అభివృద్ధి పర్చనున్నట్లు తెలిపారు. కేడీసీసీ చైర్మన్ రవీందర్రావు, డెయిరీ అధ్యక్షురాలు కడారి పుష్పలీల, బ్యాం కు, డెయిరీ జనరల్ మేనేజర్లు మార్పాటి లక్ష్మారెడ్డి, భాస్కర్‌రెడ్డి సహకార సంఘ ప్రతినిధులు రాజేశం, అర్జున్‌రావు, విజయ్, రామనుజచారీ, ఇంద్రాసేనారెడ్డి, శంకరయ్య ఉన్నారు.