సాక్షి, న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మకమైన కేంద్ర సాహిత్య అకాడమీ 2017వ సంవత్సరానికిగాను అవార్డులను ప్రకటించింది. తెలుగు ప్రముఖ కవి, రచయిత దేవిప్రియ రచించిన 'గాలిరంగు' కవిత్వానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. అదేవిధంగా అనువాద విభాగంలో వీణావల్లభరావును పురస్కారం వరించింది. ఆయన అనువాదం చేసిన 'విరామమెరుగని పయనం' పుస్తకానికి కేంద్ర సాహిత్య పురస్కారం దక్కింది. పంజాబీలో రచించిన ఖానాబదోష్ ఆత్మకథను వల్లభరావు అనువాదం చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అవార్డులను ప్రదానం చేయనున్నారు. పురస్కారం కింద తామ్రపత్రం, లక్ష నగదు రచయితలకు అందజేయనున్నారు.
దేవిప్రియ 1949 ఆగష్టు 15న గుంటూరులో జన్మించారు. ఆయన అసలు పేరు షేక్ ఖాజాహుస్సేన్. తల్లిదండ్రులు షేక్ హుస్సేన్ సాహెబ్, షేక్ ఇమాం బీ.. గుంటూరులోని ఏసీ కాలేజీలో బీఏ చదువుకున్నారు. కాలేజీ రోజుల్లోనే కవిత్వం పట్ల ఆకర్షితుడై పద్యాలు, గేయాలు రాయడం ప్రారంభించారు. గుంటూరు కేంద్రంగా అవతరించిన పైగంబర కవులు బృందంలో దేవిప్రియ ఒకరు. పాత్రికేయుడిగా పలు దినపత్రికల్లో పనిచేశారు. వ్యంగ్య, విమర్శనాత్మకమైన 'సమాజానందస్వామి', 'రన్నింగ్ కామెంటరీ' కార్టూన్ కవిత్వం ద్వారా తెలుగు పత్రికారంగంలో ఆయన కొత్త ఒరవడిని ప్రవేశపెట్టారు. సినిమా రంగంపై సాధికారమైన వ్యాసాలు రాశారు. దాసి, రంగులకల మొదలైన సినిమాలకు స్క్రీన్ ప్లే, పాటలు రాశారు. 'ప్రజాతంత్ర', 'హైదారాబాద్ మిర్రర్' దినపత్రికలకు ప్రధాన సంపాదకులుగా పనిచేశారు.
దేవిప్రియ రచనలు: అమ్మచెట్టు (1979), సమాజానందస్వామి (1977), గరీబు గీతాలు (1992), నీటిపుట్ట (1990), తుఫాను తుమ్మెద (1999), రన్నింగ్ కామెంటరీ (3 సంపుటాలు) (2013), అరణ్య పురాణం, పిట్ట కూడా ఎగిరిపోవలసిందే (2001), చేపచిలుక (2005), అధ్యక్షా మన్నించండి (సంపాదకీయాలు) (2010), గాలిరంగు (2011), గంధకుటి (2009), ఇన్షా అల్లాహ్ (పద్యకావ్యం), Poornamma the golden doll (అనువాదం), The Cobra Dancer (కేజే రావు జీవితకథ)
పురస్కారాలు: 1980లో అమ్మచెట్టు కవిత్వానికి ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు..
1991లో నీటిపుట్ట కవితాసంకలనానికి సినారె కవితాపురస్కారం (కరీంనగర్)
వైఎస్ జగన్ అభినందనలు
2017 సంవత్సరానికిగాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు గెలుపొందిన తెలుగు రచయితలు దేవిప్రియ, వీణావల్లభరావులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. సాహిత్యరంగంలో వారికి అవార్డులు రావడం తెలుగుభాషకు గర్వకారణమని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment