
వేసవి వచ్చిందంటే మామిడి సీజన్ మొదలైనట్లే. నోరూరించే పుల్లటి, తియ్యటి మామిడి రుచులను
కాస్త ప్రత్యేకమైన వంటల్లో ఎలా వాడుకోవచ్చో ఇప్పుడు చూద్దామా?
మామిడి బిర్యానీ
కావలసినవి: బాస్మతి బియ్యం – ఒక కప్పు; పచ్చి మామిడికాయ – 1 (ముక్కలుగా తరిగినది); పచ్చిమిర్చి – 3 (చిన్నగా తరిగినది); నువ్వులు – ఒక టీ స్పూన్; వేరుశెనగలు – 4 టేబుల్ స్పూన్లు; కొబ్బరి తురుము – అర కప్పు; బెల్లం తురుము – ఒక టీ స్పూన్; నూనె – సరిపడా; ఆవాలు, శనగపప్పు, మినపప్పు – ఒక టీస్పూన్ చొప్పున; కరివేపాకు, ఇంగువ, పసుపు – కొద్దికొద్దిగా; ఉప్పు – తగినంత; నీరు – 2.5 కప్పులు)
తయారీ: ముందుగా బియ్యం కడిగి 20 నిమిషాల పాటు నీటిలో నానబెట్టాలి. తరువాత కుకర్‌లో బియ్యం, నీళ్లు, ఉప్పు, కొద్దిగా నూనె వేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఈలోపు ఒక మిక్సీ బౌల్‌లో తరిగిన మామిడికాయ ముక్కలు, నువ్వులు, 1 టేబుల్ స్పూన్ వేరుశెనగలు, కొబ్బరి తురుము, అభిరుచిని బట్టి బెల్లం తురుము వేసుకుని, కొంచెం బరకగా పేస్ట్ చేసుకోవాలి. మందపాటి గిన్నెలో 3 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకుని, అందులో మిగిలిన వేరుశెనగలు వేయించుకోవాలి. తర్వాత ఆవాలు, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, ఇంగువ, పసుపు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని, గరిటెతో తిప్పుతూ ఉండాలి.
అవి బాగా వేగిన తర్వాత అందులో మామిడి–కొబ్బరి పేస్ట్ వేసుకుని సుమారు 3 నిమిషాల పాటు కలుపుతూ వేయించాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకుని, మళ్ళీ బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. ఉడికించిన అన్నం వేసి గరిటెతో బాగా కలిపి, మూతపెట్టి, చిన్న మంట మీద మగ్గనివ్వాలి. రైస్ ఉడికిపోతే మామిడికాయ బిర్యానీ సిద్ధమైనట్లే. నచ్చినవిధంగా గార్నిష్ చేసుకుని, వేయించిన పాపడ్లు, చిప్స్, పెరుగు ఇలా వేటితోనైనా సర్వ్ చేసుకోవచ్చు.
మామిడి బొబ్బట్లు
కావలసినవి: గోధుమ పిండి – ఒక కప్పు; మామిడిపండు గుజ్జు – ఒక కప్పు (బాగా పండి, తియ్యగా ఉన్నది); కొబ్బరి తురుము – పావు కప్పు; బెల్లం తురుము – పావు కప్పు (మామిడి తీపిని బట్టి ఎక్కువ లేదా తక్కువ వేసుకోవచ్చు); యాలకుల పొడి – అర టీ స్పూన్; ఉప్పు – తగినంత; నెయ్యి – సరిపడా; నీరు – కొన్ని;
తయారీ
ఒక గిన్నెలో గోధుమ పిండి, ఉప్పు, టేబుల్ స్పూన్ నెయ్యి వేసి పిండిని ఉండలు లేకుండా కొద్దికొద్దిగా నీరు పోసుకుంటూ మెత్తని చపాతీ పిండిలా కలిపి, 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు స్టవ్ ఆన్ చేసుకుని కళాయిలో 2 టేబుల్‌స్పూన్ల నెయ్యి వేడి చేసుకుని కొబ్బరి తురుము వేయించి, బెల్లం తురుము వేసి కలపాలి. బెల్లం కరిగిన వెంటనే మామిడిపండు గుజ్జు వేసుకుని తిప్పుతూ ఉండాలి.
చిన్న మంట మీద ఈ మిశ్రమాన్ని ఉడికించాలి. ఇది దగ్గరగా హల్వాలా కాగానే, యాలకుల పొడి వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మరోవైపు గోధుమ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, పూరీల్లా ఒత్తుకుని, మధ్యలో మామిడి మిశ్రమాన్ని కొద్దికొద్దిగా ఉంచి చేత్తో బొబ్బట్లలా చేసుకోవాలి. వాటిని నేతిలో వేయించుకుంటే సరిపోతుంది.
(చదవండి: 'టీ లైఫ్'..! మహిళలను ఆంట్రప్రెన్యూర్స్‌గా, ఇండస్ట్రియలిస్ట్‌గా..)