కరీంనగర్ సిటీ, న్యూస్‌లైన్ : ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలను బిజినెస్ కరస్పాండెంట్లుగా మార్చాలనే నాబార్డు చైర్మన్ ప్రకాశ్ బక్షి సిఫారసులపై ప్రభుత్వ పరంగా ఇంకా నిర్ణయం తీసుకోలేదని సహకార సంఘాల రాష్ట్ర రిజిస్ట్రార్, కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా స్పష్టం చేశారు. ప్రస్తుతం సిఫారసులను అధ్యయనం చేస్తున్నామని, ఆ తరువాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. గురువారం నగరంలోని కేడీసీసీబీ సమావేశ మందిరంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 2007 నుంచి 2009 వరకు మూడేళ్లపాటు ప్రపంచబ్యాంకు సర్వే చేసి సూచించిన మేరకు నాబార్డు ఈ సిఫారసులు ప్రతిపాదించిందన్నారు.
ఇవి ఆషామాషీ సిఫారసులు కావని తెలిపారు. సిఫారసులపై రాష్ట్ర సహకారశాఖ మంత్రితో కూడా చర్చించినట్లు చెప్పారు. పూర్తిగా అధ్యయనం చేసిన తరువాత, సహకార సంఘాల బలోపేతం దిశగానే ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. సహకార వ్యవస్థకు పీఏసీఎస్‌లు పునాది వంటివన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడువేల వరకు సింగిల్‌విండోలున్నాయని, ఇందులో కొన్ని లాభాల్లో ఉండగా, మరికొన్ని నష్టాల్లో ఉన్నాయన్నారు. ఈ వైరుధ్యాన్ని తొలగించేందుకే క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నట్లు వెల్లడించారు. సహకార రంగంలో శ్రీకాకుళం జిల్లా చివరి స్థానంలో ఉందని, కరీంనగర్ ప్రగతిపథంలో ఉందని పేర్కొన్నారు. ఒకే చట్టం, ఒకే విధానం ఉన్నప్పటికీ సంఘాల అభివృద్ధిలో హెచ్చు తగ్గులు ఉండడంపై దృష్టి సారించామని అన్నారు. నష్టాల్లో ఉన్న సంఘాలను బలోపేతం చేసేందుకు లాభాల్లో ఉన్న సొసైటీలను మార్గదర్శకంగా చూపిస్తామన్నారు. ఆ దిశగా శిక్షణ ఇస్తామని చెప్పారు.
ముల్కనూర్ ఆదర్శం
సహకార రంగం అంటేనే ప్రపంచ వ్యాప్తంగా ముల్కనూరు బ్యాంకు గుర్తుకొస్తుందని సుల్తానియా అన్నారు. బ్యాంకును వాణిజ్యపరంగా కాకుండా, స్థానికులంతా కుటుంబంలో ఒక భాగంగా చూడడంతోనే అంత గుర్తింపు లభించిందన్నారు. ముల్కనూరును ఆదర్శంగా మిగతా సంఘాల్లో మార్పులు తీసుకురావాలన్నారు. డీసీఎంఎస్‌లను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. డీసీఎంఎస్‌ల భూములు వృథాగా ఉన్నాయని, వీటిని అభివృద్ధి పరిచే దిశగా ప్రతిపాదనలు చేస్తున్నామని తెలిపారు. పోటీమార్కెట్‌ను తట్టుకొనేలా సహకార సూపర్‌బజార్లను కూడా తీర్చిదిద్దుతామన్నారు. కార్యక్రమంలో కేడీసీసీబీ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, అదనపు రిజిస్ట్రార్లు అర్జున్‌రావు, రాజేశం, డీసీఎంఎస్ చైర్మన్ ముదుగంటి సురేందర్‌రెడ్డి, బ్యాంకు జనరల్ మేనేజర్ భానుప్రసాద్ పాల్గొన్నారు.
కంప్యూటరీకరణకు ప్రతిపాదనలు
ముల్కనూర్(భీమదేవరపల్లి) : జాతీయ సహకార అభివృద్ధి సంస్థ(ఎన్‌సీడీసీ)ద్వారా సహకార సంఘాల అభివృద్ధికి కృషి చేయనున్నట్లు సందీప్‌కుమార్ సుల్తానియా తెలిపారు. ముల్కనూర్ మహిళా స్వకృషి డెయిరీ, సహకార గ్రామీణ బ్యాంకులను గురువారం సందర్శించారు. పాల ప్యాకెట్ల తయారీతోపాటు పాల సంఘాల గూర్చి, ఎంసీఆర్బీ రైతులకు అందిస్తున్న సేవల గురించి బ్యాంకు అధ్యక్షుడు, ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డిని పవర్ ప్రజెంటేషన్ ద్వారా కమిషనర్‌కు వివరించారు.
సుల్తానియా మాట్లాడుతూ సహకార సంఘాలను కంప్యూటీకరణ చేసేందుకుగాను కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించారు. ఎంసీఆర్బీ సేవలు అభినందనీయమన్నారు. రైతు బజార్లను సహకార సంఘాల పరిధిలోకి తీసుకొచ్చి వాటిని అభివృద్ధి పర్చనున్నట్లు తెలిపారు. కేడీసీసీ చైర్మన్ రవీందర్‌రావు, డెయిరీ అధ్యక్షురాలు కడారి పుష్పలీల, బ్యాం కు, డెయిరీ జనరల్ మేనేజర్లు మార్పాటి లక్ష్మారెడ్డి, భాస్కర్‌రెడ్డి సహకార సంఘ ప్రతినిధులు రాజేశం, అర్జున్‌రావు, విజయ్, రామనుజచారీ, ఇంద్రాసేనారెడ్డి, శంకరయ్య ఉన్నారు.
అధ్యయనం పూర్తయ్యాకే నిర్ణయం
Published Fri, Aug 23 2013 3:08 AM | Last Updated on Fri, Sep 1 2017 10:01 PM
Advertisement
Advertisement