తెలుగు సంస్కృతి, సంప్రదాయలను పరిరక్షించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ప్రతి నెల తెలుగు లలిత కళా వేదిక ద్వారా అంతర్జాల వేదికగా సదస్సులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా భావ వైవిధ్యం.. అన్నమయ్య సంకీర్తనంపై నాట్స్ వెబినార్ నిర్వహించింది. ప్రముఖ ఆధ్యాత్మిక గాయకులు, తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన గాయకులు పారుపల్లి శ్రీరంగనాథ్ ఈ వెబినార్‌కు విచ్చేశారు. తిరుమలేశుడి గోవింద నామాలతో ప్రతి తెలుగు ఇంటికి ఆయన గాత్రం సుపరిచితమైంది.
గోవింద నామాలతో పాటు ఆ వెంకటేశ్వరుడి అనేక భక్తిగీతాలను ఆయన ఆలపించారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి దేవాలయంలో ఆయన పాడిన భక్తి పాటలు మారుమ్రోగుతుంటాయి. భక్తి గీతాల ఆలాపనకు చిరునామాగా మారిన పారుపల్లి శ్రీరంగనాథ్ నాట్స్ వెబినార్‌లో పాలుపంచుకోవడాన్ని ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి, నాట్స్ మాజీ అధ్యక్షుడు బాపయ్య చౌదరి(బాపు)నూతి ప్రశంసించారు. గోవింద నామాలు పాడే అవకాశం ఎలా వచ్చింది.? తిరుమల దేవస్థానం ఆస్థాన గాయకుడిగా ఎలా స్థానం లభించింది ఇలాంటి అంశాలను శ్రీ రంగనాథ్ వివరించారు.
గోవింద నామాలు పాడి వినిపించారు. ఆ తిరుమలేశుడికి అత్యంత ఇష్టమైన అన్నమయ్య సంకీర్తనలు పాడటంతో పాటు వాటి అర్థాలను కూడా ఆయన వివరించారు. తాను స్వరపరిచిన భక్తిగీతాలు, ఆధ్యాత్మిక రంగంలో భక్తులను భక్తి పారవశ్యంలోకి తీసుకెళ్లేందుకు భక్తిపాటల ద్వారా చేస్తున్న కృషిని రంగనాథ్ ఈ వెబినార్ ద్వారా అందరికి తెలిపారు. అలాగే అన్నమయ్య సంకీర్తనల పరమార్థం గురించి, వెబినార్‌లో పాల్గొన్న వారు అడిగిన ప్రశ్నలకు చక్కగా సమాధానం ఇచ్చారు.
ఈ కార్యక్రమానికి నాట్స్ కార్యనిర్వాహక కార్యదర్శి( మీడియా) మురళీకృష్ణ మేడిచెర్ల అనుసంధానకర్తగా వ్యవహరించారు. లలిత కళా వేదిక సభ్యుడు గిరి కంభమ్మెట్టు, నేషనల్ కోఆర్డినేటర్ (విమెన్ ఎంపవర్మెంట్) రాజలక్ష్మి చిలుకూరి, నేషనల్ కోఆర్డినేటర్ (మార్కెటింగ్) కిరణ్ మందాడి, పలువురు నాట్స్ సభ్యులు, తెలుగువారు ఆన్‌లైన్ ద్వారా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
(చదవండి: సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ 100వ వార్షికోత్సవం)
Comments
Please login to add a commentAdd a comment