
ఎన్నో రకాల కేక్‌లు చూసుంటారు. కానీ ఇలాంటి కేక్‌ని మాత్రం చూసుండరు. అదికూడా సాంకేతికతను, సైన్సుని మిళితం చేసేలా కేక్‌ని రూపొందించారు. అయితే దీనిని భవిష్యత్తులో ఒక పర్పస్ కోసమే తయారు చేశారట. శాస్త్రవేత్తలు, పరిశోధకులు, పేస్ట్రీ చెఫ్‌లు కలిసి ఎంతో శ్రమించి తయారు చేశారు. మరిదాన్ని వేటితో తయారు చేశారో సవివరంగా చూద్దామా..!.
వినూత్నంగా తయారు చేసిన కేకులు ఇటర్‌నెట్‌లో పెను తుఫాను సృష్టిస్తున్నాయి. అయితే ఈ 'రోబోటిక్ కేక్' మాత్రం అందుకోసం చేసింది మాత్రం కాదు. దీన్ని తినదగిన సాంకేతికతలో పురోగతికి చిహ్నంగా తయారుచేశారు. ఈయూ నిధులతో కూడిన రోబోఫుడ్ ప్రాజెక్ట్‌లో భాగంగా రూపొందించారు. దీన్ని ఓ వెడ్డింగ్ కేక్ మాదిరిగా తయారు చేశారు. స్విస్ ఫెడరల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లౌసాన్ (EPFL), ఇటాలియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) శాస్త్రవేత్తలు, అలాగే లౌసాన్ స్కూల్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ (EHL) పాక నిపుణులు కలిసి తయరు చేశారు.
ఈ నెల ఏప్రిల్ మధ్యలో ఒసాకాలో జరిగిన ఎక్స్‌పో 2025లో దీనిని ప్రదర్శించారు. ఈ "రోబోకేక్" అత్యంత వినూత్న భాగాలలో ఒకటి తినదగిన రీఛార్జబుల్ బ్యాటరీలు. వీటిని B2, క్వెర్సెటిన్, యాక్టివేటెడ్ కార్బన్, చాక్లెట్‌తో తయారు చేశారు. కేక్‌పై LED కొవ్వొత్తులను వెలిగించడానికి వాటిని ఉపయోగించారు.
ప్రముఖ డిజైనర్ మారియో కైరోని సమన్వయంతో IIT పరిశోధకులు ఈ బ్యాటరీలను రూపొందించారు. అలాగే ఈ కేక్‌పై రెండు పూర్తిగా తినదగిన రోబోటిక్ టెడ్డీ బేర్‌లు ఉంచారు. వాటిని తయారు చేసేందుకు జెలటిన్, సిరప్, ఫుడ్ కలర్స్‌ని ఉపయోగించారు. అంతర్గత వాయు వ్యవస్థ ద్వారా యానిమేట్ చేయబడతాయి. ఇవి ప్రత్యేక మార్గాల ద్వారా గాలిని ఇంజెక్ట్ చేసినప్పుడు, వాటి తలలు, చేతులు కదులుతాయి కూడా. అలాగే రుచికి ఇవి దానిమ్మ గమ్మీల టేస్ట్‌ని కలిగి ఉంటాయి.
ఎందుకోసం ఇలా..
రోబోటిక్స్ ,ఆహారం రెండూ వేర్వేరు ప్రపంచాలు. అయితే, వాటిని ఇలా విలీనం చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ తినదగిన రోబోట్‌లను అంతరించిపోతున్న ప్రాంతాలకు ఆహారాన్ని అందించడానికి, మింగడంలో ఇబ్బంది ఉన్న వ్యక్తులకు లేదా జంతువులకు వినూత్న మార్గాల్లో మందులను అందింవచ్చట.
పైగా తినగలిగే సెన్సార్‌లను ఉపయోగించి ఆహారాన్ని దాని తాజాదనాన్ని కూడా పర్యవేక్షించొచ్చట. చివరగా ఈ రోబోటిక్స్ భాగాలు తినడానికి సురక్షితంగా ఉన్నాయని, మంచి రుచిని కలిగి ఉన్నాయని చెబుతున్నారు పరిశోధకులు. రానున్న కాలంలో ఇక కేకులు ఇలానే ఉంటాయేమో కాబోలు.
(చదవండి: Free AI healthcare revolution: మైక్రోసాఫ్ట్ సీఈవో, టెక్కీ తండ్రుల ఆవేదన ఫలితం..!)