గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అవార్డు.. సీఎం కేసీఆర్‌ హర్షం | MLC Goreti Venkanna Bags Central Sahitya Akademi Award | Sakshi
Sakshi News home page

గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అవార్డు.. సీఎం కేసీఆర్‌ హర్షం

Published Thu, Dec 30 2021 4:18 PM | Last Updated on Thu, Dec 30 2021 5:02 PM

MLC Goreti Venkanna Bags Central Sahitya Akademi Award - Sakshi

సాక్షి, ఢిల్లీ: కేంద్ర సాహిత్య అకాడమీ 2021 సంవత్సరానికి గాను సాహిత్య అకాడమీ అవార్డులను గురువారం ప్రకటించింది. ‘వల్లంకి తాళం’ కవిత్వానికి ఎమ్మెల్సీ, కవి గోరటి వెంకన్న కేం‍ద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికయ్యారు. 'దండకడియం' రచనకు గాను తగుళ్ల గోపాల్‌ సాహిత్య అకాడమీ యువ పురస్కార్ అవార్డు, ‘నేను అంటే ఎవరు’ నాటకానికి దేవరాజు మహారాజు బాల సాహిత్య పురస్కారానికి ఎంపికయ్యారు. ప్రముఖ కవి, శాసన మండలి సభ్యుడు గోరటి వెంకన్నకు  ప్రతిష్టాత్మక ‘కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు-2021’ దక్కడం పట్లసీఎం కేసీఆర్‌ హర్షం వ్యక్తంచేశారు.

‘వల్లంకి తాళం’అనే కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కడం గొప్ప విషయమని అ‍న్నారు. గోరటి వెంకన్నకు ఈ సందర్బంగా సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. దైనందిన జీవితంలోని ప్రజాసమస్యలను సామాజిక తాత్వికతతో కళ్లకు కడుతూ వెంకన్న అందించిన సాహిత్యం ప్రపంచ మానవుని వేదనకు అద్దం పడుతుందని చెప్పారు. 

మానవ జీవితానికి, ప్రకృతికి ఉన్న అవినాభావ సంబంధాన్ని.. మనిషికి ఇతర జంతు పక్షిజీవాలకు ఉన్న అనుబంధాన్ని గోరటి వెంకన్న అత్యున్నతంగా ఆవిష్కరించారని సీఎం కొనియాడారు. తెలంగాణ మట్టి వాసనలను తన సాహిత్యం ద్వారా గోరటి వెంకన్న విశ్వవ్యాపితం చేశారని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కవిగా తన సాహిత్యం ద్వారా గొప్ప పాత్ర పోషించారని తెలిపారు. గోరటి సాహిత్యానికి దక్కిన ప్రతిష్టాత్మక సాహితీ గౌరవం, తెలంగాణ మట్టి మనిషి జీవనతాత్వికకు దక్కిన గౌరవంగా సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ గోరటి వెంకన్న మీడియాతో మాట్లాడుతూ.. తనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు. సాహిత్య అకాడమీ అవార్డు రావడానికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. కార్పొరేటిజం పెరుగుతున్న సమయంలో సాహిత్యానికి గౌవరం పెరగాలని తెలిపారు. కృష్ణశాస్త్రి నుంచి శ్రీశ్రీ వరకు అందరి ప్రభావం తనపై ఉంటుందని చెప్పారు. వాగ్గేయం కుటుంబ నేపథ్యం వల్ల వచ్చిందని, జరుగుతున్న పరిస్థితులను వాగ్గేయం చేయడం కొంత ఇబ్బందేనని పేర్కొన్నారు. ఓటముల నుంచే గెలుపుకు బాట పడుతుందని, తాను రాసిన ప్రతిదీ వ్యక్తిగత అనుభవంతోనే వచ్చిందని తెలిపారు. అదేవిధంగా సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్‌కు సాహిత్యంపై మంచి అవగాహన ఉందని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement