Punna Krishna Murthy
-
Pakhal Tirumal Reddy: వేయి రేఖల వినూత్న సౌందర్యం
పీటీ రెడ్డిగా విఖ్యాతులైన పాకాల తిరుమల రెడ్డి (1915– 1996) ప్రపంచ స్థాయికి చెందిన తెలంగాణ కళాకారుల్లో అగ్రగణ్యుడు. కరీంనగర్ జిల్లా, అన్నవరం గ్రామంలో 1915 జనవరి 4వ తేదీన జన్మించారు. ప్రాథమిక విద్య చదివే రోజుల్లో ఆయన్ని ప్రోత్సహించింది ప్రధానోపాధ్యాయులు అబ్దుల్ సత్తార్ సుభాని. తన బంధువును కలిసేందుకు ఒక రోజు రెడ్డి హాస్టల్‌కు వెళ్లాడు పీటీ. ఆ రోజు స్కౌట్స్ డే. ముఖ్య అతిథి బాడెన్ పావెల్. బాడెన్ రూపానికి 17 ఏండ్ల పీటీ కాంతి వేగంతో ప్రాణం పోస్తున్నారు. అది గమనించిన కొత్వాల్ పీటీని పిలిపించుకొని తన పెయింటింగ్ వేస్తావా అని అడిగారు! మిడాస్ టచ్!! రెడ్డి హాస్టల్ నిబంధలను సవరించి ప్రతిభావంతులైన కళాకారులకూ స్కాలర్షిప్ ఇవ్వవచ్చని పీటీని ‘సర్ జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్’లో చేర్పించారు కొత్వాల్. ముంబైలోని ఆ వినూత్న ప్రపంచంలో సూజా, కేకే హెబ్బార్, ఎమ్ఎఫ్ హుస్సేన్ తదితరులు సహ విద్యార్థులు. తన 22వ ఏట చిత్రించిన సెల్ఫ్ పోర్ట్రెయిట్ అంతర్ వ్యక్తినీ చూపిందని అధ్యాపకులు మెచ్చుకున్నారు. జేజేలో 1935 నుంచి 42 వరకు చిత్రకళను అభ్యసించి డిప్లొమా పొందారు, ఫస్ట్ క్లాస్, ఫస్ట్ ర్యాంక్‌తో! దేశ విభజన సందర్భంలో హైదరాబాద్ వచ్చారు. తెలంగాణ మాండలికాన్ని తన రచనలలో శాశ్వతం చేసిన యశోదా రెడ్డిని వివాహం చేసుకున్నారు. కార్పెంటరీ ఇండస్ట్రీ నెలకొల్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ హుందాతనాన్ని తెలిపే ఫర్నిచర్ పీటీ రెడ్డి సమకూర్చిందే. శిల్పీ, దారుశిల్పీ; ఆయిల్, వాటర్ కలరిస్ట్ అయిన పీటీ కళా ప్రపంచానికి కానుకగా ఏమి ఇచ్చారు? ఒక్క మాటలో భారతీయ సాంస్కృతిక తాత్విక సౌందర్య భరిత వేయి దళాల పరిమళ భరిత పుష్పం! మన జ్ఞాపకాల పొరల్లో మసకబారిన ఆ కళారూపాలు చూడవచ్చా? ‘స్వధర్మ’లో మూడు అంతస్తులలోని ప్రత్యేక గ్యాలరీలలో పీటీ రెడ్డి కళా రూపాలు కొలువై ఉన్నాయి. వారి కుమార్తె లక్ష్మీ రెడ్డి దంపతులు ఎంతో శ్రద్ధగా కాపాడుతున్నారు. చిరునామా సులభం. నారాయణగూడ మెట్రో పిల్లర్ 1155. కళాకారులు, చరిత్రకారులు అపా యింట్మెంట్ తీసుకుని సందర్శించవచ్చు. (క్లిక్ చేయండి: అతడి మరణం ఓ విషాదం!) - పున్నా కృష్ణమూర్తి ఇండిపెండెంట్ జర్నలిస్ట్ (జనవరి 4న పీటీ రెడ్డి జయంతి) -
ధారణే ఆయన ఆభరణం
నివాళి కవితా ప్రసాద్- కృష్ణా జిల్లా నెమలి గ్రామంలో రామకోటీశ్వరరాజు అనే బడిపంతులు పెద్దకొడుకు. తిరగబడ్డ ట్రాక్టర్ నాగ లి కింద కాలు నుజ్జు అయిన బాలుడు. తండ్రి భుజా లపై రెండు ఏర్లను దాటి ఆసుపత్రికి చేరినవాడు. ఇప్పటికీ జీవించి ఉన్న అమ్మ రత్నవర్ధనమ్మ మైళ్ల దూరపు ఆసుపత్రికి మోసుకెళ్లగా నేలపై కాలూన్చిన వాడు. ఇంటర్లో చెప్పులు, డిగ్రీలో మెరుగైన ప్యాంటూ, గ్రూప్ వన్ నెగ్గాక బూట్లు తొలిసారి వేసుకున్నవాడు. రాళ్లబండికి షార్ట్‌కట్స్ ఇష్టం ఉం డదు. నొప్పించాలని అనుకోరు. కానీ, ఆయన ఆత్మ విశ్వాసం కొందరిని నొప్పించినా ఆశ్యర్యం లేదు. రాళ్లబండి గ్రూప్ వన్ రాసే రోజుల్లో కాంపిటీ షన్ సక్సెస్ రివ్యూ పత్రిక పరీక్షహాల్ నుంచి వచ్చిన వారికి మెమరీ టెస్ట్ పెట్టేది. మొత్తం 150 ప్రశ్నలను చెప్పినవారికి నూరు రూపాయలు బహుమతి. ప్రశ్న లు రాసి బహుమతులు పొందాడు రాళ్లబండి. ఈ శక్తి అతనికి ఎలా వచ్చింది? తండ్రి రామ కోటీశ్వర రాజు భారత, భాగవత, రామాయణాలను ధారణ చేసిన వ్యక్తి. ఈ ‘పెద్దోడు’ బాల్యంలోనే గ్రహించా రు. పద్యాన్ని పాటలా పాడటం అబ్బింది. అం తేనా? వినడం, విన్నది ప్రాసెస్ చేసుకోవడం గురిం చి, పురాతన భారతీయ విద్య ఆధారంగా తండ్రి ఉదాహరణలతో చెప్పేవాడట. ‘నాగేశ్వరరావుగారు నొచ్చుకున్నారు....!’ ఫోన్ మాట్లాడడం అయ్యాక బాధగా అన్నారు రాళ్లబండి కవితాప్రసాద్ ఒక సందర్భంలో.. ఏమిటి కారణం? కళాప్రపూర్ణ అక్కినేని నాగేశ్వరరావుగారు పుట్టిన రోజు సందర్భంగా స్వర్ణకంకణం తొడగాలనుకు న్నారు. ‘నాకు బాగా నచ్చిన వ్యక్తి మీరు, అంగీకరిం చండి’ అన్నారాయన. తాను సాంస్కృతికశాఖ డెరైక్టర్. ఈ సత్కారాలు సముచితమా? ‘ఔచితీ భం గం సాహిత్యంలోనే కాదు జీవితంలోనూ కూడదు’ అనుకున్నారు రాళ్లబండి! ఇది ఆయన వ్యక్తిత్వం. ఉద్యోగం సంపాదించడం ఎట్లా అని చెబుతూ రాళ్లబండి ఇటీవల చెప్పిన కథ వేలాది యువజనుల స్టాండింగ్ ఒవేషన్ అందుకుంది. భోజరాజు కొలు వులో దండి, భవభూతి, మాఘుడు ముఖ్యులు. దండి ఏకసంథాగ్రాహి. భవభూతి ‘ద్వి’. మాఘుడు ‘త్రి’. కొలువులో చోటు కోసం ఎవరు వచ్చినా, ఏ శ్లోకం చెప్పినా దండి ‘ఇది నేను రాసిందే!’ అనే వాడు. భవభూతి ‘అవును దండిదే!’ అని చెప్పే వాడు. మాఘుడు ‘ముమ్మార్లూ దండిదే పద్యం!’ అనేవాడు. ఇహ కొలువు ఎట్లా, కొత్తవారికి! అప్పుడే కాళిదాసు సభకు వచ్చాడు. ముగ్గురూ తేజోమూ ర్తులు. జ్ఞానకాంతులు. దండికి డెబ్భై ఏళ్లు. పళ్లు లేవు. పళ్లులేని వారు పలకలేని ‘‘షడ్జ్యామడ్జ్య...’ చది వాడు. దండి ఉచ్చరించలేడు. మిగిలిన ఇరువురూ ఏకసంథాగ్రాహులు కారుకదా! భాషను వినియోగిం చడంలో కాళిదాసు వలె ‘ఇంటలిజెన్స్’ ఉపయోగిం చాలని చమత్కరించేవారు రాళ్లబండి. అవధాన విద్య ఆరంభ వికాసాలపై అవధానులందరూ అభినందించేలా పరిశోధన చేసిన రాళ్లబండి పద్య మండపానికే కాదు, ఆధునిక కవితకూ భూషణమే. గతంలోని ‘కొంచెం మంచీ’ తెలిసిన అరుదైన ప్రతి భాశాలి. నోబెల్ బహుమతి పొందిన 30 మంది కవుల కవితలను ‘అర్థాంతరం’ పేరుతో అనువది స్తోన్న రాళ్లబండి అర్థాంతరంగా అదృశ్యమయ్యారు. ఐఏఎస్ ఆఫీసర్ ముక్తేశ్వరరావు ఇచ్చిన చెక్కుతో ఆసుపత్రి నుంచి ‘విముక్తుడైన’ రాళ్లబండి మిగిల్చు కున్నది పదివేల పుస్తకాల ఆస్తి! పున్నా కృష్ణమూర్తి సీనియర్ జర్నలిస్ట్ మొబైల్: 7680950863 -
కరిగిన స్వర్గం! చెదిరిన స్వప్నం!!
నిజాం రాచరికానికి చరమగీతం పాడాలని, రాజ్యాన్ని కూలదోయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ భావించింది. 1947 సెప్టెంబర్‌లో పార్టీ ఆమేరకు పిలుపునిచ్చింది. పోరాటాన్ని ఉధృతం చేయాలని, ఆయుధాలను చేతబట్టాలని ఆదేశించింది. పోలీస్ స్టేషన్లను లూటీ చేసి, సైనిక దళాలపై మాటు వేసి, భూస్వాముల నుంచి కైవసం చేసుకుని, వీలైన అన్ని మార్గాల్లో పార్టీ నేతలు ఆయుధాలు సొంతం చేసుకున్నారు. ‘దళాలు’ అనే ప్రత్యేక బృందాలు ఏర్పరిచారు. శ్రామికరాజ్యం సాధించే వరకూ లేదా తాము చనిపోయే వరకూ ఎత్తిన జెండా దించబోమని, పట్టిన ఆయుధం విడవబోమని దళసభ్యులతో ప్రమాణాలు చేయించారు. అప్పటికి ఏడో నిజాం పాలిస్తున్నాడు. రజాకార్లు హద్దుల్లేని అమానుషకాండకు పాల్పడుతున్నారు. ఇది పోలీస్ యాక్షన్ పూర్వరంగం. ఈ దశలో తెలంగాణ సాయుధపోరాటపు అత్యున్నత దశ ఎలా ఉండేది? నల్లగొండ జిల్లాలో (ఇప్పటి నల్లగొండ జిల్లా కంటే విశాలమైనది) రెండు వేలకు పైగా గ్రామాలను కమ్యూనిస్ట్ పార్టీ ‘విముక్తం’ చేసింది. పార్టీని ‘సంగం’ అనేవారు. కార్యకర్తలను సంగపోల్లు అనేవారు. ‘సంగం’ ఆయా గ్రామాల్లో భూసంస్కరణలను అమలు చేసింది. రెండు వందల ఎకరాలకు పైగా ఉన్న భూస్వాముల నుంచి భూమిని స్వాధీనం చేసుకుని భూమిలేని రైతు కూలీలకు పంచింది.వ్యవసాయ కూలీల వేతనం పెంచారు. కనీస మొత్తం చెల్లించే అవగాహనతో గీతకార్మికులకు తాటిచెట్లను అప్పగించారు. వ్యవసాయానికి ఉపకరించే చెరువులు, కాల్వలు, బావులు తవ్వేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. పల్లెల్లో జలసిరి కళకళలాడింది. నాగళ్లు, ఎడ్లబండ్లు తయారు చేసుకునేందుకు అటవీభూముల నుంచి ఉచితంగా కలపను తీసుకునే హక్కును రైతులకు దఖలు పరచారు. ప్రజాకోర్టులు ఏర్పరచారు. వితంతు వివాహాలు జరిపించారు. రాత్రి పాఠశాలల ద్వారా వయోజనులకు అక్షరాలు నేర్పారు. ప్రపంచం గురించి గ్రామీణులకు తమదైన అవగాహన కలిగించారు. ఒక వినూత్న సాంఘిక, రాజకీయ చైతన్యం ! ఒక కొత్త కాంతి. ఒక కొత్త శాంతి. ఆహ్లాదభరిత వాతావరణం! గ్రామీణ ప్రాంతాల్లో విశాల భూభాగాన్ని కమ్యూనిస్ట్ పార్టీ (సంగం) తమ నియంత్రణలోకి తెచ్చుకుంది. కొత్త ప్రాంతాల గ్రామీణులు వారిని బోనాలతో స్వాగతించారు. ఒక దశలో ‘అదిగో చూడు..’ అన్నట్లుగా ఎర్ర విప్లవం కనుచూపు మేరలో కన్పించింది! పోరు బాటా? పొరబాటా! అదే సమయంలో 1948లో ‘పోలీసు చర్య’ వచ్చింది ! మూడు రోజుల్లో పార్టీపై నిషేధమూ వచ్చింది. అప్పటికి కొందరు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు అజ్ఞాత వాసం నుంచి బయటకు వచ్చారు. ఇతరులు సంసిద్ధులవుతున్నారు! ఆ పరిస్థితుల్లో పోరాటాన్ని కొనసాగిద్దామని కొందరు, వద్దు ముగిద్దామని మరికొందరు భావించారు. భిన్నాభిప్రాయాలు తీవ్రతరం అవుతున్నాయి! ఉద్యమ క్షేత్రాల్లో అజ్ఞాతంలో ఉన్న వారిలో అనేకులు సాయుధపోరాటాన్ని విరమిద్దామని భావించారు. ఆ క్షేత్రానికి దూరంగా మైదాన ప్రాంతాల్లో నివసించేవారు కొనసాగిద్దామని భావించారు. కమ్యూనిస్ట్ పార్టీలో ప్రధాన కార్యదర్శి పదవి అత్యున్నతమైనది. రణదివే పార్టీ ప్రధానకార్యదర్శి. ఆయన అభిప్రాయం ప్రకారం ‘ఎర్రకోటపై మూడు రంగుల జెండా ఎగిరింది. ఎర్రజెండా ఎగరలేదు. కాబట్టి భారత దేశం స్వేచ్ఛను పొందలేదు. జవహర్లాల్ నెహ్రూ అధికారమార్పిడి జరిగిన వలసదేశానికి మాత్రమే ప్రధానమంత్రి! వాస్తవానికి ఆయన ఆంగ్లో-అమెరికన్ ఏజెంట్! కాబట్టి ఎర్రకోటపై ఎర్రజెండా ఎగిరే వరకూ తెలంగాణ కేంద్రంగా సాయుధ పోరాటం కొనసాగించాల్సిందే!’ ఈ వైఖరిని రణదివే సిద్ధాంతంగా పేర్కొనేవారు. బయటకు వచ్చిన వారు నిషేధం నేపథ్యంలో పార్టీ ఆదేశం మేరకు విధిగా లోపలికి వెళ్లారు. ఇదిలావుండగా రైతుకూలీల భావజాలంలో కూడా మార్పు వచ్చింది! ప్రజలు వ్యతిరేకించే జాగిర్దారీ వ్యవస్థను 1949 ఆగస్ట్‌లో గవర్నర్ జనరల్ రద్దు చేశారు. అప్పటికి ప్రజలు అనుభవిస్తున్న ఆస్తులపై హక్కులను నిర్ధారిస్తూ పౌరప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. మారిన పరిస్థితుల్లో ఇప్పుడు ఎందుకు పోరాటం చేయాలి? కొత్త ప్రభుత్వం సక్రమంగానే పాలిస్తోంది కదా! అని గ్రామీణ ప్రాంతాల ప్రజలు భావించసాగారు! ఈ నేపథ్యంలో ఒక మహానాయకుడి అనుభవమూ ప్రస్తావనార్హమే! ‘చండ్ర’ను కప్పిన నివురు! ‘కంట నిప్పులను చెరగిన చండ్ర రాజేశ్వరయ్య’ అని ప్రజలు పాటలు కట్టి పాడుకునేవారు. నగర జీవితమే తప్ప గ్రామీణ ప్రపంచం గురించి తెలియని నిజాం పాలన పల్లెలను కల్లోలపరచింది. గ్రామీణ తెలంగాణకు కంటగింపుగా మారిన పాలనను కూలదోసేందుకు చండ్ర రాజేశ్వరరావు చూపిన సమరశీలత్వానికి ఉదాహరణ ఆ కితాబు! అప్పటి ముఖ్య నాయకుడు, తర్వాత కాలంలో కమ్యూనిస్ట్ పార్టీ అగ్రనాయకుడు అయిన చండ్ర రాజేశ్వరరావు పోలీస్ చర్య అనంతరం మారిన పరిణామాలను ప్రత్యక్షంగా గమనించారు. ఉద్యమ ఉచ్ఛస్థితిలో కరీంనగర్ జిల్లాలోని దామెలకొండలో ఆయన అజ్ఞాతవాసం గడిపారు. అప్పట్లో గ్రామీణులు ఆయనను ఆరాధించారు. అలసి వచ్చిన చండ్రను ఒయాసిసులా సేదతీర్చేవారు. మారిన పరిస్థితుల్లో వారిలో వచ్చిన తేడాను ఆయన గమనించారు. ఆశ్రీతుడికి అన్నం పెట్టే వారేరి? ఆకలి తట్టుకోలేక సమీపంలోని పొలం నుంచి కొన్ని మొక్కజొన్న కంకులను తుంచుకున్నారు. కాల్చుకుని ఆకలిని చల్లార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా గమనిస్తోన్న గిరిజనులు చుట్టుపక్కల అలికిడిని సంశయాత్మకంగా గ్రహిస్తున్నారు. ప్రమాదం ముంచుకొస్తుందని ఊహించిన చండ్ర రాజేశ్వరరావు తక్షణం ఆ ప్రాంతం నుంచి మాయమయ్యాడు. క్షణ-శకలం ఆలస్యమైతే తనను చుట్టుముట్టిన భారత ప్రభుత్వపు సైన్యానికి బందీ అయ్యేవాడే! నిన్న దళాలను స్వాగతించిన గ్రామీణులే నేడు రావొద్దయ్యా అని ప్రాధేయపడుతున్నారు! నైజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా గ్రామీణులకు రక్షణగా నిలచిన కామ్రేడ్లు, తమకు తాము రక్షణ కల్పించుకోలేకపోయారు! సైన్యం ధాటికి గ్రామీణుల నిస్తబ్దత! సో... వాట్ టు డూ? (అంతర్జాతీయ కమ్యూనిస్ట్ నేత స్టాలిన్‌తో భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధి బృందం సమావేశం, వచ్చేవారం...) ప్రజెంటేషన్: - పున్నా కృష్ణమూర్తి -
నెహ్రూ విమర్శ..మధుర జ్ఞాపకం
మతం, భాష మనుషులను కలిపి ఉంచలేవని, సంస్కృతి మాత్రమే ఆ పని చేయగలదని నా జీవితం నేర్పింది. శరణార్థిగా ఇక్కడకు వచ్చిన నన్ను,నా కుటుంబాన్ని, లక్షలాది ఆశ్రీతులను భారతీయ సమాజం కొద్దిరోజుల్లోనే తమ వారిగా మలుచుకుంది. ఆంధ్రరాష్ట్రంలో అధికారిగా, పూర్వ ఆంధ్రప్రదేశ్‌లో సమాచార-ప్రజాసంబంధాల డెరైక్టర్‌గా ఇక్కడి నా జీవితం నిత్యనూతనంగా గడిచింది. తెలుగు-ఉర్దూ-హిందీ-ఇంగ్లిష్ భాషలలో ప్రముఖులతో వ్యాసాలు రాయించి ఆంధ్రప్రదేశ్ పత్రికను నాలుగు భాషల్లో తెచ్చాను. అప్పట్లో ప్రముఖ పత్రికలు ఇచ్చే పారితోషికాల కంటే అదనంగా ఆంధ్రప్రదేశ్ పత్రిక వ్యాసకర్తలు పారితోషికాన్ని పొందేవారు. నాలుగు భాషలకు వ్యాసకర్తలకు వెరసి, రూ.37 వేలు చెల్లించేవాళ్లం. ఆంధ్రప్రదేశ్ పత్రికను అప్పటి ఇతర పత్రికలూ ప్రశంసించేవి! విజయవాడలో బుక్ ఎగ్జిబిషన్స్ జరిగితే ఆంధ్రప్రదేశ్ పత్రిక తరఫున ఒక స్టాల్‌ను తీసుకున్నాం. వామపక్షభావాల కేంద్రంగా ఉన్న విజయవాడలో కాంగ్రెస్ ప్రభుత్వపు పత్రికను ఆదరిస్తారా? అని మంత్రులు అనేవారు! భిన్నాభిప్రాయాన్ని వ్యక్తపరచడమే కదా ప్రజాస్వామ్యం అన్న అభిప్రాయాన్ని గౌరవించేవారు. పత్రికలో రాష్ట్ర మంత్రివర్గం ఫొటో ఒక్కటంటే ఒక్కటే ప్రచురించేవారం. మిగిలిన అంశాలన్నీ సామాజికమే! అలాంటి వాతావరణంలో ఒక విమర్శ గురించి ప్రస్తావిస్తాను ! నందికొండ-నాగార్జున సాగరం వరదలను నివారించడం, కృష్ణానదికి ఇరుప్రాంతాలలోని మెట్ట ప్రాంతాలకు తాగు నీరు అందించడం, విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం తదితర బహుళార్థాలను సాధించేందుకు నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని తలపెట్టారు. 1955 డిసెంబర్ 10న నల్లగొండ జిల్లాలోని పైలాన్‌లో ప్రథమ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఈ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశారు. అప్పట్లో ఈ ప్రాజెక్ట్‌ను నందికొండ ప్రాజెక్ట్ అనేవారు. ఆంధ్రరాష్ట్రం-హైద్రాబాద్ స్టేట్ ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పడిన తొలినాళ్లలో ఈ ప్రాజెక్ట్‌ను నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌గా మార్చారు. ఆచార్య నాగార్జునుడు ఈ ప్రాంతం వాడే! బౌద్ధ ధర్మాన్ని, వజ్రయానాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు! ఆధునిక మానవతా దేవాలయంగా తాను అభివర్ణించిన నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణగతిని ప్రధాని నెహ్రూ ప్రత్యేకంగా గమనించేవారు. శ్రామికుని ప్రమిద! మహాత్మాగాంధీ ఆశించిన గ్రామస్వరాజ్యాన్ని సాధ్యం చేయాలనే తలంపుతో 1959 అక్టోబర్ 2న రాజస్థాన్‌లోని నాగూర్‌లో దేశంలో తొలి గ్రామ పంచాయతీ సమితిని ప్రధానమంత్రి నెహ్రూ ప్రారంభించారు. మరుసటి వారం విజయదశమి రోజున అక్టోబర్ 11న రాష్ట్రంలో తొలి పంచాయతీని షాద్‌నగర్‌లో ప్రారంభించారు. కార్యక్రమం అనంతరం తనకెంతో ఇష్టమైన నాగార్జునసాగర్‌ను సందర్శించారు. అక్కడ ఆనకట్టను వాటర్ క్యూరింగ్ చేస్తోన్న ఒక శ్రామికుడిని ఆయన పలకరించారు. ఆ శ్రామికుడు నెహ్రూతో ‘ఇది నీవు వెలిగించిన దీపం’ అన్నారు. ఇతను ఏమంటున్నాడు ? అని నెహ్రూ ముఖ్యమంత్రి సంజీవరెడ్డిని అడిగారు. ‘ఇట్ వజ్ ల్యాంప్ లెటైన్డ్ బై యు’ అని సంజీవరెడ్డి ఇంగ్లిష్‌లో చెప్పారు! ఆ మాటను వింటున్నప్పుడు నెహ్రూ మోములో వెలిగిన దీపాన్ని నేను గమనించాను! శ్రామికుని గుండెలోతుల్లోంచి వచ్చిన మాట కదా! నా శరీరమూ పులకరించింది! ‘మనం మన జీవితాల్లో కొత్త దీపాలను వెలిగిస్తామా? లేక ఉన్న దీపాల వెలుగులను ఆర్పేస్తామా! మనం మన జీవితాలను కొత్త వెలుతురులు ప్రసరించడం ద్వారా అర ్థవంతం చేసుకోవాలి..’ అని నెహ్రూ వివిధ సందర్భాల్లో అన్నారు కూడా! సరే, ఆంధ్రప్రదేశ్ తర్వాత సంచికకు కంటెంటూ దొరికిందని నేను అదనంగా ఆనందించాను! పీఎంవో నుంచి ‘దీపపు సెగ’! రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వమూ సమాజ అభ్యుదయానికి తోడ్పడే ఎన్నెన్నో కొత్త కార్యక్రమాలను, ప్రాజెక్టులను చేపడుతోంది అనే భావంలో ‘ఎన్నో కొత్త దీపాలను వెలిగిస్తోంది’ అని ఒక ప్రకటనను కవితాత్మకంగా రూపొందించాను. ప్రధానమంత్రితో శ్రామికుడు అన్నమాటలను వగైరా..వగైరా ఉదహరించాను. ఆంధ్రప్రదేశ్ పత్రికలో రాష్ట్రప్రభుత్వం తరఫున ఆ ప్రకటనకు ఎన్నో ప్రశంసలు వచ్చాయి ! ఒక రోజు ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) నుంచి ఫోన్ వచ్చింది. ఆయన కార్యదర్శి క్లుప్తంగా ఒక్కమాట అన్నారు. ఏమని ? ప్రైమ్ మినిస్టర్ డస్ నాట్ లైక్ టు యూస్ హిస్ నేమ్ ఇన్ అడ్వర్టయిజ్మెంట్ (ప్రధానమంత్రి తన పేరును ప్రకటనలలో వాడటాన్ని ఇష్టపడరు) అని!ఈ విమర్శ నా జీవితంలో మధురమైన అనుభవం! ప్రెజెంటేషన్: పున్నా కృష్ణమూర్తి -
మోహ్ అప్‌నేహి రంగ్ రంగ్ మె రంగ్ దే..!
మాండలిన్‌పై సూఫీ గీతం! హరిహరన్‌తో వహ్వాలు అందుకున్న శ్రీనివాస్! ‘‘ఇక్కడ అస్తమించిన సూర్యుడు మరెక్కడో ఉదయిస్తాడు! శుక్రవారం చెన్నైలో నిశ్చలమైన మాండలిన్ శ్రీనివాస్ వేళ్లు మరెక్కడో వేళ్లూనుకుని సంగీత సుధలు పలికిస్తాయి! సరస్వతి ఆయన వేలి కొసలలోకి ప్రవహిస్తుంది కాబట్టే ‘హంసధ్వని’ మన చెవులకు సోకుతుంది! చూస్తూ ఉండండి.. మరేదో తంత్రీ వాయిద్యంతో ఆరేళ్లలో ‘కార్నెగీ హాల్లో’ ప్రపంచాన్ని విస్మయపరుస్తాడు’’ .. మాండలిన్ శ్రీనివాస్ వాద్యకచేరీని ప్రముఖ గాయకుడు హరిహరన్‌తో వీనులవిందుగా ఆలకించిన హైద్రాబాదీల మనోగతం అది! ఏ సందర్భంలో? పద్మవిభూషణ్, సంగీత్ మార్తాండ్ పండిట్ జస్రాజ్ తన తండ్రి, సోదరుల పేరుతో నెలకొల్పిన ‘పండిట్ మోతీరామ్ పండిట్ మణిరామ్ సంగీత్ సమారోహ్’ ఉత్సవాలలో పాల్గొనేందుకు మాండలిన్ శ్రీనివాస్ 2004లో నగరానికి విచ్చేశారు. శ్రీనివాస్ అంటే ఎవరు? సమకాలీన మొజార్ట్! సమకాలీన యహుది మెనుహిన్! మాండలిన్ పుట్టిన తర్వాత కర్ణాటక-హిందుస్తానీ శాస్త్రీయ సంగీతాన్ని పలికించిన అనితరుడు! తూర్పుపడమరల గాయకులు, వాద్యవేత్తలతో వివిధ అంతర్జాతీయ వేదికలపై పాల్గొన్నవాడు! జాన్ మెక్లగిన్ - గిటార్, జకీర్ హుసేన్-తబలా, సెల్వగణేష్-కంజీర, ఘటం.. శంకర్ మహదేవన్ గాత్రంతో యు. శ్రీనివాస్ మాండలిన్‌ను విని మంత్రముగ్ధులైన ప్రేక్షకులు ఆయనను ప్రత్యక్షంగా చూసే అవకాశం విడుచుకుంటారా? శ్రీనివాస్‌ను వినేందుకు, చూసేందుకు సంగీతాభిమానులైన హైద్రాబాదీలు కిక్కిరిసి పోయారు. 2004, డిసెంబర్ 20వ తేదీ, మంగళవారం ఆహ్లాదకరమైన సాయంత్రం.. జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే సాధ్యమైన సంగీత సంగమం ప్రారంభమైంది. పద్మశ్రీ హరిహరన్’ ‘మోహము చెలిపై ముంచిన వాడా..’ తరహాలోని సూఫీ గీతాన్ని అందుకున్నారు! ‘‘మోహె అప్నెహీ రంగ్ మె రంగ్ దే రంగీలా తూ తో సాహెబ్ మొర మెహబూబ్ హి ఇలాయీ...’’ పాటవిని ప్రేక్షకులు పరవశులైనారు! మాండలిన్‌పై శ్రీనివాస్ విన్పించాలి. క్రీ.పూ. 3వేల సంవత్సరాలనాటి తంత్రీ వాద్యం అనేక రూపాలలో పరిణామం చెందుతూ పేర్లను మార్చుకుంటూ ‘మాండలిన్’ అనే పాశ్చాత్యపరికరంగా రూఢి అయిన తర్వాత తొలిసారిగా భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని పలికించిన శ్రీనివాస్ సూఫీ గీతాన్ని ఎలా విన్పిస్తారు? చెవులు రిక్కించి ఉత్కంఠకు లోనైనారు రసహృదయులైన ప్రేక్షకులు! ఏమా అనుభూతి? ఆ శబ్దసౌందర్యానికి గాయకుడైన హరిహరన్ పులకించి పోయాడు. పలుమార్లు ‘వహ్వా’లను పలికారు. ప్రేక్షకుల సంగతి చెప్పాలా? బాలురు నృత్యం చేశారు! శ్రీనివాస్ ‘శిశుర్వేత్తి’ కదా! - పున్నా కృష్ణమూర్తి -
హరివిల్లు పరిమళించింది!
మనిషి మరణిస్తాడు. మనుషులు మరణించరు. ఈ సత్యం రాజ్యాలకూ వర్తిస్తుంది. యునెటైడ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ అంతరించినా ఆ రాజ్యరమ అయిన సోవియట్ పుస్తక సాహిత్యం తెలుగులో సజీవంగానే ఉంది! ఇది అసంకల్పితమా? అప్రయత్నమా? కాదు! అనంతకాలం నుంచి విత్తనాలను రక్షిస్తోన్న అనిల్ బత్తుల వంటి గిరిజన హృదయం ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది! సోవియట్ సాహిత్యంతో ఒక సాయంత్రం! ‘నా బాల్యాన్ని నాకు ఇచ్చేయ్’ అన్న కవి వాక్కు నిజమైతే ఎలా ఉంటుంది? టైం మిషన్‌లో వెనక్కి పోతే ఎలా ఉంటుంది? కనుమరుగై కనిపెంచిన పెద్దవారు ప్రత్యక్షమై ముచ్చట్లు పెడితే ఎలా ఉంటుంది? ఉక్రెయిన్ జానపదగాథలూ, కుప్రిన్ రాళ్ల వంకీ కథలు, జమీల్యా, ఇకతియాండర్, నిత్యజీవితంలో భౌతికశాస్త్రం మనకళ్లముందు పరచుకుంటే ఎలా ఉంటుంది? గోర్కీ అమ్మ అనునయం మనలను తాకితే ఎలా ఉంటుంది? ‘అనిల్ బత్తుల’ ఫేస్బుక్ ఎకౌంట్లా ఉంటుంది! రాముని స‘న్నిధి’చాలా సుఖము, అని త్యాగయ్య గుణగానం చేసినట్లుగా హిటాచీ సంస్థలో కన్సల్టెంట్‌గా పనిచేస్తోన్న అనిల్ బత్తుల బ్యాంక్ అకౌంట్లో నిధి కంటే ఫేస్ బుక్ అకౌంట్లో తెలుగులో ప్రచురితమైన సోవియట్ పుస్తకాల నిధి ముఖ్యం అని సీరియస్‌గా కమిటైపోయాడు! తోట పువ్వులనడిగి ఏటి నవ్వులనడిగి అన్నట్లుగా తన వద్ద ఉన్న పుస్తకాలను సేకరించిన పుస్తకరాలను పీడీఎఫ్ రూపంలో అందుబాటులో ఉంచారు. ‘నిరుడు కురిసిన హిమసమూహాలను’ నిన్నటి తరం నెమరువేసుకుంటోంది. నేటి తరానికి వివరిస్తోంది. తమ అనుభవాలను పంచుకునేందుకు సోవియట్ సాహిత్యపు అభిమానులు లామకాన్‌లో ‘సోవియట్ సాహిత్యంతో ఒక సాయంత్రం’ ఏర్పాటు చేశారు. పిల్లా పాపలతో విచ్చేసిన పెద్దలు ప్రదర్శనకోసం ఉంచిన పుస్తకాలను స్పర్శించి (చదివేందుకు అనిల్ బత్తుల ఫేస్బుక్లో మాత్రమే లభ్యం కదా) ఆనందించారు. ‘చందమామ’ అందిన రోజులా సంతసించారు. రష్యా విప్లవాన్ని విజయవంతం చేసిన ‘సత్యం’ (ప్రావ్దా) స్ఫూర్తితో, ప్రపంచ మానవాళికి శుభం పూయాలని అందుకు సాహిత్యం వాహిక కావాలని సోవియట్ ప్రచురణరంగాన్ని నిర్దేశించారని వడ్డేపూడి హనుమంతరావు, అట్లూరి అనిల్ తదితరులు గుర్తుచేసుకున్నారు. విశాలాంధ్రలో తాను కెరీర్ ప్రారంభించిన తొలిరోజుల్లో సోవియట్నుంచి అప్పుడే దిగిన పార్శిల్స్‌లో పుస్తకం తెరచి వాసన చూసిన వైనాన్ని ఉప్పల లక్ష్మణరావు తదితర అనువాదకులతో పనిచేయడాన్ని ఆర్టిస్ట్ మోహన్ గుర్తుచేసుకున్నారు. బెంగళూరు నుంచి విచ్చేసిన మనసు ఫౌండేషన్ రాయుడు అనిల్ బత్తులకు తమ కంట్రిబ్యూషన్ సార్థకమైందన్నారు. ‘విల్డర్డ్’ పుస్తకంలో జీసస్ వర్ణచిత్రం ఇప్పటికీ తొణికిసలాడుతోందన్నారు ఆర్టిస్ట్ రమాకాంత్. తన చైతన్యానికి సోవియట్ పుస్తకాలే ప్రేరణలన్న ఎన్.వేణుగోపాల్ ప్రపంచ సాహిత్యాన్ని తెలుసుకునేందుకైనా ఈ పుస్తకాలను మళ్లీ చదవాలన్నారు. ఎంత పిచ్చి ఉంటే ఇంత మంచి పనిచేయాలి? అనిల్ బత్తుల వంటి పిచ్చివాళ్లు పెరగాలని ఆకాంక్షించారు శివాజీ! యస్, లాంగ్ లివ్ ద మాడ్నెస్! సోవియట్ సాహిత్యాన్ని ప్రచురించిన సంస్థ పేరు ‘రాదుగ’ (ఇంద్రధనుస్సు)! లామకాన్‌లో ఇంద్రధనుస్సు పరిమళించడంలో వింతేముంది! - పున్నా కృష్ణమూర్తి -
హంబర్ హాక్
కారు కొందరికి హోదా! కొందరికి అవసరం! మాసబ్‌ట్యాంకులో మా ఇంటి పక్క నవాబు గారుండేవారని చెప్పాను కదా! ఆయన కాంపౌండ్‌లో ఒక కారుండేది! జాకీలపై నిలపెట్టిన పాతకారు! ఓ రోజు, నాలుగు టైర్లను, బ్యాటరీని కిరాయికి తెప్పించారు! నడిచేందుకు వీలుగా కారును మరమ్మతు చేయించారు! దాచుకున్న షెర్వానీ దరించారు. దర్పంగా కూర్చుని, దర్జాగా డ్రైవ్ చేస్తూ డిన్నర్‌కు వెళ్లారు. జానపద కథలో రాకుమారిగా మారిన పేదరాలు‘సిండ్రెల్లా’ ఆనందాన్ని గుర్తుచేస్తూ : నబాబుగారు పార్టీనుంచి ఇంటిలోకి అడుగు పెట్టారు! స్వంత కారును ఎవరు కోరరు? అవసరం కూడా కదా! హైద్రాబాద్ వచ్చిన తొలి నాళ్లలోనే కారు గురించి ప్రయత్నాలు చేశాను. ఇంగ్లండ్‌కు చెందిన రూట్స్గ్రూప్ తయారీ అయిన హంబర్ కారు సెకండ్ హ్యాండ్లో అమ్మకానికి ఉంది అని తెలిసింది. రెండవ ప్రపంచయుద్ధం పూర్తయ్యాక కొద్ది మంది వీఐపీలకోసం ప్రత్యేకంగా తయారైన 1946 మోడల్ హంబర్ హాక్ కారు! ప్రపంచంలో అత్యధిక ధనవంతుడు 7వ నిజాం సర్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ వాడిన కారు! ఆయన రాజ్‌ప్రముఖ్ హోదాలో వరల్డ్ రిచెస్ట్ మ్యాన్‌గా జీవించే ఉన్నారు. అంతటి మహాశయుడు వినియోగించిన కారు! మరోమాట లేకుండా చెప్పిన ధరకు (రూ.3,200, అక్షరాలా మూడు వేలా రెండువందల రూపాయలు) వెంటనే కొన్నాను! నా కారును స్థానికులు మహా ఆరాధనాపూర్వకంగా చూసేవారు! చూడరా మరి! నిజాం కారు కదా! ఆ కారణం అర్థసత్యమేనని అంతకంటే మహత్తరకారణం ఉందని తర్వాత తెలిసింది! నిజాం-విప్లవం-ప్రజాస్వామ్యం హైద్రాబాద్ చరిత్రతో బాగా పరిచయం ఉన్న వ్యక్తులు నా కారు గురించి అనేక విశేషాలు చెప్పేవారు! కొంచెం ఫ్లాష్‌బ్యాక్‌కు వెళ్దాం! నిజాంను హతం చేయాలని ఒక విప్లవ సంస్థ తీర్మానించుకుందట! నారాయణరావ్ పవార్ అనే ఆర్యసమాజీకుడు ఇందులో సభ్యుడట. కొండాలక్ష్మణ్ బాపూజీ ఈ సంస్థకు సలహాదారుడ ట! నిజాం దారుషిఫాలోని తన మాతృమూర్తి సమాధిని సందర్శించుకోవడానికి కింగ్‌కోఠీ నివాసం నుంచి రోజూ నిర్ణీత వేళకు కారులో బయలుదేరుతాడని పవార్ బృందం నిర్ధారించుకుందట! 1947, డిసెంబర్ 4వ తేదీన నిజాం బయలుదేరిన కారుపై నారాయణరావ్ పవార్ బాంబు వేశారట! కారును ఓ ఇంట్లోకి మళ్లించిన డ్రైవర్ చాకచక్యంతో నిజాం బతికి బట్టకట్టాడని కొందరు, కాదు, కారు గట్టిదనం వల్లేనని మరికొందరూ చెబుతుండేవారు! నారాయణరావ్ పవార్‌ను 1948, సెప్టెంబర్ 18న ఉరితీయాలని కోర్టు తీర్పునిచ్చింది. సరిగ్గా ఒక్కరోజు ముందు నిజాం భారత ప్రభుత్వానికి లొంగి పోయాడు. పవార్ దీర్ఘకాలం (2010) జీవించారు. ఒక శరణార్థ్ధి నిన్నటి పాలకుడి కారుకి యజమాని కావడం ‘మిరకిల్ ఆఫ్ డెమొక్రసీ’ కదా! అలా సాగనంపాను! నా కారుకు బ్రేకులు పడేవి కాదు. అయినా, ఒక్క చిన్ని ప్రమాదమూ జరగకుండా డ్రైవ్ చేశాను. స్పేర్ పార్టులు సరిగ్గా దొరికేవి కావు. హంబర్ హాక్ సిటీలోనే కాదు స్టేట్ అంతా హాట్ టాపిక్ అయ్యింది! నా అవసరానికి ఉపయోగపడడం ముఖ్యం కదా! లాభం లేదని అమ్మకానికి పేపర్లో ప్రకటన ఇచ్చాను. నెల్లూరుకు చెందిన రామిరెడ్డి గారనే వ్యక్తికి కొన్నధరకి పైసా ఎక్కువ కాకుండా, తక్కువ కాకుండా అమ్మేశాను! ప్రజెంటర్ : పున్నా కృష్ణమూర్తి -
ఇదో భువన విజయం
వరుసగా... అనువుుల(కుందావఝల కృష్ణవుూర్తి), దాశరథి కృష్ణమాచార్య (గిరిజావునోహర్బాబు), సురవరం ప్రతాపరెడ్డి(తిరువుల శ్రీనివాసాచార్య), ఆళ్వార్‌స్వామి(దత్తాత్రేయుశర్మ), కాళోజీ(యుల్లారెడ్డి) తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి దాశరథి కృష్ణమాచార్య 89వ జయంతిని రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఘనంగా నిర్వహించింది. కొన్ని దశాబ్దాలుగా ‘ఆంధ్రప్రదేశ్’లో ప్రాచుర్యంలో ఉన్న ‘భువనవిజయా’న్ని తలపిస్తూ ‘తెలంగాణ విజయా’న్ని గుర్తు చేస్తూ ‘సుకవితాశరథీ! దాశరథీ’ కార్యక్రమాన్ని అపూర్వంగా ప్రదర్శించింది. భువన విజయంలోని అష్టదిగ్గజ కవులు చారిత్రకంగా సమకాలికులు. అలాగే రవీంద్రభారతిలో మంగళవారం నిర్వహించిన ‘సుకవితాశరథి’లోని తెలంగాణ కవులు దాశరథికి సమకాలికులు, పూర్వీకులు. ప్రముఖ రచయిత సురవరం ప్రతాపరెడ్డిగా తిరుమల శ్రీనివాసాచార్య, దాశరథిగా గన్నమరాజు గిరిజా మనోహర్‌బాబు, వట్టికోట అళ్వారుస్వామిగా దత్తాత్రేయశర్మ, వానమామలై వరదాచార్యులుగా మధుసూదనరావు, కాళోజీగా పొద్దుటూరి యల్లారెడ్డి, అనుముల కృష్ణమూర్తిగా కుందావఝల కృష్ణవుూర్తి, చందాల కేశవదాసుగా పురుషోత్తమాచార్య, పల్లా దుర్గయ్యగా ఆచార్య వేణు, ఒద్దిరాజు సీతారామచంద్రరావుగా మడిపల్లి సుబ్బయ్య, ఆయన సోదరుడు ఒద్దిరాజు రాఘవరావుగా వనం లక్ష్మీకాంతరావు.. దాశరథితో ‘తెలంగాణ చారిత్రక, సాంప్రదాయ, ఉద్యమ ఘట్టాలను’ సమకాలీనులుగా పంచుకున్నారు. అప్పటికప్పుడు ఆయా పాత్రలను పోషించిన కవులు సహజంగా రూపొందించుకోవడం విశేషం. రూపకంలో కొన్ని వ్యక్తీకరణలు... వట్టికోట అళ్వారు స్వామి: నిజామాబాద్ జైల్లో దాశరథీ ‘ఓరోరి నైజాము...’ అంటూ నీవు ఆశువుగా కవిత్వం చెబుతుండగా పళ్లు తోముకునేందుకు ఇచ్చిన బొగ్గు ముక్కతో జైలు గోడలపై రాశాను కదా. రాసింది చూసి, రాసింది నేనేననుకుని పోలీసులు వేరే గదిలో వేసి కొట్టారు. దెబ్బలు గట్టిగా తగిల్నయి. నీది గట్టి కవిత్వం! చందాలకేశవదాసు: దాశరథీ... నీకంటే ఎంతో ముందు పుట్టినవాడిని. పరబ్రహ్మ పరమేశ్వరా, పురుషోత్తమ సదానంద అనే ప్రార్థనా గీతము, భలేమంచి చౌకబేరము- మీరజాలగలడా పాటలు రాస్తోన్న కాలం. నిన్ను అప్పట్లో చూడక పోయినా 15వ ఏట నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నావని నీ గురించి విన్నాను. ‘ నీ నినాదం తెలంగాణ మేనిసొమ్ము’! దాశర థి: తెలంగాణ స్వప్నం ఫలించడం వల్ల మనందరం ఇలా బతికి బట్టకట్టాం. తెలంగాణలో కవులు లేరన్న ‘ముడుంబై’ మాటలను పట్టుదలగా తీసుకుని గోలకొండ కవుల సంచికతో మూడు నూర్ల కవులను పరిచయం చేస్తూ సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షతన సమావేశమైన మనం పోతన వారసులం. ‘ఇమ్మనుజేశ్వరాధముల...’ అన్న పోతన నుంచి మన వరకూ, ఇకముందూ, తెలంగాణ కవులు ధిక్కార కవులే! సాహితీరూపకంలో పాల్గొన్న కవులను, క్వశ్చన్ మార్క్(?) శీర్షికతో దాశరథి రచన ‘ఆ చల్లని సముద్రంలో...’ ఆలపించిన దాశరథి గ్రామస్తుడు నందన్రాజును భాషా సాంస్కృతిక శాఖ డెరైక్టర్ రాళ్లబండి కవితాప్రసాద్ సత్కరించారు. - పున్నా కృష్ణమూర్తి -
కళల బంగారులోకం!
గోల్డెన్ త్రెషోల్డ్.. ఒకప్పుడు ‘కవికోకిల’కు బంగారు వాకిలి. ఇప్పుడు కవిసంగమమ్, కవిపుంగవుల కవితా లోగిలి. సాంస్కృతిక వికాసానికి కేంద్రం. థియేటర్ ఆర్ట్స్‌కు వేదిక. కళాభిమానులకు నెలవు. ఇంకా చెప్పాలంటే.. అదో కొత్త ‘బంగారులోకం’! గోల్డెన్ త్రెషోల్డ్ నేపథ్యమిది. స్వాతంత్య్ర సమరయోధురాలు, నైటింగేల్ ఆఫ్ ఇండియా సరోజినీనాయుడు తన 13వ ఏటనే 1300 లైన్ల ఇంగ్లిష్ కవితాఖండికను రాశారు. దాని పేరే గోల్డెన్ త్రెషోల్డ్. 1896లో లండన్‌లో, 1905లో హైదరాబాద్ అబిడ్స్‌లోని తన నివాసంలో ఆ కవితాఖండిక ఆవిష్కృతమైంది. అప్పటి నుంచి ఆమె నివాసం ‘గోల్డెన్ త్రెషోల్డ్’గా మారింది. మరిప్పుడు..! గోల్డెన్ త్రెషోల్డ్‌లోనే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పురుడుపోసుకుంది. యూనివర్సిటీ గచ్చిబౌలికి తరలిన అనంతరం ‘సరోజినీ నాయుడు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్స్’ విభాగాన్ని ఇక్కడే నిర్వహిస్తున్నారు. లలిత కళలు, నృత్యం, రంగస్థల కళలు, మాస్ కమ్యూనికేషన్ కోర్సులను అభ్యసించే విద్యార్థినీవిద్యార్థులతో ఈ ఆవరణ నిత్యం ‘కళ’కళలాడుతోంది! కదిలే థియేటర్! వేర్లు స్థిరంగా ఉంటాయి. శాఖలు విస్తరిస్తాయి. ఈ సూత్రంతో పనిచేస్తోంది ‘థియేటర్ ఔట్రీచ్’. నగర సాంస్కృతిక వేదికగా గోల్డెన్ త్రెషోల్డ్‌కు గుర్తింపు తేవడంలో థియేటర్ ఆర్ట్స్ విభాగం డీన్ ప్రొఫెసర్ అనంతకృష్ణన్ నేతృత్వంలోని టీం కృషి చేస్తోంది. ఇక్కడి రంగస్థల కళల శాఖలో చదువుకున్న అనేకమంది విద్యార్థులు ఉపాధ్యాయులుగా, నటీనటులుగా, సాంకేతిక నిపుణులుగా రూపొందారు. నేషనల్ థియేటర్ ఆఫ్ డ్రామాకు చెందిన వివిధ రాష్ట్రాల బృందాలు గోల్డెన్ త్రెషోల్డ్లో వర్క్‌షాప్‌లను నిర్వహిస్తున్నాయి. ప్రదర్శనలు ఇస్తున్నాయి. ఇక్కడ రూపొందించిన అడ్వెంచర్స్ ఆఫ్ చిన్నారి, మిస్ మీనా, పతంజలి నాటకోత్సవం, అప్సా రెయిన్బో తదితర నాటికలను రాష్ట్రంలోని వివిధ పట్టణాలకు తీసుకెళ్లారు! ఆయా ప్రాంతాలలోని కళాకారులను, కళాభిమానులను గోల్డెన్ త్రెషోల్డ్‌కు ఆహ్వానిస్తున్నారు. ఆరుబయలు రంగస్థలం, సమావేశ మందిరం, డాక్యుమెంటరీలు ప్రదర్శించేందుకు అనువైన హాల్ తదితర సౌకర్యాలను వివరిస్తున్నారు. ్టజ్ఛ్చ్టిట్ఛౌఠ్టట్ఛ్చఛిజి.ఛిౌఝ ద్వారా తమను సంప్రదించవచ్చని నిర్వాహకులు సూచిస్తున్నారు. కళల ‘సంగమమ్’ దాదాపు ప్రతిరోజూ సాయంత్రం ఈ ఆవరణ ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమానికి వేదిక అవుతోంది. ఫేస్బుక్లో దాదాపు మూడువేల మంది సభ్యులు, అంతకు రెట్టింపు సంఖ్యలో పాఠకులు గల కవిసంగమమ్ సంస్థ సభ్యులు ముఖాముఖి కలుసుకునేందుకు తెలుసుకునేందుకు వేదిక ‘గోల్డెన్ త్రెషోల్డ్’! నెలనెలా స్థానిక, జాతీయ, అంతర్జాతీయ కవులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. పిట్టలుగా తామొస్తే చెట్టులా ‘గోల్డెన్ త్రెషోల్డ్’ ఆదరిస్తోందని కవిసంగమమ్ బాధ్యుడు యాకూబ్ కితాబునిచ్చారు! నాటకరంగం కోసం అంకితమై పృథ్వీ థియేటర్ (ముంబై) రంగశంకర (బెంగళూరు) శ్రీరామ్సెంటర్ (న్యూఢిల్లీ) తరహాలో గోల్డెన్ త్రెషోల్డ్‌ను ‘పెర్ఫార్మింగ్ ఆర్ట్’ కేంద్రంగా మలచాలని థియేటర్ ఔట్ రీచ్, ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్ డాక్టర్ పెద్ది రామారావు నేతృత్వంలోని రాజీవ్ వెలిచేటి, రాజీవ్ కృష్ణన్, విష్ణువర్ధన్, నస్రీన్, భాషా తదితరుల బృందం కృషి చేస్తోంది. పున్నా కృష్ణమూర్తి -
పడుచు ప్రపంచపు లబ్‌డబ్
13న యూరోపియన్ ఫిలిం ఫెస్టివల్‌కు వీడ్కోలు యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాలు ఎంపిక చేసిన 19 చిత్రాలను ‘వాయిసెస్ ఆఫ్ యూత్ (యువగళాలు)’ పేరిట మనదేశంలోని నగరాల్లో నిర్వహిస్తోన్న 19వ యూరోపియన్ యూనియన్ ఫిలిం ఫెస్టివల్’లో ఇంగ్లిష్ సబ్‌టైటిల్స్‌తో ప్రదర్శిస్తున్నారు. ముంబై-జోధ్‌పూర్-కోల్‌కతాల మీదుగా ప్రయాణిస్తూ ఈ కదిలే చిత్రాల పండుగ ఈ నెల 4న హైదరాబాద్ విచ్చేసింది. 13న నగర ప్రేక్షకులకు వీడ్కోలు పలికి పుణేకు తరలనుంది. యూరోపియన్ మెయిన్ స్ట్రీమ్ చిత్రాల్లో ఎక్కువ శాతం సామాజిక వాస్తవికతను ప్రతిఫలిస్తాయి. ప్రతి చిత్రం వెనుక ఏదో ఒక సందేశం మిళితమై ఉంటుంది. ఆస్ట్రియా చిత్రం ‘బ్రీతింగ్’ని డెరైక్టర్ కార్ల్ మార్కోవిజ్ క్షణం విసుగు రాకుండా ఆసక్తిగా చూపారు. 18 ఏళ్ల రోమన్ ‘కొగ్లర్’ హత్యానేరంపై బాలనేరస్తుల శిబిరంలో హత్యానేరానికి శిక్షను అనుభవిస్తూ తన తల్లిని గుర్తించే అన్వేషణలో విజయం సాధిస్తాడు. నేటి సినిమాలు మధ్యాహ్నం 3 గంటల నుంచి గోథె జెంత్రమ్లో... లవ్ మి ఆర్ లీవ్ మి: స్లోవేకియా చిత్రమిది. దర్శకురాలు మేరియానా సెనెగెల్ సోల్కాన్స్కా ప్రతిభావంతంగా చిత్రీకరించారు. ఈ చిత్రం ఆ దేశపు మహిళల జీవితాలను స్పృసిస్తుంది. మూడు తరాలకు చెందిన మహిళలు సెలబ్రేషన్ చేసుకునేందుకు కలవడం అనే ఇతివృత్తంతో చిత్రాన్ని ఆసక్తికరంగా మలిచారు. లెసన్స్ ఆఫ్ ఎ డ్రీమ్: ఈ జర్మనీ చిత్రం... వాస్తవిక సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. 1874 ప్రాంతంలో జర్మన్ విద్యార్థులకు ఇంగ్లిష్ నేర్పేందుకు కొన్రాడ్ అనే యువ టీచర్ నానా శ్రమపడాల్సి వస్తుంది. ఫుట్‌బాల్ ఆడించడంతోపాటు ఇంగ్లిష్ కూడా నేర్పుతాడు. సంప్రదాయవాదులు ఆ ఆట వద్దు, ఆ భాష వద్దు అని అడ్డంకులు పెడతారు. ఫ్రెష్ ఎయిర్: ఇది హంగేరీ సినివూ. వయోలా, ఆమె కుమార్తె ఏంజెలా ఇరుకు ఇంట్లో నివసిస్తుంటారు. కలిసే జీవిస్తున్నా వారి ప్రపంచాలు వేరే. వయోలా తనకు నచ్చే పురుషుడి కోసం అన్వేషిస్తుంది. ఏంజెలా ఫ్యాషన్ డిజైనర్ కావాలనుకుంటుంది. ఇద్దరూ ‘ఇరుకు జీవితాల్లోంచి’ బయటపడి కొత్తగాలి పీల్చాలని తహతహలాడతారు. - పున్నా కృష్ణమూర్తి -
శిల నుంచి సీడీ దాకా ‘తాళ్లపాక’ స్వరపేటికలు!
వాగ్గేయ సంపద ‘గుండు కరగగా పాడెను హనుమంతుడు’ అని కీర్తించిన అన్నమయ్య గుండుపై స్వరరచనా చేశాడు. కొంచెం ఆలస్యమైనా రాతిబండపై స్వరసహితంగా దొరికిన అతి ప్రాచీన అన్నమయ్య రచనలు - ‘తిరుమల శిలాగీతం’ పేరుతో సీడీ/పుస్తక రూపంలో విడుదలయ్యాయి. అయితే ఇవి ఇలా రూపుదాల్చడం వెనుక చాలా కథే ఉంది. తిరుమల ఆలయంలో ‘చంపకప్రదక్షిణ’ మార్గంలో ఏడడుగుల పొడవు-నాలుగడుగుల వెడల్పు,తొమ్మిది అంగుళాల మందం కలిగిన రెండు బండలపై వ్యక్తావ్యక్త తెలుగు లిపిని 1949లో గుర్తించారు. ఈ సంగతి వేటూరి ప్రభాకరశాస్త్రి దృష్టికి వెళ్లింది. ‘తాళ్లపాక సాహిత్యం’ పై పరిశోధన చేస్తోన్న ప్రభాకరశాస్త్రి ఇది తాళ్లపాక సాహిత్యమే అని నిర్ధారించారు. అన్నమయ్య. ఆయన కుమారుడు తిరుమలాచార్యులు. మనుమడు చినన్నల రచనలు తాళ్లపాక సాహిత్యంగా సుప్రసిద్ధం. ఆ మువ్వురూ జీవించిన కాలానికి చెందినవిగా వీటిని నిర్థారించారు. అయితే ఆ మరుసటి సంవత్సరమే ప్రభాకర శాస్త్రి మరణించగా ఆయన కుమారుడు వేటూరి ఆనందమూర్తి తండ్రి పరిశోధనా స్ఫూర్తితో 1965లో తాళ్లపాక కవుల సంగీతసాహిత్యంపై పీహెచ్డీ తీసుకుని ఈ శిలాగీతాలను వెలుగులోకి తేవడానికి ప్రయత్నించారు. ఆ భగీరథ ప్రయత్నానికి పరిశోధకులు ఏ.వి.శ్రీనివాసాచార్యులు, ప్రముఖ ఎపిగ్రాఫిస్ట్ (శాసనలిపి పరిశోధకులు) పి.వి.పరబ్రహ్మశాస్త్రి తదితర పెద్దలెందరో సహాయం చేశారు. అయితే అక్షరసాహిత్యాన్ని చదివేందుకు చూపు చాలును. కాని స్వరరచనలను చదివేందుకు చూపొక్కటి చాలదు. ‘చెవి’ సైతం కావాలి ప్రఖ్యాత సంగీత పరిశోధకులు నండూరి పార్ధసారథి శిలాస్వరాలను ఆవిష్కరించేందుకు ముందుకు వచ్చారు. రాతి బండలపై తెలుగు లిపిలో సంస్కృతంలో ఉన్న ఈ అన్నమయ్య స్వర సహిత సాహిత్యం పేరు ‘దశావతార సూలాది’. జాను తెలుగులో 32 వేల కీర్తనలు రచించిన అన్నమయ్య శిలారచన సంస్కృతం కావడం గమనార్హం! కన్నడ నుంచి తెలుగు లిపి పరిణామం చెందినట్లే ‘సూలాది’కి కూడా కన్నడే మాతృక. కన్నడలో ‘హాడు’ అంటే పాట. భక్తులు సులభంగా పాడుకునే పాట సూలాది (సులభహాది). తెలుగులో అనేక సూలాదులను రచించిన తాళ్లపాకవారు సంస్కృతంలో సూలాది ప్రక్రియను చేపట్టడం శిలాగీతాల ప్రత్యేకత! ‘దశావతార సూళాది ప్రబంధం’గా పేర్కొన్న ఈ స్వరరచనలు మాళవగౌళ రాగం (నేటి మాయామౌళవగౌళ)లో ఉన్నాయి. దశావతారాల కీర్తనలలో లోపించిన రెండు అవతారాలకు సంబంధించిన సాహిత్యాన్ని పుల్లెల రామచంద్రుడు, సంగీతాన్ని ఆకెళ్ల మల్లికార్జునశర్మ పూరించారు. సత్తిరాజు వేణుమాధవ్ గానం చేశారు. సూలాది సంగీతాన్ని సీడీ రూపంలో, సాహిత్యాన్ని పుస్తకరూపంలో ప్రభాకర మెమోరియల్ ట్రస్ట్ (9742486122) రూపొందించింది. డెబ్బయ్ సంవత్సరాల కృషి రెండువందల రూపాయలకు లభ్యం! అన్నమయ్య మాటలో ‘వెల సులభము-ఫలమధికము’! - పున్నా కృష్ణమూర్తి -
వాహ్... హైద్రాబాద్ వాహ్....
చెట్టు తొర్రలో పదడుగుల చదరపు గది. పిల్లలు హాయిగా ఆడుకునేంత స్థలం! 16వ శతాబ్దానికి చెందిన అటువంటి చెట్టొక టి గోల్కొండ కోట సమీపంలో నయాఖిల్లా దగ్గర ఉందని నగరంలో ఎందరికి తెలుసు. భారతీయ ఖైదీల కోసం బ్రిటిష్ పాలకులు అండమాన్‌లో కాలపానీ సెల్యులర్ జైల్ కట్టడానికంటే ఏభై ఏళ్ల ముందు 1858లో తెల్ల ఖైదీల కోసం కట్టిన సెల్యులర్ జైలు తిరుమలగిరి క్రాస్‌రోడ్స్‌కు నూరు గజాల దూరంలోనే ఉందని కూడా ఎక్కువ మందికి తెలీదు. నా నగరాన్ని చేపలతో నిండిన జలాశయంలా కళకళలాడేలా చేయి ప్రభూ అని ప్రార్ధించిన నిజాం పాలకులు నగరంలో వేయి జలాశయాలు నిర్మించారు. అవి ఏవి? ఎక్కడెక్కడుండేవి? ఇప్పుడు ఆచూకీ అయినా ఉందా! బ్రిటిష్ పాలకులు కళాసంపదను తమదేశాలకు తరలించుకుపోతోన్న రోజుల్లోనే, అజంతా-ఎల్లోరాల పరిరక్షణకు నిజాం పాలకులు తీసుకున్న శ్రద్ధ, యూరోపు, పర్షియాలు పర్యటించి అక్కడి కళాత్మక వస్తువులను సేకరించిన సాలార్జంగ్ కళాభిరుచి తదితర అసంఖ్యాక ఆసక్తికర అంశాలను ‘హెరిటేజ్ హైద్రాబాద్’లో వివరించారు మల్లాది కృష్ణానంద్. పుస్తకం పేరును బట్టి ఇది కేవలం హైద్రాబాద్‌కు చెందినది అన్పించవచ్చు. వాస్తవానికి, హైద్రాబాద్ నగరాన్ని కేంద్ర బిందువుగా తీసుకుని నాలుగు వందల సంవత్సరాల జాతీయ- అంతర్జాతీయ వైనాలు వైభవాలను ఈ పుస్తకం ఇతివృత్తంలో చూపారు. ఇప్పటి తమిళనాడు- కోస్తాంధ్ర- కర్నాటక-మహారాష్ట్ర ప్రాంతాలకు కేంద్రంగా ఉన్న చారిత్రక హైద్రాబాద్ పాఠకులకు పరిచయం అవుతుంది. ప్రస్తుతం రాష్ట్ర గవర్నర్ ప్రెస్ సెక్రటరీగా పనిచేస్తోన్న కృష్ణానంద్ ఎక్కడ పనిచేసినా ఆయా ప్రాంతాల సాంస్కృతిక విశేషాలను వివరిస్తూ, వాటి పరిరక్షించాల్సిన అవసరాన్ని పత్రికల ద్వారా, పుస్తకాల ద్వారా పాఠకులకు, ప్రభుత్వానికీ సూచిస్తూనే ఉన్నారు. ఆ క్రమంలో హైద్రాబాద్‌కు సంబంధించిన దాదాపు నూరు సాంస్కృతిక ఔన్నత్యాలను తాజా ఇంగ్లిష్ పుస్తకం హెరిటేజ్ హైద్రాబాద్ అనే ముత్యాలసరంగా కూర్చారు. ఇండోపర్షియన్ నిర్మాణశైలికి కలికి తురాయిగా రూపొందిన కుతుబ్‌షాహీ, పైగా టూంబ్స్, నిజాం మ్యూజియం, ఉర్దూప్యాలెస్, గన్‌ఫౌండ్రీ, మహబూబియా కాలేజ్, షాహీ ఖజానా, ఫైర్టెంపుల్, సెయింట్‌జోన్స్ చర్చ్, చర్చిల్ బంగ్లా, తొలి పోస్టాఫీస్, పురానా పూల్, చింతచెట్టు తదితర అనేక చారిత్రక- సాంస్కృతిక అంశాలు ఇందులో ఉన్నాయి. ‘ఫలానా వారసత్వ కట్టడాలు ఇక్కడ ఉన్నాయి. ఇలా ఉన్నాయి’ అని చెప్పి ఊరుకోకుండా వాటిని పరిరక్షించుకునేందుకు తీసుకోదగ్గ కనీస జాగ్రతలను పాఠకులకు, ప్రభుత్వానికి సూచించడం పుస్తకం విశేషం! హైద్రాబాద్ సందర్శకులు, హైద్రాబాద్‌లోనే నివసిస్తున్నవారు కూడా ఈ పుస్తకాన్ని చేతిలో పట్టుకుని తీరికను బట్టి ఒకోరోజు ఒకో ప్రాంతాన్ని చూసి ఆనందించవచ్చు. పుస్తకం : హెరిటేజ్ హైద్రాబాద్ (ఇంగ్లిష్- అన్ని పేజీలూ రంగుల్లో) రచయిత: మల్లాది కృష్ణానంద్ వెల : రూ. 599/- ప్రతులకు : 040-27860079 - పున్నా కృష్ణమూర్తి -
కవిత్వం కళ్ల ముందు కన్పించాకే రాస్తా!
తెలంగాణ రాష్ట్ర గీతకర్త అందెశ్రీ ఇంటర్వ్యూ ఆది శంకరుడిని కీర్తించడం అసాధారణమేమీ కాదు. శంకరుడు పూజించిన ‘చండాలుడి’ని? అసాధారణం కదా. అటువంటి అద్భుతం నిజామాబాద్ జిల్లా అమరాద్లో దాదాపు నాలుగు దశాబ్దాల నాడు జరిగింది. లోకరీతిలో నిజామాబాద్ జిల్లా జనగామ సమీపంలోని రేబర్తిలో 1961 జూలై 18న మాదిగ కులస్తుడిగా పుట్టారు ఎల్లయ్య. అతడి 16వ ఏట శృంగేరీ పీఠానికి చెందిన స్వాములు శంకర్ మహరాజ్ ‘బిడ్డా, కాళిదాసును తెనాలి రామకృష్ణను కనికరించిన అమ్మవారు నీలో ఉంది. నీ సాహిత్యంలో ఆమె అందె విన్పిస్తోంది. నీవు నేటి నుంచి అంద్శైవి అని ఆశీర్వదించారు. ఆచరణలోనూ అపురూపంగా చూశారు. ఒక యజ్ఞంలో ‘అంద్శైని రుత్వికునిగా కూర్చోపెట్టారు. తమ సరసన ‘అతడు’ కూర్చునేందుకు వీలులేదన్న సాంప్రదాయవాదులతో ‘తమరు నిష్ర్కమించవచ్చు. అందె శ్రీ రుత్వికుడు. నేను సోమయాజిని, యజ్ఞానికి మీరు అనర్హుల’న్న అభినవశంకరుడు శంకర్ మహరాజ్! బడి మొఖం చూడని పశువుల కాపరి లలిత జానపద కవి (సెమీ క్లాసికల్ కవి)గా ఆవిష్కృతమైన బతుకు బాటలో ఇటువంటి అపురూపాలెన్నో. ఎర్రసముద్రం సినిమా కోసం ఆయన రాసిన పాట ‘మాయమై పోతున్నడమ్మ మనిషి’ 2006 నుంచి ద్వితీయ ఇంటర్ పాఠ్యాంశం. తెలుగు సినిమా చరిత్రలో ‘మా తెలుగు తల్లికి’, ‘తెలుగు జాతి మనది’ తర్వాత పాఠ్యాంశంగా చేరిన మూడవ పాట ‘మాయమైపోతున్నడమ్మా’ కావడం గమనార్హం. గంగ సినిమాలో ‘వెళ్లి పోతున్నావా’కు నంది అవార్డు స్వీకరించారు, భారత ప్రభుత్వపు 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిన ‘తెలంగాణ’ తన పాటను రాష్ట్రగీతంగా స్వీకరించిన సందర్భంలో అంద్శై ఇంటర్వ్యూ సారాంశం : పాటకు బీజం తెలంగాణ కళాకారులు లేదా రచయితలు తమ తమ సమావేశాలను పాటతో ప్రారంభించడం ఆనవాయితీ. వివిధ సంఘాల సమాహారమైన తెలంగాణ ఉద్యమ కళాకారులు 2002 సెప్టెంబర్ 30న నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో ధూంధాం తలపెట్టారు. అందులో నేనూ పాల్గొన్నా. ముందుగా ఏ పాట పాడాలని మీమాంస వచ్చింది. తెలంగాణకు అందరూ హర్షించే ఒక గీతం లేకపాయెనే అన్పించింది. అందరి నాల్కలపై నిలిచే పాట రాయాలె అనుకున్న. అప్పుడు రెండు చరణాలు ఇప్పుడు రెండు చరణాలు ఊరుతున్నవి. మరుసటి సంవత్సరం సిద్దిపేటలో తెలంగాణ రచయితల సంఘం సమావేశ ప్రారంభగీతంగా పాడుతున్నా... ‘జయ జయహే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరితగల తల్లీ నీరాజనం పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జై తెలంగాణ జైజై తెలంగాణ ... ఎవరో వెనుక నుంచి ‘ఇది తెలంగాణ జాతీయగీతం’ అన్నరు. వెక్కిరింతేమో అని కొంచెం భయపడ్డాను. కాదని తెలిసి తెప్పరిల్లిన. ఆ క్షణం నుంచి ప్రతి ఒక్కరూ ఈ పాటను తమదిగా చేసుకున్నారు. ఏడేళ్లుగా నునుపు చేసిన పాటలో పల్లవితో కలిపి 12 చరణాలున్నవి. లక్షలాది ప్రజానీకం సమక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితి యువ విభాగం ‘జనజాగరణసేన’ సమావేశంలో ఇందులోని నాలుగు చరణాలు పాడారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధినీ విద్యార్థులు ఈ పాటను కొన్నాళ్లుగా పాడుతున్నారు. ఆ నాలుగు చరణాలకు కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర గీతం హోదానిచ్చింది. రాష్ట్రగీతం హోదా పూర్తి పాటను తెలుసుకునేందుకు ఆస్కారం ఇస్తుందని భావిస్తున్నాను. అన్నిటి కంటె గొప్ప ఆనందం నన్ను కొడుకుగా పెంచి పెద్దచేసిన దివంగత బిరుదురాజు ‘ఇది తెలంగాణకు మాత్రమే కాదు, తెలుగు నేల జాతీయ గీతం’ అన్నప్పుడు కలిగింది. ప్రతి భాషా అపౌరుషేయమే! వేదాలు అపౌరుషేయాలు అంటారు. ‘తాను పలికినది కాదు’ అనే అర్ధంలో ప్రతి భాషా అపౌరుషేయమే! ఏ పదం ఏ ఒక్కరూ కనిపెట్టలేదు. మనకు సంక్రమించిన పదాలు, నుడికారాలు, భావాలతో స్వీయానుభవాన్ని రంగరించి గానం చేస్తాం. రచిస్తాం. కాబట్టి ‘జయజయహే తెలంగాణ’ నా ద్వారా వచ్చిన అనేకుల పాట! శతకకవుల్లా తెలంగాణ ప్రాంతంలో ‘వరకవులు’న్నరు. వేమన వలె ‘గున్రెడ్డిపల్లె కుమ్మర సిద్దప్ప’ ప్రజలు పాడుకునే వరకవి. బాల్యంలో పశువులు కాసుకునే వాడిని. చెలకల్లో చెట్టుకిందకు చేరి కొందరు ఆయన పద్యాలు పాడేవారు. అవి నాలో ఇనికి పోయినవి. అక్షరాలు నేర్వకుండనే ఛందస్సుతో పద్యాలు రాయడం ఆ తీరుగ వచ్చింది. గడ్డిపూల బొడ్డుతాడు తెంపుకుని నేలపై పడ్డాను. పండుటాకు ఎంత ఇష్టమో, అంకురించే చివురుపైనా అంత ప్రేమ! ప్రకృతికి చెందిన వస్తు-శిల్పాలకు శృతి లయలు ప్రాణ ప్రతిష్ట చేశాయి. లంకలో సంపద ఎంత ఉన్నా అయోధ్యకు సాటిరాదు అనే నేపథ్యంలో రామునితో ఆదికవి వాల్మీకి ‘జననీ జన్మభూమిశ్చ’ అనే శ్లోకాన్ని చెప్పిస్తారు. అదే భావాన్ని ‘తరతరాల చరితగల తల్లీ నీరాజనం-పది జిల్లాల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం’ అన్నాను. ఆదికవి నుంచి నన్ను ఆదరించిన జక్కిరెడ్డి పూజల మల్లయ్య, ఉడుకుడుకు అన్నం పెట్టిన మహ్మద్ మునీర్ సేట్, బాలబాలికలు, యువతీ యువకులు అందరి పాలూ రాష్ట్రగీతంలో ఉంది. ఇందులో నా వాటా అణాపైసలే! చూడంది రాయలేను! పద్యమైనా, పాటైనా చూడంది రాయలేను. ప్రకృతి మనిషితో సహా అందులో భాగమైన చరాచరాలను చూసినపుడు కలిగిన సంవేదనలనే రాస్తాను. ‘వాక్కులమ్మ’ రాస్తున్నాను. ఆమె సరస్వతి కాదు. ప్రాణిలో పరుగిడు ప్రణవం. సృష్టి కనుచూపు. అందులో ఒక చరణం ‘కోటి భావాల కొనగోట మీటినట్లు-వసుధ విన్పింతు నా మాట వాక్కులమ్మా’. ప్రపంచంలో ఉన్న నదులన్నిటినీ సందర్శించి నదీ కవిత్వం రాయాలని సంకల్పించాను. ఆఫ్రికా, చైనా పర్యటనలు చేశాను. చూసే రాయాలంటే ‘నదిని కంప్యూటర్లో చూడొచ్చు కదా’ అన్నారొక మిత్రులు. కంప్యూటర్‌తో సంసారం చేయగలమా?! - పున్నా కృష్ణమూర్తి -
సరళీకృత కథనాలు!
తాజా పుస్తకం ఈ కాలానికి పనికిరాని రచన మరే కాలానికి పనికిరాదు అన్న జీన్ పాల్ సర్త్ హితోక్తిని పరిగణనలోకి తీసుకుంటే ముందుగా ‘ఈ కాలం’ ఎటువంటిది అని తెలుసుకోవాల్సి ఉంటుంది. రుతుపవనాలు, తుపానులు దేశాల సరిహద్దులను దాటి ప్రభావం చూపుతున్నట్లే సరళీకృత ఆర్థిక విధానాలు ప్రపంచ దేశాల ప్రజలను ప్రభావితం చేస్తున్నాయి. వాటిని వెనక్కి మళ్లించడం సాధ్యం కాదని అందరూ అంగీకరిస్తోన్న నేపథ్యంలో వాటి పోకడలను అర్థం చేసుకోవడం అనివార్యమవుతోంది. ఈ నేపథ్యంలో జాన్సన్ చోరగుడి పుస్తకం ‘సొంత సంతకం’ పఠనీయం అవుతుంది. సాక్షి తదితర దినపత్రికల ఎడిట్ పేజీల్లో ప్రచురితమైన 80 వ్యాసాలను ఈ సంకలనంలో పొందుపరచారు. ఈ పుస్తకం ‘జాన్సన్’ సంతకమే అనడానికి ప్రత్యేక కారణాలున్నాయి. ‘కృష్ణా-గోదావరి మండల మధ్యే’ కృష్ణాజిల్లాలో తాను పుట్టిన కోలవెన్ను గ్రామంలో నిల్చుని సరళీకృత వాతావరణాన్ని స్వానుభవంతో రిపోర్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు సరళీకృత విధానాలు అనుకుంటున్నవి ఎప్పుడూ వేర్వేరు పేర్లతో ఉన్నవేనని ‘నిన్న నుంచి పాఠకుడిని నేటి వరకూ తీసుకు వస్తారు’. రాజధానిలో సచివాలయంలో ఉద్యోగం చేస్తూ ప్రవృత్తిరీత్యా నచ్చక రాజీనామా చేసి విశాఖ జిల్లా పాడేరుకు వెళ్లి, ప్రస్తుతం సమాచార శాఖలో ఉన్నతోద్యోగిగా చేస్తోన్న జాన్సన్ చోరగుడి ఈ వ్యాసాలను సిద్ధాంతాల నుంచి రాయలేదు. తన జీవితం నుంచే పర్యావలోకన చేసి రాశారు. సంస్కరణలను పూర్తిగా వ్యతిరేకించేవారు ఉన్నా సంస్కరణల వలన అందుబాటులోకి రాగల అవకాశాలను అణగారిన వర్గాలు, ప్రాంతాలు, దేశాలు సద్వినియోగం చేసుకోవాలి అంటారు జాన్సన్! సంస్కరణలు ఇచ్చే అవకాశాలను అందుకునే ఆలోచన చేయకుండా ముఖ్యంగా లెదర్ టెక్నాలజీ ఉపాధి అవకాశాలను మాదిగ యువత కాలదన్నుకుంటుందా అని ప్రశ్నిస్తూ, ఎ-బి-సి-డి చిక్కుల్లో కూరుకుపోతోన్న సోదరుల పట్ల ఆవేదన చెందుతారు. ‘ఆడవాళ్లను వ్యభిచారానికి పంపుతాం, తాగి మత్తులో పడుకుంటాం, మమ్మల్ని బాగు చేయడం మీ వల్లేమవుతుంద’న్న సమూహాలలో ‘వెలుగు’లు నిండిన వైనం, బార్డాన్సర్లు కోర్టులకెక్కి అనుమతులు తెచ్చుకున్న చైతన్యాన్ని, కులపరంగా జరిగిన అత్యాచారాలను ఎదుర్కోవడంలో సామాజిక సంస్థల ఉదాసీనతను, ఏ ప్రభుత్వ నివేదికలోనూ వెనకబడిన ప్రాంతంగా లేని అభివృద్ధి చెందిన జిల్లాల్లో సూక్ష్మరుణాల కారణంగా జరుగుతోన్న ఆత్మహత్యలను తనదైన దృష్టి కోణంలో పాఠకులకు చూపారు. ‘హరిజన వాడ’ పంచాయతీ రికార్డుల్లో అఫీసియల్‌గా వాడడం, ‘నాన్-బ్రాహ్మిన్’ అనేపదం పార్లమెంటులో అన్ పార్లమెంటరీగా పరిగణింపబడంలోని ఔచిత్యాన్నీ ఒక వ్యాసంలో ప్రశ్నిస్తారు. అంతేనా? ‘ఇజ్రాయిల్-పాలస్తీనాల పీటముడిని సడలించలేమా’ అనే వ్యాసం బహుశా మరెవరూ రాయలేనిది. శిశువు తండ్రిని పిలిచే తొలి పలుకు ‘అబా’. అబామీడియా ప్రచురణగా వెలువడిన జాన్సన్ వ్యాసాలు పాఠకుడిని తండ్రి స్థానంలో ఉంచి తన నివేదనను వినమని కోరుతున్నవిగా భావించవచ్చు. కాలచక్ర - 2006 ఉత్సవాలు జరిగాయి. 15 రోజుల ఉత్సవాలకు జాన్సన్ మీడియా ఆఫీసర్. ఇది మరెవరి మతమో అనుకున్న స్థానికుల గురించి, దలైలామా ఏమి చెబుతాడా అని చెవులు రిక్కించి విన్న విదేశీయుల గురించి, దలైలామాతో ఫొటోలు దిగి ఉడాయించిన మన వీఐపీల గురించి నిర్మొహమాటంగా చెప్పారు. వృత్తి ప్రవృత్తిల పట్ల స్పష్టతకు ఈ వ్యాసాలు గీటురాళ్లు! - పున్నా కృష్ణమూర్తి సొంత సంతకం, జాన్సన్ చోరగుడి; వెల: రూ.250; కాపీలు: నవోదయ (abbamedia@gmail.com) -
పుర్సత్‌లో పుస్తకం బట్టుడే!
సాహిత్య అకాడెమీ అనువాద పురస్కారం వరుణుడు ఆకాశ విహారి. కురిసిన ప్రాంతాన్ని బట్టి నదీ రూపం-నామం సంతరించుకుంటాడు. పన్నెండు జీవనదుల్లో ఏటా ఒకో నదిలో ప్రవేశించి వరుణుడు పుష్కరుడవుతాడట! నదుల్లో పుష్కరునిలా భారతీయ భాషాస్రవంతుల్లో ప్రవేశించినవారెవరైనా ఉన్నారా? ఉన్నారు! నలిమెల భాస్కర్‌ను భారతీయ భాషలలో ఓలలాడిన పుష్కరుడు అనడం అతిశయోక్తి కానేరదు! ‘మంద’ అనే తెలుగుకథను రాసి, మరో 13 భాషల కథలను మూలభాషల నుంచి అనువదించి ‘భారతీయ కథలు’గా పాఠకులకు బహూకరించారు భాస్కర్. ప్రముఖ మలయాళ రచయిత పునతిల్ కున్హబ్దుల్లా నవల ‘స్మారక శిలగళ్’ను ‘స్మారక శిలలు’గా తెలుగులోకి అనువదించి ఉత్తమ అనువాదకునిగా కేంద్రసాహిత్య అకాడెమీ పురస్కారానికి ఎంపికయ్యారు. భాషాశాస్త్రాలకు సంబంధించి అకడమిక్ చదువులు లేకుండానే ఈ ‘మిరకిల్’ ఎలా సాధించారు? ‘పుర్సతుంటే(తీరికుంటే) పుస్తకం పట్టుడే’ అని చెవి(ఫోన్)లో చెప్పిన నలిమెల భాస్కర్ సాహితీ ప్రస్తానం : వేదన విశ్వభాష! ‘పుట్టగానే ఎవరైనా/ ఏడ్చేది కేర్‌మని/ అదొక్కటే విశ్వభాష’ అనే హైకూ ద్వారా భాస్కర్ తన ఫార్ములాను చెప్పేశారు. వేదనను ఆలకించే హృదయం ఉంటే ఏ భాష అయినా తనంత తానే తర్జుమా అవుతుంది. ‘గిదేంది’? అని ప్రశ్న రాగానే, కరీంనగర్ జిల్లాలోని నారాయణ్‌పూర్ గ్రామపు శ్రీరామ గ్రంథాలయం ‘అట్లన్నట్లు’ అని సమాధానం చెప్పేది. నేల అంచులను ఆకాశపు అంచులను ఊయలలో శిశువు తాకినట్లుగా ఆ గ్రంధాలయపు ఒడి విశ్వసారస్వతాన్ని చెంతకు చేర్చింది. ఒక భాషలో చదివిన పుస్తకం మూలభాషలో ఎలా ఉందో తెలుసుకునేందుకు హైస్కూల్ చదువుల రోజుల్లోనే భాస్కర్ తనదైన చిట్కాను కనుగొన్నారు. ప్రభుత్వప్రకటనలు, ప్రముఖ వాణిజ్య సంస్థల ప్రకటనలు అన్ని భారతీయ భాషలలో విడుదలవుతాయి కదా! తెలుగు ప్రకటన ఆధారంగా అన్ని భాషల సారాంశంలోకి వెళ్లేవారు. ఆ తర్వాత బహుళ భాషల సామెతల పుస్తకాల ద్వారా! నాసికా త్రయంబకంలో బిందురూపంలో మొదలైన గోదావరిలా నారాయణపూర్ గ్రంథాలయంలో మొదలైన భాస్కర్ బహుళభాషల జిజ్ఞాస కాలం గడిచేకొద్దీ దశాధిక గ్రంథకర్తను చేసింది. మలయాళం, కన్నడం, తమిళంలో హ్యాట్రిక్ చేసిన డాక్టరేట్‌గా మలచింది! 27 సంవత్సరాల బోధనావృత్తి నుంచి అనారోగ్యం కారణంగా పదవీ విరమణ చేసిన భాస్కర్ అఖిలభారత తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడిగా- నేషనల్‌బుక్ ట్రస్ట్ సలహామండలి సభ్యునిగా- సాహిత్య అకాడెమి గ్రంథ సమీక్షకునిగా పూర్తికాలం సాహిత్యజీవితం గడుపుతున్నారు. సహజభాషను ఈసడించవద్దు! ప్రతి ముప్పైమైళ్లకు భాష మారుతుందంటారు. ఏ ప్రాంతం వారికైనా తమదైన సహజభాష ఉంటుంది. తమ్మీ మంచిగున్నవా? వారీ ఎటు పోతివిరా! లాంటి వాక్యాలు తెలంగాణ పదాల్లో రమణీయతను, సొగసును చాటుతాయి. తమదైన సహజభాషను ఈసడించుకుని కృత్రిమత్వాన్ని చేర్చుకుని తమదే ప్రామాణికత అనే కృత్రిమ ధోరణులు హృదయాన్ని గాయపరుస్తాయి. ఈ నేపథ్యంలో నిఘంటువులలో లేని జనజీవితాల నుంచి సేకరించిన పదాలతో తాను రూపొందించిన ‘తెలంగాణ పదకోశా’న్ని కొన్ని పరిమితుల్లో చూడాలని భాస్కర్ సవినయంగా కోరుకుతున్నారు. మాండలికాలు రాజకీయ సరిహద్దులకు అతీతమైనవని గుర్తు చేస్తూ కరీంనగర్ ప్రాంతంలో వాడుకలో ఉన్న పదాలతో తాను పదకోశాన్ని రూపొందించానన్నారు. మహబూబ్‌నగర్, దక్షిణ తెలంగాణ ప్రాంతపు పదాలు కరీంనగర్ మాండలికానికి భిన్నంగా ఉంటాయని, ఆయా మాండలీకాలలో నిపుణులైన ఆయా ప్రాంతాల వారినుంచి పదకోశాలు రావాలసి ఉన్నదన్నారు. పధ్నాలుగు భాషలు తెలియడం వేరు, మాతృభాషలో మాండలీకాలు తెలియడం వేరు అని చమత్కరించారు! మలయాళం తెలుగు ‘తత్సమం’! ప్రముఖ మలయాళ రచయిత పునతిల్ కున్హబ్దుల్లా నవల ‘స్మారక శిలగళ్’ మలయాళంలో ఏభైకి పైగా ముద్రణలు పొందింది. పుంఖానుపుంఖాలుగా సాహిత్యాన్ని సృజించిన పునతిల్ తాను రాసిన ఒకే ఒక్క నవల ‘స్మారక శిలగళ్’ అంటారు. మిగిలిందంతా మరోరూపంలో ఆ నవలకు కొనసాగింపేనంటారు. ఈ నవలను అనువదించవలసినదిగా భాస్కర్‌ను కేంద్రసాహిత్య అకాడెమీ సూచించింది. ‘అనువాదంలో సమస్యలు రాలేదు. ఎందుకంటే మూల రచయిత మలయాళంలో ఆ నవలను ‘ప్రామాణిక’ భాషలో రాశారు. నేనూ అదే సూత్రాన్ని పాటించాను. ‘రెండు జిల్లాల ప్రామాణిక భాష’లో అనువదించాను. మలయాళంలో తెలుగులో వలె సంస్కృత పదాలు ముప్ఫైశాతం పైగా ఉంటాయి. ‘తత్సమాల’ విషయంలో రెండూ ఒకటే. నవలలో ముస్లిం సమాజం ఎక్కువగా ఉంటుంది. తెలుగు వారికి, ముఖ్యంగా తెలంగాణలోవారికి ఆ తరహా సమాజం సుపరిచితమే. కాబట్టి మూల రచయితతో మాట్లాడాల్సిన అవసరమూ ఏర్పడలేదు. రెండు భాషలూ తెలిసిన పాఠకుల కితాబే అనువాదానికి సాహిత్యఅకాడెమీ పురస్కారాన్ని తెచ్చిందని భావిస్తాను’ అన్నారాయన. - పున్నా కృష్ణమూర్తి -
‘ఆల్ ద రెబెల్ ఉమెన్’: ఫెమినిజమ్ నూరేళ్ల ప్రయాణం!
‘తక్కువ చదివి ఎక్కువ తెలుసుకున్నాం’ అని పాఠకులు భావించే రచనలు ఎలా ఉంటాయి? ‘గార్డియన్ షార్ట్స్’ పేరిట గార్డియన్ పత్రిక ప్రచురిస్తోన్న ఈబుక్స్ చూడాల్సిందే. అనేక సామాజిక అంశాలపై క్లుప్తంగా సమగ్రంగా వివరాలు అందించే వ్యాస సంపుటులను గార్డియన్ సంస్థ ‘గార్డియన్ షార్ట్స్’గా ప్రచురిస్తోంది. ఆ వరుసలో భాగంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ నేపథ్యంలో ‘ఆల్ ద రెబెల్ ఉమెన్ : ద రైజ్ ఆఫ్ ద ఫోర్త్ వేవ్ ఆఫ్ ఫెమినిజం (తిరగబడ్డ స్త్రీలందరూ : ఫెమినిజంలో ఎగసిన నాల్గవ కెరటం)’ అనే పుస్తకాన్ని (అమెజాన్‌లో రూ. 199) విడుదల చేసింది. ఇప్పటికే శరవేగంగా అమ్ముడుపోతున్న ఈ పుస్తకానికి రచయిత్రి ‘కిరా కొక్రన్’. ఈమె గతంలో గార్డియన్ మహిళల పేజీ ఎడిటర్‌గా ఐదేళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఫీచర్స్ రాస్తున్నారు. ఆ అనుభవంతో నూరేళ్ల ఫెమినిజాన్ని కిరా దర్శించి ఈ చిన్ని పుస్తకంగా వెలువరించారు. అందులో మిళితమైన జాతి- మత-ప్రాంత-కుల వివక్షతల పొరలనూ, వాటిని అధిగమించి తిరగబడ్డ వివిధ దేశాల, సమూహాల మహిళలను కిరా పాఠకులకు పరిచయం చేశారు. ఇంతకూ ‘నాల్గవ కెరటం’ స్థూలంగా ఏమి చెబుతోంది? 1913 జూన్ 4. పట్టపగలు. డ ర్బీ రేస్‌కోర్స్. పందెపు గుర్రాలు దౌడు తీస్తున్నాయి. ఇంతలో ఒక కలకలం. ప్రేక్షకుల్లోంచి ఒక స్త్రీ హటాత్తుగా ట్రాక్ మీదకు దూసుకువచ్చింది. పందెపు గుర్రాలలో నురగలు కక్కుతూ పరుగెడుతోన్న ఐదవ కింగ్‌జార్జ్ గుర్రానికి ఎదురు నిలిచింది. దూసుకుపోతున్న గుర్రం. దానిని నిలువరిస్తున్న స్త్రీ. ప్రాణాలు పోతూ ఉండగా ఎట్టకేలకు ఆమె విజయం సాధించింది. గుర్రం పడిపోయింది! అది చూసిన రాజుకు మాట పడిపోయింది. ఇంతకూ ఎవరామె? ఎమిలీ విల్డింగ్ డేవిసన్! ఎందుకంత సాహసం చేసింది? రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంలో మహిళలకు ఓటు హక్కును డిమాండ్ చేసిన మిలిటెంట్ ఉద్యమకారిణి ఎమిలీ. ఆమె అంత్యక్రియల్లో ‘ఉమెన్స్ సోషల్ అండ్ పొలిటికల్ యూనియన్’ ఉద్భవించింది. మహిళల రాజకీయహక్కులను సాధించిన ఎమిలీ డేవిసన్ (11 అక్టోబర్ 1872- 8 జూన్ 1913) స్త్రీవాదపు తొలితరంగం! ఇలా పడిన తొలి అడుగు ఆ తర్వాత అమెరికాలో మలి అడుగయ్యింది. కుటుంబంలో, సమాజంలో, పనిచేసేచోట, సంతానం కనే అంశంలో, ఆస్తి హక్కుల్లో సమానత్వం కావాలని 1960ల్లో అమెరికా నుంచి స్త్రీవాద ఉద్యమం ఆకాశానికి అంటింది. ఒకరకంగా ఆ ఉద్యమం స్త్రీవాదంలో రెండవ కెరటం. మూడోసారి? 1990ల్లో ఆసియా, మధ్యధరా దేశాలను ప్రభావితం చేస్తూ ఉవ్వెత్తున స్త్రీవాద ఉద్యమం ఎగసింది! ఇప్పుడు? నాల్గవ తరంగం ప్రపంచవ్యాప్తంగా ఎగసిపడుతోంది! ఢిల్లీ నిర్భయ ఉదంతం ఇందుకు ఉదాహరణ. స్త్రీలు ముఖ్యంగా యువత స్త్రీవాద చైతన్యాన్ని పరస్పరం ప్రసరింప చేసుకుంటున్నారు. ‘ఎవ్రీ డే సెక్సిజం’లాంటి ప్రాజెక్ట్‌ల ద్వారా ఆన్లైన్లో తక్షణం సమాచార మార్పిడి చేసుకుంటున్నారు. ప్రదర్శనలు చేస్తున్నారు. లింగవివక్షతపై ఎదుర వుతోన్న సమస్యలను గుర్తించి, న్యాయాన్ని కోరుతూ వినూత్న చైతన్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ‘కెరటాలు వెనక్కు వెళ్లవని, రెట్టించిన వేగంతో ముంచుకు వస్తాయని’ ధీర వనితలు నిరూపిస్తున్నారు. - పున్నా కృష్ణమూర్తి -
‘చల్లగా బతకలేమా’!
ఇంటర్వ్యూ: ఎడ్విన్ తంబూ జానపద సాహిత్యం-రామాయణ, భారతాలు ఏమి చెప్పాయో కొత్తగా చూస్తే మన సమస్యలకు పరిష్కారాలూ లభిస్తాయి. ‘ఉదయించేందుకు సూర్యుడు కవిత్వం కోసం ఎదురు చూస్తున్నాడు’ అని పలికిన కవి ఎడ్విన్ తంబూ. సింగపూర్ జనహృదయ జాతీయ కవి. సింగపూర్ నేషనల్ యూనివర్సిటీలో ఎమిరిటస్ ఇంగ్లిష్ ప్రొఫెసర్ (గౌరవనీయ ఆచార్యుడు). ఇంగ్లిష్ ద్వారా సింగపూర్ ఆత్మను ప్రపంచ సాహిత్యంలో పలికించినవాడుగా అనేక జాతీయ-అంతర్జాతీయ పురస్కారాలందుకున్నారు. జనవరి 24 నుంచి మూడు రోజులు ఐదు వేదికలపై ముమ్మరంగా జరిగిన నాల్గవ హైద్రాబాద్ లిటరరీ ఫెస్టివల్లో పాల్గొన్న వారిలో అష్టపదుల పెద్దాయన! తొలిరోజు ‘ఆషియానా’లో ‘వరల్డ్ ఇంగ్లిషెస్ : ఎ సింగపూర్ ఎక్స్పీరియన్స్’ అనే అంశంపై మాట్లాడారు. ఆ సందర్భంగా సంభాషణా సారాంశం... జాతీయత తెలీదు! అంతర్జాతీయత!! మన చుట్టూ ఉన్న వస్తుప్రపంచాన్ని చూస్తే పరాయి పాలన ముగిసిందనుకో గలమా? వస్తుప్రపంచం మారాలంటే భావనాప్రపంచం మారాలి. వ్యక్తిగా, జాతిగా తామేమిటో గుర్తించాలి! జాతీయతను తెలుసుకోకముందే అంతర్జాతీయవాదులమని భ్రమించడం ఎంత ప్రమాదకరం? ఇందుకు పూనుకోవాల్సింది రచయితలే కదా! ఈ సెమినార్లో నా గొంతు పొరబోయింది. వెంటనే నిర్వాహకులు లేబుల్డ్ వాటర్ బాటిల్ తెచ్చారు! ఎందుకది? నాకు అక్కర్లేదు. నేను ఇండియాకు వచ్చాను. ఇండియా అంటే ప్రపంచానికి శతాబ్దాలుగా లవంగాలు, ఏలకులు అందిస్తోన్న దేశం. నాకు కావాల్సింది ఇక్కడి సుగంధ ద్రవ్యాల మసాలా టీ! ప్చ్. ‘ఫెస్టివల్’ ద్వారా నేను చెప్పదలచుకున్నదీ ఇదే! ‘వెచ్చని’ స్వాగతం మనకేల? ఇంగ్లిష్ ఒక భాష కాదు. అనేక భాషల సమాహారం. వలసపాలన వలన ప్రపంచంలో అనేక దేశాలకు ఇంగ్లిష్ పరిచయమై, వృద్ధి పొందింది. ఇప్పుడు అనేక దేశాలకు ఇంగ్లిష్ ఒక తప్పనిసరి భాష. స్వభాష కూడా. మంచిదే. ఆసియా దేశస్తులు ఒకరితో మరొకరు మాట్లాడుకోవాలన్నా ఇంగ్లిషే కదా సాధనం! ఆ భాష ద్వారా వ్యక్తం చేయాల్సింది మన జీవితాన్ని కదా? కలవరం కలిగించే విషయం ఏమిటంటే : నిన్నటి వలస దేశాలు రాజకీయ స్వతంత్రం పొందినప్పటికీ భాష విషయంలో విముక్తి చెందలేదు. మన రచనలు ఇప్పటికీ ‘వలస’కు పూర్వం వలసకు తర్వాత (ప్రి కలోనియల్-పోస్ట్ కలోనియల్) అంటున్నాయి. వలస పాలనను మనం ఎందుకు గుర్తించాలి? ‘జాతీయ ప్రభుత్వానికి పూర్వం- తర్వాత’ అనవచ్చు కదా! ఇంగ్లిష్ భాషను స్వంతం చేసుకునే క్రమంలో ఇంగ్లిష్ సంస్కృతిని అర్ధం చేసుకోవచ్చు. కాని, స్వంతం చేసుకోవాలా? పాతను బాగు చేద్దాం. దాని అర్థం షేక్స్పియరిక్ ఇంగ్లిష్‌లోకి వెళ్లాలని కాదు. పరాయి పాలనకు చిహ్నాలను మనం నిలుచున్న నేల నుంచి పర్యావలోకన చేద్దాం. జానపద సాహిత్యం- రామాయణ, భారతాలు ఏమి చెప్పాయో కొత్తగా చూస్తే మన సమస్యలకు పరిష్కారాలూ లభిస్తాయి. ముందుగా స్వీయ సాహిత్యాన్ని అందరికీ అర్ధమయ్యే భాషలో అందు బాటులోకి తేవాలి. వాటిపై విభేదించాలి. చర్చించాలి. బహుళ భాషల, సంస్కృతుల సమాజమైన ఆధునిక సింగపూర్ యువత తమతమ పౌరాణిక, జానపద సాహిత్యం నుంచి కొత్తగా స్ఫూర్తిని పొందుతున్నారు. ‘వామ్ వెల్కం’ అని చలిదేశాల వారు స్వాగతిస్తారు. పుష్కలమైన ఎండను అనుభవించే మనం ‘కోల్డ్ వెల్కం’ అనాలి కదా! ‘చల్లగా బతుకు’ అనే పెద్దల దీవెనను మనసుకు పట్టించుకుందాం! - పున్నా కృష్ణమూర్తి -
జిన్నా ప్రధానైతే దేశ విభజన ఆగేది!
‘‘దేశ విభజనను నివారించడానికి మహాత్ముడు ప్రథమ ప్రధానిగా జిన్నాను ప్రతిపాదించగా ఆయన అనుయాయులే దాన్ని వ్యతిరేకించారు’’. ఇటీవల హైదరాబాద్ వచ్చిన గాంధీ మనుమడు రాజ్‌మోహన్ గాంధీతో ఇంటర్వ్యూ సారాంశం. కాలరేఖపై దేశం చేసే పయనంలో ‘రియర్ మిర్రర్’ ప్రయోజనం ఏమిటి? గతంలోకి జారుతున్న వర్తమానం కనిపిస్తుంది. భవిష్యత్తుపై ప్రభావం చూపగల వెనుకటి దృశ్యాలూ కనిపిస్తాయి. ‘అవర్ రిపబ్లిక్: ఫ్లాషెస్ ఫ్రం రేర్ వ్యూ మిర్రర్’ అనే అంశంపై మాట్లాడేందుకు రాజ్‌మోహన్‌గాంధీ హైద్రాబాద్ లిటరరీ ఫెస్టివల్‌కు విచ్చేశారు. ఆయన మహాత్మాగాంధీకి తండ్రి వైపు, చక్రవర్తుల రాజగోపాలాచారికి తల్లి వైపు మనుమడు. రాజ్‌మోహన్ తన 16వ ఏట నుంచి రాజకీయ రచయిత. గతంలో రాజ్యసభ సభ్యునిగా, ప్రస్తుతం వివిధ విశ్వవిద్యాలయాలలో రాజకీయ చరిత్ర ప్రొఫెసర్‌గా, అంతర్జాతీయ మానవహక్కుల సంఘం జ్యూరీ మెంబర్‌గా సేవలందిస్తున్నారు. బహుగ్రంథ కర్త అయిన ఆయన శాంతిస్థాపన అనే తాతగారి ఆశయ సాధనకు తనదైన మార్గంలో కృషి చేస్తున్నారు. గత శనివారం ఆయన తన తాజా పుస్తకం ‘పంజాబ్: ఎ హిస్టరీ ఫ్రం ఔరంగజేబ్ టు మౌంట్ బాటెన్’ను కొన్న పాఠకులకు ఆటోగ్రాఫ్‌లు ఇస్తూ, ‘సాక్షి’తో మాట్లాడారు. ‘అహాల సంఘర్షణ’ విపరీతాలకు కారణం వ్యక్తుల అహాల మధ్య సంఘర్షణ వల్లే దేశ చరిత్రలో విపరీతాలు చోటు చేసుకున్నాయి. ఉదాహరణకు ఉమ్మడి భారత దేశానికి ప్రధానమంత్రిగా మహమ్మదాలీ జిన్నాను గాంధీజీ ప్రతిపాదించారు. నెహ్రూ, వి.పి.మీనన్ తదితరులు అందుకు అం గీకరించలేదు. గాంధీజీ వైఖ రిని సమర్థిస్తారా? అని ప్రశ్నిస్తే, అవుననే అంటాను. దేశ విభజనను నివారించగలిగితే లక్షలాది మంది ఇరువైపులా హతమయ్యేవారు కాదు. వందల కోట్ల డాలర్ల ప్రజాధనం పరస్పర హననానికి ఆవిరయ్యేది కాదు. రాజకీయ సమానత్వా న్ని ఆచరణలోకి తేవాల్సిన అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం ఎమర్జెన్సీ (1975-1977) రూపంలో నియంతృత్వాన్నీ చవిచూసింది. ఆ తర్వాత ప్రధాని పదవికి పోటీపడ్డ మొరార్జీదేశాయ్-చరణ్‌సింగ్-జగజ్జీవన్‌రామ్‌ల మధ్య ‘అహం’ కారణంగానే ‘జనతాపార్టీ’ మూల్యాన్ని చెల్లించాల్సి వచ్చింది. వీపీ సింగ్-చంద్రశేఖర్-దేవీలాల్ల మధ్య అదే కథ పునరావృతం అయ్యింది. రాజకీయ ఆశయ సాధనకు వ్యక్తులు తమ అహాలను పక్కన పెట్టడం అవసరం. జిన్నాను ప్రధానిని చేయాలన్న మహా త్ముని ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఆయన సహచరులు ‘గాంధీ ప్లాన్‌ను చిత్తుచేయడానికి అనుసరించాల్సిన ఎత్తుగడల’తో ఏకమయ్యారు. వారిని నిందించకుండా, వైఫల్యాలకు బాధ్యతవ హిస్తున్నాను అనే ఔదార్యం మహాత్మా గాంధీలో కనిపిస్తుంది. దేశ విభజనను కమ్యూనిస్టులు కూడా ఆపలేకపోయారు. భగత్‌సింగ్ గొప్ప సాహసి. అభ్యుదయవాది. పంజాబ్‌లో అభ్యుదయ రచయితలు, కార్యకర్తలు ఎంద రో ఉన్నారు. కానీ భగత్‌సిం గ్, కమ్యూనిస్టుపార్టీల ప్రభా వం నిర్ణయాత్మక శక్తిగా లేదు. దేశం ఎలాగూ విడిపోతుంది. మనమూ పరిస్థితులకు అనుగుణంగా మారదామని కమ్యూనిస్టు కార్యకర్తల్లో ఎక్కువ మంది భావించారు. దేశ విభజ నను వ్యతిరేకించిన సరిహద్దు గాంధీ (ఖాన్ అ బ్దుల్ గఫార్ ఖాన్) ఇంగ్లిష్ పాలనలో 12 ఏళ్లు జైల్లో ఉంటే పాకిస్థాన్ ఏర్పడ్డాక అంతకంటే ఎక్కుకాలం జైల్లో ఉన్నారు! దేశ విభజనను వ్యతిరేకించిన కారణంగా ఆయన అనుచరు లు వందలాదిగా హత్యలకు గురయ్యారు! బ్రిటిష్ పాలన మంచి చెడ్డలు! ‘లాభం’ కోసం సాగిన బ్రిటిష్ పాలనలో మం చి-చెడ్డలున్నాయి. న్యాయవ్యవస్థ ఏర్పాటు, రాష్ట్రాల పాలనాధికారం తదితర అంశాల్లో వా రు ప్రజాస్వామ్యబద్ధంగానే వ్యవహరించారు. కానీ, వారు భారతీయులకంటే తాము అధికులమని భావించారు. ఒక తెల్ల నిందితునిపై తీర్పు చెప్పేందుకు ఒక భారతీయ న్యాయమూర్తి అర్హుడు కాదు అని ‘లండన్టైమ్స్’ వం టి పత్రికలు అభిప్రాయపడ్డాయి. ఈ ‘ఆధిక్యతాభావం’ గురించి తెల్ల సమాజంలోనే చర్చసాగింది. ఆధిక్యతాభావం తెల్లవాడికి మాత్ర మే ఉన్నదా? మనం ఏర్పరచుకున్న ఆధిక్యతాభావాల మాటేమిటి! ఒకరినొకరు తెలుసుకోవాలి! దేశ విభజన నాటి ఘటనల గురించి చెప్పగలి గినంతగా దక్షిణాది రాష్ట్రాల గురించి చెప్పలేను. సైన్యంలో ప్రాంతాల వారీగా బెటాలి యన్లున్నాయి. వాటివల్ల సమస్యలున్నాయి. అనుకూలతలూ ఉన్నాయి. తమ ప్రాంతం, తమ భాష అనే అభిమానాన్ని తప్పు పట్టాల్సిందేముంది? తమ రాష్ట్రాన్ని, ప్రాంతాన్ని, భాషను ప్రేమించని వారు దేశాన్నెలా ప్రేమిస్తారు? భిన్న మతాలు, ప్రాంతాలు, భాషలు, సంస్కృతులు ఉన్న మన దేశంలో ఏ సమూహానికి ఆ సమూహం విడిగా ఉంటోంది. అదీ ప్రధాన సమస్య. ముందుగా తామేమిటో ఆలోచించాలి. ఇతరులతో మాట్లాడాలి, అర్థం చేసుకోవాలి, అపోహలను గుర్తించాలి. తొల గించుకునేందుకు కృషి చేయాలి. దురదృష్టవశాత్తూ భారతీయులు ఒకరినొకరు తెలుసుకోవడంలో దారుణమైన అలసత్వాన్ని పాటిస్తున్నారు. రచయితలు ఈ ఆవశ్యకతను గుర్తించి తమ పాత్రను నిర్దేశించుకోవాలి. - పున్నా కృష్ణమూర్తి -
ఇతిహాస పరిమళం ‘ఇంగువ’
హైద్రాబాద్ సర్కిల్ డిప్యూటీ సూపరింటెండెంట్‌గా, ఇన్చార్జ్గా పనిచేసిన ఐ.కె.శర్మ రాష్ట్రంలోని పురావస్తు స్థలాలన్నిటినీ సందర్శించారు. లేపాక్షి బసవయ్యకు వేదిక నిర్మించారు. దేశంలో తొలి శివాలయం గుడిమల్లంలో ఉందని నిర్ధారించి ఆలయానికి హద్దులు ఏర్పరచారు. మన రాష్ట్రం భారత పురావస్తుశాఖ నిఘంటువుకు రెండు పదాలను చేర్చింది. ఒకటి ‘తరలింపు’ మరొకటి ట్రాన్స్ ప్లాంటేషన్ (మరోచోట పునః ప్రతిష్టించడం). నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణ ప్రతిపాదనల నేపథ్యంలో నంది కొండ తదితర గ్రామాల్లో ముంపునకు గురికానున్న బౌద్ధ- వైదికమత శిల్పాలను దేశంలో తొలిసారి తరలిం చారు. నాగార్జునకొండలో ఆ శిల్పాలు సందర్శనీయాలు. దేశంలో తొలిసారిగా మహబూబ్‌నగర్ జిల్లాలోని ‘కూడలి’ సంగమేశ్వర ఆలయాన్ని ‘ట్రాన్స్‌ప్లాంట్’ చేశా రు. ఈ రెండు అపూర్వ ఘట్టాలలోనూ ఐ.కె.శర్మగా అం దరికీ తెలిసిన ఇంగువ కార్తికేయశర్మ (అక్టోబర్ 21-1937 -నవంబర్ 28-11-2013 ) చిరస్మరణీయుడు. రాళ్లెత్తిన కూలీ! నెల్లూరుజిల్లా పల్లెపాడులో జన్మించిన శర్మ ‘వచ్చిందోయ్ వచ్చింది నందికొండ నాగార్జున సాగరమొచ్చింది’ అని జానపదులతో కలసి బృందగానం చేస్తూ పురావస్తు తవ్వ కాల్లో ‘రోజు కూలీ’గా ఉద్యోగజీవితాన్ని ప్రారంభించారు. ప్రైవేటుగా బిఏ చదివి టెక్నికల్ అసిస్టెంట్ అయ్యారు. నాగపూర్‌లోని తవ్వకాల విభాగంలో పని చేస్తూ, ఆఫీసుకు వచ్చే ముందు ఉదయం 6 నుంచి 9 గంటల వరకూ క్లాస్ లకు వెళ్లి ఎంఏలో గోల్డ్ మెడల్ సాధించారు. తమకు గౌరవం తెచ్చిన వినయవంతుడైన శిష్యుడుగా ఎస్.బి. దేవ్, అజయ్ మిశ్రాలు ఐ.కె.శర్మను అభివర్ణించేవారు. ప్రతిచోటా ‘ముద్ర’ హైద్రాబాద్ సర్కిల్ డిప్యూటీ సూపరింటెండెంట్‌గా, ఇన్ చార్జ్‌గా పనిచేసిన ఐ.కె. రాష్ట్రంలోని పురావస్తు స్థలాలన్ని టినీ సందర్శించారు. లేపాక్షి బసవయ్యకు వేదిక నిర్మిం చారు. దేశంలో తొలి శివాలయం గుడిమల్లంలో ఉందని నిర్ధారించి ఆలయానికి హద్దులు ఏర్పరచారు. ఏలూరు సమీపంలోని పెదవేగి, గుంటుపల్లిలోని బౌద్ధారామాలను వెలుగులోకి తెచ్చారు. రైతులతో సంప్రదించి భూమి తగా దాలను పరిష్కరించి పురావస్తు కేంద్రంగా పర్యాటక చిత్ర పటంలో చేర్చడంలో ఆయన శైలి అనన్యం! పరిశోధకులకు ప్రామాణిక గ్రంథ కర్త ప్రపంచవ్యాప్తంగా అన్ని ముఖ్యమైన విశ్వవిద్యాలయా లు, గ్రంథాలయాల్లో ఆయన పుస్తకాలు రిఫరెన్స్ గ్రంథా లుగా ఉన్నాయి. ‘ఆర్టిఫిషియల్ వాటర్ సిస్టమ్స్ ఇన్ ఏనిషి యంట్ అండ్ మిడీవల్ ఇండియా (పురాతన-మధ్యయు గాల్లో కృత్రిమ నీటిసరఫరా విధానాలు)-సిటీ గాడెసెస్ ఫ్రం వేంగీపుర (వేంగిపురపు నగర దేవతలు) శ్రీసుబ్రహ్మ ణ్యస్మతి, నరసింహస్మృతి (శాసన లిపి-నాణెముల శాస్త్రం -కళ-వాస్తు నిర్మాణాలు-ఐకనోగ్రఫీ-సాంస్కృతిక చరి త్రల సంపుటి), బ్రాహ్మినికల్ బ్రిక్ టెంపుల్స్ అండ్ కల్ట్ ఆబ్జెక్ట్స్ ఫ్రం కీసరగుట్ట-బుద్దిస్ట్ మాన్యుమెంట్స్ ఆఫ్ చైనా అండ్ సౌత్ ఈస్ట్ ఇండియా- కాయినేజ్ ఆఫ్ ద శాతవా హన ఎంపైర్, రూట్స్ ఆఫ్ ఇండియన్ సివిలిసైజేషన్ తదితర గ్రంథాలను ఆయన రచించారు. అబుసింబల్-అలంపురం ప్రపంచంలో తొలి ట్రాన్స్‌ప్లాంటేషన్ ఈజిప్ట్‌లోని అబుసిం బల్. రెండవది మహబూబ్‌నగర్ జిల్లాలోని అలంపురం. మరణానంతర నివాసం కోసం తమ జీవితకాలంలో ఈజిప్ట్ చక్రవర్తి రెండవ ఫారోస్ రామ్సేస్, అతని భార్య నెఫర్తరి క్రీ.పూ.13వ శతాబ్దంలో నిర్మించిన అబుసింబల్ కు నైలునదిపై ఆస్వాన్ డ్యాంతో ముంపు ప్రమాదం ఏర్ప డింది. ఈ నేపథ్యంలో యునెస్కో ఆధ్వర్యంలో 50 దేశాల పురావస్తు బృందాలు 1960ల్లో ఆ కట్టడాలను ట్రాన్స్ ప్లాంట్ చేశాయి. ఆ క్రమం లో పెద్ద శిల్పాలను పగులగొట్టి పునః నిర్మాణంలో స్టీల్ రాడ్లతో అతికించారు. భారీ యంత్రాలను వాడి 40 మిలి యన్ల డాలర్లు ఖర్చుపెట్టారు. అటువంటి ప్రమాదమే మహబూబ్‌నగర్ జిల్లా, ‘కూడలి’ గ్రామంలో క్రీ.శ. 6వ శతాబ్దంలో మొదటి విక్రమాదిత్యుడు నిర్మించిన ఆల యానికి శ్రీశైలం జలవిద్యుద్కేంద్ర నిర్మాణ నేపథ్యంలో ఏర్పడింది. కృష్ణ-తుంగభద్ర సంగమస్థలిలోని కూడలి సంగమే శ్వరాలయం భారతదేశంలోని అన్ని శిల్పసంప్రదాయాల కూడలి కూడా! ఉత్తరాదికి చెందిన ‘నాగరి’ శైలి, తూర్పు నకు చెందిన ‘జగతి’ ద్రవిడ రీతులు అన్నీ కలసిన ‘వేసరి’ శైలి ఈ ఆలయ ప్రత్యేకత! ఈ ఆలయాన్ని ట్రాన్స్‌ప్లాంట్ చేయాలని పురావస్తుశాఖలో డెరైక్టర్‌గా పనిచేస్తోన్న ఐ.కె. శర్మ, డెరైక్టర్ జనరల్ జగపతి జోషిని ఒప్పించారు. పరిసర గ్రామాల ప్రజల సహకారంతో, భారీ యంత్రాలేమీ వాడ కుండా, రాయివెంట రాయిని సశాస్త్రీయంగా వెలికితీసి, ఎడ్లబండ్లపై తరలించి పునః నిర్మాణం చేయించారు ఐ.కె. శర్మ. కేవలం 31 లక్షల రూపాయల ఖర్చుతో! 14 శతా బ్దాల తర్వాత 1990 ఫిబ్రవరి 23న శివరాత్రిరోజు కూడలి సంగమేశ్వరుని పునః ప్రతిష్ట జరగడాన్ని స్థానికులు తాజా సంఘటనగా చెప్పుకుంటారు. ఇటీవల నర్మద వ్యాలీలోని 30 పురావస్తు నిర్మాణాలను తరలించేందుకు పురావస్తు శాఖలోని అన్ని విభాగాల్లో విశేష అనుభవం ఉన్న ఐ.కె. శర్మ ముందుచూపు ఉపకరించిదని ఆ శాఖ ఉన్నతాధికా రులు పేర్కొన్నారు. శ్రీపాద ప్రాజెక్ట్ నిర్మాణం కారణంగా శాతవాహనుల తొలి రాజధాని కోటిలింగాల; పులిచింతల కారణంగా గుంటూరుజిల్లా మోర్జంపాడు గ్రామ సమీపంలోని బుగ్గ మల్లయ్య ఆలయం ముంపునకు గురికానున్నాయి. ఆయా సాంస్కృతిక నిర్మాణాలను గుర్తించి, తరలించి, పునః నిర్మాణం చేయడమే ప్రామాణిక గ్రంథకర్త, అధ్యాపకుడు అయిన ఐ.కె.శర్మకు పురావస్తుశాఖ ఇవ్వగల ఘనమైన నివాళి! -పున్నా కృష్ణమూర్తి -
అంతరాల సంఘర్షణే నాటకం
ఇంటర్వ్యూ: - డి.విజయభాస్కర్ కావ్యేషు నాటకం రమ్యమ్ అన్నారు మహాకవి కాళిదాసు. సామాజిక సామరస్యతకు ‘నాటకమ్ గమ్యమ్’ అంటున్నారు డా.దీర్ఘాశి విజయభాస్కర్. శ్రీకాకుళం జిల్లా అంపోలు గ్రామంలో బలహీనవర్గానికి చెందిన ‘దమ్మలి’ కులంలో పుట్టారు. ఎత్తై మరగల్లుపై గ్రామాన్ని వీక్షించి శంఖాధ్వానంతో గ్రామదేవతను అర్చించడం వృత్తిగా ఉన్న తన కులస్తుల్లో చదువుకుని ప్రభుత్వ ఉన్నతోద్యోగం చేస్తోన్న ఒకే ఒక్కడు విజయభాస్కర్. అంతేనా? తెలుగు నాటకాన్ని భారతీయభాషల్లో రెపరెపలాడిస్తోన్న వాడు కూడా! ‘బ్రెహ్ట్’పై డాక్టరేట్ చేసిన విజయభాస్కర్ ‘తూర్పు తెల్లవారింది’తో మొదలై ఇటీవలి ‘రాజిగాడు రాజయ్యాడు’ వరకూ 14 నాటకాలు రాశారు. కేంద్ర సంగీత-నాటక అకాడెమీ అవార్డు, ఆరుసార్లు నంది అవార్డులు, ఇతరేతరాలు తనను వరించాయి. సాంఘిక సమస్యలను ఇతివృత్తాలుగా తీసుకుని నాటకాన్ని కథలా ప్రారంభించి, కావ్యంలా ముగిస్తూ, ఒక తాత్త్విక భావజాలాన్ని అంతర్లీనంగా ప్రవహింపజేసే విజయభాస్కర్‌తో ఇంటర్వ్యూ సారాంశం : మీ నేపథ్యం చెప్పండి. నాన్న సూర్యనారాయణ పౌరాణిక, సాంఘిక నాటకాల్లో నటించేవాడు. రామదాసు నాటకంలో కబీర్ పాత్ర పోషించేవాడు. ఆ ప్రభావం నా మీద ఉంది. శ్రీకాకుళం కాలేజీలో చదువుకునేటప్పుడే కొన్ని నాటకాల్లో నటించాను. రవీంద్రభారతి గురించి మా నాన్న ద్వారానే తొలిసారి విన్నాను. ‘హిందువులకు కాశి, ముస్లింలకు మక్కా, క్రిస్టియన్లకు జెరూసలెం వలె కళాకారులకు పుణ్యస్థలి రవీంద్రభారతి’గా చెప్పుకునేవాళ్లం. ఏనాటికైనా నా నాటకాలు అక్కడ ఆడాలి అనుకున్నాను. అలాగే జరిగింది. నాటకాలు రాయడం ఎప్పటి నుంచి మొదలెట్టారు? బాల్యంలోనే నాటకం పట్ల ఏర్పడిన అభిరుచి నాటకాన్ని సాహితీ ప్రక్రియగా ఎంపిక చేసుకునేందుకు దోహదపడింది. కులాలు, రాజకీయాలు, ప్రాంతాలు, మతాలు, అభిమతాల పేరిట సమాజంలో అసంఖ్యాక సంఘర్షణలున్నాయి. కేవలం నాటకం మాత్రమే సంఘర్షణను ప్రతిభావంతంగా ప్రజల దగ్గరకు చేరుస్తుందని నా అభిప్రాయం. ఆ ఉద్దేశంతోనే ఎం.ఎ చదువుతోండగా ‘తూర్పు తెల్లారింది’ రాశాను. అది రేడియోనాటకంగా ప్రసారమైంది. నాటక రచయిత ఎస్.కె.మిశ్రో నా గురుసమానులు. ఇప్పటికి 24 నాటకాలు రాశాను. గాంధీ జయంతి- రుత్విక్- కాలకూటం-మినిస్టర్- కుర్చీ- పులిస్వారీ తదితర నాటకాలు అనేక భారతీయ భాషలలోకి అనువాదమయ్యాయి. వివిధ రాష్ట్రాల్లో ‘విజయభాస్కర్ నాటకోత్సవాలు’ విజయవంతంగా ప్రదర్శితమైనాయి. మీ నాటకాలు ఎందుకు నచ్చుతున్నాయి? నా నాటకాలు ఇంగ్లిష్ ఇతర భారతీయ భాషల్లోకి విరివిగా అనువాదమై ప్రజలకు నచ్చడానికి కారణం వర్తమాన సంఘర్షణను చెప్పేందుకు పౌరాణిక ప్రతీకలను ఎంచుకోవడమేనని భావిస్తాను. ‘పురాణా’నికి పునర్నవం అనే అర్థం ఉంది. పురాణాల కనెక్టివిటీకి ఒక ఉదాహరణ : ఏడు ఈశాన్య రాష్ట్రాలలో సామాజిక ఉద్యమాల గురించి ‘హై వే - జర్నీస్ త్రూ ఎ ఫ్రాక్చర్డ్ లాండ్’ అనే పుస్తకాన్ని రాసిన అంతర్జాతీయ జర్నలిస్ట్ సుదీప్ చక్రవర్తి మణిపురిభాషలోకి ‘లైబికా-వాగా’ పేరుతో అనువాదితమైన నా నాటిక ‘బ్రహ్మరాత’ను వీక్షించి, ఈ నాటిక ఈశాన్యరాష్ట్రాల వర్తమాన రాజకీయపరిస్థితులకు అద్దం పడుతుంది అని వివరించారు. నా తెలుగు నాటకంలో మణిపురి సమస్యలేం లేవు. అయినా సరే, నా నాటిక ‘స్థలాన్ని’ (స్పేస్)ఎలా దాటింది? పౌరాణిక ప్రతీకలను వాడడం ద్వారానే! ఇతర భాషల్లోకి అనువాదం అవుతోన్న నా తాజా నాటకం ‘రాజిగాడు రాజయ్యాడు’లోనూ కులపురాణాల ప్రస్తావన ఉంది. సేవకవృత్తిలో మగ్గిపోతోన్న కులాలు అగ్రవర్ణాలలోని ‘పాజిటివ్’ వ్యక్తుల నుంచి చైతన్యవంతమై అధికారంలోకి వస్తాయనే ఇతివృత్తంలో ‘లౌక్యం’ ఏమీ లేదు. పాలిత కులాలపట్ల చూపించే సానుభూతి, పాలక కులాలపట్ల ద్వేషం కలిగించరాదనే స్పష్టతనిచ్చాను. ఇతర భాషలతో పోలిస్తే మన నాటకం ఎలా ఉంది? ఇతర భారతీయభాషలతో పోలిస్తే తెలుగు రచయితలు, దర్శకులు, నటులు ఎవరికీ తీసిపోరు. మైసూర్‌లోని రంగాయణలో మన పడమటిగాలి, కుర్చీ నాటకాలను చూసిన నాటకా భిమానులు ‘ప్రయోగాల అతితో విసిగిపోయిన మాకు ఈ నాటకాలు గొప్ప రిలీఫ్ ఇచ్చాయి’ అనడం గమనార్హం! అయితే తెలుగు నాటకరంగం స్టేజ్క్రాఫ్ట్లో చాలా వెనుకబడి ఉంది. కవిత్వం రాస్తున్నారు కదా. నేను అవలోకించిన సామాజిక సంఘర్షణలు నాటకాలుగా రూపొందితే ఆంతరంగిక సంఘర్షణ ఇటీవలి కవితాసంపుటి ‘మహాశూన్యం’గా రూపొందింది. మహాశూన్యం అంటే ఏమీ లేకపోవడం కాదు. ‘అంతా ఉన్నది. అంతటా ఉన్నది. అంతటా నిండి ఉన్నదీ అయిన చైతన్యం’. వ్యక్తి తనలోకి చూసుకుని తన అనంతవ్యాప్తిని అనుభవించడం ‘అనుభావ’కావ్యం! నన్ను నేను పరికిస్తే- ‘నీవు ధరించాల్సిన దుస్తులు/ ఏ దిగంతాలకు అవతలనో నేస్తున్నారు/ నగ్న అంతస్సులో నడచి వెళ్లు’ అన్పిస్తోంది. విజయభాస్కర్ రచనలు 1. కాలకూటం 2. రుత్విక్ 3. కుర్చి 4. పొలి స్వరి 5. కించిత్ భోగమ్ 6. జీవన్నాటకం (నాటకరంగ ప్రముఖుల గురించి టెలీ సీరియల్) 7. హిరణ్యగర్భ 8. మినిస్టర్ 9. బ్రహ్మరాత 10 మబ్బులో బొమ్మ 11. గాంధీజయంతి 12. దేవుడు కావాలి 13. బాపు చెప్పిన మాట 14. చిత్రం 15. రాజిగాడు రాజయ్యాడు 16. మౌనంతో మాటలు (కవిత్వం) - పున్నా కృష్ణమూర్తి -
ఒక నలంద! ఒక శ్రీపర్వతం!!
బీహార్ రాజధాని పాట్నా సమీపంలోని ‘బడాగావ్’లో చరిత్ర పునరుజ్జీవనం పొంద నుంది! స్వాతంత్య్రం వచ్చాక నలందపై దృష్టి సారించిన తొలి వ్యక్తి డా.అబ్దుల్ కలామ్. రాష్ట్రపతి హోదాలో నలంద విశ్వ విద్యాలయానికి పునర్ వైభవాన్ని ఇవ్వాలని సంకల్పించారు. ‘నలంద’ను నిజం చేయవల సినదిగా వివిధ దేశాలకు సూచించారు. ఈ క్రమంలో నిరంతర ప్రయత్నాల ఫలితంగా తూర్పు ఆసియా దేశాల శిఖరాగ్ర సమావే శంలో ప్రధాని మన్మోహన్ సమక్షంలో గురు వారం నాడు ఒక అవగాహనా ఒప్పందం (ఎంఒయు) కుదిరింది. ఆధునిక ప్రపంచ విశ్వవిద్యాలయంగా నలందను సమున్నతంగా రూపొందించడా నికి అంగీకరిస్తూ ఆస్ట్రేలియా-కంబోడి యా-సింగపూర్- బ్రూనీ- న్యూజిలాండ్- లావో-మయన్మార్ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. ‘ఎంత ఇచ్చినా ఇవ్వాల నిపించేలా’ మిలియన్ల డాలర్లను విడుదల చేస్తున్నాయి. అంతర్జాతీయ వాస్తు సంస్థలు ఆధునిక నలందా నిర్మాణానికి నమూనాలు రూపొందించనున్నాయి. ఆధునిక ధర్మపాలుడు అమర్త్యసేన్ నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ నలం ద కులపతిగా తగిన భూమిక నిర్వహించ నున్నారు. అంతర్జాతీయ మేధావులతో పాల కవర్గం ఏర్పడనుంది. గృహస్తుల నుంచి భిక్ష స్వీకరించి ‘ధర్మా’న్ని దానం చేసిన బుద్ధుడు, ఈ ప్రాంత ప్రజల జిజ్ఞాసకు ముగ్ధులై ‘నలం ద’ (ఎంత ఇచ్చినా ఇవ్వాలనిపించే చోటు) అన్నారట! ఆ ప్రత్యేకత రీత్యా 5వ శతాబ్దంలో ‘నలంద’లో ప్రపంచానికి తెలిసిన తొలి వసతి విశ్వవిద్యాలయం ఏర్పడింది. శ్రీహర్షుని కాలంలో భారత్‌ను సందర్శించిన చైనాయా త్రికుడు హుయాన్‌త్సాంగ్ (క్రీ.శ.602-664) యాత్రా రచనలు, నలంద గురించి తెలుసుకు నేందుకు ఉపకరిస్తున్నాయి. కంచి ధర్మపాలుడు నలంద కులపతి నలంద ఒక ప్రాచీన విజ్ఞాన అద్భుతం. వివిధ దేశాల నుంచి విచ్చేసిన పదివేల మంది విద్యా ర్థులకు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన రెండువేల మంది అధ్యాపకులు విద్యాబోధన చేసేవారు. దక్షిణాదిన కంచికి చెందిన ధర్మ పాలుడు నలందలో దిగ్నాగుడి విద్యార్ధి. తదుపరి కాలంలో నలంద కులపతి. ధర్మ పాలుడి శిష్య ప్రముఖుడు శిలాభద్ర ఆధ్వ ర్యంలో ఆయన శిష్యప్రశిష్యులు చైనాకు తరలి వెళ్లి, చైనా భాష నేర్చుకుని ధర్మపాలుడి బౌద్ధ దర్మ వ్యాఖ్యానాలను రచించారు. నేటికీ అవ న్నీ పదిలం. హర్షవర్ధనుడు 25మీటర్ల ఎత్త యిన బుద్ధుని కాంశ్య ప్రతిమను విశ్వవిద్యా లయానికి బహూకరించాడు. కుమారగుప్తుని పాలనలో ‘ఫైన్ ఆర్ట్స్ స్కూల్’ ప్రారంభమైం ది. పదివేలమంది విద్యార్ధులు ఒకేసారి సమా వేశమయ్యేందుకు వీలైన మందిరాలుండేవి. తొమ్మిదంతస్తులున్న మూడు భవనాలలో సారస్వతం విరాజిల్లేది. విశ్వవిద్యాలయానికి అవసరమైన నిధులను పాలకులు ‘గ్రాంట్’ గా ఇచ్చేవారు. 8 శతాబ్దాలు నిరాటంకంగా విద్యాకేంద్రంగా నిలచిన నలందకు క్రమేణా క్షీణదశ కమ్మింది, తాంత్రిక రీతులు, దురా క్రమణలు, దారుణ దహనకాండలు! 13వ శతాబ్దానికి శిథిలాలుగా మిగిలిపోయింది. ఒక సామూహిక, సాంస్కృతిక మతిమరుపు కొన సాగింది. బ్రిటిష్ పాలకులు వలస దేశాల చరి త్రను తెలుసుకోవాలనుకున్నారు. ఆ క్రమం లో 19వ శతాబ్ది నుంచి నలంద పొరలుపొర లుగా ఆవిష్కృతం అవుతోంది. నలంద-నాగార్జునకొండ హుయాన్త్సాంగ్కు పూర్వమే 4వ శతాబ్దంలో శ్రీపర్వతాన్ని (నాగార్జునకొండ) పాహియాన్ సందర్శించారు. ఆచార్య నాగార్జునుడి జీవిత చరిత్రను రచించిన పాహియాన్ నాగార్జును డు నెలకొల్పిన విశ్వవిద్యాలయం గురించి ప్రస్తావించాడు. శ్రీపర్వతం కేంద్రంగా రాష్ట్రం లోని మూడు ప్రాంతాల్లో విస్తరించిన నల్లమ ల అడవుల్లోని సమస్త వృక్షజాతులు ఏఏ అనా రోగ్యాలకు ఔషధాలో నిరూపించి, పట్టభద్రు లైన విద్యార్ధులు వివిధ దేశాలకు వైద్యులుగా వెళ్లేవారని ఉల్లేఖనాలున్నాయి. ‘మెడిసినల్ బుద్ధ’గా నాగార్జునుడు వివిధ దేశాలలో నేటికీ ఆరాధనీయుడు. ‘నలంద’ స్ఫూర్తితో ‘శ్రీపర్వ తం వైద్యవిశ్వవిద్యాలయా’నికి చొరవ తీసు కోవాలని ప్రధమ పౌరుడు ప్రణబ్ ముఖర్జీకి ఎవరైనా ప్రతిపాదించాలని ఆశిద్దాం. - పున్నా కృష్ణమూర్తి