అంతరాల సంఘర్షణే నాటకం
ఇంటర్వ్యూ: - డి.విజయభాస్కర్
కావ్యేషు నాటకం రమ్యమ్ అన్నారు మహాకవి కాళిదాసు. సామాజిక సామరస్యతకు ‘నాటకమ్ గమ్యమ్’ అంటున్నారు డా.దీర్ఘాశి విజయభాస్కర్. శ్రీకాకుళం జిల్లా అంపోలు గ్రామంలో బలహీనవర్గానికి చెందిన ‘దమ్మలి’ కులంలో పుట్టారు. ఎత్తై మరగల్లుపై గ్రామాన్ని వీక్షించి శంఖాధ్వానంతో గ్రామదేవతను అర్చించడం వృత్తిగా ఉన్న తన కులస్తుల్లో చదువుకుని ప్రభుత్వ ఉన్నతోద్యోగం చేస్తోన్న ఒకే ఒక్కడు విజయభాస్కర్. అంతేనా? తెలుగు నాటకాన్ని భారతీయభాషల్లో రెపరెపలాడిస్తోన్న వాడు కూడా! ‘బ్రెహ్ట్’పై డాక్టరేట్ చేసిన విజయభాస్కర్ ‘తూర్పు తెల్లవారింది’తో మొదలై ఇటీవలి ‘రాజిగాడు రాజయ్యాడు’ వరకూ 14 నాటకాలు రాశారు. కేంద్ర సంగీత-నాటక అకాడెమీ అవార్డు, ఆరుసార్లు నంది అవార్డులు, ఇతరేతరాలు తనను వరించాయి. సాంఘిక సమస్యలను ఇతివృత్తాలుగా తీసుకుని నాటకాన్ని కథలా ప్రారంభించి, కావ్యంలా ముగిస్తూ, ఒక తాత్త్విక భావజాలాన్ని అంతర్లీనంగా ప్రవహింపజేసే విజయభాస్కర్‌తో ఇంటర్వ్యూ సారాంశం :
మీ నేపథ్యం చెప్పండి.
నాన్న సూర్యనారాయణ పౌరాణిక, సాంఘిక నాటకాల్లో నటించేవాడు. రామదాసు నాటకంలో కబీర్ పాత్ర పోషించేవాడు. ఆ ప్రభావం నా మీద ఉంది. శ్రీకాకుళం కాలేజీలో చదువుకునేటప్పుడే కొన్ని నాటకాల్లో నటించాను. రవీంద్రభారతి గురించి మా నాన్న ద్వారానే తొలిసారి విన్నాను. ‘హిందువులకు కాశి, ముస్లింలకు మక్కా, క్రిస్టియన్లకు జెరూసలెం వలె కళాకారులకు పుణ్యస్థలి రవీంద్రభారతి’గా చెప్పుకునేవాళ్లం. ఏనాటికైనా నా నాటకాలు అక్కడ ఆడాలి అనుకున్నాను. అలాగే జరిగింది.
నాటకాలు రాయడం ఎప్పటి నుంచి మొదలెట్టారు?
బాల్యంలోనే నాటకం పట్ల ఏర్పడిన అభిరుచి నాటకాన్ని సాహితీ ప్రక్రియగా ఎంపిక చేసుకునేందుకు దోహదపడింది. కులాలు, రాజకీయాలు, ప్రాంతాలు, మతాలు, అభిమతాల పేరిట సమాజంలో అసంఖ్యాక సంఘర్షణలున్నాయి. కేవలం నాటకం మాత్రమే సంఘర్షణను ప్రతిభావంతంగా ప్రజల దగ్గరకు చేరుస్తుందని నా అభిప్రాయం. ఆ ఉద్దేశంతోనే ఎం.ఎ చదువుతోండగా ‘తూర్పు తెల్లారింది’ రాశాను. అది రేడియోనాటకంగా ప్రసారమైంది. నాటక రచయిత ఎస్.కె.మిశ్రో నా గురుసమానులు. ఇప్పటికి 24 నాటకాలు రాశాను. గాంధీ జయంతి- రుత్విక్- కాలకూటం-మినిస్టర్- కుర్చీ- పులిస్వారీ తదితర నాటకాలు అనేక భారతీయ భాషలలోకి అనువాదమయ్యాయి. వివిధ రాష్ట్రాల్లో ‘విజయభాస్కర్ నాటకోత్సవాలు’ విజయవంతంగా ప్రదర్శితమైనాయి.
మీ నాటకాలు ఎందుకు నచ్చుతున్నాయి?
నా నాటకాలు ఇంగ్లిష్ ఇతర భారతీయ భాషల్లోకి విరివిగా అనువాదమై ప్రజలకు నచ్చడానికి కారణం వర్తమాన సంఘర్షణను చెప్పేందుకు పౌరాణిక ప్రతీకలను ఎంచుకోవడమేనని భావిస్తాను. ‘పురాణా’నికి పునర్‌నవం అనే అర్థం ఉంది. పురాణాల కనెక్టివిటీకి ఒక ఉదాహరణ : ఏడు ఈశాన్య రాష్ట్రాలలో సామాజిక ఉద్యమాల గురించి ‘హై వే - జర్నీస్ త్రూ ఎ ఫ్రాక్చర్డ్ లాండ్’ అనే పుస్తకాన్ని రాసిన అంతర్జాతీయ జర్నలిస్ట్ సుదీప్ చక్రవర్తి మణిపురిభాషలోకి ‘లైబికా-వాగా’ పేరుతో అనువాదితమైన నా నాటిక ‘బ్రహ్మరాత’ను వీక్షించి, ఈ నాటిక ఈశాన్యరాష్ట్రాల వర్తమాన రాజకీయపరిస్థితులకు అద్దం పడుతుంది అని వివరించారు. నా తెలుగు నాటకంలో మణిపురి సమస్యలేం లేవు. అయినా సరే, నా నాటిక ‘స్థలాన్ని’ (స్పేస్)ఎలా దాటింది? పౌరాణిక ప్రతీకలను వాడడం ద్వారానే! ఇతర భాషల్లోకి అనువాదం అవుతోన్న నా తాజా నాటకం ‘రాజిగాడు రాజయ్యాడు’లోనూ కులపురాణాల ప్రస్తావన ఉంది. సేవకవృత్తిలో మగ్గిపోతోన్న కులాలు అగ్రవర్ణాలలోని ‘పాజిటివ్’ వ్యక్తుల నుంచి చైతన్యవంతమై అధికారంలోకి వస్తాయనే ఇతివృత్తంలో ‘లౌక్యం’ ఏమీ లేదు. పాలిత కులాలపట్ల చూపించే సానుభూతి, పాలక కులాలపట్ల ద్వేషం కలిగించరాదనే స్పష్టతనిచ్చాను.
ఇతర భాషలతో పోలిస్తే మన నాటకం ఎలా ఉంది?
ఇతర భారతీయభాషలతో పోలిస్తే తెలుగు రచయితలు, దర్శకులు, నటులు ఎవరికీ తీసిపోరు. మైసూర్‌లోని రంగాయణలో మన పడమటిగాలి, కుర్చీ నాటకాలను చూసిన నాటకా భిమానులు ‘ప్రయోగాల అతితో విసిగిపోయిన మాకు ఈ నాటకాలు గొప్ప రిలీఫ్ ఇచ్చాయి’ అనడం గమనార్హం! అయితే తెలుగు నాటకరంగం స్టేజ్‌క్రాఫ్ట్‌లో చాలా వెనుకబడి ఉంది.
కవిత్వం రాస్తున్నారు కదా.
నేను అవలోకించిన సామాజిక సంఘర్షణలు నాటకాలుగా రూపొందితే ఆంతరంగిక సంఘర్షణ ఇటీవలి కవితాసంపుటి ‘మహాశూన్యం’గా రూపొందింది. మహాశూన్యం అంటే ఏమీ లేకపోవడం కాదు. ‘అంతా ఉన్నది. అంతటా ఉన్నది. అంతటా నిండి ఉన్నదీ అయిన చైతన్యం’. వ్యక్తి తనలోకి చూసుకుని తన అనంతవ్యాప్తిని అనుభవించడం ‘అనుభావ’కావ్యం! నన్ను నేను పరికిస్తే- ‘నీవు ధరించాల్సిన దుస్తులు/ ఏ దిగంతాలకు అవతలనో నేస్తున్నారు/
నగ్న అంతస్సులో నడచి వెళ్లు’ అన్పిస్తోంది.
విజయభాస్కర్ రచనలు
1. కాలకూటం 2. రుత్విక్
3. కుర్చి 4. పొలి స్వరి 5. కించిత్ భోగమ్
6. జీవన్నాటకం (నాటకరంగ ప్రముఖుల గురించి టెలీ సీరియల్)
7. హిరణ్యగర్భ
8. మినిస్టర్
9. బ్రహ్మరాత
10 మబ్బులో బొమ్మ 11. గాంధీజయంతి 12. దేవుడు కావాలి 13. బాపు చెప్పిన మాట
14. చిత్రం 15. రాజిగాడు రాజయ్యాడు 16. మౌనంతో మాటలు (కవిత్వం)
- పున్నా కృష్ణమూర్తి