శిల నుంచి సీడీ దాకా ‘తాళ్లపాక’ స్వరపేటికలు!
వాగ్గేయ సంపద
‘గుండు కరగగా పాడెను హనుమంతుడు’ అని కీర్తించిన అన్నమయ్య గుండుపై స్వరరచనా చేశాడు. కొంచెం ఆలస్యమైనా రాతిబండపై స్వరసహితంగా దొరికిన అతి ప్రాచీన అన్నమయ్య రచనలు - ‘తిరుమల శిలాగీతం’ పేరుతో సీడీ/పుస్తక రూపంలో విడుదలయ్యాయి. అయితే ఇవి ఇలా రూపుదాల్చడం వెనుక చాలా కథే ఉంది.
తిరుమల ఆలయంలో ‘చంపకప్రదక్షిణ’ మార్గంలో ఏడడుగుల పొడవు-నాలుగడుగుల వెడల్పు,తొమ్మిది అంగుళాల మందం కలిగిన రెండు బండలపై వ్యక్తావ్యక్త తెలుగు లిపిని 1949లో గుర్తించారు. ఈ సంగతి వేటూరి ప్రభాకరశాస్త్రి దృష్టికి వెళ్లింది. ‘తాళ్లపాక సాహిత్యం’ పై పరిశోధన చేస్తోన్న ప్రభాకరశాస్త్రి ఇది తాళ్లపాక సాహిత్యమే అని నిర్ధారించారు. అన్నమయ్య. ఆయన కుమారుడు తిరుమలాచార్యులు. మనుమడు చినన్నల రచనలు తాళ్లపాక సాహిత్యంగా సుప్రసిద్ధం. ఆ మువ్వురూ జీవించిన కాలానికి చెందినవిగా వీటిని నిర్థారించారు. అయితే ఆ మరుసటి సంవత్సరమే ప్రభాకర శాస్త్రి మరణించగా ఆయన కుమారుడు వేటూరి ఆనందమూర్తి తండ్రి పరిశోధనా స్ఫూర్తితో 1965లో తాళ్లపాక కవుల సంగీతసాహిత్యంపై పీహెచ్‌డీ తీసుకుని ఈ శిలాగీతాలను వెలుగులోకి తేవడానికి ప్రయత్నించారు. ఆ భగీరథ ప్రయత్నానికి పరిశోధకులు ఏ.వి.శ్రీనివాసాచార్యులు, ప్రముఖ ఎపిగ్రాఫిస్ట్ (శాసనలిపి పరిశోధకులు) పి.వి.పరబ్రహ్మశాస్త్రి తదితర పెద్దలెందరో సహాయం చేశారు. అయితే అక్షరసాహిత్యాన్ని చదివేందుకు చూపు చాలును. కాని స్వరరచనలను చదివేందుకు చూపొక్కటి చాలదు. ‘చెవి’ సైతం కావాలి ప్రఖ్యాత సంగీత పరిశోధకులు నండూరి పార్ధసారథి శిలాస్వరాలను ఆవిష్కరించేందుకు ముందుకు వచ్చారు.
రాతి బండలపై తెలుగు లిపిలో సంస్కృతంలో ఉన్న ఈ అన్నమయ్య స్వర సహిత సాహిత్యం పేరు ‘దశావతార సూలాది’. జాను తెలుగులో 32 వేల కీర్తనలు రచించిన అన్నమయ్య శిలారచన సంస్కృతం కావడం గమనార్హం! కన్నడ నుంచి తెలుగు లిపి పరిణామం చెందినట్లే ‘సూలాది’కి కూడా కన్నడే మాతృక. కన్నడలో ‘హాడు’ అంటే పాట. భక్తులు సులభంగా పాడుకునే పాట సూలాది (సులభహాది). తెలుగులో అనేక సూలాదులను రచించిన తాళ్లపాకవారు సంస్కృతంలో సూలాది ప్రక్రియను చేపట్టడం శిలాగీతాల ప్రత్యేకత! ‘దశావతార సూళాది ప్రబంధం’గా పేర్కొన్న ఈ స్వరరచనలు మాళవగౌళ రాగం (నేటి మాయామౌళవగౌళ)లో ఉన్నాయి. దశావతారాల కీర్తనలలో లోపించిన రెండు అవతారాలకు సంబంధించిన సాహిత్యాన్ని పుల్లెల రామచంద్రుడు, సంగీతాన్ని ఆకెళ్ల మల్లికార్జునశర్మ పూరించారు. సత్తిరాజు వేణుమాధవ్ గానం చేశారు. సూలాది సంగీతాన్ని సీడీ రూపంలో, సాహిత్యాన్ని పుస్తకరూపంలో ప్రభాకర మెమోరియల్ ట్రస్ట్ (9742486122) రూపొందించింది. డెబ్బయ్ సంవత్సరాల కృషి రెండువందల రూపాయలకు లభ్యం! అన్నమయ్య మాటలో ‘వెల సులభము-ఫలమధికము’!
- పున్నా కృష్ణమూర్తి