59 ఏళ్ల ఆ వ్యాపారవేత్తకు నయంకాని చర్మవ్యాధి వస్తుంది. కాళ్లకు ఎప్పుడూ పట్టీలు కట్టాల్సిన పరిస్థితి. భార్య ఇష్టపడదు. అతణ్ణి తాకనివ్వదు. అసహనం కమ్ముకున్న వ్యాపారవేత్త విసిగిపోయి తన గోడౌన్ లో నివసించడం ప్రారంభిస్తాడు. ఒక్కగానొక్క కొడుక్కి తండ్రి గురించి బెంగ. అతను తండ్రి బాగోగుల కోసం ఒక మహిళను తెచ్చి పెడతాడు. ఆ మహిళ ఆ వ్యాపారవేత్త పట్ల కారుణ్యమూర్తి అవుతుందా? మానవ స్వభావాలు ఎట్టి పరిస్థితుల్లో ఏమేమిగా మారుతుంటాయి? తమిళ సాహిత్యంలో నిన్న మొన్న పూచిన కలం ముతురాస కుమార్ రాసిన ఇలాంటి కథలున్న సంకలనాన్ని ‘మీ భాషలోకి అనువదిస్తారా... మెమొరాండం ఆఫ్ అండర్‌స్టాండింగ్ (ఎంఓయు) సైన్ చేస్తారా’ అని కన్నడ, మలయాళ పబ్లిషర్లతో సూటూ బూటూ వేసుకుని చర్చిస్తున్న లిటరరీ ఏజెంట్ అక్కడ కనిపించింది.
‘ఇమయం’ కలం పేరుతో పాతికేళ్లుగా రాస్తున్న స్కూల్ టీచర్ వి.అన్నామలై కిడ్నీ బాధితుల జీవితాన్ని నవలగా రాయడానికి ఏకంగా సైంటిస్ట్ అంతటి పరిశోధన చేశాడు. కిడ్నీ ఎలా పని చేస్తుంది, ఎందుకు పాడవుతుంది, పాడయ్యాక ఎలా ఎదుర్కొనాలి, ఇందులో మందుల, ఆస్పత్రుల గూడుపుఠానీ ఏమిటనేవి వివరిస్తూ ‘ఇప్పోదు ఉయిరోడు ఇరిక్కిరేన్ ’ పేరుతో నవల రాస్తే వెంటనే ‘ఐయామ్ ఎలైవ్.. ఫర్ నౌ’ పేరుతో ఇంగ్లిష్‌లోకి అనువాదమైంది. అది సరిపోతుందా? స్పానిష్, టర్కిష్, నేపాలీ, లేదంటే తెలుగు భాషల్లోకి అనువాదమైతేనే కదా తమిళ నవల గొప్పదనం తెలిసేది! ‘అనువాదం చేయించి పబ్లిష్ చేస్తారా మరి’ అని మరో లిటరరీ ఏజెంట్ అక్కడ విదేశీ పబ్లిషర్ల డెస్క్‌ల దగ్గర తిరుగాడుతూ కనిపించాడు.
‘చెన్నై ఇంటర్నేషనల్ బుక్‌ఫెయిర్ 2024’ పేరుతో చెన్నపట్టణంలో జనవరి 16–18 తేదీల్లో మూడురోజులు సాగిన పుస్తక ప్రదర్శన నిజానికి ‘రైట్స్ హబ్’. ఇది తమిళనాడు ప్రభుత్వ పూనికతో, తమిళ సాహిత్యాన్ని ప్రపంచానికి అనువాదం చేసి అందించడానికి హక్కుల క్రయవిక్రయాలకు నియోగించిన వేదిక. మిగిలిన భారతీయ భాషల్లో రచయితలు తాము రాసిన పుస్తకాలను ఇతర భాషల్లో అనువదించుకోవడానికి పాట్లు పడాలి. కాని తమిళనాడు ప్రభుత్వం తన భాషా సాహిత్యాన్ని అనువాదం చేయించడానికి గత రెండేళ్లుగా ఈ రైట్స్ హబ్ నిర్వహించడమే కాదు అందుకు ‘తమిళనాడు ట్రాన్ ్సలేషన్ గ్రాంట్’ పేరుతో ఆర్థిక అండ కూడా అందిస్తోంది.
అంటే మీరొక పబ్లిషరై ఒక తమిళ పుస్తకాన్ని తెలుగులోకి అనువాదం చేయించి ప్రచురిస్తానంటే ఒక్కో పుస్తకానికి పేజీల సంఖ్యను బట్టి గరిష్ఠంగా రెండున్నర లక్షలు మంజూరు చేస్తుంది! రెండున్నర లక్షలు!! దానికి బదులుగా మీరు 500 కాపీలు ప్రచురిస్తే 50 కాపీలు, 1000 కాపీలు ప్రచురిస్తే 100 కాపీలు ప్రభుత్వానికి దఖలు పరచాలి. గ్రాంటు డబ్బుల్లో అనువాద ఖర్చులు, బుక్‌మేకింగ్ ఖర్చులు, ప్రింటింగ్ ఖర్చులు బాగానే సరిపోతాయి. కాపీలు అమ్ముకోగా వచ్చిన డబ్బులు పబ్లిషర్లవే!
‘తమిళంలో గత వందేళ్లలో గొప్ప సాహిత్యం వచ్చింది. ప్రపంచ సాహిత్యానికి ఇది ఏ మాత్రం తక్కువ కాదు. మేము ఇప్పటి వరకు రష్యన్, ఫ్రెంచ్, బెంగాలీ, హిందీ నుంచి అనువాదాలు బోలెడు చేసుకున్నాం. బయట దేశాల, భారతీయ భాషల సాహిత్యం తమిళ అనువాదాల ద్వారా చదివాం. ఇప్పుడు మీ వంతు. మా సాహిత్యాన్ని చదవండి. అనువాదం చేసుకోండి. మా సాహిత్యాన్ని మీకు చేరువ కానీయండి’ అని బుక్ ఫెయిర్ అనుసంధానకర్త, రచయిత మనుష్యపుత్రన్ ప్రారంభ కార్యక్రమంలో అన్నారు.
గత సంవత్సరం నుంచి మొదలైన ఈ గొప్ప సంకల్పం సత్ఫలితాలను ఇస్తోంది. 2023లో జరిగిన చెన్నై ఇంటర్నేషనల్ బుక్‌ఫెయిర్‌లో దేశీయంగా, విదేశీయంగా 100కు పైగా తమిళ పుస్తకాల అనువాదాలకు ఎంఓయులు జరిగితే ఇప్పటికి 52 పుస్తకాలు వెలువడ్డాయి. వీటిలో చైనీస్, అరబిక్, మలయా, కొరియన్, కన్నడ, మలయాళ భాషల్లో వెలువడ్డ తమిళ పుస్తకాలు ఉన్నాయి. ఉదాహరణకు తమిళ కథారచయిత సుజాత కథలు తమిళం ద్వారా పాఠకులకు తెలుసు. ఇప్పుడు చైనీస్ ద్వారా మొత్తం చైనాకు తెలుసు.
చెన్నై ఇంటర్నేషనల్ బుక్‌ఫెయిర్ 2024లో పాల్గొన్న 40 దేశాల పబ్లిషర్లు, భారతీయ భాషల పబ్లిషర్లు ఫెయిర్ ముగిసే సమయానికి 750 ఎంఓయులు చేసుకున్నారు. ఇవన్నీ తమిళం నుంచి ఇతర భాషలకు మాత్రమే కాదు... ఇతర భాషల నుంచి తమిళ లేదా ఏ భాషలోకైనా గానీ! అయితే తమిళనాడు ప్రభుత్వ ట్రాన్ ్సలేషన్ గ్రాంట్ మాత్రం తమిళం నుంచి ఇతర భాషల్లోకి అనువాదమయ్యే పుస్తకాలకే! తమిళ ప్రభుత్వం ఈ ఒడంబడికల కోసం ఎంత శ్రద్ధ పెట్టిందంటే ఇంగ్లిష్ రాని రచయితల, పబ్లిషర్ల తరఫున చర్చలు చేయడానికి 20 మంది లిటరరీ ఏజెంట్లకు శిక్షణ ఇచ్చి మరీ రంగంలో దింపింది. ఎంత బాగుంది ఇది! ఏ ప్రభుత్వానికైనా తన సాహిత్య సంపద పట్ల ఉండవలసిన కనీస అనురక్తి ఇది!!
మరి మన సంగతి? తెలుగు సాహిత్యం నుంచి ఇలాంటి ప్రయత్నం చేయడానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు అనాసక్తి లేకపోవచ్చు. తమ సాహిత్యాన్ని కాపాడుకోవాలనుకునే తపన ఆ రెండు ప్రభుత్వాలకు తప్పక ఉండి ఉండొచ్చు. కాకుంటే సాహిత్య ప్రపంచం నుంచి, శాసనాధీశుల నుంచి, పాలనా వ్యవస్థలోని చదువరులైన ఐ.ఏ.ఎస్ అధికారుల నుంచి తగిన చొరవ, ఒత్తిడి కావాలంతే!
‘చలం రాసిన ‘మైదానం’ను కొరియన్ లోకి అనువదిస్తారా?’ అని ఒక లిటరరీ ఏజెంట్, ‘గుఱ<ం జాషువా ‘గబ్బిలం’ను ఫ్రెంచ్‌లోకి అనువదిస్తారా?’ అని మరో లిటరరీ ఏజెంట్ ఎంఓయులు సైన్ చేసే సన్నివేశం కోసం ఎదురుచూద్దాం.
సాహిత్య ఒడంబడికలు
Published Mon, Jan 22 2024 12:09 AM | Last Updated on Mon, Jan 22 2024 12:09 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment