పాపినేనికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు | Central Sahitya Akademi Award to Papineni | Sakshi
Sakshi News home page

పాపినేనికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

Published Thu, Dec 22 2016 2:19 AM | Last Updated on Mon, Aug 13 2018 7:54 PM

పాపినేనికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు - Sakshi

పాపినేనికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

- ’రజనీగంధ’ కవితా సంకలనంతో అవార్డుకు ఎంపిక
- నాగళ్ల గురుప్రసాద్‌కు భాషా సమ్మాన్‌ పురస్కారం
- 24 భాషల్లో ప్రసిద్ధ సాహితీవేత్తలకు అవార్డులు ప్రకటించిన అకాడమీ


సాక్షి, న్యూఢిల్లీ/ తెనాలి : ధిక్కరించకపోతే, దిక్కులు దద్దరిల్లేటట్టు పొలికేక పెట్టకపోతే అది కవిత్వం ఎట్లా అవుతుందని ప్రశ్నించిన కవి డా.పాపినేని శివశంకర్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. రజనీగంధ కవితా సంకలనానికి గాను ఈయనకు ఈ అవార్డును ప్రకటించారు. సాహిత్య రంగంలో విశేష కృషి చేసిన నాగళ్ల గురు ప్రసాద్‌రావ్‌కు భాషా సమ్మాన్‌ అవార్డును ప్రకటించారు. బుధవారం కేంద్ర సాహిత్య అకాడమి 2016 వార్షిక అవార్డులను ప్రకటించింది. కవిత్వానికి ఎనిమిది మందికి, ఏడుగురు కథకులకు, ఐదుగురు నవలా రచయితలకు, ఇద్దరు విమర్శకులకు, ఒక వ్యాసకర్తకు, ఒక నాటక రచయితకు మొత్తం 24 మందికి ఈ సంవత్సరం అవార్డులు లభించాయి. అద్భుత కవిత్వాలు రాసిన ఎనిమిది మంది కవులలో పాపినేని శివశంకర్‌ ఒకరు.

జీవితం ఒక అద్భుత పుష్పం వికసించే ప్రక్రియ, డొల్ల మనుషులే ఇమేజ్‌ కల్పించుకుంటారు.. మూర్ఖులు దాన్ని ఆరాధిస్తారు అంటూ రజనీగంధలో ఆయన కవిత్వం రాశారు. ప్రతి భాషలో ముగ్గురు సభ్యుల జ్యూరీ సిఫారసుల మేరకు అవార్డు గ్రహీతల ఎంపిక జరిగింది. 2010 జనవరి నుంచి 2014  డిసెంబర్‌ వరకు ప్రచురితమైన రచనలను పరిగణనలోకి తీసుకుని అవార్డు గ్రహీతలను ఎంపిక చేశారు. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 22న జరిగే అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో అవార్డులకు ఎంపికైనవారికి తామ్ర పత్రంతో పాటు లక్ష రూపాయల చెక్కును బçహూకరిస్తారు. భాష సమ్మాన్‌ అవార్డుకు ఎంపికైన నాగళ్ల గురు ప్రసాద్‌రావ్‌ సాహిత్య రంగంలో విశేష కృషి చేశారు. విజయవాడ లయోలా కళాశాల, గుంటూరు జేకేసీ కళాశాలలో ఆయన తెలుగు బోధించారు.

ఉద్యోగ విరమణ తర్వాత విజయవాడలోని సిద్ధార్థ కళాపీఠానికి రెండు దశాబ్దాలపాటు కార్యదర్శిగా సేవలందించారు. శాలివాహనుడు, ఇద్దరు మహాకవులు లాంటి రచనలు చేశారు. కన్నడ భాషలో మహ్మద్‌ కున్హీ రచించిన స్వతంత్రయాద వోటా నవల, తమిళంలో వన్నధాసన్‌ రచించిన ఓరు సిరు ఇసై (చిన్న కథ) అవార్డుకు ఎంపికయ్యాయి. అవార్డుల ప్రకటన సందర్భంగా కొత్త సంవత్సరం డైరీ, క్యాలెండర్‌ను అకాడమీ కార్యదర్శి డా.శ్రీనివాస రావు విడుదల చేశారు. గతంలో ’అసహనం’తో సాహిత్య అకాడమీ అవార్డులను తిరిగి ఇచ్చిన వారిని.. ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని కోరామన్నారు.  

మూడు ప్రక్రియల్లో పాపినేని ప్రతిభావంతమైన కృషి
గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం నెక్కల్లు గ్రామంలో 1953 నవంబరు 6న రైతుబిడ్డగా జన్మించిన పాపినేని శివశంకర్‌ మూడున్నర దశాబ్దాలుగా కథ, కవిత్వం, విమర్శ అనే మూడు ప్రక్రియల్లో ప్రతిభావంతమైన కృషి చేస్తున్నారు. నెక్కల్లు, తుళ్లూరులో పాఠశాల విద్య, గుంటూరులో బీఏ, ఎంఏ చేశారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ’సాహిత్యం–మౌలిక భావనలు’పై పరిశోధన చేశారు. బీఏ, ఎంఏ, పీహెచ్‌డీల్లో స్వర్ణపతకాలు సాధించారు. 1977 నుంచి తాడికొండలోని వీఎస్‌ఎస్‌బీ కాలేజీలో తెలుగు అధ్యాపకుడిగా, ప్రిన్సిపల్‌గా పనిచేశారు. వీరి సహ సంపాదకత్వంలో వార్షిక కథ, కవితా సంకలనాలు వెలువడుతున్నాయి.

కవితా! ఓ కవితా! విస్మృత కథ, రైతుకవిత సంకలనాలకు ముఖ్యసంపాదకుడు. ఫ్రీవర్స్‌ ఫ్రంట్, తెలుగు విశ్వవిద్యాలయం, ఆంధ్రప్రదేశ్‌ అధికార భాషా సంఘం, విశాలాంధ్ర, నాగభైరవ కళాపీఠం సంస్థల పురస్కారాలను పొందారు. దేవరకొండ బాలగంగాధర తిలక్‌ అవార్డు, డాక్టర్‌ సి.నారాయణరెడ్డి, డాక్టర్‌ అవంత్స సోమసుందర్‌ కవితా పురస్కారాలు, రాష్ట్ర ప్రభుత్వ ఉగాది విశిష్ట పురస్కారం వంటి గౌరవాలు ఆయన్ను వరించాయి. స్తబ్ధతా చలనం, ఒక సారాంశం కోసం, ఆకుపచ్చని లోకంలో, ఒక ఖడ్గం–ఒక పుష్పం, రజనీగంధ.. ఆయన కలం నుంచి వెలువడిన కవితా సంపుటాలు. తల్లీ నిన్ను దలంచి, సాహిత్యం– మౌలిక భావనలు, సగం తెరచిన తలుపు లాంటి ఎన్నో గొప్ప రచనలు చేశారు. వివిధ రంగాలకు చెందిన మేధావులు, విలక్షణమైన వ్యక్తులకు సంబంధించిన భిన్నమైన శిల్పంతో కూడిన కవితలివి. పెట్టుబడిదారీ నాగరికత, ప్రపంచీకరణ నేపథ్యంలో మానవ సంబంధాలు విచ్ఛిన్నం కావడం తననెంతో కలవరపెట్టినట్టు పాపినేని చెప్పారు. ఆ క్రమంలోనే మానవ సంబంధాల్లోని అసహజత్వం/ కృత్రిమత్వం, స్వేచ్ఛారాహిత్యంపై కూడా కథలు, కవితలు రాశారు. మృగ్యమవుతున్న మానవ సంబంధాలను ఎలా కాపాడుకోవాలి? అనేది ’రజనీగంధ’ కవితల్లో కనిపిస్తుంది.

జగన్‌ అభినందనలు
సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికైన డాక్టర్‌ పాపినేని శివశంకర్, భాష సమ్మాన్‌ అవార్డుకు ఎంపికైన నాగళ్ల గురు ప్రసాద్‌రావ్‌లను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. తెలుగు సాహిత్యానికి వారు అందించిన సేవలను ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ కొనియాడారు.

కృషికి తగిన ఫలితం: నాగళ్ల
విజయవాడ కల్చరల్‌: అవార్డుల కోసం తాను ఏనాడు ఎదురు చూడలేదని, తాను చేస్తున్న సాహిత్య సేవకు ప్రభుత్వం గుర్తింపు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని నాగళ్ల గురు ప్రసాద్‌ చెప్పారు. భాషా సమ్మాన్‌ పురస్కారం వస్తుందని ఊహించ లేదని, తాను ఇంతకాలం చేసిన సాహిత్య సేవకు గుర్తింపు రావడం ఆనందంగా ఉందన్నారు. విజయవా డ లయోలా కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా కెరీర్‌ ప్రారంభించి అంచలంచెలుగా ఎదిగి పీబీ సిద్ధార్థ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సు కళాశాలకు ప్రిన్సిపాల్‌గా పనిచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement