సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: ప్రముఖ కవి, రచయిత దేవిప్రియను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం–2017 వరించింది. ఆయన పద్యకావ్యం ‘గాలిరంగు’ తెలుగు నుంచి ఉత్తమ కవితా సంపుటి విభాగంలో పురస్కారానికి ఎంపికైంది. కేంద్ర సాహిత్య అకాడమీ ఏటా అందించే వార్షిక అవార్డులను గురువారం ఢిల్లీలో ప్రకటిం చింది. మొత్తం 24 భాషల్లో ఉత్తమ రచనలను పురస్కారాలకు ఎంపిక చేసింది. అకాడమీ చైర్మన్ ప్రొఫెసర్ విశ్వనాథ్ ప్రసాద్ తివారీ అధ్యక్షతన సమవేశమైన కార్యవర్గ బోర్డు తీసుకున్న నిర్ణయాలను కార్యదర్శి కె. శ్రీనివాసరావు ఈ మేరకు మీడియాకు వెల్లడించారు. ప్రతి భాష నుంచి ముగ్గురు చొప్పున జ్యూరీ సభ్యులతో కూడిన కమిటీ ఉత్తమ రచనలను ఎంపిక చేసింది.
తెలుగు నుంచి జ్యూరీ కమిటీలో ఎ.ఎన్. జగన్నాథశర్మ, కె.శివారెడ్డి, డాక్టర్ సంపత్ కుమార్ సభ్యులుగా వ్యవహరించారు. అనువాద రచన ఎంపిక జ్యూరీలో ‘అంపశయ్య’నవీన్, బండ్ల మాధవరావు, డాక్టర్ జె.ఎల్. రెడ్డి సభ్యులుగా పనిచేశారు. అవార్డులను ఫిబ్రవరి 12న ఢిల్లీలోని అకాడమీ కేంద్రంలో జరిగే ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ కార్యక్రమంలో ప్రదానం చేయనున్నారు. ఉత్తమ కవితా సంపుటికి రూ. లక్ష, ఉత్తమ అనువాద రచనకు రూ. 50 వేల చొప్పున నగదు బహుమతిని అందించనున్నారు. మరోవైపు కేంద్ర సాహిత్య అకాడమీ ఉత్తమ అనువాద రచనగా తెలుగు నుంచి వెన్న వల్లభరావు అనువదించిన ‘విరామం ఎరుగని పయనం’రచనకు అవార్డు లభించింది. ప్రముఖ పంజాబీ రచయిత్రి అజీత్ కౌర్ జీవితకథ ‘ఖానాబదోష్’ను వల్లభరావు తెలుగులో ‘విరామం ఎరుగని పయనం’గా అనువదించారు.
రన్నింగ్ కామెంటరీ కవిగా సుపరిచితులు...
దైనందిన రాజకీయ, సాంఘిక పరిస్థితుల్ని ప్రతిబింబిస్తూ ‘రన్నింగ్ కామెంటరీ’ కవిగా సుపరిచుతులైన దేవిప్రియ 1951 ఆగస్టు 15న గుంటూరు జిల్లాలో జన్మించారు. సినీరంగంతో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన దేవిప్రియ... జర్నలిజంలో స్థిరపడి వివిధ పత్రికలకు ఎడిటర్‌గా పనిచేశారు. ‘అమ్మ చెట్టు’ మొదలుకొని ‘గాలిరంగు’ వరకు మొత్తం ఏడు కవితా సంపుటాలను రచించారు. ప్రజాగాయకుడు గద్దర్‌పై ఆంగ్ల డాక్యుమెంటరీ చిత్రం ‘మ్యూజిక్ ఆఫ్ ఎ బ్యాటిల్‌షిప్’ను నిర్మించి దర్శకత్వం వహించారు. దాసి, రంగుల కల వంటి చిత్రాలకు స్క్రీన్‌ప్లే అందించి జాతీయ బహుమతులు అందుకున్నారు. కవిగా, పాత్రికేయుడిగా, సంపాదకుడిగా, సినీ గేయ రచయితగా, డాక్యుమెంటరీ రూపకర్తగా, టీవీ చానల్ కంటెంట్ విభాగాధిపతిగా వైవిధ్య ప్రక్రియల్లో ఆయన పేరొందారు. నాలుగు దశాబ్దాలకుపైగా తెలుగు కవిత్వానికి, జర్నలిజానికి సేవలందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో స్థిరపడ్డారు.
చాలా సంతోషంగా ఉంది
నేను రాసిన ‘గాలి రంగు’ పద్య కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించడం సంతోషంగా, తృప్తిగా ఉంది. ఏ కవి జీవితంలోనైనా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఒక మైలురాయి. ఈ ఏడాది జ్యూరీగా వ్యవహరించిన పెద్దలకు ధన్యవాదాలు.
– దేవిప్రియ
జగన్ అభినందనలు
ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు దక్కించుకున్న దేవిప్రియ, వెన్న వల్లభరావును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందించారు. తెలుగు భాషా రంగంలో వారు చేసిన కృషికి ఈ అవార్డు రావడం గర్వకారణమని పేర్కొన్నారు. ఈ అవార్డుల ద్వారా తెలుగు కీర్తి దశదిశల విస్తరించిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment