Devipriya
-
‘గాలిరంగు’ మీద ‘కామెంటరీ’
పురస్కార సాహితి పాటనూ, మాటనూ మోసుకొచ్చే శక్తి కూడా గాలిదే. అంటే అన్యాయాలపైన, అక్రమాల పైన గళం విప్పగలిగే మనిషికి కావలసిన శక్తీ, ఇంధనమూ కూడా గాలిలోనే ఉన్నాయి. కాబట్టే గాలికీ రంగులు ఉన్నాయని ఈ కవి భావన. ఏటినీ నీటినీ నిలబెట్టేవాyì కీ, నిప్పుని కూడా నీటిలో మండించే వాడికీ, ఏనుగుని తొండం మీద నడిపించేవాడికీ, ఎవరెస్టు పర్వతాన్ని చపాతీలా చాప చుట్టుగలిగిన వాడికీ; నీవూ నేనూ ఎవరూ చేయలేని పనులు చేయడానికి సంకల్పించిన వాడికీ గాలికి రంగులద్దడం, ఆ రంగులను మనకు చూపడం పెద్ద పనా? ‘నీ పెదవులు నీవి– మాట్లాడు/ నీ నాలుక నీది – మాట్లాడు నిటారైన నీ శరీరం నీది–మాట్లాడు/ నీ ఆత్మ ఇప్పటికీ నీదే– మాట్లాడు మరి! నీకున్న వ్యవధి స్వల్పకాలమే– అందుకే మాట్లాడవయ్యా! సత్యం ఇంకా బతికే ఉంది– అందుకే చెప్పేసెయ్! నీవేం చెప్పాలనుకున్నావో– అదంతా కక్కేసెయ్!’ – ఫైజ్ అహ్మద్ ఫైజ్ (‘భారత ఉపఖండ చరిత్ర’ నుంచి) ఈ సందేశాన్నీ, ఈ ఉద్దీపననీ ఒంట పట్టించుకున్న ఆధునిక తెలుగు కవితా క్షేత్రంలో అగ్రశ్రేణి కవి దేవీప్రియ. ‘గాలిరంగు’ ఆయన సృజనే. ఈ కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించడం ఆలస్యమైందే కానీ, అబ్బురమైనదేమీ కాదు. స్వేచ్ఛాప్రియులు ఎవరైనా త్యాగ నిరతిని వదులుకోలేరు. తమ బాధాతప్త హృదయాలకు దారిద్య్రమే బహుమానంగా వచ్చినా వెనుదీయరు. అలాంటి వ్యక్తిత్వం దేవీప్రియ సొంతం. ఆయన కవిత్వం మీద ముద్ర అలాంటిదే. రాజకీయ, సామాజిక, ఆర్థిక, తాత్త్విక కారణాలెన్నింటినో ఈ కవి శ్వాసించాడు. వాటికి స్పందించాడు. అయినా తనదైన దృక్కోణాన్ని కోల్పోకుండా దేవీప్రియ చేసిన అక్షర చాలనమే ‘గాలిరంగు’. దేవీప్రియ ఒకే కార్యక్షేత్రానికి పరిమితం కాలేదు. కవిత్వంతో పాటు కథ, పత్రికా రచన, చలన చిత్రాలు, చిత్రానువాదం ఆయన కలానికి పరిచయాలే. నేను సంపాదకునిగా పనిచేసిన ‘ఆంధ్రప్రభ’, ‘ఉదయం’ దినపత్రికలలో తొలిసారి (1982 నుంచి) రాజకీయాల మీద నిత్య వ్యంగ్య వ్యాఖ్యాన ప్రక్రియను ప్రారంభించినవారు దేవీప్రియ. అదే ‘రన్నింగ్ కామెంటరీ’. దీనికి వ్యంగ్య చిత్రం కూడా తోడై తెలుగు పత్రికారంగంలో వినూత్న పోకడగా అవతరించింది. పరిశోధనాత్మక జర్నలిజానికి ఒజ్జబంతిగా అవతరించిన ‘ఉదయం’ ఆదివారం అనుబంధాలలో ‘సంతకాలు’ శీర్షికను కూడా దేవీప్రియ రమణీయంగా నిర్వహించారు. తెలుగువారైన పలువురు ముస్లిం కవులకు ఆయన మార్గదర్శకుడు. ఈ కవులంతా ‘వెతల మైదానంలో’ జీవిస్తూ కూడా తమ ‘తనాన్ని’, వ్యక్తిత్వాన్ని సమున్నతంగా నిలబెట్టుకున్నవారే. ఎంతగా ప్రణయ శృంగార కవిత్వానికి ఆకర్షితుడైనప్పటికీ గాలిబ్ ఒక జీవన సత్యాన్ని ఆవిష్కరించకుండా మాత్రం తప్పించుకోలేకపోయాడు. ‘మనిషి బాధ చైతన్యానికి నిదర్శన’మని చెప్పాడాయన. మరో మహాకవి ఖలీల్ జిబ్రాన్ మానవాళి వ్యథార్త జీవిత యథార్థ గాథను ఆవిష్కరిస్తూ ఇలా అన్నారు, ‘మీ కోసం పాడాను కానీ మీరు నర్తించలేదు/ మీ ముందు రోదించాను కానీ మీరెవరూ స్పందించలేద’ని. ఇందుకు కారణం –‘స్పందించలేకపోవడానికి కారణం– మీ ఆత్మలు ఆకలి బాధతో విలవిలలాడడమూ, ‘మీ హృదయాలు దాహంతో ఎండిపోవడమూ’ తప్ప మరేమీ కాదంటారాయన. ‘మానవ జీవితం మృత్యువుకన్నా బలహీనమైతే/ మృత్యువు సత్యానికన్నా బలహీనం కదా!’ అన్న మహోన్నత కవి ఖలీల్ జిబ్రాన్. ఈ తాత్త్విక చింతనకు చెందిన దేవీప్రియ కవితా సంపుటి ‘గాలిరంగు’ కూడా ఆ కోవలోనే జీవన సత్యాలను విప్పిచెప్పింది. అసలు ‘గాలిరంగు’ అన్న పదబంధమే ఒక వైచిత్రి. గాలికి వాసన సంగతేమో కానీ, రంగూ రుచీ ఉంటాయా! ఉంటాయనే అంటారు దేవీప్రియ. ఎలా? మనిషి ఆయువు ప్రాణవాయువు. కానీ ప్రాణవాయువును పీల్చినవారంతా మనుషులుగా బతకడం లేదు. మనుషులుగా ఉండడం లేదు కూడా. మనిషతనాన్ని అడ్డంపెట్టుకుని అడ్డదారులలో జొరబడేవారూ ఉన్నారు. సుగంధాలనూ, దుర్గంధాలనూ గాలే మోసుకురాగలదు. శ్రేష్టమైన పైరగాలీ, దుర్భరమైన పడమటి గాలీ, కొండగాలీ, అడవి గాలీ కూడా నిజమే. పాటనూ, మాటనూ మోసుకొచ్చే శక్తి కూడా గాలిదే. అంటే అన్యాయాలపైన, అక్రమాల పైన గళం విప్పగలిగే మనిషికి కావలసిన శక్తీ, ఇంధనమూ కూడా గాలిలోనే ఉన్నాయి. కాబట్టే గాలికీ రంగులు ఉన్నాయని ఈ కవి భావన. ఏటినీ నీటినీ నిలబెట్టేవాడికీ, నిప్పుని కూడా నీటిలో మండించే వాడికీ, ఏనుగుని తొండం మీద నడిపించేవాడికీ, ఎవరెస్టు పర్వతాన్ని చపాతీలా చాప చుట్టుగలిగిన వాడికీ; నీవూ నేనూ ఎవరూ చేయలేని పనులు చేయడానికి సంకల్పించిన వాడికీ (ఆ ‘వాడు’ ఎవరో కాదు, దేవీ ప్రియే) గాలికి రంగులద్దడం, ఆ రంగులను మనకు చూపడం పెద్ద పనా? గాలికి అతడు వేసే రంగు ఎరుపా, తెలుపా, చిలకపచ్చా, ఆకుపచ్చా? ఆ రంగులు ఏవైనా గాలిబ్ అన్నట్టు, ‘మల్లెలు, గులాబీలు, చంపకవల్లులు పూస్తాయి. కానీ వసంతం రాకను ప్రకటించేవి రంగులే!’’ కానీ దేవీప్రియ ‘గాలిరంగునైనా ఊహించగలనుగానీ/ రానున్న రేపటి రూపే చూపుకందడంలేద’ని ఆక్రోశించాడు. ఎన్నో ఉత్ప్రేక్షలతో పేదవాడి బాధలను అక్షరబద్ధం చేసిన దేవీప్రియకి గాలి ఒక ప్రతీక. తన దేశ సామాన్య ప్రజాబాహుళ్యానికి డెబ్బయ్యేళ్ల తరువాత కూడా సాంఘిక, రాజకీయ, ఆర్థిక స్వాతంత్య్రం కోసం, భావ ప్రకటనా స్వేచ్ఛ కోసం అంగలారుస్తున్న విషాదాన్ని చూసి కుపితుడైన దేవీప్రియ ఒక ప్రశ్నను సంధించాడు: ‘దేనికీ భయపడను/ జలపాతాల ధారలు పట్టుకుని/ఊగుతూ దూకుతూ అరణ్యాలు దాటినవాణ్ణి/ అల్లకల్లోలంగా ఉన్న ఈ దేశంలో సముద్రాలకున్న సంవేదన (అలల కల్లోలం) కూడా/ మన పౌర మానవుడికి లేదెందుకు?’’ అని! నిజమే, దేశంలో పౌర సమాజం ఎదగకుండా పాలక వర్గాలు రోజుకొక తీరున పౌర స్వేచ్ఛపైన, భావ ప్రకటనా స్వాతంత్య్రంపైన, భిన్నాభిప్రాయ ప్రకటనలపైన యుద్ధం ప్రకటిస్తున్నాయి. అదేమంటే రాజద్రోహం అంటున్నాయి. ‘క్షేమం అవిభాజ్యం అన్నందుకు’ జైళ్ల నోళ్లు తెరిపిస్తున్న సమయంలో పౌర సమాజం భీకరంగా విరుచుకుపడవలసిన రోజులివి. ఈ విషయాన్ని కనిపెట్టి ముందుగానే హెచ్చరించాడు ‘గాలి రంగు’ కవి: ‘ప్రవక్తలు పారిపోతారు/స్వాప్నికులు సిలువెక్కుతారు/నియంతలు త్యాగపురుషుల వెనుక శరణు తీసుకుంటారు/ రక్త పిపాసులు చేతిలో పుష్పగుచ్ఛాలతో తిరుగుతారు/ జాతి ఆకాంక్షలను కొందరు/ సముద్రాలకు ఆవల మర్రిచెట్టు తొర్రలలో దాచిపెడతారు/ పొలాల పురుగు మందు చావులూ/ ఆదివాసీ తిరుగుబాట్లదారులూ/ దగ్ధమవుతున్న అరణ్యాలూ, రగులుతున్న పర్వతశ్రేణులూ/ నవభారత నిర్మాణ నినాదాల కంటికి కనిపించవు/ వేదికలూ నివేదికల మధ్య/ ప్రశ్నలూ జవాబుల మధ్య నిరుపేద భారతం నలిగి నరకం అనుభవిస్తూ ఉంటుంది/ రామలీలా మైదానం ఒక్కటే/ జాతీయ ప్రత్యక్ష ప్రసారాల ప్రాధాన్యత అవుతుంది!’ అంతేగాదు, ‘మానవుడు ఎన్ని వైజ్ఞానిక విజయాలు సాధించినా, మాటలు నేర్చుకుని, లిపులు మార్చుకుని మరీ/ దేవుళ్లను సృష్టించుకున్నాం, నక్షత్రాలకు నామకరణం చేసి, గ్రహాలను విగ్రహాలుగా మార్చాం.../ కానీ, సోదరా! మనిషి మాలిన్యాన్ని ఇన్ని నులివెచ్చని కన్నీళ్లతో కడిగి శుభ్రం చేయలేకపోయాం’ అంటాడు దేవీప్రియ. అతను త్యాగానికీ, రక్తానికీ ఉన్నఅవినాభావ సంబంధాన్ని ‘అచరిత్ర’ కవితలో బలంగా ఆవిష్కరించాడు: ‘కురుక్షేత్ర రణరంగమైనా/ కల్వంగిరి దారైనా/ కర్బలా మైదానమైనా/ రక్తం ఒక్కటే! సెల్యులార్ జైలు ఉరికొయ్యలకి వేలాడినా/ ఉగాండా అడవుల్లో తిరగబడి నేలకొరిగినా/ నల్లమల అరణ్యాలలో స్మారక స్తంభాలై నిలిచినా/ త్యాగం ఒక్కటే.../ అయినా ఎవడు నమోదు చేస్తున్నాడు/ తరతరాలుగా తడి ఆరకుండా మెరుస్తున్న/ నెత్తుటి బడబానలాల మూల చరిత్ర..? ఏ హోమరు, ఏ వాల్మీకి/ ఏ వ్యాసుడు/ ఏ కంబడు/ ఏ నన్నయ/ రాశాడు, రక్తబీజాలు చల్లుకుంటూ/ ఇతిహాస ఊసర క్షేత్రాలలో/ మందార పాదముద్రలు వదిలి వెళ్లిన జన వీరులగాథ?’’ ఎంత ఎత్తు ఎదిగినా బాల్యాన్ని మరచిపోనివాడు దేవీప్రియ దృష్టిలో ధన్యజీవి. తన కవిత్వంలో చిన్నతనం, పల్లెతనం, గ్రామీణ చిహ్నాలూ, ప్రతీ కలూ, చిన్న చిన్న అనుభవాలు పదే పదే కనిపిస్తూండటానికి కారణం ఆ బాల్యమే. బహుశా అడివన్నా అతనికంత ఇష్టం. అయితే గార్డెన్ రెస్టారెంట్ చల్లగాలిని రుచి మరిగిన వాడు, ఫ్యాన్ విసిరే చల్లగాలిలో శరీరాన్ని ఆరేసుకోవడానికి అలవాటు పడినవాడు ‘అడివి’ని ఎలా ఇష్టపడగలడు? ఈ ప్రశ్నకు దేవీప్రియ ఇచ్చిన సమాధానం– నేటి అజ్ఞాత వీరులైన విప్లవకారుల గురిం చిన విస్పష్ట ప్రకటనే. ఎందుకంటే, రేపటి ఆకాశానికి ఈ రోజునే పూచిన సూర్య పుష్పానివని కీర్తిస్తూ–చెప్పదలచుకున్న సత్యాన్ని దేవీప్రియ విప్పాడు: ప్రజలకోసం విప్లవకారులు చేస్తున్న త్యాగాలను జ్ఞప్తికి తెచ్చుకుని ‘నీ ముళ్ల ఒడిలో నా వాళ్లు విశ్రమించారు/ నీ చల్లని కనురెప్పల నీడలో/ నావాళ్లు సేదదీరారు/ నీ కొమ్మలే, నీ ఆకులే/ నీ గాలుల సాక్షిగా/ నావాళ్లు ఒరిగిపోయారు/ విల్లంబులూ, తుపాకులూ/ జారవిడిచారు/ అడివీ, నా అడివీ/ ఆ బాణాలు ఏరివుంచు/ ఆ ఆయుధాలు దాచివుంచు’ అని రహస్యంగా సందేశమిస్తాడు. రైతుకూలీల, శ్రమజీవుల శరీరం నిత్యమూ శ్రమ సంగీతాన్ని విని పిస్తూనే ఉంటుందంటాడు. అతనికి శబ్ద రహస్యం తెలుసు. తనను కమ్ముకున్న ‘రెండు నిధుల్నీ, రెండు విధుల్నీ’ కవి పేర్కొన్నాడు. ‘నాలుక మీద కవిత్వం/ తలమీద మాత్రం దారిద్య్రం’ అనేవి రెండు నిధులట. ‘నిత్య నిబద్ధం/ దారిద్య్ర విముక్తి యుద్ధం’ అనేవి రెండు విధులట. ఆంధ్రజాతి, అదే తెలుగు జాతి ఆంధ్ర/సీమ/తెలంగాణగా మూడు ముక్కలు, మూడు చెక్కలవడాన్ని దేవీప్రియ అదే ‘తెలుగు శాసనం’గా పేర్కొంటూ ‘పొలంగట్లు కూరాయి/ పెత్తందార్లు మారారు’ (గాలిరంగు) తప్ప శ్రమ జీవులైన రైతు, కూలీల నసీబులు మాత్రం మారలేదని ఆ ‘శాసనం’లో చిత్రించాడు దేవీప్రియ. మళ్లీ ఒక హంసపాదు పెట్టుకుని, పోనీలే ‘ఉద్వేగమో, ఉద్రేకమో చాలదని తేలింది’ కదా, ‘‘భాషకంటే బలమైనదొకటి శాసిస్తోంది కదా నీ ఊపిరిని/ ఏ ఒడ్డున ఎవరు నిలబడినా/ మనిషి తోటి మనిషి కోసం పోరాడనీ/ తెలుగు పలుగు/ తెలుగు లిపి/ సజీవ మానవ మహా శాసనం మీద చిరస్థాయిగా నిలిచిపోనీ’ అని దేవీప్రియ జాతి విశాల ప్రయోజనాల దృష్ట్యా రాజీ మార్గం ఎంచుకున్నాడు. ఏది ఎలా ఉన్నా, కళింగ యుద్ధానంతరం శాంతి మార్గాన్ని ఎంచుకుని బౌద్ధ ధర్మాన్ని పాటించడానికి సిద్ధమైన అశోకుడిని ‘దేవానాంప్రియ’ (దేవతల ఆశీస్సులు పొందినవాడా) అని సంబోధించినట్టుగా మనం సహమానవులైన ప్రగతిశీల సారస్వతీయుల అభినందనలు అందుకుంటున్నందుకు ‘మానవానాంప్రియ– దేవీప్రియ’ అని ఆశీరాక్షతలు చల్లుదాం! (దేవీప్రియకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చిన సందర్భంగా) abkprasad2006@yahoo.co.in ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు -
యుద్ధం చేస్తూ శాంతిని కోరే కవి
‘నేనింకా కలలు కంటున్నాను నేనింకా నన్ను నేను తొలుచుకుంటున్నాను నేనింకా అనుక్షణం దహనమవుతున్నాను నేనింకా నిరంతరం మునిగి తేలుతున్నాను పద్యం రాసిన ప్రతిసారీ నేనిప్పటికీ భస్మమై మళ్లీ రూపొందుతున్నాను’’ – దేవిప్రియ కవిత్వం కోసం తపన చెంది, దహించుకుపోయి, ‘గాలిరంగు’ల మూలాల్ని తెలుసుకుని, నిరంతరం కవిత్వమైపోగల మనిషి ‘దేవిప్రియ’. తన కవిత్వాన్ని చదరంగపు ఆటతో పోల్చుకుంటూ, ‘అక్షరాలు దేని గడిలో అవి పడిపోతాయి’ అంటూ, ‘గణితం, రసాయనం, అలంకారం కలిసిన ప్రతిసారీ ఒక నూతన పద్యం పుడుతుంది’ అంటూ తన కవితా ప్రక్రియ రహస్యాన్ని తాను తెలుసుకుని ఆవిష్కరించగల సత్తావున్న కవి దేవిప్రియ. గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తును పునాదిగా, భవనంగా, శిఖరంగా భావించుకుని మూడింటినీ ముద్దాడి రాగల త్రి‘కాలజ్ఞుడైన’ కవి అతను. అన్ని కాలాలలోకీ అలవోకగా ప్రయాణం చేయగల అనితర సాధ్యుడైన కవి. కవిగా దేవిప్రియ ప్రయాణం మొదలైంది 60లలో. చిన్ననాడు పాఠశాల గురువులే పునాది గట్టిగా వేశారు. కళాశాలలో ‘కరుణశ్రీ’ దగ్గర నేర్చుకున్న పాఠాలు ఛందస్సు మీద కూడా గట్టి పట్టునీ, భాషా సంపదనూ అందించాయి. నేనూ, దేవిప్రియ యిద్దరం ఎ.సి. కాలేజీలో సహాధ్యాయులం కావటం వలన కవిగా ఆయన తొలి అడుగులను దగ్గర నుంచి చూశాను. రెండు మూడేళ్లు ఇద్దరం కలిసి నడక నేర్చుకున్నాం. ఆ నడకలోనే అర్థమైంది దేవిప్రియ చూపు లోతైనదని. బి.ఎ. మొదటి సంవత్సరంలో నేనూ, బీనా తరగతి గదిలో చేసే అల్లరిని నిశ్శబ్దంగా గమనించే దేవిప్రియ – అప్పటికింకా ఖాజా హుస్సేన్గానే మాకు తెలుసు – రెండవ సంవత్సరంలో ఒక ఛందోబద్ద కావ్యాన్ని, తన చేతిరాతతో ఉన్నదాన్ని నా చేతిలో పెట్టి చదవమన్నాడు. దేవిప్రియ కలం పేరుగా అప్పటికే పెట్టుకున్నాడు. రోజూ క్లాసులో ప్రశాంతంగా చిరునవ్వులు చిందించే ఈ పిల్లవాడికి ఇంత శక్తి సామర్థ్యాలున్నాయా అని ఆశ్చర్యపోయాం. ఇతను పెద్దయ్యాక తప్పక నారాయణరెడ్డిగారంతటి కవి అవుతాడు, అప్పుడు మనం ఇతని ఆటోగ్రాఫ్ కోసం పరిగెత్తాలి కదా అనుకున్నాం. ఇప్పుడే ఆటోగ్రాఫ్ తీసుకుందామా అని దురాశపడ్డాం. మూడో ఏడాది దేవిప్రియ సుగమ్బాబుని తీసుకుని మా ఇంటికొచ్చాడు. అతని వెనకే కిరణ్‌బాబు. ఆ తర్వాత కమలాకాంత్ని పరిచయం చేశాడు. మన ఐదుగురం కలిసి కవితా సంకలనం ఒకటి తీసుకొద్దామన్నాడు. నాక్కాస్త భయం వేసినా సరేనన్నాను. ఆ వేసవి సెలవుల్లో ‘యుగ సంగీతం’ పైగంబర కవుల పేరుతో ప్రచురించాం. పరుచూరి రాజారాం ఆవిష్కరించారు. ఆ రోజులు చాలా సంచలనాలతో గడిచాయి. ఒకవైపు శ్రీకాకుళోద్యమంలో నా గురువులు, స్నేహితులు అమరులవుతున్నారు. ఇంకోవైపు, శ్రీశ్రీ షష్టిపూర్తి. ఇంకొన్ని నెలలకు విరసం ఆవిర్భావం. వీటన్నిటినీ నేనూ, దేవిప్రియ, సుగమ్‌బాబు కలిసి పంచుకున్నాం. మా ఇంట్లోని చిన్న లైబ్రరీ గదిలో గంటలు, గంటలు కరిగిపోయేవి మాటలతో, మౌనాలతో. విరసం సభలకు ఖమ్మం కూడా కలిసే వెళ్లాం. ఆ తర్వాత దేవిప్రియ మద్రాసు వెళ్లిపోయాడు. మళ్లీ ఎన్నో సంవత్సరాలకు 1985లో అనుకుంటా హైదరాబాద్‌లో కలిశాడు. చిన్నప్పటిలానే ఆప్యాయంగా నవ్వుతూ ‘‘ఏరా ఎలా వున్నావు’’ అని పలకరించేసరికి ప్రాణం లేచొచ్చినట్లయింది. అప్పటికే దేవిప్రియ చాలా సాధించాడు. కవిగా ఎంతో పేరు. ‘అమ్మచెట్టు’ వంటి గొప్ప సంకలనం. ‘ప్రజాతంత్ర’ పత్రికకు సంపాదకుడిగా తన విలక్షణ శైలిని అందరికీ పరిచయం చేశాడు. శ్రీశ్రీని ఆత్మకథ రాయటానికి ఒప్పించటం, ఆయనతో వేగటం, రాయించి సంచలనాలను తట్టుకుని నిలబడటం మామూలు పని కాదు. అనంతమైన ఓరిమి దేవిప్రియలో ఉంది. దానితో పాటు అంతులేని అసహనం కూడా ఉంది. ఐతే ఎక్కడ ఎప్పుడు దేనికోసం ఓర్పు వహించాలో, ఎక్కడ ఎప్పుడు దేనికోసం అసహనం ప్రదర్శించాలో తెలుసుకునే వివేకం కూడా ఉంది. ఆ వివేకమే అతని జీవితాన్ని నడిపించిందనిపిస్తుంది నాకు. ‘ఉదయం’ వార్తాపత్రికలో కొన్నేళ్లపాటు రన్నింగ్ కామెంటరీ నిత్య నూతనంగా నడిపించటానికి సమాజం, రాజకీయాల పట్ల ఎంత అవగాహన ఉండాలి! ప్రజల పక్షమే నిలబడే తన రాజకీయ అవగాహనను, సామాన్య ప్రజలకు హాయిగా అర్థమయ్యేలా, వ్యంగ్యంగా, చురకలతో, చెణుకులతో, అతి చిన్న రూపంలో యిమిడ్చి అందించటం ఎంత కష్టమైన పని! ఆ పనిని సునాయాసంగా, ఇష్టంగా చేశాడు దేవిప్రియ. కొన్ని లక్షల మందిని కొన్నేళ్లపాటు ప్రతిరోజూ ఆలోచింపజేశాడు. దీనితోపాటు అద్భుతమైన పాటలు, కవితా సంకలనాలు, సినిమా ప్రయత్నాలు – తాను నిదానంగా ఉన్నట్టు కనిపిస్తూనే జీవితాన్ని పరిగెత్తించినవాడు దేవిప్రియ. ‘నీటిపుట్ట’ నుంచీ యెదురుచూస్తున్నాను. చివరకు ‘గాలిరంగు’కి అకాడెమీ అవార్డు వచ్చింది. అవార్డు వచ్చిందంటే అవార్డుకి గౌరవం తెచ్చే రచయితల జాబితాలోనివాడు దేవిప్రియ. ఎలాంటి కవిత్వం దేవిప్రియది. ఎంత విశాలమైనది అతని కవితా దృక్పథం. ‘నాకు ఆస్ట్రేలియా అబోరిజనుల ఆదిమూలాలు కావాలి దండకారణ్య సంతాన సంకేతాల అంబుల పదునూ కావాలి నాకు పురాణ పురుషుల పుట్టు పూర్వోత్తరాలు కావాలి మానవ వికాస వనంలో పురివిప్పి ఆడిన వసంత యామినుల చెరిగిపోని పాదముద్రల జాడలూ కావాలి నాకు కరాచీ భూగర్భ మురుగు సొరంగాలలో మునకలేస్తున్న నిరుపేద ముస్లిముల విముక్తీ కావాలి స్వాతంత్య్రం సాక్షిగా ఇంకా తలమీద మానవ మలం మోస్తున్న అణగారిన భారత హైందవ సంతానం కళ్లనిండా ఆత్మగౌరవ ఆనందమూ కావాలి. నాకు సకల జనుల సమస్త జాతుల శాంతీ కావాలి శాంతి కోసం అనివార్యంగా జరిగే యుద్ధమూ కావాలి.’ శాంతిని, యుద్ధాన్ని నిరంతరం తన హృదయంలోంచి కవిత్వంలోకి అనువదించి మనకు యుద్ధం మీద, శాంతి మీద కూడా ప్రేమ కలిగేలా చేస్తున్న కవి దేవిప్రియ. కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు దేవిప్రియకు ప్రకటించిన వేళ ఆయన మిత్రులందరూ ఆయన కంటే ఎక్కువగా ఆయన సహచరి రాజ్యలక్ష్మిని తల్చుకుంటారు. ఆమె ఉంటే ఆ సంబరమే వేరు. కానీ ఈ సంబరం తెలుగు కవిత్వానిది. కేవలం దేవిప్రియది కాదు. అతని మిత్రులదీ కాదు. - ఓల్గా -
దేవిప్రియకు సాహితీ పురస్కారం
-
దేవిప్రియకు కేంద్ర సాహిత్య పురస్కారం
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: ప్రముఖ కవి, రచయిత దేవిప్రియను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం–2017 వరించింది. ఆయన పద్యకావ్యం ‘గాలిరంగు’ తెలుగు నుంచి ఉత్తమ కవితా సంపుటి విభాగంలో పురస్కారానికి ఎంపికైంది. కేంద్ర సాహిత్య అకాడమీ ఏటా అందించే వార్షిక అవార్డులను గురువారం ఢిల్లీలో ప్రకటిం చింది. మొత్తం 24 భాషల్లో ఉత్తమ రచనలను పురస్కారాలకు ఎంపిక చేసింది. అకాడమీ చైర్మన్ ప్రొఫెసర్ విశ్వనాథ్ ప్రసాద్ తివారీ అధ్యక్షతన సమవేశమైన కార్యవర్గ బోర్డు తీసుకున్న నిర్ణయాలను కార్యదర్శి కె. శ్రీనివాసరావు ఈ మేరకు మీడియాకు వెల్లడించారు. ప్రతి భాష నుంచి ముగ్గురు చొప్పున జ్యూరీ సభ్యులతో కూడిన కమిటీ ఉత్తమ రచనలను ఎంపిక చేసింది. తెలుగు నుంచి జ్యూరీ కమిటీలో ఎ.ఎన్. జగన్నాథశర్మ, కె.శివారెడ్డి, డాక్టర్ సంపత్ కుమార్ సభ్యులుగా వ్యవహరించారు. అనువాద రచన ఎంపిక జ్యూరీలో ‘అంపశయ్య’నవీన్, బండ్ల మాధవరావు, డాక్టర్ జె.ఎల్. రెడ్డి సభ్యులుగా పనిచేశారు. అవార్డులను ఫిబ్రవరి 12న ఢిల్లీలోని అకాడమీ కేంద్రంలో జరిగే ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ కార్యక్రమంలో ప్రదానం చేయనున్నారు. ఉత్తమ కవితా సంపుటికి రూ. లక్ష, ఉత్తమ అనువాద రచనకు రూ. 50 వేల చొప్పున నగదు బహుమతిని అందించనున్నారు. మరోవైపు కేంద్ర సాహిత్య అకాడమీ ఉత్తమ అనువాద రచనగా తెలుగు నుంచి వెన్న వల్లభరావు అనువదించిన ‘విరామం ఎరుగని పయనం’రచనకు అవార్డు లభించింది. ప్రముఖ పంజాబీ రచయిత్రి అజీత్ కౌర్ జీవితకథ ‘ఖానాబదోష్’ను వల్లభరావు తెలుగులో ‘విరామం ఎరుగని పయనం’గా అనువదించారు. రన్నింగ్ కామెంటరీ కవిగా సుపరిచితులు... దైనందిన రాజకీయ, సాంఘిక పరిస్థితుల్ని ప్రతిబింబిస్తూ ‘రన్నింగ్ కామెంటరీ’ కవిగా సుపరిచుతులైన దేవిప్రియ 1951 ఆగస్టు 15న గుంటూరు జిల్లాలో జన్మించారు. సినీరంగంతో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన దేవిప్రియ... జర్నలిజంలో స్థిరపడి వివిధ పత్రికలకు ఎడిటర్‌గా పనిచేశారు. ‘అమ్మ చెట్టు’ మొదలుకొని ‘గాలిరంగు’ వరకు మొత్తం ఏడు కవితా సంపుటాలను రచించారు. ప్రజాగాయకుడు గద్దర్‌పై ఆంగ్ల డాక్యుమెంటరీ చిత్రం ‘మ్యూజిక్ ఆఫ్ ఎ బ్యాటిల్‌షిప్’ను నిర్మించి దర్శకత్వం వహించారు. దాసి, రంగుల కల వంటి చిత్రాలకు స్క్రీన్‌ప్లే అందించి జాతీయ బహుమతులు అందుకున్నారు. కవిగా, పాత్రికేయుడిగా, సంపాదకుడిగా, సినీ గేయ రచయితగా, డాక్యుమెంటరీ రూపకర్తగా, టీవీ చానల్ కంటెంట్ విభాగాధిపతిగా వైవిధ్య ప్రక్రియల్లో ఆయన పేరొందారు. నాలుగు దశాబ్దాలకుపైగా తెలుగు కవిత్వానికి, జర్నలిజానికి సేవలందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. చాలా సంతోషంగా ఉంది నేను రాసిన ‘గాలి రంగు’ పద్య కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించడం సంతోషంగా, తృప్తిగా ఉంది. ఏ కవి జీవితంలోనైనా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఒక మైలురాయి. ఈ ఏడాది జ్యూరీగా వ్యవహరించిన పెద్దలకు ధన్యవాదాలు. – దేవిప్రియ జగన్ అభినందనలు ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు దక్కించుకున్న దేవిప్రియ, వెన్న వల్లభరావును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందించారు. తెలుగు భాషా రంగంలో వారు చేసిన కృషికి ఈ అవార్డు రావడం గర్వకారణమని పేర్కొన్నారు. ఈ అవార్డుల ద్వారా తెలుగు కీర్తి దశదిశల విస్తరించిందన్నారు. -
దేవిప్రియ కవిత్వానికి కేంద్ర సాహిత్య పురస్కారం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మకమైన కేంద్ర సాహిత్య అకాడమీ 2017వ సంవత్సరానికిగాను అవార్డులను ప్రకటించింది. తెలుగు ప్రముఖ కవి, రచయిత దేవిప్రియ రచించిన 'గాలిరంగు' కవిత్వానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. అదేవిధంగా అనువాద విభాగంలో వీణావల్లభరావును పురస్కారం వరించింది. ఆయన అనువాదం చేసిన 'విరామమెరుగని పయనం' పుస్తకానికి కేంద్ర సాహిత్య పురస్కారం దక్కింది. పంజాబీలో రచించిన ఖానాబదోష్ ఆత్మకథను వల్లభరావు అనువాదం చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అవార్డులను ప్రదానం చేయనున్నారు. పురస్కారం కింద తామ్రపత్రం, లక్ష నగదు రచయితలకు అందజేయనున్నారు. దేవిప్రియ 1949 ఆగష్టు 15న గుంటూరులో జన్మించారు. ఆయన అసలు పేరు షేక్ ఖాజాహుస్సేన్. తల్లిదండ్రులు షేక్ హుస్సేన్ సాహెబ్, షేక్ ఇమాం బీ.. గుంటూరులోని ఏసీ కాలేజీలో బీఏ చదువుకున్నారు. కాలేజీ రోజుల్లోనే కవిత్వం పట్ల ఆకర్షితుడై పద్యాలు, గేయాలు రాయడం ప్రారంభించారు. గుంటూరు కేంద్రంగా అవతరించిన పైగంబర కవులు బృందంలో దేవిప్రియ ఒకరు. పాత్రికేయుడిగా పలు దినపత్రికల్లో పనిచేశారు. వ్యంగ్య, విమర్శనాత్మకమైన 'సమాజానందస్వామి', 'రన్నింగ్ కామెంటరీ' కార్టూన్ కవిత్వం ద్వారా తెలుగు పత్రికారంగంలో ఆయన కొత్త ఒరవడిని ప్రవేశపెట్టారు. సినిమా రంగంపై సాధికారమైన వ్యాసాలు రాశారు. దాసి, రంగులకల మొదలైన సినిమాలకు స్క్రీన్ ప్లే, పాటలు రాశారు. 'ప్రజాతంత్ర', 'హైదారాబాద్ మిర్రర్' దినపత్రికలకు ప్రధాన సంపాదకులుగా పనిచేశారు. దేవిప్రియ రచనలు: అమ్మచెట్టు (1979), సమాజానందస్వామి (1977), గరీబు గీతాలు (1992), నీటిపుట్ట (1990), తుఫాను తుమ్మెద (1999), రన్నింగ్ కామెంటరీ (3 సంపుటాలు) (2013), అరణ్య పురాణం, పిట్ట కూడా ఎగిరిపోవలసిందే (2001), చేపచిలుక (2005), అధ్యక్షా మన్నించండి (సంపాదకీయాలు) (2010), గాలిరంగు (2011), గంధకుటి (2009), ఇన్షా అల్లాహ్ (పద్యకావ్యం), Poornamma the golden doll (అనువాదం), The Cobra Dancer (కేజే రావు జీవితకథ) పురస్కారాలు: 1980లో అమ్మచెట్టు కవిత్వానికి ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు.. 1991లో నీటిపుట్ట కవితాసంకలనానికి సినారె కవితాపురస్కారం (కరీంనగర్) వైఎస్ జగన్ అభినందనలు 2017 సంవత్సరానికిగాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు గెలుపొందిన తెలుగు రచయితలు దేవిప్రియ, వీణావల్లభరావులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. సాహిత్యరంగంలో వారికి అవార్డులు రావడం తెలుగుభాషకు గర్వకారణమని వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
దేవిప్రియకు పతంజలి సాహితీ పురస్కారం
విజయనగరం పూల్‌బాగ్ (విజయనగరం): పతంజలి సాహితీ పురస్కారానికి ప్రముఖ రచయిత, పత్రికల్లో రన్నింగ్ కామెంటరీ కాలమ్, గరీబు గీతాలు రచించిన దేవిప్రియ ఎంపికయ్యారు. ఈ అవార్డును ఆయనకు ఈ నెల 29న పతంజలి జయంతి సందర్భంగా అందజేయనున్నట్లు కేఎన్‌వై. పతంజలి సాంస్కృ తిక వేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ తెలిపారు. సంస్థ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈ నెల 29న జెడ్పీ సమావేశ మందిరంలో దేవిప్రియకు ఈ పురస్కారం అందజేస్తామని తెలిపారు. అదే రోజు ఉదయం 9 గంటలకు గురజాడ గ్రంథాలయం వద్ద పతంజలి విగ్రహం ఆవిష్కరణ ఉంటుందని చెప్పారు.