Central Sahitya Akademi award
-
గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అవార్డు.. సీఎం కేసీఆర్ హర్షం
సాక్షి, ఢిల్లీ: కేంద్ర సాహిత్య అకాడమీ 2021 సంవత్సరానికి గాను సాహిత్య అకాడమీ అవార్డులను గురువారం ప్రకటించింది. ‘వల్లంకి తాళం’ కవిత్వానికి ఎమ్మెల్సీ, కవి గోరటి వెంకన్న కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికయ్యారు. 'దండకడియం' రచనకు గాను తగుళ్ల గోపాల్ సాహిత్య అకాడమీ యువ పురస్కార్ అవార్డు, ‘నేను అంటే ఎవరు’ నాటకానికి దేవరాజు మహారాజు బాల సాహిత్య పురస్కారానికి ఎంపికయ్యారు. ప్రముఖ కవి, శాసన మండలి సభ్యుడు గోరటి వెంకన్నకు ప్రతిష్టాత్మక ‘కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు-2021’ దక్కడం పట్లసీఎం కేసీఆర్ హర్షం వ్యక్తంచేశారు. ‘వల్లంకి తాళం’అనే కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కడం గొప్ప విషయమని అన్నారు. గోరటి వెంకన్నకు ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. దైనందిన జీవితంలోని ప్రజాసమస్యలను సామాజిక తాత్వికతతో కళ్లకు కడుతూ వెంకన్న అందించిన సాహిత్యం ప్రపంచ మానవుని వేదనకు అద్దం పడుతుందని చెప్పారు. మానవ జీవితానికి, ప్రకృతికి ఉన్న అవినాభావ సంబంధాన్ని.. మనిషికి ఇతర జంతు పక్షిజీవాలకు ఉన్న అనుబంధాన్ని గోరటి వెంకన్న అత్యున్నతంగా ఆవిష్కరించారని సీఎం కొనియాడారు. తెలంగాణ మట్టి వాసనలను తన సాహిత్యం ద్వారా గోరటి వెంకన్న విశ్వవ్యాపితం చేశారని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కవిగా తన సాహిత్యం ద్వారా గొప్ప పాత్ర పోషించారని తెలిపారు. గోరటి సాహిత్యానికి దక్కిన ప్రతిష్టాత్మక సాహితీ గౌరవం, తెలంగాణ మట్టి మనిషి జీవనతాత్వికకు దక్కిన గౌరవంగా సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ గోరటి వెంకన్న మీడియాతో మాట్లాడుతూ.. తనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు. సాహిత్య అకాడమీ అవార్డు రావడానికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. కార్పొరేటిజం పెరుగుతున్న సమయంలో సాహిత్యానికి గౌవరం పెరగాలని తెలిపారు. కృష్ణశాస్త్రి నుంచి శ్రీశ్రీ వరకు అందరి ప్రభావం తనపై ఉంటుందని చెప్పారు. వాగ్గేయం కుటుంబ నేపథ్యం వల్ల వచ్చిందని, జరుగుతున్న పరిస్థితులను వాగ్గేయం చేయడం కొంత ఇబ్బందేనని పేర్కొన్నారు. ఓటముల నుంచే గెలుపుకు బాట పడుతుందని, తాను రాసిన ప్రతిదీ వ్యక్తిగత అనుభవంతోనే వచ్చిందని తెలిపారు. అదేవిధంగా సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్‌కు సాహిత్యంపై మంచి అవగాహన ఉందని చెప్పారు. -
‘శప్తభూమి’కి సాహిత్య అవార్డు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ తెలుగు రచయిత బండి నారాయణస్వామికి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది. రాయలసీమ చరిత్ర నేపథ్యంగా ఆయన రాసిన ‘శప్తభూమి’నవలకు ఈ గౌరవం దక్కింది. కేంద్ర సాహిత్య అకాడెమీ 23 భారతీయ భాషలలో రచనలకు వార్షిక అవార్డులను బుధవారం ప్రకటించింది. 7 కవితా సంకలనాలు, 4 నవలలు, 6 లఘు కథలు, 4 వ్యాసాలు, ఒక నాన్ ఫిక్షన్, ఒక ఆటోబయోగ్రఫీ, ఒక బయోగ్రఫీని అవార్డుల కోసం ఎంపిక చేసినట్లు అకాడెమీ తెలిపింది. 23 భారతీయ భాషలలో జ్యూరీ సభ్యులు సిఫారసు చేసిన రచనలను అకాడెమీ కార్యనిర్వాహక బోర్డు ఆమోదించి అవార్డులను ప్రకటించింది. తెలుగులో కేతు విశ్వనాథరెడ్డి, శీలా వీర్రాజు, డాక్టర్ వి.చినవీరభద్రుడు జ్యూరీ సభ్యులుగా వ్యవహరించారు. బండి నారాయణస్వామి రాయలసీమ రచయితగా గుర్తింపు పొందారు. శప్తభూమి అంటే శాపగ్రస్త ప్రదేశమని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా, గడ్డం మోహన్‌రావు రాసిన ‘కొంగవాలు కత్తి’నవలకు అకాడెమీ యువ పురస్కార్ లభించింది. ‘తాత మాట వరాల మూట’రచనకు గాను బెలగం భీమేశ్వరరావుకు అకాడెమీ ‘బాల సాహిత్య పురస్కారం’ప్రకటించింది. ధరూర్ పుస్తకం, నంది కిశోర్ కవిత కాంగ్రెస్ నేత, రచయిత శశిథరూర్, నాటక రచయిత నంద కిశోర్ ఆచార్య తదితర 23 మంది రచయితలున్నారు. థరూర్ ఆంగ్లంలో రాసిన ‘యాన్ ఎరా ఆఫ్ డార్క్నెస్’పుస్తకం, నందకిశోర్ ఆచార్య హిందీలో రాసిన ‘చలాతే హుయే ఆప్నే కో’కవితకు ఈ పురస్కారం లభించింది. విజేతలకు వచ్చే ఫిబ్రవరి 25వ తేదీన ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో తామ్ర పత్రంతోపాటు రూ.లక్ష నగదు అందజేస్తారు. ఏపీ సీఎం జగన్ అభినందనలు సాక్షి, అమరావతి: ప్రముఖ రచయిత బండి నారాయణస్వామికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడంపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. ఉపాధ్యాయుడిగా, రచయితగా సమాజాన్ని అధ్యయనం చేస్తూ ఆయన చేసిన రచనలు మరెందరికో స్ఫూర్తినిస్తాయని అన్నారు. -
ఆవేశమే అక్షరం రాయించింది
సాక్షి, న్యూఢిల్లీ: రాయాలన్న ఆవేశమే తనచేత ఇప్పటి వరకు 96 పుస్తకాలు రాసేలా చేసిందని ప్రముఖ రచయిత, పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్ అన్నారు. రాయాల్సిన అవసరం, ఆవేశం, ఆవేదన, సమాజంలో కావాల్సిన పరిణామాలకు హేతువు అయిన దృక్పథం తాను రచనలు చేసేందుకు ప్రేరేపించిందని కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఆయన రచించిన ‘విమర్శిని’వ్యాస రచనకు 2018 ఏడాదికిగానూ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించిన విషయం తెలిసిందే. మంగళవారం ఢిల్లీలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన అకాడమీ అధ్యక్షుడు చంద్రశేఖర్ కంబార్ చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు. అనంతరం మాట్లాడుతూ తన జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో రచనలు, కవిత్వాలు, అనువాదాలు రాసినా ‘విమర్శిని’వ్యాసరచనకు పురస్కారం వరించడం సంతోషంగా ఉందన్నారు. తెలుగు యువత అద్భుతంగా సాహిత్యం రాస్తోందని, వారి నుంచి గొప్ప సాహిత్యం వస్తోందన్నారు. సామాజిక జీవితాన్ని సందర్శించానికి సిద్ధంగా ఉన్న యువత గొప్ప సాహిత్యాన్ని సృష్టించాలని ఆయన ఆకాంక్షించారు. అవార్డు ప్రదానోత్సవం సందర్భంగా కొలకలూరి ఇనాక్ కుమారుడు శ్రీకిరణ్, కుమార్తె ఆశా జ్యోతి, కోడలు అనిత పాల్గొన్నారు. -
దేవిప్రియకు కేంద్ర సాహిత్య పురస్కారం
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: ప్రముఖ కవి, రచయిత దేవిప్రియను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం–2017 వరించింది. ఆయన పద్యకావ్యం ‘గాలిరంగు’ తెలుగు నుంచి ఉత్తమ కవితా సంపుటి విభాగంలో పురస్కారానికి ఎంపికైంది. కేంద్ర సాహిత్య అకాడమీ ఏటా అందించే వార్షిక అవార్డులను గురువారం ఢిల్లీలో ప్రకటిం చింది. మొత్తం 24 భాషల్లో ఉత్తమ రచనలను పురస్కారాలకు ఎంపిక చేసింది. అకాడమీ చైర్మన్ ప్రొఫెసర్ విశ్వనాథ్ ప్రసాద్ తివారీ అధ్యక్షతన సమవేశమైన కార్యవర్గ బోర్డు తీసుకున్న నిర్ణయాలను కార్యదర్శి కె. శ్రీనివాసరావు ఈ మేరకు మీడియాకు వెల్లడించారు. ప్రతి భాష నుంచి ముగ్గురు చొప్పున జ్యూరీ సభ్యులతో కూడిన కమిటీ ఉత్తమ రచనలను ఎంపిక చేసింది. తెలుగు నుంచి జ్యూరీ కమిటీలో ఎ.ఎన్. జగన్నాథశర్మ, కె.శివారెడ్డి, డాక్టర్ సంపత్ కుమార్ సభ్యులుగా వ్యవహరించారు. అనువాద రచన ఎంపిక జ్యూరీలో ‘అంపశయ్య’నవీన్, బండ్ల మాధవరావు, డాక్టర్ జె.ఎల్. రెడ్డి సభ్యులుగా పనిచేశారు. అవార్డులను ఫిబ్రవరి 12న ఢిల్లీలోని అకాడమీ కేంద్రంలో జరిగే ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ కార్యక్రమంలో ప్రదానం చేయనున్నారు. ఉత్తమ కవితా సంపుటికి రూ. లక్ష, ఉత్తమ అనువాద రచనకు రూ. 50 వేల చొప్పున నగదు బహుమతిని అందించనున్నారు. మరోవైపు కేంద్ర సాహిత్య అకాడమీ ఉత్తమ అనువాద రచనగా తెలుగు నుంచి వెన్న వల్లభరావు అనువదించిన ‘విరామం ఎరుగని పయనం’రచనకు అవార్డు లభించింది. ప్రముఖ పంజాబీ రచయిత్రి అజీత్ కౌర్ జీవితకథ ‘ఖానాబదోష్’ను వల్లభరావు తెలుగులో ‘విరామం ఎరుగని పయనం’గా అనువదించారు. రన్నింగ్ కామెంటరీ కవిగా సుపరిచితులు... దైనందిన రాజకీయ, సాంఘిక పరిస్థితుల్ని ప్రతిబింబిస్తూ ‘రన్నింగ్ కామెంటరీ’ కవిగా సుపరిచుతులైన దేవిప్రియ 1951 ఆగస్టు 15న గుంటూరు జిల్లాలో జన్మించారు. సినీరంగంతో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన దేవిప్రియ... జర్నలిజంలో స్థిరపడి వివిధ పత్రికలకు ఎడిటర్‌గా పనిచేశారు. ‘అమ్మ చెట్టు’ మొదలుకొని ‘గాలిరంగు’ వరకు మొత్తం ఏడు కవితా సంపుటాలను రచించారు. ప్రజాగాయకుడు గద్దర్‌పై ఆంగ్ల డాక్యుమెంటరీ చిత్రం ‘మ్యూజిక్ ఆఫ్ ఎ బ్యాటిల్‌షిప్’ను నిర్మించి దర్శకత్వం వహించారు. దాసి, రంగుల కల వంటి చిత్రాలకు స్క్రీన్‌ప్లే అందించి జాతీయ బహుమతులు అందుకున్నారు. కవిగా, పాత్రికేయుడిగా, సంపాదకుడిగా, సినీ గేయ రచయితగా, డాక్యుమెంటరీ రూపకర్తగా, టీవీ చానల్ కంటెంట్ విభాగాధిపతిగా వైవిధ్య ప్రక్రియల్లో ఆయన పేరొందారు. నాలుగు దశాబ్దాలకుపైగా తెలుగు కవిత్వానికి, జర్నలిజానికి సేవలందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. చాలా సంతోషంగా ఉంది నేను రాసిన ‘గాలి రంగు’ పద్య కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించడం సంతోషంగా, తృప్తిగా ఉంది. ఏ కవి జీవితంలోనైనా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఒక మైలురాయి. ఈ ఏడాది జ్యూరీగా వ్యవహరించిన పెద్దలకు ధన్యవాదాలు. – దేవిప్రియ జగన్ అభినందనలు ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు దక్కించుకున్న దేవిప్రియ, వెన్న వల్లభరావును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందించారు. తెలుగు భాషా రంగంలో వారు చేసిన కృషికి ఈ అవార్డు రావడం గర్వకారణమని పేర్కొన్నారు. ఈ అవార్డుల ద్వారా తెలుగు కీర్తి దశదిశల విస్తరించిందన్నారు. -
పాపినేనికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
-
పాపినేనికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
- ’రజనీగంధ’ కవితా సంకలనంతో అవార్డుకు ఎంపిక - నాగళ్ల గురుప్రసాద్‌కు భాషా సమ్మాన్ పురస్కారం - 24 భాషల్లో ప్రసిద్ధ సాహితీవేత్తలకు అవార్డులు ప్రకటించిన అకాడమీ సాక్షి, న్యూఢిల్లీ/ తెనాలి : ధిక్కరించకపోతే, దిక్కులు దద్దరిల్లేటట్టు పొలికేక పెట్టకపోతే అది కవిత్వం ఎట్లా అవుతుందని ప్రశ్నించిన కవి డా.పాపినేని శివశంకర్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. రజనీగంధ కవితా సంకలనానికి గాను ఈయనకు ఈ అవార్డును ప్రకటించారు. సాహిత్య రంగంలో విశేష కృషి చేసిన నాగళ్ల గురు ప్రసాద్‌రావ్‌కు భాషా సమ్మాన్ అవార్డును ప్రకటించారు. బుధవారం కేంద్ర సాహిత్య అకాడమి 2016 వార్షిక అవార్డులను ప్రకటించింది. కవిత్వానికి ఎనిమిది మందికి, ఏడుగురు కథకులకు, ఐదుగురు నవలా రచయితలకు, ఇద్దరు విమర్శకులకు, ఒక వ్యాసకర్తకు, ఒక నాటక రచయితకు మొత్తం 24 మందికి ఈ సంవత్సరం అవార్డులు లభించాయి. అద్భుత కవిత్వాలు రాసిన ఎనిమిది మంది కవులలో పాపినేని శివశంకర్ ఒకరు. జీవితం ఒక అద్భుత పుష్పం వికసించే ప్రక్రియ, డొల్ల మనుషులే ఇమేజ్ కల్పించుకుంటారు.. మూర్ఖులు దాన్ని ఆరాధిస్తారు అంటూ రజనీగంధలో ఆయన కవిత్వం రాశారు. ప్రతి భాషలో ముగ్గురు సభ్యుల జ్యూరీ సిఫారసుల మేరకు అవార్డు గ్రహీతల ఎంపిక జరిగింది. 2010 జనవరి నుంచి 2014 డిసెంబర్ వరకు ప్రచురితమైన రచనలను పరిగణనలోకి తీసుకుని అవార్డు గ్రహీతలను ఎంపిక చేశారు. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 22న జరిగే అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో అవార్డులకు ఎంపికైనవారికి తామ్ర పత్రంతో పాటు లక్ష రూపాయల చెక్కును బçహూకరిస్తారు. భాష సమ్మాన్ అవార్డుకు ఎంపికైన నాగళ్ల గురు ప్రసాద్‌రావ్ సాహిత్య రంగంలో విశేష కృషి చేశారు. విజయవాడ లయోలా కళాశాల, గుంటూరు జేకేసీ కళాశాలలో ఆయన తెలుగు బోధించారు. ఉద్యోగ విరమణ తర్వాత విజయవాడలోని సిద్ధార్థ కళాపీఠానికి రెండు దశాబ్దాలపాటు కార్యదర్శిగా సేవలందించారు. శాలివాహనుడు, ఇద్దరు మహాకవులు లాంటి రచనలు చేశారు. కన్నడ భాషలో మహ్మద్ కున్హీ రచించిన స్వతంత్రయాద వోటా నవల, తమిళంలో వన్నధాసన్ రచించిన ఓరు సిరు ఇసై (చిన్న కథ) అవార్డుకు ఎంపికయ్యాయి. అవార్డుల ప్రకటన సందర్భంగా కొత్త సంవత్సరం డైరీ, క్యాలెండర్‌ను అకాడమీ కార్యదర్శి డా.శ్రీనివాస రావు విడుదల చేశారు. గతంలో ’అసహనం’తో సాహిత్య అకాడమీ అవార్డులను తిరిగి ఇచ్చిన వారిని.. ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని కోరామన్నారు. మూడు ప్రక్రియల్లో పాపినేని ప్రతిభావంతమైన కృషి గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం నెక్కల్లు గ్రామంలో 1953 నవంబరు 6న రైతుబిడ్డగా జన్మించిన పాపినేని శివశంకర్ మూడున్నర దశాబ్దాలుగా కథ, కవిత్వం, విమర్శ అనే మూడు ప్రక్రియల్లో ప్రతిభావంతమైన కృషి చేస్తున్నారు. నెక్కల్లు, తుళ్లూరులో పాఠశాల విద్య, గుంటూరులో బీఏ, ఎంఏ చేశారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ’సాహిత్యం–మౌలిక భావనలు’పై పరిశోధన చేశారు. బీఏ, ఎంఏ, పీహెచ్‌డీల్లో స్వర్ణపతకాలు సాధించారు. 1977 నుంచి తాడికొండలోని వీఎస్‌ఎస్‌బీ కాలేజీలో తెలుగు అధ్యాపకుడిగా, ప్రిన్సిపల్‌గా పనిచేశారు. వీరి సహ సంపాదకత్వంలో వార్షిక కథ, కవితా సంకలనాలు వెలువడుతున్నాయి. కవితా! ఓ కవితా! విస్మృత కథ, రైతుకవిత సంకలనాలకు ముఖ్యసంపాదకుడు. ఫ్రీవర్స్ ఫ్రంట్, తెలుగు విశ్వవిద్యాలయం, ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం, విశాలాంధ్ర, నాగభైరవ కళాపీఠం సంస్థల పురస్కారాలను పొందారు. దేవరకొండ బాలగంగాధర తిలక్ అవార్డు, డాక్టర్ సి.నారాయణరెడ్డి, డాక్టర్ అవంత్స సోమసుందర్ కవితా పురస్కారాలు, రాష్ట్ర ప్రభుత్వ ఉగాది విశిష్ట పురస్కారం వంటి గౌరవాలు ఆయన్ను వరించాయి. స్తబ్ధతా చలనం, ఒక సారాంశం కోసం, ఆకుపచ్చని లోకంలో, ఒక ఖడ్గం–ఒక పుష్పం, రజనీగంధ.. ఆయన కలం నుంచి వెలువడిన కవితా సంపుటాలు. తల్లీ నిన్ను దలంచి, సాహిత్యం– మౌలిక భావనలు, సగం తెరచిన తలుపు లాంటి ఎన్నో గొప్ప రచనలు చేశారు. వివిధ రంగాలకు చెందిన మేధావులు, విలక్షణమైన వ్యక్తులకు సంబంధించిన భిన్నమైన శిల్పంతో కూడిన కవితలివి. పెట్టుబడిదారీ నాగరికత, ప్రపంచీకరణ నేపథ్యంలో మానవ సంబంధాలు విచ్ఛిన్నం కావడం తననెంతో కలవరపెట్టినట్టు పాపినేని చెప్పారు. ఆ క్రమంలోనే మానవ సంబంధాల్లోని అసహజత్వం/ కృత్రిమత్వం, స్వేచ్ఛారాహిత్యంపై కూడా కథలు, కవితలు రాశారు. మృగ్యమవుతున్న మానవ సంబంధాలను ఎలా కాపాడుకోవాలి? అనేది ’రజనీగంధ’ కవితల్లో కనిపిస్తుంది. జగన్ అభినందనలు సాక్షి, హైదరాబాద్: కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికైన డాక్టర్ పాపినేని శివశంకర్, భాష సమ్మాన్ అవార్డుకు ఎంపికైన నాగళ్ల గురు ప్రసాద్రావ్లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. తెలుగు సాహిత్యానికి వారు అందించిన సేవలను ఈ సందర్భంగా వైఎస్ జగన్ కొనియాడారు. కృషికి తగిన ఫలితం: నాగళ్ల విజయవాడ కల్చరల్: అవార్డుల కోసం తాను ఏనాడు ఎదురు చూడలేదని, తాను చేస్తున్న సాహిత్య సేవకు ప్రభుత్వం గుర్తింపు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని నాగళ్ల గురు ప్రసాద్ చెప్పారు. భాషా సమ్మాన్ పురస్కారం వస్తుందని ఊహించ లేదని, తాను ఇంతకాలం చేసిన సాహిత్య సేవకు గుర్తింపు రావడం ఆనందంగా ఉందన్నారు. విజయవా డ లయోలా కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా కెరీర్ ప్రారంభించి అంచలంచెలుగా ఎదిగి పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్సు కళాశాలకు ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. -
రచయిత ఎలా బతకాలో అలా బతికాడు...
జయకాంతన్‌కు నలభై ఏళ్ల వయసు లోపలే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. అప్పుడాయన ఒకచోట రాసుకుంటూ ‘ప్రపంచ కథాసాహిత్యంలో నేను ముఖ్యుణ్ణి’ అని చెప్పుకున్నాడు. అది అతివిశ్వాసం కాదు. ఆత్మవిశ్వాసమూ కాదు. తనను తాను తెలుసుకోవడం. ఆ మాటకొస్తే ఆ సంగతి పాఠకులకు కూడా తెలుసు. అవును. ప్రపంచ సాహిత్యంలో ఆయనొక ముఖ్య రచయిత. తమిళులు తమవారిని గొప్పవారిగా తయారు చేసుకోరు. కాని వారి గొప్పతనం ఏమిటంటే తమవారిలోని గొప్పతనాన్ని వారు గుర్తిస్తారు. సాహిత్యంలో అడుగుపెట్టినప్పటి నుంచి జయకాంతన్ ప్రభావాన్ని తమిళులు ఏ మాత్రం ఆలస్యం లేకుండా గుర్తించారు. ఆయన రచనలను ఆదరించారు. ‘ప్రొఫెషనల్ రైటర్‌గా ఒక మనిషి బతకొచ్చు అని నేను నిరూపించాను’ అని జయకాంతన్ అనగలిగారంటే అందుకు తమిళ పాఠకులు ఆయన పట్ల చూపిన ఆదరణే కారణం. నాకు జయకాంతన్ 1975లో పరిచయం. నేరుగా కాదు. తన రచనల ద్వారా. అప్పుడు మా నాన్న మధురాంతకం రాజారాం జయకాంతన్ కథలను నేషనల్ బుక్‌ట్రస్ట్ కోసం అనువాదం చేయడం మొదలుపెట్టారు. ఆయన సగం సగం చేసి పక్కన పెట్టిన అనువాదాలను నేను చదువుతుండేవాణ్ణి. అప్పుడు నా వయసు 18 ఏళ్లే అయినా ఒక పద్దెనిమిదేళ్ల వయసున్న కుర్రవాణ్ణి ఒక ఆరోగ్యవంతమైన సృజనా ప్రపంచంలోకి జయకాంతన్ ఈడ్చుకెళ్లిన తీరు నేను మర్చిపోలేను. ఆయనవి ‘షోయింగ్ స్టోరీస్’. అంటే కళ్లకు కట్టినట్టుగా రాసే రచయిత. అందువల్లే మా నాన్నను అనువాదం పూర్తి చేయమని వెంట పడి మరీ ఆ కథలను చదివేవాణ్ణి. అలా నేను చదివిన జయకాంతన్ మొదటి కథ ‘అగ్నిప్రవేశం’. ఇందులో వాన కురుస్తున్న రోజు ఒక కాలేజీ అమ్మాయికి ఒక డబ్బున్న వ్యక్తి లిఫ్ట్ ఇస్తాడు. కారు లోపల ఏం జరిగింది? అత్యాచారం జరిగిందా లేదా అనేది రచయిత చెప్పడు. లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి మంచివాడు. అతడి లోపల ఉద్దేశం ఉంది. కాని గట్టిగా ప్రయత్నించాడో లేదో రచయిత చూపడు. కాని అమ్మాయి ఏడుస్తూ ఇంటికి వస్తే, ఆ దిగువ మధ్యతరగతి ఇంటిలో, ఆ తల్లి రాద్ధాంతం చేయదు. కూతురిని స్నానాల గదిలోకి తీసుకెళ్లి పెద్ద చెర్వ నిండుగా నీళ్లు కుమ్మరించి ‘నీకేం కాలేదుపో. నువ్వు పునీతవయ్యావు పో’ అంటుంది. ఈ కథనే విస్తరించి కొన్నాళ్లకు ఆయన ‘కొన్ని సమయాలు కొందరు మనుషులు’గా రాశాడు. విశేష ఆదరణ పొందింది. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే మరి కొన్నాళ్లకు ఈ నవలకే సీక్వెల్‌గా ‘గంగ ఎక్కడికి వెళుతోంది’ పేరుతో మరో నవల రాశాడు. జయకాంతన్‌ను చూసి ప్రతి రచయిత నేర్చుకోవలసింది అదే. ప్రయోగం. ఆయన నిత్య ప్రయోగశాలి. ఏ రోజైతే కొత్తది మానేస్తామో ఆ రోజున మనం నిర్జీవం అయ్యామని అర్థం. జయకాంతన్ కథలన్నీ నాకు కంఠోపాఠం. ‘నేనున్నాను’, ‘గురుపీఠం’, ‘ఒక పగటివేళ పాసింజర్లో’, ‘నందవనంలో ఆండీ’, ‘చీకట్లోకి’, ‘అగ్రహారంలో పిల్లి’, ‘శిలువ’... ఆయన కథల్లో ‘మౌనం ఒక భాష’ అనే కథ ఉంది. ఒక బ్రాహ్మణ కుటుంబంలో తల్లి, కూతురు ఒకేసారి గర్భవతులవుతారు. ఇందుకు తల్లి సిగ్గుతో చితికిపోతుంది. కూతురి ముందుకు ఎలా రావడం? అప్పుడు రచయిత సాంత్వనం పలుకుతాడు. ‘పర్లేదులేమ్మా... పనసచెట్టుకు మొదట్లో కూడా కాయలు కాస్తాయి... తప్పులేదు’ అంటాడు. ఆయన మరో కథ ‘బ్రహ్మోపదేశం’. అందులో జీవితాంతం మంత్రోచ్ఛారణ చేసిన ఒక బ్రాహ్మణుడు చివరకు తనకు మంత్రాలు రావని గ్రహించి, వాటి అసలైన అర్థాలు పరమార్థాలు అవసరాలు ఏమీ తెలియవని గ్రహించి, జంధ్యం తెంచి పడేసి అంతర్థానం అయిపోతాడు. అలాంటి విప్లవాత్మకమైన కథలు జయకాంతన్ ఎన్నో రాశాడు. ఒక చెట్టును పెకలించి చూసినప్పుడు దాని కుదుళ్లతో పాటు మట్టిపెళ్లలు తేమ అంతా అంటుకుని దర్శనమిచ్చి నట్టుగా జయకాంతన్ ఏది రాసినా లోలోపలి నుంచి ఏదో పెళ్లగించి చూపినట్టుగా లోతుగా, విస్తృతంగా, దిగ్భ్రమగా ఉంటుంది. స్త్రీల గురించి, వారి చుట్టూ ఏర్పరచిన పవిత్రత గురించి పేరుకొని ఉన్న కొన్ని అభిప్రాయాలను బోర్లగించినవాడు జయకాంతన్. దాదాపు 200 కథలు, 25 నవలలు... ఇవిగాక వ్యాసాలు... సినిమా స్క్రిప్ట్‌లు... సినిమాకు దర్శకత్వాలు... ఎన్నని. మనం గ్రహించాల్సింది ఏమిటంటే ఏ వైటాలిటితో ఆయన బయలుదేరాడో చివరివరకూ ఆయన దానిని కాపాడుకుంటూనే వచ్చాడు. బహుముఖాలుగా... వేయి బాహువు లుగా... ఏ రచయిత అయినా అలా జీవించాలి. ఆయన రచన ఆధారంగా వచ్చిన సినిమాని ఒకసారి టీవీలో చూసి ఇది ఏ నవల అనే అన్వేషణ సాగించాను. చివరికి అది ‘ఒక నటి నాటకం చూస్తోంది’ నవల అని తెలిసింది. మిత్రులు జిల్లేళ్ల బాలాజీ దానిని ‘కల్యాణి’ పేరుతో అనువాదం చేసినప్పుడు చాలా సంతోషం కలిగింది. దానికే కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చినప్పుడు మరింత సంతోషం కలిగింది. అది పుస్తకంగా వెలువడుతున్న సందర్భంగా చెన్నైలో ఆయనను కలవాలని జిల్లేళ్ల బాలాజీ, సుంకోజి దేవేంద్రాచారి, నేనూ తిరుపతి నుంచి వెళ్లాం. ఆయన తన ఇంటి మూడో ఫ్లోర్ మీద టీస్టాల్ వంటి ఒక తాటిపాక వేసుకొని ఎక్కువ భాగం అక్కడే గడుపుతూ ఉన్నాడు. మేం వచ్చామని తెలిసి ఆ తాటిపాకలోనే కూచోబెట్టి కాసేపటికి లుంగీ, గళ్ల చొక్కా మీద వచ్చి కూచున్నాడు. అంత పెద్ద రచయిత అయినా మా స్థాయికి దిగి ఎన్ని కబుర్లు చెప్పాడో ఎంత సంతోషం పొందాడో చెప్పలేను. అయితే ఆయన అందరినీ రచయితలుగా గుర్తిస్తాడని చెప్పలేము. అన్నాదురై, కరుణానిధి వంటి మహామహులను కూడా వారు రచయితలే కాదు అని తేల్చి చెబుతాడాయన. ఆయనకు ఇష్టమైన కవి కన్నదాసన్. అయినప్పటికీ జయకాంతన్ ధోరణిని అందరూ స్వీకరించారు. ఆయన స్టైల్‌ని హీరో పాత్రలకు ఆపాదించారు. జయకాంతన్వి పెద్ద పెద్ద మీసాలు. మాతో మాట్లాడుతున్నంత సేపు వాటిని మెలి తిప్పుకుంటూనే ఉన్నాడు. అయితే ఆ చేష్ట మాకు పొగరుగా, అహంకారంగా అనిపించలేదు. ముచ్చటగొలిపేదిగానే ఉంది. ఎందుకంటే మా ఎదురుగా ఉన్నది ఒక కథావీరుడు అని మాకు తెలుసు. అవును. ఆయన కథావీరుడే. ఇప్పుడే కాదు మరో వందేళ్లకు కూడా భారతీయ సాహిత్యంలో మనం మళ్లీ చూడలేని ఒక అరుదైన సాహితీ వీరుడు- జయకాంతన్. - మధురాంతకం నరేంద్ర 9866243659 మనం గ్రహించాల్సింది ఏమిటంటే ఏ వైటాలిటితో ఆయన బయలుదేరాడో చివరివరకూ ఆయన దానిని కాపాడుకుంటూనే వచ్చాడు. బహుముఖాలుగా... వేయి బాహువులుగా... ఏ రచయిత అయినా అలా జీవించాలి. -
విమర్శలో రాచ‘పాళీ’యం
పద్నాలుగేళ్ల్ల విరామం తర్వాత రాయలసీమ సాహిత్య విమర్శకునికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. మాటల్లో చేతల్లో తనువెత్తు ఆదర్శం రాచపాళెం. గత 42 ఏళ్లుగా సుదీర్ఘ కాలం విరామం పాటించకుండా విమర్శా సాహిత్యం అందిస్తున్న నిబద్ధ, మార్క్సిస్ట్ సాహిత్యకారుడాయన. ఆయన పేరు రాచపాళెం చంద్రశేఖరరెడ్డి. ఆయన రచించిన ‘మన నవలలు-మన కథాని కలు’ పుస్తకానికి, జీవిత కాల సాహిత్య కృషికి గుర్తింపుగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించింది. 2014వ ఏడాదికి ఇచ్చే ఈ అవార్డు ఆయనకు న్యూఢిల్లీలో జనవరి 9న ప్రదానం చేస్తారు. 42 ఏళ్ల క్రితం 1972 అక్టోబర్ నెలలో ‘స్రవంతి’ మాసపత్రికలో ‘సినిమా కవిత్వం’ మీద రాచపాళెం తొలి విమర్శా వ్యాసం అచ్చయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 36 గ్రంథాలు రచించారు. దాదాపు 3,500 పేజీల సాహిత్య విమర్శ రాశారు. సాహిత్యం ఇచ్చిన సంస్కారం రాచపాళెంలోని సంస్కర్తను తట్టి లేపింది. చిత్తూరు జిల్లా కుంట్రపాకం గ్రామంలోని సామాన్య రైతు కుటుంబంలో 1948 అక్టోబర్ 16న రాచపాళెం చంద్రశేఖరరెడ్డి జన్మించారు. తల్లిదండ్రులు రాచపాళెం రామిరెడ్డి, మంగమ్మలు. కుంట్రపాకం, కట్టకింద వెంకటాపురం, తిరుపతిలో ప్రాథమిక, ఉన్నత విద్య, శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీలో పీహెచ్డీ చేశారు. ఆ తర్వాత 1977 ఆగస్టు 25న శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, అనంతపురంలో తెలుగు లెక్చరర్‌గా ఉద్యోగంలో చేరారు. 31 ఏళ్లపాటు అనంతపురంలో పనిచేసి 2008లో ఉద్యోగ విరమణ చేశారు. ఆపై కడపలోని యోగివేమన విశ్వవిద్యాలయం తెలుగుశాఖలోను, సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం ప్రధాన బాధ్యులుగా గత 6 ఏళ్లుగా సేవలందిస్తున్నారు. రాచపాళెం అనంతపురంలో ఆచార్యునిగా పని చేస్తున్న కాలంలోనే లక్ష్మీ కాంతమ్మతో పెండ్లి జరిగింది. అప్పట్లో ఆయన పచ్చి భావవాది. సరిగా ఆ కాలంలో గురజాడ కన్యాశుల్కంపై విద్యార్థులకు ఏకంగా నాలుగేళ్లపాటు పాఠం చెప్పాల్సివచ్చింది. దాంతో కన్యాశుల్కం నాటకానికి సంబంధించిన విమర్శనా గ్రంథాలు అధ్యయనం చేయడంతో తనలో కొత్త ఆలోచనలు రేకెత్తాయి. ఆలోచనలు మారాయి. పైగా అనంతపురంలో జనవిజ్ఞాన వేదిక, అభ్యుదయ రచయితల సంఘం, విశాలాంధ్ర, సీపీఎం, సీసీఐ నాయకులతో పరిచయాలు మార్క్సిస్టుగా ఆయన్ను తేర్చాయి. ఈ క్రమంలో కులాంతర మతాంతర వివాహాలు నిర్వహించారు. గుర్రంజాషువా విగ్రహం ఏర్పాటులో ప్రధాన భూమిక నిర్వహించారు. ఈ ప్రభావంతో కూతురు శ్రీవిద్యకు నారాయణ స్వామితో కులాంతర వివాహం, అలాగే కుమారుడు ఆనందకుమార్‌కు సుధా లావణ్యతో మతాంతర వివాహం చేశారు. అవార్డు గ్రంథం మన నవలలు-మన కథానికలు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఏకగ్రీవంగా న్యాయనిర్ణేతలు ఎంపిక చేసిన గ్రంథం ‘మన నవలలు- మన కథానికలు’. ఈ పుస్తకంలోని 24 వ్యా సాలు 13 ఏళ్ల సాహిత్య అధ్యయన కృషికి అక్షరరూపం. అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాలకు చెందిన ప్రాతినిధ్య నవలలు, కథానికల మీద చేసిన మూల్యాంకనం, పునర్ మూల్యాంకనాలే ఇందులో ఉన్నాయి. ఈ పుస్త కంలో మాస్టర్పీస్లు రెండు ఉన్నాయి. అవి ఒకటి. ‘సామాజిక ఉద్యమాలు- తెలుగు కథానికా వికాసం’. ఈ వ్యాసంలో సంఘసంస్కరణ ఉద్యమం నుండి ప్రపంచీకరణ నేపథ్యం వరకు తెలుగు కథానిక ఎలా వికసించిందో చెప్పారు. రెండు. ‘అయ్యో పాపం నుండి ఆగ్రహం దాకా తెలుగు దళిత కథానిక’. ఈ వ్యాసంలో 1925-2008 మధ్య 9 దశాబ్దాలలో దళిత జీవితం వస్తువుగా వచ్చిన కథానికల్ని చారిత్రక దృక్పథంతో అధ్యయనం చేశారు. దళిత సాహిత్య విమ ర్శలో ఈ వ్యాసం కలికితురాయి. జాతీయస్థాయిలో ప్రతిష్టాత్మకమైన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికైన చంద్రశేఖరరెడ్డికి అభినందనలు. - శశిశ్రీ (వ్యాసకర్త రచయిత, పత్రికా సంపాదకుడు) ఫోన్: 9347914465 -
ఆచార్య రాచపాళెంకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
‘మన నవలలు, మన కథానికలు’ విమర్శనా గ్రంథానికి గుర్తింపు రాచపాళెంకు అభినందనలు తెలిపిన జగన్ సాక్షి, కడప/ తిరుపతి: రాష్ట్ర స్థాయిలో ఉత్తమ విమర్శకునిగా విశేష గుర్తింపు సాధించిన ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డిని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. ఆయన రాసిన ‘మన నవలలు, మన కథానికలు’ పుస్తకానికి ఉత్తమ విమర్శకుడిగా ఈ పురస్కారం దక్కింది. దేశవ్యాప్తంగా సాహిత్యంలో విశేష సేవలు అందించిన 24 మంది ప్రముఖులకు అకాడమీ శుక్రవారం అవార్డులు ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి తొమ్మిదో తేదీన జరగనున్న అకాడమీ వార్షికోత్సవ వేడుకల్లో పురస్కారాల ప్రదాన కార్యక్రమం ఉంటుందని అకాడమీ కార్యదర్శి కె.శ్రీనివాసరావు న్యూఢిల్లీలో వెల్లడించారు. రాచపాళెం చంద్రశేఖరరెడ్డి 1948 అక్టోబర్ 16న చిత్తూరుజిల్లా, తిరుపతి రూరల్ మండలం కుంట్రపాకంలో మంగమ్మ, రామిరెడ్డిలకు జన్మించారు. ఎస్వీ, ఎస్కే విశ్వవిద్యాలయాలలో తెలుగుశాఖలో వివిధ హోదాల్లో పనిచేశారు. వైఎస్సార్ జిల్లాలోని యోగివేమన యూనివర్సిటీనుంచి పదవీ విరమణ చేసి ప్రస్తుతం సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రానికి ప్రధాన బాధ్యులుగా సేవలంది స్తున్నారు. అరసం ఏపీ అధ్యక్షులుగా, జన విజ్ఞాన వేదిక గౌరవాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర సాహిత్య లోకంలో ఉత్తమ స్థాయి రచయితగా, నిబద్ధత గల విమర్శకునిగా ఆయనకు విశేషమైన గుర్తింపు ఉంది. రాయలసీమ రైతు జీవితాన్ని ప్రతిబింబించేలా ‘పొలి’ పేరిట దీర్ఘ కవితను సైతం వెలువరించారు. ప్రముఖ సీనియర్ కథా రచయిత కాళీపట్నం రామారావు ఏర్పాటు చేసిన ‘కథా నిలయం’ ప్రారంభించిన అరుదైన గౌరవం ఆయనకు దక్కింది. ఆయన దశాబ్ది తెలుగు కథ పేరిట 50 సంవత్సరాల తెలుగు సాహిత్యంపై విద్యార్థులతో పరిశోధనలు చేయించారు. 28 సాహిత్య గ్రంథాలు, పలు అనువాద గ్రంథాలు వెలువరించారు. ఆయన నేతృత్వంలో 25మంది పీహెచ్‌డీలు, 20 మంది ఎంఫిల్ చేశారు. సీమ సాహితి పత్రికకు సంపాదకత్వం వహించారు. పలు రాష్ట్ర, జాతీయ, సాహితీ సదస్సులు, ప్రముఖ కవుల శతజయంతి ఉత్సవాలు నిర్వహించారు. రాచపాళెంకు జగన్ అభినందన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికైన ప్రముఖ రచయిత రాచపాళెం చంద్రశేఖరరెడ్డికి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. చంద్రశేఖరరెడ్డి అవార్డుకు ఎంపిక కావడమనేది ఆయనకు లభించిన సరైన గుర్తింపు అని జగన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాయలసీమ సాహితీ ఉద్యమంలో, అభ్యుదయ రచయితల సంఘంలోనూ రాచపాళెం ప్రముఖ భూమిక పోషిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఒక ప్రకటనలో ప్రశంసించారు. ఉత్తమ సమాజం కోసం ఉత్తమ విమర్శ: రాచపాళెం సాహిత్యం సమాజం నుంచి, సమాజం కోసమే పుడుతుంది. ఆకాశం నుండి ఊడిపడదు. సాహిత్యం జీవితానికి ప్రతిబింబం లాంటిది. దాన్ని శాస్త్రీయంగా వ్యాఖ్యానిస్తే విమర్శ అవుతుంది. ‘మంచి సమాజం కావాలంటే మంచి సాహిత్యం రావాలి. మంచి సాహిత్యం రావాలంటే మంచి సాహిత్య విమర్శ కావాలి’ అన్నారు ప్రముఖ సీనియర్ రచయిత కొడవటిగంటి కుటుంబరావు. నేను ఈ మాట నుంచే విమర్శన రంగంలోకి వచ్చేందుకు స్ఫూర్తి పొందాను. -
‘విమర్శ’కు పురస్కారం
సాహిత్య విమర్శకుడు రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు బాధ్యతను మరింత పెంచిందన్న అవార్డు గ్రహీత తిరుచానూరు/తిరుపతి తుడా : ప్రతిష్టాత్మకమైన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కడం తన బాధ్యతను మరింత పెంచడమేనని అవార్డు గ్రహీత యోగి వేమన యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. కేంద్ర సాహిత్య అకాడమీ శుక్రవారం ఆయనకు అవార్డును ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాచపాళెం మాట్లాడుతూ ఈ అవార్డు సాహితీ విమర్శక ప్రపంచానికి వచ్చినట్లుగా భావిస్తున్నానని తెలిపారు. ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు. తాను చేయాల్సిన, తన ముందు ఉన్న కర్తవ్యాన్ని అవార్డు గుర్తు చేస్తోందని చెప్పారు. 42 సంవత్సరాలుగా తెలుగు సాహిత్య విమర్శపై రచనలు చేసినట్లు తెలిపారు. మొత్తం 19సాహిత్య విమర్శలు రాశానన్నారు. ఇదీ రాచపాళెం ప్రస్థానం.. తిరుపతి రూరల్ మండలం కుంట్రపాకం గ్రామంలో 16-10-1948లో రామిరెడ్డి, రాజమ్మ దంపతులకు రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి జన్మించారు. ప్రాథమిక విద్యను కుంట్రపాకం, ఉన్నత విద్యను వెంకటాపురం, తిరుపతి నెహ్రూ మున్సిపల్ హైస్కూల్లో అభ్యసించారు. తిరుపతి ఎస్వీ జూనియర్ కళాశాలలో ఇంటర్, ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ చేశారు. 1970-72లో ఎస్వీయూలో ఎంఏ తెలుగు చేశారు. 1976లో ప్రొఫెసర్ కోటేశ్వరరావు పర్యవేక్షణలో పీహెచ్డీ చేసి డాక్టరేట్ పొందారు. 1977లో అనంతపురం జిల్లాలోని ఎస్వీయూ పీజీ సెంటర్లో లెక్చరర్‌గా పనిచేశారు. తరువాత పీజీ సెంటర్‌ను శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీగా మార్చాక అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా, రీడర్‌గా, 1993లో ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందారు. అధ్యాపకుడిగా 35 ఏళ్ల పాటు సేవలందించారు. 2008 అక్టోబర్‌లో ప్రొఫెసర్‌గా పదవీ విరమణ పొందారు. అదే ఏడాది నవంబర్‌లో వైఎస్సార్ జిల్లా కడపలోని యోగి వేమన యూనివర్సిటీ ప్రత్యేకాహ్వానం మేరకు గెస్ట్ ప్రొఫెసర్‌గా చేరారు. ప్రస్తుతం యోగి వేమన యూనివర్సిటీ తెలుగు విభాగంలో ప్రొఫెసర్‌గా ఉంటూ సీపీ బ్రౌన్ లైబ్రరీ ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నారు. ప్రాచీన తెలుగు కవుల సిద్ధాంతాలు, చర్చ అనే తెలుగు విమర్శ రచనలకు శ్రీపొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఉత్తమ గ్రంథ పురస్కారాన్ని అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పురస్కారాన్ని అందజేసి ఘనంగా సత్కరించింది. ఈయన ఇప్పటి వరకు 19 తెలుగు సాహిత్య విమర్శన గ్రంథాలు వెలువరించారు. పలు పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. ఈయన తెలుగు సాహిత్యానికి చేసిన కృషిని గుర్తిస్తూ కేంద్ర సాహిత్య అకాడమీ ప్రతిష్టాత్మకమైన అవార్డును ప్రకటించింది. త్వరలోనే ఈ అవార్డును ఆయన అందుకోనున్నారు. -
ఉత్తమ అనువాదకులకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు
చెన్నై, న్యూస్‌లైన్: ఉత్తమ అనువాదకులుగా ఎంపిక చేసిన 24 మంది రచయితలకు కేంద్ర సాహిత్య అకాడమీ ‘ఉత్తమ అనువాదకుల అవార్డు-2012’ను అందజేసింది. అవార్డుల ప్రదానోత్సవం చెన్నైలో శుక్రవారం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న అకాడమీ అధ్యక్షుడు విశ్వనాథ్ ప్రసాద్ తివారీ మాట్లాడుతూ, అనువాదాలు పాఠకులకు ఇతర భాషా రచయితలతో పరిచయూలు పెంచుతాయన్నారు. గ్రహీతలకు తామ్రపత్రం, రూ.50 వేల చొప్పున నగదును అందజేశారు. అవార్డుకు ఎంపికైన వారిలో తెలుగు వ్యక్తి వెంకటేశ్వరరావు ఉన్నారు. ఈయన స్వగ్రామం పశ్చిమగోదావరి జిల్లాలోని పెద్దేవం. క్రీ.పూ 500 నుంచి క్రీ.శ 624 సంవత్సరం వరకు ‘తొలి చారిత్రక ఆంధ్రప్రదేశ్’ అనే ఇంగ్లిష్ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించారు. ‘పనికొచ్చే ముక్క’ అనే శీర్షికను విశాలాంధ్ర దినపత్రికలో చాలా కాలం నడిపారు. గత డిసెంబర్లో వెంకటేశ్వరరావు కన్నుమూశారు. అవార్డును వెంకటేశ్వరరావు తరపున ఆయన బంధువులు స్వీకరించారు.