రచన, సాహిత్యాన్ని అభిరుచిగా మలుచుకుంటే చాలు.. మన భవిష్యత్ ప్రయాణ మార్గాన్ని, అత్యుత్తమ లక్ష్యాలకు అదే చేర్చుతుందని ప్రముఖ సాహిత్యకారులు చెప్పే మాట. ఆనాటి తరం యువ రచయితలకు సాహిత్యాభిలాష ఎంత వరకూ తోడ్పాటునందించిందో అటుంచితే.. ఈ తరం యువ రచయితలకు మాత్రం గౌరవ ప్రస్తానాన్ని ప్రసాదిస్తోంది. ఈ తరం యువత సాహిత్యంలో విశేషంగా రాణించడమే దీనికి నిదర్శనం. అధునాతన పంథాతో, వినూత్న ఆలోచనలతో, సామాజిక అంశాలను ప్రస్తుత భాషా అనుకరణ పరిమితుల్లో రచిస్తూ.. తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. యువ రచనలకు ఈ దశాబ్ద కాలాన్ని స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చు. ప్రతి ఏడాదీ యువ రచయితల కొత్త పుస్తకాలు, నవలలు, కథానికలు, కవిత్వ సంపుటిలు విరివిగా ప్రచురితమవుతున్నాయి. ఇందులోనూ వినూతనత్వం ఏంటంటే.. ఈ అభిరుచి ఉన్న యువ ఔత్సాహికులకు అటు సినిమా రంగంలో, ఇటు కంటెంట్ డెవలప్‌మెంట్ వేదికల్లో ప్రధాన్యత పెరగడం. ఈ సందర్భంగా వీరంతా సోషల్ సెలబ్రెటీలుగా మారుతున్నారు. హైదరాబాద్ నగరం వేదికగా కొనసాగుతున్న నేషనల్ బుక్ ఫెయిర్(National Book Fair) నేపథ్యంలో అటువంటి యువ సాహిత్య కారులను ‘సాక్షి’ ప్రత్యేకంగా పలకరించింది. వారి అభిప్రాయాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం.
ప్రశ్నించే గొంతుకగా ఉండాలని..
ర చన, సాహిత్యం అనేది నా ఆలోచనలను ప్రతిబింబించే సామాజిక వేదికలుగా భావిస్తాను. రాసే కథ అయినా, నవల అయినా సమాజహితమై, అసమానతలను ప్రశ్నించే గొంతుకగా ఉండాలని భావిస్తాను. అందులో భాగంగానే ఎర్రమల్లెలు అనే పుస్తకం రాశాను. మ్యారిటల్ రేప్‌ల పై ఈ రచన రాశాను. సాధారణంగా మల్లెలు తెల్లగా ఉంటాయి. కానీ అవి ఎందకు ఎర్రగా మారాయనే నిజజీవిత సామాజిక అంశాన్ని ప్రస్తావించాను. సాధారణంగా పెళ్లి జరిగిన తరువాత అందరి ఆడవారి జీవితాలూ ఒకేలా ఉండవు. ముఖ్యంగా సెక్స్ ఎడ్యుకేషన్‌పై అవగాహన లేకపోవడం దీనికి కారణం.
నా పుస్తకానికి అన్ని వయసుల ఆడవారు, ముఖ్యంగా మగవారి నుంచి స్పందన లభిస్తోంది. నిజ జీవితంలో భార్యల విషయంలో భర్తలు ఎలా ప్రవర్తిస్తున్నారనే అంశంలో చాలా మంది రియలైజ్ అయ్యామని స్పందించడం చాలా సంతోషాన్నిచ్చింది. నేను సినిమాలకు రచనా సహకారం అందిస్తున్నాను. ఆల్ ఇండియా రేడియోలో డ్రామాలు రాస్తున్నాను. భవిష్యత్తులో మరిన్ని కథలు, నవలలు రాయనున్నాను.
– రోజా రాణి దాసరి
స్క్రీన్ రైటర్ అవ్వాలనే లక్ష్యంతో..
మనుషుల్లోని సున్నితమైన భావోద్వేగాలైన ప్రేమ, అనురాగం, అభిమానం, ఆప్యాయత వంటి అంశాల్ని స్పృశిస్తూ రచనలు చేయడం నాకు ఇష్టం. ప్రస్తుతం ఈ ప్రపంచానికి వీటి అవసరం ఎంతో ఉందని నేను భావిస్తున్నాను. ఇందులో భాగంగానే ‘సరిజోడి’ అనే స్వచ్ఛమైన అచ్చ తెలుగులో ఒక నవల రాశాను. సిటీలో కొనసాగుతున్న బుక్ ఫెయిర్‌లో ఈ పుస్తకానికి మంచి ఆదరణ లభిస్తోంది.
ఇది పాకిస్తానీ ముస్లిం అమ్మాయికి, హైదరాబాదీ వ్యాపారవేత్తకి మధ్య జరిగిన హృద్యమైన ప్రేమ కావ్యం. ఇది నా మొదటి నవల. భవిష్యత్తులో స్క్రీన్ రైటర్ అవ్వాలనే లక్ష్యంతో ఉన్నాను. ప్రస్తుతం నగరంలోని ఇఫ్లూ యూనివర్సిటీలో ఫిల్మ్ స్టడీస్ పై పీహెచ్‌డీ చేస్తున్నాను. ఈ మధ్య కాలంలో యువ రచయితల పుస్తకాలు పెరగడం సంతోషాన్ని ఇవ్వడంతో పాటు, పోటీతత్వాన్ని పెంచుతోంది. ఇందులో బాధ్యతాయుతమైన రచనలు, భాషను, సామాజిక, మానసిక విలువలను స్పృశించే రచనలు కూడా ఉండటం శుభపరిణామం.
– దిలీప్.
స్నేహితుల సహకారంతో..
రచనల పరంగా 2012లో మొదలైన నా ప్రయాణం కేంద్ర యువ సాహిత్య అకాడమీ అవార్డు పొందే వరకూ సాగింది. మొదట్లో ఈ రచనా రంగంలోని స్నేహితుల సహకారంతో మొదటి పుస్తకాన్ని ప్రచురించాను. ఆ తరువాత ఆ కష్టాలను దాటుకుని అస్థిత్వం, కుల వృత్తులను, సామాజిక అంశాలను ప్రతిబింబించే కవిత్యం, కథలు రాశాను. నా రచనలు హిందీ, తమిళం, అస్సామీ, బంగ్లా వంటి భాషలతో పాటు ఫ్రెంచ్, స్పేయిన్ వంటి భాషల్లోకి తర్జుమా చేయడం గొప్ప గౌరవంగా భావిస్తాను.
రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల కోసం సిలబస్ చేర్చడం కూడా మరింత సంతృప్తినిచ్చింది. ఈ ప్రయాణంలో వివిధ రాష్ట్రాల్లో దాదాపు 13 లిటరరీ ఫెస్టివల్స్‌లో వేదిక పంచుకోవడం, ఈ వేదికల పైన జాతీయ, అంతర్జాతీయ సాహిత్యకారులను కలుసుకోవడం, వారి అనుభవాలను ఆలోచనలను పంచుకోవడం నా విజయాలుగా భావిస్తాను. మరి కొద్ది రోజుల్లో ఇంగ్లిష్ కవిత్వం, కవిత్వ అనువాదం, మరో సంపాదకత్వంతో రానున్నాను.
– రమేష్ కార్తీక్
మహిళా సాధికారత దిశగా..
నా వృత్తి ప్రభుత్వ రంగ సంస్థలో మహిళా సాధికారత కోసం కృషి చేయడం. నా వృత్తిలో ఎదురైన అనుభవాలను ప్రవృత్తి అయినటువంటి రచనల ద్వారా సమాజానికి చేరువ చేస్తున్నాను. మొదటి సామాజిక సమస్యలపై కథలు రాస్తున్నాను. నా మొదటి పుస్తకం ఇసుక అద్దం. ఇది నా ప్రయాణానికి మంచి బాట వేసింది. ఈ మధ్యనే విడుదల చేసిన 2వ కథల పుస్తకం బల్కావ్ కూడా నా సామాజిక బాధ్యతను అక్షరాలుగా, పదాలుగా వివరిస్తుంది.
ఒక సామాజిక అంశంపై లోతుగా పరిశోధించాకే, అందులోని నిజాలను నిక్కచ్చిగా చెప్పడానికే నా కలాన్ని వాడతాను. నా రచనలు నాకు సంతృప్తితో పాటు గౌరవాన్ని, గుర్తింపును ఇచ్చాయి. యండమూరి వీరేంద్రనాథ్ ఉగాది పురస్కారంతో పాటు, వాయిస్ ఆఫ్ తెలంగాణ వంటి అవార్డులు సైతం లభించాయి. ముఖ్యంగా 50 ఇన్స్‌పైరింగ్ ఉమెన్స్‌లో నాకు అవార్డు రావడం, దీని కోసం ప్రత్యేకంగా ప్రచురించిన పుస్తకంలో నా గురించి ప్రచురించారు. మరికొన్ని అద్భుతమైన కథలతో రానున్నాను.
– శ్రీ ఊహ
(చదవండి: వామ్మో..! అలాంటి ఉద్యోగాలు కూడా ఉంటాయా..? వింటే వెన్నులో వణుకురావాల్సిందే..!)
Comments
Please login to add a commentAdd a comment